అక్షర

తీరైన నుడులలో చణకసుత నీతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాణక్య నీతి 300 శ్లోకాలు తాత్పర్యంతో
సంకలనం: కె.వి.రమణ
పుటలు: 62 వెల: రూ.40
ప్రతులకు: నవ చేతన పబ్లిషింగ్ హౌస్
గిరిప్రసాద్ భవన్ బండ్లగూడ (నాగోల్) జి.ఎస్.ఐ పోస్ట్ హైదరాబాద్- 500 068
ఇతర అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో

** *** **** **************

మనిషి సంఘ జీవి. మనీషి సంఘోత్తమ జీవి. మనిషి అంటే సామాన్యుడు. సంఘంలో ఒక వౌన జీవి. సగటు జీవి. ‘మనీషి’ అంటే ధీమాన్యుడు (మనీష కలవాడు). సంఘానికి పరిశోధన - అధ్యయనాల ఆలోకనతో దిశా నిర్దేశం చేసే వాడు. అలాంటివాడు శతాబ్దానికి ఒకడు పుడతాడు. భారతీయ చారిత్రక యుగాలలో అలాంటి వాళ్లలో బహుశః చాణక్యుడే మొదటివాడు.
ప్రాచీన కాలంలో అర్థశాస్త్రం అంటే రాజనీతి శాస్త్రం (పొలిటికల్ సైన్స్). చాణక్యుడు వౌర్యుల నాటి అర్థశాస్త్ర రచయిత. అంతేకాకుండా మానవ సామాజిక జీవితం, వైయక్తిక జీవితం, ధార్మిక మార్గం, లోకరీతి, లౌక్యం మొదలైన అంశాల మీద కూడా చాణక్యుడు అసంఖ్యాకంగా ముక్తకాలు, వృత్తగంధులు మొదలైనవి చెప్పాడు. అలాంటి వాటిని ఒక మూడు వందల సూక్తులను ఏర్చి కూర్చి, వాటికి సరళ సుందర శైలిలో ఆంధ్రీకరణ చేశారు కె.వి.రమణ. పుస్తకం పేరు ‘చాణక్యనీతి’.
విలువల గురించి చెప్తూ
‘మణిర్లుంఠతి పాదాగ్రే; కాచః శిరసి ధార్యతే/ క్రయ విక్రయ వేళాయాం కాచః కాచో మణిర్మణిః’ అంటాడు చాణక్యుడు. దీనికి ఒక వచన కవితా శైలిలో రచయిత చక్కని భావలయ, కించిత్తు శబ్ద లయలతో
‘విలువలు తెలియని వాడి దగ్గర జాతిరత్నం పాదాల ముందు దొర్లవచ్చు. గాజు ముక్క నగలాగా వాడి శిరస్సు నెక్కవచ్చు. కాని, క్రయ విక్రయాల అంగట్లో దేని విలువ దానిదే. రత్నం రత్నమే; గాజుముక్క గాజుముక్కే. జాతి రాయి విలువ గాజు ముక్కకు రాదు’ అని అనువాదం చేశారు.
చాణక్యుడు నవనందుల కొలువులో తనకు జరిగిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకుని, అన్యాపదేశంగాను, సమాసోక్తి అలంకార గర్భితంగాను, ధ్వనిశిల్ప మనోహరంగాను ఈ ముక్తకం అప్పటికప్పుడు చెప్పి ఉండాలి. తన మేథాశక్తి, ఆత్మవిశ్వాస, ఆత్మగౌరవ, ఆత్మస్థైర్యాలను గూడా గౌణంగా తెలియజేస్తూ. ఏది ఏమైనా వస్తువు విలువ విజ్ఞులు మాత్రమే గుర్తిస్తారు అనే సార్వకాలిక, సార్వజనీన సత్యం ఇందులో రచనా శిల్ప కళాత్మకంగా కళకళలాడింది.
‘కాలః పచతి భూతాని కాలః సంహరతే ప్రజాః/ కాలః సుప్తేషు జాగర్తి కాలోహి దురతి క్రమః (కాలమే జీవరాశిని సంహరిస్తుంది, మింగేస్తుంది. జగత్తు నిద్రలోకి వెళ్లినా కాలం మేల్కొనే ఉంటుంది.) అంటూ చాణక్యుడు చెప్పిన ముక్తకంలో భావ గాంభీర్య సహితమైన ఒక చమత్కారం చాణక్యుడిని ఒక భావకవిగా మనం సంభావించేట్లు చేస్తుంది.
‘విద్యామిత్రం ప్రవాసేషు భార్యా మిత్రం గృహేషు చ/ వ్యాధితస్యౌషధం మిత్రం ధర్మో మిత్రం మృతస్యచ (విదేశంలో విద్యయే తోడు. ఇంటిలో భార్య తోడు. రోగికి ఔషధం తోడు. (ఆచరించిన ధర్మమే చివరి తోడు.)’ అనే శ్లోకం ఇహపర సాధకంగా, ఉదాత్త సందేశాత్మకంగా సందీపిస్తోంది.
‘శకటం పంచ హస్తేన దశ హస్తేన వాజినం/ హస్తినం శత హస్తేన దేశ త్యాగేన దుర్జనం’ (ఎద్దుల బండికి ఐదు మూరల ఎడంగా, గుర్రానికి పది మూరల ఎడంగా, ఏనుగుకు నూరు మూరల దూరంగా విడిచి ఉండాలి. దుర్జనుణ్ణి దేశం నుండి తరిమెయ్యాలి)’ అనే శ్లోక భావం ఉత్కంఠారోహణాలంకారం (‘క్లైమాక్స్’ అనే ఇంగ్లీష్ ఫిగర్ ఆఫ్ స్పీచ్)లో ఇంపుగా సొంపమిరి ఉంది. నేటి కాలపు ఉగ్రవాదులను, హింసావాదులను దృష్టిలో ఉంచుకొని ఈ శ్లోకం చదువుకుంటే చాణక్యుడు ఒక క్రాంతదర్శిగాను, దార్శనికుడుగాను కనిపిస్తాడనిపిస్తుంది.
ఇక ఈ సూక్తిముక్తక త్రిశతిలో ఉపమ, రూపక, దృష్టాంత, అర్థాంతరన్యాస, సమాసోక్తి, సారాది అలంకార శోభాన్విత శ్లోకాలైతే ముప్పాతిక మువీసం పఱచుకొని ఉన్నాయి.
‘అతి సర్వత్ర వర్జయేత్’ అని త్యాణి శరీరాణి’ ‘ఆత్మవత్ సర్వభూతాని’ ‘వినాశకాలే విపరీత బుద్ధి’ ‘యథా రాజా తథా ప్రజా’ లాంటి లోకోక్తులకు కాపీరైట్ చాణక్యుడే అవునో కాదో గాని అవన్నీ మాత్రం చణకసుతుని లోకజ్ఞతా ప్రాభవానికి అందమైన అద్దాలే అనిపిస్తాయి - ఈ పుస్తకంలో అడుగడుక్కీ అగుపించే నానుడులను చూస్తూంటే.
‘తాపత్రయం అంటే మూడు రకాల బాధలు. అవి 1.ఆద్యాత్మికం; మనస్సు, శరీరాల వలన కలిగే విపత్తులు. 2.ఆదిదైవికం; వరుణుడు, అగ్నిదేవాదుల వలన కలిగే విపత్తులు. 3.ఆధిభౌతికం: పులి, పాము వంటి క్రూర ప్రాణుల వలన కలిగే విపత్తులు’.
‘తామస యజ్ఞం’ అంటే శాస్త్రానుసారంగా లేని యజ్ఞం.’
ఆశ్రయం అనే శీర్షిక కింద ‘యత్రోదకం తత్ర వసంతి హంసాః..’ అంటూ మొదలయ్యే శ్లోకానికి తాత్పర్యం చెప్పటమే కాకుండా ‘అవసరం తీరగానే ఆశ్రయమిచ్చిన వారిని విడిచిపెట్టటం, అవసరం కలిగి మళ్లీ ఆశ్రయించటం కూడదు అని భావం’ అంటూ శ్లోకార్థాన్ని వింగడించి ముక్తాయింపు కూడా చెప్పటం.
- ఇలాంటి విశదీకరణలు, వివరణలు ఇవ్వటం రచనకు ఒక నిండుతనాన్ని ఇచ్చింది.
సూక్తులను కూడా కళాత్మక విలువలతోను, సారాంశ చమత్కారాలతోను చెప్పవచ్చని చాణక్యుడు నిరూపించాడు. వాటిని తీరైన తెలుగు నుడికారంతో నుడివిన అనువాద శిల్పి అభినందనీయుడు.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం