అనంతపురం

అంతా హడావుడి.. ఆర్‌ఎంపిలు బలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, సెప్టెంబర్ 18: అనంతపురం నగరంలోని వినాయక నగర్‌లో ఇద్దరు చిన్నారులు డెంగీతో మృతి చెందారన్న వార్తలతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్, ఉన్నతాధికారులు మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్ స్పందించారు. ఆఘ మేఘాలపై చిన్నారుల మృతదేహాలను ఈ నెల 16న సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తక్షణం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య విభాగం అధికారులు, సిబ్బందిని రంగంలోకి దింపారు. పారిశుద్ధ్యం పనుల్ని గత మూడు రోజులుగా పర్యవేక్షిస్తూ పలు కార్యక్రమాలు చేపడుతూ హడావుడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఎంపిలు నిర్వహిస్తున్న క్లినిక్‌ను మూసి వేయించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఉపాధి కోల్పోయారు. వీరిలో కూడా చిత్తశుద్ధితో తమ తాహతుకు తగ్గట్టు వైద్యం చేస్తున్న వారు అధిక సంఖ్యలో ఉన్నారు. కేవలం ధనార్జనే ధ్యేయంగా సమస్యాత్మక కేసులకు కూడా వైద్యం చేస్తున్న కొందరు ఉన్నారు. వీరి కారణంగా చిన్నారులు విష జ్వరాలు అధికమై తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. వినాయకనగర్‌లో మృతి చెందిన ఇద్దరు అన్నదమ్ములైన చిన్నారుల మృతికి ఈ పరిస్థితే కారణమని అధికారులు భావించారు. దీంతో చిన్నారుల మృతితో ఆర్‌ఎంపిల క్లీనిక్‌లను అధికారులు మూసి వేశారు. ఇది ఓ విధంగా వారికి కనువిప్పులాంటిదేనని చెప్పొచ్చు. మరోవైపు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు తీవ్రంగా ప్రబలుతాయి. ఈ నేపథ్యంలో పేద, మధ్యతరగతి పిల్లలు జ్వరాల బారిన పడితే ఆర్‌ఎంపిలే గతవుతున్నారు. ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరం, నొప్పులు, మందులతో నయం కాగల వ్యాధులకు వీరు చికిత్స చేస్తారు. చిన్నపాటి సర్జరీల్లాంటివి కూడా చేయడానికి వీలు లేదు. ఈ పరిస్థితుల్లో పేదలు అనేకమంది తమ పిల్లలను ఆర్‌ఎంపిలకే చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు అనంతపురం నగరం, పట్టణ ప్రాంతాల్లో కూడా సందుసందుకూ ఒక ఆర్‌ఎంపి వైద్యులు ఉంటున్నారు. పట్టణాల్లో ప్రముఖ వైద్యశాలలున్న చోట కూడా వీరు క్లినిక్‌లు పెట్టుకుని నడుపుతున్నారు. చిన్నచిన్న రుగ్మతలకు ఎక్కడో దూరంగా ఉన్న ప్రభుత్వాస్పత్రులకు వెళ్ల లేక, పక్కనే ఉన్నప్పటికీ అధికంగా డబ్బు ఖర్చు చేసుకునే స్తోమత లేక పేదాసాదా ఆర్‌ఎంపిలతో ఆశ్రయిస్తున్నారు. వీరి వద్ద కన్సల్టింగ్ ఫీజు రూ.25కు మించి ఉండదు. మందులు విచ్చలవిడిగా రాయరు. కొంతలో కొంత నయం అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. అదే ప్రయివేటు ఆస్పత్రుల్లో జ్వరం వస్తే హీనపక్షం రూ.