అక్షర

గురుదక్షిణ... ఓ సందేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురుదక్షిణ- కథా సంపుటి
-గోనుకుంట మురళీకృష్ణ,
పేజీలు: 134,
వెల: రూ.99/-
ప్రతులకు: రచయిత, 7-12-13,
కనగాలవారి వీధి,
రేపల్లె- 522201
---

‘‘మంచితనం, ప్రేమాభిమానాలు, కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరినొకరు ఆదుకోవటం, ఐకమత్యంగా ఉండటం; ఇవన్నీ ‘‘జీవజలం’’వంటివి. అలాంటి గుణాలు ఉన్నంతకాలం మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాము.
‘‘వీళ్ళ (అనాధల) కళ్ళలో సంతృప్తి, సంతోషం చూస్తూంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నా డబ్బు సద్వినియోగం అయినట్లు అనిపిస్తుంది’’ లాంటి గొప్ప వాక్యాలు, మానవత్వం, కాచి వడపోసినట్లున్న ఈ జీవన సత్యాలు, సమాజంతో ఆత్మీయ అనుబంధం ఉన్నవారు, సమాజాన్ని దగ్గరనుండి పరిశీలిస్తూ, అధ్యయనం చేయగలవారు మాత్రమే వ్రాయగలరు.
ఇలాంటి అధ్యయనశీలి గొనుగుంట మురళీకృష్ణగారు వ్రాసిన కథాసంపుటి ‘‘గురుదక్షిణ’’. ఇందులో ఇరవయి కథలున్నాయి. ఇవన్నీ 2012నుండి జనవరి 2015 వరకు వివిధ పత్రికల్లో ప్రచురించబడి ప్రశంసలందుకున్నవి. సంకలనం రూపంగా మన ముందుకు ఇప్పుడు వచ్చాయి.
అధ్యాపకులు మరియు సమాజాన్ని నిరంతరం అధ్యయనం చేస్తున్న మురళీకృష్ణగారు గతంలో రెండు కథాసంపుటాల్ని వెలువరించారు. ఇది వీరి మూడవ సంపుటి. అనువంశికంగా వచ్చిన సృజనాత్మక నైపుణ్యాన్ని మరింత పదునుపెట్టి వ్రాస్తున్న కథలు ఇవి.
రచయిత తన ‘‘రచయిత మాట’’లో చెప్పుకున్నట్లు అనుభవాలకు కల్పనను జోడించి కథారూపం తీసుకువచ్చిన కథలు. సహజత్వం, సారళ్యత- రెంటినీ జోడించి వ్రాయటంవల్ల, పాఠకుడు కథల్లో మమేకం అవుతాడు. ప్రతీ కథలోనూ అంతర్లీనంగా అగుపించే సందేశం మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది.
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు తన ఉద్యోగ కాలంలో కొన్ని వందల మంది భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాడు. అంతమందినీ ఆయన గుర్తుపెట్టుకోలేడు. ఆ వందల్లో ఏ కొద్దిమంది విద్యార్థులు మాత్రమే గుర్తుంచుకుంటారు. అలా గుర్తుంచుకున్న వారి కృతజ్ఞత పట్ల గురువుగారి మనసు బరువెక్కుతుందని చెప్పే కథ ‘‘గురుదక్షిణ’’. గురువుగారి కంటే, అలా గుర్తుపెట్టుకున్న శిష్యులు గొప్పవారని సూచించటం బావుంది.
ఆధునిక జీవనంవల్ల ఎవరికివారే ఒంటరి అవుతున్నారని, వృద్ధాప్యానికి కావల్సింది మందులూ, మాకుల కంటే, వారిలోని అభద్రతాభావాన్ని పోగొట్టగలిగే ‘ఆదరణ’ అని చెప్పే ‘‘ద్వితీయ బాల్యం’’ కథ.
ఆత్మీయులు ఆపదలో ఉన్నపుడు పరస్పర కక్షలూ కార్పణ్యాలు గుర్తుకు రావు. పరుగెత్తుకుని వెళ్ళి ఆదుకోవాలనిపిస్తుంది. అదే ‘‘రక్తస్పర్శ!’’ స్వార్థాన్ని త్యజిస్తే, మనసు ప్రక్షాళన పొందుతుందని ఈ కథ చెబుతుంది.
‘‘ఇప్పటి చదువులన్నీ మార్కులకోసం. విదేశాల్లో డాలర్ల సంపాదనకోసమే కాని, అసలైన గొప్పతనం సమాజాన్ని ఆదుకోవటమే’’నని చెప్పే ‘‘విలువలు’’.
‘‘్భగవంతుడు తింటానికి మనకి ఇచ్చిన దాంట్లో కొంత తీసి తోటివాళ్ళకు పెట్టాల. అప్పుడు (్భగవంతుడు) మనల్ని కూడా సల్లగా సూస్తాడు’’ అని చెప్పే పొలాల్లో నాట్లువేసే కూలీ వరలక్ష్మి. (చల్లని నీడ).
మనిషి జీవించటానికి సరిపడిన డబ్బుంటే చాలు. అది కూడా స్వయంగా సంపాదించుకున్నప్పుడే దాని విలువ తెలుస్తుందని చెప్పే ‘‘తండ్రి లేఖ’’.
ఇవన్నీ మచ్చుకు మాత్రమే! ప్రతి కథలోనూ రచయిత తనదైన ఓ సందేశం ఇచ్చే ప్రయత్నం చేయబడింది.
కథనంపై మరికొంత శ్రద్ధపెట్టటం అవసరం. ‘‘జీవజలం’’లోనైనా (పేజీ 35) ‘‘రక్తస్పర్శ’’లోనైనా (పేజీ 47) డాక్టరు ప్రిస్క్రిప్షన్ ‘‘బరబరా గీకుతాడు’’. హెల్ప్, థాంక్సు, మూడీ, డల్, పేకెట్, గ్యాసుస్టవు, సిలిండర్, కనెక్షన్, డబల్, ఆఫీసు లాంటి ఇంగ్లీషు పదాల వాడకం తగ్గిస్తే బావుండేది. ఉదాహరణకు పేజీ 34 (జీవజలం)లో- ఒక్క పేజీలోనే డజను ఇంగ్లీషు పదాలున్నాయి. ఇంగ్లీషు పదాలు వాడవద్దని కాదు- వాటి వాడకం వీలైనంతగా తగ్గిస్తేనే, స్వభాషకు న్యాయం చేకూర్చేవారం అవుతాము.

-కూర చిదంబరం