అక్షర

యువతకు స్ఫూర్తిదాయకం ‘హిట్ రిఫ్రెష్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిట్ రిఫ్రెష్ (బిల్‌గేట్స్ ముందు మాటతో)
-సత్య నాదెళ్ల
హార్పర్ కోలిన్స్ పబ్లిషర్స్
195 బ్రాడ్‌వే, న్యూయార్క్
ప్రింటెడ్ అండ్ బౌండ్ ఇన్ ఇండియా బై థామ్సన్ ప్రెస్ ఇండియా లిమిటెడ్.
వెల: రూ.599
యాజమాన్యపు పని ఒత్తిడులతో నిరంతరం వుండే వ్యక్తి - ‘రచన’ అనే ఒక సృజనాత్మక కార్యం చేయడం అంత సులభమైన సంగతేమీ కాదు, అది ఏ విషయం మీదనైనా కానీయండి! కానీ ప్రపంచంలోనే అతి ప్రసిద్ధి చెందిన మైక్రోసాఫ్ట్ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా మూడేళ్ల క్రితం నియమితుడైన మూడవ సి.ఇ.ఓ. ఒక తెలుగు బిడ్డ కావడం, తాను పగ్గాలు చేపట్టడంతోనే కంపెనీలో గుణాత్మక మార్పులకు హేతుభూతుడు కావడం ఒక ఎత్తుకాగా, రానున్న యువతకు స్ఫూర్తిదాయకంగా తన అనుభవ సంపత్తిని ఏడాదిగా ఓ గ్రంథంగా మలచి రాయడం ఒక ఎత్తు.
సత్య నాదెళ్ల అనే ఈ నాదెళ్ల సత్యనారాయణ అనంతపురం జిల్లా ఎలనూరు మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన 1962 బ్యాచ్ ఐ.ఏ.ఎస్. అధికారి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ కుమారుడు. ఆయన 2004 నుంచి 2009 వరకు ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రణాళికా సంఘం సభ్యునిగా, ప్రధానమంత్రి కార్యదర్శిగా పని చేసినవారు. ఐ.ఎ.ఎస్. అధికారిగా కుటుంబాన్ని హైదరాబాద్‌కు మార్చారు. 1967లో బి.ఎన్.యుగంధర్, ప్రభావతి దంపతులకు సత్య నాదెళ్ల హైదరాబాద్‌లోనే జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి. మణిపాల్ ఐఐటిలో చదివి 1988లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బిఈ చేసి, ఆపై అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొంది, చికాగో యూనివర్సిటీ నుంచి ఎం.బి.ఏ. చేశారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రవేశించి గ్రీన్‌కార్డు తీసుకున్నారు. మొదట్లో సన్‌మైక్రో సిస్టమ్స్‌లో పని చేసి, 1992లో మైక్రోసాఫ్ట్‌లో అడుగుపెట్టారు సత్య నాదెళ్ల. వ్యాపార సేవల విభాగంలో కీలక పాత్ర వహించారు. తొమ్మిదివేల కోట్ల కంపెనీ వ్యాపారం అయిదేళ్లలో ముప్పైఒక్క వేల కోట్లకు చేర్చిన ఘనత సత్యకే దక్కుతుంది. నెలకు సుమారు ఆరు వందల కోట్ల రూపాయల భారీ వేతనం తనది.
సత్య తన తండ్రి స్నేహితుడు మరో ఐఎఎస్ అధికారి కె.ఆర్.వేణుగోపాల్ కుమార్తె, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లోనే చదివిన అనుపమను వివాహమాడి, వాషింగ్టన్‌లో స్థిరపడ్డారు. వారికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. తన కొడుకుకి కొంత బుద్ధిమాంద్యం ఉండటంతో, అలాంటి పిల్లల కోసం హైదరాబాద్‌లో ఓ పాఠశాల పెట్టారు.
మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకుడు, మాజీ అధ్యక్షుడు బిల్‌గేట్స్ సత్య సామర్థ్యాన్ని గుర్తించి అబ్బురపడ్డారు. స్టీవ్ బాల్మేర్ తరువాత సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సి.ఇ.ఓ.గా 4 ఫిబ్రవరి 2014న బాధ్యతలు చేపట్టారు. పెళ్లయిన ఏడాదికే ఆ కంపెనీలో చేరిన సత్య, సంస్థకు అత్యధికంగా లాభాలు సమకూర్చే సర్వర్ టూల్ బిజినెస్ విభాగానికీ, అత్యధిక నష్టాలనిచ్చే బింగ్ బిజినెస్ విభాగానికి రెండింటి బాధ్యతలూ నిర్వహించడం విశేషం! భవిష్యత్ ప్రపంచ టెక్నాలజీగా భావిస్తున్న ‘క్లౌడ్’ - ప్రత్యేకించి - ‘అజూర్’పై సత్యకు గొప్ప పట్టుంది.
