శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఆనం సోదరులను పార్టీలోకి స్వాగతిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మంత్రి నారాయణ స్పష్టం
* ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన మంత్రి
నెల్లూరు , నవంబర్ 27: ఆనం సోదరులను తెలుగుదేశం పార్టీలోకి సంతోషంగా స్వాగతిస్తున్నామని రాష్ట్ర మున్సిపల్‌శాఖా మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం నెల్లూరు మండల పరిధిలోని కొత్తూరులో ఉన్న వైఎస్‌ఆర్ కాలనీని ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీ అధిష్ఠానం అందరితో చర్చించి జిల్లా నాయకులకు ముందుగా తెలియపర్చిన తర్వాతనే ఆనం సోదరులను పార్టీలోకి ఆహ్వానించినట్లు చెప్పారు. వారి రాకవల్ల జిల్లాలో పార్టీ బలపడుతుందన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి గతంలోనే తెలుగుదేశం పార్టీలో మంత్రిగా, ఎమ్మెల్యేగా కొనసాగారని, వారికి తెలుగుదేశంపార్టీ కొత్తకాదని ఆయన పేర్కొన్నారు. అందరం కలసికట్టుగా ఉండి జిల్లాను అభివృద్ధిబాటలో తీసుకువెళ్లడానికి కృషిచేస్తామని ఆయన తెలిపారు. కాలువ కట్టలపై ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న వారికి ఇతర ప్రాంతంలో అన్ని వసతులతోకూడిన ఇళ్లను నిర్మించిన తర్వాతే అక్కడ నుంచి ఖాళీ చేయిస్తామని ఆయన చెప్పారు. ఒక సంవత్సరంలోగా వౌలిక వసతులు కల్పిస్తామని, అప్పటి వరకు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. వైఎస్‌ఆర్ నగర్‌లో నిర్మించిన ఇందిరమ్మ గృహాల్లో అతి త్వరలోనే వౌలిక వసతులు కల్పిస్తామని, ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. నెల్లూరు నగరం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇలాంటి సమయంలో వర్షాలకు నగరం నీట మునగడం మంచిదికాదని, అందువల్లే పూర్తిస్థాయిలో నగరాన్ని అభివృద్ధి చేస్తామని, కాలువల నిర్మాణాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీని నమ్మి సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నవారు ఎవరైనా పార్టీలోకి రావచ్చునని ఆయన పిలుపునిచ్చారు. నారాయణ విలేఖర్లతో మాట్లాడుతున్న సమయంలో కిలారి వెంకటస్వామినాయుడు ఆనం కుటుంబం గురించి రన్నింగ్ కామెంట్ చేశారు. ఈకార్యక్రమంలో మేయర్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

చేనేత పరిశ్రమకు రూ. 100 కోట్లతో మూలనిధి ఏర్పాటు చేయాలి
* చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చలపతి డిమాండ్
వెంకటగిరి, నవంబర్ 27: చేనేత పరిశ్రమకు 100 కోట్ల రూపాయలతో మూలనిధిని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా చలపతి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం వెంకటగిరి విచ్చేసిన ఆయన రాష్ట్ర గౌరవాధ్యక్షులు పముజుల దశరథరామయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య, నియోజకవర్గ సిపిఐ ఇన్‌చార్జి పి బాలకృష్ణయ్య, పట్టణ కార్యదర్శి రామమూర్తితో కలిసి పట్టణంలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలైన బిసి కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, బొప్పాపురం తదితర ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. చేనేత కార్మికులకు జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత కార్మికులకు కనీసం 30 వేల రూపాయలకు తక్కువ లేకుండా ఇవ్వాలని, మరో 50 కేజీల బియ్యాన్ని ప్రభుత్వం అందజేయాలన్నారు. చేనేత సహకార సంఘాల దగ్గర ఉన్న చేనేత వస్త్ర నిల్వలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, శ్రీనివాసులు, శివకుమార్ పాల్గొన్నారు.

