అక్షర

ప్రేక్షకులకు, పాఠకులకూ ఒక థ్రిల్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయణంలో రాయని పుటలు
(మిశ్రో - నాటకాలు - నాటికలు)
-ఎస్.కె.మిశ్రో
అధ్యక్షులు, బహురూప
నట సమాఖ్య
31-32-12/3, ఘంటసాల రోడ్డు
అల్లిపురం జంక్షన్
విశాఖపట్టణం- 530 004

** ** ** **
నాటక రంగానికీ, చలనచిత్ర రంగానికీ, బుల్లి తెరకూ కూడా పరిచయం అక్కర్లేని వ్యక్తి యస్.కె.మిశ్రో. నలభై ఏళ్ల పైచిలుకుగా అనేకానేక నాటకాలు వేస్తూ, అనేక సినిమాలలో సీరియళ్లలో నటిస్తూ తెలుగు వారందరికీ సుపరిచితులు. వారి నాటకానుభవాన్ని రంగరించి కొన్ని నాటకాలు, నాటికలు రాసేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి ఆర్థిక సహాయంతో ‘మిశ్రో నాటకాలు’ శీర్షికతో 4 నాటకాలనూ, 3 నాటికలనూ కూర్చి ఒక పుస్తకంగా అచ్చువేయబడింది. అందులో మొదటి నాటకం - ‘రామాయణంలో రాయని పుటలు.’
భారతీయ జీవన వ్యవస్థ, ఇతిహాస శ్రేష్ఠాలయిన - రామాయణ భారతాలతో చాలావరకు ముడివడి ఉంది. కవిగా ప్రాచుర్యం పొందిన ప్రతివారూ రామాయణాన్ని అందులోని ఇతివృత్తాలనూ తమ కథావస్తువుగా ఎన్నుకుంటూనే ఉన్నారు. ప్రతి తరంలోనూ ఎవరో ఒకరు రామాయణాన్ని రాస్తూనే ఉన్నారు.
‘యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహతీలే
తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి’ - శ్రీ రా.బా.కాం.2వ స. 36 శ్లో.) అని వాల్మీకి చెప్పాడు.
‘అసలు మళ్లీ మళ్లీ రామాయణాలు ఎందుకు?’ అని, శ్రీశ్రీ ప్రశ్న.
‘నా భక్తి రచనలు నావి..!’ అని, విశ్వనాథవారి సమాధానం.
ఇంకొకాయన.. ‘శ్రీరాముని మించిన సద్గుణాలున్న ఇంకో వ్యక్తిని చూపించు, అతణ్ణి కథానాయకుడుగా కావ్యాన్ని వ్రాస్తాను...’ అన్నాడుట. అంతగా ఇమిడిపోయింది రామాయణం. భాసుడి నుండి నేటి ఆధునిక కవుల వరకూ రామాయణాన్ని సంస్కరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. వాల్మీకి తన మనసులోని అసలైన ఆలోచనలను, స్వల్పమాత్రంగా అలా అలా చెప్పిన వాటిని, పూరించడానికి, వివరించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
కైకను ఉన్నతమైన పాత్రగా నిలబెట్టడానికి భాసుడు - ప్రతిమా నాటకాన్ని రచించాడు. అలాగే భవభూతి, దిఙ్నగుడు కూడా సంస్కరణ దృష్టితోనే తమ నాటకాలు (రామకథ ఇతివృత్తంగా) రచించారు.
మిశ్రో ‘రామాయణంలో రాయని పుటలు’ అనే నాటకంలో - శ్రీరామచంద్రుడు ఏకపత్నీవ్రతుడా..!’ అనే సందేహంతో మొదలెట్టి, దానికి అనువైన సమాధానం ఇవ్వడంతో ముగించారు.
మంధర అకారణంగా రామునిపై కోపం ప్రకటిస్తుందా? ఏదో హేతువుండాలని, మనుమరాళ్ల పాత్రల సృష్టితో ఒక మధురమైన కల్పనను జోడించి, నాటకాన్ని రమ్యంగా మలిచారు.
