అనంతపురం

జిల్లాలో క్రాప్ హాలిడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, నవంబర్ 7: జిల్లా రైతాంగాన్ని కరవు పరిస్థితులు వెంటాడుతున్నాయి. తీవ్ర వర్షాభావం నెలకొన్న నేపథ్యంలో వేరుశెనగ పంటతో పాటు కంది పంటను కూడా రైతులు ఈ ఏడాది నష్టపోయారు. రబీ సీజన్‌లోనైనా నల్లరేగడి నేలల్లో పప్పుశెనగ సాగు చేసుకుందామని ఆశించినా.. అక్టోబర్, నవంబరు నెలల్లో వరుణుడు కరుణించక పోవడంతో సాగు విస్తీర్ణం భారీగా పడిపోయింది. దీంతో గోరు చుట్టు మీద రోకటి పోటులా రైతులకు దెబ్బ మీద దెబ్బ పడటంతో ఆర్థికంగా కుదేలై పోయారు. ప్రస్తుతం రబీలో పప్పుశెనగ పంట సాగు కూడా దారుణంగా పడిపోవడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఈసారి క్రాప్ హాలిడే తప్పేలా లేదు.
ఈ నెల 15 వరకు వర్షాలు కురిస్తే పప్పుశెనగ సాగు చేయవచ్చని వాతావరణ శాఖ శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. మరో వారం రోజుల్లో వర్షాలు బాగా కురిసినట్లయితే రైతులు పంట సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అది కూడా ఆశించిన మేరకు సాగయ్యే పరిస్థితులు లేవు. ఒకవేళ ఆశ కొద్ది సాగు చేసినా జనవరిలో పంట నూర్పిడికి వచ్చే సమయానికి గాలిలో, భూమిలో తేమ శాతం లేకుండా పోయే ప్రమాదం లేకపోలేదు. దీంతో దిగుబడి దారుణంగా పడిపోతుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు గత ఏడాది నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు పంటలు అతలాకుతలమైన తరుణంలో పంపిణీ చేయనున్న పంట నష్ట పరిహారం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.
ఇప్పటి వరకు సాగైంది 6,800 హెక్టార్లు..
ఏటా రబీ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో 80వేల హెక్టార్లలో పప్పుశెనగ పంట సాగవుతుందని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి దాదాపు 71వేల హెక్టార్లలో పప్పుశెనగ పంట వేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 6,800 హెక్టార్లలో మొత్తం 10 మండలాల్లో మాత్రమే సాగైంది. వీటిలో ఉరవకొండ, తాడిపత్రి మండలాల్లో మాత్రమే అధికంగా పంట సాగు చేశారు. అది కూడా 200 హెక్టార్లు, 100 హెక్టార్ల, అంతకన్నా తక్కువగా పలు మండలాల్లో విత్తనం వేశారు.
జిల్లాలో ఉరవకొండ, బెళుగుప్ప, వజ్రకరూరు, కళ్యాణదుర్గం, గుంతకల్లు, కణేకల్లు, తాడిపత్రి తదితర మండలాల్లో పప్పుశెనగ సాగవుతుంది. జిల్లాలో పప్పుశెనగ సాగును దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో దాదాపు 67వేల క్వింటాళ్ల పప్పుశెనగను రైతులకు పంపిణీ చేసింది. దీంతో విత్తనాన్ని సిద్ధం చేసుకుని రైతులు వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి దాదాపు 71 వేల హెక్టార్లలో పప్పుశెనగ పంటను రైతులు సాగు చేశారు. నవంబరులో 34 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉన్నా, ఇప్పటి వరకు జిల్లాలో కురిసిన తుంపర్ల కారణంగా కేవలం 1 మి.మీ. మాత్రమే నమోదైంది.
అక్టోబర్‌లో 118 మి.మీకు గానూ 34.4 మి.మీ. మాత్రమే కురిసింది. రుతుపవనాలు కూడా తరలి పోవడంతో రైతులు ఆశలు వదులుకున్నారు. ఈ నెల 15లోగా దేవుడు కరుణించి వర్షాలు కురిసినా సాగు చేసే పంట జనవరి నాటికి చేతికొచ్చే పరిస్థితి లేదు. ఇక ప్రత్యామ్నాయంగా మంచు ప్రభావంతో ఎంతో కొంత ఫలితాన్నిచ్చే ధనియాలు, కొత్తిమీర వంటి వాటి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. జొన్న పంట వేద్దామన్నా అవకాశం లేదు. కేవలం పశుగ్రాసం కోసం జోవార్ రకం జొన్న సాగు చేయాల్సి ఉంటుందని వ్యవసాధికారి చెన్నస్వామి పేర్కొన్నారు.

రాగులపాడు వద్ద 5 పంపులతో
నీటి పంపింగ్
వజ్రకరూరు, నవంబర్ 7: రాగులపాడు హంద్రీనీవా లిఫ్ట్‌ద్వారా 5 పైపుల ద్వారా సోమవారం నీరు పంపింగ్ చేశారు. ఈసందర్భంగా ఇఇ రాజశేఖర్ మాట్లాడుతూ శ్రీశైలం జలాశయంలో సంపూర్ణంగా కృష్ణజలాలు ఉన్నంతవరకు జీడిపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తామన్నార. ప్రభుత్వ ఆదేశాల మేరకు అనుకూలంగా ఉన్న గ్రామ వంకల ద్వారా చెరువులకు కాలవల నుండి నీరు సరఫరా చేయడం జరిగిందని పేర్కొంటూ ఈ నీటిని వృథా చేయకుండా తమ పంటపొలాలను సాగుచేయడానికి సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాబోయే కాలంలో మండల వ్యాప్తంగా చెరువులకు నీరు సరపార చేసి పంటపోలాలకు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఇ పవన్, సిబ్బంది పాల్గొన్నారు.
హంద్రీనీవా గట్టు పూడ్చివేత
మండల పరిధిలోని పిసి ప్యాపిలి వద్ద జె రాంపురం, కొట్టాల రైతులు తెంపిన హంద్రీనీవా గట్టును ఇఇ రాజశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం మట్టిని వేసి మరమ్మతులు చేయించారు. ప్యాపిలి గ్రామం వద్దనున్న హంద్రీనీవా కాలవ వంతెన పక్కన నుండి జె రాంపురం, కొట్టాల గ్రామ చెరువుకు నీరు పోవాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో ప్యాపిలీ రైతులు నీటిని బంద్ చేయడం జరిగింది. దీనితో వర్షం లేక, హంద్రీనీవా రైతులు రాకపోవడంతో రైతులు కాలవకు చిన్నపాటి గండి కొట్టి నీటిని రప్పించుకున్నారు. ఈ సందర్భంగా ఇఇ రాజశేఖర్, డిఇ పవన్ కాలవను సందర్శించి యదావిధిగా నీరు పోయే విధంగా ఏర్పాటు చేశారు.
నష్టపోయాం.. ఆదుకోండి... రైతులు
హంద్రీనీవా కాలవ గట్టు తెగి పొలాల్లో నీరు నిల్వ ఉండి నష్టం వాటిల్లిందని సోమవారం తహశీల్దార్ ఆదిలింగయ్యకు ప్యాపిలి గ్రామస్థులు వినతిపత్రం సమర్పించారు. పప్పుశెనగ, విత్తన సాగు చేసిన మూడు రోజులకే పొలంలోకి నీరు వచ్చిన నష్టం వాటిల్లిందని ప్రమీళమ్మ అనే మహిళా రైతు పేర్కొన్నారు. వీరితో పాటు హేమ్లానాయక్, సుంకమ్మ, శర్మస్‌వలి వినతి పత్రం సమర్పించారు. రైతులకు మద్దతుగా సర్పంచ్ హనుమంతరాయుడు మాజీ ఎంపిపి తిప్పయ్య తదితరులు పాల్గొన్నారు.
గుత్తిలో స్వచ్చ్భారత్ మిషన్
కేంద్ర ప్రతినిధి పర్యటన
గుత్తి, నవంబర్ 7: గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో సోమవారం స్వచ్చ్భారత్ మిషన్ కేంద్ర కమిటీ సభ్యులు ప్రదీప్‌కుమార్ వివిధ వార్డుల్లో పర్యటించారు. గుత్తి మున్సిపాలిటీని బహిరంగ మలమూత్ర విసర్జన రహిత మున్సిపాలిటీగా గుర్తించే క్రమంలో భాగంగా ఆయన ఉదయం ఐదు గంటలకే మున్సిపాలిటీలో పర్యటన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని సీపర్స్ కాలనీ, బస్టాండ్, గాంధీనగర్, మారుతినగర్, బండగేరి తదితర వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చ్భారత్ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతం కావడానికి తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా ప్రభుత్వం ముందుస్తుగా మున్సిపాలిటీలను ఎంపిక చేసి స్వచ్చ్భారత్ పనులను చేపట్టింది. ఈసందర్భంగా ఆయన వివిధ వార్డుల్లో పర్యటించి పరిసరాల పరిశుభ్రత, డ్రైనేజి వ్యవస్థ, బహిరంగ మలమూత్ర విసర్జన రహిత ఏరియాలను ఆయన గుర్తించారు. ఈకార్యక్రమంలో ఆయనతో పాటు గుత్తి మున్సిపల్ కమీషనర్ కృష్ణమూర్తి, ఎర్రిస్వామిలతో పాటు శానిటరీ ఇన్స్‌పెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా
చంద్రవౌళేశ్వరస్వామి ప్రాకారోత్సవం
మడకశిర, నవంబర్ 7: పట్టణంలోని కార్తీక మాసాన్ని పురస్కరించుకొని చంద్రవౌళేశ్వరస్వామి ప్రాకారోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం 6.30 గంటలకు స్వామి వారికి పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, భిల్వాష్టకం, సహస్ర కుంకుమార్చన వంటి పూజలు నిర్వహించారు. అనంతరం చంద్రవౌళేశ్వరస్వామికి విశేష అలంకరణ నిర్వహించారు. అదే విధంగా భోగి రామేశ్వరస్వామి, వీరభద్రస్వామి, బసవేశ్వరస్వామి, కొండపై వెలసిన రామలింగేశ్వరస్వామి, నగరేశ్వరస్వామికి విశేష పూజలు నిర్వహించారు. మహామంగళ హారతి నిర్వహించి భక్తులకు తీర్థ, ప్రసాదాలు పంపిణీ చేశారు. కాగా శమీవృక్షానికి, భిల్వ వృక్షానికి, అశ్వర్థకట్ట, నాగులకు మహిళలు వెయ్యి పోగుల నేతి వత్తులు వెలిగించి దీపారాధన చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
అర్హులకు అందని సంక్షేమ పథకాలు
లేపాక్షి, నవంబర్ 7: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అర్హులకు సంక్షేమ పథకాలు అందలేదని నియోజకవర్గ వైకాపా సమన్వయ కర్త నవీన్‌నిశ్చల్ విమర్శించారు. సోమవారం మండల పరిధిలోని మల్లిరెడ్డిపల్లి, బైరేపల్లిలో జరిగిన గడపగడపకు వైకాపా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాల కరపత్రాలను ఇంటింటా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే అందతున్నాయన్నారు. అధికారులు కూడా తెలుగుదేశం నాయకుల కనుసన్నల్లో నడుస్తున్నారన్నారు. పచ్చచొక్కాలకు మాత్రమే పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్లు మంజూరు చేస్తూ ప్రజాధనాన్ని దోచుకు తింటున్నారని ధ్వజమెత్తారు. అయితే వైకాపా ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్లు నారాయణస్వామి, సదాశివరెడ్డి, నాయకులు టైలర్ మూర్తి, నంజుండప్ప, వేణుగోపాల్, నారాయణప్ప, హనుమంతు, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలను ఆదుకునేందుకే
సంక్షేమ పథకాలు
హిందూపురం టౌన్, నవంబర్ 7: అన్ని వర్గాల ప్రజలను ఆదుకొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టిడిపి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర బిసి కార్పొరేషన్ చైర్మన్ పామిశెట్టి రంగనాయకులు, మున్సిపల్ చైర్‌పర్సన్ రావిళ్ళ లక్ష్మి, వైస్ చైర్మన్ జెపికె రాము అన్నారు. జన చైతన్య యాత్రల్లో భాగంగా సోమవారం మున్సిపల్ పరిధిలోని 12 వార్డులో పర్యటించారు. ఇందులో భాగంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా, గృహావసరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సబ్ ప్లాన్, విద్యా రుణాలు, రైతు, డ్వాక్రా సంఘాల రుణమాఫీ తదితర పథకాలపై ఇంటింటా తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడం ఒక్క టిడిపి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమవుతుందన్నారు. హిందూపురం మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహకారంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్‌లను ఐదు రెట్లు పెంచి పంపిణీ చేస్తుండటంతోపాటు అర్హులందరికీ ఎన్టీఆర్ స్వగృహ పథకం కింద ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులందరూ తప్పనిసరిగా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు భారతి, సరోజ, సీతాలక్ష్మి, రామ్మూర్తి, రోషన్‌అలీ, సనావుల్లా, వెంకటస్వామి, వెంకటేష్, నాయకులు ఏ.నాగరాజు, షఫీవుల్లా, అమర్‌నాథ్, నజీర్ అహ్మద్ పాల్గొన్నారు.