అక్షర

అబ్బురపరచిన అంతర్మథనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్మథనం
-రావినూతల శ్రీరాములు
సెల్ నెం: 8885653924
వెల:రూ.75/-లు
ప్రచురణ ఎమెస్కో బుక్స్‌ప్రై.లి.

** ** *****

సాగరమథనం వంటిదే అంతర్మథనం అని శ్యాంచరణ్ బాబా గారన్నట్లు సాగరాన్ని మథిస్తే అమృతం పుట్టినట్లే మనసును మర్ధిస్తే మానవత్వం పరిమళిస్తుందని ఈ‘‘అంతర్మథనం’’ చదివిన పాఠకులకు అనిపిస్తుంది.
గతాన్ని ఎందుకు తవ్వుకుంటారు అంటే గతం ఒక పాఠంగా వర్తమానానికి పనికివస్తుంది. ఆ గతపాఠమే జీవితనౌకను ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగడానికి తెడ్డుగా ఉపయోగపడుతుంది.
రావినూతల శ్రీరాములు ఒక చక్కని విలేఖరిగా తన జీవిత పథాన్ని ఎన్నుకొన్నారు. బహుశా ఆ విలేఖరి అన్న పదమే ఆ ఉద్యోగమే ఆయన్ను ఎంతోమంది గొప్పవాళ్లకు దగ్గర చేసింది. అందులోను ఆయనలోని స్నేహశీలత్వం గొప్పవారి జీవిత విశేషాలను మరింత లోతుగా చూడడానికి దివిటీగా పనికి వచ్చి ఉంటుంది.
రావినూతల తండ్రిగారిలో ఉదారగుణం సహజంగా ఉన్నప్పటికీ కూడా మానవ నైజంతో ఒకసారి ఓ భిక్షార్థిని ఒత్తిచేతులతో తరిమేశాడు. కాని ఆ భిక్షకుడే తిరుపతి వేంకటేశ్వరుడుగా కనిపించి ఆయనలో కనుమరుగవుతున్న కారుణ్యాన్ని తట్టి లేపాడు. ఇక ఆ సంఘటన తరువాత వారి తండ్రి ఎన్నో సంస్కరణలు చేపట్టారు. ఆయన నివాసమున్న ఊరిలో ఎవరూ కూడా పస్తులుండకూడదని అనుకోవడం ఒకవేళ అలాంటి అవస్థలో ఎవరైనా ఉంటే వారికి తిండిగింజలు పంపడం చేసేవారు అంటే ఈ సంఘటన చదివిన వారిలోఎవరికైనా భిక్షకులు ఎవరైనా తారసపడితే రావినూతల సత్యనారాయణ గారు గుర్తుకురాకమానరు కదా.
అందుకే తన జీవితంలో ఎన్నో సంఘటనలు, మరెన్నో విశేషాలను చూసిన రావినూతల తనకు ఏవిధంగా గతం వర్తమానానికి బలవర్థకమైన పానీయంగా పనికి వచ్చిందో ఇతరులకు కూడా ఆ విధంగా తన జీవితపాఠం పనికిరావాలన్న ఉద్దేశంతో ఈ అంతర్మథన ఫలం అందరికీ అక్షరరూపంలో అందిస్తున్నారేమో అన్న ఉద్దేశం పాఠకుని కలిగేట్లుగా రచన చేశారు.
స్పర్థ ఎవరినైనా విజయపథగాముల్ని చేస్తుంది. అందుకే పోటీ తత్వం ఉండాలని అంటారు. ఉక్రోషం కూడా ఒక్కోసారి మంచిదే. ఎవరైనా గొప్పలుపోతే అవి చూసిన వారికి తమకన్నా వారు ఎందులో గొప్ప అని ఆలోచన చేస్తారు. అది ఎదుటివారి నిజమైన గొప్ప అయ్యి ఉంటే తప్పక తాముకూడా అంత గొప్పవారిమికావాలని శ్రమకు సంకల్పించుకుంటారు. కాని,ఎదుటివారు తమవంటి గొప్పవారో, లేక తమకన్నా తక్కువవారోఅయ్యిఉంటే అదేంటి వాళ్లు నన్ను వెటకారం చేస్తున్నారే అని ఆలోచనలో పడతారు. ఇది చాలా సహజమైన చర్యనే. ఇట్లాంటిదే పుటపర్తినారాయణాచార్యుల జీవితంలో జరిగిందట. కంచిపరమాచార్యులు తమను సత్కారం చేయలేదే అన్న బాధతో ఉండిపోలేదాయన. సరాసరి స్వామి వారి దగ్గరకు వెళ్లి నన్ను సన్మానానికి పిలవకపోవడానికి కారణమేమిటి అని అడిగారట. ఇలా అడగడానికి వారిపై వారికున్న నమ్మకం. వారికి వారి పాండిత్యం పట్ల ఉన్న నిశితదృష్టి ... ఆ తరువాత స్వామివారికి వారికి ప్రత్యేక సన్మానం జరిపి అందరికీ 116 రూపాయలు ఇస్తే పుట్టపర్తివారికి 700 రూపాయలు ఇచ్చారన్న సంగతి వేరు. కాని ఇలా ధైర్యంగా ఉండాలన్న విషయం, తాము చేసే రచనల పట్ల ఉన్ననిబద్ధత ఇవన్నీ పుట్టపర్తినారాయణాచార్యుగారి నుంచి నేటి యువత నేర్చుకోవలసిన ఘట్టాలే.
జాతీయ పతాకం-గీతం, త్యాగధనుల నినాదాలు, స్వాతంత్య్ర సమరం లాంటి దేశభక్తి రచనలు, ప్రజల మనిషి ప్రకాశం, కల్లూరి సుబ్బారావు, అంబేద్కరు లాంటి వారి సుమారు 35 మంది జీవిత చరిత్రలు, అచల రమణులు, బ్రహ్మర్షి దైవరాత, దక్షిణాది భక్త పారిజాతాలు లాంటి భక్తి సాహిత్య పుస్తకాలు, బాపూజీ రామమంత్రం వంటి అనువాదాలు ఇవేకాక ఇంగ్లీషు భాషలో పుస్తకాలు రచించారు రావినూతల శ్రీరాములు గారు. ఇవే కాక ఎన్నో సంచికలకు సంపాదకత్వం వహించిన విశేష ప్రజ్ఞులు వీరు. వీరిని జాతీయ అవార్డు, కీర్తిపురస్కారం, ఉగాది పురస్కారం, ప్రతిభాపురస్కారం లాంటి ఎన్నో పురస్కారాలు వీరిని ప్రతిభాపాటవాలను చాటి చెప్తాయి.
ఇంతటి ప్రజ్ఞా విశేషులైన వీరు పాఠకుని హృదయరంజకంగా రచన చేసే నేర్పు వీరికి సహజంగా అబ్బి ఉండడం మూలాన సరళమైన భాష, ఆసక్తికరమైన సంఘటనలతో చదువరులందరినీ ఏకబిగిన చదివించే నైపుణ్యతతో సాగిన ఈ ‘అంతర్మథనం’ ఆసక్తిదాయకంగా ఉంటుంది.

-రాయసం లక్ష్మి