అక్షర

సందేహాలు తీర్చే సైన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైన్స్ పద్ధతి- కొన్ని సిద్ధాంతాలు
రచయిత- డా.కె.బి.గోపాలం
ప్రతులకు-
1. మంచి పుస్తకం, తార్నాక, సికింద్రాబాద్
ఫోన్- 9490746614
2. విజ్ఞాన ప్రచురణలు, నెల్లూరు
ఫోన్- 9440503061

అసలే ‘పాఠకులు లేర’నీ, ‘కొనేవాళ్లులేర’నీ- ఇలా ఎన్నోరకాల వ్యాఖ్యానాలు మన చెవిన పడుతున్నాయి. ఐతే, అడపాదడపా అయినా తెలుగులో కొన్ని విజ్ఞానశాస్త్ర సంబంధమైన పుస్తకాలు వస్తూ ఉన్నాయి. నిజం చెప్పాలంటే, తెలుగులో విజ్ఞానశాస్త్ర సంబంధమైన పుస్తకాలు చాలా తక్కువ. ఆ కొరత తీర్చడానికా అన్నట్టు, నాలుగు చిన్నచిన్న సైన్సు పుస్తకాలు మంచి పుస్తకం ద్వారా వెలువడ్డాయి. వీటిలో మొదటిది ‘‘సైన్స్ పద్ధతి- కొన్ని సిద్ధాంతాలు’’ అనేది. ఇది బహుశ సైన్స్ టీచర్లను దృష్టిలో పెట్టుకుని రాశారులా ఉంది. మిగిలిన మూడు పుస్తకాలు వరసగా భౌతిక, రసాయన, జీవశాస్త్రాలకు సంబంధించి తరచూ కలిగే సందేహాల నివృత్తిచేయడంకోసం రాసినవని చెప్పాలి.
‘‘సైన్స్ పద్ధతి-కొన్ని సిద్ధాంతాలు’’ అనేది 40 పేజీల పుస్తకం. ఇందులో సైన్స్ అంటే ఏమిటి, ఎలా అలవడింది, పరిశోధన, సిద్ధాంతాలంటే ఏమిటి, సైన్స్ అనేదెవరైనా చెబుతున్నారా అసలు?-అంటూ 13 వివిధ అంశాల గురించి వివరించారు రచయిత. అలాగే పరిణామ సిద్ధాంతం, ఖండ చలన సిద్ధాంతం వంటి వాటి గూర్చి కూడా క్లుప్తంగా చెప్పారు.
‘‘ఏమిటి, ఎందుకు, ఎలా అని ప్రశ్నించడమే సైన్స్. అందరూ అంగీకరించిన విషయమే వైజ్ఞానిక సత్యం. ఐతే అదే శాశ్వతం కాదు. నిరంతరం పరిశోధనలు సాగుతూనే ఉంటాయి. ఎవరన్నా అది నిజంకాదని నిరూపిస్తే దానికి మనం తలవంచాల్సిందే!’’ అంటారు రచయిత.
భౌతిక శాస్త్రంలో అందరికీ తరచూ కలిగే సందేహాలను నివృత్తిచేసే దిశలో ‘‘పక్షులు ఎలా ఎగురుతాయి?’’ అనే శీర్షికతో 70 పేజీల పుస్తకం రెండోది. ఇందులో ‘‘ఫ్రిజ్‌ను వాడి గదిని ఎందుకు చల్లబర్చలేం, రంగులరాట్నంలో తిరిగేవారు ఎందుకు పడిపోరు, ఓడ నీటిపై ఎలా తేలుతుంది?’’- వంటి సందేహాలను నివృత్తిచేసే అంశాలున్నాయి. ఇది 72 పేజీల పుస్తకం.
జీవశాస్త్రంలో అందరికీ తరచూ కలిగే సందేహాలను నివృత్తిచేసే దిశలో ‘‘పువ్వులకు రంగులు ఎందుకు?’’ అనే శీర్షికతో 70 పేజీల పుస్తకం మూడోది. ఇందులో చాలా ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని చెప్పవచ్చు. ‘‘చెట్లు పచ్చగా ఎందుకుంటాయి, పువ్వులకు రంగులెందుకు’’, అలాగే ‘‘వెంట్రుకల రంగునుంచి, రుచుల దాకా’’- వివిధ అంశాలలో జీవశాస్త్రం గురించి అర్థంచేసుకునే ప్రయత్నంలో ఉపయుక్తమైన 78 పేజీల చిన్న పుస్తకం ఇది.
రసాయన శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలను ఛేదించే రీతిలో నాలుగో పుస్తకాన్ని రాశారు. దీని పేరు ‘‘మిణుగురులలో వెలుగు ఎలా వస్తుంది?’’. ఈ పుస్తకంలో ‘‘పొడిమంచెందుకు కరగదు, మిణుగురులలో వెలుగు ఎలా వస్తుంది, మట్టి నేలకన్నా, టైల్స్ పరిచిన చోట చల్లగా ఎందుకుంటుంది, సబ్బులు, డిటర్జెంట్లూ ఎలా పనిచేస్తాయి’’-అంటూ జీవశాస్త్రం గురించి అర్థంచేసుకునే ప్రయత్నంలో అనేక అంశాలతో కూడిన ఉపయుక్తమైన 63 పేజీల చిన్న పుస్తకం ఇది.
అందరికీ ఆసక్తికరంగా ఉండేలా చెప్పడం మాత్రమేకాదు, పాఠకుల నాడి ఏమిటో రచయితకు తెలుసు. ఇది సైన్సుకాదు. అశాస్ర్తియం అని చెప్పేటపుడు అసలు సైన్సంటే ఏమిటో తెలియాలికదా. అందుకే సూటిగా, సుత్తిలేకుండా, చాలా పొందికగా 4 పుస్తకాలను రాశారు. బడి పిల్లలకు బహుమతిగా ఇవ్వడానికి బాగా పనికివస్తాయి. వీటి వెల తక్కువే. ఈ పుస్తకాలను మరింత ఆకర్షణీయంగా ముద్రించి ఉండవచ్చేమోననిపిస్తున్నది. ఎందుకంటే, పిల్లలకు ఇలాంటి పుస్తకాలను రంగుల్లో, ఆకర్షణీయంగా అందించాలి. అంతేకాదు. అనవసరంగా ఎక్కువ ఇంగ్లీషు పదాలను వాడారేమోనని కూడా అనిపిస్తూన్నది. ఏదేమైనా, ఇది మంచి పుస్తకం సంస్థ చేస్తున్న చక్కని ప్రయత్నం.

-అనుపమ