తెలంగాణ

జోరుగా... హుషారుగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ బుధవారం బంజారా నృత్యం, చిందు-యక్షగానం, ఒగ్గుకథలు, పులివేషాలు, బతుకమ్మ ఆటపాటలతో మార్మోగింది. తెలంగాణ రకరకాల వంటలతో ఘుమఘుమలాడింది. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి అధ్వర్యంలో అలయ్-బలయ్ కార్యక్రమం జోరుగా, హుషారుగా జరిగింది. రాజకీయాలకు అతీతంగా బిజెపి, టిఆర్‌ఎస్, కాంగ్రెస్, టిడిపి నాయకులు హాజరయ్యారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, కవులు, కళాకారులూ పాల్గొన్నారు. సద్దఅప్పలు, కోడి పులుసు, సర్వపిండి, పచ్చిపులుసు, గుడాలు, దబడం వంటి అనేక తెలంగాణ వంటలను ఆహ్వానితులు ఆరగించారు. అతిథులను దత్తాత్రేయ సన్మానించారు. యక్షగానం, ఒగ్గు, బంజారా కళాకారులతో కలిసి కదం కలిపారు.
ఢ ప్రకృతి, వికృతి, సంస్కృతి: వెంకయ్య
తొలుత కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఇతరులకు సహాయం చేయడమే మన సంస్కృతి అని చెప్పారు. సంస్కృతి అంటే ఏమిటీ? అని ఒకరు తనను అడిగారని, అందుకు తాను మన రొట్టే మనం తిన్నప్పుడు ప్రకృతి అవుతుందని, ఇతరులది లాక్కొని తింటే వికృతి అవుతుందని, ఇతరులకు పంచి పెడితే సంస్కృతి అవుతుందని చెప్పానని ఆయన అనగానే సభికులు కరతాళధ్వనులు చేశారు. వివిధ కులాలు, మతాలు, భాషల సమాహరమే మనదేశ గొప్పతనమన్నారు.
ఢ చిన్న జీవితం..: గవర్నర్
రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ మాట్లాడుతూ బాణం వదిలితే ఏలాగైతే వెనక్కి రాదో, అలాగే మనం తప్పుగా మాట్లాడితే వెనక్కి తీసుకోలేమని అన్నారు. కాబట్టి ఈ చిన్న జీవితంలో ఎవరితో శత్రుత్వం లేకుండా తియ్యగా మాట్లాడుతూ, పరులతో ప్రేమతో ఉండాలని ఆయన సూచించారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రసంగిస్తూ దత్తాత్రేయను అభినందించారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఢ భాగ్యనగరం విశ్వనగరంగా..: దత్తాత్రేయ
కేంద్ర మంత్రి దత్తాత్రేయ ప్రసంగిస్తూ భాగ్యనగరం విశ్వనగరంగా భాసిల్లాలని ఆకాంక్షించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
ఢ దసరాలో భాగమే..: స్వామిగౌడ్
తెలంగాణ మండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ ప్రసంగిస్తూ అలయ్-బలయ్ దసరాలో భాగంగా మారిందని అన్నారు. దత్తాత్రేయ అన్ని పార్టీలనూ ఒకే వేదికపైకి తెస్తున్నారని ఆయన చెప్పారు.
ఢ మానవత్వానికి ప్రతీక: ఈటల
తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రసంగిస్తూ దత్తాత్రేయ మానవత్వానికి ప్రతీక అని పొగిడారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ప్రతి ఏడాది అలయ్-బలయ్ నిర్వహిస్తున్నారని చెప్పారు. తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రసంగిస్తూ అలయ్-బలయ్ అంటేనే దత్తాత్రేయ అని అన్నారు.
ఢ జాతీయవాదం కోసం..: మురళీధర్ రావు
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్ రావు ప్రసంగిస్తూ దత్తాత్రేయకు అలయ్-బలయ్ దత్తన్నగా పేరు పడిందని అన్నారు. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల సమయంలో నిర్వహించారని అన్నారు. తెలుగు మాట్లాడేవారికే కాకుండా జాతీయవాదం వచ్చేలా ప్రతి ఏడాది దీనిని నిర్వహించాలని ఆయన కోరారు. టి.బిజెపి అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ప్రసంగిస్తూ వివిధ సిద్ధాంతాలు ఉన్న పార్టీలను ఒకే వేదికపైకి దత్తాత్రేయ తెచ్చారని ప్రశంసించారు.
ఢ రాయలసీమలో చేయండి: విహెచ్
ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి. హనుమంత రావు ప్రసంగిస్తూ తెలంగాణలో కొట్లాడుకున్నా, మళ్లీ ఒక్కటవుతారని అన్నారు. రాయలసీమలో ఆ ఆనవాయితీ లేదని అన్నారు. కాబట్టి వచ్చే ఏడాది రాయలసీమలో అలయ్-బలయ్ నిర్వహించాలని ఆయన సూచించారు.
ఢ సెలవు ఇవ్వాలి: జస్టిస్ సుభాషణ్ రెడ్డి
లోకాయుక్త జస్టిస్ సుభాషణ్ రెడ్డి ప్రసంగిస్తూ సర్వమానవ సామరస్యం కోసం అలయ్-బలయ్ కార్యక్రమాన్ని దత్తాత్రేయ నిర్వహిస్తున్నారని చెప్పారు. దీనికి ప్రభుత్వం సెలవు ఇస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. టిఆర్‌ఎస్ ఎంపి కె. కేశవరావు ప్రసంగిస్తూ అలయ్-బలయ్ అంటే ప్రసంగాలు కాదు ఆలింగనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాలని సూచిస్తూ ముగించారు. టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ ప్రసంగిస్తూ దత్తాత్రేయ నిరంతరం కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని చెప్పారు.
ఢ దేశమంతా నిర్వహించాలి: నారాయణమూర్తి
సినీ నటుడు నారాయణ మూర్తి ప్రసంగిస్తూ అంతకు ముందు విహెచ్ రాయలసీమ గురించి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సీమ వాసుల్లో ఎంతో ఆదరణ, ప్రేమ భావాలు ఉంటాయని అన్నారు. అలయ్-బలయ్ యుపి, బీహార్ తదితర ప్రాంతాల్లో నిర్వహించాలని ఆయన దత్తాత్రేయను కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.
అలయ్-బలయ్ వేదికపై మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యకు దత్తాత్రేయ పాదాభివందనం చేశారు. ఉరీ ఘటనలో మృతి చెందిన వీరజవానులకు సభ శ్రద్ధాంజలి ఘటించింది. వెంకయ్య నాయుడు తన ప్రసంగాన్ని ముగిస్తూ జై తెలంగాణ అని అన్నారు.