వెయ్యి నుంచి రూ.2వేల దాకా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దీంతో అక్కడికి పేదవారు తమ పిల్లలను తీసుకెళ్లేందుకు జంకుతున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు. అలాంటి వారు వేలకు వేలు ఖర్చు పెట్టుకోలేని దుస్థితి నెలకొంది. ఇక ప్రభుత్వాస్పత్రులున్నా, ఆటో చార్జీలు పెట్టుకోలేని దైనస్థితిలో ఉన్న వారూ లేకపోలేదు. ఈ పరిస్థితే పేదల్ని ఆర్‌ఎంపిలకు దగ్గర చేస్తోంది. ఇదే పరిస్థితి వీరి ప్రాణాల మీదకూ తెస్తోంది. ఆర్‌ఎంపిలు కూడా సరైన వైద్యం అందించకపోవడం, రక్త పరీక్షలు, ఇతరత్రా డయాగ్నిసిస్ పూర్తి స్థాయిలో చేయకపోవడం, అందుకు అవసరమైన పరికరాలు, యంత్ర సామగ్రి వారి వద్ద లేకపోవడం వల్ల రోగాలు ముదిరే ప్రమాదం ఉంది. ఇవేమీ పట్టని పేదలు తమ కష్టాలు కంటి ముందు కనిపిస్తుంటే.. డబ్బు ఆదా కోసం ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తుండటం పరిపాటిగా మారింది. ఇక పల్లెల్లో పిహెచ్‌సీలు రాత్రి సమయాల్లో అందుబాటులో ఉండవు. అక్కడ ఆర్‌ఎంపిలే గతి. వీరే లేకపోతే ప్రాథమిక వైద్యం సైతం అందదన్నది నిష్టుర సత్యం. అయితే ఆర్‌ఎంపిలు కొందరు గ్రామీణ ప్రాంతాల్లో తమ ఇష్టానుసారంగా వైద్యం చేస్తున్నారు. కొందరు మహిళా ఆర్‌ఎంపిలు ఏకంగా అబార్షన్లు చేస్తున్నారు. కొందరు ఆర్‌ఎంపిలు చిన్నపాటి సర్జరీలు కూడా చేస్తున్నారు. కేవలం ధనార్జనే ధ్యేయంగా కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు వస్తున్న ఆరోపణలు వాస్తవ దూరం కాదన్నది వారికి కూడా తెలిసిందే. ఈ పరిస్థితే నేడు ఆర్‌ఎంపిల క్లీనిక్‌లు సీజ్‌కు కారణమైంది. వ్యవస్థలో ఎవరో కొందరు ఇలాంటి వాళ్లు ఉంటారని, అందుకు అందర్నీ శిక్షించడం న్యాయం కాదని ఆర్‌ఎంపిల అసోసియేషన్లు ఘోషిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఆయా సంఘాల నాయకులు కలెక్టర్ కోన శశిధర్, ఎంపి జెసి. దివాకర్‌రెడ్డికి విన్నవించారు. దీంతో మరో రెండు, మూడు రోజుల్లో హెల్త్ ఎమర్జెన్సీని ఎత్తివేస్తే క్లీనిక్‌లు తెరుచుకోవచ్చని అధికారులు హామీ ఇచ్చారు. అలాగే తాను కూడా జిల్లా అధికారులతో మాట్లాడానని, ఒకటి, రెండు రోజులు ఓపిక పట్టండని ఆదివారం ఎంపి జెసి దివాకర్‌రెడ్డి కూడా వారికి భరోసా ఇచ్చారు. కాగా జిల్లాలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారితే.. పట్టించుకోని అధికారులు, చిన్నారుల మృతితో హడావుడి చేయడం ఏమిటని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రతి ఏటా సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని అందరికీ తెలిసిందేనని, అయితే వైద్య, ఆరోగ్య శాఖ, మున్సిపల్ పారిశుద్ధ్య విభాగాలు నిద్దరోతున్నాయా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలడం సహజమని కొందరు వైద్య సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రభుత్వ యంత్రాంగం పట్ల వారికున్న చిత్తశుద్ధిని చాటుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

