AADIVAVRAM - Others

గానయోగి ‘వోలేటి’ ( అమృతవర్షిణి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్ని విప్లవాత్మక మార్పులొచ్చినా, ఆకాశవాణి అంటే అభిమానించేవారున్నారు. మాధ్యమాలన్నింటి కంటే రేడియోకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రజల్లో నిత్యం ఉంటూ ప్రజల కోసమే పనిచేసే సంస్థ రేడియో.
సంగీతం, సాహిత్యం, నాటకం లాంటి కళలపై ఆసక్తిని శ్రోతల్లో కలిగించే ఉత్తమమైన ప్రసార సాధనం. అప్పుడూ, ఇప్పుడూ ఇదే - ఇతర మాధ్యమాల ప్రభావం ఆకాశవాణి మీద ఎప్పుడూ ఉండదు. రేడియో వల్ల గుర్తింపు పొందిన వారు కొందరు. రేడియోకే కీర్తిని తెచ్చినవారు మరి కొందరూ.
అజమాయిషీ చేసే, అధికారుల కంటే, కళాతృష్ణ కలిగిన వారికే ఎప్పుడూ కీర్తి ప్రతిష్టలుంటాయి రేడియోలో. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు కార్యక్రమాలన్నీ ఒకప్పుడు మద్రాసు కేంద్రం నుండే ప్రసారమవుతూ ఉండేవి. తమిళం మాట్లాడే వారి మధ్య తెలుగు కార్యక్రమాలను ప్రసారం చేయటం ఒక విధంగా కత్తిమీద సాములాంటి పని. అయినా అప్పట్లో అంటే 1941 ప్రాంతాల్లో మద్రాసు కేంద్రం నుండి ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమాలన్నీ ప్రజారంజకంగానే ఉండేవి. సంగీత సాహిత్య ప్రధానంగా ప్రసారమయ్యే కార్యక్రమాలలో లబ్ధప్రతిష్టులైన కవులూ, గాయకులూ, విద్వాంసులూ పాల్గొనేవారు. ఆ ప్రాభవానికి కారకులైన వారిలో ఆచంట జానకిరాం, ఎస్.ఎన్.మూర్తి, అయ్యగారి వీరభద్రరావు, డా.బాలాంత్రపు రజనీకాంతరావు గారలు అత్యంత ప్రముఖులు. వీరు అధికార దర్పానికి వశులవ్వకుండా ఆకాశవాణి అభ్యున్నతి కోసం అంకితభావంతో పనిచేసిన వ్యక్తులు. వీరిలో సంగీత ప్రయోక్తగా, కవిగా, గాయకుడిగా, వాగ్గేయకారునిగా, కళాప్రపూర్ణుడైన వ్యక్తి డా.బాలాంత్రపు రజనీకాంతరావు ముఖ్యుడు.
ఆయన దగ్గరున్న విద్యలన్నింటినీ, సావకాశం కల్గిన ‘ఆకాశవాణి’ కార్యక్రమాల నిర్వహణకే వినియోగించి ధన్యుడైన పుంభావ సరస్వతి. అప్పటికీ, ఇప్పటికీ, ఇటువంటి ప్రతిభామూర్తిని మరొకర్ని చూడలేం - మూడు పుష్కరాల కాలం ఆకాశవాణిలో. వివిధ వినూత్న కార్యక్రమాల రూపశిల్పి మన మధ్య ఉండటం ఆంధ్రుల అదృష్టం. ఆకాశవాణి సుకృతం.
