అమృత వర్షిణి

తేనె పాటల తోటమాలి.. ఇంద్రగంటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతరిక్షంలో, ఎక్కడో ఏ లోకాల్లోనో కొలువైయున్న పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునే ఒకే ఒక మార్గం.. హాయిగా గొంతెత్తి కీర్తిస్తూ గానం చేయటమే. మరే దగ్గరదారులూ పనిచేయవు. అందుకే భక్తాగ్రేసరులంతా ఈ మార్గానే్న ఎంచుకున్నారు. దీనికి ఆర్ద్రత కావాలి. భావనాబలం, భాషా సౌలభ్యం.. రెండూ పెనవేసుకుని దర్శనమివ్వాలి. ఈ లక్షణాలన్నీ పుష్కలంగా వున్న కవులను ఆశ్రయించిన గాయకులు వారి ప్రతిభకు పట్టం కట్టారు. ఆనందంగా పాడుకుంటూ తన్మయులౌతారు. రాగానికి భావం జంట- గీతానికి సంగీతమే జంట.
పాటలోని భావం శ్రోతల మనస్సులో స్ఫుటంగా ముద్రవేయడానికి ఏ గమనంలో ఏయే గతుల్లో నడిపితే రాణిస్తుందో, తన సాహిత్యం ఎలాంటి సంగీతంతో జతకడితే ప్రాణం పోసుకుని పరవశమై చిందువేస్తుందో ఆ మర్మం బాగా తెలిసిన మధుర కవి మా శ్రీకాంతశర్మ.
గేయానికి ఎక్కువ నగలు తొడిగేయకూడదు. శబ్దాలంకారాలు, పెద్దపెద్ద సమాసాలు, గతిభేదాలతో ఆ పాట ఉక్కిరి బిక్కిరైపోతుందని బాగా తెలిసిన కొద్దిమంది భావకవులలో శర్మ ప్రముఖుడు. కాబట్టే ఆయనకు అంత పేరు. మిత్రుడవడం నాకు గర్వకారణం. కవిత్వానికీ, సంగీతానికి చాలా దగ్గర సంబంధముంది. వౌనంగా ఓ మూల కూర్చుని చదువుకునేవి కథలు, కథానికలు, నవలలూ- పదిమందీ వినేలా, విని మెచ్చుకునేలా, ఎలుగెత్తి హాయిగా పాడేది పాట. ఆ పాట రామబాణంలా తిన్నగా రసికజన హృదయాలకు చేరిపోవాలి.
కవులూ గాయకులూ కళాకారులూ పండితులూ పామరులూ విజయవాడ ఆకాశవాణి కేంద్రాన్ని ఒక బృందావనంగా భావించి దర్శించుకున్న ఆ రోజుల్లో తన సుమధుర గీతాలతో, సుస్వర పరిమళాలను వెదజల్లిన తోటమాలి శ్రీకాంతశర్మ. ఊహాతీతమైన శైలితో, ఒక ఒరవడితో కవితలల్లి, కథలు చెప్పి, పదికాలాలపాటు రసహృదయాలలో శాశ్వతంగా నిలిచేలా పసందైన పాటలల్లి హాయిగా పాడుకోమని చెప్పి వెళ్లిపోయిన మా శ్రీకాంత శర్మనూ ఆయన జ్ఞాపకాలను ఎలా మరుగవలను?
కొందరి ఆలోచనల సమాహారమే ఆకాశవాణి. అదే ఓ గమనాన్ని నిర్దేశిస్తుంది- దిశానిర్దేశం చేస్తుంది. గగనవాణీ క్రియా కలాప చక్రవర్తులలో నేను సన్నిహితంగా మెలిగినవారు కొందరే. వారిలో ఒకరు ఉషశ్రీ, మరొకరు శ్రీకాంతశర్మ, మూడవ వ్యక్తి శ్రీరామమూర్తి (రామం). ఒకర్ని మించినవారు మరొకరు. వివిధభారతిలో మేమిద్దరం కొన్ని దశాబ్దాలపాటు ప్రత్యేక కార్యక్రమాలు సమర్పించేవాళ్ళం. శ్రవణ మాధ్యమానికీ, సృజనాత్మకతకూ అర్థం చెప్పగల శ్రీకాంతశర్మ, శ్రీరామమూర్తి రూపొందించిన కార్యక్రమాలు పదికి పైగా జాతీయ స్థాయిలో ఆకాశావాణి వార్షిక పోటీలలో బహుమతులు గెల్చుకోవటం ఆకాశావాణికే గర్వకారణం. శ్రీకాంత శర్మ, రామంలతో ముడివేసుకున్న బంధం నాది. శ్రీకాంతశర్మ రచించిన రూపకాలకు తన మేథాశక్తిని జతచేసి, రామం రూపొందించిన కార్యక్రమాలతో ఆకాశవాణి కీర్తి ఆకాశమంత ఎదిగిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఆకాశవాణి వినబడే మాథ్యమం, టీవీ మాధ్యమంలా అందులో కనపడేవి ఏవీ వుండవు. కానీ అనుభూతికి తగ్గ ఆకృతి తప్పకుండా వుంటుందని నమ్మి నిరూపించిన భావుకులు ‘శర్మ- రామం’.
కథ, నటన, సంగీతం, కల్పన, ధ్వని, ఎఫెక్ట్‌లు, కాస్సేపు నిశ్శబ్దం, మరికొంతసేపు శబ్దం- ఇలా ఎన్నో ప్రయోగాలు చేసి వినేవారికి ఏదో సినిమా చూస్తున్న అనుభూతిని కల్గిస్తూ ఓ శబ్ద చిత్రాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించిన ఘనుడు రామం. ఏవో నాలుగు పాటలు రాసినంత మాత్రాన కవులందరూ యిలాంటి కార్యక్రమాలకు మాటలు రాయలేరు. ఇదొక ప్రజ్ఞ. సంభాషణంటూ లేకుండా కేవలం సౌండ్ ఎఫెక్ట్సుతో పదహారు రకాల సన్నివేశాలను ఊహించగా, ఆ శబ్ద చిత్రాలకు సరిపోయేలా శ్రీకాంతశర్మ చక్కని కవితా వ్యాఖ్యలు రాశాడు. అదో కొత్త ప్రయోగం. ఆ కార్యక్రమం పేరు ‘నిశ్శబ్దం - గమ్యం’.
మనిషి జీవితంలో కష్టంతోపాటు సుఖం, ధర్మంతో అధర్మం, శాంతికి అశాంతి- యిలా రెండు ద్వంద్వాలూ ఉంటూనే ఉంటాయి. ఏ ఒక్కటీ స్థిరంగా ఉండవు.
ఎంత వెలుగుంటే అంతే చీకటి తప్పదు. రెండు చీకట్లమధ్య వెలుగు తోరణమే నరుడు అనే అంశంపై రామం రూపొందించిన ఈ కార్యక్రమంలో గజల్ శైలిలో - రెండు పాదాలలో ఒదిగే శబ్ద చిత్రాలకు రకరకాల రాగాలతో భావాలను ఆవిష్కరిస్తూ నేను పాడిన ద్విపదలు డిల్లీలో కూర్చుని విన్న తెలుగు తెలియని న్యాయ నిర్ణేతల ప్రశంసలు పొంది మా ముగ్గురికీ పేరు తెచ్చిపెట్టింది.
శిలను మల్లె పూచిందట, తెలుసా మీకెప్పుడైనా! అంటూ శిలామురళిని వెలువరించిన శ్రీకాంతశర్మకూ గోదావరి తీరానికీగల అనుబంధం చాలా గొప్పది. వాగ్వైభవం కల చాలామంది కవులకు గోదావరే తల్లి. గలగలా పారే గోదావరి నీరు త్రాగితే సహజంగానే కవిత్వం పుట్టుకురావడం యిందుకే. గాయక వరేణ్యులకు జన్మస్థానం కావేరీ. కావేరీ నీరు తాగిన వారికి సంగీతం అబ్బటం సహజమేనేమో?
రాజమహేంద్రవరంలో గోదావరి గట్టు సాక్షిగా పెనవేసుకున్న మైత్రితో అఖండ గోదావరి అందచందాలన్నీ తనివితీరా అనుభవించిన శర్మకు అనుభూతులకు లోటా? అందులో పడిపోయాడు. గోదావరి ఒడ్డున కూర్చుని గోదావరి ప్రతి కెరటం ఏదో కథ చెపుతుందీ అంటూ ఓ పాట రాశాడు. ఎంత బాగుందో ఆ పాట. ఎంత చక్కని భావుకుడో? అని రాజమహేంద్రవరంలోని గౌతమీ గ్రంథాలయంలో నాలుగున్నర దశాబ్దాల సర్వీసులో శ్రీకాంతశర్మలోని ప్రజా ప్రాభవాలన్నీ అతి సన్నిహితంగా మెలుగుతూ గమనించిన శ్రీకాంతశర్మకు చిరకాల స్నేహితుడు ప్రముఖ కవి పండితుడు సన్నిధానం నరసింహశర్మ చెప్పటంలో ఆశ్చర్యం లేదు. వీరిద్దరూ ఉభయ భాషా పండితులే. శర్మకూ, నాకూ సన్నిహితుడు సన్నిధానం.
వృత్తిరీత్యా నేనో రేడియో ఎనౌన్సర్‌నే. ప్రవృత్తి సంగీతం కావటంతో లైబ్రరీలో నేను విన్న ప్రతి ఘజల్ సంగీతం శర్మకు వినిపించేవాణ్ణి. ఆనందంగా వినేవాడు. హిందూస్థాన్ సంగీతంలో టుమ్రీలకూ, ఘజల్‌కు ఆకర్షణ ఎక్కువ. శాస్ర్తియ సంగీతం ఒక సముద్రమైతే లలిత సంగీతం మన సౌలభ్యం కోసం ఏర్పాటుచేసుకుని నిర్మించుకున్న చిన్న తటాకం లాంటిది.
బంగారు రంగులీనే తామరపువ్వుల శోభతో, పెద్ద పెద్ద అంగలేస్తూ తామరాకులపై నెమ్మది నెమ్మదిగా వాలే కొంగల గుంపు ఒకవైపు ఝుమ్మంటూ ఎక్కడినుంచో వచ్చివాలే మ్రోయు తుమ్మెదలు మరోవైపు నయనానందకరంగా ఎలా శోభిస్తాయో లలిత సంగీతం కూడా అంతే. అలాగే వుండాలని నా భావన. నా గురువు వోలేటి గారు ఈ ఘజల్, టుమ్రీలు విసుగొచ్చేలా వినేశారు. నాకూ అలవాటు చేశారు. నేను శర్మకు అలవాటు చేశాను.
‘‘మేరీ జాన్ నజర్ కరో/ అప్‌నీ వఫా పేష్ కరూఁ’’ అనే మకుటంతో సుప్రసిద్ధ పాకిస్తాన్ ఘజల్ గాకుడు ఉస్తాద్ మెహాదీ హాసన్ పాడిన పాట వోలేటిగారి స్ఫురణకు వచ్చిన మరుక్షణం ఆ ట్యూన్ శర్మకు వినిపించారు. ఉగాదికోసం చేసిన సంగీత రూపకానికి ఈ పాట తయారైంది.
‘‘కాలం కాలం కాలం../ యిది మానవుడే నవభావకుడై
గమనించు ఇంద్రజాలం’’ పాట తయారైంది. నేను పెమ్మరాజు సూర్యారావు, దేవన సుభద్ర, కుసుమకుమారి పాడాం. ఎలక్ట్రానిక్ కీబోర్డు ఈ పాటలతోనే విజయవాడ రేడియో కేంద్రంలో ప్రవేశించింది.
‘నిన్న నిరాశకు రేపటి ఆశకు/ నిండిన రుచుల కటాహం
బ్రతుకు బాటలో నడిచేవారికి/ పన్ని పద్మవ్యూహం..’’
కాలం, కాలం, కలాం/ యిది మానవుడే నవభావకు
గమనించు ఇంద్రజాలం!
ఈ పాట వోలేటి గారిచ్చిన ట్యూన్‌కు చక్కగా ఒదిగిపోయింది. రేడియో లలిత సంగీతంలో ట్యూన్‌కు పాట రాయించే సంప్రదాయం శర్మతోనే ప్రారంభమైందనవచ్చు. ఒకవైపు కలగ కృష్ణమోహన్, మరోవైపు నేను సతాయించి కూర్చోపెట్టి పాటలు రాయించేసుకుని స్టూడియోల్లోకి వెళ్లిపోయే వాళ్ళం. నాకైతే శర్మపాట చేతికిరాగానే మనస్సులో ట్యూన్ తళుక్కున మెరిసేది. విసుక్కోవటం తెలియని శర్మచేత అలా రేడియో కోసం రాయించిన పాటలన్నీ హిట్లే. ఆశ్చర్యమేమంటే, చెట్టుమీదో, ఏ పుట్టమీదో కూడా శర్మ పాటలు రాశినా ఎందుకో నవ నవోనే్మషంగానే కనపడేవి- కొన్ని ఉద్యోగ ధర్మం కొద్దీ అయిష్టంగానే రాసేవాడు. ఒకరు లేక ఇద్దరూ అనుకుంటూ ఆర్యక్రమాలు రేడియోలో ముమ్మరంగా నెత్తిపై కూర్చుని ప్రసారమవుతూండేవి. ప్రత్యేకంగా దీనికి బడ్జెట్‌ండేది. యిటువంటి పాటలకు ట్యూన్లు సాధారణంగా తొందరగా స్ఫురించవు- పాడబుద్ధికాదు.
‘‘నీలాల నీ కళ్ళు వలపు వాకిళ్ళు/ పారాణి ఆదాలు ప్రణయరాగాలు’’ అని ప్రారంభించి ఎక్కడో చరణంలో ‘కుటుంబ నియంత్రణ’ సందేశం గుప్తంగా అమర్చేవాడు. పైకి తెలిసేది కాదు, మహాగడుసరి.
ఈ పాట కె.జె.యేసుదాసు పాడిన కుటుంబ నియంత్రణపై పాడిన పాటంటే నమ్మేవారు కాదు. భక్తమీరాబాయి కృష్ణ్భక్తురాలుగా ప్రపంచానికి తెలుసు. మీరా భజన్‌లు తెలుగులో పాడించాలనే సంకల్పం కలిగింది. హిందూస్తానీ సంగీత ప్రధానమైన ఈ భజన్‌లు శ్రీరంగం గోపాలరత్నం పాడారు. అన్ని పాటలూ వోలేటిగారు ట్యూన్ చేశారు. పాటలన్నీ శ్రీకాంతుడే రాశాడు. హిందూస్తానీ హొయలతో ఒకో పాట ఒక్కో ఆణిముత్యం. ఈ పాటలు అందరూ పాడలేరు. దమ్ముండాలి.
‘‘రారా ప్రియ! దరిశనమీయరా/ నిను వీడి నే నిక మనజాలరా!’’
‘‘సఖియా! నిదురన్నదెరుగనే’’/ ‘‘వలపు సోకి వెర్రినైతినే’’ లాంటివన్నీ గోపాలరత్నానికెంతో పేరు తెచ్చిపెట్టాయి.
కొన్ని పాటలు వోలేటిగారి ఎదురుగా నేనే కండక్ట్ చేశాను. సాహితీప్రియులకు తెలిసిన శ్రీకాంతశర్మ వేరు సంగీత ప్రియులకు తెలిసిన శ్రీకాంతుడు వేరు.
ఫిల్మ్స్ డివిజన్‌లో సంగీత దర్శకుడైన ప్రముఖ వేణుగాన విద్వాంసుడు విజయ రాఘవరావు విజయవాడ వచ్చినపుడు ఈ మాసపు పాటొకటి శ్రీకాంత శర్మ రాశాడు. ఆ పాట గోపాలరత్నం చాలా బాగా పాడారు.
‘తిరునాళ్లకు తరలొచ్చే కనె్నపిల్లలా’ అనే పల్లవితో ప్రారంభమయ్యే పాట. నమ్మండి! ఎంతో పసందుగా వీనుల విందుగా గోపాలరత్నం కంఠంలో ఒదిగిపోయింది. శ్రీరామమూర్తి, శర్మ, నేను ఆ పాట రికార్డింగ్‌లో ప్రత్యక్షంగా కూర్చుని విన్నాం.
రేడియో కేంద్రాల్లో అధికారులూ ఉంటారు, అనధికారులూ, కార్యక్రమ నిర్వహణాభారం వహించేవారూ, సాంకేతిక నిపుణులూంటారు. ఒకరిద్దరు తప్ప చాలావరకూ అందరూ తెరవెనకుండేవారే. కొన్ని ప్రత్యేక అర్హతలతో చేరి, రేడియోకే కీర్తిప్రతిష్ఠలు తెచ్చిన వారిలో శ్రీకాంత శర్మ ప్రముఖుడు.
ప్రగతి లలిత సంగీత ప్రియుడి చేతుల్లోనూ శర్మ రాశిన పొగడపూలు, ఆలాపన పుస్తకాలు కనిపిస్తాయి. శ్రీకాంత శర్మ రాసిన పాటల్లో సగానికిపైగా నేను ట్యూన్ చేసి పాడినవీ, పాడించినవీ ఉన్నాయి. కేవలం వినటానికే పరిమితమైన రేడియోలో ఓ వర్షాకాలపు మేఘగర్జన, ఓ పౌర్ణమి నాటి సాగర ఘోష, కొండ లోయల ప్రతిధ్వనులు, సింహగర్జన, వినీలాకాశంలో రివ్వున ఎగిరిపోయే గువ్వల జంటల కూతలు లాంటి ధ్వని విశేషాలన్నీ కళ్ళారా చూసిన అనుభూతిని తమ రచనలవల్ల సృష్టించగలిగే సృజనాత్మకత కలిగిన రచయితలు, వాటికి తగ్గ ధ్వనులన్నింటినీ మాటలతో జతకూర్చి, ఒక్కసారి అసలు మాటలే లేకుండా కేవలం ఒక్క ఆడియో టేపుల్లో ప్రతిధ్వనింపచేయగల సమర్థులైన, ధ్వని సంయోజకులతో (సౌండ్ టెక్నాలజీ) కలిసి విజయవాడ రేడియో కేంద్రంలో పనిచేయడం నా భాగ్యం.
25-7-19న వెళ్లిపోయిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మకు అక్షర నివాళి

- మల్లాది సూరిబాబు 90527 65490