అక్షర

నేలపట్టులో ‘పక్షితీర్థం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పక్షి తీర్థం (దీర్ఘ కవిత)
-ఈతకోట సుబ్బారావు
వెల: రూ.50
ప్రతులకు: రచయిత
24/1697, సెకండ్ స్ట్రీట్
రవీంద్రనగర్, నెల్లూరు-524 004
9440529785

** ** ** ** **

మనిషికి రెక్కలుంటాయా? ఉంటే ఎగిరిపోగలడా? ఎగురగలిగినా పక్షి కాగలడా? ఎగిరిపోగలిగినంత మాత్రాన మనిషి ‘జీవిస్తాడా’. ఇన్ని మీమాంశలకి సమాధానం వెదుకుతాడు ‘పక్షితీర్థం’కరుడు! పక్షి తీర్థం ఊరు మరణానంతరం కొనసాగే ప్రక్రియకు ఆనవాలు అయితే ఈ ‘పక్షితీర్థం’ జీవన కాల పయనానికి చేసే యుద్ధానికి సమాయత్తం చేసే ప్రబోధ - ప్రబోధ మాటలలో కాదు - అంతర్లీనమైన చింతన - మనిషి మనిషికీ - మానవ సమాజానికీ అంతర్లీనంగా సాగే.. సాగవలసిన చింతన! రెండిటి వ్యత్యాసాన్ని ఈ ‘తీర్థం’ కరుడు బాగానే వొంటబట్టించాడు!
అనాదిగా సాగుతున్న పక్షుల ఖండాంతర యానం ‘పక్షితీర్థం’కరునికి ప్రేరణ! ఆ ప్రేరణ సృష్టికర్తకి వందనంతోనే మొదలవుతుంది. అందునా ముందు కనబడే ‘పక్షి తీర్థాని’కి నాందీభూతమైన నింగీ - సముద్రాలతో! కవి ‘ఆకాశమంత సముద్రాన్ని భూమిపైన జల తివాచీగా పరిచిందెవరో’ అని ఎత్తుకుంటాడు! ఇది తను చెప్పబోతూ ఉన్న జగద్దర్శనానికి అక్షరాల నాంది. పైగా నింగిలోని రంగులొలికే పక్షులు, నీటిలోని రంగురంగుల చేపలు ఒద్దికగా ‘చిత్రిక’ పట్టే నిర్మాతకే సాధ్యం! మట్టికీ చెట్టుకీ నీటికీ ఆనవాలమైన నేలపట్టుకి వందనం అంటాడు కవి!
నాందీ వాక్యం కొనసాగి వలస పక్షులు ‘విశ్వశాంతి దాటే ఆత్మీయ అతిథుల రాయబారుల్లా...’ అని కవిచేత అనిపిస్తాయి! తను పుట్టిన మట్టిని ముద్దాడే పె(ఫె)లికాన్లు ఫ్లామింగోల సైన్యం ఈ నేలను ముద్దాడుతాయ్ అనిపించడంలో కవి ఔచిత్యం నేలపట్టు గొప్పతనం చూపెడుతోంది. వచ్చి వాలిన సైన్యంతో సముద్రం మొత్తం ‘ఆసనాల యోగ వేదిక’ (యోగాసనాల వేదిక కాదు) స్ఫురింపజేస్తుంది అనడంలో కవి ఔచిత్యం ముదావహం! యోగం అంటే కలయిక! అన్ని పక్షుల కలయిక యోగ వేదిక కాక మరింకేమిటి?
పక్షుల సాయంత్రపు సరసాల గేయాలని ఎంతని వర్ణించినా కవికి తనివితీర లేదని అనిపిస్తుంది! అలాంటి ‘పక్షుల’ వలస నేలపట్టుని రేపటి పంటలకి సమాయత్తం చేస్తున్నాయా? కవి ముందు చెప్పిన యోగ వేదికని ఇక్కడ నిరూపిస్తున్నాడు. దేశ దేశాల వాసులు అటూ ఇటూ పరిభ్రమిస్తేనే కదా సంస్కృతులు బలోపేతవౌతాయి. అదే సందర్భంలో ‘రంగులద్దిన ఆకాశం - నేల ప్రకృతికి సోయగం ప్రసాదిస్తుంది!’ పక్షులు పట్టుకొచ్చిన సౌభాగ్యం ఏమో గాని ‘ఏడాది పొడవునా పొలమంతా నిండు గర్భిణీ’ అంటాడు కవి! అందుకేనేమో ‘పక్షుల ఉ(వు)త్సవం చేస్తారు తనిసి, ఏడాదికోమారు వచ్చే అభ్యాగతుల్ని దేవతల్లా భావిస్తారు మైమరిచి’ అంటాడు. అందుకే ‘చెట్లన్నీ సౌభాగ్యవతులు’ అవుతాయి అని తీరతాడు ఈ ‘తీర్థం’కరుడు! అన్నాడు కూడా!