ఎన్నో దశాబ్దాలుగా ఇప్పటికీ, అవిచ్ఛిన్నంగా విజయవాడ ఆకాశవాణిలో నిత్యమూ ప్రసారమవుతున్న అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసినది రజనీయే. ఎప్పుడో ఆయన వేసిన పునాదులే స్థిరంగా రేడియో స్థానాన్ని సుస్థిరం చేశాయంటే ఆశ్చర్యం లేదు. రజనీ లాంటి మేధావితో పనిచేస్తూ, సుస్వరంతో శుద్ధమైన మనసుతో, అసాధారణ మనోధర్మంతో కర్ణాటక సంగీత రంగంలో తనకంటూ ఒక కొత్త బాణీని సృష్టించుకున్న మహావిద్వాంసుడు వోలేటి. జనం మెచ్చేలా పాడాలని గానీ, కచేరీలు చేస్తూ బాగా డబ్బు సంపాదించాలనే యావ, కీర్తి కండూతీ లేని అరుదైన వ్యక్తి వోలేటి. ఆపాత మధురమైన వోలేటి గానం తెలుగు వారికంటే, రాష్ట్రేతర ప్రాంతాల్లోని తమిళనాడు, కేరళ, కర్ణాటకలోని సంగీత రసికులు ఎక్కువగా విన్నారంటే ఆశ్చర్యంలేదు. ఆయన విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో ప్రొడ్యూసర్‌గా ఉన్న కాలమంతా స్వర్ణయుగమే.
సంగీతం కోసమే సంగీతం పాడుకుంటూ ఆనందించిన విద్వాంసుడు. అప్పట్లో విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండి ప్రసారమయ్యే వాటిల్లో భక్తిరంజని కార్యక్రమం, రాష్ట్రేతర ప్రాంతాల శ్రోతలనూ ఆనందపరిచేది. ఆ తర్వాత అత్యంత ప్రాచుర్యం పొందిన కార్యక్రమం ఆయన నిర్వహించిన ‘సంగీత శిక్షణ’.
ఓసారి రేడియో సంగీత సమ్మేళనం సందర్భంగా ఆయనతో కేరళ వెళ్లటం జరిగింది. మేమున్న బసకు సూటూ బూటూ వేసుకున్న ఓ వ్యక్తి వచ్చి నమస్కరించి వోలేటిగారితో మాట్లాడుతూ ‘ఈ వారం మీరు చెప్పిన కృతి చాలా బాగుందని అభినందించి’ వెళ్లిపోయాడు. ఆయన వోలేటి అభిమాని. విజయవాడ కేంద్రం నుండి ప్రసారమయ్యే సంగీత శిక్షణలోని కృతులు, సదరు వ్యక్తి ఆధ్వర్యంలో నడిచే ఓ సంగీత గురుకులంలోని విద్యార్థులకు క్యాసెట్ల రికార్డింగ్ ద్వారా నేర్పిస్తున్న సంగతి తెలిసి ఆశ్చర్యపోయాను. తెలుగు రేడియో కేంద్రాల నుండి వచ్చే తెలుగు కార్యక్రమాలు తెలుగు సీమలోని శ్రోతల కంటే ఇతర ప్రాంతాల శ్రోతలే ఎక్కువగా వినేవారనటానికి ఇదో నిదర్శనం. వోలేటి గారి ప్రక్కన శిష్యుడుగా కూర్చుని ‘ఈ సంగీత శిక్షణ’ దావరా, నవగ్రహ, నవావరణ, నవరాత్రి కృతులూ మూర్తిత్రయం వారి కీర్తనలు నేర్చుకున్న అదృష్టవంతుణ్ని. కాళహస్తి సంస్థానంలోని మునిపల్లె సుబ్రహ్మకవి విరచిత ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు, జొన్నలగడ్డ శివశంకర శాస్ర్తీ పాడగా విని, వాటికి నొటేషన్ తయారుచేసి, ప్రసిద్ధ విద్వాంసుల చేత పాడించి రికార్డు చేశారు. ఈ కీర్తనలు విజయవాడ కేంద్రంలో ప్రక్షిప్తంగా ఉన్నాయి. ఎప్పుడైనా, పొరపాటున ప్రసారం చేస్తే వినే అదృష్టం శ్రోతలకు కలుగుతుందేమో.
సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు సెమ్మంగుడి, నాట్యశాస్త్ర కోవిదులు చింతా కృష్ణమూర్తి గార్ల వంటి విద్వాంసులతో ఎన్నో యక్షగానాలకు రూపకల్పన చేసి ఆకాశవాణికే కీర్తిని తెచ్చిన వ్యక్తి వోలేటి.
శశిరేఖా పరిణయం, రామ నాటకం, ఉషా పరిణయం, రుక్మాంగద చరిత్రం, మార్కండేయ, ప్రహ్లాద, హరిశ్చంద్ర లాంటి యక్షగానాలు దీనికి ఉదాహరణ.
మద్రాసు కేంద్రంలో తెలుగు శాఖలో నాటక శాఖను కీ.శే.యండమూరి సత్యనారాయణ (శ్రీవాత్సవ) నిర్వహించేవారు. ఆయన గొప్ప రచయిత. షహరజాద్ - అరేబియన్ నైట్స్ - వేయిన్నొక్క రాత్రుల కథలు, లైలామజ్ను, షిరీజ్ ఫర్‌హద్ లాంటి ఇతివృత్తాలతో నాటకాలు రాసేవారు. వాటిలో పాటలూ, సంగీత రచనా రజనీయే.
మధ్యప్రాచ్యం, పంజాబీ, ఉర్దూ గజల్ బాణీలు వోలేటి, ఘంటసాల వేంకటేశ్వరరావు పాడేవారు.
1956-60 ల మధ్య, విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో సాహిత్య కార్యక్రమ ప్రయోక్త పింగళి లక్ష్మీకాంతరావు, నాటక రంగస్థల సూత్రధారుడు బందా కనకలింగేశ్వర్రావు గారూ, వోలేటిగారూ, కూచిపూడి యక్షగాన ప్రదర్శనల ఆదర్శ పరిణామాలకు కారకులు.
భామా కలాపం, గొల్లకలాపం, సీతా వనవాసం మొదలైన వాటిని కూచిపూడి వారు ప్రదర్శిస్తూ ఉండే యక్షగాన రచనలను ఒక్కొక్కదానినీ తీసుకుని, ఆయా నాటకాలలో, ఆయా పాత్రల వేషధారణలో ప్రామాణికతను ఏర్పరుస్తూ, (బందా గారు చేసినట్లు) ఆయా నాటకాల దరువులతో వచ్చే రాగాలను, దరువులలోని సంగీతాన్ని స్వర యుక్తంగా నిర్ణయిస్తూ వోలేటి గారు పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టారు.
అదొక బృహత్తర కార్యక్రమం.
‘గంగా గౌరీ విలాసం’ అనే తెలుగు యక్షగానం, పిఠాపురంలో త్యాగరాజస్వామికి సమకాలికుడైన మద్దిరాల వేంకటరాయకవి రచించిన ‘ఏకాంత సేవా విలాసం’ అనే కుక్కుటేశ్వర రాజరాజేశ్వరీ దేవుల భక్తుడు రచించిన యక్షగానాన్ని విజయవాడ కేంద్రం నుండి ప్రసారం చేయిస్తూ, దేశంలో అన్ని రేడియో కేంద్రాలూ రిలే చేసే జాతీయ సంగీత కార్యక్రమంగా ప్రసారం చేశారు వోలేటి.
సంగీత కళానిధి పద్మభూషణ్ డా.శ్రీపాద పినాకపాణిగారు రెండు తరాల విద్వాంసులకు నడుమ సేతువు లాంటివారు. ముందు తరంలోని ఉత్తమ విద్వాంసుల ఉత్తమ సంగీత రీతులను అన్నిటినీ గ్రహించి, తన తరువాత తరానికి చెందిన ఉత్తమ విద్వాంసులను తయారుచేశారు. ఆయన విద్వాంసులకు విద్వాంసుడు. రాగం, కృతి, నెరవు పాడటంలో దిట్ట. డా.పినాకపాణి ఈ స్వభావాన్ని బాగా సొంతం చేసుకున్న పాణిగారి శిష్యులలో వోలేటి అగ్రగణ్యుడు.