బిడ్డకు ఉరి వేసి తల్లి ఆత్మహత్య
హిందూపురం, సెప్టెంబర్ 18: చిన్ననాటి నుండి బిడ్డ మానసిక వ్యాధితో బాధపడుతుండటం, వయసు పెరిగినా తెలివి తేటలు పెరగకపోవడం, శనివారం నాడు ఆ బాలిక పుష్పవతి కావడంతో భవిష్యత్తుపై కలత చెందిన ఆ తల్లి బిడ్డకు ఉరి వేసి ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం ముద్దిరెడ్డిపల్లిలో చోటు చేసుకొంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ముద్దిరెడ్డిపల్లి పాత ఊరు సమీపంలోని నంది సర్కిల్ వద్ద నివాసం ఉంటున్న పల్లా రమేష్ భార్య రాజేశ్వరి (31) ఈ ఘతుకానికి పాల్పడింది. కుమార్తె పద్మశ్రీ (12) పుట్టినప్పటి నుండి మానసికంగా సక్రమంగా లేకపోవడంతో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించినా పరిస్థితి మెరుగుపడలేదు. కుటుంబ సభ్యులు బయటకు వెళ్ళకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మానసిక పరిస్థితి సక్రమంగా లేకపోవడంతో పద్మశ్రీ బయట తిరిగేది. ఈ నేపథ్యంలో శనివారం పుష్పవతి కాగా ఇకపై తన బిడ్డను ఎలా కాపాడుకోవాలో అంటూ కలత చెందినట్లు కుటుంబ సభ్యులు పోలీసులతో పేర్కొన్నారు. దీంతో తాను మగ్గం నేస్తున్న ఇనుప కడ్డీకి ముందుగా బిడ్డ పద్మశ్రీని ఉరి వేసి వెంటనే అదే కడ్డీకి రాజేశ్వరి కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. బిడ్డ అనారోగ్య పరిస్థితుల వల్లే రాజేశ్వరి ఈ ఘాతుకానికి పాల్పడిందని స్థానికులు వన్‌టౌన్ సిఐ ఇదుర్‌బాషాతో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పార్టీకి సేవలందించే వారికే పదవులు..
* మంత్రి పల్లె రఘునాథరెడ్డి
పుట్టపర్తి, సెప్టెంబర్ 18: పార్టీలో క్రమశిక్షణ కలిగి సేవలందించే వారికే పదవులు ఇవ్వడం జరుగుతుందని మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మంత్రి పల్లె రఘునాథరెడ్డి జన్మదిన వేడుకలు నియోజకవర్గ కేంద్రంలో పుట్టపర్తి పరిసర గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. అనంతరం సత్యసాయి విమానాశ్రయం ఎదురుగా పర్తిసాయి ధర్మశాలలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ముందుగా దేశ సరిహద్దులో తీవ్రవాదుల దాడిలో అశువులు బాసిన అమరవీరులకు సంతాప సూచకంగా కాసేపు వౌనం పాటించి వారి త్యాగాన్ని ఆయన కొనియాడారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల పార్టీ కన్వీనర్లు ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పార్టీకి విధేయులుగా ఉంటూ పనిచేసే వారికి త్వరలో మరిన్ని పదవులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇతర పార్టీల నుంచి టీడీపీ వైపు మొగ్గుచూపే వారిని పార్టీలోకి ఆహ్వానించామని ఆయన పేర్కొన్నారు. జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారించారని ఇటీవల నాలుగు రోజులపాటు రక్షక తడులు, రైతును ఆదుకునేందుకు ఆయన చేసిన సాయం పట్ల జిల్లా తరపున కృతజ్ఞతలు తెలిపారు. హంద్రీనీవా పూర్తిచేసి జిల్లాలోని 1243 చెరువులు నింపేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. అనంతరం పుట్టపర్తి డీఎస్పీ శివరామిరెడ్డి పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జన్మదిన కేక్‌ను మంత్రి కట్ చేశారు. సాయంత్రం ఎనుములపల్లి సమీపంలో రూ.55 లక్షలతో నిర్మించతలపెట్టిన షాదీమహల్‌కు భూమిపూజ చేశారు. ఎనుములపల్లి గణేశ్ సర్కిల్‌లో పుట్టపర్తి మున్సిపాలిటీ, మామిళ్లకుంట క్రాస్ వద్ద ప్రజాప్రతినిధులు, అభిమానుల నడుమ ఆయన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

‘అనంత’ కార్పొరేషన్‌లో కుల గజ్జి
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, సెప్టెంబర్ 18 : 3అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌కు కుల గజ్జి పట్టింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే వి.ప్రభాకరచౌదరి, నగర మేయర్ స్వరూప, కమిషనర్ చల్లా ఓబిలేసు పాలన సాగిస్తున్నారు. వీరిది బంధుత్వమంట.. అదేం బంధుత్వమో ఏమో.. తాను ఏది చెద్దామన్నా విపరీతార్థాలు తీస్తారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నానంటారు. పారిశుద్ధ్య లోపంతో ఇద్దరు చిన్నారులు ఒకే ఇంట్లో మృతి చెందారు. ఎంత బాధేస్తుందో. దీనికి ఎవరు బాధ్యులు.. ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్ ఎవరు సమాధానం చెబుతారు? వీరి కారణంగా నగరం నాశనమైపోతోంది 1 అంటూ అనంతపురం ఎంపి జెసి.దివాకర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం అనంతపురంలోని తన కార్యాలయంలో ఎంపి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పారిశుద్ధ్య లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పందుల విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. పట్టించుకునే నాథుడే లేడు. అనంతపురం నగరం రోజు రోజుకు జనంతో కిక్కిరిసిపోతోంది. తాడిపత్రి బస్టాండు నుంచి సుభాష్ రోడ్డుకు రావాలంటే అర్ధ గంట పడుతోంది అని ఆయన ఆక్రోశం వెలిబుచ్చారు. తాడిపత్రిలో బహిరంగంగా పోస్తే చెట్టుకు కట్టేసి కొడతారంట అని ప్రచారం చేస్తున్నారు. బహిరంగ మూత్ర విసర్జన చేస్తే ఎవరికైనా ఇదే పని. నేను, ఎమ్మెల్యే ఎవరి కోసం చేస్తున్నాం. అది అర్థం కాదా? చేతనైతే అనంతపురాన్ని తాడిపత్రిలా చేసి చూపెట్టండి.. అంటూ ఓ దశలో ఆగ్రహం వెల్లగక్కారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సిఎం చంద్రబాబునాయుడు నిధులు ఇస్తున్నారని, కానీ వాటిని ఎక్కడ అభివృద్ధి పనులకు చేయడం లేదని ఆయన ఆరోపించారు. నగరంలో అభివృద్ధి బాటలు వేద్దామంటే ఇప్పటికి మూడు మార్లు కోర్టుకెళ్లి స్టే తెచ్చారు. రామ్‌నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలంటూ ఏళ్లుగా చెబుతుంటే.. నేను తెచ్చాను. దానిని నిర్మించేందుకు పనులు మొదలు పెడితే అడ్డుకుంటారు. కలెక్టర్‌కు చెబితే కొద్ది రోజులు అక్కడి షాపుల వాళ్లను పంపించి, మూడు, నాలుగు రోజులకే షరా మామూలుగా వారిని అక్కడికే రప్పించారు. ఇదేనా అభివృద్ధి అంటే.. అంటూ ఎంపి ప్రశ్నించారు. కమిషనర్ వెనుక ఉన్న వాళ్లు గుర్తించాలి. నగరంలో విపరీతమైన అవినీతి జరుగుతోందన్నారు. వేరే వారు చేసిన పనులకు వీళ్లు బిల్లులు చేసుకుంటున్నారు. డివైడర్లు, నగర సుందరీకరణ అవసరమే. అయితే ప్రాధాన్యతను గుర్తించి పనులు చేయమంటున్నా. నాకేదో మంచి పేరు వస్తుందని అడ్డుకుంటున్నారు. భావితరాల పిల్లల కోసం ఆలోచించాలి అన్నారు. అవసరమైన పనులకు డబ్బు ఇస్తానన్నాను. అయినా పట్టించుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. మూత్ర విసర్జన చేయడానికీ అనువుగాని ప్రదేశాల్లో జనం ముక్కు మూసుకుని మూత్ర విసర్జన చేస్తున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలనుకుంటున్నారో, లేదో.. ఇలా చేస్తున్నా ప్రజలు ఎలా భరిస్తున్నారోనంటూ ఎంపి ఆవేదన చెందారు. అనంత అభివృద్ధికి ఎప్పుడూ అండగా ఉంటానన్నారు. నగర పాలకసంస్థ, ఎమ్మెల్యే అవినీతి, అభివృద్ధి నిరోధక చర్యలపై సిఎంకు ఈ నెల 21న ఫిర్యాదు చేస్తున్నట్లు ఎంపి చెప్పారు.

ఇద్దరికి డెంగ్యూ వ్యాధి లక్షణాలు..

మడకశిర, సెప్టెంబర్ 18: మండల పరిధిలోని కల్లుమర్రి గ్రామానికి చెందిన మల్లేష్ (45), బేగార్లపల్లి గ్రామానికి చెందిన హేమలత (11)లు డెంగ్యూ వ్యాధి బారినపడి ఆసుపత్రి పాలయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. కల్లుమర్రి గ్రామానికి చెందిన మల్లేష్‌కు గత 15 రోజుల నుండి జ్వరం వస్తోందని హిందూపురంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకొన్నా జ్వరం నయం కాలేదు. దీంతో గత వారం నుండి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకొంటున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అదేవిధంగా బేగార్లపల్లికి చెందిన హేమలత గత నెల నుండి జ్వరంతో బాధపడుతోందని, కుటుంబ సభ్యులు మడకశిర ప్రభుత్వాసుపత్రిలో చికిత్సలు చేయంచుకొన్నా జ్వరం తగ్గలేదు. అయితే ఆదివారం మడకశిర వైద్యాధికారులు మెరుగైన చికిత్సల కోసం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి పంపారు. అక్కడి వైద్యులు హేమలతకు పరీక్షలు నిర్వహించగా చిన్నారికి డెంగ్యూ లక్షణాలు ఉన్నట్లు బయటపడ్డాయి. దీంతో ఆ చిన్నారికి అక్కడి వైద్యాధికారులు చికిత్సలు అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళడంతో పెనుకొండ ఆర్డీఓ రామ్మూర్తి, తహశీల్దార్ హరిలాల్‌నాయక్, మున్సిపల్ కమిషనర్ నరుూం మహమ్మద్, వైద్య సిబ్బంది బేగార్లపల్లి గ్రామాన్ని పర్యటించి వ్యాధి బారినపడ్డ కుటుంబ సభ్యులతో కలసి గతంలో వారు తీసుకొన్న వైద్య పరీక్షలపై ఆరా తీశారు. దీంతో అధికారులు గ్రామంలో ముమ్మరంగా పారిశుద్ధ్యం పనులను చేపట్టడం జరిగింది. గ్రామంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది విలేఖరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం జ్వరాల బారిన పడ్డ వారు ఇద్దరు, ముగ్గురు మాత్రమే ఉన్నారని, అందులో హేమలతకు మాత్రమే డెంగ్యూ లక్షణాలు కనిపించడంతో ఆమెకు హిందూపురంలో చికిత్సలు అందిస్తున్నారని, ప్రజలెవ్వరూ ఆందోళన చెందనవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించి మంచినీటిని వేడి చేసుకొని సేవించాలని సూచించారు.

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి

రాప్తాడు, సెప్టెంబర్ 18: సీజనల్ వ్యాధులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మలేరియా, డెంగీలపై జిల్లాలో జరిగిన సంఘటనలు మరెక్కడా జరగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ మండల వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్‌ఎమ్‌లు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు డెంగీ, మలేరియా వ్యాధులపై అవగాహన నిర్వహించి చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటా తిరిగి డెంగీ, మలేరియాపై కరపత్రాలు పంపిణీ చేయాలన్నారు. అనంతరం పంచాయతీల వారీగా డ్రైనేజీలు, ఫాగింగ్, మరుగుదొడ్ల నిర్మాణం ఎంతవరకు జరుగుతోందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మురికి కాలువలు పంచాయతీల వారీగా ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌ఓ యుగంధర్, వైద్యాధికారి సరిత, ఎంపీడీవో శ్రీనివాసులు, తహసీల్దార్ నాగభూషణం, సర్పంచ్‌లు వెంకటరాముడు, శ్రీనివాసులు, వెంకటేష్, గోపాల్, ఎంపీటీసీలు, ఏఎన్‌ఎమ్‌లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

క్షేత్రస్థాయిలో పనిచేయండి

చెనే్నకొత్తపల్లి, సెప్టెంబర్ 18: ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని వాటి నివారణకు క్షేత్రస్థాయిలో వైద్యులు, ఇతర శాఖల అధికారులు పర్యటించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. ఆదివారం ఎంపీడీవో కార్యాలయంలో సీజనల్ వ్యాధులపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని అనంతపురంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు చనిపోవడం బాధాకరమన్నారు. ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా పునరావృతం కాకూడదన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గట్టి చర్యలు కూడా తీసుకుంటున్నామన్నారు. కాబట్టి ముఖ్యంగా వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలోకి వెళ్లి పనిచేయాలన్నారు. ఈ మూడు నెలలపాటు 24 గంటలు క్షేత్రస్థాయిలో ఉండి గ్రామాల్లో వ్యాధుల బారిన పడిన వారిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అలాగే డెంగ్యూ, మలేరియా, వ్యాధులు ప్రాణాంతకమైనవని, వాటిని గుర్తించి నివారణకు చర్యలు తీసుకోవాల్సిందిగా డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌ఓ యుగంధర్‌కు మంత్రి ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే వైద్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో వ్యాధులను ప్రబలకుండా అరికట్టాలన్నారు. అలాగే మండల కేంద్రంలో ఉన్న ఆసుపత్రి సిబ్బందిపై ఎల్లప్పుడూ ఫిర్యాదులు అందుతున్నాయని పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని వైద్య సిబ్బందిని మంత్రి హెచ్చరించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే రోగులతో సఖ్యతగా మెలిగి వారిని పరీక్షించాల్సింది వైద్యుల యొక్క సామాజిక బాధ్యత అని మంత్రి అన్నారు. అలాగే వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం ప్రతి గ్రామ పంచాయతీలోనూ వివరాలను సేకరించాలని మంత్రి ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా శుభ్రం చేయడంతోపాటు సాయంత్రం ఫాగింగ్ చేయించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో ఆర్డీవో బాలానాయక్, ఎంపీపీ అమరేంద్ర, జడ్పీటీసీ వెంకటరామిరెడ్డి, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో రామాంజనేయులు, తదితరులు ఉన్నారు.
3 రోజుల్లో రోగుల నివేదికలివ్వండి

ఆత్మకూరు, సెప్టెంబర్ 18: ఆత్మకూరు వైద్య ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాలలో రోగుల వివరాలు తనకు మూడు రోజులలో అందచేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామాత్యులు పరిటాల సునీత ఆదివారం వైద్యాధికారులను ఆదేశించారు. మండల పరిధిలో ఎంతమంది జ్వరపీడితులున్నారో తెలియజేయాలన్నారు. ఆదివారం ఆత్మకూరు రూరల్ హెల్త్ సెంటర్‌కు విచ్చేసి ఆసుపత్రిలో నమోదైన రోగుల వివరాలు ఆరా తీశారు. జిల్లాలో డెంగీ లక్షణాలు కనిపిస్తుండడంతో మంత్రి ఆత్మకూరు విచ్చేసి వైద్యులను, పంచాయతీ కార్యదర్శులను సర్పంచ్‌లను చైతన్యపరచి గ్రామాలలో మురికివాడలు లేకుండా చూడాలని ఆదేశించారు. 19 నుంచి 29వరకు గ్రామాలలో ప్రతి రోజు ఆరోగ్యం పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించి రోగాలను అరికట్టాలని సూచించారు. వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ప్రజల ఆరోగ్య పరిరక్షణ బాధ్యత మీపైనే ఉంటుందన్న విషయం మరువరాదన్నారు. ్ర గ్రామాలు ఆరోగ్యకరమైన స్థితిలో ఉండాలన్నారు. మరో నాలుగు రోజుల్లో హంద్రీనీవా కాలువ నుంచి నీరు ముందుకు సాగే ఏర్పాట్లు చేస్తున్నామని, మరో మూడు నెలల్లో కాలువకు నీరు అందచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మారెక్క, వైస్ పిపి ప్రతాప్, ఎంపిడిఓ ఆదినారాయణ, తహశీల్దార్ నాగరాజు, ఆత్మకూరు సర్పంచ్ పార్వతమ్మ, పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంక్షోభ సమయం పనిచేయండి

