అనంతపురం

బ్యాంకులు, పోస్ట్ఫాసులపై సిబిఐ కన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 13 : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో పాత రూ.500, రూ.1000 నోట్ల మార్పిడిలో చోటుచేసుకున్న అక్రమాలపై సిబిఐ కొరడా ఝలిపించనుంది. ఇందులో భాగంగా దొడ్డిదారిన కొత్త రూ.2వేల నోట్లను పంపి, పాత నోట్లు మార్పిడి చేసిన వ్యవహారంపై ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో కొందరు తమ పరపతిని ఉపయోగించి అధికారులు, పోస్టుమాస్టర్లను ఉపయోగించుకుని పెద్ద ఎత్తున పాతనోట్ల మార్పిడి జరిగినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆదాయ పన్ను శాఖతో పాటు సిబిఐ అధికారులు సైతం అధిక మొత్తంలో పాతనోట్లు డిపాజిట్ చేసిన వారిని భరతం పట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జన్‌ధన్ ఖాతాల్లో జమ అయిన మొత్తాలపై కేంద్రం కనె్నర్రజేసింది. నల్లధనాన్ని వెలికి తీయాలన్న లక్ష్యంతో పెద్దనోట్ల రద్దును అమలు చేస్తుంటే దొడ్డిదారిన నల్లకుబేరులు కొత్త రూ.2వేలు, రూ.500 నోట్లను తరలించుకుపోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈనేపథ్యంలో అలాంటి ఖాతాలపై సిబిఐ దృష్టి సారించింది. మరోవైపు విజిలెన్స్ టీమ్‌లు సైతం బ్యాంకుల పుటేజీలను పరిశీలించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. దొడ్డిదారుల్లో కొత్త నోట్లు తరలిపోవడంతో పెద్దనోట్ల రద్దు అనంతరం 35 రోజులు గడిచిపోయినా నేటికీ సామాన్యులు, మధ్యతరగతి జీవులు నానా అవస్థలు పడుతున్నారు. నగదు కోసం బ్యాంకులు, ఎటిఎంల వద్ద పడిగాపులు కాస్తున్నారు. చలామణిలో ఉన్న చిన్న నోట్లు, కొత్త రూ.2వేలు నోట్లు బ్యాంకుల్లో తిరిగి డిపాజిట్ కాకపోవడంతో లావాదేవీల్లో ఇబ్బందులు తప్పడం లేదు.

కిక్కిరిసిన బ్యాంకులు
* చాంతాడంత క్యూలు..

అనంతపురం, డిసెంబర్ 13 : పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఇప్పటికే నగదు కోసం ఇక్కట్లకు గురవుతున్న జనానికి బ్యాంకులకు మూడు రోజులు వరుస సెలవులు రావడంతో కరెన్సీ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో మంగళవారం తెల్లవారగానే బ్యాంకుల వద్దకు జనం పరుగులు తీయడంతో వినియోగదారులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా వచ్చే నెల జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల వద్దా ఇదే పరిస్థితి. మరో రెండు రోజుల్లో కొత్త రూ.500 నోట్లు రాష్ట్రానికి వస్తున్నట్లు సిఎం చంద్రబాబునాయుడు జిల్లాధికారులకు తెలిపారు. అయితే ఒక్కో జిల్లాకు ఎంత నగదు వస్తుందోనన్న అంశంపై బ్యాంకర్లకు సైతం సరైన సమాచారం లేదు. ఎప్పటికప్పుడు నోట్ల డిమాండ్‌ను ప్రభుత్వానికి పంపుతున్నామని వారు చెబుతున్నారు. కాగా మంగళవారం జిల్లా కేంద్రంలోని సాయినగర్‌లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ జనంతో కిటకిటలాడింది. ఓవైపు ఎటిఎం కేంద్రం, మరోవైపు బ్యాంకు వద్ద జనం బారులు తీరారు. ఇంకా గుత్తి రోడ్డులోని ఆంధ్రా బ్యాంకు, గాంధీ బజారులోని స్టేట్ బ్యాంకు, తిలక్ రోడ్డులోని కార్పొరేట్ బ్యాంకు ఐసిఐసిసి, ఆర్ ఎఫ్ రోడ్డులోని ఐడిబిఐ, నగరంలోని హెచ్‌డిఎఫ్‌సితో పాటు కెనరాబ్యాంకు శాఖలు, ఆంధ్ర బ్యాంకు శాఖలు 35 రకాల బ్యాంకులు వినియోగదారులతో నిండిపోయాయి. ఎస్‌బిఐ మినహా ఇతర బ్యాంకుల్లో ఎప్పటి లాగే మంగళవారం కూడా నగదు కొంతే ఇచ్చారు. వారానికి కనీసం రూ.24 వేలు తీసుకోవచ్చన్న ఆశతో వెళ్లిన వారికి అందులో సగం కూడా చాలా బ్యాంకుల్లో అందజేయలేదు. దీంతో ప్రజలు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఎప్పుడు ఈ పరిస్థితి చక్క బడుతుందో, ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయోనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులన్నీ మానుకుని రోజూ బ్యాంకులు, ఎటిఎంలకే సమయమంతా కేటాయించాల్సి వస్తోందని వాపోతున్నారు. మరోవైపు వచ్చేనెల రైతులు బోర్లు, బావుల కింద పంటలు సాగు చేసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. ఈనేపథ్యంలో విత్తనాలు, ఎరువులు, రవాణా ఖర్చుల నిమిత్తం డబ్బు కోసం ఇప్పటి నుంచే సమకూర్చుకునే పనిలో పడ్డారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుల చుట్టూ నిత్యం తిరగక తప్పడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
వివాహాలకు నిబంధనల అడ్డంకి...
ఈనెల 24 వరకు పెళ్లిళ్లకు ముహూర్తాలు ఉండటంతో వధూవరుల తరపున కుటుంబ సభ్యులు నగదు కోసం నానా అవస్థలు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్‌బిఐ విధించిన నిబంధనలు పెళ్లిళ్లకు అడ్డంకిగా మారాయి. మధ్య తరగతి కుటుంబాల్లో వివాహం జరిపించాలంటే కనీసం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల దాకా ఖర్చవుతోంది. దీనికితోడు బ్యాంకుల్లో తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి సైతం నానా అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్‌బిఐ నిబంధనల మేరకు పెద్ద నోట్ల రద్దైన తేదీ (నవంబర్8)కి మునుపు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకున్న మొత్తాల్లో రూ.2.50 లక్షలు వరకూ తీసుకోవడానికి మాత్రమే ఆర్‌బిఐ అనుమతి ఉంది. నోట్ల రద్దు తర్వాతి రోజు నుంచి బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకున్నా, లేదా పాత రూ.1000, రూ.500 నోట్లు డిపాజిట్ చేసినా, పెళ్లిళ్లు ఉన్నా నగదు తీసుకోవడానికి లేదు. ఈ విషయంపై ఇప్పటి వరకూ ఎలాంటి వెసులుబాటుకు ఇటు కేంద్రం నుంచిగానీ, అటు ఆర్‌బిఐ నుంచిగానీ ఆదేశాలు రాలేదు. ఈ పరిస్థితుల్లో పెళ్లింటి వాళ్లు అప్పోసప్పో చేయక తప్పడం లేదు. వారానికి రూ.24 వేలు మాత్రం బ్యాంకర్లకు వివరించి తీసుకుంటున్నారు.

మారిన సీను!
* వైకాపాకే ఎంపిపి పదవి
* నేడు కనగానపల్లి ఎంపిపి ఎన్నిక
కనగానపల్లి, డిసెంబర్ 13: కనగానపల్లి మండల అధ్యక్ష పదవి వైకాపా సొంతం కానుంది. మారిన రాజకీయపరిణామాల నేపధ్యంలో వైకాపా ఈ స్థానాన్ని సొంతం చేసుకోనుంది. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఉదయం 11గంటలకు కనగానపల్లి మండలాధ్యక్షుని పదవి కోసం ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి బాలానాయక్ మంగళవారం తెలిపారు. కనగానపల్లి మండలంలో 11 ఎంపిటిసి స్థానాలు వుండగా గత ఎన్నికల్లో వైకాపాకు చెందిన 6మంది విజయం సాధించగా టిడిపికి చెందిన ఐదుగురు గెలుపొందారు. అయితే వైకాపాకు చెందిన ఇద్దరు ముత్తవకుంట్ల, కనగానపల్లి ఎంపిటిసీలు అప్పట్లో టిడిపిలో చేరడంతో ఎంపిపి పదవి కాస్తా టిడిపికి చెందిన బిల్లే రాజేంద్రను వరించింది. అయితే రెండున్నర సంవత్సరం పదవీకాలం ముగియడంతో బిల్లే రాజేంద్ర ఈనెల 3న ఎంపిపి పదవికి రాజీనామా చేయగా 5వ తేదీ ఆమోదించారు. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం టిడిపికి చెందిన ఎంపిటిసి సభ్యురాలు పద్మగీతకు ఎంపిపి పదవిని కట్టబెట్టాలి. కానీ టిడిపికి చెందిన కొంతమంది ఎంపిటిసి సభ్యులు పద్మగీత భర్త ముకుందనాయుడు తీరును నిరసిస్తూ అసమ్మతి రాగం ఆలపించారు. ఎట్టి పరిస్థితుల్లోను ఎంపిపి పదవి ముకుందనాయుడు భార్యకు దక్కకూడదనే ఉద్దేశ్యంతో వైకాపా పంచన చేరినట్లు తెలుస్తోంది. గత ఎంపిటిసి ఎన్నికల్లో వైఎస్‌ఆర్ పార్టీ తరపున ఎంపిటిసిగా గెలిచిన పద్మగీత టిడిపిలోకి మారిన విషయం తెలిసిందే. టిడిపిలో వర్గ విభేదాలు తలెత్తడంతో తాజా మాజీ ఎంపిపి బిల్లే రాజేంద్ర, వైస్ ఎంపిపి ఉన్నం వెంకటరామిరెడ్డి, కనగానపల్లి ఎంపిటిసి సభ్యురాలు బిల్లే గంగమ్మ వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. దీంతో వైకాపాకు 7 ఎంపిటిసి స్థానాలు, టిడిపికి 4 స్థానాలు మిగిలాయి. దీంతో బుధవారం జరిగే ఎంపిపి ఎన్నిక ఏకపక్షంగా సాగే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఎంపిపి ఎన్నిక సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం వుంటుందని ధర్మవరం డిఎస్‌పి వేణుగోపాల్, రామగిరి సర్కిల్ సిఐ యుగంధర్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని వారు సూచించారు.
భద్రత కల్పించండి..
* కలెక్టర్, ఎస్పీకి వైకాపా నేతల వినతి
అనంతపురం అర్బన్ : కనగానపల్లి మండలాధ్యక్షుని ఎంపిక సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా చూడాలంటూ మాజీ ఎంపి అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్‌ను. ఎస్‌పి రాజశేఖర్‌బుబుకు కలిసి వినతిపత్రం అంజేశారు. అనంతరం అనంత వెకంటరామిరెడ్డి మాట్లాడుతూ 2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో కనగానపల్లి మండలంలోని 11 మండల ప్రాదేశిక నియోజకవర్గాలకుగాను వైసిపి 6, తెదేపా 5 స్థానాల్లో గెలిచాయని, రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి రావటంతో వివిధ ఒత్తిళ్ల నేపథ్యంలో ముత్తవకుంట్ల, కనగానపల్లి వైసిపీ ఎంపిటిసీలు తెదేపా మద్దతు తెలిపారన్నారు. అత్యధిక స్థానాలు వైకాపా గెలిచినప్పటికి తెదేపా ఏకపక్షంగా మండలాధ్యక్ష పదవి చేజిక్కించుకుందన్నారు. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో మండలాధ్యక్షునిగా కొనసాగుతున్న బిల్లే నాగేంద్ర, బాలేపాళ్యం ఎంపిటిసీ వెంకట్రామిరెడ్డి వైసిపీలోకి చేరటంతోపాటు కనగానపల్లి వైసిపీ ఎంపిటిసీ గంగమ్మ సొంత గూటికి చేరుకోవడంతో ప్రస్తుతం వైసిపీ ఎంపిటీసిల ఆధిక్యం 8కి పెరిగిందన్నారు. వారి వెంట మాజీ మేయర్ రాగే పరుశురామ్, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి తదితరులు ఉన్నారు. కాగా రాప్తాడు నియోకవర్గ వైసిపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఎనిమిదిమంది ఎంపిటీసిలను రహస్య ప్రదేశానికి తరలించినట్లు సమాచారం. రేపు వీరిని నేరుగా సమావేశానికి తీసుకువచ్చే అవకాశం ఉంది.
వైభవంగా లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం
మడకశిర, డిసెంబర్ 13 : మండలంలోని భక్తరహళ్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లేడుగుంట ఆంజనేయస్వామి బ్రహ్మరథోత్సవాలు మంగళవారం భక్తజన సందోహం మధ్య వైభవంగా సాగాయి. ఈ సందర్భంగా రథం ముందు వేద పండితులు ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ముందుగా లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు తలపై మోసుకొచ్చి రథంపై కూర్చోబెట్టారు. అనంతరం భగవంతుడి నామస్మరణ నడుమ భక్తులు పురవీధుల గుండా రథాన్ని లాగారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ ఇఓ శ్రీనివాసులు, సర్పంచ్‌లు భీమప్ప, ఉమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో రథోత్సవాలు జరిగాయి. రథోత్సవాలకు ఆంధ్రా, కర్నాటక ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్న, తహశీల్దార్ హరిలాల్‌నాయక్, జడ్పీటీసీ సులోచనమ్మ, ఎంపిపి అరుణ, శ్రీనివాసమూర్తి తదితరులు రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ దేవానంద్, ఎస్సై మక్బూల్‌బాషా ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేడు భూతప్పల ఉత్సవం
బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం భూతప్పల ఉత్సవం నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారి కె.శ్రీనివాసులు తెలిపారు. తెల్లవారుఝాము నుంచి జ్యోతుల పరుష, గ్రామోత్సవం, మధ్యాహ్నం 12.30 గంటలకు భూతప్ప, పొంజు ఉత్సవం, రాత్రి ముత్యాలపల్లకి ఉత్సవాలు జరగనున్నట్లు తెలిపారు. ఈమేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
