అక్షర

అస్తిత్వ పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రదుక్కి (కథలు)
-ఎం.నారాయణ
వెల: రూ.100
ప్రతులకు: రచయిత వెంకటేశ్వర కాలనీ, అచ్చంపేట, నాగర్‌కర్నూలు మరియు ప్రముఖ పుస్తక కేంద్రాలు

*** *** *** *******************

‘మన భాష, మన కళలు, మన సాహిత్యం, మన సంస్కృతి అనే బలమైన వ్యక్తీకరణ గత పదేళ్లలో పెరిగింది. తెలంగాణా ఉద్యమం జరిగిన ఈ అయిదేళ్లలో అది మరింత బలపడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాతనైతే, తెలంగాణ తనకు తాను తెలుసుకుని నిర్మాణం కావటానికి ప్రయత్నిస్తున్నది. ఇన్నాళ్ల విస్మరణకు, వివక్షకు, వక్రీకరణకు గురైన తన చరిత్ర, సంస్కృతి, సాహిత్య మూలాలను అనే్వషించి కొత్త నిర్మాణం వైపు పరుగులిడుతున్న సమయమిది’ అని అంటారు ప్రముఖ అధ్యాపకుడు, తెలంగాణ సాహితీ చరిత్రకారుడు శ్రీకాశిం తన ‘తెలంగాణా సాహిత్యం’ (డిసెంబర్ 2015 ప్రచురణ) అన్న వ్యాస సంకలనంలో.
తెలంగాణా వాడుక భాష అసలు తెలుగే కాదని, విస్మరించిన నేపథ్యంలోంచి, వేరు పోరాట ఉద్యమం మొదలయిన నాటి నుండి తెలంగాణా భాషకు, యాసకు ఆదరణ పెరిగింది. ఎందరో కవులు, గాయకులు, కథకులు, వ్యాసకర్తలు తమ భావజాలాన్ని ఈ ప్రాంతపు భాషలో అనుసృజనం కావించటం మొదలుపెట్టారు. ఇదొక గొప్ప శుభ పరిణామం.
ఏ భావం అయినా తన స్వంతమైన మాతృ నుడికారంలోనే బాగా పలుకగలుగుతుంది. భావ వ్యక్తీకరణ, పద చిత్రణ ఎదుటివారి గుండెలోకి సూటిగా దూసుకెళ్లగలుగుతుంది. అరువు సొమ్ము ఏనాటికైనా బరువే కద! దీనికి తగినట్టుగా కొన్ని ప్రముఖ పత్రికలు కూడా ఇదే భాషకు ప్రాముఖ్యత ఇచ్చి తమ రాష్ట్భ్రామానం చాటుకున్నాయి- తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తరువాత. ఈ ప్రాంతపు నుడికారంతో ఎన్నో కథలు వస్తున్నాయి. ఇట్లా వచ్చిన కథల్ని నిశితంగా పరిశీలిస్తే, సింహభాగం మధ్యతరగతి రైతులు, రైతు కూలీలు, అట్టడుగు వర్గాల బడుగు జీవిత పోరాటాలు కానవస్తాయి.
ఈ కోవకు చెందిందే ఈ కథా సంకలనం ‘ఎర్రదుక్కి’. ఎత్తుగడ, కథనం, ముగింపు: ఈ మూడూ కథకు ప్రాణం లాంటివి. ఈ మూడింటినీ, ప్రతిభావంతంగా, ప్రభావపూరితంగా చెప్పగలిగినప్పుడే కథ పాఠకుడి మనసులో తిష్ట వేసుకో గలుగుతుంది. ఈ మూడింటినీ ఈ కథల్లో చెప్పిన తీరు గమనిస్తే - ఇవన్నీ రచయిత స్వానుభవాలా అన్న భ్రమ కలిగించేవిగా ఉన్నాయి.
‘మునుపెన్నడూ లేదు. ఆవులు, ఎడ్లూ, కోడెలు, లేగలు.. గుంపులు గుంపులే వస్తున్నాయి’ (బొల్లెద్దు) పాఠకుడు ఈ ప్రారంభ వాక్యం చదవగానే, కారణం తెలుసుకోవాలన్న కుతూహలానికి లోనవుతారు. ‘సారూ..! ఓ సారూ..! అమ్మా..! ఓ అమ్మా..’ గేటు బయట పిలుపు (్భమ్ కుట్ర) పాఠకుడ్నే పిలుస్తున్నట్లనిపించి ఒక్కసారిగా ‘ఎలర్ట్’ అవుతాడు. ‘ఊరంత చిత్తడి చిత్తడైంది.’ (ఎర్రదుక్కి) ఎందుకైంది అన్న ఉత్కంఠ రేపే ప్రారంభ వాక్యాలు ఇవి. తరువాతి వాక్యానికి చూపుల్ని పరుగెత్తించే ప్రక్రియ.