అనంతపురంటౌన్, సెప్టెంబర్ 18: ఇది సంక్షోభ సమయం. ఖాళీ స్థలాలపై పన్నులు వేసి కార్పొరేషన్ ఆదాయం పెంచండి. ఖాళీ జాగాల్లో కంప చెట్లు పెరిగి, మురుగు నీరు చేరి దుర్గంధం వెదజల్లుతున్నాయి. మూ డు రోజులలో నగరంలోని ప్రైవేట్ ఖాళీ స్థలాలకు పన్నులు వేసి ఇ-ఆర్‌పి మాడ్యుల్‌లో నమోదు చేయండి. లే కుంటే సంబంధిత ఆర్‌ఓ, ఆర్.ఐ, బిల్ కలెక్టర్లను సస్పెండ్ చేయాలని మున్సిపల్ పరిపాలనా శాఖ డైరెక్టర్ ఎ.కన్నబాబు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం నగరంలో పర్యటించి వచ్చిన తర్వాత కమిషనర్ ఛాం బర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఆర్.డి విజయలక్ష్మి, కమిషనర్ ఓబులేశు, అదనపు కమిషనర్ కృష్ణమూర్తి, డిప్యూటీ కమిషనర్ జ్యోతిలక్ష్మి, ఆర్.ఓలు సుజాత, లక్ష్మీదేవి, అకౌంటెంట్ నవనీతకృష్ణ, ఆర్.ఐలు పాల్గొన్నారు. ఎ.సి, డి.సిలపై డిఎంఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛాంబర్లకే పరిమితమైపోతే ఎలాగని ప్రశ్నించారు. సీనియర్లై ఉండి సిబ్బందితో పని చేయించకుండా స్మార్ట్‌పల్స్ సర్వేయని కబుర్లు చెప్పవద్దని హెచ్చరించారు. వినాయకనగర్‌కు వెళ్ళే ప్రాంతంలో ప్రధాన రహదారి పక్కన ఎకరంన్నర స్థలం విలువ మార్కెట్ ప్రకారం ముఫై కోట్లు ఉంటుందన్నారు. ఏళ్ళతరబడి ఈ స్థలంపై ఖాళీ స్థలాల (విఎల్‌టి) పన్ను వేయకుండా కార్పొరేషన్ రాబడికి గండి కొడతారాయని నిలదీశారు. పనిచేయని వారిని ఉపేక్షించవద్దని కమిషనర్‌ను ఆదేశించారు.

నీటి కుంటల్లో గంబూజియా
చేప పిల్లల విడుదల

తాడిపత్రి, సెప్టెంబర్ 18: మునిసిపాలిటీ పరిధి దోమల లార్వాల నిర్మూలనకు నీటి కుంటల్లో శానిటరీ ఇన్‌స్పెక్టర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం 2 లక్షల గంబూజియా చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్బంగా శానిటరీ ఇన్‌స్పెక్టర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ తాడిపత్రి మలేరియా రహిత పట్టణంగా నమోదైందని, పట్టణంలో దోమల శాశ్వత నిర్మూలనకు పట్టణంలో ఫాగింగ్, మురుగు కాల్వల్లో టిమోఫాన్ ఈసి 50 మందును పిచికారి చేయిస్తున్నామని తెలిపారు. దోమల లార్వాలను నాశనం చేసేందుకు టిటిడి కళ్యాణ మండపం నుంచి యల్లనూరు రోడ్ వరకు రూరల్ పరిధిలోని వంకలోని కుంటల్లో రెండు లక్షల గంబూజియా చేప పిల్లలను వదిలామని తెలిపారు. రూరల్‌లోని పెద్ద నీటి కుంటల్లో ఆయిల్‌బాల్స్ వేస్తున్నామని తెలిపారు.