మొత్తం ఈ దీర్ఘ కవితలో పరివ్రాజకత చూపినా ‘తీర్థం’కరుడు కొన్ని సామాజిక తత్త్వాలను పక్షుల సాక్షిగా వేలెత్తి చూపుతాడు! అవి ‘భ్రూణ హత్యలంటే ఎంతో ముద్దు’ అంటూ ఆడపిల్లల ఆవశ్యకత, స్ర్తి వివక్షపై ఒక విసురు. ‘ఏ జాతి పక్షి ఆ గూటి పలుకు పలకదిక్కడ. భిన్నత్వంలో ఏకత్వమే వీటి మనుగడ. బారులు బారులుగా సమూహ సమూహాలుగా సాగే ప్రయాణం’ అంటూ కాలం ఎంత ధిక్కరించినా ఎన్ని ఆటంకాలు పర్చినా అధిగమించడమే ఏకైక లక్ష్యమిక్కడ’ అంటూ సహ జీవనానందం, లక్ష్యం చెబుతున్నాడు కవి. ఇది కాదా వలస పక్షుల సందేశం! కలల్ని కనండి వాటిని సాకారం చేసుకోడానికి మేల్కొని ఉండండి అనకుండా ఈ ‘తీర్థం’కరుడు ‘గమ్యాన్ని నిషానిగా పెట్టుకొని ఏ లైట్‌హౌస్‌ను లెక్కచేయని పయనంలో అన్నీ దీర్ఘ యాత్రలే’ అంటాడు. అవును కదా! ఆ పక్షులు ‘చిన్ని చిన్ని గుండెలలో కలల్ని మోసుకుంటూ.. అమ్మ కళ్లకి కలలిచ్చిన నేలకు కువకువల కచేరీ వినిపించాలని’ దీర్ఘ యాత్రలు చేస్తాయట. గమ్యాన్ని చేరుకోవాలని అనుకునే వాడికి పయనం ఒక వ్యసనం! ‘ఉరకలెత్తే ఉత్సాహంతో.. కదులుతున్న రెక్కల కేతనాలు తమ ఉ(వు)నికిని చాటుకుంటాయి’ అనడంలో కవి భావంలో ఒక పరిపక్వత చూపించాడు! అది ఒక పరిణత చెందిన భావం! అంతా యుద్ధానికి సన్నద్ధమైన సైన్యం.. గమ్యం కోసం! ఆ సన్నద్ధమైన సైన్యం రెక్కల చప్పుడు ఈ కవి సుదూర తీరాల నుండి వినగలడు. మనకీ వినిపించడంలో సఫలీకృతుడయ్యాడనే చెప్పాలి. అటువంటి పక్షి సైనికుల ప్రతి శ్వాసా ఒక ఆయుధమట, ప్రతి కూజనం ఒక బాణమట - కాదా! ఊహించండి - గమ్యాన్ని చేరాలనుకున్న ప్రతివాడూ మనసా వాచా కర్మణా నవనాడులూ ఏకం చేస్తాడు. వాడి ప్రతీ అడుగూ వాడిగానే ఉంటుంది అలాంటి సైనికుడిని ‘మతం మలినం సోకని పువ్వంటా’డు ఈ ‘తీర్థం’కరుడు! ‘గోత్రాల్లేని అప్సరస’ లంటాడు! ఎంత ముదావహం!
ఈ దీర్ఘ కవితకు విశే్లషణ అంత తేలిక గానోపదు. ఆది నుండి తుది వరకూ సాగిన భావపు దండయాత్రలో విచ్చలవిడితనం లేదు. ఆది నుండీ ముగింపు వరకూ భావాల వెనుకా ముందూ అయినా ఒకదానికి ఒకటి అన్వయించుకుంటేనే గానీ భావం లోతు సామాన్యంగా తెలియదు.
కవి కొన్ని ప్రయోగాలను ఎందుకు వాడవలసి వచ్చిందో తెలియదు. ‘నదుల వారధి సముద్రం’ అందుకోలేక భంగపడిన విషాదంలో ప్రవహిస్తున్న ఆవిరి సముద్రం..’ ఇలాంటివి.
కవి కొన్ని చోట్ల అచ్చులకు బదులు హల్లులు విరివిగా వాడాడు. ఎందుకో తెలియదు. దానివల్ల కవితకు అందం చేకూర్చాలని ప్రయత్నమో ఏమో! వొక్కొక్క వునికి, వూడిసి, వూసు, వొక, వూరేగింపు, వుత్సవం ఇలాంటివి ఎందుకో తెలియదు. ఎంతైనా కవికి భాషను రక్షించే బాధ్యత కూడా ఉంటుంది.
మొత్తం మీద ‘పక్షి తీర్థం’ పాఠకుడిని చెప్పనలవి కాని భావావేశానికి గురిచేసి భావుకుడిని చేస్తుంది అనడంలో ఏ సందేహమూ లేదు.

-్భరద్వాజ శంకర్