అనంతపురం

వ్యవసాయానికి ప్రాధాన్యత * రూ.7763.08 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 7 : జిల్లా వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం సంతోషంగా ఉందని కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. గురువారం డ్వామా సమావేశ మందిరంలో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో 2016-17 జిల్లా వార్షిక రుణ ప్రణాళిక విడుదల చేశారు. ఇందులో పంట రుణాలు రూ.3880.92, వ్యవసాయ దీర్గకాలిక రుణాలు రూ.205.32, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.450.63, వ్యవసాయ వౌలిక సదుపాయాల రంగానికి రూ. 86.15, వ్యవసాయ అనుబంధ, వౌలిక సదుపాయ రంగాలకు రూ.4623.02 కోట్లు కేటాయించారు. ఇక పరిశ్రమలు, చేతివృత్తి రంగాలకు రూ.816.09, ఎక్స్‌పోర్టు క్రెడిట్‌కు రూ.10.00, ఇతర ప్రాధాన్యత రంగాలకు రూ.1432.91 కోట్లు కేటాయించారు. ఇలా ప్రాధాన్యతా రంగాలకు రూ.6882.02, నాన్ ప్రయారిటీ సెక్టార్‌కు రూ.881.06 కోట్లు కేటాయించారు. గతేడాది రూ.6710.93 కోట్ల రుణ లక్ష్యం కాగా ఈ ఏడాది రూ.7763.08 కోట్లతో 15.68 శాతం పెంచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయానికి 5.32 శాతం రుణ లక్ష్యాన్ని పెంచడం సంతోషంగా ఉందన్నారు. 2015-16 లోరుణ లక్ష్యాల సాధనలో బ్యాంకర్ల సహకారానికి అభినందనలు తెలుపుతూ ఈఏడాది కూడా ఇదే విధంగా సహకారాన్ని అందించాలని కోరారు. వ్యవసాయం, పశు సంవర్ధకం, ఫిషరీష్, హార్టికల్చర్ రంగాల్లో రెండంకెల వృద్ధి సాధించేలా రుణ ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారన్నారు. వ్యవసాయాన్ని ఉద్యాన వ్యవసాయం దిశగా మళ్లించడం ద్వారా జిల్లాను దేశంలోనే హార్టికల్చర్ బౌల్‌గా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశమన్నారు. హంద్రీనీవా ద్వారా ఈ ఏడాది నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆగస్టులో నీరు ఇచ్చే ప్రాంతాలు చాలా ఉన్నాయని, తద్వారా ఉద్యాన పంటలపై రైతులు దృష్టి పెడతారన్నారు. ఈ ఏడాది 23,200 హెక్టార్లలో బిందు, తుంపర సేద్యం అమలు చేయాలన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పంట, వ్యవసాయ వౌలి వసతులకు రుణాలను పెంచాల్సి ఉంటుందన్నారు. పాలీ హౌస్‌లు, షేడెడ్ నర్సరీలను రైతులు ప్రోత్సహించే దిశగా రుణాలు మంజూరు చేయాలన్నారు.
నిబంధనల మేరకే బంగారం వేలం వేయాలి...
బంగారు ఆభరణాల వేలం విషయంలో ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని కలెక్టర్ సూచించారు. పాత రుణాలకు లింక్ చేసి బంగారాన్ని వేలం వేయడం సరికాదన్నారు. ఆరు నెలల్లోపే వేలం వేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. మీ లక్ష్యాలు మీకు ఉండవచ్చు.. కానీ కొంత మానవతా దృక్పథంతోవ్యవహరించాలన్నారు. వేలం వేసేటపుడు సంబంధిత వ్యక్తులకు వేలం నోటీసులు పంపించాలన్నారు. కళ్యాణదుర్గం ఆంధ్రాబ్యాంకు, సిండికేటు బ్యాంకులో వ్యవసాయ అవసరాలకు అని రాయకుండా బంగారు రుణాలు అని రాసినందు వల్ల రైతులు తమ ప్రయోజనాలను కోల్పోయారని ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి కలెక్టర్, బ్యాంకర్ల దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ నిజంగా పంటల అవసరాల కోసం రుణాలు తీసుకుని ఉంటే రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌తో సంబంధం లేకుండా రుణాలు తీసుకుని ఉంటే వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. కళ్యాణదుర్గం పరిధిలో రుణాలకు సంబంధించి పరిశీలించాల్సిందిగా ఆయా బ్యాంకుల రీజినల్ మేనేజర్‌లను ఆదేశించారు.
