అక్షర

అర్థం తెలియని ఆప్యాయత - అంత్యక్రియలకు ఆర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగన్నాధం అనే ఆయన తన మేనల్లుడు రఘునందనంను తీసుకుని విజయవాడ నుంచి గుంటూరులో ఒక ఆసుపత్రికి చేరుకుంటాడు. అక్కడ తనకు ప్రతి నెలా వంద రూపాయలు మనిఆర్డర్ పంపుతూ ‘రఘునందనాన్ని బాగా చదివించండి’ అని కోరుతూ ఉత్తరం రాస్తున్న మనిషిని చూడాలని ప్రయత్నంగా ఆ మనిషి ఎవరో తెలియదు, రఘునందనానికి అబ్బ వంక చుట్టమో, అమ్మ వంక చుట్టమో ఎరగడు అతను. ఆస్పత్రిలో ఆ మనిషిని కలుసుకున్నపుడు అర్థం తెలియని ఆప్యాయతకు కారణం దొరికింది జగన్నాధానికి. అంత్యక్రియలకోసం ఆ మనిషిలోని ఆర్తి అర్ధం అయింది రఘునందానికి.
జీవితంలో జరిగే యిటువంటి అలవోకను ఆప్యాయంగా ఎఱుక చేసే కథానిక ‘అంతరంగం’. రచయిత శ్రీ పి.యస్.నారాయణ. ప్రతి పనికి కార్యా కారణాలు వెదుకుతూ వుంటుంది మనస్సు. భౌతిక వాతావరణం చక్కగా వుండకపోతే భయభ్రాంతులతో దూరంగా వుండాలని ప్రయత్నిస్తుంది. మనసుకు సందర్భం సరయినదిగా కనిపించకపోతే దానిని చెరిపివేసుకుందుకు శతధా ప్రయత్నం చేస్తుంది.
ఇంతకూ రఘునందం ఎవరు? తల్లినీ తండ్రినీ కోల్పోయి, అనాధగా మేనమామ ఆసరాలో వుండి చదువుకుంటున్న కుర్రవాడు. మేనమామ ఆర్థికంగా లేనివాడేమీ కాదు. అందుకనే మేనల్లుడి కోసం ‘శ్రేయోభిలాషి’ పంపిస్తున్న డబ్బును తిప్పికొట్టాలని ప్రయత్నం చేశాడు. శ్రేయోభిలాషి ఎవరో తెలుసుకోవటానికి ప్రయత్నం చేశారు. కాని అది ఫలించలేదు.
అకస్మాత్తుగా మనియార్డర్లురావడం ఆగిపోయింది. ఒక నెల, రెండు నెలలు. అప్పుడు ఓ ఉత్తరం వచ్చింది అతనికి (జగన్నాధానికి). ‘నేను చివరి ఘడియల్లో వున్నాను.. రఘునందనాన్ని ఒక్కసారి చూడాలనిపిస్తోంది. శ్రమ అనుకోకుండా బాబును తీసుకురండి.. నేను గుంటూరులో జనరల్ ఆస్పత్రిలో స్ర్తిల వార్డులో వున్నాను’ అనేది ఆ ఉత్తరం.
