అనంతపురం

వామ్మో ఒకటో తారీఖు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, నవంబర్ 28: ఒకటో తరీఖు వస్తోందంటేనే వేతనజీవులు, సమాన్యులు బెంబెలెత్తుతున్నారు. జీతాలు తీసుకునేందుకు, ఖాతాల్లోని సొమ్ము తీసుకునేందుకు మళ్లీ బ్యాంకుల వద్ద గంటల తరబడి వేచిఉండక తప్పదా అని ఆందోళన చెందుతున్నారు. పెద్దనోట్లు రద్దుచేస్తున్నట్లు కేంద్రం ప్రకటించినప్పటి నుంచి చిల్లర కోసం జనం పడ్డకష్టాలు అన్నీఇన్నీకావు. ఎటిఎంలు తెరుచుకోకోవడంతో గంటల తరబడి బ్యాంకుల వద్ద క్యూలో నిలుచోగా రూ.2 వేల నోట్లు ఇచ్చారు. తీరా వాటిని మార్చుకునేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఎలాగోలా చిల్లర తెచ్చుకోగా నెలాఖరు కావడంతో మిగిలిన కాస్తాకూస్తా చిల్లర డబ్బులు సైతం ఖర్చుచేసేశారు. ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కనీసం అప్పు చేద్దామన్నా ఇచ్చేవారు కరువయ్యారు. బడ్జెట్ రూపొందించుకుని ఆచితూచి వచ్చే నెల వరకు జీతంతో గడిపే వేతనజీవికి ఒకటో తారీఖు వస్తుండడంతో మళ్లీ కష్టాలు తప్పేటట్టులేవు. వచ్చేనెల జీతం చేతికందితే తప్ప ఇంటి అద్దె, నిత్యావసరాలు, పిల్లల ఆటో, బస్సుచార్జీలు, కుటుంబ అవసరాలు తీరేటట్టులేవు. గత కొన్నిరోజులుగా జనం డబ్బు కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. శని, ఆదివారాలు బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి. సోమవారం భారత్‌బంద్ జరగడంతో కొన్ని చోట్ల బ్యాంకులు మూతపడ్డాయి. మరికొన్ని తెరిచినా నగదు లేదని బోర్డులు పెట్టేశారు. ఇక మిగిలింది రెండు రోజులే. ఈ రెండు రోజుల్లో ఎంతోకొంత నగదు బ్యాంకుల నుంచి తెచ్చుకుంటే వచ్చేనెల ప్రారంభంలో తలెత్తే ఇబ్బందులు అధిగమించవచ్చని చాలామంది భావిస్తున్నారు.
కనగానపల్లి, నవంబర్ 28:గ్రామాల అభివృద్ధి కోసం టిడిపి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత అన్నా రు. కనగానపల్లిలో సోమవారం నిర్వహించిన జనచైతన్యయాత్రలో మంత్రి పాల్గొన్నారు. డప్పులతో గ్రామంలోని మహిళలు హారతులు పడుతూ మంత్రికి ఘనస్వాగతం పలికారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేశారు. సర్పంచి బాల య్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సిఎం చంద్రబాబు చంద్రన్న బీమా పేరుతో ప్రజలకు ధీమా కల్పించి దేవుడయ్యాడన్నారు. చంద్రన్నబీమా ద్వారా ప్రతి ఒక్కరూ రూ రూ. 15 బీమా చెల్లిస్తే ప్రమాదవశాత్తూ ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షలు బీమా చెల్లిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ సభ్యత్వం రూ. 100 చెల్లిస్తే అలాంటి వారికి రూ. 2 లక్షలు పరిహారం అందిస్తామన్నారు. ఆ విధంగా ఒక్కో కుటుంబానికి రూ. 