అక్షర

తొలకరితో చిగురించిన కవితల వనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షర తొలకరి
కవితా సంకలనం
వెల: రూ.70/-
తెలంగాణ సాహితి
హైదరాబాద్ నగర కమిటీ
ఫ్లాట్ నం.21/1, ఎం.హెచ్.్భవన్
ఆర్.టి.సి. కళ్యాణమండపం దగ్గర, అజామాబాద్,
హైదరాబాద్- 500 020
ఫోన్: 9490098660, 9393804472
ప్రజాశక్తి ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్

కవిత్వానికి ఇవి మంచిరోజులు. చైతన్య పూరితమైన కవితలతో కొత్త గళాలకు వేదిక కల్పించడంలో ‘తెలంగాణ సాహితి’ విశేషమైన కృషిచేస్తోంది. దీనిలో భాగంగా శ్రీశ్రీ వర్ధంతిని ఘనంగా నిర్వహించింది. సాహితీ స్రవంతి వారసత్వాన్ని కొనసాగించడానికి ‘మేడే’ కవి సమ్మేళనాన్ని జరిపింది. ‘‘అక్షర తొలకరి’’ పేరుతో ఒక కవితా సంకలనాన్ని వెలువరించింది. ఇందులో 62 మంది కవుల కవితలు చోటుచేసుకున్నాయి. వచనం, పద్యం, గేయ సంప్రదాయాలను పోలిన కవితారచనలు దీనిలో ఉన్నాయి. ఇప్పుడే కొత్తగా కలం పట్టిన యువకవి నుండి, చెయ్యి తిరిగిన పెద్దకవుల దాకా ఇందులో కవితాక్షరాలతో సామూహిక తిరుగుబాటు చేశారు. సమకాలీన సామాజిక అంశాలతోపాటు, ప్రపంచ స్థితిగతులకు అద్దంపట్టే రచనలు ఊపిరిపోసుకున్నాయి. ఈ నేపథ్యంలోంచి తొంగి చూసిన అనుభవాలను కవిత్వీకరించే ప్రయత్నం జరిగింది. వాటి మూలాల లోతులను వాస్తవిక దృష్టితో ఒకసారి తడిమి చూద్దాం.
‘‘అణచి వేస్తున్నమని
మరీ అంతగా సంబరపడిపోకండి
సత్తువ కోల్పోయిన
మా కార్మికుల దేహాలన్నీ
కొత్త నెత్తురు పులుముకుని
లేలేత విప్లవానికి ఎరువుగా మారుతున్నాయి’’అంటారు. ‘‘పారే నెత్తురు హోరులోని పాటను వినరా’’అనే కవితలో కవి వౌనశ్రీ మల్లిక్. ‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి’అన్న నినాదాన్ని ఆదర్శంగా తీసుకొని ‘మేడే’ ప్రాధాన్యతను నొక్కిచెప్పడానికి చేసే అంతర్ముఖ ప్రయత్నమిది. అంతర్జాతీయ కార్మిక శక్తిని ఏకతాటిపై నడిపించడానికి స్ఫూర్తిదాయకమైన చైతన్యానికి ఇది బలాన్ని చేకూరుస్తుంది. భవిష్యత్తులో పూరించబోయే శ్రామిక శంఖారావానికి ఇదొక ముందస్తు ప్రమాద సూచిక. ఈ వాక్యాల్లో కొత్తనెత్తురు సమీప విప్లవానికి నాంది పలికి, విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్న తరుణాన్ని కవితాత్మకంగా ఆకాంక్షిస్తాడు వౌనశ్రీ మల్లిక్. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామమే!
