అనంతపురం

జిల్లా టిడిపిలో వర్గపోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, అక్టోబర్ 22 : అనంతపురం జిల్లాలో టిడిపి నేతల మధ్య వర్గపోరు రాజుకుంది. ప్రధానంగా అనంతపురం నగరం కేంద్రంగా సాగుతున్న ఈ రాజకీయ ఎత్తుగడలు రోజుకో మలుపుతిరుగుతున్నాయి. ఎంపి జెసి దివాకర్‌రెడ్డి అభివృద్ధి మంత్రం, స్వచ్చ్భారత్ నినాదాన్ని నెత్తినెత్తుకుని విస్తృత ప్రచారానికి దిగారు. అయితే గతంలోనే తాము అభివృద్ధి పనులు చేపట్టామని, వాటిని కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి స్పష్టం చేస్తున్నారు. తాజాగా శనివారం నగరంలో నిర్వహించిన దోమలపై దండయాత్ర ర్యాలీ సమాచారం స్థానిక ఎమ్మెల్యేకు అందివ్వలేదు. ర్యాలీలో పాల్గొన్న ఎంపి, మేయర్ ఎవరికి వారే తీరుగా వ్యవహరించారు. ఈ వర్గపోరు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న చర్చ సర్వత్రా జరుగుతోంది, అనంతపురం ఎంపి జెసి.దివాకర్‌రెడ్డి, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి మధ్య నెలకొన్న విభేదాలు నగరాభివృద్ధిపై ప్రభావం చూపుతున్నాయి. నగర మేయర్ స్వరూప, ఎమ్మెల్యే బంధువులు కావడం, ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడంతో అభివృద్ధి పనుల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఎంపి బహిరంగంగా ఆరోపిస్తున్నారు. నగరంలో రోడ్ల విస్తరణ, రాంనగర్ రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే మోకాలడ్డుతున్నారంటూ ఎంపి శివాలెత్తుతున్నారు. స్వచ్ఛ్భారత్ నినాదంతో గత మూడు రోజులుగా ఎంపి నగరంలో పర్యటిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. ఇదంతా చూస్తుంటే నగరంపై పట్టు సాధించాలని జెసి చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. కాగా ఎంపి తాజా ఎత్తుగడలను అవతలివర్గం నిశితంగా గమనిస్తోంది. తాడిపత్రి మార్కు రాజకీయాన్ని అనంతలో రుద్దాలని జెసి వేస్తున్న ఎత్తులకు పైఎత్తలు వేసే పనిలో పడింది. నగరంలో అభివృద్ధి తాము చేసిందేనని, నిరంతరం ఈ ప్రక్రియను కొనసాగిస్తామని ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి స్పష్టం చేస్తున్నారు. ఈరోజు కొత్తగా వచ్చిన వారు అభివృద్ధి మంత్రం పఠిస్తే జనం నవ్వుకుంటారని పరోక్షంగా దివాకర్‌రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంపిగా గెలిచినప్పటి నుంచి నగరం వైపు కనె్నత్తిచూడని ఎంపి రెండున్నరేళ్ల తరువాత అభివృద్ధి, స్వచ్ఛ్భారత్ మంత్రం పఠిస్తున్నారన్నారు. పార్టీలో చిరకాలంగా కొనసాగుతున్న తమపై కొత్తగా వచ్చిన వారు ఆధిపత్యం చెలాయించాలని చూస్తే సహించబోమని ఎమ్మెల్యే వర్గం స్పష్టం చేస్తోంది. నగర మేయర్ కుర్చీ కదులుతోందన్న వార్తల నేపధ్యంలో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టబోమని వైకుంఠం ప్రకటించారు. కాగా ఎమ్మెల్యేతో తమకు ఎలాంటి విభేదాలు లేవని, నగరాభివృద్ధికి కలిసి పనిచేస్తున్నామని మేయర్ స్వరూప ప్రకటించారు.
తమమధ్య ఎలాంటి విభేదాలు లేవని అటు ఎమ్యెల్యే, ఇటు మేయర్ ప్రకటించిన నేపథ్యంలో శనివారం జరిగిన దోమలపై దండయాత్ర ర్యాలీ వీరి మధ్య విభేదాలను మరోసారి బహిర్గతం చేసినట్లయింది. ఈ ర్యాలీకి ఎమ్మెల్యే, ఆయన వర్గానికి సమాచారం అందకపోవడంతో దూరంగా ఉన్నారు.
కాగా ఎంపి, ఎమ్మెల్యే వ్యవహారాన్ని జిల్లా టిడిపి నేతలు నిశితంగా గమనిస్తున్నా ఎవరికీ ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అలాగని నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అక్రమాలు జరిగాయని ఎంపి చేస్తున్న ఆరోపణల్ని కొట్టివేసే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి స్వయంగా కల్పించుకుంటేనే మేలన్న భావనలో వీరు ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా అనంతపురం నగరం కేంద్రంగా సాగుతున్న వర్గపోరు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి వెళ్లినట్లు సమాచారం. నేతలు రోడ్డునపడి బహిరంగంగా విమర్శలు చేసుకోవడాన్ని ఆయన సీరియన్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

దండగయాత్ర!
* ఆర్భాటంగా ర్యాలీలు, ప్రదర్శనలు
* క్షేత్రస్థాయికి వెళ్లని సిబ్బంది
* విజృంభిస్తున్న దోమలు.. పెరుగుతున్న రోగులు
* ఫలితమివ్వని ‘దోమలపై దండయాత్ర’
నల్లమాడ, అక్టోబర్ 22 : దోమలను పూర్తిస్థాయిలో నిర్మూలించి దోమల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘దోమలపై దండయాత్ర’ కేవలం దండగయాత్రేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ర్యాలీలు, ప్రదర్శనలు, సమావేశాలు నిర్వహిస్తే దోమలు పరిగెత్తుతాయా? అని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు కొన్ని మున్సిపాలిటీల్లో మాత్రమే పారిశుద్ధ్యంపై చర్యలు చేబడుతున్నారు (పూర్తిస్థాయిలో లేదు) తప్పా మండల కేంద్రాలు, పంచాయతీ గ్రామాల్లో ఎటువంటి చర్యలు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నెల 15న జిల్లా కేంద్రంలో ఇద్రీస్ (12), మహమ్మద్ జువేద్ (10) అనే ఇద్దరు అన్నదమ్ములు డెంగ్యూ జ్వరం సోకి మృతి చెందిన సంగతి విదితమే. దీంతో నిద్రావస్థలో నుంచి ఒక్కసారిగా మేల్కొన్న జిల్లా అధికార యంత్రాంగంతోపాటు ప్రజా ప్రతినిధులకు కూడా దోమల్ని నిర్మూలిస్తే తప్పా డెంగ్యూను నియంత్రించలేమని నానా హంగామాలు చేశారు. ఎక్కడికక్కడ పారిశుద్ధ్యం పనులు చేబట్టాలన్న ఆదేశాలను కూడా జారీ చేశారు. అయితే కేవలం నెల రోజుల్లోనే దోమల నిర్మూలనా చర్యలు నీరుగారిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దోమలపై దండ్రయాత్ర, సంపూర్ణ పారిశుద్ధ్యం అని ఫ్లెక్సీలను ఏర్పాటుచేసుకుని అధికారులు ప్రతి శనివారం ర్యాలీలు మాత్రం నిర్వహించి ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్తున్నారేగానీ దోమల అభివృద్ధికి మూల కారణమైన మురికి నీటి కాలువలు, చెత్తా చెదారాలను తొలగించడంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మురికి నీటి గుంటలు, నీటి ట్యాంకులు, పెద్దపెద్ద కాలువలు తదితర పరిసరాల్లో దోమలు అభివృద్ధి చెందుతాయి. వాటిలో మగ దోమలు కేవలం ఆకు రసాలు పీల్చి బతుకుతుంది. ఆడ దోమలు ఆకు రసాలతోపాటు మనిషి రక్తాన్ని కూడా పీల్చడం జరుగుతుంది. ఆడ దోమలు తమ అండాశయాన్ని అభివృద్ధి చేసుకోవడానికే మనిషి రక్తాన్ని పీలుస్తాయి. మగ దోమలు ఆడ దోమతో సంపర్కం చేసిన తర్వాత చనిపోవడం జరుగుతుంది. మగ దోమల జీవితకాలం కేవలం వారం రోజులు మాత్రమే. అయితే 20రోజుల నుండి 30రోజుల లోపు జీవించే ఆడ దోమలు మనుషులకు కాటేసి పలు రోగాలను కారణమై మానవ ఆరోగ్యకరమైన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దోమల