అక్షర

యథాలాపంగా అనుభవ వేదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ స్వధర్మమేమిటో కనుక్కోఆధ్యాత్మిక వ్యాస సంకలనం
-నీలంరాజు లక్ష్మీప్రసాద్
వెల: రూ.50 పుటలు: 184
ప్రతులకు: విద్యార్థి మిత్రప్రచురణలు
ఫ్రెండ్స్ బుక్ డిపో పార్క్‌రోడ్, కర్నూలు- 518001

** ** **

పుస్తకం మస్తకాన్ని పదును పెడుతుంది. అనుభవం హృదయంలో పదిలమవుతుంది. అనుభవం ముఖ్యంగా మూడు విధాలు - పఠనానుభవం, స్వానుభవం, లోకానుభవం అని. ఈ మూడు రకాల అనుభవాలతో ఒక మేధావిగానీ, ఒక భావుకుడు గానీ ఏదైనా ఒక పుస్తకం రాస్తే అది సామాన్యుని నుంచి ధీమాన్యుని వరకు చదివిన ప్రతి పాఠకుని మస్తకాన్ని పదును పెట్టి, ఆలోచనకు పురికొల్పి, మంచి పని కల్పిస్తుంది. అలాంటి కొన్ని ప్రేరణాత్మక లఘు వ్యాసాల, కొన్ని మ్యూజింగ్ల సంకలనాన్ని నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారు ‘నీ స్వధర్మమేమిటో కనుక్కో’ అనే పేరుతో రచించారు.
ఈ పుస్తకంలో మొత్తం 51 అంశికలున్నాయి. ‘అమ్మ బ్యాంక్ ఎకౌంట్’ అనే కథాపూర్వక, సందేశాత్మక అంశిక బాగుంది. ఒక సుందర, అపకార రసిత, ఆశావాద పూర్వకపు అబద్ధంతో ఒక మాతృమూర్తి తన పిల్లల భవిష్యత్తును ఎంత బాగా తీర్చిదిద్దగలదో అమెరికా దేశ రచయిత్రి కేథరీన్ ఫోర్బ్స్ రాసిన ఒక ఉదాత్త సందేశాత్మక కథను స్వేచ్ఛానువాదంతో సమర్థంగా అందించారు రచయిత.
‘మతాలు, ఇజాలు లేని లోకం’ అనే వ్యాసం మరణానంతర జీవితం గురించిన ఒక మహా గంభీరమైన ఆలోచనాత్మక రచన. గొప్ప జిజ్ఞాసను రేకెత్తిస్తుంది. మనిషి చనిపోయాక అతని ఆత్మ యొక్క సూక్ష్మ జీవనం (ఎథిరిక్ - లేక - ఈథరియల్ లైఫ్) కొన్ని కంపనల (వైబ్రేషన్స్)ను అనుభూతిస్తుంది. ఆ కంపనల స్థాయి (వైబ్రేషనల్ లెవెల్)ని బట్టి ఆత్మయొక్క సూక్ష్మశరీర జీవనం తనతో సహానుభూతి, సమాన భావనలు కలిగిన ఇతర మృతజీవుల ఆత్మలతో కలిసి సంచరిస్తుంటుంది - ఇలా చాలా లోతుగా ఉత్కంఠభరితమైన అంశాలతో ఒకే బిగువున చదివిస్తుంది ఆ వ్యాసం. ఆ థియరీకి ఆధారంగా పాశ్చాత్య పారాసైకాలజిస్టులైన ప్రొఫెసర్ వినె్సంట్ లూటో స్లావ్‌స్కీ, డమాస్కిమోస్‌లను కూడా ప్రస్తావించారు నీలంరాజు వారు.
‘మన చదరంగమూ ఒక శాస్తమ్రే’ వ్యాసంలో చదరంగం ఆటలోని ‘మస్తు’ ‘నిర్మస్తు’ ‘మద్దత్ మజా’ ‘మారాపూరి’ ‘జాతీయ’ ‘అంతర్జాతీయ’ మొదలైన రకాలు, రాజకీయ చతురతలు, వ్యూహాలు, రాజధర్మాలు, నీతి నియమాలు - వీటి గురించిన చాలా ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకున్నాయి.
‘బ్రతుకు ఒక మహదవకాశం’ వ్యాసం ఈ వ్యాసమాలలో ఒక మణిపూ. ‘ద్వంద్వాలకు ప్రచలితం కాకుండా ఆనందాన్ని కనుక్కోవటానికే జీవితం’ అనే సందేశాన్ని చాలా తేలిక మాటలతో, మంచి వ్యాఖ్యానంతో, కాదనలేని రీతిలో పాఠకుని మనసుకు పట్టేట్టు రాశారు.
‘ప్రయాణం ఒక అనుభవం’ అనే వ్యాసంలో చెప్పిన అనుభవాలు సార్వజనీనాలు. మనకు దైనందిన జీవితంలో అప్పుడప్పుడు తారసపడుతుండే కొందరు దురాలోచన - దురాశాపరులైన ఆటోడ్రైవర్లు, బస్ డ్రైవర్లు, గెస్ట్‌హౌస్ వాచ్‌మన్లు మొదలైన వారి వల్ల కలిగే ఇబ్బందులను, కష్టనష్టాలను వివరించారు. బస్సు ప్రయాణికులకు అకాల భోజనాలు, కాఫీ దొరకక తలనొప్పులు లాంటివి తప్పించగలిగే ఏర్పాటుకు తగిన చక్కని సలహా ఒకటి ఆర్‌టిసి వారికిచ్చారు రచయిత.
