అక్షర

సత్యాలోకనం... సముదాత్త ధ్యాస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యమంటే ఏమిటి? (తాత్త్విక వ్యాసాల సంపుటి)
-మునిమడుగుల రాజారావు
పుటలు: 112 వెల: రూ.100
ప్రతులకు: ఎం.విజయలక్ష్మి
ఇం.నెం.7-2-83/49/2బి 4, ఇందిరానగర్, నిర్మల్-504 106

మనిషి నిరంతరం ఆలోచనాపరుడు. ఆలోచన అనేది కనులకు కనిపించని ఒక విచిత్రమైన మెకానిజం. ఆ మెకానిజంలో యంత్రమంటూ కనిపించదు కానీ యంత్రంలాగా పని చేస్తుంది ఒక వ్యవస్థ. మరి మెదడు అనేది ఒకటుంది కదా! జీవ విజ్ఞాన శాస్త్రం ప్రకారం అది ఒక అద్భుత యంత్రమే కదా! అనే ప్రశ్న ఒకటి ఉదయిస్తుంది. అయితే మెదడు అనేది ఇంద్రియాలు, నాడులు మొదలైన వాటిని సక్రమంగా నియంత్రిస్తుంది. కానీ ఆలోచన అనేది మెదడు అనే యంత్రం కంటే భిన్నమైనది. ఒక విధంగా ఉన్నతమైన, అధిక ప్రతిఫలదాయకమైన పనిని చేస్తుంది. ఆ ప్రతిఫలం ఏమిటి అంటే సత్యము, ధర్మము, వివేకము, ఆనందము, పరమాత్మ, సాత్త్వికత, నిశ్శబ్దత మొదలైన ఉదాత్త అంశాల గూర్చిన నిశ్చయాలను, సారాంశాలను మెదడుకు, అనుభవానికి, అనుభూతులకు ఇస్తుంది. ఇంత గొప్పదైన ఆలోచన అనే పనిలో తఱచుగా నిమగ్నుడైపోతూ జీవితానికి, అభ్యుదయానికి పనికొచ్చే ఎన్నో విషయాలను సూక్ష్మంలో మోక్షంలా అందించే ఒక మంచి ప్రయత్నం మునిమడుగుల రాజారావు గారి ‘సత్యమంటే ఏమిటి?’ అనే తాత్త్విక వ్యాసాల సంపుటిలో చూస్తాం.
ఇందులో ‘సత్యమంటే ఏమిటి?’ ‘తెలివి జ్ఞాపకం కాదు’ ‘ఎరుక తక్కువ ఆలోచన ఎక్కువ’ ‘సంకల్ప బలముంటే చాలు’ ‘కర్మయోగ’ ‘ఆయుష్షును పెంచే నిద్ర’ ‘అంతిమ గమ్యం’ లాంటి ఆలోచనాత్మక శీర్షికలతో ముప్పై చిన్నచిన్న వ్యాసాలున్నాయి.
‘అంతిమ గమ్యం’ అనే వ్యాసంలో తాత్త్విక అభ్యున్నతి - లేక- ఆధ్యాత్మిక భావనా పురోగతిపై అభిరుచి కలగటానికి, ధ్యాస పెంపొందటానికి రచయిత చెప్పిన ఉపమానాత్మక కథ బాగుంది.
‘ఎన్నో టన్నుల బరువున్న ఒక పెద్ద బెల్లం ముద్ద కొన్ని వేల ముక్కలుగా విడగొట్టబడింది. అప్పుడు అందులోని ఏ ఒక్క ముక్కైనా దాని తీయని గుణాన్ని పోగొట్టుకుంటుందా? లేదే! అయితే కాలగమనంలో దానిపై దుమ్ము పేరుకుపోయి దాని ఉపరితలం మీద ఉన్న రుచి కప్పబడుతుంది. కానీ దాని లోపలి భాగమంతా వ్యాపించి ఉన్న రుచి అలాగే ఉంటుంది. విశ్వాత్మ నుండి విడిపోయిన జీవాత్మ ‘మనసు’ అనే (్ధళి)పొరను కప్పుకొని ఉంది. దాన్ని తీసేస్తే అగుపడేది, అనుభవంలోకి వచ్చేది అది లోనిది’ - ఇలా ఎంతో ఉదాత్తతా సముచితంగా ఉంది రాజారావుగారు అందించిన ఉపమానం. ‘న భూతో న భవిష్యతి’ అనే దానికి మామూలుగా చెప్పుకునే అర్థం ‘నిన్న లేదు. రేపు ఉండదు’ అని. కానీ దానికి ‘నిన్న లేకపోతే రేపు లేదు’ అని మరో అర్థం కూడా ఉంది. నిన్నటి అనుభవంతో రేపటి భవిష్యత్తుకు రూపం ఇవ్వాలంటే ‘ఇవాళ’ పని చేయటం తప్పనిసరి. పనిని ధ్యానంలా భావించి శ్రద్ధ్భాక్తులతో ప్రార్థనలా చేస్తే దొరికేది ఆనందమే’ అని ‘కర్మయోగ’ వ్యాసంలో అంటారు రచయిత. ఒక ప్రసిద్ధ లోకోక్తికి రెండో అర్థం చెప్పటం, దాని ద్వారా ‘పని’ (కర్మ) అనే దాని ప్రాధాన్య, ఆవశ్యకతలను చెప్పటం రచయిత వివరణాత్మక నిపుణత (ళనఔ్యఖశజూజశ ళనఔళూఆజఒళ) కు ఒక ఉధాహరణ.
మహోదాత్త ఫలాలు నిశ్శబ్దంలోంచే వస్తాయి అని సోపపత్తికంగా తెలియజేశారు రచయిత ‘నిశ్శబ్దం - సృజనాత్మకత - ఆనందం’ అనే వ్యాసంలో. నిశ్శబ్దం అంటే ఆలోచనల వలలో చిక్కకుండా ఉండటం అని గంభీరార్థకంగా చెప్పారు. ఒప్పుకోవాల్సిందే.
‘తెలివి జ్ఞాపకం కాదు’ వ్యాసంలో జ్ఞానము - తెలివిలకు ఉన్న నిర్వచన సహితమైన వింగడింపు ఇంపుగా ఉంది.
14, 15వ పుటలలో ఎరుక (జ్ఞానం) - ఆలోచనల యొక్క భేద, ప్రాముఖ్య, ఆవశ్యకతల గురించి మంచి ఎఱిగింపు ఉంది. ‘సంకల్ప బలం ఉంటే చాలు’ అనే వ్యాసంలోని చక్కని సందేశాత్మక కథ ఉత్కంఠభరితంగా సాగిపోయింది. ‘ఆయుష్షును పెంచే నిద్ర’ వ్యాసం చదివితే నిద్ర యొక్క ప్రబల ఆవశ్యకత ఏమిటో అర్థమయి, అనవసర ఆలోచనలు మాని, ఆరోగ్యదాయకమైన, కలలు, కలతలు లేని నిద్రా సౌఖ్య, సత్ఫలితాలను అనుభవిస్తాం అని తెలుస్తుంది.
సంఘంలో ఐడెంటిటీ కోసం ఆరాటపడే ప్రతి మనిషి ‘ఇతరులను తనకి సమాంతరంగా రాకుండా, లేదా తనకన్నా పైకి వెళ్లకుండా, ఒక ప్రణాళిక అల్లుకొని దానిని అమలుపరుస్తుంటాడు’ అనటం (57వ పేజీలో ఒక సందర్భోచిత వాక్యం)లో ప్రణాళిక అనే పద ప్రయోగం లలిత హాస్య స్ఫోరకం.
ఉన్న ముప్పై వ్యాసాలలో మూడవ వంతు వ్యాసాలకు వాక్యరూపంలోని శీర్షికలకన్న క్లుప్తత (బ్రివిటీ)తో కూడి ఒకటి రెండు పదాల శీర్షికలయితే ముచ్చటగా ఉండేది; భావ గాంభీర్యంతో అలరారేవి.
14వ పుటలో ‘మానసిక గోడలు’ పదం వికృతంగా ఉంది. మనః కుడ్యాలు, తలపుల గోడలు, మానసికపు గోడలు, ఆటంకాలు - ఇలా మరేదైనా సాధు రూపమో భావసామ్య రూపమో ఎన్నుకుంటే బాగుండేది.
మొత్తం మీద ఇది ఉత్తమ జిజ్ఞాసకు ఊపిరులూదే పుస్తకం. ముందు మాటలో డా.అప్పాల చక్రధారి గారన్నట్టు ‘సత్యానికి, మనిషికి అనుసంధాన కర్తగా రాజారావు యొక్క కృషి’ ఇది.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం