అక్షరాలోచన

ఏదీ సంక్రాంతి హేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హేమంత ఋతుశోభ ఏమంత రుచిలేని
సీమంతినిని బోలి చేరవచ్చె
హేతువేమని చూడ జాతర్తు నియమాలు
క్రమముగా సాగుట కననివయ్యె!
ఒకరోజు చలిగాలి ఒకరోజు నడివేడి
చలిలోను ఉక్కపోతల తలంపు
ఉడికించెనని ఫంక నూపిన చలిగిలి
పంకాల నాప రాపాడు దోమ!
వాయు కాలుష్యమొకటె, శబ్దాల ఘోష
వలన కలుషిత మొకటి, మేతలు కలుషిత
ములె జలములును కలుషితములె, మనుజుని
మనసె కలుషితమయ్యె, ఈ మాయకనరె!
ముగ్గులు వేయుట ముగ్ధలు మరచిరి
ఆకాశ హర్మ్యాలు ప్రాకుకతన,
గొబ్బెమ్మలన నేవొ గొప్ప బొమ్మలటంచు
అంగడులకేగి రతివలెల్ల,
పరమార్థమును వీడి బహుమతి కోసమై
మైదానముల వేయ మరులుగొనిరి
గంగిరెద్దుల వాడు కనిపించుటే పోయె
దాసరి పాటల తళుకులణగె,
ఏమి సంక్రాంతి పండుగో ఏమొ గాని
భోగిమంటలు రొట్టెల భోగమెల్ల
తియ్యగుమ్మడి కూరల తీపులన్ని
వర్తమానమ్మునంద సంభవము చూడ!
కట్నాల కమతాల కాన్కల మతలబు
అల్లుళ్ల సందళ్ల నణచివేసి,
ధర శరాఘాత వ్యథలతోడ యజమాని
ఇంట సరకు నింపకుంటుచుండె,
వానలు సరిరాక వచ్చెనా అతివృష్టి
పంటరాలు బదికి మంటబెట్టె,
కొత్త ధాన్యమ్ముతో కొత్త అల్లుళ్లతో
ఇలు కళకళలాడు ఇంపు సమసి,
ఏదొ మ్రొక్కుబడిగ ఇదిగొ పండుగయన్చు
జరిపినారటన్న జరిపిరనుచు
రమణ తరిగె సంకురాత్రి వనె్నలయందు
నిజము నేటి పర్వనీతి యింతె!
తెలవారుచుండగా తెరగప్పు పొగమంచు - రోగాల పొగవోలె రుచుల తప్పె
మనసు కాహ్లాదవౌ మాలదాసరి చేతి - చిరుతల పాటల కరవుగప్పె
గంగిరెద్దులవాని గడి మీరు మాటల - జలపాత వేగమ్ము జారిపోయె
పంట పండని రైతు ఫలితమబ్బని రైతు - మొగముల దైన్యమ్ము మూగియుండె,
వీధివీధుల పల్లెల వీడులందు - అంతటను చూడ కృత్రిమ హాసవదన
రేఖలె కనిపించు విచిత్ర రీతి తోచె - ఏమి సంక్రాంతి? నిజమె! నీకింపు గలదె!
అన్నిట తెలుగన్చు ఆంగ్లమ్ము ముద్దిడు
చేష్టల ప్రభుత ‘విశేష’మయ్యె!
‘మా తెల్గు మా తెల్గు మామా!’ అటంచునే
తెల్గు తమ్ముల వీడు తెలివి మీరె,
సభలంచు పెక్కులే సంబరాలంచును
స్వీయ భ్రాతృజనుల చీదరింపె,
కవులు కళాకారులవుర! ఒక ప్రాంత
ఘనులేనా? లేరి యింకచట నిచట?
చూడ కౌరవ పాండవ చుట్టరికమె
తేటతెల్లమయె ప్రపంచ తెల్గు సభల!
పౌష్యలక్ష్మీ! ముఖాన విప్పారదేలు!
తెల్గుదనపు సంక్రమణ విస్తీర్ణ శోభ!

-జి.సుబ్రహ్మణ్య శాస్ర్తీ