అక్షరాలోచన

నది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదటిసారి
నదిని చూసినప్పుడు
అడివిలో ఆగమైన
పల్లె యువతిలా కనిపించింది.

ఒకచోట ఆగదు
సూటిగా పరిగెత్తదు
వంకర టింకరగా
తన దారిని తానే నిర్మించుకుంటుంది.

సముద్రమెక్కడుందో తెలియదు
అసలు సముద్రమే దాని గమ్యమని
దానికెవరూ చెప్పలేదు.
వెళ్తూ వెళ్తూ ఓ గుట్టమీంచి
గబాలున దుంకేస్తుంది

నీటికింత సాహసమా
నీటికింత సౌందర్యమా అనిపిస్తుంది
విరిగిన శరీర భాగాలను అతికించుకొని
ఏమీ ఎరుగనట్టు ముందుకు సాగుతుంది.

ఆ మైదానంలో
గాలి వీయడం మానేసింది
చలికి భయపడి కాబోలు!
సూర్యకాంతి
విచ్చుకోవడానికి జంకుతుంది
గడ్డకట్టుకపోతానని కాబోలు!
నదికి ఇవేమీ పట్టవు.

అసలు నది అంటే ఏమిటి?
జలమా!
దాని అవిచ్ఛిన్న మార్గమా!
ఆ గమనంలో గర్భితమైన
అంతరాంతర స్థగిత
అద్భుత చైతన్యమా!
కనులలో ప్రతిఫలించే అరణ్య శోభను
ఎంత దూరం తీసుకెళ్తుందో తెలియదు.

ఇంత సుదీర్ఘ యాత్ర తర్వాత
దాని కదలికలో ఏదో పెనుగులాట!
సాగర సామీప్యం కావచ్చు
నదికది నచ్చలేదు కావచ్చు
వ్యక్తిత్వం కరిగిపోవడం
ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది కనుక!

డా.ఎన్.గోపి