సంకలనంలోని కథనం కూడా ఆకట్టుకుంటుంది. రచయిత తన అనుభవంలోకి వచ్చిన, అనుభూతించిన సంఘటనల్లోంచి కథను అల్లాడు. కాబట్టి సన్నివేశాలని అతి సహజంగా కనులకు కట్టినట్లుగా వర్ణించాడు. ‘మేతలేక కరువు గోసతోని ఇల్లు గడవక పాణం లెక్క పెంచుకున్న ఎద్దును అమ్మనీకి’ వచ్చిన బాలయ్యకు అమ్మనీకి మనసొప్పక మూడు వారాల నుంచి గుంజాటన పడుతున్నాడట. సమాజం ఎంత దూరం వెలివేసిందో, ఆ వూరి ప్రజలకు అంతే దగ్గరుంటాడట సోమయ్య! (సోమయ్య). ‘ఇత్తునాలెయ్యనీకి సెల్కలకు పోతే...’ అక్కడ భూమి ఎట్లున్నది? ‘ఎండకాలమంత గుంటుకలు గొట్టి నలెదిరి, మంకు లెక్క’ ఉన్నది! నలకలు ఏమీ లేకుండా మెత్తగా, తాకగానే నుదుటి చర్మానికి అంటేలా మృదువుగా ఉంటుంది కుంకుమ. లచ్చమ్మ పిన్ని (ఎర్రదుక్కి) విత్తులు నాటటానికి ముందు నేలను అట్లా చేసి ఉంచింది. మట్టినే నమ్ముకున్న రైతు మాసయ్యను ఆ మట్టికి దూరం చేసింది. తన భూమికి పరాయివాన్ని, పనిమనిషిని చేసిందట (్భమ్ కుట్ర) ఇదీ ప్రపంచీకరణ ప్రసాదించిన అభివృద్ధి అనుకుంటాం, కథ ముగియగానే. పాఠకుడు మరి కొంతసేపు కథలోనే ఉండిపోయే వాక్యాలు! ఆ వూరి మాదిగ చంద్రయ్య భార్య రాములమ్మ గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలుగా ఎన్నికవుతుంది! ప్రొటొకాల్ ప్రకారం పంద్రాగస్టునాడు ఆమే.. జండా ఎగురెయ్యాలి. సమాఖ్య భవనం ముందున్న చెత్తాచెదారం, పెంటకుప్పలు ముందు రోజు ఎప్పటిలా రాములమ్మే సాఫు చేసింది. మరునాడు అద్యక్షురాలుగా ఆమే... జండా ఎగురేస్తుంది. కాని పొలం పనులకు ఆలస్యం అవుతుందంటూ భర్త గదమాయించగానే.. జండాను అలాగే వదిలేసి పరుగెత్తాల్సి వచ్చింది. ‘ఎగిరీ ఎగరని జండాలా వుండిపోతుంది దళితవాడ’ అన్న ముగింపు వాక్యం పాఠకుడిని ఆలోచనలో పడవేస్తుంది.
పదకొండు కథలు. 66 పేజీలు. అయినా ఒక్కో కథ వెనుక ఒక్కో వంద పేజీల ఆవేదన. ముందు మాటలో డా.కాశిం చెప్పినట్లు ‘కన్నీటి బొట్టులో, కంటిపాప మెరుపులో కథకు కావాల్సిన ముడిసరుకు వెదుక్కుంటాడు నారాయణ! భావం, ఉద్రేకం (ఉద్వేగం) కలిపిన సుతారమైన అల్లిక నారాయణ కథలు! నారాయణ మాత్రమే రాయగలడు అని అనిపించేంత గొప్పగా రాసిన కథలు. జీవితం పట్ల ప్రేమ సంఘర్షణ సమాజం పట్ల బాధ్యత, నిబద్ధత ఉన్న ఈ 50 ఏళ్ల రచయిత మరో ఏభయి ఏళ్లు, ఇట్లానే కథలు రాస్తూ, మనల్ని బాధ, వ్యధ ఆనందాల మధ్య ఓలలాడిస్తాడని ఆశిద్దాం.

-కూర చిదంబరం.. 8885552423