తూర్పుగోదావరి

అంగన్‌వాడీల కలెక్టఠేట్ ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 27: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎపి అంగన్‌వాడీ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా సంఘం గౌరవాధ్యక్షుడు దువ్వా శేషుబాబ్జి మాట్లాడుతూ చంద్రబాబు గత ఎన్నికల హామీలో భాగంగా తాము అధికారంలోకి వస్తే అంగన్‌వాడీలకు వేతనాలు పెంచుతామని చెప్పారన్నారు. దీనిపై పోరాటాలు చేయగా వేతనాల పెంచుతున్నట్టు ప్రకటించారన్నారు. ప్రకటించి సుమారు 5 నెలలు కావస్తున్నా అమలుకు నోచుకోలేదన్నారు. వెంటనే పెంచిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే అంగన్‌వాడీలను వేరే ప్రభుత్వ పనులకు వినియోగించుకుని వారికి అలవెన్సులు ఇవ్వటం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందు కలెక్టరేట్‌కు వేలాదిగా అంగన్‌వాడీలు చేరుకుని ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని వారిని కలెక్టరేట్‌లోకి రానీయకుండా అడ్డగించారు. కొద్దిసేపు కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం అంగన్‌వాడీల వద్దకు డిఆర్వో బి యాదగిరి, ఐసిడిఎస్ పిడి విజయలక్ష్మిలు వెళ్లి వారి డిమాండ్లను విన్నారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని వారు చెప్పడంతో అంగన్‌వాడీలు ఆందోళన విరమించారు.

రైలు కోసం పాదయాత్ర
అయినవిల్లి, నవంబర్ 27: కోనసీమలో రైల్వేలైను నిర్మాణం కోసం జెఎసి నాయకులు తలపెట్టిన పాదయాత్ర శుక్రవారం ముక్తేశ్వరంలో అట్టహాసంగా ప్రారంభమైంది. జడ్పీటీసీ గంగుమళ్ళ కాశీ అన్నపూర్ణ పాదయాత్రకు హారతి ఇవ్వగా, జెఎసి ఛైర్మన్ వాసు దివాకర్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమానికి సుమారు 400 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ కోనసీమ రైల్వేలైను కోసం విద్యార్థులే కాకుండా వివిధ పార్టీల నాయకులు, ఉద్యోగులు పెద్దఎత్తున తరలి రావడం సంతోషం వ్యక్తం చేశారు. కోనసీమ ప్రజల చిరకాల కోరిక రైల్వేలైనని, కేంద్రప్రభుత్వంపై రైల్వేలైనుకోసం ఒత్తిడి తీసుకొస్తామన్నారు. అదేవిధంగా అమలాపురం ఎంపి పండుల రవీంద్రబాబు వచ్చే కేంద్ర బడ్జెట్‌లో కోనసీమ రైల్వేలైను కోసం నిధులు కేటాయించేలా కృషిచేయాలని ఆయన కోరారు. ఈ పాదయాత్ర ముక్తేశ్వరం నుండి అమలాపురం మీదుగా బోడసకుర్రు వెళ్ళి అక్కడ రైలు నిద్ర చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపిపి సలాది పుల్లయ్యనాయుడు, వైసిపి నాయకులు మిండుగుదిటి మోహన్, ఆర్టీసి యూనియన్ నాయకుడు కె సత్తిబాబు, సిపిఎం నాయకుడు మోర్త రాజశేఖర్, నక్కా చిట్టిబాబు, బండారు రామ్మోహన్‌రావుతదితరులు పాల్గొన్నారు.