విద్యకు రుణాలు ఎందుకు ఇవ్వడం లేదు ..
విద్య రుణాల మంజూరులో బ్యాంకర్లు ఎందుకు స్పందించడం లేదని బ్యాంకర్లను ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లా నుంచి ఉన్నత చదువులకు వెళ్తామంటే ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు ఎమ్మెల్యే ఉన్నం మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఒక విద్యార్థికి విద్య రుణంగా రూ.పది లక్షల రుణం మంజూరు చేయాలని కోరితే మున్సిపల్ పరిధిలోని ఆస్తులనే సెక్యూరిటీగా చూపించాలని చెబుతున్నారన్నారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని ఆర్‌బిఐ ప్రతినిధి మురళీధర్‌ను ఆదేశించారు. పై అధికారులతో మాట్లాడి స్పష్టత ఇస్తానని తెలిపారు. విద్యారుణాలకు సంబంధించి రూ.4 లక్షల వరకూ ఎలాంటి కొల్లేటరల్ సెక్యూరిటీ అవసరం లేదని రూ.7.50 లక్షల వరకూ థర్డ్ పార్టీ సెక్యూరిటీ ఇండియాలో రూ.10 లక్షలు, విదేశాల్లో రూ.20 లక్షల వరకూ విద్యారుణాలను ట్యాంజబుల్ అసెట్స్ సెక్యూరిటీ ఆధారంగా మంజూరు చేయవచ్చని వివరించారు.
చేనేతకు రుణమాఫీ అయ్యే అవకాశం..
జిల్లాలో పది వేల దరఖాస్తులకు 8200 దరఖాస్తులను జిల్లా కమిటీ పరిశీలించి రుణమాఫీ నిమిత్తం సిఫార్సులు చేస్తూ ప్రభుత్వానికి పంపామని త్వరలో రుణమాఫీ అయ్యే అవకాశం ఉందన్నారు. పిజి, ప్రొఫెషనల్ కోర్సుల వికలాంగు విద్యార్థులకు మూడు చక్రాల స్కూటర్‌కు రూ.65 వేలలో 50 శాతం రాయితీతోప్రభుత్వం సబ్సిడీ మంజూరు చేస్తోందని మిగిలిన 50 శాతం బ్యాంకర్లు రుణం మంజూరుకు ముందుకు వస్తున్నారని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టరు కోరారు. కాగా జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చే వారిని కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని పరిశ్రమల శాఖ అధికారులకు సూచించారు. లబ్దిదారులతో నేరుగా మాట్లాడతానని ఫిర్యాదులు వస్తే మాత్రం చర్యలు తప్పవన్నారు. అలాగే జిల్లాలో ప్రస్తుతం 80 శాతం సంఘాలు ఎ గ్రేడుకు చేరాయని డిఆర్‌డిఎ పిడి వెంకటేశ్వర్లు వివరించారు. ఈ అంశంపై స్పందిస్తూ ఇది గణనీయమైన పురోగతి అని బ్యాంకర్లను అభినందించారు. ఈఏడాది 90 శాతం సంఘాల ఆర్థిక కార్యాచరణపై దృష్టి పెట్టాలన్నారు. రూడ్‌సెట్‌లో శిక్షణ పొందిన వారికి రుణాల మంజూరు కాలేదని తనదృష్టికి వచ్చిందని వారికి రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, కాపు కార్పొరేషన్, మెప్మా తదితర శాఖల రుణాల మంజూరులో బ్యాంకర్లు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ, ఎల్‌డిఎం జయశంకర్, సిండికేట్ బ్యాంకు ఆర్‌ఎం ఆశీర్వాదం, ఎస్‌బిఐ ఆర్‌ఎం మురళీకృష్ణ, ఎపిజిబి ఆర్‌ఎం జయసింహారెడ్డి, బ్యాంకర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.