రాగాలాపనలో, నెరవల్, స్వరకల్పనల్లో అప్పటికప్పుడు ఎవ్వరూ ఎదురుచూడని దారులు తొక్కుతూ, శ్రోతల్ని తనతో కూడా ఊహించరాని కల్పనా లోకాలకు లాక్కొని పోవడం వోలేటి గారికి భగవంతుడిచ్చిన వరం. ‘వోలేటి వంటి మహా ప్రతిభావంతుడు, భూత, భవిష్యద్వర్తమాన కాలాల్లో ‘ఆంధ్రమాత ప్రసవించే గాయక సంతానంలో అతని వంటి వాడు తిరిగి పుట్టడం, సంభవమా! అనిపిస్తుంది నాకు’ అంటారు డా.బాలాంత్రపు రజనీకాంతరావు.
‘ఎంతటి క్లిష్టమైన సంపుటియైనా అది ఏ దేశం సంగీతమైనా, ఏ ప్రాంతపు బాణీ అయినా, స్వరపరిచేసి స్వాధీనపరచుకుని దానిలోకి ప్రాణాన్ని పోసి, సొంతం చేసుకుని తన ప్రయోగంలో చూపిస్తాడు వోలేటి’ అన్నారు పాణిగారు.
పాడిన పాట పాడినట్లే, అనుస్వర సహితంగా నిర్దిష్టమైన కాల ప్రమాణంతో స్వరపరచి వ్రాయటం, అలా రాసిన దాన్ని రాగభావంతో అన్వయించుకుంటూ పాడగలగటం, తగినంత కృషి చేసిన వారికే సాధ్యవౌతుంది. అలా పాడగలిగిన వారిలో వోలేటిగారు అగ్రగణ్యులు. ఈ అలవాటు ఆయనకు పినాకపాణిగారి వల్ల అబ్బింది.
దక్షిణ భారతానికి వోలేటి, చిన్న బడేగులాం అలీఖాన్ అంటారు. హిందూస్థానీ రాగాలాపన పద్ధతిలో వున్న స్వర నుడికారాన్ని, కర్ణాటక రాగాలు పాడుతున్నప్పుడు చొప్పించటం, ఆయనకు వెన్నతో పెట్టిన విద్య లాంటిది.
బొంబాయి ప్రాంతాలకు వెళ్లి హిందూస్థానీ శాస్ర్తియ సంగీతం నేర్చుకుని తిరిగి వచ్చిన యువకులు కాకినాడలో ఉండేవారు. వారి పాట, గ్రామఫోన్ రికార్డులలో రోషనారా, కరీంఖాన్, బడే గులామలీఖాన్ వంటి వారి గానాన్ని వింటూ అలవోకగా ఆ శైలిని బాగా వొంటబట్టించుకున్నారు. ప్రత్యేకంగా ఏమీ శిక్షణ లేకనే, కేవలం వినికిడి జ్ఞానంతోనే, హిందూస్థానీ సంగీతం పాడే యువ విద్వాంసులను అదరగొట్టే బాణీ, పకడ్ వోలేటి గారికి అవలీలగా అబ్బింది.
వంచన లేకుండా పాడటమే ఆయన ధ్యేయం. ‘పాట నచ్చితే వినండి. లేకపోతే పోనీలెండి’ అనే మానసిక ప్రవృత్తి ఆయనది.
హిందూస్థానీ ఉస్తాదులకు తమ పాట కచేరీలలో కర్ణాటక సంగీతపు బాణీలో ఒక్క పాటైనా పాడే సంప్రదాయం లేదు. కానీ, కర్ణాటక సంగీత కచ్చేరీలలో చివ్వరి భాగంలో హిందూస్థానీ బాణీలో టుమ్రీ, భజన్, గజల్ లేదా గీత్ పాడే సంప్రదాయం స్థిరంగా యింకా ఉంది. హిందూస్థానీ బాణీ పాడగలిగిన గాయకులు, ఆంధ్ర, తమిళ, కర్ణాటక ప్రదేశాల్లో చాలామంది ఉన్నారు.
