అనంతపురం

అదుపులోకిరాని రోగాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, సెప్టెంబర్ 20 : జిల్లాలో సీజనల్ వ్యాధులు అదుపులోకి రావడం లేదు. జిల్లా యంత్రాంగం ఓవైపు వ్యాధుల నివారణ చర్యల్ని ముమ్మరం చేస్తుండగా, మరోవైపు జనం విష జ్వరాల బారిన పడుతూనే ఉన్నారు. డెంగ్యూతో అనంతపురం నగరంలోని వినాయకనగర్‌కు చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడటంతో జిల్లా యంత్రాంగం పారిశుద్ధ్యం పనులు, మెరుగైన వైద్యం అందించడంలో నిమగ్నమైంది. నగరంతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామాల్లో పారిశుద్ధ్యం పనులు చేపడుతూ, అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 10 లక్షల కరపత్రాలు ముద్రించి వైద్య సిబ్బందికి అందజేశారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారం సందర్భంగా వైద్య సిబ్బంది కరపత్రాలు పంచుతూ, పారిశుద్ధ్య పనుల్ని పర్యవేక్షిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ వ్యాధులు తగ్గుముఖం పట్టడం లేదు. డెంగీ, టైఫాయిడ్, మలేరియా, చికున్‌గున్యా, డయేరియా వంటి వ్యాధులు బారినపడి అధిక సంఖ్యలో చిన్నారులు, పెద్దలు ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం మరో డెంగ్యూ కేసు నమోదైంది. పెనకచర్ల డ్యామ్ గ్రామానికి చెందిన గౌతం(12) గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. జ్వరం తీవ్రం కావడంతో తల్లిదండ్రులు బాలున్ని అనంతపురం సర్వజన ఆస్పత్రిలో చేర్పించగా పరీక్షించిన వైద్యులు డెంగ్యూ సోకినట్లు నిర్ధరించారు. దీంతో డెంగ్యూ బాధితుల సంఖ్య 8కి చేరింది. కాగా సర్వజనాస్పత్రిలోని చిన్న పిల్లల వార్డులో మొత్తం 60 పడకలుండగా, మొత్తం 180 మంది చిన్నారులు విషజ్వరాలతో చికిత్స పొందుతున్నారు. దీంతో చిన్న పిల్లల వార్డులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పటి వరకూ జిల్లావ్యాప్తంగా 75 వరకూ డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. బాధితులు హిందూపురం, అనంతపురం ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో విష జ్వరంతో చికిత్స పొందుతూ చిన్నారి నవిత(4) మంగళవారం మరణించింది. పరిగి మండలం యర్రగుంట్ల గ్రామానికి చెందిన బాలిక తండ్రి నర్సింహమూర్తి ఈనెల 17న కూతుర్ని ఆస్పత్రిలో చేర్చాడు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చిన్నారి మృత్యువాత పడింది. విష జ్వరం ముదిరిపోవడం, ఫిట్స్ రావడంతో ఆమె మృతి చెందిందని, డెంగ్యూ వల్ల కాదని డిఎంఅండ్‌హెచ్‌ఓ వెంకటరమణ వివరణ ఇచ్చారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లా స్థాయి అధికారి మొదలు గ్రామ కార్యదర్శి వరకూ వ్యాధి నిరోధక, పారిశుధ్య చర్యల్ని ముమ్మరం చేశారు. 14వ ఆర్థిక సంఘం నిదులు వినియోగించుకోవాలని సిఎం అనుమతివ్వడంతో జిల్లా యంత్రాంగం ఆ దిశగా పంచాయతీల పాలక వర్గాలకు ఆదేశాలు జారీ చేసింది.
పారిశుద్ధ్యం చర్యలు అంతంతమాత్రమే ..
జిల్లాలోని 1003 గ్రామ పంచాయతీల్లో వేలాది గ్రామాల్లో పూర్తి స్థాయిలో పారిశుధ్య పనులు జరగడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయతీ కేంద్రాల్లో ముందుస్తు చర్యలు చేపడుతున్నా.. కుగ్రామాల వైపు కనె్నత్తి చూసే నాథుడే లేకుండా పోయాడు. దీంతో అక్కడి ప్రజలు జ్వరాల బారిన పడి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స నిమిత్తం చేరుతున్నారు. గ్రామ పంచాయతీలకు నిధుల కొరత ఉండటంతో చెత్తాచెదారాన్ని సంపూర్ణంగా తొలగించడం, నీటిమడుగుల్ని పూడ్చివేయలేక పోతున్నట్లు తెలుస్తోంది.
అంతా ఆర్భాటమే...
* చంద్రబాబు రైతులకు చేసింది శూన్యం..
* ఎమ్మెల్యే విశ్వ, మాజీ ఎంపి అనంత ధ్వజం
ఉరవకొండ, సెప్టెంబర్ 20 : ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం ఆర్భాటాలు, ప్రచారాలు తప్ప రైతులకు మేలుచేసింది శూన్యమని ఎమ్మెల్యే విశే్వశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపి అనంతవెంకటరామిరెడ్డి విమర్శించారు. మంగళవారం మండలంలోని నింబగల్లు హెచ్‌ఎల్‌సి హెడ్ రెగులేటర్ వద్ద ఉన్న జిబిసి కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎల్‌సి కాలువలోని జిబిసికి నీటిని మళ్లిస్తున్న వివరాలను డిఇ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకూ జిబిసి కాలువకు ఎన్ని క్యూసెక్కుల నీరు మళ్లించారని ప్రశ్నించారు. అనంతరం మాజీ ఎంపి అనంత మాట్లాడుతూ జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల కరవు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. హెచ్‌ఎల్‌సి నుంచి జిబిసి నీటి ఆయకట్టుకు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి నుంచి జిబిసికి నీరు మళ్లించాలని ఇప్పటికే కలెక్టర్‌ను కోరిన్నట్లు తెలిపారు. ఇకపోతే హంద్రీనీవా డిస్ట్రిబ్యూటరీ కింద పనులు పూర్తి చేయలేదన్నారు. పెండి ంగ్ పనులు పూర్తి చేసి ఉంటే నియోజకవర్గ పరిధిలోని ఆయకట్టు భూములకు నీరు అందేదన్నారు. గతంలో హెచ్‌ఎల్‌సికి 23 టిఎంసీలు నీరు వచ్చేదని, ఈసారి తుంగభద్ర జలాశయం ఎగువ ప్రాంతంలో సరైన వర్షాలు కురవకపోవడంతో రావాల్సిన నీరు రావడంలేదన్నారు. నిబంధనల ప్రకారం రావాల్సిన నీటివాటాను సాధించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. హెచ్‌ఎల్‌సికి కేవలం 10 టిఎంసిలు మాత్రమే కేటాయించగా అందులో కూడా 6.5 టిఎంసిలు మాత్రమే విడుదల చేశారన్నారు. ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిలో హెచ్‌ఎల్‌సికి తుంగభద్ర బోర్డు నీటిని విడుదల చేస్తున్నారన్నారు. ఇక శ్రీశైలం జలాశయంలో 874 అడుగుల నీట్టి మట్టం ఉందన్నారు. అలాగే పులిచింతల ప్రాజెక్ట్‌లో 25, నాగార్జున సాగర్‌లో 136 టిఎంసిల నీరు ఉండగా కృష్ణా ప్రాంతానికి రెండవ పంటకు నీటిని మళ్లిస్తూ రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారన్నారు. ఆయా సమస్యలపై ఈనెల 27న కలెక్టరేట్‌ను ముట్టడించనున్నట్లు తెలిపారు.
జిబిసికి నీరు వదలాలి..