కుతుకులూరులో క్షుద్రపూజలు!
అనపర్తి, నవంబర్ 27: అనపర్తి మండలం కుతుకులూరు ఎస్సీ కాలనీ శివారు గరువు వద్ద గురువారం రాత్రి క్షుద్ర పూజలు జరిగాయన్న వార్త శుక్రవారం గ్రామస్థుల్లో కలకలం రేపింది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కుతుకులూరు కోనాల వెంకట్‌రెడ్డికి చెందిన వ్యవసాయ భూమి వద్దకు గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఐటెన్ కారులో ఎర్ర దుస్తులు ధరించిన ఒక మహిళ, ఇద్దరు పంచెకట్టు పురుషులు ఒక బాలున్ని వెంటబెట్టుకుని వచ్చారు. ఈ హడావుడిని గమనించిన దళితవాడకు చెందిన కొందరు అక్కడకు చేరుకుని వెంకట్‌రెడ్డిని ప్రశ్నించారు. దీనిపై వెంకట్‌రెడ్డి తన పొలంలో పాత బోరును తొలగించి తిరిగి భూమి పూజ గావిస్తున్నట్లు వారికి తెలిపాడు. అక్కడ పరిస్థితులు గమనించి సమాధాన పడని స్థానికులు ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో, అక్కడ ముగ్గులు వేసి ఉన్నాయి, వాటిని తొక్కకూడదని బెదిరించి వెనక్కు పంపారు. అయితే ప్రొక్లెయినర్‌తో ఆ ప్రాంతంలో గోతులు తీసి ఉండడం, బోరు షెడ్డులోనూ గోతులు తీసిన ప్రాంతంలో ముగ్గులు వేసి నిమ్మకాలు, పసుపు, కుంకుమి, బియ్యం చల్లి ఉండటాన్ని స్థానికులు గమనించారు. ఇదిలా ఉండగా కారులో వచ్చిన వ్యక్తులు దళిత వాడ మీదుగా తిరిగి వెళ్తున్న సమయంలో వారి వెంట వచ్చిన బాలుడు లేకపోవడంతో, వీరు క్షుద్ర పూజలు చేసి బాలున్ని బలి ఇచ్చి ఉంటారని వారు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనత దళివాడలోని మహిళలు ఆందోళన చెందడం, ప్రతి ఒక్కరూ ఆ ప్రాంతానికి వచ్చి చూసి వెళుతున్న సమాచారం అందుకున్న అనపర్తి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రాతపూర్వక ఫిర్యాదుతో పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని స్థానికులకు తెలిపి స్థల యజమాని వెంకట్‌రెడ్డిని తమతో వెంటబెట్టుకుని వెళ్లారు. ఈ వ్యవహారంలో గోతులు తీసి కప్పివేసిన చోట తిరిగి తవ్వకాలు చేస్తే అసలు విషయం బయటపడుతుందని స్థానికులు చెబుతున్నారు.

జెఎన్‌టియుకె డిఇగా సుబ్బారావు
కాకినాడ సిటీ, నవంబర్ 27: జెఎన్‌టియుకె డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అధిపతిగా కళాశాల వైస్‌ప్రిన్సిపాల్ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ పి సుబ్బారావు నియమితులయ్యారు. ఇప్పటి వరకు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్‌గా విధులను నిర్వహించిన డాక్టర్ పి ఉదయభాస్కర్ ఎపిపిఎస్‌పి ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించడంతో ఆయన ఆ బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన స్థానాన్ని భర్తీచేస్తు వర్శిటీ విసి ప్రొఫెసర్ విఎస్‌ఎస్ కుమార్ శుక్రవారం అంతర్గత బదిలీలకు ఆదేశాలు జారీచేశారు. విసి ఆదేశాలు ప్రకారం రిజిస్ట్రార్ జివిఆర్ ప్రసాదరాజు ఎవాల్యుయేషన్ డైరెక్టర్‌గా సుబ్బారావును నియమిస్తు ఉత్తర్వులు జారీచేశారు.

అంగన్‌వాడీల రాస్తారోకో ః ఉద్రిక్తత
చింతూరు, నవంబర్ 27: విలీన మండలాల్లోని అంగన్‌వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం చింతూరులో చేపట్టిన రాస్తారోకోలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముందుగా అంగన్‌వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యర్రంపేట వద్దనుండి చింతూరు వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రహదారిపై బైఠాయించి ఆందోళన కొనసాగించారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, మాజీ ఎంపి మిడియం బాబూరావులు మాట్లాడుతూ విలీన మండలాల్లోని అంగన్‌వాడీలకు 2013 నుండి 2015 వరకూ పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే మంజూరు చేయాలని డిమాండు చేశారు. ఈ మండలాల్లో 392 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, 790 మంది వర్కర్లు విధులు నిర్వర్తిస్తున్నారని, వారికి సంబంధించిన రూ.1.58 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అమృతహస్తం, ఇంటి అద్దె, టిఎ, కట్టెల బిల్లులను చెల్లించాలని డిమాండు చేశారు. అలాగే కూనవరం ఐసిడిఎస్ సిడిపిఒ నిర్మలజ్యోతి అవినీతికి పాల్పడిందని, అంగన్‌వాడీల పట్ల దురుసుగా ప్రవర్తించేదని వారు ఆరోపించారు. ఆమెను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండు చేశారు. సుమారు 3గంటల పాటు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయమేర్పడింది. ఎస్సై గజేంద్రకుమార్ ఆందోళనను విరమించాలని కోరినా వినలేదు. దీంతో సిఐటియు నాయకులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయినా అంగన్‌వాడీలు రోడ్డుపైనే బైఠాయించి పోలీసు చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో తహసీల్దార్ శివకుమార్ ఆందోళనకారుల వద్దకు వచ్చి అంగన్‌వాడీలతో మాట్లాడారు. ఎటపాక ఆర్డీవో నర్సింహమ్మూర్తి ఈ నాలుగు మండలాల సిడిపిఒలతో సోమవారం సమావేశం ఏర్పాటుచేసి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్టు తహసీల్దార్ శివకుమార్ అంగన్‌వాడీలకు తెలిపారు. దీంతో సిఐటియు నేతలు, అంగన్‌వాడీలు తమ ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో ఎంపిపి చిత్తడి మురళీ, శేషావతారం, కోట్ల కృష్ణ, కుంజా సీతారామయ్య, వెంకట్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు
అంబాజీపేట, నవంబర్ 27: అకాల వర్షాలకు తడిసిపోయిన ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, దీనిని పరిశీలించేందుకు నెల 30న ప్రత్యేక బృందం జిల్లాకు వస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. శుక్రవారం అంబాజీపేట మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ గణపతి బాబులు సృగృహంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. సిపిసిఆర్‌ఐ ప్రాంతీయ కార్యాలయాన్ని అంబాజీపేటలో ఏర్పాటుచేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే ఉద్యాన పరిశోధనా స్థానంలో 30 ఎకరాలు సేకరించేందుకు సన్నాహాలు చేసామన్నారు. కోనసీమ కొబ్బరి రైతులు కష్టాల నుండి గట్టెక్కే శుభ తరుణం వచ్చిందని, కల్పరసను అబ్కారీ చట్టం నుండి మినహాయించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కొబ్బరి ఆధారిత పరిశ్రమలు, ఉప ఉత్పత్తుల తయారీకి పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని ఆయన కోరారు. ప్రభుత్వం వీటిపై 50 శాతం వరకు రాయితీ కల్పిస్తుందన్నారు. ఈ సమావేశంలో ఎఎంసి మాజీ ఛైర్మన్ గణపతి బాబులు, సొసైటీ అధ్యక్షులు గణపతి వీర రాఘవులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధి కమిటీ ఛైర్మన్ మేడిది చిన్న, మైపాల తాతాజీ, సుంకర బాలాజీ, రవణం రాము, శిరిగినీడి వెంకటేశ్వరరావు, పాబోలు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

