అక్షర

వేంకటాచల మహత్మ్యం.. ఈ అష్టోత్తరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శత నామావళి
వరివస్యా వ్యాఖ్యా సమేతము
వ్యాఖ్యాన రచయిత:
ఆచార్య కె.వి.రాఘవాచార్య,
పేజీలు: 246, వెల: రూ.216
ప్రతులకు: రచయిత, 106,
శ్రీపాదకేశవ టవర్స్, 11-35,
ఎస్.వి.టవర్స్, తిరుపతి- 517502.
సెల్: 9290086012, 9704342668

కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో యజ్ఞం, ద్వాపరంలో అర్చన అనేవి భగవంతుని చేరేందుకు సాధనాలుగా చెప్పబడ్డాయి. ఐతే, ఈ కలియుగంలో అడుగడుగునా అపవాదులు, అసత్యాలు, కలహాలు ఎక్కువ కావడంవల్ల, భగవంతుని చేరడానికి నామస్మరణే తరుణోపాయంగా మన పెద్దలు ఆనాడే చెప్పారు. మద్భక్తా యత్రగాయన్తి తత్ర తిష్ఠామి నారద అని మహావిష్ణువే ఒక సన్నివేశంలో నారదునితో చెప్పాడు. అందువల్ల భగవంతుడిని తెలుసుకోవడానికి ఆయన నామస్మరణ ఒక్కటి చాలు. కలౌ వేంకట నాయకః అన్నారు. ఈ కలియుగంలో శ్రీ వేంకటేశుడే దైవం కానీ మరొక దైవం లేదు.
కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీ వేంకటేశ్వరస్వామి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం ఎంతో లోక ప్రసిద్ధి. వాటి తరవాత శ్రీ వేంకటేశ్వర సహస్రనామావళి, అష్టోత్తర శతనామావళి కూడా అంతే ప్రసిద్ధి. శ్రీ వేంకటేశ అష్టోత్తర శతనామావళి అనేది వరాహ పురాణంలో 61వ అధ్యాయంలో వర్ణించి ఉంది. దీనిని సూత మహాముని ఇతర మునులకు ఉపదేశించాడు. వీటితో బ్రహ్మదేవుడు స్వామిని సేవించి ధన్యుడైనాడని ప్రతీతి. ఈ అష్టోత్తర శతనామావళి ఆసాంతమూ చతుర్థీ విభక్త్యంతంగా ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఈ నామాలన్నీ వేంకటాచల వైభవాన్నీ, శ్రీ వేంకటేశ్వరుని మహిమనూ, ఆ స్వామిని సేవించి తరించిన భక్తుల అభీష్టాలనూ వివరించి ఉండటంవల్ల ఈ స్తుతి పాఠం వేంకటాచల మహాత్మ్యాన్ని సమగ్రంగా నిరూపిస్తుంది. స్తోత్రాలను శబ్దపూర్వకంగా పఠించేటపుడు వాటి వెనక ఉండే అర్థాన్ని తెలుసుకుని పఠిస్తే మరింత చక్కగా మనస్సుకు హత్తుకుంటుంది. తద్వారా మనస్సుకు ప్రశాంతం మాత్రమే కాదు భగవంతునిపై ఏకాగ్రత కూడా కలుగుతుంది.
శ్రీ వేంకటేశ్వరస్వామి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం మీద సవివరమైన, సరళమైన వ్యాఖ్యానాలెన్నో ఇప్పటికే వచ్చాయి. ఆమధ్య శ్రీనివాస గద్యానికి వివరణ కూడా దేవస్థానంవారి మాస పత్రికలో వచ్చింది. ఐతే, శ్రీ వేంకటేశ అష్టోత్తర శత నామావళిలో ఉండే 108 నామాలను సవివరంగా వ్యాఖ్యానించినట్లు దాఖలాలు లేవు. జిజ్ఞాసులైన స్వామి భక్తులకు అదొక తీరని కొరతగా ఉండింది. ఇన్నాళ్లకు డా.రాఘవాచార్యులు ఆ కొరతను తీర్చారు. వీరు చాలాకాలంగా శ్రీ వేంకటేశ్వర సాహిత్యం మీదే పరిశోధన చేస్తూన్నారు. ఏది చెప్పినా, సరైన రీతిలో, సరైన ఋజువులతో వీలైనంత సమగ్రంగా వివరించడం వారి ప్రత్యేకత.