విడపనకల్లు : గుంతకల్లు బ్రాంచి కెనాల్‌కు నీరు వదిలి రై తులు వేసుకున్న మిర్చి పంట వేసుకు న్న రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే విశే్వశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపి అనంత వెం కటరామిరెడ్డి డిమాండ్ చేశారు. మంగ ళవారం మండల పరిధిలోని గడేకల్లు, కడదరబెంచి, డెనేకల్లు గ్రామాల్లో సాగు చేసిన మిర్చి పంటలను వైకాపా నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వేలకువేలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తున్నారన్నారు. ఈ సమయంలో జిబిసికి నీరు బంద్ కావడంతో లక్షల్లో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక మిర్చి రైతులకు నీరిచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇకపోతే వేరుశెనగ పంట సాగు చేసిన రైతులకు రెయిన్‌గన్‌ల ద్వారా నీరు అందిస్తామని చెబుతూ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం రైతులకు చేసింది చేసింది శూన్యమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి తిప్పయ్య, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
హెచ్చెల్సీ దక్షిణ కాలువకు
నీరు విడుదల
* తాడిపత్రి, పులివెందులకు తరలింపు
* ఆయకట్టుకు విడుదల చేయం.. : ఇఇ రమణారెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, సెప్టెంబర్ 20 : మిడ్ పెన్నార్ డ్యామ్(ఎంపిఆర్) నుంచి హెచ్చెల్సీ దక్షిణ కాలువకు అధికారులు మంగళవారం నీరు విడుదల చేశారు. దీంతో తుంపెర వద్ద 72వ కిలోమీటర్ నుంచి పులివెందుల, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్స్‌కు విప్, ఎమ్మెల్యే యామినీబాల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్ ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సిబిఆర్)కు తాగునీటి అవసరాలు, తాడిపత్రి బ్రాంచి కెనాల్ ద్వారా మూడు చెరువులకు నీరు వదిలారు. ప్రస్తుతం సిబిఆర్‌లో 1.6 టి ఎంసిల నీరు నిల్వ ఉంది. ఈక్రమంలో ఎంపిఆర్‌లో ఉన్న 650 క్యూసెక్కుల నీటిలో 300 క్యూసెక్కులు తాడిపత్రి బ్రాంచ్ కెనాల్‌కు, మిగతావి పులివెందుల బ్రాంచి కెనాల్‌కు విడుదల చేసేలా హెచ్చెల్సీ అధికారులు చర్యలు తీసుకున్నారు. సిబిఆర్ నుంచి జిల్లాలోని కదిరి, ధర్మవరం, పుట్టపర్తి పరిసర ప్రాంతాలు, గ్రామాలకు తాగునీటి అవసరాల ఈ నీటిని వాడుకోవచ్చు. తాడిపత్రి కెనాల్ ద్వారా పుట్లూరు, కోమటికుంట్ల, జిగురుగుంట్లపల్లి ట్యాంకులకు నీరు వదిలారు. అయితే ఆ ప్రాంత హక్కుగా ఉన్న ఈనీటిని చుక్క కూడా ఆయకట్టుకు వదలలేదు. కాగా అనంతపురం, కడప జిల్లాల తాగునీటి అవసరాలు తీర్చేందుకు 10 టిఎంసిల నీరు అవసరం. ప్రస్తుతం టిబి డ్యామ్ నుంచి దాదాపు 7 టిఎంసిల నీరు విడుదలైంది. ఈనీటిని పిఎబిఆర్‌లో 3 టిఎంసిల మేర నిల్వ ఉంచారు. అక్కడి నుంచి ఎంపిఆర్‌కు 1.3 టిఎంసిలు తరలించారు. ఈనేపథ్యంలో ఇప్పటికే సిబిఆర్‌లో నిల్వ ఉన్న 1.6 టిఎంసిలకు అదనంగా ఈ 1.3 టిఎంసీలు వదిలితే కడప జిల్లావాసులు తాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉంది. గత 35 రోజులుగా సిబిఆర్‌ను నీరు వెళ్తోంది. కాగా హంద్రీనీవా ద్వారా పిఎబిఆర్‌కు వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ఈనీటితో అనంతపురానికి తాగునీటి అవసరాలు తీర్చనున్నారు. అయితే ప్రతినెలా కృష్ణా బోర్డు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉందని హెచ్చెల్సీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. కాగా అత్యంత ప్రాధాన్యమైన తాగునీటి అవసరాలకే ఈనీటిని వాడుతున్నందున చెరువులు నింపలేమన్నారు.

రోగులతో ఆసుపత్రులు కిటకిట
* ‘పురం’లో జ్వరంతో చిన్నారి మృతి
హిందూపురం, సెప్టెంబర్ 20 : సీజనల్ వ్యాధులు, విష, డెంగ్యూ జ్వరాలతో జిల్లా వణికిపోతోంది. ఫలితంగా జ్వర పీడితులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఇందులో భాగంగానే హిందూపురం జిల్లా స్థాయి ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం జ్వరంతో చికిత్స పొందుతూ నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. మడకశిర మండలం వైబి హళ్లికి చెందిన నరసింహప్ప కుమార్తె నవిత మూడు రోజుల క్రితం జ్వరంతో బాధపడుతుండగా స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. మంగళవారం ఉదయం దాకా నవిత ఆరోగ్య పరిస్థితి కుదుటుగా ఉండగా ఒక్కసారిగా జ్వరం అధికం కావడంతోపాటు మూర్ఛవ్యాధి దాదాపు గంటపాటు పీడించడంతో మృత్యువాత పడినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్, చిన్నపిల్లల వైద్య నిపుణులు కేశవులు తెలిపారు. జ్వరంతో నవిత ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స చేశామన్నారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి పరీక్షలు నిర్వహించగా అలాంటి లక్షణాలు బయటపడకపోగా సాధారణ జ్వరంతో పాటు మూర్ఛవ్యాధి సోకడంతో మృతి చెందినట్లు తెలిపారు. కాగా నర్సుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతి చెందిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఒక్కగానొక్క బిడ్డ మృతి చెందడంతో కుటుంబ సభ్యుల బాధ వర్ణణాతీతం. సకాలంలో వైద్య సేవలు అందించలేదని ఆరోపించారు. ఇకపోతే ఈ ఘటన హిందూపురం ప్రాంతంలో భయాందోళలకు గురి చేస్తోంది. 15 రోజులుగా జ్వరాల బారిన పడి చిన్నారులతో పాటు పెద్దలు, వృద్ధులు పెద్దఎత్తున ఆసుపత్రుల పాలవుతున్నారు. ఒక్క హిందూపురం ప్రభుత్వాసుపత్రికి సోమవారం రికార్డు స్థాయిలో 1,467 మంది సీజనల్ వ్యాధులతో చికిత్స నిమిత్తం రాగా వెయ్యి మంది దాకా చికిత్స చేయించుకున్నారు. ఇందులో అధిక శాతం చిన్నారులే ఉండటం తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఈనెల 1వ తేదీ నుంచి మంగళవారం దాకా సీజనల్ వ్యాధులతో 13,554 మంది ఓపి విభాగంలో చికిత్స చేయించుకోగా 1,267 మంది ఆసుపత్రిలో చేరినట్లు డాక్టర్ కేశవులు తెలిపారు. జిల్లా స్థాయి హోదా కలిగిన హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు, నర్సులు తదితర విభాగాల పోస్టులు ఖాళీగా ఉండటంతో ఎంతో ఇబ్బందులకు గురవుతున్నామని ఆయా వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఏదిఏమైనా సీజనల్ వ్యాధులు ప్రజలను వణికిస్తున్నాయి.
కొనసాగుతున్న వర్షాభావం
* తుంపర్లతో సరి..