ఉత్పత్తి ఆగాలంటే లార్వా దశ నుంచే నాశనం చేయాలన్న ఆలోచనతో ఆరోగ్య సిబ్బంది మురికి నీళ్ళలో అబేట్ పిచికారి చేయడం, ఆయిల్ బంతులను వేయడం చేస్తుంటారు. అయితే అభివృద్ధి చెందిన దోమల నిర్మూలనకు కేవలం ఫాగింగ్ ఒక్కటే మార్గమని అధికారులకు తెలుసు. దోమల నిర్మూలన పట్ల ఎక్కువ బాధ్యత వున్న జిల్లా మలేరియా విభాగ పరిధిలో కేవలం 10 ఫాగింగ్ యంత్రాలు మాత్రమే వుండటం శోచనీయం. కొన్ని పంచాయతీల పరిధిలో ఫాగింగ్ యంత్రాలు వున్నప్పటికీ గ్రామాల్లో ఫాగింగ్ చేయించడంపై పంచాయతీల పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రతి గ్రామంలో పంచాయతీ అంటే కేవలం వీధి దీపాలు, నీటి సరఫరా అంతే అన్న చందంగా వ్యవహరించడం పరిపాటిగా మారింది. పారిశుద్ధ్యం పనులు చేబట్టడంలో వారు విఫలమవుతున్నారు. ఎవరైనా దోమకాటు ద్వారా వచ్చే వ్యాధులతో మృతి చెందితే కేవలం ఆరోగ్య సిబ్బందిపైనే చర్యలు చేబట్టడం జరుగుతోంది. అయితే గ్రామాల్లో అపరిశుభ్రత చోటు చేసుకున్న సమయంలో వాటి పరిశుభ్రతా చర్యలు తీసుకోవాల్సిన పంచాయతీ పాలకులపై మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. పారిశుద్ధ్యం విషయంలో ఆరోగ్య సిబ్బందికన్నా ఎక్కువ బాధ్యతగా వ్యవహరించాల్సిన పంచాయతీ పాలకులు, అధికారులు మేల్కొని గ్రామాల్లో పరిశుభ్రత పట్ల చేబట్టాల్సిన పనులు చేయనంతవరకూ దోమలపై దండయాత్రలులాంటి ఎన్ని కార్యక్రమాలు చేబట్టినా వాటి వల్ల పూర్తిస్థాయిలో ప్రయోజనం చేకూరదని చెప్పుకోవచ్చు.

టిడిపి బలోపేతమే లక్ష్యం
* టిడిపి నాయకులు జెసి పవన్‌కుమార్‌రెడ్డి
గుంతకల్లు, అక్టోబర్ 22 : అనంత పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరించడంతో పాటు పార్టీ ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేస్తానని ఎపి ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, టిడిపి నాయకులు జెసి పవన్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక రైల్వే కోజీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపిగా జెసి దివాకర్‌రెడ్డికి అనంతపురం తర్వాత అత్యధికంగా మెజార్టీని అందించిన గుంతకల్లు నియోజకవర్గాన్ని తాడిపత్రి తరహాలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. జెసి దివాకర్‌రెడ్డి చెప్పిందే చేస్తారన్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గ సమస్యలను ఎంపి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా గుంతకల్లు ఎఫ్‌సిఐని తరలించేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని ఎంపి జెసి విరమించేందుకు చర్యలు తీసుకుంటారన్నారు. అదేవిధంగా హెచ్‌పిసిని తరలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై పార్లమెంట్‌లో చర్చించి ఇక్కడే కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. గుంతకల్లు అభివృద్ధితో పాటు టిడిపిని బలోపేతం చేస్తామన్నారు. ఎన్నికలలో పోటీ చేయాలన్న ఉద్దేశంతో పర్యటించడం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్‌పర్సన్‌తో కలసి పట్టణాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అంతకు ముందుగా స్థానిక పాత గుంతకల్లులోని మస్తాన్‌వలి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు దేవేంద్రప్ప, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.