అమృత వర్షిణి

నారీమణులూ - నాణ్యమైన సంగీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాటకు పరవశించని వారంటూ ఉండరు. మోతాదుకు మించి ఉపన్యాసాలు దంచేస్తే వినేవారుండరు. ఆలిండియా రేడియోలో తెల్లవారగానే వినిపించే సూక్తుల వ్యవధి కేవలం నాలుగు నిమిషాలు. ఆ విన్న నాలుగు మాటలూ కనీసం నాలుగు రోజులపాటైనా మనసులో నిలిచిపోయేవి. సులభంగా అర్థమయ్యేదే సూక్తి. చెప్పేవాడికి వినేవాడు లోకువని చెప్పి కుండ బోర్లించేసినట్లు చెప్పినా ప్రమాదమే. ముచ్చటగా చెప్పాలి. మృదువుగా ముక్తసరిగానే చెప్పాలి. ‘మిత్రమా! చూడు. ఆ వేళ నువ్వు చెప్పిన మాట విని ఆచరించటం వల్లనే నేనీ స్థితిలో ఉన్నాను సుమా’ అని చెప్పగలిగే సంస్కారవంతులుంటే, మంచి చెప్పగలిగే వారీ లోకంలో ఎప్పుడూ వుంటారు. లోపం చెప్పేవాడిలో వుండదు. కుదురుగా వినటంలోనే వుంది. వినగానే ఆచరణలో పెట్టేవారే దుర్లభం. వినదగు నెవ్వరు చెప్పిన అనే పద్యం అందుకే పుట్టింది - మన గురించి మన పెద్దలు చాలా ముందు చూపుగల మేధావులు.
‘ఔనా? నిజమేనా!’ అని ఆలోచించి, బుద్ధికి సమన్వయ పరచుకున్న కార్యసాధకులు ఈ లోకంలో చాలామంది వున్నారు. కానీ అవతలి వారి అనుభవం తనకో పాఠం -అని భావించేవాళ్లు ఎందరు?
వెనకటి రోజుల్లో వివాహాలు ఎంతో వైభవంగా జరిగేవి. ముహూర్తానికి ఒకటి రెండు రోజులు ముందుగానే బంధుమిత్రులొక్కొక్కరూ రావటం నేనెరుగుదును - తాటాకు పందిళ్లూ, మామిడి తోరణాలతో ఆ వీధి వీధంతా ఘుమఘుమలతో కళకళలాడిపోయేది. పెళ్లి ఫలానా వారింట్లో అట.. అంటూ వచ్చేపోయే జనం గొప్పగా చెప్పుకునేవారు.
అలా వచ్చిన వాల్లలో కొందరు అనుభవం పండిన పెద్దలు స్వయంగా పూనుకుని ఇంటి పెద్దలకు సలహాలిస్తూ సహాయపడేవారు. వారి సలహాలను తు.చ. పాటించాలనే గౌరవం కూడా ఉండేది. ఎవరైనా పెళ్లి కావలసిన ఆడపిల్లలు ఎదురుపడితే చాలు. బంధుత్వాలన్నీ కూడబలుక్కుని తెలుసుకుని నెమ్మదిగా సంబంధాలను కలిపే ప్రయత్నానికి దిగేవారు.
గలగలా నవ్వుతూ చకచకా నడిచి వెళ్లిపోయే పిల్లల్ని పిలిచి, అడిగేవి ఆ రోజుల్లో మూడే మూడు ప్రశ్నలు.
1.అమ్మాయ్! ఏం చదువుకున్నావ్?
2.వంట వచ్చునా?
3.సంగీతం పాడతావా?
ఇవే ఆ కాలం పెద్దలు కోరేవి. ఆఖరున అడిగే ప్రశ్నకు సమాధానంగా ఒకవేళ పాట పాడిందంటే చాలు - మరో పాట పాడమంటూ పదిమందీ చేరి బలవంతం చేయగానే, అందరు మురిసిపోయి వింటూండగానే సంబంధాలు కలిసిపోయేవి - పెళ్లిచూపుల హడావిడితో.
పెద్దల సమక్షంలో కుదిరిన ఆ సంబంధాలు చాలావరకూ పిల్లాపాపలతో వర్థిల్లటం సర్వసాధారణ అనుభవం. చల్లగా సాగే కుటుంబాల్లో ఏ మాత్రం చిన్నచిన్న అభిప్రాయ భేదాలు తలెత్తినా పెళ్లి కుదిరిన పెద్దల దాకా వెళ్తుందేమోననే భయం వుండేది. పిల్లలు పెద్దయ్యే దశలో యించుమించు అన్నీ పరిష్కరింపబడి హుందాగానే సాగిపోయేవి జీవితాలు.