* ఇప్పటి వరకూ 20.1 మి.మీ వర్షపాతం
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, సెప్టెంబర్ 20 : జిల్లాలో వర్షాభావం కొనసాగుతూనే ఉంది. జిల్లావ్యాప్తంగా మేఘాలు కమ్ముకోవడమే తప్ప ఓ మోస్తరు వర్షం కూడా కురవని పరిస్థితి. కేవరం తుంపర్లతోనే వరుణుడు సరిపెట్టేస్తున్నాడు. ఈనెలలో ఇప్పటి వరకూ చెదురుముదురుగా కురిసిన వర్షాలతో 20.1 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. మంగళవారం కేవలం 1.2 మి.మీ. మాత్రమే పడింది. అత్యధికంగా గుత్తిలో 11.4 మి.మీ కురిసింది. ఈనెలలో 118.4 మి.మీ. సాధారణ వర్షపాతం కురవాల్సి ఉంది. గతేడాది 20వ తేదీ నాటికి 67.6 మి.మీ. వర్షం కురిసింది. కానీ ఈనెల 20 రోజులు దాటినా కేవలం 20.1 మి.మీ. మాత్రమే కురవడంతో తీవ్ర వర్షాభావం కొనసాగుతోంది. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఖరీఫ్ వేరుశెనగ పంట పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి చేరుకుంటోంది. అన్ని మండలాల్లో వర్షాభావం నెలకొంది. అంతర పంటలు సైతం ఈసారి చేతికొచ్చేలా లేవని రైతులు బెంబేలెత్తుతున్నారు. మరోవైపు రక్షక తడులు ఇచ్చేందుకు కూడా నీటి వనరులు లభ్యం కాని దుస్థితి జిల్లాలో నెలకొంది. దీంతో పంటలు నష్టపోవడం తప్ప చేయగలిగిందేమీ లేదని రైతులు ఖిన్నులవుతున్నారు.
వ్యక్తిగత సెలవుపై కలెక్టర్
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, సెప్టెంబర్ 20 : కలెక్టర్ కోన శశిధర్ మంగళవారం వ్యక్తిగత సెలవులోకి వెళ్లారు. నేడో, రేపో తిరిగి విధులకు హాజరు కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా కొనసాగుతున్నారు.
తాడిపత్రి కాలువకు హెచ్చెల్సీ నీరు విడుదల
నార్పల, సెప్టెంబర్ 20: మండల పరిధిలోని తుంపెర డీప్ కట్ నుండి హెచ్చెల్సీ నీటిని తాడిపత్రి బ్రాంచ్ కాలువకు ఎమ్మెల్యే యామినీ బాల మంగళవారం అట్టహాసంగా విడుదల చేశారు. ఆమె తొలుత తుంపెర డీప్ కట్ వద్ద పూజలు నిర్వహించి అనంతరం స్వయంగా గేట్‌లు తెరచి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ తాగునీటి అవసరాల నిమిత్తం పుట్లూరు, యల్లనూరు మండలాల్లో ఉన్న చెరువులు నింపుతామని అంతేకాకుండా సుబ్బరాయసాగర్ రిజర్వాయర్‌కు నీటిని నింపాలనే ఈ ప్రయత్నమన్నారు. డీఈ శేషగిరిరావు మాట్లాడుతూ పులివెందుల కాలువకు ఇప్పటికే ఒక టీయంసీ నీరు వెళ్లిందని, ప్రస్తుతం తాడిపత్రి కాలువకు రోజుకు 300 క్యూసెక్కులు అలాగే పులివెందుల కాలువకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎపీపీ ఆకుల అరుణ, మండల తెలుగుదేశం నాయకులు ఆకుల ఆంజనేయులు, ఆలం నరసానాయుడు, ప్రతాప్ చౌదరి, కేశేపల్లి చంద్రమోహన్, వైస్ ఎపీపీ తిప్పన్న, బొమ్మలాటపల్లి కుళ్ళాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘ఉపాధి’లో అవినీతి!
* సామాజిక తనిఖీ ప్రజావేదికలో అధికారుల బహిర్గతం
గుత్తి, సెప్టెంబర్ 20 : మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఉపాధి హామీ పథకానికి సంబంధించి అధికారులు సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. సామాజిక తనిఖీ బృందం ఈనెల 14 నుంచి 19 వరకూ వివిధ గ్రామాల్లో నిర్వహించిన తనిఖీల్లో బహిర్గతమైన అవకతవకలను సభలో వెల్లడించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని చెర్లోపల్లి, సి ఎర్రగుడి, ధర్మపురం, ఊబిచెర్ల, లచ్చానుపల్లి, మాముడూరు, కొత్తపేట, జక్కలచెరువు, ఇసురాళ్లపల్లి గ్రామాలకు సంబంధించిన ఉపాధి హామీ పథకం వివరాలు వేరువేరుగా ప్రకటించారు. అనేక గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద సంబందింత ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఉన్నతాధికారులు పనులు పర్యవేక్షించకుండానే నిధులు ముందుస్తుగా డ్రా చేసినట్లు సభ దృష్టికి తీసుకొచ్చారు. టి ఎర్రగుడి, ధర్మాపురం, ఊబిచెర్ల, బ్రాహ్మణపల్లి, కొత్తపల్లి తదితర గ్రామాలలో రైతులకు పండ్లతోటల పెంపకం కింద అందజేసిన మొక్కలు పెద్దమొత్తంలో చనిపోయాయని, దీంతో రూ.లక్షల ప్రజాధనం దుర్వినియోగమైనట్లు పరిశీలనలో వెల్లడైందని ఎస్‌ఆర్‌పి లోకేష్ తెలిపారు. సభ ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా 23 గ్రామ పంచాయతీలకు సంబందించిన వివరాలను వెల్లడించడానికి సాయంత్రం 6 వరకూ సభ కొనసాగింది. అయితే సభలో పాల్గొనడానికి 23 గ్రామ పంచాయతీల నుంచి కేవలం వంద మందిలోపునే హాజరుకావడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్పెషలాఫిసర్ మేఘన్ సునీల్ మాట్లాడుతూ ఉపాధి పథకం సిబ్బంది తూతూమంత్రంగా రికార్డులు నమోదు చేయడం, ముందస్తుగా బిల్లు చెల్లించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ముందస్తు చెల్లింపులకు పాల్పడిన వారిపైన రికార్డులను సక్రమంగా నిర్వహించని సిబ్బందిపైన శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చనిపోయిన మొక్కలకు బిల్లులు చెల్లించి జేబులు నింపుకుంటున్నారా? అని జిల్లా తనిఖీ అధికారి చంద్రశేఖర్ ఉపాధి హామీ పథకం సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ విజయప్రాసాద్, రాష్ట్ర ఉపాధి హామీ పథకం స్పెషలాఫీసర్ మేఘన్ సునీల్, జిల్లా అధికారులు చంద్రశేఖర్‌రావు, ఎపిడి శైలాకుమారి, పిఎంసి ఈశ్వరయ్య, ఎస్‌క్యూసి రవీంద్రనాథ్, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
బస్సు కింద పడి వ్యక్తి మృతి
గార్లదినె్న, సెప్టెంబర్ 20 : మండల కేంద్రంలోని రైల్వే గేట్ సమీపంలో మంగళవారం మర్తాడు గ్రామానికి చెందిన షేక్ అల్లాబకాష్(30) ప్రమాదవశాత్తు బస్సు కింద పడి మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు మర్తాడు గ్రామం నుంచి గార్లదినె్నకు బస్సులో వస్తుండగా రైల్వేగేటు వద్దకు రాగానే గేటు వేశారు. దీంతో బస్సు ఆపారు. ఈసమయంలో అల్లాబకాష్ బస్సు దిగుతూ ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
గుత్తి, సెప్టెంబర్ 20 : కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు (50) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మామిళ్లపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తూ గత కొంతకాలంగా అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమయ్యేవాడు. ఈనేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. దీంతో అపస్మారక స్థితిలో చేరిన బాధితుడిని గమణించిన కుటుంబ సభ్యులు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఘటనపై గుత్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్యాపిలి పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు.