భవభూతి స్ర్తిని ఎంతో ఉన్నతంగా సృష్టించాడు తన నాటకంలో. అట్లాంటి స్ర్తివాద ధోరణిని కొంచెం అహల్య కథకి వినియోగించారు మిశ్రో. కానీ, విశ్వామిత్రుడు తక్కువవాడేమీ కాదు కదా! సృష్టికి ప్రతిసృష్టి చేయగల సమర్థుడు. ప్రత్యేకంగా స్వర్గానే్న ఏర్పరచి త్రిశంకును అందు ప్రవేశపెట్టినవాడు. అహల్యను అందలమెక్కించడానికి విశ్వామిత్రుని దిగజార్చినట్టుగా ఉంది అహల్య - శ్రీరామ - విశ్వామిత్రులు కలిసి ఉన్న సన్నివేశం.
అలాగే ఊర్మిళను దివ్యాత్మ సందర్శనం చేసే సాధకురాలిగా చిత్రీకరించారు. కవి ఊహ వరకూ బావుంది. మిశ్రో స్వతహాగా నటుడు కావటాన, నాటకాన్ని ప్రదర్శనయోగ్యంగా మలిచారు. ఇది పాఠకులకు, ప్రేక్షకులకు ఆనందాన్ని - ఆలోచనను కలిగిస్తుంది. అయితే కొన్నిచోట్ల ముఖ్యంగా సంస్కృత భాషకు సంబంధించినంత వరకూ కొంత సరిదిద్దవలసిన ఆవశ్యకత ఉంది.
శ్రీకృష్ణ సందేశం - మాస్టర్ ఇ.కె.గారి ‘మంద్రజాలం’ అనే నవలకు నాటకీకరణ. ఇందులో ముఖ్యంగా వైదిక - చార్వాక మతాల సంఘర్షణను చక్కగా చిత్రించారు. కానీ, అసలు నవలలోని మంద్రజాలం కొంచెం వెనుకబడిందనే చెప్పాలి. శ్రీకృష్ణ వేణుగానానికి సమ్మోహితులై ఆయనను చేరుకోవాలి...
ఆయనకు దాసులు కావాలి.. అదే మంద్రజాల మహిమ..!
ఇక ‘నిర్భయ నా కూతురు’ - నాటకం నేటి సమాజానికి ప్రబోధాత్మకంగా ఉంది, రచన! రచయిత మనసెరిగి, లేక పాత్రలే రచయితను నడిపించే.. ఆంగ్ల నాటకాల పద్ధతిలో, పాత్రల చేత నాటకాన్ని నడిపించారు. ‘రాజ్యం’.. ‘రచయిత’ పాత్రలు మలచిన తీరు బాగుంది. ఈ నాటకం ఆహూతులను చక్కగా ఆకట్టుకుంటుంది.
చివరగా అనుబంధ నాటికలుగా - ‘చివరి అధ్యాయం’, సింహప్రసాద్ గారి ‘ఇల్లు’ కథని నాటికగా మలిచేరు. నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు దూరంగా ఉంటున్న నేపథ్యాన్ని చూపించే ప్రయత్నంగా ఈ నాటిక ప్రేక్షకుల.. పాఠకుల మన్నన లందుకుంటుందనడంలో సందేహం లేదు. ‘ష్ ఎవరికీ చెప్పకండి’ - కమల పాత్రని చూపించిన తీరు, రచయిత చాలా ఊహాతీతంగా కల్పించేరు. ప్రేక్షకులకు, పాఠకులకూ ఒక థ్రిల్..!
అలాగే ‘స్వచ్ఛ భారత్’ ఆలోచనాత్మకంగా.. పిల్లలకు వినోదాత్మకంగా సాగింది. రచయిత తన నాటకానుభవాన్ని రంగరించి నాటకాలనూ నాటికలను చక్కగా తీర్చిదిద్దేరు. ఈ నాటకాన్ని, నాటికలను ప్రదర్శించడానికి విధిగా రచయిత అనుమతిని పొందవలసి ఉన్నది. ఈ పుస్తకాన్ని సుమారు 425 పేజీలతో చదువరుల కంటికి ఇబ్బంది కలుగకుండునట్లు పెద్ద అక్షరాలతో ముద్రించారు.

-ఎస్.టి.పి.వేణుగోపాలస్వామి