కర్నూల్

అడకత్తెరలో అంగన్‌వాడీలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* చర్యలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం..
* కలెక్టర్‌కు నిఘా వర్గాల నివేదిక..
* 60 మందికి పైగా ఇబ్బందులు..
కర్నూలు, డిసెంబర్ 27:జీతభత్యాల పెంపుకోసం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాస గృహాన్ని ముట్టడించిన అంగన్‌వాడీ కార్యకర్తల పరిస్థితి ‘అడకత్తెరలో పోకచెక్క’ మాదిరిగా తయారైంది. విజయవాడలో చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి వెళ్లిన అంగన్‌వాడీ కార్యకర్తలను విధుల నుంచి తొలగించాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో జిల్లా నుంచి ఎంతమంది అంగన్‌వాడీలు విజయవాడ వెళ్లారో నివేదిక ఇవ్వాలని సిడిపిఓలను కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. మరో వైపు పోలీసు నిఘా విభాగం నుంచి కూడా సమాచారం సేకరించాలని అధికారులను ఆదేశించారు. కాగా జిల్లా నుంచి ఎంతమంది అంగన్‌వాడీలు విజయవాడ ఆందోళన కార్యక్రమానికి హాజరయ్యారన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. సిడిపిఓలు సమర్పించిన నివేదిక ప్రకారం ధర్నాకు ఎవరూ వెళ్లలేదని తెలుస్తోంది. అయితే పోలీసు నిఘా విభాగం అధికారులు మాత్రం సుమారు 100 మంది వరకూ విజయవాడకు వెళ్లినట్లు కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారని అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో కలెక్టర్ విజయమోహన్ సిడిపిఓలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాస్తవ నివేదికను పంపాలని ఆదేశించినట్లు వెల్లడవుతోంది. కాగా అంగన్‌వాడీల ఆందోళన కార్యక్రమానికి నేతృత్వం వహించిన కార్మిక సంఘం లెటర్ హెడ్‌పై కొందరు అంగన్‌వాడీ వర్కర్లు సిడిపిఓలను అనుమతి కోరుతూ లేఖ సమర్పించారని ఆ లేఖల ఆధారంగా కొందరి పేర్లను కలెక్టర్‌కు సమర్పించాలని సిడిపిఓలు భావించినా ఆ లేఖలన్నింటినీ తనకు పంపాలని సూచించడంతో అధికారులు ఇరకాటంలో పడ్డారు. అంగన్‌వాడీ సంఘం నేతలు ఇచ్చిన లేఖ ప్రకారం సుమారు 200లకు పైగా అంగన్‌వాడీ కార్యకర్తలు సంతకం చేశారని చర్చించుకుంటున్నారు. అయితే వీరిలో అనేక మంది ధర్నాకు వెళ్లకుండా వ్యక్తిగత పనులు పూర్తి చేసుకున్నారని అంగన్‌వాడీ కార్యకర్తలు అధికారులకు విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. పోలీసు నిఘా విభాగం సమర్పించిన జాబితా, సిడిపిఓలకు సమర్పించిన లేఖల ఆధారంగా తుది జాబితా సిద్ధం చేసి చర్యలు తీసుకోవడానికి కలెక్టర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ముత్యాలమ్మకు సూచనలు ఇచ్చారని కలెక్టర్ కార్యాలయంలో చర్చించుకుంటున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలపై చర్యకు సిద్ధమైన ఐసిడిఎస్ అధికారులు తుది జాబితాను కలెక్టర్ విజయమోహన్‌కు రెండు, మూడు రోజుల్లో సమర్పించి తదుపరి చర్యలు తీసుకుంటారని వెల్లడవుతోంది. కాగా విజయవాడ ఆందోళన కార్యక్రమానికి హాజరైన అంగన్‌వాడీ కార్యకర్తల్లో ఆత్మకూరు, నందికొట్కూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, కర్నూలు డివిజన్‌ల నుంచే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర డివిజన్ల నుంచి ఒకరిద్దరు వెళ్లారని మొత్తం మీద సుమారు 60 నుంచి 65 మందిపై చర్య తీసుకునే అవకాశమున్నట్లు చర్చించుకుంటున్నారు. అయితే ప్రభుత్వ చర్యను అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం నాయకురాళ్లు వ్యతిరేకిస్తున్నారు. తమకు ఆందోళన నిర్వహించే హక్కు ఉందని, విజయవాడ కార్యక్రమానికి పోలీసు శాఖ అనుమతి కూడా ఉందని స్పష్టం చేస్తున్నారు. తమ కార్యక్రమంలో చిన్న అవాంఛనీయ సంఘటన కానీ, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కానీ జరగలేదని వారంటున్నారు. అలాంటప్పుడు కఠిన చర్యలు తీసుకోవడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయమైన వేతనాల కోసం ఆందోళన చేశామే కానీ మరో కారణం లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం తన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

టిడిపి బలోపేతానికి కృషి
* ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా
కర్నూలు సిటీ, డిసెంబర్ 27:తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉంటున్న కార్యకర్తలు, నాయకులను ప్రోత్సహించేందుకు అనుబంధ కమిటీల్లో స్థానం కల్పించామని, వారు పదవులను అలంకారప్రాయంగా భావించకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి సూచించారు. నగరంలోని సి క్యాంప్ సెంటర్‌లో ఉన్న లలిత కళా సమితిలో ఆదివారం జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావుయాదవ్ అధ్యక్షతన అనుబంధ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పా మాట్లాడుతూ ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకుని ఉన్న కార్యకర్తలు నిరుత్సాహపడకుండా ఉండాలని భావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఇటీవల దాదాపు 14 అనుబంధ సంఘాలకు సభ్యులను ఎన్నుకున్నామన్నారు. పదవులు వచ్చిన వారంతా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల దరికి చేర్చి పార్టీ పట్ల నమ్మకం పెంచాలని సూచించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలిపి వాటి ద్వారా చేకూరే ఉపయోగాలను ప్రజలకు తెలపాలన్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు వేసే ఎత్తుగడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని తిప్పికొట్టే విధంగా చేయాలన్నారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చూడాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ అనుబంధ కమిటీ సభ్యులతో పాటు మండల ఇన్‌చార్జిలు ప్రతి వారానికి ఒక సారి సమావేశం ఏర్పాటు చేసుకుని గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గ్రామాలతో పాటు మండలాల్లో నెలకొన్న సమస్యల గురించి జిల్లా కమిటీ దృష్టికి తీసుకు వస్తే వాటిని పరిష్కరించి ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకం పెంచాలన్నారు. కావున ప్రతి ఒక్కరూ పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తే తద్వారా అభివృద్ధి వేగం పుంజుకుంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ధనారెడ్డి, పర్వేజ్, హనమంతరాయచౌదరి, బాబురాజ్, మల్లెల పుల్లారెడ్డి, అయ్యపురెడ్డి, బుగ్గన ప్రసన్నలక్ష్మి, సుశీలమ్మ, సుభాషిణి, వివిధ అనుబంధ కమిటీల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

పట్టణాల్లో నేరాలు అరికట్టేందుకు సిసి కెమెరాల ఏర్పాటు
* రాయలసీమ జోన్ ఐజి గోపాలకృష్ణ
మహానంది, డిసెంబర్ 27: రాయలసీమ జోన్‌లోని అన్ని పట్టణాల్లో చైన్ స్నాచింగ్‌లు, నేరాలను అరికట్టేందుకు సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాయలసీమ జోన్ ఐజి గోపాలకృష్ణ తెలిపారు. ఆదివారం ఆయన మహానంది పుణ్యక్షేత్రంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ మర్యాదలతో ఇఓ డాక్టర్ శంకర వరప్రసాద్ స్వాగతం పలికారు. ఆలయ ముందు భాగంలో డిఎస్పీ హరినాధరెడ్డి స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీ కామేశ్వరీదేవి మహానందీశ్వర స్వామి వార్లకు అభిషేకార్చన పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులు మొమెంటో అందించి పట్టు వస్త్రం సమర్పించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కర్నూలు పట్టణంలో నేరాలు అరికట్టేందుకై 120 సిసి కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. నంద్యాలలో కూడా 85 సిసి కెమెరాలు త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. తప్పు చేసిన వ్యక్తి శిక్షించబడాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పత్రికల్లో ఎర్ర కూలీలు అని రాస్తున్నారని, వారు కూలీలు కాదు స్మగ్లర్లేనని నిర్ధారించారు. నేటి కూలే రేపటి స్మగ్లర్‌గా మారుతున్నారన్నారు. వీరికి బలమైన అండ ఉందనే అనుమానంతో విచారణ చేపట్టామన్నారు. ఎర్రకూలీలు చనిపోయిన వారి కూలీలకు, ఇన్సురెన్స్, ఉద్యోగాలు ఇస్తారనే భరోసా ఉన్నందు వల్లే వారు తిరిగి స్మగ్లింగ్ చేసేందుకు ముందుకు వస్తున్నారన్నారు. విద్యార్థుల్లో కూడా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీరి వెంట నంద్యాల రూరల్ సిఐ మురళీదర్‌రెడ్డి, ప్రోటోకాల్ ఇన్‌స్పెక్టర్ సురేంద్రనాధరెడ్డి, ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ నాగభూషణం తదితరులు ఉన్నారు.