అమృత వర్షిణి

కన్నవి.. విన్నవి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెనుకటి రోజుల్లో ఆంధ్రులంటే అసహాయ శూరులని కొందరూ, కాదు, ఆరంభశూరులని మరి కొందరూ అంటే వినీ విననట్లుగా ఉండేవాళ్లం.
‘కాదు కాదని’ నిరూపించే రోజు రాకపోతుందా అనుకుంటూ చాతక పక్షుల్లా ఎదురుచూసే సహృదయులింకా వున్నారు. మన సంగతి అలా వుంచండి. కొన్ని దశాబ్దాలు, మృదుమధురంగా తన వయొలిన్ సహకారంతో ఆ రోజుల్లో బాగా ప్రసిద్ధులైన అరియక్కుడి రామానుజయ్యంగార్, శెమ్మంగుడి శ్రీనివాసయ్యర్, జి.ఎన్. బాలసుబ్రహ్మణ్యం, అలత్తూర్ సోదరుల వంటి దక్షిణాది దిగ్గజాలను ఆనంద శిఖరాలపై కూర్చోపెట్టిన సంగీత విద్వాంసుడి పేర బెంగుళూరులో ఒక విచిత్రమైన భవనాన్ని కట్టారు. ఆయన పేరు మైసూర్ టి.చౌడయ్య. ఆ భవనం ‘వయొలిన్’ ఆకారంలోనే వుంటుంది. అదే విశేషం.
ఇక్కడ మనవాళ్లను తలుచుకుందాం. తమ సంగీత వైదుష్యంతో సంగీత రసికులను ఆనందోత్సాహాలతో నింపిన ఎందరెందరో లబ్దప్రతిష్టులైన విద్వాంసులు మనకూ ఉన్నారు.
దైవదత్తంగా లభించిన సంగీతానికే వారి జీవితాలను అంకితం చేసి బ్రతికారే గాని, పేరు ప్రతిష్ఠల కోసమో, అవార్డుల కోసమో రివార్డుల కోసమో, ధన సంపాదన కోసమో బ్రతకలేదు. ఎవరెవరిని ఆశ్రయిస్తే గుర్తింపు లభిస్తుందోనని వెంపర్లాడకుండా, వారి మానాన వారు ఆనందమయ సంగీత లోకంలో విహరించి ఈ జీవిత నాటక రంగస్థలం నుండి హాయిగా నిష్క్రమించిన తెలుగు వారెందరో మనకు తెలుసు. కళను ఆస్వాదించి ఆనందించేంత వరకే ప్రజలకు తెలుసు. ఆ కళాకారుల కోసం వారేమీ పాటుపడరు. ఇక్కడ మన వాళ్ల గొప్పతనాన్ని మనమే అభినందించలేని దుస్థితిలో వున్నాం.
రాజకీయ నాయకులకు గానీ ప్రజా సేవకులమని చెప్పుకునే వారికి గానీ సంగీత సాహిత్యాది కళల పట్ల మోజుండటం అసహజం. ఒకవేళ ఏ ఒకరిద్దరికో ఉన్నా వారికి తెలిసిన కవులే కవులు. వాళ్లు విన్నదే సంగీతం. వాళ్లకు అంతకంటే విశాల హృదయం వుండదు. సద్గురువుగా నీరాజనాలందుకుంటూ ఎక్కడో తంజావూర్‌లో, రామభక్తి సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజై ఆంధ్ర, తమిళ, కన్నడ కేరళ ప్రాంతాలన్నిటినీ నాదసుధారసమనే సూత్రంతో ఏకం చేసిన త్యాగరాజు కంటే జాతీయ సమగ్రతకు అర్థం చెప్పగలిగిన మొనగాడెవరున్నాడో చెప్పండి.
భాషలు వేరైనా భావాలు వేరైనా కులాలు వేరైనా మతాలు వేరైనా తాను రాసిన కీర్తనలు జగద్వ్యాప్తమై, గాయకులంతా ఏకకంఠంతో పాడేలా చేసిన సంగీత ఋషి శ్రీరామభక్తాగ్రణ్యుడు, త్యాగయ్య.
కర్ణాటకలో ప్రసిద్ధి పొందిన మహా విద్వాంసుడు బిడారం కృష్టప్ప శిష్యుడే మైసూరు టి.చౌడయ్య. బెంగుళూరు నాగరత్నమ్మ కూడా. బిడారం శిష్యురాలే. చౌడయ్య వయోలిన్ వాద్యానికి మరో ప్రత్యేకత ఉంది. సాధారణంగా వయొలిన్‌కు 4 తీగలే వుంటాయి. కానీ ఈయన వయొలిన్‌కు 7 తీగలుంటాయి.
ఆ రోజుల్లో అరియక్కుడి రామానుజయ్యంగార్, బిడారం కృష్టప్ప, రాచప్ప, సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్, జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం, చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్లై వంటి పెద్ద విద్వాంసుల గౌళగాత్రాలతో సరిసమానంగా తూగగలిగే నాదాన్నివ్వడానికి వయొలిన్‌కున్న నాలుగు తీగలు సరిపోవనిపించి, తన గురువుగారి అనుమతితో 7 తీగలను అమర్చి ఆ కాలంలో ప్రసిద్ధులైన వీణ శేషన్న, వీణ సుబ్బన్న వంటి వైణికులను ఆశ్చర్యపరిచాడు.
ఆరోహణ అవరోహణలు తెలిసినంత మాత్రాన ప్రతివాడూ గాయకుడవ్వడు.
గాయకుడైనంత మాత్రాన లోక ప్రసిద్ధుడవటం ఇంకా కష్టం.
‘చౌడయ్య రాక్షస సాధకుడని పేరు. కేవలం నేర్చుకుని ఊరుకుంటే సంగీతం పెరగదు. నేర్చినది మననం చేయాలి. పునశ్చరణ చేసే కొద్దీ మంత్రానికి బలం ఎలా ఏర్పడుతుందో, పాడినవే మళ్లీ మళ్లీ పాడిన కొద్దీ పాటకు రుచి ఏర్పడి, నాణ్యత పెరుగుతుంద’ని చౌడయ్య తరచు సభల్లో చెప్పేవారు. ఆయన చెప్పినవన్నీ, స్వయంగా ఆచరించినవే. నిత్య సాధకుడు. నిత్యం పదేసి గంటల సాధన. సరళీ స్వరాలు, జంట దాటు వరుసలు, వర్ణాలు ఎడతెరిపి లేకుండా వాయించేవాడు. ఒకే రాగాన్ని వారం రోజులపాటు సాధన చేసి స్వాధీనం చేసుకునేవాడు. ఆ రోజుల్లో మైకులుండేవి కావు. ఎంత దూరమైనా తన వాద్యం వినిపించాలనే ఆశయంతో మైసూర్‌లో ‘రంగప్ప’ అనే వయొలిన్ రిపేరర్ సలహాతో 1928 సంవత్సరంలోనే వయొలిన్‌కు 7 తీగలను అమర్చి, సుస్వర సునాదాన్ని పలికించిన విద్వాంసుడు.
షట్కాల గోవింద మరార్ అనే మహా విద్వాంసుడు ఏడు తీగలతో వున్న తంబురాతో తన అమృతమయమైన గానంతో త్యాగరాజస్వామి అనుగ్రహానికి పాత్రుడైన సంగతి మీకు తెలుసు గదా? బహుశా చౌడయ్య వయొలిన్‌కు 7 తీగల సంప్రదాయానికి ప్రేరణ ఇదే కావచ్చునేమో?
మైసూర్ మహారాజులకు అత్యంత ప్రీతిపాత్రుడైన మహా విద్వాంసుడు చౌడయ్యకు లభించిన సత్కారాలకు, సన్మానాలకు కొదవేమీ లేదు. ఇటీవల దివంగతుడై, సినిమా లోకంలో ప్రసిద్ధుడైన నటుడు అంబరీష్ చౌడయ్య మనుమడే.
శ్రుతి సుఖం తెలిసి, మృదువైన నాదంతో, పరిపక్వత స్థితికి చేరుకున్న మైసూర్ చౌడయ్యకు కర్ణాటకలోని సంగీత రసికుల వల్ల లభించిన అత్యంత గౌరవమే మైసూర్‌లో ఆయన పేర నెలకొల్పిన చౌడయ్య మెమోరియల్ హాల్.
మన ఆంధ్రుల సమర్థతను మన వాళ్లే మెచ్చుకోలేరు.
పవిత్రమైన సంగీతం వేరు. ప్రారబ్దం కొద్దీ తప్పనిసరిగా వినవలసిన సంగీతం వేరు - మొదటి రకాన్ని ఆనందించే సంస్కారాలు తగ్గిపోయారు. రెండో రకమైనదే అసలైన సంగీతమని భావించేవారే ఎక్కువ. పురుషులందు పుణ్య పురుషులు వేరన్నట్లుగా దివ్యమైన సంగీతాన్ని ఆరాధించి అందులోనే రమించిన మహానుభావులను సాధారణమైన శ్రోత అందుకుని ఆనందించలేడు. అందుకే అటువంటి నిజమైన కళాకారులు అన్నింటికీ దూరంగా ఉంటారు. దైవదత్తమైన గానం పాడేందుకు మాత్రమే కాదు వినేందుకూ సంస్కారం కావాలి.

- మల్లాది సూరిబాబు 90527 65490