‘్ధర్మంలో మెళకువలు’ అనే వ్యాసంలో జోషువా బెన్ హనావీయ అనే మతగురువు ‘్భగ్యవంతుని నుంచి దానం పొందిన పేదవానికి జరిగే మేలుకన్న పేదవాడు భాగ్యవంతుని దానాన్ని స్వీకరించటానికి అంగీకరించటం వల్ల భాగ్యవంతుడికి జరిగే మేలే ఎక్కువ’ అని చెప్పిన వాక్యం లాంటివి చాలాచాలా తళుక్కుమంటుంటాయి ఈ పుస్తకంలో. ఈ వ్యాసంలో లలిత హాస్యం కూడా తొంగి చూస్తూంటుంది. వ్యాసం చివరలో తక్షణ కర్తవ్యం అంటూ ‘ఏ సంస్థలోనైనా అక్కడేమేమి జరుగుతున్నాయో తెలిసిన వాడు ఒక్కడైనా ఉంటాడు. అతడిని వెంటనే బర్తరఫ్ చేయాలి’ అంటాడు ఉత్కళరావు. బతకటం నేర్చిన వాడి తరహాకు చెందిన లౌక్య ధర్మపు మెళకువ ఒకటి చెప్తూ.
ఆశావాద - నిరాశావాదాల మద్య డోలాయమానంగా ఊగిసలాడుతూ సతమతమవుతున్న నేటి సగటు మానవుడికి ‘ఇక ముందు రాబోయే కాలంలో బాధలు మరింతగా ఉంటాయి అని భయపడటంలో కూడా ఒక సంతృప్తి ఉన్నట్టు కనిపిస్తుంది’ అంటూ ‘గతం నిజంగా గొప్పదే’ అనే మ్యూజింగ్‌లో కనిపించే వాక్యం బహు గంభీరార్థ సంభరితం, సార్వకాలిక సార్వజనీన సత్యం.
‘శుభస్య శీఘ్రం (మంచిని తొందరగా చేయాలి)’ అని కాదు; ‘శుభస్య తక్షణం (మంచిని వెంటనే చేయాలి)’ అంటారు 98వ పుటలో రచయిత ఒక సూక్తిని ‘సూపర్’ ఉక్తిగా మలుస్తూ, కాదా అని ప్రశ్నిస్తూ.
‘ప్రాణ త్యాగం - మనో త్యాగం’ అనే అంశికా వ్యాసంలో భక్తకబీర్, జిడ్డు కృష్ణమూర్తిల దృక్పథాలలో ఒక ఏకత కనిపిస్తుంది ‘జీవితం - దేవుడు - మనస్సు’ అనే విషయంలో.
చలం దృక్పథాన్ని మొహమాటం లేకుండా ఖండించిన ఒక బలమైన వ్యాసం ఇందులోని ‘స్వేచ్ఛా ప్రణయం’
కమ్యూనిస్ట్ నాయకుడు నీలం రాజశేఖరరెడ్డి ఎంత మృదు భాషో, ఎంత మంచి మర్యాదస్తుడో, ఎంత ప్రశాంతంగా తన వాదన వినిపిస్తాడో తెలియజేస్తుంది. ఆయన వ్యక్తిత్వ ఉన్నతిని పేర్కొంటూ రాసిన ‘పేదల మనిషి’ అనే వ్యాసం.
‘్ధన ప్రాధాన్యం’ అనే మ్యూజింగ్‌లో డబ్బును గూర్చిన చమత్కార వాక్యాలు బాగున్నాయి. ‘పర్సు గనక తేలిగ్గా ఉంటే హృదయం బరువుగా ఉంటుంది. పర్సు బరువుగా వుంటే హృదయం తేలిగ్గా ఉంటుంది’ అంటాడు పాశ్చాత్య రచయిత జాన్‌బోరే’; ‘డబ్బుకన్నా ముఖ్యమైనవున్నాయి. కాదనటానికి లేదు. కానీ వచ్చిన చిక్కల్లా అవన్నీ డబ్బు పెట్టే కొనాలి’ వంటి వాక్యాలు కొన్ని తార్కాణాలు మాత్రమే.
115వ పుటలోని ‘సౌభ్రాతృత్వ’ పదం సాధువు కాదు. ‘సౌభ్రాత్రం’ అనాలి భావార్థక తద్ధిత రూపంలో. 114వ పుటలో ‘్భరతీయ వెలుగు’ అనే శీర్షికా పదబంధం వికృతంగాను, ఎబ్బెట్టుగాను ఉంది - ‘టుమారో పొద్దున’ ‘తొమ్మిదో క్లాక్’ అన్న పదాలలాగా. భారతీయ ‘ప్రభ’ అని గాని, రోచిస్సు, శోభ, దీప్తి వంటి పదాలతోగాని, లేక భారతీయపు వెలుగు అని గాని రాస్తే శ్రవణ సుభగంగాను, హుందాగాను ఉంటుంది.
మొత్తం మీద మానవ జీవన ఉదాత్త ధర్మపథం కొంతైనా తెలుసుకోవటానికి సరళమైన భాషలో సవ్యాఖ్యానంగా, సోదాహరణంగా, పఠనీయంగా రూపొందిన పుస్తకం ఈ ‘నీ స్వధర్మమేమిటో కనుక్కో’.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం