అమృత వర్షిణి

ఏది నాదం? ఏది గానం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతావర! సంగీత జ్ఞానము ధాత వ్రాయవలెరా! -అంటారు త్యాగయ్య.
సంగీత విద్వాంసుల కుటుంబాల్లోని పిల్లలందరికీ సంగీతం రావాలనే నియమం లేదు.
సంగీత వాసనంటూ బొత్తిగా లేని కొన్నికొన్ని కుటుంబాల్లో ఎక్కడో ఓ ఇంట్లో సంగీతం పాడేవారు బయలుదేరుతూంటారు. అన్నీ అనుకూలిస్తే గాయకుడౌతాడు. అంతా దైవ సంకల్పమే.
కేవలం ఆసక్తి ఒక్కటే సరిపోదు. అసలు లోపల అభిరుచి ఉండాలి. అభిరుచితోబాటు అందిపుచ్చుకోగల తెలివితేటలుండాలి. అన్నిటికంటే ముఖ్యం.. సద్గురువు దొరకాలి. దొరికినవాడు సద్గురువో కాదో తెలియాలి. లేని పక్షంలో సమయం వృథా. డబ్బు వృథా. సంగీత సాహిత్యాలు రెండూ సహజంగా పుట్టవలసినవే. ఎరువు తెచ్చుకున్న విద్యలు కావు. వినికిడితో పాడగలిగినవారు దక్షిణాదిలో చాలామంది ఉన్నారు. అక్కడ వాతావరణమే పాడిస్తుంది.
సహజంగా పురుష గాత్రాలకూ, స్ర్తి కంఠస్వరానికీ తేడా ఉంటుంది. సద్గురు త్యాగరాజ స్వామి నాదోపాసనతో తరించారని విన్నాం. సంగీతం బాగా నేర్చుకుని సంగీత కచేరీలు చేస్తే అది నాదోపాసనవుతుందా? అవ్వదు. పాట కచేరీయే అవుతుంది.
మరి నాదోపాసనా మార్గం తెలియటం ఎలా? ఒక్కో ధ్వని తరంగం ఒక్కో ప్రత్యేక రూపం కలిగి ఉంటుంది. రకరకాల స్వరాలన్నీ కలిస్తే రాగమవుతుంది. ఒక పద్ధతిగా పాడే రాగం ఒక రూపాన్ని సంతరించుకుంటుంది. అదిగో ఆలాటి రూపాన్ని దర్శించాడు త్యాగయ్య.
కీర్తనలను ఆసరాగా చేసుకుంటూ నాదానందం అనుభవిస్తూ సంగీత సాగరంలో ఓలలాడాడు.
అటువంటి నాద యోగులకు లభించే స్థితి గాయకులందరికీ లభించదు. సంగీతం ఆయనకు ఉపాసనగా పరిణమించి ముక్తి మార్గాన్ని చూపించింది.
ఉపాసన అంటే ఏమిటి? అనే దానికి - గణపతి సచ్చిదానంద స్వామి ఒక దృష్టాంతాన్ని ఉదాహరణగా చెప్పారు.
అనగనగా ఒక దొంగ. వాడికి వృద్ధాప్యం సమీపిస్తోందని తెలిసిన కొడుకు, ఒక రోజు తండ్రితో ‘నాన్నా! మీకు ముసలితనం వచ్చిందిగా, పరంపరగా ఎన్నో తరాలుగా మన వంశంలో సంప్రదాయంగా వస్తున్న చోరకళను నాకు నేర్పి ఇంక మీరు విశ్రాంతి తీసుకోరాదా! నేను కూడా మీలాగా దొంగతనాలు చేస్తూ కుటుంబ పోషణ భారాన్ని వహిస్తాను’ అన్నాడు.
తండ్రి ఎంతో సంతోషించి ‘నేర్పుతాను రమ్మ’ని ఆ రోజు దొంగతనానికి కొడుకుని వెంటబెట్టుకుని వెళ్లాడు. చీకట్లో నెమ్మదిగా ఇద్దరూ ఓ ఇంట్లో ప్రవేశించారు. అనుభవం పండిన తండ్రి చాకచక్యంగా పెద్ద బీరువా నొకదాన్ని తెరిచి, కొడుకును అందులోకి దూరి వెళ్లి ఏమైనా విలువైన వస్తువులున్నాయో లేదో చూడమన్నాడు. కొడుకు బీరువాలోకి దూరగానే ఆ బీరువా తలుపులు గభాలున మూసేసి మెల్లగా అడుగులు వేసుకుంటూ బయటకు జారుకున్నాడు.
లోపల దూరిన వాడికి గుండె జారిపోయింది.
అంతేనా? తండ్రి ‘దొంగ దొంగ’ అని అరుస్తూ చేసిన అలజడికి యజమాని, పనిమనిషి కంగారుగా లేచి, కొవ్వొత్తి పుచ్చుకుని ఇల్లంతా కలియ తిరగసాగారు. బీరువాలో దాక్కున్న కొడుక్కి తండ్రి మీద ఎక్కడ లేని కోపమూ వచ్చింది. తాను పట్టుబడతామేమోననే భయం పట్టుకుంది. వెంటనే ఒక ఉపాయం కూడా తట్టింది. లోపల నుండి పిల్లిలా అరవడం మొదలుపెట్టాడు. పనిమనిషి ‘పిల్లి లోపల వుండగా ఎవరో బీరువా తలుపు వేసేశారు పాపం’ అనుకుని ఒక్కసారి బీరువా తలుపులు తెరిచిన మరుక్షణం లోపలున్న దొంగ కొడుకు ఒక్క గెంతు వేసి బైటికి దూకేసి, పనిమనిషి చేతిలోని కొవ్వొత్తిని ఆర్పేసి ఆవిడను తోసుకుంటూ బయటకు పరిగెత్తాడు.
ఈ హడావిడికి వీధిలోని జనం ఒక్కొక్కరు దొంగ వెంటపడ్డారు. ప్రాణాలు పోయినంత పనైంది ఆ దొంగ కొడుక్కి. అలవాటు లేని వ్యవహారమాయె. పైగా అనుభవం లేదు.
క్రమంగా వీధిలో జనాన్ని చూసి దారి ప్రక్కనే ఉన్న బండరాయిని, అక్కడ సమీపంలోని పాడుపడ్డ బావిలో వేసి, వెళ్లి చీకట్లో దాక్కున్నాడు.
జనానికి దొంగ ఎక్కడా కనిపించలేదు.
పాడుబడ్డ బావిలో శబ్దాన్ని విని, అందులో దూకి చచ్చే ఉంటాడని భావించి వెదికే ప్రయత్నం విరమించి ఇళ్లకు పోయారంతా.
కాస్సేపటికి ఈ దొంగ కొడుకు బట్టలు దులుపుకుని ఇంటికి చేరి, తండ్రిని నిలదీశాడు.
ముసుగుతన్ని పడుకున్న తండ్రిని కోపంగా లేపి ‘తనను బీరువాలో బంధించినందుకు నిందిస్తూ, తన అనుభవాన్ని తండ్రికి చెప్పబోయాడు.
తండ్రి ఆవులిస్తూ ‘నువ్వు ఆ వివరాలేవీ నాకు చెప్పక్కర్లేదు. అవన్నీ వ్యర్థం. నువ్వు తప్పించుకుని కొంపకు చేరావంటే చౌర్యకళ నీకు వచ్చినట్లే. ఇంక వెళ్లి పడుకో’ అని చల్లగా సమాధానమిచ్చాడు’.
స్వామీజీ.. ‘ఉపాసన’ అంటే ఇదే’ అని చెప్పి కథ ముగించారు.
ఉపాసకుడు వర్తమానంలోనే మనస్సును నిలపాలి. భవిష్యదాలోచనలు మనసులోకి రానివ్వరాదు. మహత్వ కాంక్ష, సన్మాన దృష్టి, లౌకికమైన లాభాపేక్ష వుండకూడదు. వర్తమానంలోనే జీవించాలి. భవిష్యత్ గణితంలో కొట్టుకుపోరాదు’ అని చెప్పారు.
అపరితోషాత్ విదుషాం, న సాధు మనే్య ప్రయోగ విజ్ఞానం -కాళిదాసు. తన పాండిత్యాన్ని విజ్ఞులైన వారు (రసజ్ఞులు) బాగా మెచ్చుకునేంత వరకూ ఏ కళాకారుడూ తృప్తిపడడు’
నిజమైన నాదయోగి తన సృజనత్వంలోనే ఆనందాన్ని అనుభవిస్తాడు. అతడికి ఇతరుల పొగడ్తలతో పనిలేదు.
తంబురా మీద నాలుగు తీగలను షడ్జానికి శృతి చేసి మీటితే, ఆ మధుర ధ్వని నాదమవుతుంది. అది గానం కాదు.
కాలమనే ఒక సన్నని రేఖ మీదుగా ఉపస్వరాల మీదుగా (అనుస్వరం) రకరకాల శృతులను దాటి, ఆరోహణ, అవరోహణల మీదుగా స్వర సంచారం సాగితేనే గానం. విన్యాసం లేకుండా గానం లేదు. నాదం మాత్రమే ఉంటుంది. గానం నాదంలోనే పుట్తుంది. కాస్సేపటికి రకరకాల విన్యాసాలతో మళ్లీ తిరిగి ఆ నాదంలోనే కలిసిపోతుంది. పాట పాడినంతసేపు, ఈ ప్రక్రియ సాగుతూనే ఉంటుంది. ఈ రహస్యం గాయకులకే ఎఱుక, వినే శ్రోతల కంటే.
మరో రహస్యం
గానంలోని నాద సుఖం గాయకులందరికీ తెలియదు - అలా పాడేస్తూ పోతారు.
శ్రోతల్లో నాద సుఖం తెలిసినవారు ‘అయ్యో! నాదంలోని రుచి తెలియకుండా పాడేస్తున్నారే’ అని చింతిస్తూంటారు. మీకు తేలికగా అర్థమవ్వటం కోసం మరో ఉదాహరణ.
ఇప్పటిలాగా కాదు. ఇదివరకటి రోజుల్లో పెళ్లి భోజనాలు చాలా పసందుగా ఉండేవి. పెళ్లి ముహూర్తానికి, వేదికకూ ఎంత శ్రమపడి ఆలోచించి నిర్ణయించేవారో పెళ్లి భోజనాలక్కూడా అంతకంటే రెట్టింపు ప్రాధాన్యత నిచ్చేవారు. ఎవరూ ఎవరి మీదా అలగకుండా. అటు పెళ్లివారికీ, పిలిచిన బంధువులకూ మాట రాకుండా ఎంతో గౌరవ మర్యాదలతో ఘనంగా భోజనాల ఏర్పాట్లుండేవి. ఆ సమయంలో ప్రత్యేకించి, విందు భోజనాల మీద పుణ్యస్ర్తిలు పాడే పెళ్లి పాటలే వుండే. పెళ్లి అవ్వగానే ముచ్చటగొలిపేది ‘్భజన విందు’ కార్యక్రమం. ఏదైనా మధుర పదార్థం వడ్డిస్తే, ఎంతో ఆదుర్దాగా, ఆసక్తిగా ఆ పదార్థాన్ని అడిగి మరీ తినేవారు. కొసరి కొసరి వడ్డించేవారు. ఇప్పుడా సీను లేదు. ఎవరికి వారే యమునాతీరే.
భోజనం చేశారా లేదా అని అడిగే నాథుడే వుండడు. పైగా అదేదో సినిమా టిక్కెట్ల కోసం ఎగబడి క్యూలో నిలబడ్డట్లు చేతిలో ప్లేటు తీసుకుని ‘దేహి’ అనడుగుతూ మనుషుల్ని తోసుకుంటూ కనిపించిన పదార్థం ఏదో మ్రింగి రావటమేగా?
భాండశుద్ధిలేని వంట
నాదశుద్ధి లేని పాట
రెండూ ఒక్కటే. నాదమంటే గోముఖం నుంచి వెలువడే గంగ. నాదమంటే అఖండంగా వెలువడే మధుధార. మధురాతి మధురమైన పదార్థ రుచి మాటల్లో ఎలా వర్ణించలేమో?! సుస్వరంతో నిండిన నాదాన్ని కూడా వర్ణించలేం.
అనుభవించవలసినదే. త్యాగరాజస్వామి లాంటివారు ‘ఇంత సౌఖ్యమని నే చెప్పజాల! ఎంతో ఏమో ఎవరికి తెలుసు?’ అనటానికిదే కారణం.
కొందరు వెనుకటి తరంలోని సంగీత దర్శకులు గాయకులూ నాదానుభవాన్ని తెలిసినవారే. చెవికి సుఖంగా వినిపించే పాటల్ని గుర్తుండిపోయేలా పాడినవారే. కాలంతోబాటు ఎన్నో మార్పులు - ఈ వేళ నాదసుఖంతో పనిలేదు. ఏం పాడినా వినేవారున్నారు.
ఎలా పాడినా భరించేవారున్నారు.

------------------------------------------------------------------------------------------------------------
కెనడాలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సితార్ విద్వాంసుడు ఒక అద్భుత ప్రయోగమొకటి చేశాడు. ఆ రోజుల్లో ప్రముఖ వార్తాపత్రికలన్నీ ఆ ప్రయోగాన్ని ప్రశంసించాయి. తాను కూర్చున్న స్థలంలో చుట్టూ కొన్ని విత్తనాలు నాటించాడు. కొన్ని విత్తనాలు ఆయనకు బాగా సమీపంలోనూ, మరి కొన్ని కాస్త దూరంగానూ నాటించాడు. ప్రతిరోజు నిర్దిష్ట సమయంలో అవి మొలకెత్తే వరకూ వాటికి సితార్ నుండి శ్రావ్యమైన సంగీతం వినిపించేవాడు. ఆయన సితార్ వాద్యాన్ని మొలకెత్తే మొక్కలు వినడం ప్రారంభించాయి. ఎలా తెలిసింది? మెల్లగా ఎవరో రహస్యం చెబితే చెవి యొగ్గి ఎలా వింటామో, అలా వంగి వున్నాయి. చూసిన వారు రవిశంకర్‌తోబాటు విస్తుబోయారు. నిర్ణీత సమయం కంటే తొందరగా ఆ విత్తనాలు మొలకెత్తి మొక్కలు ఊగుతూ కనిపించాయి. అరాచక శబ్దాలు, మనిషి శారీరక ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. ఈ రోజుల్లో చాలామందికి ముఖ్యంగా పట్నాల్లో నివసించే వారికి సంభవించే శారీరక మానసిక రుగ్మతలకు జల వాయు కాలుష్యాలతోబాటు శబ్ద కాలుష్యం కూడా ప్రధాన కారణం.

- మల్లాది సూరిబాబు 90527 65490