వెనుకబడిన కులస్తుడి వెంట నడవక లేక వెళ్లిపోయారు
* పదవులు అనుభవించి కాంగ్రెస్‌పై నిందలా..
* ఆనం సోదరులపై రాష్ట్ర బిసి సెల్ నాయకుడు రఘురామ్ ముదిరాజ్ విమర్శ
నెల్లూరుసిటీ, నవంబర్ 27: రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి వెనుకబడిన కులస్తుడు కావడంతో ఆనం సోదరులు ఆయన వెంట నడవలేక కాంగ్రెస్ పార్టీని వీడారని రాష్ట్ర బిసి సెల్ నాయకుడు కనకట్ల ముదిరాజ్ విమర్శించారు. శుక్రవారం ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన వ్యక్తులుగా ఉండి మంత్రి పదవులు అనుభవించిన ఆనం సోదరులు అధికారం దాహం కోసం పార్టీని వీడి వెళ్లిపోయే వాళ్లు వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీపై నిందలు వేయడం మంచిది కాదన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర విభజన జరిగితే 13 జిల్లాల ప్రజానీకం, రైతాంగం నష్టపోతారని విభజన చేయకుండా ఒప్పించేందుకు ఒక టీమ్‌ను తయారుచేస్తే అందులో ఆనం రామనారాయణరెడ్డి లేకుండా వెళ్లి పోయి ముఖ్యమంత్రి పదవి కోసం కెవిపితో సమావేశమై, సిఎం పదవి కోసం వెంపర్లాడలేదా అని ప్రశ్నించారు. గతంలో ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీని వీడేదిలేదని చెప్పిన ఆనం సోదరులు వారి ప్రాణాలు ఇప్పుడు ఎవరు చేతిలో ఉన్నాయో అర్థం కావడం లేదన్నారు.
29న పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి రాక: ఉడతా
చిత్తూరు, నెల్లూరు జిల్లాలో కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలను పరామర్శించేందుకు ఈ నెల 29న రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి నెల్లూరు రానున్నట్లు పిసిసి కార్యదర్శి ఉడతా వెంకట్రావు తెలిపారు. చిత్తూరు, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు, నెల్లూరులో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. నెల్లూరులోని వరద ముంపు ప్రాంతాలైన ఇరుకళల పరమేశ్వరి నగర్, మన్సూర్ నగర్‌లలో పర్యటించి వరద బాధితులకు అండగా నిలిచేందుకు వస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు భవాని నాగేంద్రప్రసాద్, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు బాలసుధాకర్, మురళీ కృష్ణయాదవ్ పాల్గొన్నారు.

పార్టీలో చేరక ముందే... సోమిరెడ్డికి ఆనం వివేకా ఝులక్ !
నెల్లూరు, నవంబర్ 27: తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎంఎల్‌సి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఆ పార్టీలో నూతనంగా చేరనున్న మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఝలక్ ఇచ్చిన వైనమిది. శుక్రవారం మధ్యాహ్నం 12.30గంటలకు సోమిరెడ్డి నెల్లూరులోని తన కార్యాలయంలో విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ తరువాత అర్ధగంట సేపటి వరకు కూడా హాజరైన పాత్రికేయుల సంఖ్య పలచగానే కనిపించింది. ఏంటయ్యా... మీ వాళ్లు ఇంకా రాలేదని హాజరైన విలేఖర్లను ఉద్దేశించి సోమిరెడ్డి ఆరా తీశారు. సార్... ఏసి సెంటర్‌లో ఆనం వివేకా కూడా ప్రెస్‌మీట్ పెట్టారు... మా వాళ్లు అక్కడున్నారని ఓ విలేఖరి బదులిచ్చారు. ఏందయ్యా... ఆయన ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడా అంటూ సోమిరెడ్డి విస్తుపోయారు. సార్ అక్కడ ఇంతవరకు ప్రెస్‌మీట్ మొదలే కాలేదు అంటూ హాజరైన విలేఖర్ల నుంచి సమాధానమొచ్చింది. అదేంది.. ఇద్దరమూ ముందుగానే చర్చించుకున్నాము కదా! 11.30 గంటలకు ఆయన ప్రెస్‌మీట్. ఆ తరువాత గంటకు నాది అంటూ సోమిరెడ్డి ఆశ్చర్యపోతూ బదులిచ్చారు. ఇలా చేస్తే ఎలాగంటూ విలేఖర్ల వద్ద సోమిరెడ్డి పేర్కొన్నారు. ఇంతకీ ఆనం వారు చేరికపై మీరేమంటారనే విలేఖర్ల ప్రశ్నకు సోమిరెడ్డి రెండు ముక్కల్లోనే క్లుప్తంగా బదులిచ్చారు. వచ్చే వాళ్లెవరైనా పార్టీకి, నాయకుడికి విధేయులుగా ఉంటే తప్పక స్వాగతిస్తామని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఇంకా పార్టీలో చేరక ముందే ఆనం వివేకా సోమిరెడ్డికి ఝులక్ ఇచ్చిన సంగతి అక్కడ హాజరైన పాత్రికేయులందరికీ అర్థమైంది.

వరద బాధితులకు దుప్పట్ల పంపిణీ
గూడూరు, నవంబర్ 27: గూడూరు పురపాలక సంఘ పరిధిలోని 3వ వార్డులో శుక్రవారం పిఎస్‌ఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో వరద బాధితులకు పురపాలక సంఘ చైర్‌పర్సన్ పి దేవసేన, ప్రముఖ పారిశ్రామిక వేత్త పి శివకుమార్ రెడ్డి దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ తమ ట్రస్టు ఆధ్వర్యంలో ఇప్పటికే వరద బాధితులకు 2 వేల దుప్పట్లను పట్టణంలోని పలువార్డుల్లో పంపిణీ చేశామని, వరదల్లోనష్ట పోయిన అన్ని కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

మేము సైతం.. వరద బాధితులకు హిజ్రాల సాయం
నెల్లూరు, నవంబర్ 27: వారిని చూస్తేనే అందరికీ అలుసు. చూడగానే నవ్వుకుంటారు. అడుగడుగునా నవ్వులపాలయ్యే వారు మాత్రం సమాజ సేవలో మేము సైతం అంటూ ముందుకొచ్చిన వైనమిది. శుక్రవారం నెల్లూరు హిజ్రాలు వరద బాధితులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేసి తమ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మాన్సూర్‌నగర్‌లో అరవై మందికి చీరలు, దుప్పట్లు అందజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి హిజ్రాల సంఘ అధ్యక్షురాలు అలేఖ్య మాట్లాడుతూ గత మూడు దశాబ్దాల్లో ఇంతటి భారీ వరద చూడలేదని వాపోయారు. తమను ఎవరేమని హేళన చేసినా సేవా కార్యక్రమాల్లో వెనుకడుగు వేసేది లేదన్నారు. కార్యక్రమంలో హిజ్రాల సంఘ ప్రతినిధులు కల్పన, మయూరి, కావ్య, వైష్ణవి, శ్రీదేవి, హీనా, శిల్ప, తదితరులు పాల్గొన్నారు.

రైల్ ఢీకొని ఒకరు మృతి
నెల్లూరు, నవంబర్ 27: రైలు ఢీకొని ఒకరు మృతిచెందిన సంఘటన నగరంలోని విజయమహల్ గేట్ సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు మృతుడు సుమారు 50 ఏళ్ల వయస్సు కలిగి, రోజ్‌కలర్ షర్ట్ నల్లఫ్యాంట్ ధరించి ఉన్నాడు. శుక్రవారం రాత్రి 8గంటల సమయంలో పట్టాలు దాటుతుండగా విశాఖపట్నం నుంచి చెన్నై వైపువెళ్లే గూడ్సు రైలు ఢీకొని మృతిచెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీస్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

హైవేపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు
నెల్లూరు, నవంబర్ 27: నెల్లూరు జిల్లాలోని జాతీయ రహదారిపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ అధికారుల సమాచారం మేరకు నగరంలోని బుజబుజ నెల్లూరు సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై శుక్రవారం విజిలెన్స్ డిఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీచేశారు. ఈ తనిఖీల్లో టాక్స్ చెల్లించకుండా వేబిల్లులేకుండా, హెవీలోడుతో వెళ్తున్న ఎనిమిది వాహనాలను సీజ్‌చేశారు. వీటిలో కొన్ని వాహనాలను ఐదోనగర పోలీస్‌స్టేషన్‌కు కొన్ని వాహనాలను వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు.

మహిళపై దాడి
నెల్లూరు, నవంబర్ 27: ఓ మహిళపై నలుగురు మహిళలు దాడిచేసి గాయపర్చిన సంఘటన నగరంలోని కిసాన్‌నగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. రెండో నగర పోలీసుల కథనం మేరకు కిసాన్‌నగర్‌లో నివాసం ఉంటున్న వజ్రమ్మ ఒక ఇంట్లో కింద వాటాలో నివాసం ఉంటోంది. పై పోర్షన్‌లో రజియా దంపతులు నివాసం ఉంటున్నారు. రజియా భర్త రసూల్‌కు చెందిన మోటార్‌సైకిల్‌ను వజ్రమ్మ ఇంట్లో పార్కింగ్ చేసేవాడు. దీంతో వజ్రమ్మకు రజియా కుటుంబ సభ్యులకు తరచూ వాదనలు చోటుచేసుకునేవి. శుక్రవారం ఈ గొడవ కాస్తా పెద్దదై వజ్రమ్మ, ఆమె బంధువు బాలసుబ్రహ్మణ్యం, కుమారుడు, మరో మహిళతో కలసి రజియాపై రోకలి బండతో దాడిచేసి తలపై గాయపర్చారు. దీంతో రజియాకు బలమైన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.

ఎర్ర చందనం పట్టివేత
చిల్లకూరు, నవంబర్ 27: చిల్లకూరు 5వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న బూదనం టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం ఉదయం 9 గంటలకు సీతారామపురం నుండి టెంపోలో 70 ఎర్ర చందనం దుంగలు చెన్నైకి తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారంతో చిల్లకూరు పోలీసులు పట్టుకొన్నారు. సీతారామపురం నుండి ఒక టెంపోలో 40 లక్షల రూపాయల విలువ చేసే 70 ఎర్ర చందనం దుంగలను తీసుకు వస్తుండగా పోలీసులు వెంబడించి పట్టుకొన్నారు. ఈ మేరకు ఆ వాహనాలను స్వాధీనం చేసుకొని చిల్లకూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల అదుపులో ముగ్గురు ఎర్ర చందనం దొంగల ముఠా సభ్యులు ఉన్నట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలను శనివారం డిఎస్పీ కార్యాలయంలో వెల్లడిస్తామని ఎస్సై అంకమ్మ తెలిపారు.