కానీ వోలేటి వారందరిలోనూ మేటి. ఆయన భజన పాడుతూంటే, ఏ ఖాన్ సాహెబో పాడుతున్నట్లే అనిపిస్తుంది. మరెవ్వరికీ అబ్బలేదు. పరమ శుద్ధమైన శృతి జ్ఞానం. ఇటూ అటూ అసియాడని లయ. గోముఖంలో నుండి గంగా ప్రవాహంలా, నోటి నుండి సంగీతం ధారగా వచ్చేది.
ఆయనదొక స్వంతమైన బాణీ.
నేదునూరి గారిది పిఠాపురమూ, వోలేటి గారిది కాకినాడే అయినా, ప్రారంభ దశలో గురువులూ, గురుకుల పద్ధతులూ వేరయినా ఈ ఇద్దరూ పరిపక్వం అవుతున్న దశలో, గాయక విద్వన్మణైన శ్రీపాద పినాక పాణిగారి ప్రభావానికి పూర్తిగా లోనయ్యారు.
వోలేటి గారి సంగీత శిక్షణ కార్యక్రమం నాకో మరపురాని అనుభవం. బుధ, శుక్రవారాలలో ఉదయం తెలుగు వార్తలవ్వగానే 7.15 ని.లకు ప్రసారమయ్యేది.
అరగంట ముందుగా తంబురా శృతి చేసి సిద్ధంగా ఉంచేవాణ్ని. ఆయన రాగానే తంబురా శృతిలో లీనమై పోయి, ఒక్కసారి నాదాన్ని పూరిస్తూ, శుద్ధ మధ్యమం దాటి ప్రతిమధ్యం, అంతర గాంధారం మీదుగా సాధారణ గాంధారాలు దాటి పంచమం న్యాసం చేసుకుంటూ ఆగేవారు - అదో వింతగా కనిపించే స్వర సంచారాలు. నిర్దిష్టమైన రాగం కోసం కాకుండా, స్వర స్థానాలన్నిటినీ తట్టి పిలుస్తూ, గొంతు సవరించుకుంటూ పది పదిహేను నిమిషాల సేపు ఆలాపన సాగేది. ఆయనతో కూ పాడేవాణ్ని - అలా పాడిన సంచారాలన్నీ హిందూస్థానీ బాణీలోనే ఉండటం విశేషం.
ఆధారషడ్జంలో నిలబడి ఆగగానే, ‘ఎనౌన్సుమెంట్ వచ్చేది, ‘సంగీత శిక్షణ’ వింటారని.
ఏ భైరవి రాగంలోనో, దేవగాంధారిలోనో ఆ కీర్తన ప్రారంభం అయ్యేది.
హిందూస్థానీ బాణీలో సాధన చేస్తూ, గొంతును సిద్ధం చేసుకుని శుద్ధ కర్ణాటక సంగీతంలో కీర్తన పాడటం ఆయనకే చెల్లు.