ఈ కోవలోనే మేడే కార్మిక స్ఫూర్తిని రగిలించే కవితలు ఈ సంకలనంలో ఇంకా చాలాఉన్నాయి. ‘‘ఇది! స్వేదజలం స్వీకరించండి’’శీర్షికలో పొత్తూరి సుబ్బారావు, ‘‘మే’డే’’ కవితలో పెద్దూరి వెంకటదాసు, చల్లా లీలావతి, ఇంకా... జి.నరేష్, మండల స్వామి, దస్రురమవత్, గుళ్ళపల్లి ఆంజనేయులు, జి.యస్.రామకృష్ణ తదితర కవులు ఈ అంశం ప్రాతిపదికగా చిక్కనైన కవితలల్లారు. ‘‘ఊపిరి సంతకం’’ కవితలో కె.విల్సన్‌రావుగారు రాసిన కవిత శిల్పపరంగా, కవితాత్మకంగా గాఢతతో కూడిన అభివ్యక్తికి దర్పణం పట్టిస్తుంది. ‘‘ఇండియాస్ డాటర్’’ కవితలో ప్రసాదమూర్తిగారి ఆవేదనలోని అంతర్మథనం ఇలా దృశ్యాన్ని మెలిపెడుతుంది.
‘‘నా చర్మంలోని ప్రతి రంధ్రం నుండి
ఇప్పుడు ప్రశ్నలే కురుస్తున్నాయి
చెప్పండి/ నన్ను చంపింది వ్యక్తులా! వ్యవస్థా?’’ అని నిలదీసి ప్రశ్నిస్తున్నప్పుడు కళ్ళముందు మెదిలే ఆలోచనల దృశ్యాలు పుంఖానుపుంఖాలు. బాధల గాథలు వర్ణనాతీతాలు. ‘నిర్భయ’పై వచ్చిన ‘ఇండియాస్ డాటర్’ డాక్యుమెంటరీని నిషేధించిన సందర్భంలో ఈ కవిత చోటుచేసుకుంది. అభివ్యక్తిలోని సూటిదనం, సరళత్వం, సున్నితత్వం గుండెను మెలిపెట్టి గాయపరుస్తాయి. ఇందులోని శూన్యస్తబ్దతను కవిత్వంతో బద్ధలుకొట్టడమే ప్రసాదమూర్తిగారి ఏకైక లక్ష్యంగా కనబడుతుంది.
‘‘మా నీటిలో అగ్గిరాజేద్దామనే?/ ఉద్దానం బుగ్గి ఔతుందంటే/ జనం సముద్రమై ముంచెయ్యరూ?’’ అంటూ అంతర్లీనమైన తిరుగుబాటుతనంతో బతుకు ఎర్రజెండాను ఎగరవేస్తుంది కవయిత్రి దుర్గాప్రసన్న. ఇటీవల సోంపేటలోని సముద్ర తీర ప్రాంతమైన ‘ఉద్ధానం’పై ఉక్కుపాదం మోపిన ప్రభుత్వ సంఘటనను ఉద్యమరూపంలో స్ఫురణకు తెస్తుంది. పర్యావరణ కాలుష్య ముప్పు విద్యుత్ ఫ్యాక్టరీల రూపంలో తలెత్తకుండా జరిపిన ప్రజాపోరాటానికి ఇదొక కుండ గుర్తు. చైతన్యస్ఫూర్తిని కలిగించి కదిలిస్తుంది. ఈ సంపుటిలో కొన్ని కవితల్ని సవరించి జాగ్రత్తలుతీసుకొని ఉంటే, ఇంకా శక్తివంతంగా రూపుదిద్దుకొని ఉండేది. ఇలా భిన్నత్వంలోంచి ఏకత్వంలోకి తొంగిచూసిన ఈ ఉమ్మడి కవితాస్వరాలు కాలం నుదుటి రేఖపై ప్రతిబింబ ముఖ చిత్రాలై ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఈ ప్రయత్నంలో భాగంగా తెలంగాణా సాహితి చేసిన కృషిని అక్షరాక్షరమూ అభినందించాల్సిందే!

-మానాపురం రాజా చంద్రశేఖర్