7 లక్షల దాకా లబ్ధి చేకూరుస్తామన్నారు. ప్రతి పంచాయతీలో పార్టీసభ్యత్వం వేగవంతం చేయాలని పార్టీశ్రేణులను ఆదేశించారు. గ్రామాల కల్పతరువు హంద్రీనీవా అని, అలాంటి హంద్రీనీవా కాలువ ద్వారా ఇప్పటివరకు 23 చెరువులు, 73 కుంటలు నీటితో నింపామన్నారు. మిగిలిన అన్ని చెరువులను హంద్రీనీవా నీటితో నింపి బీడుబారిన నేలలను పచ్చని పంటపొలాలతో కళకళలాడేలా చూడాలన్నదే తమ లక్ష్యమన్నారు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. గ్రామాల్లో అందరూ కలసికట్టుగా ఉం టూ గ్రామాల అభివృద్దికి కృషి చేయాలన్నారు. మండల కన్వీనర్ మాధవరాజు, ఎంపీపీ బిల్లేరవీంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు నెట్టెం వెంకటేశులు, నాయకులు టీసీ సుబ్రమణ్యం, చలపతి, బాలకృష్ణ, సుబ్రమణ్యం, నాగభూషణం, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆన్‌లైన్‌కే ప్రాధాన్యం
* ఈ-పోస్, యూపిఐ యాప్, వాలెట్‌లు ఉపయోగించండి
* వాణిజ్య పన్నులశాఖ
ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం, నవంబర్ 28:పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వినియోగదారులు ఇబ్బందులు పడకుండా వ్యాపారులు ఆన్‌లైన్ కొనుగోలు విధానాన్ని పాటించాలని జిల్లా వాణిజ్య పన్నల శాఖ కోరింది. దీనిపై అవగాహన కల్పించేందుకు, సూచనలు, సలహాలు ఇచ్చేందుకు జిల్లా కేంద్రంతోపాటు ప్రతి ఒక్క వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని సంబంధిత అధికారులు ఏర్పాటు చేశారు. వినియోగదారుల వద్ద నగదు ఉన్నట్లయితే కొనుగోలు, అమ్మకాలు జరపాలని, నగదు లేని పక్షంలో లేకుంటే రోజువారీ కొనుగోళ్లు, ఈ-పోస్(ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ లేదా స్వైసింగ్ మిషన్) ద్వారా వివిధ బ్యాంకులకు చెందిన డెబిట్, క్రెడిట్ కార్డులు స్వైప్ చేసి లావాదేవీలు జరపవచ్చు. రిజిష్టర్డ్ డీలర్లతో పాటు చిన్న దుకాణాలదారులు, ఇతర వ్యాపారస్తులు కూడా ఈ-పోస్ మిషన్లను బ్యాంకు అధికారుల నుంచి పొందవచ్చు. లేదా స్మార్ట్ సెల్‌ఫోన్ ద్వారా యూపిఐ యాప్‌తో నగదు పొందే వారి ఖాతా, మొబైల్ మనీ ఐడెంటిఫైయర్(ఎంఎంఐడి) ఐఎఫ్‌ఐసి కోడ్ వంటి వివరాలు అవసరం లేకుండా కేవలం ఖాతాదారుడని వర్చ్యువల్ ఐడి సాయంతో వ్యక్తుల నుంచి వ్యాపారులకు నగదు బదిలీ చేయవచ్చు. అలాగే నగదు పొందవచ్చన్నారు. ఒకే వ్యక్తికి వివిధ బ్యాంకుల్లో ఖాతాలున్నప్పటికీ అన్ని ఖాతాలకు కలిపి ఒక యూపిఐ యాప్ ద్వారా లావాదేవీలు జరపాలి. లేదా వస్తువుల కొనుగోలు సేవలు పొందేందుకు ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్ సాధనంగా ఉపయోగించవచ్చు. డెబిట్‌కార్డు, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వానా నిధులు బదిలీ చేసుకోవచ్చు. రూ. 20 వేల వరకు నగదు
లావాదేవీలు జరుపుకోవచ్చు.
కలకలం రేపిన నోట్లు!
ధర్మవరం రూరల్, నవంబర్ 28: అనంతపురం నగరంలో కొత్తనోట్లు తరలిస్తూ ముగ్గురు ధర్మవరంవాసులు పోలీసులకు చిక్కడం కలకలం రేపింది. పట్టుబడిన వారిలో ధర్మవరానికి చెందిన తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకుడు ఉండడం గమనార్హం. ధర్మవరంలో బంగారు నగల వ్యాపారం చేస్తూ తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్ర పోషించిన మైనారిటీ నాయకుడు తొలుత పరిటాల వర్గంలో ఉన్నారు. ఆ తరువాత ఎమ్మెల్యే వర్గంలో చేరిపోయారు. పార్టీలో చురుగ్గా పాల్గొంటూ మైనారిటీ నేతగా ఎదిగారు. అటు బంగారం వ్యాపారం చేస్తూ ఇటు పార్టీలో చురుగ్గా పాల్గొంటూ తలలోనాలుకలా మెలిగారనే చెప్పాలి. అయితే మరో ఇద్దరు వ్యాపారులతో కలిసి ఆదివారం అర్ధరాత్రి అనంతపురం నగరంలోని బళ్ళారి రోడ్డులో పోలీసులకు చిక్కాడు. బంగారం కొనుగోలు చేసేందుకు వచ్చినట్లు వీరు చెప్పినా అందుకు సరిపడ ఆధారాలు చూపకోవడంతో వీరివద్ద ఉన్న రూ.18.50 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో అన్నీ రూ.2 వేల నోట్లు ఉండడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఇంత పెద్దమొత్తంలో రూ.2 వేల నోట్లు వీరికి ఎలా వచ్చాయన్న కోణంలో ఆరా తీస్తున్నట్లు సమాచారం.
రద్దయిన నోట్ల మార్పిడికే వచ్చారా...
ధర్మవరానికి చెందిన ముగ్గురు రద్దయిన పెద్దనోట్ల మార్పిడికే అనంతపురం వచ్చినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగారం కొనుగోలుకు వచ్చినట్లు వీరు పోలీసులకు చెబుతున్నా వాటికి ఆధారాలు చూపించలేకపోయారు. దీంతో పెద్దనోట్ల మార్పిడికే వచ్చిఉంటారన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది. రూ.500, రూ.వెయ్యి నోట్లు రద్దయిప్పటి నుంచి నల్లకుబేరులు తమ వద్ద ఉన్న నోట్లు మార్పిడికి కమీషన్ ఎర వేస్తున్నారు. లక్షకు రూ.30 వేల కమిషన్ ఆఫర్ ప్రకటించడంతో పలువురు ఆశతో నల్లధనం మార్పిడికి యత్నిస్తూ వస్తున్నారు. అదే క్రమంలో మైనారిటీ నాయకుడు సైతం డబ్బుతో వచ్చిఉంటాడని భావిస్తున్నారు.
సమాచారం ఎలా తెలిసింది...
మైనారిటీ నాయకుడు పెద్దమొత్తంలో నగదుతో అనంతపురం వచ్చినట్లు పోలీసులకు అర్ధరాత్రి ఎవరో సమాచారం అందించారన్న చర్చ జోరందుకుంది. మైనారిటీ నేత అంటే గిట్టనివారు కబురుపెట్టారా లేక బంగారం వ్యాపారంలో ఉన్న ప్రత్యర్థులు దెబ్బ తీసేందుకు ఇలా చేశారా , లేక పార్టీలోని ప్రత్యర్థులే కబురందించారా అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది.
బ్యాంకర్లతో మిలాఖత్...
కాగా పోలీసులకు పట్టుబడిన మైనారిటీ నేత వద్ద అంత పెద్ద మొత్తంలో కొత్త రూ.2 వేల నోట్లు లభించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. పెద్దనోట్లు రద్దచేసిన ప్రభుత్వం కొత్త నోట్లను బ్యాంకుల ద్యారా జారీ చేస్తోంది. సామాన్య జనం గంటల తరబడి బ్యాంకుల వద్ద వేచి ఉండే కేవలం రూ.4 వేలు మాత్రమే ఇచ్చారు. అవీ రూ. 2 వేల నోట్లు కావడంతో చిల్లర కోసం జనం నానా అగచాట్లు పడ్డారు. అలాంటిది అధికారపార్టీ నేతకు లక్షల్లో రూ.2 వేల నోట్లు ఎవరు ఇచ్చారు, ఏ బ్యాంకు నుంచి ఇతడు డబ్బు తీసుకున్నాడు అన్న కోణంలో పోలీసులు కూపీ లాగే అవకాశాలు ఉన్నాయి.
