అమృత వర్షిణి

ఎంత నేర్చినా సఫలమేమి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసుకు ప్రతిరూపమే మనిషి. స్థూల రూపంలో కనపడేది మనిషి. కనిపించనిది మనసు.
రక్తంలో తెల్లకణాలు, ఎర్రకణాలు పుట్టి పెరుగుతూ, తరుగుతూ ఎలా ఉంటాయో మనసులో పుట్టే సంకల్ప వికల్పాలూ అంతే. ఏ కారణమూ కనిపించదు. కొందర్ని చూస్తే పెట్టబుద్ధి మరి కొందరు కనిపిస్తే తిట్ట బుద్ధి.
పశుపక్ష్యాదులు వేటికీ లేని ఈ (అవ) లక్షణం కేవలం మనిషికే ప్రసాదించి భగవంతుడు తన చిత్తం వచ్చినట్లు ఆడుకుంటూ ఆనందిస్తూంటాడు. ఆయనకదో సరదా.
త్రిగుణాలనూ గ్రహించి పంచభూతాలనే కొమ్మలతో ‘సంసార వటవృక్షం’ తయారై కూర్చుంటుంది. ఒకరికొకరు జీవికా జీవుల్లా బతికిన ఒకనాటి తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్లు, అత్తమామలు, అన్నదమ్ములు, అన్నాచెల్లెళ్లు, తోటికోడళ్లు ఇలా జంట కొమ్మల్లా సంసారం పెరుగుతున్న కొద్దీ క్రమంగా అభిప్రాయాలు మారుతూంటాయి. అభిరుచులు మారుతాయి. అంతరంగాలు వేరవుతూ క్రమంగా పరస్పర అవగాహనల్లో తేడాలొస్తూంటాయి. విడిగా బ్రతుకుదామనుకుంటూ అసూయా ద్వేషాలతో రగిలిపోతూంటారు. సర్వసాధారణంగా ఈ అన్ని జంటల్లోనూ స్ర్తియే కారణమై కేంద్రబిందువై నిలుస్తుంది. ఆమె మాటకు తప్పనిసరిగా విలువ ఇవ్వవలసిన అగత్యం ఏర్పడుతుంది. ఇందులో అంతశ్శత్రువులు చేసే గారడీ అమోఘం. పైకి ఏమీ కనపడదు. చాపకింద నీరే. మనం గమనిస్తే, సృష్టిలో ఒక గమ్మతె్తైన ఏర్పాటుంది. ఎదుటి వారిని గురించి మంచి భావనలు కలిగినప్పుడు ఆ ఎదుటి వారికి అవి అంది మేలు జరిగేలా, ఒకవేళ ఎదుటివారిని గురించి చెడ్డ భావనలు పుట్టినట్లైతే అవి తిరిగి వచ్చి అలా చేసిన వారినే ఇబ్బంది పెట్టేటట్లుగా ఓ ఏర్పాటుంది. యధార్థాన్ని కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసుగార్ని ‘ఏమిటి దాసుగారూ! మీరలా ఉన్నదున్నట్లు ముఖం మీద చెప్పేస్తే బాధపడరా? సిగ్గుపడరా?’ అని దాసుగారినే అడిగాడొకడు.
‘అలా చెప్పకపోతే వాళ్లకెలా తెలుస్తుందిరా? పెద్దలైన వారు పనికట్టుకుని చెప్పి తీరాలి. వినటం వారి ధర్మం. వినకపోతే వాళ్ల ఖర్మం’ అనేవారుట. ఇప్పుడా పరిస్థితులు లేవుగాక లేవు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుండేవి. ఇచ్చి పుచ్చుకునే ధోరణే తప్ప విడివిడి ఆలోచనలంటూ ఉండేవి కావు.
కుటుంబ పెద్దకు భయపడేవారు. ఆయన నిర్ణయానికి కట్టుబడేవారు. అత్తమామలు, నలుగురు కోడళ్లు, కొడుకులు, మనవలు, మనవరాళ్లతో ఏకాభిప్రాయమే లక్ష్యంగా సంసారాలు సాగుతూండేవి. జీవనం నిజాయితీగా వుండేది. కడుపునొప్పి వచ్చినా, కాలునొప్పి వచ్చినా కాసుకుని ‘నేనున్నాననే’ ధైర్యమిచ్చే మనుషులంటూ ఉండేవారు. వంతులవారీగా సేవ చేసేవారు. ముఖ్యంగా స్ర్తిలే దీనికి ప్రధాన పాత్ర వహించేవారు. తప్పించుకు తిరగటం తప్పులెన్నడమే పనిగా మాట్లాడటం ఎరుగని తల్లులుండేవారు.
యథా రాజా తథా ప్రజా అననట్లుగా ఋజువర్తనంతో నడిచే పెద్దలుంటే తదనుగుణంగానే మిగిలిన కుటుంబ సన్యులు నడుచుకోవటంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడా పరిస్థితి లేదు. ధనమూల మిదం జగత్. వ్యవహారమంతా దీని చుట్టూ తిరుగుతోంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదు. ఎవరికి వారే యమునా తీరే. చిన్నకూ పెద్దకూ మాటకు గౌరవమిచ్చే మానసిక స్థితి పోయింది.
లోకంలో తనకు తెలిసినదే ధర్మమనీ, ఎదుటి వారిదే పొరబాటని వాదించే వారి సంఖ్యే ఎక్కువ.
సమస్యలన్నిటికీ ఇదే కారణం. చిన్నచిన్న భేదాభిప్రాయాలున్నా ఒకప్పుడు పెద్ద మనుషుల మాటకు విలువనిస్తూ సర్దుకుపోయేలా వ్యవహరించేవారు. పరువు మర్యాదలకు ప్రాధాన్యతనిస్తూ కలివిడిగా తిరిగేసేవారు. క్రమంగా అన్నీ మరిచిపోయేవారు.
ఇదంతా గతం గతః. భూమ్యాకాశాలకు ఏ మార్పూ లేదు. మార్పు మనిషికే. కాలమాన పరిస్థితులలో సంభవించే ఈ మార్పులు ముందే ఊహించిన మహానుభావులు, వారి స్వగతాన్ని మన ముందుంచారు. కారణాల్ని అనే్వషించారు. కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మన లోపాలు మనకు తెలియవుగా.
ఎంత నేర్చినా ఎంత జూచినా
ఎంత వారలైనా కాంత దాసులే

సంతతంబు శ్రీకాంత స్వాంత
సిద్ధాంతమైన మార్గచింత లేని వా

పరహింస పర భామాన్యధన
పర మాన వాప వాద
పర జీవనముల కనృతమే భాషింతురయ్య
త్యాగరాజ నుత
ఎంత నేర్చినా, ఎంత జూచినా
ఎంత వారలైనా కాంతదాసులే॥

ఈ కీర్తన పరమార్థ చింతన లేనివారి కోసమే గానీ, స్ర్తిపురుషులలో ఒకరెక్కువ, మరొకరు తక్కువ అనే భావాన్ని ఎత్తి చూపటం కోసం కాదు.
ఎందుకంటే సంసారంలో స్ర్తి పురుషులిద్దరికీ సమాన బాధ్యత ఉంది. విజ్ఞులైన వారు తప్పించుకు తిరుగుతూ ఏ ఒక్కరూ తమ బాధ్యతను మరొకరిపై నెట్టే ప్రయత్నం చేయరు. చేయకూడదు.
కానీ ఇక్కడే ఉంది తిరకాసు. లోకంలో రెండు రకాలుగా మనుషులుంటారు. సరిగా బ్రతుక కలిగిన తరగతివారు సరిగా బ్రతకలేకపోయిన తరగతి వారు. సరిగ్గా బ్రతికేవారిని చూస్తున్నప్పుడు, ఈ రెండో రకం ఎక్కడో ఒకచోట తప్పు దొరక్కపోతుందా వెతుకుదామనే రంధ్రానే్వషణ చేసేవారుంటారు. సరిగా జీవించలేని వారిని చూసి హేళన చేయాలనిపించే వారుంటారు. వారి కదో ముచ్చట. ఎగతాళిగా మాట్లాడాలనిపిస్తుంది. ఎడంగా చూడాలనిపిస్తుంది.
ఇదంతా ద్వేషం నుండి పుట్టుకొచ్చే విత్తనాలే. ఇవే పెరిగి పెరిగీ వృక్షమై మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు తెగిపోయేవరకూ వెళ్తుంది. సరిగా జీవించే వారితో స్నేహం చేయబుద్ధి కాదు. మనసు విప్పి మాట్లాడుకోరు. తమకు తోచదు. ఇతరులు చెప్తే వినరు. గత్యంతరం ఏది?
అరిషడ్వర్గాల ఉద్యోగమే ఇది. మునులు, యోగులూ ముక్కుమూసుకుంటూ తపోభూములకు పారిపోవటానికి ఇదే కారణం.
మూడు పదులు నిండకుండానే ప్రపంచపు వరసను కనిపెట్టేసిన మహానుభావుడు ఆదిశంకరులు - ఎప్పుడో చెప్పేశారు.
బాలస్తావత్క్రీడాసక్తః
తరుణస్తావత్తరుణీ సక్తః
వృద్ధస్తా వచ్చింతా సక్తః
పరమే బ్రహ్మణి కోపినసక్తః
పసిపిల్లలకు ప్రపంచపు వాసన తగలదు. అన్నీ మరచి ఆడుకోవటంతోనే బాల్యం గడిచిపోతుంది.
వారి మంచీ చెడూ బాధ్యతంతా కన్నవారిదే. కాస్త వయసు మీరితే స్ర్తి వ్యామోహం సహజంగా సంక్రమించేదే. ఆఖరి దశలోనైనా వృద్ధుడైన తర్వాత కూడా పొరబాటున వైరాగ్య భావన ఎందుకు రాదో?నని త్యాగయ్యగారు పడిన ఆవేదనకు ప్రతిరూపమే ఈ కీర్తన. ప్రతి మనిషీ తనకు తాను కడిగిన ముత్యమనుకుంటూ మురిసిపోతూంటాడు కానీ పరోపకారమే పుణ్యం పర పీడనమే పాపం, ఇదొక్కటి తెలిస్తే ఇంక రామాయణ భారత భాగవతాలతో ఏం పని? అన్నింటి సారమే ఇది.
‘శుద్ధ ధన్యాసి’ రాగంలో బాగా ప్రచారంగల త్యాగరాజ కీర్తనలలో ఇదొకటి.
నిజాన్ని నిర్ధారించే భావాలతో కూడిన సాహిత్యమంటూ ఒకటి ఉంటుంది. అటువంటి మాటలకు సరిపోయే రాగాన్ని ఎంచుకోవటంలోనే వాగ్గేయకారుల ప్రతిభ కనిపిస్తుంది. త్యాగరాజాది వాగ్గేయకారుల మనోవీధుల్లో ముందుగా తారాడినవన్నీ రాగాలే. ఆ తర్వాతే సాహిత్యం వచ్చేది. నిత్యం రాగసముద్రంలో ఈదులాడిన వారికి, తెలిసినట్లుగా గట్టుమీద కూర్చుని చూసే వారి లోతెలా తెలుస్తుంది? ఏయే రాగం ఎంతెంత భావాన్ని మనసుకు చేరుస్తుందో తెలిసిన త్యాగయ్య వాగ్గేయకారుడు, నాదయోగి, సద్గురువు. అందుకే ఆయన కీర్తనలు నిత్యానంద ప్రదాతలు. ఎప్పుడు విన్నా అప్పుడే విన్న అనుభూతినిస్తాయి. ఆశువుగా వారి మనోవీధుల్లో అల్లుకున్న భావాలే అక్షరాలుగా మారాయి. అంతే.
‘ఎంతవారలైనా కాంత దాసులే’ అనే మాట త్యాగయ్య గారి నోటి వెంట ఎందుకు ఎలా వచ్చిందీ? కారణమొక్కటే. రామాయణ భారతాల్లో స్ర్తి చుట్టూ తిరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. సముద్రానికి ఇవతల అయోధ్యలోని రామ వనవాసానికి కారణమైన మంధర, అరణ్యంలో తారసపడిన శూర్పణఖ శ్రీరామాయణాన్ని ఒక మలుపు తిప్పేశారు.
అరణ్యవాసంలో వున్న సీతారాములు శూర్పణఖ కంటబడ్డారు. రాముణ్ణి చూసి శూర్పణఖకు మదన తాపమావేశించింది. మోహపడింది. శృంగభంగమై ముక్కు చెవులు కోయబడి, వెళ్లి తన పరాభవాన్ని రావణాసురుడికి చెప్పింది. అంతవరకూ బాగానే ఉంది. తన ప్రారబ్దం కొద్దీ ముక్కు చెవులూ పోగొట్టుకున్నందుకు ఏడవటం పోయి, సీత సౌందర్యాన్ని పొగడుతూ రావణాసురుడి బుర్ర కాస్తా పాడుచేసింది. స్ర్తి బుద్ధి ఎంత ప్రళయాంతకమో చూడండి. దీనంతటికీ మానసిక దౌర్బల్యం ప్రధానమైతే అక్క అయినా చెల్లెలయినా భార్య అయినా దిక్కుమాలిన బుద్ధి అందరికీ ఒకటే. పరిణామాలను గురించి ఆలోచించరు. పరువు పోగొట్టుకుంటారనటానికి ఇది చిన్న ఉదాహరణ. పరులను అకారణంగా హింసించటం, పరస్ర్తిలను చెఱచటం, పర ధనాన్ని తేరగా దోచుకోవటం, నిష్కారణంగా ఎదుటివారిని దుర్భాషలాడుతూ బాధించటం, తన స్వార్థం కోసం ఎదుటి వాళ్లను బలి చేయటం ఇవన్నీ ఎవరికుంటాయి? రావణాసురుడి లాంటి రాక్షసులకే. కట్టుకున్న భార్య చెప్పినా, మగాడు చెప్పినా అందులో ధర్మం ఉందా లేదా అని ఆలోచన లేక ఎంత పండితుడైనా ఆడవారి మాట పట్టుకు వేలాడితే, కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లే. తెలుసుకోకుండా ప్రవర్తిస్తే నెత్తి మీద పది తలకాయలున్న రావణాసురుడికి పట్టిన గతే ఎవరికైనా?’ అంటూ త్యాగయ్య ఎంతో ఆవేదన చెంది పాడుకున్న కీర్తన.
శ్రీరామాయణ కథను తన రక్తంలో జీర్ణించుకున్న త్యాగయ్య ప్రతి పాత్ర స్వభావాన్నీ తన అంతరంగంలో ఆవిష్కరించుకున్నాడు కాబట్టే ఆయన భావాలకు అద్దం పట్టే ఆణిముత్యాల్లాంటి కీర్తనలు వెలువడ్డాయి. అస్మదాదులకు శ్రవణపేయాలయ్యాయి.

- మల్లాది సూరిబాబు 90527 65490