తన వ్యక్తిగత జీవితంలో వచ్చిన పరివర్తన, మైక్రోసాఫ్ట్ కంపెనీలోని పరిణామాలూ, ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే వాటి విషయాల మూలకందంగా - సత్య నాదెళ్ల రచించిన ఆంగ్ల గ్రంథం ‘హిట్ రిఫ్రెష్’. గ్రెగ్‌షా, జిల్‌ట్రసీనికోల్స్ అనే సహ రచయితల సహకారంతో, సత్య నాదెళ్ల రాసిన ఈ పుస్తకం ఈ సెప్టెంబర్‌లోనే విడుదలై పాఠకుల ఆసక్తికి ఆలవాలమైంది.
తొమ్మిది అధ్యాయాల్లో తన జీవన ప్రయాణం, మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రస్థానం రెండింటి మేళవింపు ఈ గ్రంథం. అయితే మొదటి అధ్యాయాలంత ఆసక్తిగా తదుపరి అధ్యాయాలు కొందరికి ఉండకపోవడానికి - టెక్నికల్‌గా విషయ రచన సాగడం కారణం కావచ్చు. కానీ ఇందులో సత్య చెప్పిన విషయాలేవీ ‘సత్యదూరాలు’ కావు. తన వ్యక్తిత్వంలోని మార్పులనూ, సంస్థాగత పరిణామాలనూ వివరించిన తీరు ఆసాంతం ఆసక్తిగా మలచే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ పనితీరును నిష్కర్షగా అధిక భాగం వివరించారు. ఇన్నోవేషన్ స్థానంలో బ్యూరోక్రసీ ప్రవేశించినప్పుడు - సృజనను అధికారం ఎలా కబళిస్తుందో, సంఘటిత కృషి విచ్ఛిన్నమై ఆఫీస్ రాజకీయాలు పనిచేసే సంస్కృతిని ఎలా దెబ్బతీస్తాయో ఈ పుస్తకంలో సత్య చక్కగా వివరించడం మాత్రమే కాదు, ఆ దురవస్థను అధిగమించిన తీరుతెన్నులను చక్కగా విశదపరిచారు.
ఒక సమయంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇతర కంపెనీలకన్న వెనుకబడి పోతూ వచ్చినప్పుడు మను కార్నెట్ అనే కార్టూనిస్టు మైక్రోసాఫ్ట్ సిబ్బంది గ్యాంగులుగా విడిపోయి, ఒకరిపై ఒకరు తుపాకులు ఎక్కుపెట్టుకుంటున్నట్టు గీసిన కార్టూన్ - తనను ఎలా కలవరపెట్టిందీ, ఒక అంతర్మథనంతో తాను - సంస్థ సంస్కృతిని పునరుద్ధరించవలసిన అగత్యం గుర్తించి, 2014 ఫిబ్రవరిలో సి.ఇ.ఓ. పదవి చేపట్టగానే సిబ్బందికి లేఖ రాయడం గురించీ పేర్కొన్నారు. నిజంగానే ఆ లేఖ ఒక గుణాత్మక సంచలనంగా చరిత్ర సృష్టించింది టెక్నాలజీ రంగంలో. సైకాలజిస్టు మైఖల్ జెర్వైస్‌చే మైక్రోసాఫ్ట్ కంపెనీ లీడర్‌షిప్ టీమ్‌కు అందింపజేసిన సలహాల వల్ల కలిగిన ఉపయోగాలను సత్య ఈ పుస్తకంలో ఆసక్తికరంగా చెప్పారు.
‘గొప్ప ఉత్పత్తులు చేయడం, వినియోగదార్లకు మంచి సేవలందించడం, మదుపు దార్లకు లాభాలు సమకూర్చడం ముఖ్యమే. కానీ అంతమాత్రం చాలదు. మనం తీసుకునే నిర్ణయాలు ప్రపంచం మీద, పౌరుల భవిష్యత్తు మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తాయనేది కూడా వాణిజ్య సారథులుగా అంచనా వేయగలగాలి’ అంటారు సత్య టెక్నాలజీ అధినేతల గురించి.