ప్రతి నామాన్నీ వివరించేటపుడు ఆ నామానికి ఉండే విశిష్టత, పౌరాణికంగా, చారిత్రాత్మకంగా ఉండే విశేషాలను వివిధ పురాణాలనుంచి వివరాలను జోడించి మరీ పొందుపరిచారు. ఉదాహరణకు, 95వ నామమైన ఓం త్రివిక్రమాయ నమః అనే దానికి వేంకటేశుడు త్రివిక్రముడెలా అయ్యాడూ అంటే ఇచ్చిన వివరణ ఎంతో హృద్యంగా ఉంది. భాగవతంలోని వర్ణనను ప్రస్తావించడం గొప్పగా ఉంది.
శ్రీ వేంకటేశ అష్టోత్తర శత నామావళిలో ఒక విచిత్రమైన అంశాన్ని రచయిత ప్రస్తావించారు. అదేమిటంటే శ్రీ వేంకటేశ అష్టోత్తర శత నామావళిలో మొదటి నామం శ్రీ వేంకటేశాయనమః అని ప్రారంభమై, శ్రీశ్రీనివాసాయ నమః 108 నామంతో పరిపూర్ణమవుతుంది. దీనికి రచయిత మొదటి నామం అనేది అనిష్ఠ నివృత్తి అయితే 108వ నామం ఇష్టప్రాప్తిని కలిగిస్తుందని ఇచ్చిన వివరణ ఎంతో అందంగా ఉంది (పే.232). అలాగే వరాహమంటే ఏమిటి? దాని రూపమేమిటి సచిత్ర రూపంలో అందించారు కూడా. ప్రాచీన శ్రీ వేంకటేశ సాహిత్యం ఎక్కువగా తమిళంలో ఉండటంవల్ల, వాటిని పరిష్కరించడంలో పండిత మిత్రులతో చర్చించి, పరిష్కరింపజేయడమేకాక, ఆ విషయాన్ని పుస్తకం చివరలో ప్రస్తావించి, తన వినమ్రతను చాటుకున్నారీ రచయిత.
ఈ ప్రపంచంలో దైవభక్తి, పుస్తక పఠనం మీద ఆసక్తి తగ్గిపోతున్న నేటి తరుణంలో శ్రీ వేంకటేశ అష్టోత్తర శతనామావళి వరివస్యా వ్యాఖ్యా సమేతము ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. అంతేకాదు శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులను ఆనందింపజేస్తుంది. దైవభక్తిపైన, స్తోత్రాలు ఎందుకు చదవాలి, వాటి వెనక అంతరార్థమేమిటి అనే అంశాలపైనా, నేడు జనాలకు సరైన మార్గనిర్దేశనం చేయాలి. అలాటి నిర్దేశనా దిశలో ఈ పుస్తకం ఒక చక్కని ప్రయత్నమనే చెప్పాలి. శ్రీ వేంకటేశ తత్వాన్ని తెలుసుకోగోరే ఆస్తిక పాఠకులకోసం వెంకన్న నామస్మరణ సౌరభాలతో గుభాళించే చక్కని వ్యాఖ్యాన గ్రంథం ఇది. శ్రీ వేంకటేశ తత్వాన్ని ఇంత చక్కగా వ్యాఖ్యానరూపంలో మనకు అందించినందుకు, ముద్రారాక్షసాలు కూడా ఆట్టేలేకుండా ఈ పుస్తకాన్ని మనకు అందించిన డా. కె.వి.రాఘవాచార్యను మనం అభినందించి తీరాలి. ఈ వరివస్యా వ్యాఖ్య ప్రతి శ్రీ వేంకటేశ్వర భక్తుని వద్దా ఉండాల్సిన కరదీపిక.

-వి.వి.వేంకటరమణ