అమృత వర్షిణి

కవిగాయక వైతాళికులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి నాలుగు రీతులుగా సమాజంలో బ్రతుకుతూంటాడని శాస్త్రం చెబుతోంది. సహజంగా ఏర్పడే గుణాలు పుట్టుకతోనే వస్తాయి. వాటికి మనిషి కారణం కాదు. మనిషి అలవాటు చేసుకుంటే ఏర్పడే గుణాలు కొన్ని వున్నాయి. ప్రధానంగా దైవభక్తి, దేశభక్తి సహజంగానే పుట్టాలి. ఒకరు చెబితేనే రావు.
జన్మనిచ్చిన తల్లిదండ్రులను పక్కనపెట్టే గుణం సహజంగా వచ్చేది కాదు. బుద్ధిః కర్మానుసారిణే. ‘ఇన్ని తెలిసియుండి రుూ గుణమేలరా’ అన్న విధంగా ఉన్నట్లుండి క్షణాల్లో భావాలు తలక్రిందులైపోతాయి.
కానీ మారకూడనివి మారనివి దైవభక్తితో బాటు దేశభక్తి. ఈ రెండూ మనిషికి తప్పనిసరి. సమాజాన్ని పెద్దఎత్తున మేల్కొలపాలని సంకల్పించిన వెనుకటి తరంలోని పెద్దలు పాటను ఒక ఉద్యమంలా సాగించిన సంగతి మనకు తెలుసు. ‘స్వాతంత్య్రమె నా జన్మహక్కన్న’ తిలక్ మహాశయుడి మాట ఈ జాతి చెవుల్లో పడింది. అదే క్రమంగా నినాదమై మారుమ్రోగింది. ప్రతివాడూ ‘స్వాతంత్య్రం నా జన్మహక్కు’ అనటం ప్రారంభించాడు. గర్జించసాగాడు. ఈ నినాదమే ఈ జాతికి ఊపిరిలూదింది. జాతిని ముందుకు నడిపింది. గమనించారా? ముందు ఈ మాట వ్యక్తిగతంగానే బయలుదేరింది. వ్యక్తిగతం నుండి క్రమంగా జాతిని చైతన్యపరచటం ప్రారంభించింది.
నేను, నా వాళ్లూ కాదు. నా ప్రజలు, తర్వాత, నేనూ, నా దేశం అనే భావం మొదలైతే ‘సర్వమానవ ప్రేమ’ మొలకెత్తటం తథ్యం - అనుమానం లేదు.
‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అని మాతృదేశభక్తిని ఈ జాతికి ప్రబోధించిన కవి రాయప్రోలు సుబ్బారావు.
‘దేశమును ప్రేమించుమన్నా మంచి యన్నది పెంచుమన్నా’ లాంటి గురజాడ మాటలున్నాయే, రామాయణ భారతాది యితిహాసాలకున్న విలువ ఈ ఒక్క పాటకుంది. అదేమి చిత్రమో! మంచి పెరగాలని అందరికీ మనసులోనే వుంటుంది. ఆచరణలోకి రాదు. అందుకే ప్రబోధ గీతాలు పుట్టాయి. ఈ గీతాలు ఒక్కసారి వినేసి ఊరుకుంటే సరిపోదు. తరతరాలు మన వెంటే వుంటూ మనల్ని, మన పిల్లల్ని వెన్నుతట్తూ నడిపించాలి. మన నీడలా ఉండాలి.
జాతీయ భావాలు ఆకాశం నుంచి ఊడిపడవు. పసితనం నుంచే మొదలవ్వాలి. రెండే రెండు మాటల్లో ‘మనిషెలా బ్రతకాలి?’ అనే మాటకు అర్థం కృష్ణుడు చెప్పాడు.
‘తనవల్ల లోకానికి, లోకం వల్ల తనకూ కంపరం ఎవరికి కలగదో వాడే ధన్యుడు. అదెలా చెప్మా? - అనకండి. అంతా ఒకేలా పుట్టినా మత్సర బుద్ధితో తోటి మనిషిని హీనంగా తేలికగా చూచే దైన్యస్థితికి ఎందుకు దిగజారుతున్నాడో గ్రహించగలిగితే, సగం సమస్య తీరినట్లే.
తమ గొప్పలు, ఎదుటివారి తప్పులు ఎన్నటంతోనే సగం జీవితం గడిచిపోతున్నా, సహజీవన, సహభావన అనే సిద్ధాంతాలపై యింకా నమ్మకం పోలేదు అదృష్టవంతులం.
ఒకరినొకరు ప్రేమించడం ఎంత గొప్పది? ఈ భూమి మీదకు స్వర్గం దిగి వచ్చినంత అనేవారట గురజాడ.
మన భాష, మన సాహిత్యం వల్ల మన మనుషులకూ, మన దేశానికీ, ప్రపంచానికీ మేలు జరగాలని గురజాడ కోరిక. ఆయన ఆశయాలు, ఆదర్శాలు కవితా రూపంలో ప్రబోధించి వందేళ్లు దాటిపోయింది. అందరూ బాగుండాలనుకునేవాడు ఎప్పుడూ బాగుంటాడు. ఇప్పటికీ ఇంకా దేశమంటే మట్టి మాత్రమే. మనుషులు అనే ఆలోచన కార్యరూపం ఎందుకు దాల్చటం లేదో ఎవరికీ అర్థంకాదు.
అంతకంటే దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయేమో అనిపిస్తుంది.
ప్రజాహితం కోరే వారు చేయాల్సినవి ఒట్టి ఉపన్యాసాలు కాదు. కావలసినది కార్యాచరణ.
ఇందుకే కవులూ, గాయకులూ పుట్టారు. నేను చదువుకునే రోజుల్లో ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలంటే ఎంతో సంబరపడేవాళ్లం.
చిన్నప్పటి నుంచీ పాటో, పద్యమో పాడే అలవాటుందేమో, అటు ఉపాధ్యాయులు, ఇటు స్నేహితులూ ననె్నంతో ఇష్టపడేవారు.
జెండా వందనం సమయం సమీపిస్తూంటే నేను ఆ రోజుల్లో విన్న దేశభక్తి గీతం ‘స్వాతంత్య్రమె నా జన్మహక్కనీ చాటండీ’ అంటూ ఖంగుమనే కంచుకంఠంతో ‘స్వర్గతుల్యవౌ స్వతంత్ర జ్యోతీ’ అని తారాస్థాయిలో షడ్జం మాధుర్యాన్ని గమకయుక్తంగా పాడుతోంటే ఒళ్లు గగుర్పొడిచేది. చుట్టూ తిరిగే మనుషులు దేవతా స్వరూపాలుగా కనిపించేవారు. ఘంటసాల వదిలిన నాదాన్ని ఆకాశంలో దర్శించేవాణ్ణి.
పవిత్రమైన దేవాలయాల్లో దైవదర్శనానికి, సంప్రదాయ దుస్తుల్లో వెళ్లాలనీ, పాదరక్షలు బయటే వదిలి లోపలకు ప్రవేశించాలని ఒకరు చెప్పాలా? మన బుద్ధికి తెలియదూ? సంగీత జ్ఞానం బొత్తిగా లేని పాటకు విలువ వుండదనీ, ఇష్టమైతే కష్టపడి నేర్చుకుని ‘ఈ పాట ఇలాగే పాడాలి.. అలా పాడితేనే జనం, చక్కగా శ్రవణానందంగా వింటారని చెప్పకనే చెప్పిన గాయకుడు ఘంటసాల. కాదంటారా? సినిమాతో సంబంధం లేకుండా కేవలం దేశభక్తిని ప్రచోదనం చేసే ఆయన పాటలు దశాబ్దాలుగా వినగలుగుతున్నారంటే ఒక్కటే కారణం. పాటలోని మాటలు ఆ మాటల చుట్టూ అల్లుకున్న రాగం. శ్రుతిశుద్ధత. ఘంటసాలలోని మత్తెక్కించే కంఠమాధుర్యం.
పాటకు ఉండవలసిన లక్షణాలన్నీ నిండుగా వున్న ఈ పాట రికార్డై 1948 ఆగస్టు 15న విడుదలై ప్రజల్లోకి దూసుకెళ్లిపోయింది.
‘స్వాతంత్య్రమె నా జన్మహక్కని చాటండి
నిరంకుశంబగు శక్తులెగిరినా
నిర్భయముగ నెదిరించండి
పరుల దాస్యమున బాధలు పొంది
బ్రతికిన చచ్చిన భేదమె లేదు॥
కవోష్ణ రుధిర జ్వాలల తోటి
స్వతంత్ర సమరం నెరపండి
ఎంతకాలమిటు సహించియున్న
దోపిడి మూకకు దయ రాదన్న॥
సంఘములోను ఐక్యత వేగమె
సంఘటపరుపుము శాంతిపథాన
స్వర్గతుల్యవౌ స్వతంత్ర జ్యోతికి
మాంగల్యపు హారతులిమ్మా॥
‘ఆ మొగల్ రణధీరులు’ అనే పద్యాన్ని ఒక్కసారి మోహన రాగంలో సమ్మోహనంగా పాడేసి అందుకున్న ఈ పాట ‘్భంపలాస్’లో మొక్కుబడిగా ఈ పాట ఏదో మీ కోసమో నా కోసమో పాడలేదు. మనసా, వాచా, ఆర్తితో దేశం కోసమే పాడినట్లుగా అనిపిస్తుంది.
కడుపులో లేని ప్రేమ కౌగిలించుకుంటే వస్తుందా? దేశభకె్తైనా సహజంగానే స్వతస్సిద్ధంగానే పుట్టాలి. నేను, నా దేశం, నా ప్రజలు అంటూ జెండా మోసి, జైలు జీవితం కూడా గడిపిన ఘంటసాల జీవితానుభవమంతా ఈ పాటలో ప్రతిధ్వనించిందేమో అనిపిస్తుంది.
అందుకే అంటారు. అంతరాత్మను మించిన గురువు లేడు. లోకాన్ని మించిన పెద్ద గ్రంథం లేదని. నేను రేడియోలో పని చేసిన రోజుల్లో వెనకటి తరంలోని ప్రసిద్ధ గాయనీ గాయకుల రికార్డులు వెదికేవాణ్ణి.
ఆలిండియా రేడియోలో లలిత సంగీతం ప్రసారానికి అంకురార్పణ జరిగిన తొలి రోజుల్లో వెలువడిన పాటల్లో ఇదొకటి.
కేవలం 3 నిమిషాల 20 సెకన్లలో తిరిగే గ్రామఫోన్ రికార్డులతో (78 ఆర్‌పిఎం) లభ్యమైన పాటలు అసంఖ్యాకంగా ఆ రోజుల్లో విడుదలయ్యేవి.
క్రమక్రమంగా ఘంటసాల కంఠాన్ని అమితంగా ఇష్టపడిన వారి కోసం తయారైన ఆ పాటలన్నీ ఒక ఎల్‌పి రికార్డ్‌గా వేశారు. తోలేటి రాసిన పాటల్లో చాలా ప్రసిద్ధమైన గీతం ‘స్వాతంత్య్రమె నా జన్మహక్కు’. ఘంటసాల విజయనగరంలో వున్న రోజుల్లో పరిచయమైన తోలేటి క్రమంగా సన్నిహితుడై స్నేహితుడయ్యాడు. శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం, జీవితం, సంఘం, వదిన లాంటి కొన్ని సినిమాలక్కూడా పాటలు రాశాడు.
తోలేటి వెంకటరెడ్డిగా పేరు మార్చినా, అసలు పేరు తోలేటి వెంకటశాస్ర్తీ. ముత్యాల్లాంటి మాటలకు సర్వాంగసుందరమైన రాగాన్ని జోడించి గమక సౌందర్యాన్ని ఆవిష్కరించిన ఘంటసాల ఎంత నాద సుఖం అనుభవించాడో?
పాటలో ప్రతి మాట, ప్రతి అక్షరం నాదాన్ని నింపుకుని చెవికి సోకితే కలిగే ఆనందం వంద మందిలో ఏ ఒకరిద్దరికో మాత్రమే లభిస్తుంది. మిగిలిన వారూ వింటారు. కానీ అర్థమై అనుభవించేది మాత్రం ఆ ఇద్దరే. పాట చెవికి వినబడితే చాలదు. అంతరంగాన్ని చైతన్యపరచాలి. తివాసీ పరిచినట్లు పచ్చని పొలాల్లో బారులు తీరి వాలే కొంగల్ని చూస్తూంటే కలిగే అనుభూతి, పాట వింటే కలగాలి. అదీ పాటంటే - కబుర్లు చెప్తూ, కాలక్షేపం కోసం వినే మిగిలినవన్నీ ఇలా వింటే, అలా మరిచిపోయేవే. కాలచక్రంలో కనిపించకుండా పోయేవే.

- మల్లాది సూరిబాబు 90527 65490