హర్తాళ్ పాక్షికం
ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం, నవంబర్ 28: వామపక్షాల పిలుపు మేరకు సోమవారం చేపట్టిన భారత్‌బంద్ జిల్లాలో పాక్షికంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాలు, ముఖ్య పట్టణాల్లో నామమాత్రంగానే ప్రతిపక్షాలు పాల్గొన్నాయి. పెద్ద నోట్ల రద్దుతో జనం పడుతున్న అవస్థలకు, ఆర్థిక సమస్యలకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తీరే కారణమంటూ వామ పక్షాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షం వైకాపా, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో బంద్ నామమాత్రంగానే జరిగింది. అనంతపురం నగరంలో సిపిఐ, సిపిఎం, వైకాపా, కార్మిక సంఘాలు, పలు విద్యార్థి సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి. దుకాణాలు, విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలను నిర్వాహకులు స్వచ్ఛందంగా మూసివేశారు. సినిమా థియేటర్లు, పెట్రోలు బంకులు మూత పడ్డాయి. బంద్ సందర్భం గా పోలీసులు వామపక్షాలు, వైకాపా, ఇతర అనుబంధ సంఘాల నాయకుల్ని ముందస్తుగా అరెస్టులు చేశారు. అనంతపురం నగరంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్, జిల్లా, నగర శాఖ నాయకులు, సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, రాష్ట్ర నాయకుడు ఓబులు బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వామ పక్షాల ఆధ్వర్యంలో ఉదయం స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద డిపో ఎదురుగా బస్సులు బయటకు రానీకుండా అడ్డుకున్నారు. వైకాపా ఆధ్వర్యంలో నగరంలో రెండు బృందాలుగా ర్యాలీలు నిర్వహించారు. శింగనమల నియోజకవర్గ నేత ఆలూరి సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, ఇతర నాయకులు, నగర సీనియర్ నాయకులు చవ్వా రాజశేఖరరెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ర్యాలీలో రాష్ట్ర కార్యదర్శి మీసాల రంగన్న, జిల్లా కన్వీనర్ పెన్నోబిలేసు, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి కెసి దేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి సోమశేఖరరెడ్డి, నాయకుడు మారుతీప్రకాష్, నగర సేవా దళ్ నాయకుడు వాయల శ్రీనివాసులు, మైనార్టీసెల్ నాయకుడు పాన్ సాధిక్, తదితరులు పాల్గొన్నారు. గుంతకల్లులో వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త వెంకట్రామిరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆ పార్టీ నాయకుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ జింకల రామాంజనేయులు, ఇతర నాయకులను అరెస్టు చేసి వదిలి పెట్టారు. దీంతో గుంతకల్లుతో పాటు ఉరవకొండ, గుత్తిలో సైతం బంద్ విఫలమైంది. కదిరిలో వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త సిద్దారెడ్డిని, పట్టణ కన్వీనర్ కె ఎస్‌బావుద్దీన్‌ను ఉదయం ర్యాలీ సందర్భంగా పోలీసులు అరెస్టు చేశారు. సిపి ఐ, సిపి ఎం నాయకుల్ని కూడా అరెస్టు చేశారు. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఊసే లేకుండా పోయింది. పుట్టపర్తిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నా బంద్‌లో ఎవరూ పాల్గొనలేదు. వైకాపా, సిఐటియూ నాయకులు మాత్రం కొంత సేపుర్యాలీ చేసి వెళ్లిపోయారు. ధర్మవరంలోనూ వామ పక్షాలు నామమాత్రంగా బంద్‌లో పాల్గొన్నారు. బస్సులు, ప్రైవేటు వాహనాలు తిరిగాయి. హిందూపురంలో సైతం బంద్ విఫలమైంది. పెనుకొండలో యథావిధిగా ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు నడిచాయి. వ్యాపార సముదాయాలు తెరిచే ఉంచారు. ఉరవకొండలో వామ పక్షాలు ఆర్టీసీ డిపో వద్ద ధర్నా చేశాయి. వీరిని పోలీసులు అరెస్టు చేసి విడుదల చేశారు. తాడిపత్రిలో బంద్ విఫలమైంది. ఇతర నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో బంద్ ప్రభావం కనిపించలేదు. దీంతో జన జీవనం యథాతథంగా కొనసాగింది.

టిడిపిలో బంధుప్రీతికి చోటు లేదు:మంత్రి పల్లె
నల్లమాడ, నవంబర్ 28 : అన్నదమ్ములు, బావా బావమరుదులు, చెల్లెళ్లు అంటూ బంధుప్రీతి లేని పార్టీ టిడిపి అని, ప్రజా సంక్షేమమే టిడిపి లక్ష్యమని మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పష్టం చేశార. మండలంలోని దొన్నికోటలో సోమవారం యువ నాయకుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో వందలాదిమంది టీడీపీలోకి చేరారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి పల్లె మాట్లాడుతూ పార్టీలో కష్టపడేవారికీ, అన్ని వర్గాలకూ సమాన ప్రాధాన్యతనిచ్చి వారి అభివృద్ధి కోసం శ్రమించడమే టీడీపి ప్రత్యేకత అన్నారు. సియం చంద్రబాబు నేతృత్వంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. పేదల కోసం ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 2.5 లక్షల వరకూ అందిస్తున్నామన్నారు. రేషన్‌కార్డులు, ఎన్టీఆర్ వైద్యసేవ, గృహాలు, అర్హులందరికీ పింఛన్లు, ప్రతి గ్రామానికీ తారు, సిమెంటు రోడ్లు, నీటి ట్యాంకులు ఇలా ఎన్ని కార్యక్రమాలు చేబడుతున్నప్పటికీ జిల్లా వాసుల్లో నిరాశ వుందన్నారు. అందుకు ముఖ్య కారణం వర్షాలు కురవకపోవడమే అన్నారు. జిల్లాలోని చెరువులను నీటితో నింపాలని సిఎం చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. అ యితే ప్రతిపక్షాలకు నోరుపారేసుకోవడం తప్పా రాష్ట్భ్రావృద్ధి పట్టలేదన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం దేశంలోనే ముందుండేలా చేయడమే టీడీపి ప్రభుత్వ లక్ష్యమని అందుకు ప్రజల సహకారం వుండాలని కోరారు. అనంతరం దొన్నికోట, పులగంపల్లి, ఎద్దులవాండ్లపల్లి, గూడుమేకలపల్లి చెర్లోపల్లి గ్రామాలకు చెందిన పలువురికి కుండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నల్లమాడలోని పంచాయతీ కార్యాలయంలో ఆర్డీటి వారు అందజేసిన రూ. 9 లక్షలు విలువ చేసే శుద్ధ జల యంత్రాన్ని మంత్రి ప్రారంభించారు. మైనార్టీ సెల్ రాష్ట్ర డెరెక్టర్ అల్లాబకష్, కిరణ్‌కుమార్‌రెడ్డి, శివరాంనాయుడు, గడ్డం రమణారెడ్డి, అగిశం ప్రతాప్, రమణ, కేశవరెడ్డి, సుధాకర్‌రెడ్డి, అష్పక్‌ఖాన్, వాసుదేవరెడ్డి, షానవాజ్, ఫయాజ్, పెద్దప్పయ్యనాయుడు, నల్లమాడ ఎంపీటీసి చండ్రాయుడు, రషీద్‌ఖాన్, నల్లమాడ సర్పంచ్ రంగలాల్‌నాయక్, కార్యదర్శి శంకర్‌నాయుడు, మెడికల్ స్టోర్ మంజు, అగ్గిరాముడు, రాంచంద్ర, హరిక్రిష్ణ, అబ్బాస్, బాబావలి నాయకులు పాల్గొన్నారు.
జగన్‌కు
ఘన స్వాగతం
కదిరి, నవంబర్ 28:వైకాపా అధినేత వైయస్ జగన్‌కు సోమవారం సాయంత్రం పట్టణంలోని వేమారెడ్డి కూడలిలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. బెంగుళూరు నుండి పులివెందులకు వెళ్తున్న సందర్భంగా వేమారెడ్డి కూడలిలో జగన్ కాన్వాయ్ చేరుకోగానే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వేచివుండడంతో జగన్ అక్కడ ఆగి అభివాదం చేశారు. జగన్ వెంట వైకాపా కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా. సిద్దారెడ్డితో పాటు వైకాపా నాయకులు ఉన్నారు.
ప్రభుత్వ పథకాలపై తప్పుడు ప్రచారం
* వైకాపా అధినేత జగన్‌పై చీఫ్ విప్ కాలవ ఆగ్రహం
డీ.హీరేహాల్, నవంబర్ 28:తండ్రిని అడ్డం పెట్టుకుని అడ్డంగా సంపాదించిన అవినీతి సొమ్ముతో పెట్టుకున్న పత్రిక ద్వారా ప్రభుత్వ పధకాలపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడని వైకాపా అధినేత వైఎస్ జగన్‌పై చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి తలపెట్టిన ప్రజా జన చైతన్యయాత్ర, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా సోమవారం డీ.హీరేహాల్ మండల పరిధిలోని ఇర్దేహాల్, డీ.హీరేహాల్ గ్రామాలలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమం ముందుగా స్పెషల్ గ్రాంట్ కింద రూ.15లక్షల వ్యయంతో పూర్తి చేసిన మంచినీటి సరఫరా పథకాన్ని డీ.హీరేహాల్ గ్రామానికి తాగునీటి సరఫరా పధకానికి ఎమ్మెల్యే కాలవ ప్రారంభించారు. అనంతర వారు మాట్లాడుతు నీతి వంతమైన పరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడిని విమర్శించడం అవినీతి పార్టీ అయిన వైకాపాకు లేదని కాలవ అన్నారు. పసుపు యాంటిబయాటిక్‌గా ఎలా పనిచేస్తుందో పసుపు చొక్కాతో అవినీతి నిరోధక శక్తిగా టిడిపి అవతరించిందని ఆయన అన్నారు. టిడిపి కార్యకర్తలు కూడా తలెత్తుకుని ప్రజల్లో తిరుగుతూ స్వచ్చమైన పరిపాలనను అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన పధకాలను అర్హులకు చేరే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ చంద్రహాస్, ఎంపిపి పుష్పవతి, వైస్ ఎంపిపి గంగాధర, తెలుగుదేశం మండల కన్వీనర్‌లు హనుమంతురెడ్డి, హనుమంతు, స్థానిక గ్రామ సర్పంచ్ లక్ష్మిదేవి, నాగళ్లి వెంకటేశులు, నాగళ్లి పుష్పవతి, శ్రీరామజ్యోతి, కాదలూరు మోహన్‌రెడ్డి, అంగడి రాజశేఖర్, రాయదుర్గం పురపాలక కౌన్సిలర్లు టంకశాల హనుమంతు, గాజుల వెంకటేశు, చుంచుల నాగప్ప, పాండు పాల్గొన్నారు
డీలర్లు సిండికేట్ బ్యాంకులో ఖాతాలు తెరవాలి
అనంతపురం సిటీ, నవంబర్ 28: నగదు రహిత లావాదేవీలను నిర్వహించేందుకు జిల్లాలో ఉన్న 3వేల మంది ఎఫ్‌పి షాపు డీలర్లందరూ సిండికేట్ బ్యాంకులో జిరో బ్యాలెన్సుతో కరెంటు ఖాతాలను ప్రారంభించాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ బి.లక్ష్మికాం తం ఆదేశించారు. జిల్లాలోని ఆర్‌డిఓ లు, ఎంపిడిఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎఫ్‌పి షాపు డీలర్లు, ఆర్‌డిబ్యుయస్ ఏఇలకు ఇన్‌లైన్, మొబైల్ లావాదేవీల నిర్వహణకై సో మవారం తన క్యాంపు కార్యాలయం నుండి వినూత్నంగా మొబైల్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 1 నుండి నగదు రహిత లావాదేవీ లు తప్పకుండా మొదలు కావాలన్నా రు. ఎఫ్‌పి షాపు డీలర్లందరూ తమ చౌక ధరల దుకాణం ముందు విలేజ్ మాల్ అనే బ్యానర్‌ను ఏర్పాటు చేయాలని, దానితో పాటు ధరల పట్టిక తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. ప్రతి ఒక్కరూ నగదు రహిత విదానాల ద్వా రా లావాదేవీలు నిర్వహించాలని సామాజిక ఫించన్‌దారులు, స్వయం సహాయక సంఘాల వారి బ్యాంకు ఖాతాలను యాక్టివేట్ చేయించాలని, ఖాతాలు లేని వారికి ఖాతాలను ప్రా రంభించాలని అధికారులను ఆదేశించారు. దీపం పథకంలో గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయని గ్యాస్ ఏజెన్సీలకు షోకాజ్ నోటీసులు పంపిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఎం.వీసా అనే మొబైల్ యాఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. లోన్ ఛార్జి క్రియేషన్ మా డ్యూల్‌లో జ్యూరీ అవార్డుకు ఏపి ఎంపికైందన్నారు. అలాగే ప్రజాసాధికార సర్వేను వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇంకా మూడు రోజులే మిగిలివుందని, ఈ నెలఖారులోగా సర్వేను తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సర్వేలో ఇప్పటి వరకు కళ్యాణదుర్గం ఆర్‌డిఓ రామారావు 97 శాతం తో ముందంజలో వున్నారని ఆయనను ప్రశంసించారు. కెవైసిలో కదిరి ఆర్‌డిఓ ముందుంజలో వున్నారని తెలిపారు. అలాగే మీ కోసం, మ్యుటేషన్, ఈ-పట్టాదారు పాసుపుస్తకం, మీభూమి-్ఫర్టల్, 1బి ఆధార్, ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ వన్‌టైమ్ కన్వర్షన్, పెండింగ్ ఫైల్స్ తదితర అంశాలపై సమీక్షించారు. ఆర్‌డిఓలు, తహసీల్దార్లు, ఎంపిడిఓ పాల్గొన్నారు.
పుట్టపర్తిలో కార్తీకదీపోత్సవం
పుట్టపర్తి,నవంబర్ 28:ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో పవిత్ర కార్తీక దీపమహోత్సవం ఘనంగా జరిగింది. సోమవారం సాయంత్రం చిత్రావతినదిలో అశేషభక్తజనం కార్తీకదీపోత్సవాన్ని నిర్వహించారు. బ్రహ్మకుమారీలు, సత్యసాయిభక్తులు సంయుక్తంగా కార్తీకదీపమహోత్సవాన్ని నిర్వహించారు. భగవాన్ సత్యసాయిబాబా ప్రసంగ ఆంగ్ల అనువాదకుడు ప్రొఫెసర్ అనిల్‌కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి ఏటా కార్తీకదీపమహోత్సవం జరుపుకుందామని ఆయన భక్తులకు పిలుపునిచ్చారు. అశేషభక్తజనం ఈ కార్తీకదీపాలను వెలిగించి భక్తిప్రపత్తులను చాటుకున్నారు. దేశవిదేశీయులు సైతం పాల్గొనడం విశేషం.
జిల్లాకు రూ. 88.60 కోట్ల కరెన్సీ
అనంతపురం సిటీ, నవంబర్ 28:కేంద్ర ప్రభుత్వం రూ.500, 1000నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో జిల్లాకు ఆర్‌బిఐ నుండి రూ.88.60కోట్లు కరెన్సీ అందినదని ఇన్‌ఛార్జి కలెక్టర్ బి.లక్ష్మికాంతం ఒక ప్రకటనలో తెలిపారు. రోజువారీ బ్యాంకర్ల సమావేశంలో ప్రజలకు కరెన్సీని వివిధ బ్యాంకుల ద్వారా అందజేసేందుక రూ.100కోట్లు అవసరమని ఇటీవల ఉన్నతాధికారులను కలెక్టర్ కోరడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు రిజర్వ్ బ్యాంకు నుండి రూ.88.60కోట్లు కరెన్సీ వచ్చిందని తెలిపారు. నోట్లు రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న జిల్లా ప్రజలకు కరెన్సీ నోట్లు రావడంతో కొంత మేరకు ఇబ్బందులు అధికమించవచ్చునని తెలిపారు.
వైభవంగా కార్తీక దీపోత్సవం
అనంతపురం కల్చరల్, నవంబర్ 28 : కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా నగరంలోని ఆలయాల్లో కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయానే్న భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి, దీపారాధన చేశారు. అదేవిధంగా సాయంత్రం దీపోత్సవాలు నిర్వహించారు. దీపకాంతుల మధ్య ఆలయాలు దేదీప్యమానంగా వెలుగొందుతూ భక్తులకు నేత్రానందం, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించాయి. మొదటిరోడ్డు శ్రీ కాశీవిశే్వశ్వర కోదండ రామాలయం, పాతూరు శ్రీ విరూపాక్షేశ్వరస్వామి ఆలయం, వ్యాసరాజమఠం, సంగమేష్‌నగర్ శ్రీ పార్వతీపరమేశ్వర ఆలయం, గీతామందిరంలోని శివాలయం, అరవిందనగర్ శ్రీ సర్వేశ్వరస్వామి ఆలయం, శివకోటి ఆలయం, లక్ష్మీనగర్, ఆరోరోడ్డులోని శివాలయాలు, హెచ్చెల్సీ కాలనీ శ్రీ చాముండేశ్వరి ఆలయం, శ్రీ మంజునాథ స్వామి ఆలయాల్లో కార్తికమాసం చివరి సోమవారం సందర్భంగా శివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. కాగా నగరంలోని మూడోరోడ్డులో గల గొంగడి రామప్ప ఫంక్షన్‌హాలులో అనంత శివారాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్తికమాసం చివరి సోమవారం సందర్భంగా నిర్వహించిన లక్ష దీపోత్సవానికి స్థానిక భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈకార్యక్రమానికి స్వామి ఆత్మవిదానంద, ప్రతిష్టానంద సరస్వతి మాతాజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈసందర్భంగా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, శ్రీ లలితా సహస్రనామ పారాయణము, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణము, లింగాష్టకము మొదలైన భగవన్నామ స్మరణలు పారాయణము చేశారు. వేదపండితులు ఛాయాపతి మదనమోహన్ చే మహాగణపతిపూజ, కాశీవిశే్వశ్వర లింగమునకు, గోమాత, తులసీమాత, ధాత్రీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక భజనలు చేశారు. స్వామీజీలు కార్తిక మాస వైశిష్ట్యాన్ని భక్తులకు వివరించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపి ణీ చేశారు. గొంగడి రామప్ప, గొంగడి బుగ్గేష్, ఉడుపి అనంతపద్మనాభ, చంద్రశేఖర్, చలపతిరెడ్డి, పాలసము ద్రం నాగరాజు, మహేష్, కోడూరు సుధాకర్, నాగరాజు పాల్గొన్నారు. కార్తిక సోమవారం సందర్భంగా మం జునాథస్వామి ఆలయంలో శివునికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో లక్షదీపోత్సవం నిర్వహించారు. అదేవిధంగా భక్తులు హెచ్చెల్సీ కెనాల్‌లో నీటిలో దీపాలు వదిలారు. నగరంలోని ఆర్‌ఎఫ్ రోడ్ శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా శివపార్వతుల కల్యాణం భక్తులకు నేత్రానందం కలిగించింది. అధిక సంఖ్యలో భక్తులు హాజరై పూజలు నిర్వహించారు.
ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతు
పుట్లూరు, నవంబర్ 28:ఈతకు వెళ్లి ఓ విద్యార్థి గల్లంతయిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. పుట్లూరు మండలపరిధిలోని నారాయణరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకటరాముడు, రామాంజినమ్మ కుమారుడు రాజకుళ్లాయప్ప ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తన మిత్రులతో కలసి సోమవారం సుబ్బరాయసాగర్‌కు ఈతకు వెళ్లాడని, అయితే ఈత రాకపోవడంతో రాజకుళ్లాయప్ప నీటిలో మునిగి గల్లంతయ్యాడని మిత్రులు తెలిపారు. దీంతో మిత్రులు ఈ విషయాన్ని వెంటనే రాజకుళ్లాయప్ప తల్లిదండ్రులకు తెలిపారు. వారు వెంటనే సుబ్బరాయసాగర్‌లో గాలించినా ఫలితం లేకుండాపోయింది.
ఆటో బోల్తా-తొమ్మిది మందికి గాయాలు
హిందూపురం రూరల్, నవంబర్ 28:హిందూపురం పరిసర ప్రాంతాల నుండి ప్రయాణికులను తూమకుంట పారిశ్రామిక వాడలోని గార్మెంట్ ఫ్యాక్టరీకి తీసుకెళుతున్న ఆటో సోమవారం గోళ్ళాపురం రహదారిలో ప్రమాదవ శాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ సంఘటనలో జుమాకులపల్లి, పి.సడ్లపల్లి గ్రామాలకు చెందిన మీన, సుజాత, నందిని, అరుణ, నాగరాజు, అర్చన గాయపడ్డారు. వెంటనే 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డుప్రమాదంలో ఇద్దరికి గాయాలు
మండలంలోని పూలకుంట సమీపంలోని సోమవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని మేళాపురంనకు చెందిన మంజునాథ్, విజయ్‌కుమార్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 వాహనంలో హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.