జగన్నాధానికి శ్రేయోభిలాషిని కలుసుకుందుకు, అతని (ఆమె) ఆప్యాయతకు కారణం తెలుసుకుందుకు అవకాశం దొరికినట్లయింది. అందుకే వెంటనే మేనల్లుడిని తీసుకుని ప్రయాణం అయి వెళ్లాడు. ఆస్పత్రి వాతావరణం, అక్కడ ఉన్న మురికితనం, మందు వాసనలతో పాటు మందభాగ్యుల ఆవేదనలు, ఇవన్నీ నడుచుకుంటూ, స్ర్తిల వార్డుకు వెళ్లి ‘ముడుతలు పడ్డ చర్మం కప్పుకున్న ఓ ఎముకల గూడు కళ్ళు మూసుకొని పడి వుండడం, ఎండిపోయిన ఛాతీ ఎగిరెగిరి పడుతూ వుండడం’ చూస్తాడు. అప్పటికీ ఆ మనిషి ఎవరో అతనికి తెలిసిరాదు. అసలు అంతకుముందు తెలిసిన వ్యక్తి అయితే గదా! నర్స్ సహాయంతో ఆ మనిషి ‘పంకజం’ అని పేరున్నదని తెలుసుకుంటాడు. ‘ఆమె బురదగుంటల్లో బ్రతికిన మనిషి. పిడికెడు మెతుకుల కోసం శరీరాన్ని అమ్ముకున్న దౌర్భాగ్యురాలు’ అంటూ పది రోజుల క్రితం ఒక మనిషి తెచ్చి ఇక్కడ పడేసి వెళ్లాడు.. ఆమెకు లేని రోగాలు లేవు అని నర్స్ ద్వారా తెలుసుకుంటాడు. నర్స్ సహాయంతో పంకజం కళ్ళు తెరిచి చూడగలుగుతుంది. దిండుకింద జాగ్రత్తపరిచిన ఓ ఉత్తరాన్ని అందుకుంటాడు జగన్నాధం, రఘునందనం. ఆ ఉత్తరంలో తన జిగుప్స, ఆవేదన, దేవతలను కోరుకునే వరాలు అన్నీ వ్రాస్తుంది పంకజం.
‘చిన్నపిల్లవాడివయినా నువ్వు గుండు చేయించుకుని, పిలక పెట్టుకుని, నది మెట్లమీద కూర్చుని- ఆ ఎండలో సూర్యునిలా మెరిసిపోతూ, చనిపోయిన మీ అమ్మ అస్థికలను నిమజ్జనం చేసేందుకు గాను బ్రాహ్మడు చెప్పినట్లుగా చేస్తున్నావు.. నాలో ఎందుకో నీ మీద తెలియని అభిమానం ఏర్పడింది. ఆ రూపంలో వున్న నీ ముఖ వర్చస్సు నన్ను అయస్కాంతంలా నీవైపు లాగింది. చాలాసేపు అలా నిన్ను చూస్తూనే ఉండిపోయాను.. ముందు ముందు నువ్వు పొందబోయే విజ్ఞానంలో నేనూ ఇసుక రేణువంత భాగస్వామ్యాన్ననయినా పొందాలనే కోరిక నాలో కలిగింది ఆ క్షణాన. పర్యవసానమే నేను ప్రతి నెలా నాకు చేతనయినంత నీకు చదువు నిమిత్తం ఖర్చుపెట్టేందుకై పంపాను. ఇలా చేసినా నన్ను పాప పంకిలమైన ఈ జీవితంలో కొద్ది తృప్తి పొందనీయ్.. నీ శ్రేయోభిలాషిగానే నీ మనసులో నన్ను ఉండనీయ్..
ఆమె వృత్తాంతం అంతా తెలుసుకున్నాక జగన్నాధం ఆమె పడుపు వృత్తికి అసహ్యించుకుని మేనల్లుడిని బయటకు లాక్కు వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. ‘దరిద్రపు సంత.. మనకెందుకు వచ్చిన పీడ ఇది’ అని అతని వ్యాఖ్యానం. రఘునందనం మటుకు మరింత లోతుగా ఆలోచించి యిలా అంటాడు.. ‘ఆప్యాయంగా ప్రతినెలా డబ్బు పంపడంలో అసంబద్ధం కాకపోయనా ఆమె అంతరంగంలో నిగూఢంగా మరో కోరిక కూడా వుండి వుంటుంది. అమ్మ పోయినపుడు నేను చేస్తున్న కర్మకాండను చూచి ముగ్ధురాలయింది. ఆమెకు శాస్తయ్రుక్తంగా అంత్యక్రియలు చేద్దామనుకుంటున్నాను మామయ్యా’ అంటాడు దృఢమైన కంఠంతో.
అంతరంగంలో వున్న ఆలోచనలను ఒడిసి పట్టుకునే పాత్రలతో పి.యస్.నారాయణ ఇంకా కొన్ని కథలు వ్రాశారు. జీవితంలో జరిగే కారణాలు తెలియని అనేక కార్యాలకు దారిచూపించే దీపాలు ఇలాంటి కథానికలు. తెలిసిన జీవితం కంటే, తెలియని జీవితం మరింత విభిన్నమయినదీ, విచిత్రమయినదీని!

- శ్రీవిరించి, 09444963584