జపాన్ మహిళను పెళ్లి చేసుకుని
వేధించిన వ్యక్తిపై కేసు నమోదు
పుట్టపర్తి, సెప్టెంబర్ 20: జపాన్ దేశానికి చెందిన ఓ మహిళను పుట్టపర్తి నివాసి ప్రేమించి పెళ్లి చేసుకొని తర్వాత వేధిస్తున్నాడంటూ ఆ మహిళ పుట్టపర్తి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు. సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జపాన్ దేశానికి చెందిన మీమీషాహిమద సత్యసాయిబాబా దర్శనార్థం పుట్టపర్తికి వచ్చి వెళ్లేది. 2014 సంవత్సరంలో జాకీర్‌హుస్సేన్ అనే చెప్పుల దుకాణం నిర్వాహకుడు ఆమెను రిజిస్టర్ వివాహం చేసుకోవడం జరిగింది. తరచూ జాకీర్‌హుస్సేన్ షాపుకు వెళ్లివస్తూ ప్రేమలో పడిన మిమిషాహిమద వివాహానికి సైతం మద్దతు తెలపడం జరిగింది. కొంతకాలం వారు సజావుగా ఉంటూ వచ్చారు. ఇటీవల తనను వేధించడం పట్ల ఆమె అసహనానికి గురైంది. తన వద్ద నుండి సుమారు రూ.30లక్షల వరకు జాకీర్‌హుస్సేన్ తీసుకున్నట్లు తెలిపింది. అతనితో తనకు దాంపత్య జీవితం వద్దు అని, తనకు ఇవ్వాల్సిన డబ్బును తిరిగి ఇప్పించాలని జాకీర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి తెలిపారు.

ధ్యానంతో అరిషడ్వర్గాలు దూరం
* విపశ్యన ధ్యాన గురు విజయ్ సింగ్
అనంతపురం కల్చరల్, సెప్టెంబర్ 20: ప్రతి నిత్యం ధ్యానం చేయడం ద్వారా అరిషడ్వర్గాలు దూరమవుతాయని విపశ్యన ధ్యాన గురు విజయ్‌సింగ్ పేర్కొన్నారు. నగరంలోని తపోవనంలో ఉన్న శ్రీ వేదగాయత్రీ దేవాలయం సభామండపంలో ఒక్కరోజు ధ్యాన, జ్ఞాన, యోగా సప్తాహ శిబిరం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యాసకులనుద్దేశించి గురూజీ మాట్లాడుతూ విపశ్యన ధ్యానం బుద్ధ భగవానుని వల్ల వ్యాప్తిలోకి వచ్చిందన్నారు. 2600 సంవత్సరాల క్రితం రుగ్వేదంలోని విపశ్యన ధ్యానాన్ని బుద్ధుడు ఆచరించి జ్ఞానోదయం పొందాడన్నారు. ప్రతి ఒక్కరిని దుఃఖం ఆశ్రయించిందని, దుఃఖానికి కారణం కోరికలని బుద్దుడు తేటతెల్లం చేశాడన్నారు. కోరికలను జయించడానికి అష్టాంగ మార్గాన్ని, ఆర్యసత్యాలను బోధించారన్నారు. శీలం, సమాధి, ప్రజ్ఞ ద్వారా వాటిని జయించాలన్నారు. శరీరానికి ఆహారం ఏ విధంగా శక్తినిస్తుందో, ధ్యానం మనసుకు శక్తినిస్తుందన్నారు. శ్వాసపై ధ్యాస పెట్టడమే ధ్యానమన్నారు.