ఇటువంటి సాధన చేసిన విద్వాంసులు ఎవరూ నాకు తారసపడలేదు. పాకిస్తాన్ గాయకులు మెహదీ హసన్, గులాం అలీ, మధురాణి, రోషనారా బేగం, ఫరీదా కానన్, అమానత్ ఆలీ లాంటి వారి ఘజల్ సంగీతం వినే అలవాటు చేసినది వోలేటిగారే. కాకినాడలో ఆయన సంగీతాభ్యాసం చేసే రోజుల్లో ప్రధాన మేళకర్త రాగాలలో ఆరోహణ, అవరోహణ క్రమంలో అలంకారాలు సాధన చేయించిన ఘనత, ఆయన తొలి గురువు మునుగంటి వెంకట్రావు పంతులుగారిదే. అదే ఆయన సంగీతానికి గట్టి పునాది. పనె్నండు స్వరస్థానాలనూ క్రమంగా ఒక ఊపిరితో సాధకం చేయించేవారు. షడ్జం, రెండు రిషభాలు, రెండు గాంధారాలు, రెడు మధ్యమాలు, పంచమ, రెండు దైవత నిషాదాలూ, ఆరోహణ అవరోహణ క్రమంలో తడుముకోకుండా వేగంగా పాడటం అన్నమాట. త్యాగరాజు ఆశువుగా పాడుతూంటే ఆయన శిష్యులు అప్పటికప్పుడు కొటేషన్ వ్రాయగలిగారంటే ఈ రకమైన స్వరాభ్యాసమే కారణం. తన సంగీతం ఎలా వున్నది? అని ఎవరినీ అడిగేవారు కాదు. ఫలానా కచేరీలో తాను బాగా పాడానని ఎవ్వరితోనూ చెప్పుకోలేదు. ఇతరులెవరైనా, ఆయన ప్రతిభను ప్రశంసిస్తే, వినీ విననట్లు ఉండేవారు. తోటి విద్వాంసుల సంగీతాన్ని కలలోనైనా విమర్శించి ఎరుగరు.
రెండున్నర దశాబ్దాల వోలేటిగారితో నాకుగల పరిచయం, అపురూపమైన కీర్తనలు నేర్చుకోవటానికి దోహదపడింది. ప్రత్యేకించి శిష్యులను ఎవరినీ తయారుచేయలేదు. రేడియో సంగీత శిక్షణ కార్యక్రమం ద్వారా నేర్చుకునే అదృష్టం నాకు దక్కింది.
వోలేటిగారు పాడిన వందలాది కచేరీలు సి.డిల రూపంలో ఆయన అభిమానులు జాగ్రత్తగా పదిలపరచుకున్నారు. తన స్థాయికి తగిన బిరుదులూ, సన్మానాలూ ఆయన పొందలేదు.
వోలేటి గారితో కలిసి పాడేందుకు ఒకసారి స్టూడియోలో చిన్మయ లహరి అనే బెంగాలీ గాయకుడు కలకత్తా నుండి వచ్చి ‘తిలక్కామోద్’ పాడి వినిపించాడు. ఆ తర్వాత తిలాంగ్ అందుకున్నాడు. రాగప్రధాన్ పద్ధతిలో టుమ్రీ అందుకుని పాడాడు - మరూ బేహాగ్‌తో ముగించాడు.
ఆ తర్వాత వోలేటిగారి వంతు. పహాడీ అందుకున్నారు. అచ్చం ‘బడే గులాం అలీఖాన్’ ‘హరి ఓం’ పాడుతున్నట్లే ఉంది. పదునైన తన కంఠంతో చక్కని అదుగులతో తెల్లని పావురాలను గాలిలోకి విసురుతున్నట్లు పాడుతూంటే ఆ చిన్మయ లహరి విస్తుబోతూ విన్నాడు - లేచి నమస్కరించాడు. వోలేటిగారి పాటలో అంతటి ప్రజ్ఞా ప్రాభవాలున్నాయి. అదేమో! తెలుగుదేశంలో గ్రహించే సంగీత రసికులు లేరు. అందుకే ఆయన పాట వినాలని కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆహ్వానాలు వచ్చేవి.
ఆయన గానం అందర్నీ రంజింపజేసే ఆపాత మధురమే కాదు ఆలోచనామృతం కూడాను. అందుచేతనే మామూలు గాయకులందరూ మనలాంటి వారి కోసం పాడితే, అలాంటి గాయకుల కోసం పాడే విద్వాంసుడు వోలేటి. ఆయన లాంటి గాయకులు మళ్లీ పుడతారా?

-మల్లాది సూరిబాబు 9052765490