అమృత వర్షిణి

ఆత్మశుద్ధి లేని ఆలాపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకంలో దైవదత్తంగా లభించిన సంగీత విద్య నభ్యసించిన కొందరు సంగీత విద్వాంసులు తమకు తాము చాలా గొప్పవారమనే స్వోత్కర్షతో బ్రతుకుతూ పటాటోపాన్ని ప్రదర్శిస్తూంటారు. అవతలి వారిలో వున్న కాస్త గొప్పతనాన్ని కొండంతలుగా చేసి, ఆ మహా విద్వాంసుల ముందు ‘మేమెంత’ అనే అణకువ భావంతో తమ గొప్పతనాన్ని కాసె్తైనా బయటకు ప్రదర్శించని మహా విద్వాంసులు బహు అరుదు.
ఈ కోవకు చెందిన వారికి సన్మానాల మీద గానీ, సత్కారాల మీద గానీ, మమకారం వుండదు. పైపెచ్చు వారికంటే తక్కువ స్థాయిలోని వారికి గండపెండేరాలు తొడిగి, ఏనుగు అంబారీ మీద ఊరేగించినా ఏ మాత్రం చలించరు. పైగా మనస్ఫూర్తిగా అభినందించటం కూడా కద్దు.
ఇంకొందరుంటారు. ఎంత గొప్ప వాడైనా ఇంకొందరుంటారు. ఎంత గొప్పవాడైనా తమ గోటికి తగనట్లుగా అపహాస్యం చేస్తూ అవహేళనగా మాట్లాడుతూంటారు.
మనలో ఈ ‘నేను’ అనే పొర తొలిగితే గానీ ‘యథార్థం’ బోధపడదు. తెలుసుకునే ప్రయత్నం చేస్తే గదా? మహా యోగులంతా చేసిన తపస్సు ‘ఈ ఇగోను జయించటానికే.’ ఈ మాయ ఒక్క సంగీతమే కాదు. ప్రతి రంగంలోనూ ఆవరించి ఉంది. సంగీతం ఒక ప్రవహించే నది. గంగా ప్రవాహం. అందులో ఎవరు మునిగినా పునీతులౌతూనే వుంటారు.
సంగీత మూర్తిత్రయం వారి కీర్తనలు ఎన్నో దశాబ్దాలుగా వింటూనే వున్నాం. ఆనందిస్తూనే ఉన్నా ఎప్పుడైనా విసుగనిపించిందా?
ఒక్కో రాగం ఒక్కొక్కరి గొంతులో ఒక్కోలా వినిపిస్తుంది. ఒక్కో రూపంలో కనిపిస్తుంది. అందరికీ ఆ ఏడు స్వరాలే దిక్కు. అయినా నిన్న విన్న సినిమా పాట మరుసటి రోజుకు పాతబడిపోతుంది. నేడు విన్న పాట రేపటికి మరుగున పడిపోతుంది. కానీ ఎన్నిసార్లు విన్నా ఎందరు పాడినా త్యాగరాజ కీర్తనలలోని నవ్యత్వం చెడదు. చెదరకుండటానికి ఏమిటి కారణం? ఆ కీర్తనను వెన్నంటి వున్న ఎప్పటికీ మాయని రాగం. నిత్య చైతన్యవంతమైన, శుద్ధమైన, పవిత్రమైన, జీవనది కాబట్టే. రాగాలు అనంతం, అరిగిపోవు. తరిగిపోవు. నిండుకోవు. సంప్రదాయ సంగీతంలోని మజా అదే మరి.
సంప్రదాయాన్ని ఆశ్రయించిన సంగీతం శాశ్వతం -కానిది ఎప్పుడూ అశాశ్వతమే. సినిమా సంగీతానికి బద్ధ శత్రువులు ‘బాగా సంగీత జ్ఞానం కలిగిన విద్వాంసులే.’
భావం ఎలా వుంటే ఫలితం అలా ఉంటుంది. స్వరాల సారం రాగం. అన్ని రాగాలకూ శ్రుతి మూలం. ఆ నారాయణుడు శ్రుతి సాగరుడు. శ్రుతిలో నుంచి రాగాలు, స్వరాలు ఏర్పడ్డాయి. భాష వికసించింది. కాల తత్త్వం నుండి ‘లయ’ పుట్టింది. ఈ దృష్టిలో గాయకులు పాడాలని త్యాగరాజు వాంఛించాడు. ఇప్పుడు అలా సంగీతం మనకు వినబడుతోందా? లయ ప్రధానమైనదే సంగీతమని వాదిస్తూ సునాదాన్ని సుదూరం చేసే మహానుభావులు గొంతులో గమకాలన్ని పలికించలేక, వారి తెలిసిన జ్ఞానంతోనే పాడుతూ అదే సంప్రదాయమని వితర్కించే విద్వాంసులున్నారు.
సంప్రదాయ సంగీతానికి గౌరవం తెస్తూ వారు పాడిన సంగీతం మనస్సులో కుదురుకుని స్థిరంగా వుండిపోయేలా గానం చేసే మహాజ్ఞాన సంపన్నులు వీరికి బద్ధ శత్రువులు.
ఎవరి దోవ వారిది. ఎవరి బాణీ వారిది. ఎవరికి వారే గొప్పగా పరిగణించుకుని దివ్యమైన సంగీతాన్ని విమర్శించి బ్రతికే అల్ప జ్ఞానులున్నారు. సంగీత లోకంలో ఇది సహజమేనేమో? ప్రతి యేడూ త్యాగరాజారాధనోత్సవాలు ఆయన పుట్టి పెరిగిన తిరువయ్యారులో ఎంతో ఘనంగా చేస్తారు. ఆడమగా మహా విద్వాంసులంతా ఎంతో డాబు దర్పాలొలికిస్తూ కూర్చుని చేతులతో తాళాలు వేస్తూ టీవీలో బాగా కనిపించాలని ఉవ్విళ్లూరుతూ పాడుతూంటారు. గమనించే వుంటారు. సంగీత జ్ఞానం బొత్తిగా లేని సామాన్య శ్రోతలకు తెలియదు. నిజానికి త్యాగరాజ కీర్తనలే కాదు ఏ కీర్తన పేరు చెప్పినా గమకాలన్నీ ఒక గాయకుడికీ, మరో గాయకుడికీ ఒకేలా ఒదగవు. కంఠాల్లో ఒకేలా పలకవు. అందులోని సంగతులన్నీ కలవకుండానే కలిసినట్లుగా భ్రమించి పాడటమే విశేషం. ఎంతో సాధన చేస్తే గానీ ఇద్దరు గాయకులు కలిసి పాడటం చాలా కష్టం. అలాంటిది మూకుమ్మడిగా కలిసి బృందగానంలా కలబడి పాడేసేవి కావని తెలిసినా ఈ త్యాగరాజ పంచరత్న కీర్తనలు - అలాగే పాడేయటం విశేషం.
పంచరత్నాలు చాలా ఉన్నాయి. కానీ ఈ పంచరత్నాలకు ప్రాముఖ్యత ఎక్కువ. ఈ ఐదు పంచరత్నాల్లో ఓ కీర్తనలో మానవ స్వభావాన్ని చక్కగా చిత్రీకరిస్తూ అవివేకులు, మందభాగ్యులు, కడుపే కైలాసంగా బ్రతికేవారు, రాజస తామస గుణాలతో వెర్రివేషాలేసే పది రకాల వారిని చల్లగా ఎండగట్టేశాడు త్యాగయ్య. దీనికి దుడుకు అనే మాటను తగిలించాడు. ఇతరులను విమర్శిస్తే వీధికెక్కుతారు. తట్టుకోగలరా? తెలివిగా ఆ దుడుకులన్నీ తనలోనే వున్నాయని అవన్నీ తనకే ఆపాదించుకుని పాడుకున్నాడు. అజ్ఞానం, భక్తి లేకుండా పాడటం, పర ధనకాంక్ష, సుఖ లాలసత్వం, కాంతాసక్తి, ఈ షణత్రయం, మొదలైనవన్నీ దుడుకులుగా పేర్కొన్నాడు. అంతేకాదు. లోకంలో కొందరు గాయకులు చేసే అవకతవక పనుల్ని బాహాటంగా ముఖం బద్దలు కొట్టి మరీ చెప్పాడు.
మాటల్లోనే వైరాగ్యం కనిపిస్తుంది. కానీ చేతల్లో వుండదన్నాడు.
క్షుద్రులన్నాడు. అంతేనా? తమ నాద విద్యచేత ఆకర్షింపబడే స్ర్తిలను వశం చేసుకోవడానికి తహతహలాడే మహా గాయకుల్ని ఉతికి ఆరేశాడు.
ఉత్తమ గాయకుల్ని చేస్తామని భ్రమపెట్టి సర్వం దోచుకునే సన్నాసుల్ని వదల్లేదు. సంగీతం పేరు చెప్పి ఆత్మవికాసం లేని అటువంటి వాళ్లను శిలాత్ములన్నాడు. ఎందరో మహానుభావుల్ని కీర్తించాడు. శుద్ధమైన మనసుచే సుస్వరంతో పద్దు తప్పక భజించే భక్తులను పాలించే త్యాగరాజ నుతుడిని నెత్తిన పెట్టుకుని పూజించాడు. గాయకులు తన కీర్తనల్లో మనకు చీవాట్లు పెట్తున్న సంగతి పెద్దగా పట్టించుకోకుండా దృష్టి సంగీతం మీద పెట్టి, అసలు విషయాన్ని దాటవేసి, గానం చేస్తారనిపించటం సహజం. నిజం కూడా.
ఒక నాణానికి బొమ్మా బొరుసూ రెండూ వుంటాయి.
సంసారం అనే మాటకు తమిళంలో ‘్భర్య’ అనే అర్థం ఉంది. కొడుకులుండి, కూతుళ్లు లేకపోతే అదో విచారం. కేవలం కూతుళ్లే వున్నా కొరతే. అలా అలా సంసారం పెరుగుతూ పోతుంది. సంసారానికి డబ్బు కావాలి. ఎంత కావాలంటే దీనికి జవాబు ఎవరి దగ్గరా వుండదు.
‘చాలు’ అనే వాడీ లోకంలో ఎవరూ ఉండరు. ఏదో కూడబెట్టామనుకుంటే దాన్ని కాపాడటం మరో సమస్య. మిగిలేది ఏతావతా దుఃఖం ఒక్కటే. రోజులు గడవాలి. దారీతెన్నూ కనిపించదు. త్యాగరాజు మాత్రం నిరాశావాది కాదు. సంసారంలో వుంటూనే సాధించాడు. అన్ని దుడుకుల నివారణకూ మార్గం భక్తి ఒక్కటే. అదే చక్కని రాజమార్గం’ అన్నాడు.

- మల్లాది సూరిబాబు 90527 65490