ఏలేరు ఆయకట్టులో 32 వేల ఎకరాలకు సాగునీరు
కాకినాడ సిటీ, నవంబర్ 27: ఏలేరు రిజర్వాయర్ పరిధిలో రెండవ పంటకు 32 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ ప్రకటించారు. దీంతోపాటు మరో 9 వేల ఎకరాల స్టాండింగ్ పంటలకు నీరందిస్తామన్నారు. అయితే సాగునీరివ్వని ప్రాంతాల్లో కాలువల ఆధునీకరణ పనులు చేపడతామన్నారు. కలెక్టరేట్‌లో ఆయన శుక్రవారం పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌విఎస్‌ఎన్ వర్మ సమక్షంలో నీటిపారుదల శాఖ ఎస్‌ఇ, కాకినాడ, పెద్దాపురం ఆర్డీఒలు, పిఠాపురం నియోజకవర్గ సాగునీటి సంఘాలసు, నీటి వినియోగ సంఘాల అధ్యక్షులతో ఏలేరు ఆయకట్టు కింద రెండోపంటకు సాగునీరు, ఏలేరు ఆధునీకరణ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏలేరు రిజర్వాయర్‌లో తగినంత నీటి లభ్యత లేనందున, 53 వేల ఎకరాల ఆయకట్టుకుగాను 32 వేల ఎకరాలకు, స్టాండింగ్ పంటలకు మరో 9 వేల ఎకరాలకు సాగునీరిచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జగ్గంపేట మండలంలో 1995 ఎకరాలు, కిర్లంపూడి మండలంలో 7,475 ఎకరాలు, పెద్దాపురం మండలంలో 7,780 ఎకరాలు, పిఠాపురం మండలంలో 10,500 ఎకరాలు, ఏలేశ్వరం మండలంలో 4,100 ఎకరాలు, ప్రత్తిపాడు మండలంలో 150 ఎకరాలకు రెండోపంటకు సాగునీరు అందిస్తామని కలెక్టర్ అరుణ్‌కుమార్ ప్రకటించారు. సమావేశంలో పాల్గొన్న పిఠాపురం ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ ఏలేరు రిజర్వాయర్ ఆధునీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.172 కోట్ల నిధులు మంజూరుచేశారన్నారు. తన నియోజకవర్గంలో 10,500 ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. పి దొంతమూరు, బి ప్రత్తిపాడు, పి రాయవరం, రాపర్తి, భోగాపురం, ప్రత్తిపాడు గ్రామాల పరిధిలో రెండోపంట విరామానికి రైతులు అంగీకరించారని తెలిపారు. పిబిసి-2 కింద మరో రూ.20 కోట్లతో కాలువల ఆధునీకరణ పనులు చేయాలని ఆధికారులను కోరారు. నియోజకవర్గంలో ఆర్‌ఆర్‌బిహెచ్‌ఆర్ సహా పలు చెరువుల్లో ఉపాధిహామీ కింద పూడికతీసి ఆధునీకరణకు సుమారు రూ.30 కోట్లు మంజూరుకు సిఎం అంగీకరించారని ఆయన తెలిపారు. నీటి పారుదల శాఖ ఎస్‌ఇ ఎస్ సుగుణారావు మాట్లాడుతూ ఏలేరు రిజర్వాయర్ కింద రెండోపంటకు సాగునీరివ్వని ప్రాంతాల్లో సుమారు రూ.30 కోట్లతో కాలువలను ఆధునీకరణ పనులు నిర్వహిస్తామన్నారు. అలాగే ఫేజ్-2 కింద మరో రూ.42 కోట్లతో ఆధునీకరణ పనులు నిర్వహిస్తామని, డిసెంబర్ 1వ తేదీ నుండి రైతులకు సాగునీటిని విడుదలచేసి మార్చి 31వ తేదీన కాలువలను మూసివేస్తామన్నారు. సమావేశంలో ఆర్డీఒలు బిఆర్ అంబేద్కర్, వి విశే్వశ్వరరావు, ఏలేరు ఇఇ, డిఇఇలు, నీటిసంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