నిజానికి వృత్తిలో తలమునకలై ఉండి కూడా, ఇలా తన అనుభవాలనూ, సంస్థాగత విషయాలనూ సత్య నాదెళ్ల గ్రంథస్థం చేయడం విశేషం! నిజానికి ఏ పదవీ విరమణ తరువాతనో అనుభవజ్ఞులుగా చెప్పే విషయాలను, ఒక బాధ్యతాయుతమైన సి.ఇ.ఓ. పదవిలో వుండి రాయడం విలక్షణతే కాదు, పనిచేసే సంస్కృతికి మంచి ప్రేరణ. యువ సాంకేతిక తరానికి మార్గదర్శనం. ‘ప్రతి ఇంటా ప్రతి డ్రాయింగ్ రూమ్ బల్ల మీదా కంప్యూటర్ వుండాలనేదే’ మైక్రోసాఫ్ట్ తొలి నినాదం. ఇవాళ కంప్యూటర్ ఒక గృహోపకరణంగా మారింది. మొబైల్స్ ప్రవేశించి పర్సనల్ కంప్యూటర్స్ కూడా మందగించాయి. మైక్రోసాఫ్ట్ కూడా కొన్ని విషయాల్లో వెనుకబడిపోయిందనీ, నేటి వినియోగదారుల అవసరాలను గుర్తించి వారికి తగిన ఉత్పత్తులను అందించవలసిన బాధ్యత ఈనాడు వుందనీ, మైక్రోసాఫ్ట్ రిఫ్రెష్ బటన్‌ను హిట్ చేయాల్సిన అగత్యాన్ని గుర్తించే ఈ పుస్తకం రాశాననీ పేర్కొన్నారు సత్య నాదెళ్ల. సి.ఇ.ఓ. అనే మాటలో ‘సి’ అంటే కల్చర్ అనీ, ఓ సంస్థ సంస్కృతిని కాపాడే క్యూరేటర్‌గా ఈ పదవిని భావిస్తానంటారాయన.
‘హిట్ రిఫ్రెష్’ అనే ఈ గ్రంథానికి బిల్‌గేట్స్ పీఠిక రాశారు. గత రెండు దశాబ్దాలకు పైగా సత్య తనకు తెలుసనీ, కంపెనీపై తన ముద్ర అవిస్మరణీయమనీ ప్రశంసించారు. తన తల్లిదండ్రులు, భార్య అను, తన పిల్లలు ఒక కుటుంబం అయితే, మైక్రోసాఫ్ట్ సంస్థ పరివారం అంతా మరో కుటుంబంగా భావించి - సత్య ఈ గ్రంథాన్ని ఆ రెండు కుటుంబాలకూ అంకితం చేశారు.
ఇతరులతో తాదాత్మ్యం చెంది అర్థం చేసుకోవడం, ఏదీ శాశ్వతం కాదనే ఎరుక కలిగి ఉండడం అనే బుద్ధుని బోధనల తాత్త్విక పార్శ్వం సత్య నాదెళ్ల ఈ రచనలో ద్యోతకమవుతోంది. మిక్సడ్‌రియాలిటీ, ఆర్ట్ఫిషియల్ ఇంటలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ అనే మూడింటి ప్రధాన ఆలోచనా స్రవంతిగా ఈ రచన సాగింది తన హైదరాబాద్ జ్ఞాపకాలను, తన క్రికెట్ క్రీడా ఉత్సుకతను, ఇండియన్ బ్యాట్స్‌మెన్ జయసింహపై గల తన అభిమానాన్ని, తన ఇరవై ఏళ్ల వయస్సులోనే అమెరికాకు వచ్చేయడం, అనూతో పెళ్లయ్యాక ఒక సమయంలో గ్రీన్‌కార్డు వదులుకుని స్వదేశానకి వచ్చేయాలనిపించిన మనఃస్థితినీ, మైక్రోసాఫ్ట్ రంగంలో గత అయిదేల్లలో ముఖ్యంగా పొడసూపిన పరిణామాలనూ ‘హిట్ రిఫ్రెష్’ గ్రంథంలో సత్య వివరించిన సంగతులు ఎంతో హృదయంగమంగా అలరించి, పాఠకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
ప్రపంచంలో టెక్నాలజీ రంగ భవిష్యత్తును గురించి కూడా ఇందులో చర్చించారు. తాను, తన కుటుంబం, తాను పని చేస్తున్న కంపెనీ, తన ప్రజలు, జీవిత ప్రయోజనం అనే అంశాలన్నింటి పట్లా అవగాహన, అభినివేశం, ఉపయుక్త ఆలోచనలు కలిగిన సత్య నాదెళ్ల ఒక అద్భుత టెక్నాలజీరంగ అధిపతిగానే కాదు, రచయితగా సకాలంలో ఉపయుక్త అంశాలను జనావళితో పంచుకునే సృజనకారునిగా కూడా ఈ పుస్తకంతో వ్యక్తం కావడం అభినందనీయం. సరికొత్త అధ్యాయాలను చేరుస్తూ ఎప్పటికప్పుడు ‘హిట్ రిఫ్రెష్’ను నవీకరించే అవకాశం ఉంది. సత్య నాదెళ్ల మున్ముందు ఆ సీక్వెల్స్‌ను అందించి, రాబోయే తరాలకూ స్ఫూర్తిదాయక మార్గదర్శిగా, దారి దీపంగా వెలుగొందాలని ఆశిద్దాం. ఈ పుస్తక పఠనంతో యువతరం స్ఫూర్తిమంతం కావాలని ఆశిద్దాం.

-సుధామ