ఆశ్చర్యమేమంటే అలా ఆవేళ పెళ్లిచూపుల్లో వధువు పాడిన సంగీతం మాత్రం ఎదుగూ బొదుగూ లేక, అలాగే వుండిపోయేది. పెళ్లి సంగీతమనేవారు. నేర్చుకున్న సంగీతాన్ని కొనసాగించలేక, పాడాలనే ఉత్సాహం ఉన్నా పాడే అవకాశాలు మాత్రం క్రమంగా తగ్గిపోతూ, ఏం చేయాలో పాలుపోని అర్హులైన వారెందరో వుండేవారు. వారి సంగీతం కాస్తా పెళ్లి కుదిరే వరకే. పట్టుదలతో నేర్చుకుందామన్నా కట్టుకున్న భర్త ఒప్పుకోవాలి. అత్తమామల అంగీకారం కూడా సమస్యే.
బయటకు వెళ్లి సంగీత కచేరీ విందామన్నా సవాలక్ష ఆంక్షలు. మన ఆంధ్రదేశంలో చాలామంది స్ర్తిలు, శుద్ధమైన సంప్రదాయ సంగీతానికి దూరమవటానికిదే కారణం. అన్ని రకాల అవరోధాలూ దాటి, వెనకటి తరంలో ఆంధ్రదేశంలో లబ్దప్రతిష్టులైన వారిలో, నేనెరిగిన కుమారి శ్రీరంగం గోపాలరత్నం, టిటిటి సీత, టి.కె. యశోదాదేవి, వింజమూరి లక్ష్మి, వి.బి.కనకదుర్గ మొదలైనవారు ముఖ్యులు. జానపద సంగీతంలో సీత, అనసూయ ప్రముఖులు. మరెందరో గాయనీమణులు తమ గానంతో ఆంధ్రావనిలో పేరు తెచ్చుకున్నవారే.
దక్షిణాది సంగీత వాతావరణం వేరు. ఏ మాత్రం సంగీతాభిరుచి వున్నా, భర్తలు ప్రోత్సహించేందుకు వెనుకాడరు. అభ్యంతరం చెప్పరు. ఇంటి బాధ్యతను పంచుకుంటారు. వెన్నుతట్టి వెనకే వుంటారు.
వెనకటి తరంలో ఎన్.సి.వసంత కోకిలమ్, బృంద, ముక్త, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, ఎం.ఎల్. వసంతకుమారి, డి.కె.పట్టమ్మాళ్ మొదలైన గాయనీ మణులెందరో అవరోధాలెన్నిటినో దాటి అత్యున్నత స్థాయికి చేరుకున్నవారే. శుభ్రంగా నేర్చుకుని లక్షణంగా, గానం చేసేత కట్టుకున్న భార్యలకు కనకాభిషేకం చేస్తే కాదనేవారెవరుంటారు?
మనవైపు వాతావరణం వేరు. ‘ఎందుకులే ఈ సంగీతం’ అని దూరంగా వుందామనుకున్నా, సంగీత వాంఛ వీళ్లను వదలదు. ఏ గురువునో ఆశ్రయిస్తారు. పరిస్థితిని మొత్తం వివరిస్తారు. సంగీతం పునరుద్ధరించే ప్రయత్నం మొదలవుతుంది.
నాలుగు పదులు దాటిన వారికి, ఎలా ఏం పాడి బోధించాలో తెలియని పరిస్థితి ‘గురువు’ది. లోగడ మీరేం మందులు వాడారు? అని డాక్టర్ ప్రశ్నించినట్టుగా, నెమ్మదిగా సహృదయంతో సరళీ స్వరాలు, అలంకారాలూ, వర్ణాలతో మళ్లీ ప్రారంభించి పునాదిని సుస్థిరం చేద్దామంటే ఆత్మన్యూనత, శిష్యులది. పోనీ చిన్నచిన్న కీర్తనలతో సర్దుకుపోతారేమో అని అడిగి చూస్తాడు గురువు.
ఆ కీర్తనలన్నీ నేర్చుకున్నానండి. ఏమైనా కొత్త కీర్తనలు చెప్పండనే సమాధానంతో గురువుకు పాతవి గుర్తుకు రావు. కొత్తవి దిక్కుతోచదు. బుర్ర కెక్కవు. నేర్చుకున్న కీర్తనలు క్షుణ్ణంగా తలకెక్కలేదన్న సంగతి ఆమె పాడగానే గురువుకు తెలిసిపోతుంది. కింకర్తవ్యం?
ఆ విషమ పరిస్థితికి నివారణౌషధం ఆ గురువుకు తెలుసు. చలించిన పునాదిని కట్టుదిట్టంగా పటిష్ఠపరచుకునే సదుద్దేశం కూడా లేదనీ తెలుసుకుంటాడు. నెమ్మదిగా నలుగురు శిష్యులతోబాటు కూర్చోబెట్టి నాలుగు కీర్తనలు నేర్చుకోమంటూ ప్రోత్సహిస్తాడు. కొన్నాళ్లు గడుస్తుంది. బాగానే వుందనిపిస్తుంది నేర్చుకునేవారికి. ఓ మంచి ఉదయంలో అన్నమాచార్య కీర్తనల్ని గుర్తు చేస్తాడు. అంతే. అప్రయత్నంగా ఒక్కసారి ఆ ఏడుకొండలూ ఎక్కేసి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి చూసినంత అనుభూతితో అన్నమయ్యను తలుచుకుని పాట ఆరంభవౌతుంది. మరో పాట, మరో పాట, అలా అలా అంచెలంచెలుగా తాను పాడగలిగిన గమక శుద్ధిలేని పాటల్ని ఏరుకుని పరమపద సంగీత సోపానాలుగా భావించిన వర్థిష్ణు గాయనీమణులు కోకొల్లలు. ఎలా పాడినా, ఏం పాడినా వింటారు జనం అనే నిర్ధారణకు రాగానే ఎదురయ్యే పరిణామాలన్నీ ఇలాగే ఉంటాయి. క్షుణ్ణంగా గురువు వల్ల మాత్రమే తెలుసుకోవలసిన విషయాలన్నీ పక్కకు వెళ్లిపోయి, ఈ పాటలే నెత్తికెక్కుతాయి.
ప్రభుత్వం పుణ్యమా అని మన ఆంధ్రదేశంలో రెండు పదులకు మించి సంగీత కళాశాలలు, ఇంచుమించు ప్రతి జిల్లా కేంద్రాల్లోనూ నెలకొని వున్నాయి.
శుద్ధమైన సంప్రదాయ సంగీత బోధన మినహా మరే ఇతర తేలికైన బాణీలకూ అక్కడ స్థానం లేదు. ప్రతి ఏడూ డిప్లొమోలో, సర్ట్ఫికెట్‌లో తీసుకుని బయటకు వచ్చేవారి సంఖ్య వందల్లోనే ఉంటుంది. సంగీత విద్వాంసులై పోయామన్న భావన, డిప్లొమోలు పుచ్చుకున్న వారికి గానీ, ఇచ్చేసి చేతులు దులిపేసుకున్న కళాశాలల వారికి గానీ వుండదు. ఇది నిత్యసత్యం.
కుటుంబ పరిస్థితులు ఎలా వున్నా సంగీతం మీద వున్న పిచ్చి వ్యామోహంతో దిగిన వారు కోరుకునేది ఒకటి ఉపాధి అవకాశం. లేదా వారు నేర్చినది వినిపించే అవకాశం. ఈ రెండూ ఆంధ్ర దేశంలో ఇంచుమించు మృగ్యమే.
దిక్కుతోచని పరిస్థితుల్లో ఏం చేయగలరు? పది మందీ నడిచే దోవలో నడవటమే. మరో గత్యంతరం లేదు. ఏళ్ల తరబడి.. సంప్రదాయ సంగీతం నేర్చుకున్నా అవకాశాలంటూ లేని పరిస్థితుల్లో ఆశ్రయించేది సినిమా పాటల్నే. చక్కని సంప్రదాయ సంగీతాన్ని, శ్రద్ధగా ఓ సద్గురువు దగ్గర నేర్చుకున్న ఘంటసాల జీవన గమనం మారడానికి కారణం ఇదే.
రియాలిటీ షోల్లో ఈ వేళ అనుకరించి పాడి ప్రసిద్ధులైన ప్రతి గాయకుడూ తనను తాను ఘంటసాలతో పోల్చుకునే సాహసం చేయలేరు. ఎందుకని?
సాహిత్యంలో కనిపించే మాటలు ఏ రాగంలో వుంటే బాగుంటాయి? ఏ తాళంలో పాడితే రక్తిగా వినిపిస్తాయి? ఏయే రాగం ఎలా పాడాలి? అందులో రాకూడని స్వరాలేవి? రక్తినిచ్చే స్వరాలేవి? మొదలైనవి తెలియాలిగా?
తెలిసేదెలా? దారేదీ? శాస్తమ్రే మార్గబంధువు. అదే ప్రమాణం లేదా గురువుపై గురి.
గురు లేక ఎటువంటి గుణికి తెలియగబోదు (త్యాగరాజు)
సంగీత జ్ఞానం హృదయ స్పర్శకం. మనిషిని కదిలిస్తుంది.
మనకున్న జ్ఞానేంద్రియాల్లో ‘నాసిక’ మినహా అన్నీ అబద్ధాలు చెప్పగలిగేవే. లేనిది ఉన్నట్లు భ్రమింపచేసేవే. జీవుల మనుగడకు ‘శ్వాస’ ‘నిశ్వాస’లతో పాటు ‘విశ్వాసం’ కూడా ముఖ్యం. శబ్ద, నిశ్శబ్దాలు కూడా అనివార్యం. ధ్వని ఎక్కడ పూరించాలి? ఎక్కడ ఏ మాటకు ఎంత ఊపిరిని వదలాలి? ఎక్కడ తగ్గించుకుని పాడాలి అనే ‘స్పృహ’ కూడా అవసరమే. ఇది నేర్చుకుని పొందేది కాదు. విధాత వ్రాయవలసినదే.
ఇవన్నీ చెప్పగలిగిన సద్గురువులు మాత్రం అరుదుగా ఉంటారు. వినగానే ముక్కును పట్టి పాడేసే పాటలు తాత్కాలిక ప్రయోజనాన్నివ్వచ్చునేమో. కనీసం సంగీత జ్ఞానార్జనకు దూరం చేస్తాయనేది విజ్ఞులు చెప్పే మాట.
తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లోని ఏ సినిమా పాటల్లోనైనా చూడండి. నిర్దుష్టమైన లయ, చెక్కుచెదరని శృతి, భావం కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. శాస్ర్తియ సంగీత జ్ఞానం తెలిసిన గాయకులే సినీ గాయకుల ప్రత్యర్థులు.
సినిమా వ్యాపారమే అయినా ఒకప్పుడు సంగీత ప్రయోజనాన్ని కాంక్షించే నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు, గాయకులుండేవారు. వారి పుణ్యమా అని ఆనాటి సినిమా కథలు, నటీనటులు గుర్తుండకపోయినా పాటలు చిరస్థాయిగా కీర్తినార్జించాయి. ఎందుకంటారు? కారణాలు వెదకనవసరం లేదు. ఆ పాటలన్నీ మీకు కరతలామలకమే. ఊహించగలరు. పునశ్చరణ చేయగా చేయగా పెరిగేది దివ్యమైన సంగీతం.
నిరంతరం, ‘మననాత్ త్రాయతే ఇతి మంత్రః’ మననం చేసే కొద్దీ మనకు రక్షణ కల్పించేది మంత్రం. ‘త్రాణ’మంటే రక్షణ. ఎవరో పాడి వదిలేసిన పాటలు మననం చేసే కొద్దీ లభించేది ప్రజ్ఞ. మరి పాండిత్యం? త్రిస్థాయిల్లో అలవోకగా స్వర సంచారం చేయగలగడం, నిలకడగా ఒక స్వరంపై పూర్తి శ్వాసతో నిలిపి పాడగలగటం, ఏ స్వరం మీద ఎక్కడ ఆపినా, అపశ్రుతి లేకుండా స్వచ్ఛంగా పాడటం మొదలైన సంగీత పరమైన విషయాలన్నీ తెలుసుకునే మార్గాన్ని చూపించేది మాత్రం శాస్తమ్రే.
అప్పుడు వినేసి, ఆ క్షణంలోనే మరిచిపోయే సినిమా పాటకు కూడా ఈ నియమాలుంటాయి - ఉండవనుకోకండి.
కానీ నేల విడిచి గరిడీ సాములెవరూ చేయలేరు. ఆధారం లేకుండా ఎవరూ పరుగెత్తలేరు. సంగీత రంగంలో నెలకొన్న పోటీ ప్రపంచంలో, ప్రతి క్షణం, ఒకరిని మరొకరు అధిగమించటానికి చేసే ప్రయత్నాన్ని ఎవరూ ఆపలేరు. ఉన్నదేమిటో తెలుసుకోవాలి. లేని దాని కోసం ప్రయత్నించాలి.

- మల్లాది సూరిబాబు 90527 65490