‘కోట’ రైల్వే స్టేషన్‌లో డిఆర్‌ఎం ఆకస్మిక తనిఖీ
సామర్లకోట, నవంబర్ 27: వచ్చే నెలలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా తనిఖీల నేపథ్యంలో శుక్రవారం సామర్లకోట రైల్వేస్టేషన్‌లో విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ అశోక్‌కుమార్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తొలుత తెల్లవారుజామున విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు అనుసంధానం చేసిన సెలూన్ భోగీలో డిఆర్‌ఎం బృందం సామర్లకోట చేరుకున్నారు. తదుపరి తుని, కాకినాడ స్టేషన్లను పరిశీలించి తిరిగి సామర్లకోట విచ్చేశారు. సామర్లకోట రైల్వేస్టేషన్‌లో టికెట్ బుకింగ్ కౌంటర్లు, ప్లాట్‌ఫాంలపై శానిటేషన్ నిర్వహణ, ప్రయాణీకులు వేచి ఉండే గదులు, ప్రయాణీకుల సదుపాయాలను పరిశీలించి ఆరా తీసి వారికి పలు ఆదేశాలు ఇచ్చారు. కార్యక్రమంలో సీనియర్ డిసిఎం సత్యనారాయణ, సీనియర్ డిఒఎం సత్యనారాయణ, సీనియర్ డిఇఎన్ నార్త్ సిన్హా, సామర్లకోట స్టేషన్ మేనేజర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మొక్కుబడిగా ప్రభుత్వ పథకాల నిర్వహణ
విఆర్ పురం, నవంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పలు పథకాలు అధికారుల నిర్లక్ష్య వైఖరితో మొక్కుబడిగా నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. దీనికి మచ్చుతునక నీరు-ప్రగతి కార్యక్రమం. ఈకార్యక్రమాన్ని అక్టోబర్ 2 నుండి డిసెంబర్ 3వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంది. ఈ నీరు-ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని జలవనరులను పెంపొందించటం, పర్యావరణాన్ని కాపాడటం, శాశ్వత కరవు నివారణ, సుస్థిర అభివృద్ధి చేయటం ప్రభుత్వ లక్ష్యం. ఈ కార్యక్రమం గడువు కూడా అయిదు రోజుల్లో ముగియనుంది. అయితే ఈ పథకం గురించి ఎవరికీ తెలియకపోవడం విడ్డూరం. ఈ కార్యక్రమానికి కనీసం ఒక్కరోజు ముందయినా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అధికారులు చెప్పాల్సి ఉంది. కానీ సంబంధిత అధికారులు ఎటువంటి ప్రచారం లేకుండా శుక్రవారం అప్పటికప్పుడు వడ్డిగూడెం పంచాయతీ సర్పంచ్‌కు చెప్పి ఈ రోజు గ్రామసభ నిర్వహిస్తున్నాం అని చెప్పారు. ఆ సర్పంచ్ మిగతా ప్రజాప్రతి నిధులను పిలిచే వరకూ ఈ కార్యక్రమం అంటూ ఒకటి నిర్వహిస్తున్నట్టు ఎవరికీ తెలియని పరిస్థితి. ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో పథకాలను ప్రవేశ పెడుతుంటే అధికారులు సమాచారం, ప్రచారం నిర్వహించకపోవడంతో పలు పథకాలు మరుగున పడిపోతున్నాయి. మొక్కుబడిగా గ్రామసభలు నిర్వహించటం వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా పోతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లి వాటిపై అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనావుంది.