అక్షర

అంగడిబొమ్మల హృదయ విలాపం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనామిక డైరీ
పుటలు: 208, వెల: రు.150/-
ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌హౌస్
- అన్ని బ్రాంచీలు
నవోదయ బుక్‌హౌస్- కాచిగూడ,
హైదరాబాద్
సలీం, ప్లాట్ నం.306, జె.బి.అపార్టుమెంట్స్
దోమల్‌గూడ, హైదరాబాద్.

ఆకాశంలో సగమని చెప్తారు. కానీ వాస్తవ జీవితంలో మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధం. ఈ ఆధునిక అంతర్జాల యుగంలోనూ, స్ర్తిలపై పెనుహింస తప్పడం లేదు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ జరిగే హత్యలకు, అత్యాచారాలకు అంతులేదు. బాల్య దశనుంచి వృద్ధాప్య దశవరకు అనేక రకాలుగా మహిళ హింసకు గురి కాబడుతునే వుంది. విద్యార్థి దశలో రేగింగ్, ఉద్యోగ స్థలాల్లో లైంగిక వేధింపులు, వివాహమయ్యాక గృహహింస తప్పడం లేదు.
పురుషాధిక్య ప్రపంచంలో స్ర్తి ఎంత చదువుకొన్నా, ఉద్యోగం చేస్తున్నా, మేధావి ఐనా, రాజకీయ నాయకురాలైనా పురుషుని దృష్టిలో ఒక భోగ వస్తువు, ఒక మార్కెట్ సరుకు, ఒక అంగడి బొమ్మ. సమాజంలో స్ర్తిలందరూ ఒకే వర్గానికి చెందినవారు కారు. అగ్రవర్ణాలవారు దళితులు, మధ్యతరగతి వారు, వేశ్యలు ఇలా విభిన్న స్ర్తిలు. ఈ వ్యవస్థలో భద్ర జీవితం గడిపేవారు కొందరు. క్షణం ప్రమత్తంగా వుంటే కబళించే తోడేళ్ళమధ్య జీవించేవారు కొందరు. కడుపు నింపుకోవడానికి పడుపువృత్తి చేస్తూ బ్రతికే స్ర్తిల జీవితాలు ఎంత విషాదమయమో ‘అనామిక డైరీ’ నవల చదివితే తెలుస్తుంది. వీళ్ళ జీవితాలలో నవ్వుల పువ్వులు విరియవు. ఆనందాల ఇంధ్ర ధనుస్సులు మెరవవు. ప్రతిక్షణం భయంతో కనిపించని ఒత్తిడితో ఈ సమాజం కత్తుల బోనులో ప్రమాదాల అంచుల్లో బతుకుతుంటారు.
ఆటా- నవ్య వీక్లీ సంయుక్త నిర్వహణలో ప్రథమ బహుమతి పొందిన నవల ఇది. జీవన్మృతులు, కాలుతున్న పూల తోటలాటి నవలలతో రచయిత సలీంగారు ఇంతకుముందే సుప్రసిద్ధులు. కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీతలు. సమాజంలో నిత్యం రగులుతున్న సమస్యలే వీరి కథా వస్తువులు.
అనామిక డైరీలో నాయిక స్వప్న. చిన్న వయస్సులోనే తల్లి మరణిస్తే ఎన్నో కష్టాలుపడుతుంది. ప్రభుత్వ సంక్షేమ హాస్టలులో ఇంటరువరకు చదువుకొంటుంది. చిన్నప్పటినుంచి తనను అభిమానించిన రాములును పెళ్ళిచేసికొంటుంది. రాము పిన్నికొడుకు 18 ఏళ్ళ సందీప్. రాములు జీవితంలో నిలదొక్కుకోవడానికి సహాయం చేస్తూనే అందమైన స్వప్నమీద కన్నువేస్తాడు. రాములు ఆటో నడపడానికి బయటకు వెళ్ళినపుడు ఇంటికి వచ్చి శతవిధాల స్వప్నను లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. స్వప్న ఒప్పుకోకపోతే పగబట్టిన పాములా ప్రవర్తిస్తాడు. రాములుకు తాగుడు నేర్పిస్తాడు. రాములు ఒకరోజు బాగా తాగి రైల్లో ప్రయాణంచేస్తూ ప్రమాదవశాత్తు రైలుకిందపడి మరణిస్తాడు. ఐదేళ్ళ కూతురితో ఒంటరిగా మిగిలిన స్వప్నపై మరింత ఒత్తిడి తెస్తాడు. అనేక విధాలుగా బెదిరిస్తాడు. ఈ బెదిరింపులకు భయపడి స్వప్న ఊరువదిలి హైదరాబాదులో శ్రీజ ఇంటికి వెళ్తుంది తన కూతుర్ని తీసుకొని. స్వప్న వుంటున్న ఇంటి ఓనరు భానుమతి ఆమె అక్క శ్రీజ. ఆమె సినిమాల్లో నటించే జూనియర్ ఆర్టిస్ట్. ఇక్కడినుంచీ స్వప్న జీవితం అనేక మలుపులు తిరుగుతుంది.
స్వప్న శ్రీజ దగ్గర వుంటూ ఏవో చిన్న చిన్న వేషాలు వేస్తుంటుంది కానీ వేషాలు ఎప్పుడూ వుండవుగదా! తన దగ్గర వుండే అమ్మాయిల తిండి తిప్పలు వుండడానికి గదులు, మేకప్ కావల్సిన సరంజామా అన్నీ తనే చూస్తుంది శ్రీజ. ఎంత మంచిదో శ్రీజ అనుకొంటుంది స్వప్న. కానీ వాళ్ళకింద ఖర్చుపెట్టిన ప్రతి పైసాకి లెక్కరాసి వాళ్ళదగ్గర గోళ్ళూడగొట్టి వసూలుచేసికోవడం చూసి ఆశ్చర్యపోతుంది. అన్నిటికన్నా ముఖ్య విషయం వేషాల్లేనపుడు అమ్మాయిలతో వ్యాపారంచేసే విషయం తెలుసుకొని పద్మవ్యూహంలోకి వచ్చానని విచారిస్తుంది. కానీ తప్పించుకోవడానికి వీలు లేని పరిస్థితి.
కొన్నాళ్ళుపోయాక శ్రీజ ఇంటినుంచి బయటపడి, ఒక బ్రోకర్ను పెట్టుకొని తనే సొంతంగా బేరాలు కుదుర్చుకొంటుంది. కూతురు పద్మ పెద్దదవుతుంటుంది. కూతురికి తన జీవితం తెలియకూడదని తమలాటి వేశ్యల పిల్లలకి ఉచితంగా చదువుచెప్పేచోట చేర్పిస్తుంది. తన స్నేహితురాలి సలహాతో రైల్వే ఉద్యోగి శేషు అండలోకి వస్తుంది. అతనివలన ప్లాటుఫారాలు ఊడ్చే ఉద్యోగం చేస్తుంది. వృత్తిమానేస్తుంది. శేషు ఇంట్లో పనిచేస్తూ వాళ్ళ యింట్లోనే సర్వెంట్ క్వార్టర్‌లో వుంటుంది. పద్మకి పద్నాలుగేళ్ళు వస్తాయి. కూతుర్ని ఒకసారి ఇంటికి తీసుకువస్తుంది. తను పనిలోకి వెళ్తుంది. మామూలుగా ఒకరోజు పనినుంచి ఇంటికి వచ్చేసరికి రక్తపుమడుగులో శేషు పద్మననుభవించే సంఘటనలో జరిగిన హత్య అది. కూతురు చేసిన హత్యను తనపై వేసికొని జైల్లో పదేళ్ళు శిక్షననుభవిస్తుంది తల్లి. జైల్లో వున్నపుడు తన జీవితంలోని విషాదాన్ని తట్టుకోలేక డైరీ రాస్తుంది. అదే అనామిక డైరీ.
చిన్నప్పుడే తల్లి, తండ్రి లేని అనాథై, సంక్షేమ హాస్టల్లో చేరి అక్కడ నరకాన్ని అనుభవించలేక బయటకువస్తే, బయట ప్రపంచం మరింత ఘోర నరకం. ఆడ పిల్లల్ని కబళించడానికి ఆత్రంగా ఎదురుచూసే గుంటనక్కలు, విష సర్పాలు. బాల్యం అందమైనదని కవులు అంటారు. కానీ అందరికీ కాదు. అమ్మానాన్నల దగ్గర గారాబపు ఉయ్యాల లూగేవారికి, వారి ప్రేమసాగరంలో మునిగి తేలేవారికి మాత్రమే చక్కని బాల్యం. అమ్మనాన్న లేని అభాగ్యులకు ఆనందం ఎక్కడ? అన్నీ సమస్యలే వారికి. ఈ విషాదాన్ని అక్షరం అక్షరంలో ఒలికించారు సలీం.
పడుపువృత్తిలో వున్న స్ర్తిల దుర్భర పరిస్థితులను, పితృస్వామ్య వ్యవస్థలోని దుర్మార్గాన్ని ఎత్తిచూపిన నవల ఇది. నవల ప్రారంభమే కొత్తగా వుంటుంది. జైలరు యామినికి లేడీ కానిస్టేబిల్ రెండు పెద్దసైజు నోటు పుస్తకాలు కృష్ణా బ్యారక్‌లో దొరికాయని తెచ్చిస్తుంది. తెల్ల కాయితంమీద మధ్యలో బాల్‌పాయింట్‌పెన్‌తో ‘‘అనామిక డైరీ’’అని రాసి వుంటుంది. ఆ పుస్తకంలో ఏం రాసి వుందో అని చదువుతుంది. అలా రచయిత కథ వృత్తాంతాన్ని చెప్తారు. డైరీ అంతా చదివాక అసలు దోషి పద్మ అని స్వప్న నిర్దోషి అని తెలుస్తుంది. కానీ ఇప్పుడా డైరీ బయటపెడితే పద్మ కోర్టుకు రావాలి, మళ్ళీ అక్కడ హింస. తన పెళ్లి ఆగిపోతుంది అని ఆలోచించి ఆ పుస్తకంలో స్వప్న రాసిన కాగితాల్ని చింపి తన దగ్గర పెట్టుకొని మిగిలిన పుస్తకాల్ని ఇచ్చేస్తుంది. నవల చదివాక చాలా రోజులవరకు స్వప్న, సారిక పాత్రలు మనను వెంటాడతాయి. ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కల్గించినా, మధ్యదళారీలు అందవలసిన వాళ్ళకు అందకుండా చేయడం, మితిమీరిన స్వార్థపరత్వం, విస్తరించిన అవినీతి భూతం ఈ దేశం ఎప్పటికి మారుతుంది అని మనసులో ప్రశ్నలు రేకెత్తిస్తాయి. సరళమైన శైలితో ఈ పుస్తకం చివరంటా ఆగకుండా చదివిస్తుంది. పాఠకుల మనసుల్లో ఎన్నో ఆలోచనలని రగిలించే నవల రాసిన సలీం అభినందనీయులు.

-మందరపు హైమవతి