అక్షర

చిన్నపాటి తెలంగాణ దర్శిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ సాంస్కృతిక వైభవం
-ఆచార్య ఎస్వీ రామారావు
వెల: రూ.170 పేజీలు: 252
ప్రతులకు: నవ చేతన పబ్లిషింగ్ హౌస్

*** ** ***

సుసంపన్నమైన తెలంగాణ సాంస్కృతిక చరిత్ర, పూర్వ చారిత్రకుల అవగాహనా రాహిత్యం వల్లనూ, ఇతర ప్రాంతీయుల నిరాదరణ, నిర్లక్ష్యాల కారణంగానూ తెర మరుగున పడిపోయింది. చిరకాల పోరాటం ఫలితంగా సిద్ధించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇంతకాలమూ అజ్ఞాతంగా ఉండిన తెలంగాణ సాహిత్య సాంస్కృతిక విశేషాలు క్రమక్రమంగా తెరపైకి రావడం హర్షదాయకం. సాహిత్య చరిత్రకు సంబంధించిన కొన్ని గ్రంథాలు వెలువడినా, సాంస్కృతిక వైభవాన్ని చాటే రచనలు అరుదుగానే ఉన్నాయి. ఆ కొరతను తీర్చడానికి డా.ఎస్వీరామారావు ఈ పుస్తకాన్ని వెలువరించారు. ఇందులోని మొదటి భాగం ‘పూర్వ యుగంలో తెలంగాణ సంస్కృతి’. ఇందులోని మొదటి అధ్యాయంలో శాతవాహనుల నుండి అసఫ్ జాహిల వరకు తెలంగాణను పరిపాలించిన రాజవంశాల చరిత్రను తెలియజేశారు. వనపర్తి, ఆత్మకూరు, గద్వాల, జటప్రోలు, గోపాల్‌పేట - అలంపురం, లోకాయపల్లి, దోమకొండ, పాపన్నపేట, పాల్వంచ, మునగాల సంస్థానాలు చేసిన సాంస్కృతిక సేవను రెండవ అధ్యాయంలో వివరించారు. ప్రాచీన తెలంగాణ కవుల కావ్యాల్లో ప్రతిబింబితమైన సామాజిక - చారిత్రక అంశాల సంక్షిప్త వివరణ మూడవ అధ్యాయంలో కనిపిస్తుంది. పండితారాధ్య చరిత్ర, క్రీడాభిరామం మొదలైన తెలుగు కావ్యాల్లో చోటు చేసుకున్న పర్యాటక స్థలాల విశేషాల గురించి నాల్గవ అధ్యాయంలో తెలియజేశారు.
ఇక రెండవ భాగం ‘ఆధునిక యుగంలో సాంస్కృతిక పునరుజ్జీవనం’. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో మహోజ్వలమైన చారిత్రాత్మక ఘట్టం ‘గ్రంథాలయోద్యమం’. ప్రజలకు వాక్, పత్రికా స్వాతంత్య్రాలు, రాజకీయ హక్కులు లేని గడ్డుకాలంలో వారి సామాజిక చైతన్యాన్ని ఉద్దీప్తం చేయటంలో గ్రంథాలయోద్యమం ప్రముఖ పాత్ర వహించిందని తెలియజేశారు. లభిస్తున్న సాక్ష్యాల ఆధారంగా 1901-56 మధ్య నెలకొన్న గ్రంథమాలల విశిష్టసేవను వివరించారు. గ్రంథాలయాలు, గ్రంథమాలల స్థాపన సాహిత్య సంస్థల ఏర్పాటుకు ప్రేరణగా నిలిచాయి. ఆంధ్రోద్యమంలో భాగంగా తెలంగాణలోని అన్ని జిల్లాలలో కొనసాగిన ఆంధ్ర మహాసభలు సాహితీ సంస్థల ఆవిర్భావానికి దోహదంగా నిలిచాయి. తెలంగాణలో ఉన్న రకరకాల చారిత్రక నిర్మాణాల విశేషాలను, తెలంగాణ కోటలు - గడీల గురించి వివరించారు. నీటి వసతులు, వైద్యశాలలు, రవాణా సౌకర్యాలు, పౌర రక్షణ మొదలయిన సౌకర్యాల వివరాలను సంక్షిప్తంగా వివరించారు. చివరగా తెలంగాణలో ప్రత్యేకంగా జరుపుకునే హిందూ ముస్లింల పండుగల గురించి తెలియజేయడం విశేషం. మొత్తానికి ఈ పుస్తకాన్ని మినీ ‘తెలంగాణ దర్శిని’లా రూపొందించారు. బృహత్తర ప్రణాళిక కోసం రూపుకట్టుకున్న స్థూల రూపం ఇది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులే కాకుండా తెలంగాణ గురించి, సమాచారం తెలుసుకో దలచిన వారికి ఈ పుస్తకం రెడీ రెఫరెన్స్‌లా పనికివస్తుంది.

-కె.పి.అశోక్‌కుమార్