అక్షర

చిన్న కథ... గొప్ప పాఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మ అలిగింది -వాణిశ్రీ
వెల: రూ.150/-
ప్రతులకు: సి.హెచ్.శివప్రసాద్,
స్వగృహ అపార్ట్‌మెంట్, సి.బ్లాక్
ఫ్లాట్ నెం.2, భాగ్యనగర్ కాలనీ
కూకట్‌పల్లి, హైదరాబాద్- 500 072.
**
అమ్మ అలిగింది కథల సంపుటిలో రచయిత నేలవిడిచి సాము చేయలేదు. తన అనుభవాల్నే సి.హెచ్.శివప్రసాద్ (వాణిశ్రీ) కథలుగా మలిచారు. ఇవి ఒక స్నేహితుడు చెప్పిన ముచ్చట్లలాగ ఉంటాయి. అమ్మ అలిగింది కథలో గౌతమ్ వాళ్ల అమ్మ కొడుక్కి చెప్పకుండా ఊరువెళుతుంది. కేబుల్ కనెక్షన్ తీసివేయడంవల్ల అమ్మ అలిగిందని తెలుసుకుంటాడు గౌతమ్. ఇంటర్‌లోకి వచ్చిన పిల్లలు సరిగ్గా చదవడానికే కేబుల్ కనెక్షన్ తీసారని తెలుసుకొన్న సూరమ్మ కోడలిని అపార్థం చేసుకొన్నందుకు పశ్చాత్తాప పడుతుంది. ఇచ్చిన మాటప్రకారం అల్లుడు శ్రీనివాసరావుకు సుందరయ్య స్కూటర్ కొనలేకపోతాడు. ధాన్యం అమ్ముడుపోలేదు. డబ్బు సర్దుబాటు కాలేదంటూ సుందరయ్య సంజాయిషీ ఇచ్చుకుంటాడు. రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోలు ధర కారణంగా మీరు స్కూటర్ కొనిచ్చినా లాభం లేదని అల్లుడనడంతో సంతోషిస్తాడు అల్లుడొచ్చాడు కథలో సుందరయ్య. ఇందులోని కథలన్నీ సీనియర్ సిటిజన్స్‌కు సంబంధించినవి.
ఆషాఢ మాసంలో కొత్తకోడలు, అత్త ఒక్క దగ్గర ఉండకూడదంటారు. అమ్మ యాత్రలకెళ్ళింది కథలో రాంబాబు వాళ్ల అమ్మను యాత్రలకు పంపి ఆషాఢమాసంలో కూడా తన కొత్త పెళ్లాంతో కాలం గడపగలుగుతాడు. శతకోటి సంప్రదాయాలకు అనంతకోటి ఉపాయాలంటే ఇదేనేమో. పీనాసి అతిథి, పెట్టెలో ప్రాణం హాస్యకథలు. పీనాసి అతిథి కథలో సుందరం బాబాయ్‌కి గురునాథ్ భార్య జయ బుద్ధిచెప్పిన విధానాన్ని రచయిత హాస్యభరితంగా చిత్రించారు. ‘చంపదగిన శత్రువు చేత జిక్కెనేని; పొసగి మేలుచేసి పొమ్మనుటయె చాలు’ అనే పద్యాన్ని ఈ కథా సంకలనంలోని శిక్ష అనే కథ గుర్తుచేస్తున్నది. సుబ్బారాయుడు తన తల్లిని హత్యచేసాడని తెలిసున్నప్పటికీ ఆపరేషన్ చేసి అతని ప్రాణాల్ని రక్షిస్తుంది డాక్టర్ గిరిజాదేవి. ‘‘ఆమె తనని రక్షించి జీవితాంతం కుమిలిపోయేలా శిక్షించిందేమో’’అని సుబ్బారాయుడు అనుకొంటాడు.
లంచగొండి ఉద్యోగులకు ‘వింత జబ్బు’అనే కథతో రచయిత చురకలు వేశారు. వల్లభుడు అనే ఉద్యోగి రిటైరైనా ఎంతో చక్కగా ఎప్పటిలాగే ఆఫీసుకెళుతుంటాడు. ఆఫీసులో అతని గురించి ఎవరూ పట్టించుకోరు. దాంతో ఇంటిపట్టునే ఉండిపోతాడు. కొన్నిరోజులు మనవళ్ళను స్కూలుకు తీసుకెళతాడు. బజారుపనులు చేస్తాడు. తరువాత ఆ పనులు కూడా చేయడు. జుట్టు, గడ్డం పెంచేసి పిచ్చివాడిలా తయారవుతాడు. దాంతో అతని కొడుకు చంద్రం అతణ్ని సైక్రాటిస్ట్ దగ్గరకు తీసుకువెళతాడు. వల్లభుడి గురించి అంతా తెలుసుకొన్న సైక్రాటిస్ట్ చంద్రానికి ఒక సలహాఇస్తాడు. నాన్నా సెలూన్‌కెళ్ళి క్రాఫ్ చేయించుకో అంటూ వల్లభుడికి వంద రూపాయలిస్తాడు. వల్లభుడు ముప్ఫై రూపాయలకు క్రాఫ్ చేయించుకొని వస్తాడు. నా సంపాదనంటూ మిగిలిన డెబ్భై రూపాయలను భార్యకిస్తాడు. డబ్బులు తీసుకొనే ఇంటి పనులు చేస్తుంటాడు. మామయ్యగారికి నెలనెలా పెన్షన్ వస్తున్నా ప్రతి పనికీ డబ్బులెందుకు తీసుకుంటున్నారని కోడలడిగితే ఆయన ఉద్యోగం చేసేటప్పుడు లంచం ఇవ్వందే ఏ పనీ చేసేవారుకాదు. రిటైరయ్యాక లంచం ఇచ్చేవారు లేక దిగులుపడిపోయారు. మానసిక వ్యాధి తెచ్చుకున్నారు. డాక్టరు సలహాపై ప్రతి పనికీ మనం డబ్బులివ్వడంతో మామూలు మనిషయ్యారని వల్లభుడి భార్య చెబుతుంది.
రచయిత తాను చూసిన సంఘటనలపై తన అనుభవంలోకి వచ్చిన వాటిపైనే రాశారు. కాని ఎక్కడా కల్పనలకు చోటివ్వలేదు. ఈ పుస్తకంలోని కథలు చిన్నవే అయినప్పటికీ పెద్ద పాఠాల్నే చెబుతున్నాయి.
కొందరికి గుణపాఠాల్ని నేర్పుతున్నాయి. ఇందులోని ఎక్కువ కథలు కుటుంబ సంబంధాల మీదే ఉన్నాయి. ఇందులోని కథలు మధ్యతరగతివారికి చెందినవే. ‘్భరతదేశమంటే బీదవాళ్ళున్న ధనవంతుల దేశం’వంటి వాక్యాలు ఈ కథల్లో కనిపిస్తాయి.

-తెలిదేవర భానుమూర్తి