అసంతృప్తుల నడుమ కమిటీ సమావేశం
* మూడు అభ్యంతరాలు.. * ఒకటి తిరస్కరణ.. * 16 ఆమోదం
అనంతపురంటౌన్, డిసెంబర్ 13: కార్పొరేషన్‌లో మేయర్ ఛాంబర్‌లో మంగళవారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం మూడు అభ్యంతరాలు, ఒకటి తిరస్కరణ, 16 ఆమోదం అన్న రీతిలో సాగింది. అజెండాలోని 19వ అంశం సిటీ శానిటేషన్ టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు కాపీని కమిటీ సభ్యుల వత్తిళ్ళ మేరకు తొలగించిన తర్వాతనే సమావేశం జరిగింది. అయి తే పాలకవర్గం అధికార పార్టీ సభ్యులలో కొంతమందిపై వివక్ష చూపుతూ నామినేషన్ వర్క్‌లు మంజూరు చేయకుండా అభివృద్ధికి ఆమడదూరంలో డివిజన్లను ఉంచుతున్నారంటూ కమిటీ సభ్యుడు ఉమామహేష్ సమావేశం ప్రారంభమైన కొంతసేపటికే వాకౌట్ చేసి వెళ్లిపోయారు. నగరంలోని నీలిమా టాకీస్ నుంచి తపోవనం వరకు గుంతలు ఏర్పడిన ప్రధాన రహదారిని మరమ్మతు చేయాలని కోరుతూ సిపిఎం కార్యకర్తలు వరిమళ్లు నాటారని, అయితే ఎమ్మెల్యే భూమిపూజ చేసిన ప్రాంతం నుంచి కాకుండా ఆంధ్రా బ్యాంక్ నుంచి పనులు చేశారని కమిటీ సభ్యులు నటేష్‌చౌదరి, లక్ష్మిరెడ్డిలు ధ్వజమెత్తారు. ఇందుకు సంబంధించి అజెండాలోని 13వ అంశాన్ని ఆమోదించకుండా వాయిదా వేశారు. పాడైన రోడ్డుకు పూర్తిస్థాయిలో అంచనాలు రూపొందించకుండా 13 లక్షల రూపాయల టెండర్‌ను ఎక్సెస్ రేట్లతో చేపట్టి కమిటీ ముందుకు తెస్తే డూడూ బసవన్నలా ఆమోదించాలాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అజెండాలోని చివరి 20వ అంశాన్ని సైతం వాయిదా వేశారు. టీచర్ల సీనియారిటీ జాబితా ఇస్తే పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. అజెండాలోని రెండవ అంశాన్ని సైతం వాయిదా వేశారు. రామ్‌నగర్‌లోని షాపింగ్ కాంప్లెక్స్ రూముల కూల్చివేతకు రెండున్నర లక్షల రూపాయల అంచనాలు రూపొందించటంపై వివరణ కోరిన సభ్యులకు అధికారుల నుంచి సంతృప్తికరమైన సమాధానాలు లభించకపోవటంతో వాయిదా వేశారు. ఈ సమావేశంలో డెలిగేట్ కమిషనర్ రామ్మోహనరెడ్డి, డిప్యూటీ కమిషనర్ జ్యోతిలక్ష్మి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కమిటీ సభ్యుడి వాకౌట్..
స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాలక 3వర్గ2 వివక్షను ధైర్యంగా ప్రశ్నించిన కమిటీ సభ్యుడు ఉమామహేష్‌నుద్దేశించి అధికార పార్టీ కార్పొరేటర్లు వ్యాఖ్యానించటం కనిపించింది. కార్పొరేషన్‌లో అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా అధికార పార్టీలోనే ఒక వర్గంగా తాము సాగిస్తున్న పోరాటాన్ని ముఖ్య నేతే అడ్డుకోవటం దారుణమని వ్యాఖ్యానించారు. దీనినిబట్టి చూస్తే అవినీతికే నేతలు అండగా ఉంటారని స్పష్టమవుతోందని పేర్కొంటున్నారు. మేయర్ ఛాంబర్‌లో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశానికి డిప్యూటీ మేయర్ గంపన్న బలవంతంగా కమిటీ సభ్యులు లక్ష్మిరెడ్డి, నటేష్‌చౌదరి, విజయశ్రీలను వెంట తీసుకువచ్చారు. వారు సాకులు చూపి సమావేశానికి రాకుండా వెళ్లిపోవాలన్న ప్రయత్నాలను వారు విఫలం చేశారు. అంతటితో ఆగకుండా డిప్యూటీ మేయర్ వారిని మేయర్ ఛాంబర్‌కు తీసుకువచ్చి వెనుక గదిలో సమావేశం పూర్తయ్యే వరకు ఉండిపోయారు. సమావేశం మేయర్ ఛాంబర్‌లో జరిపించటం ద్వారా పాలకవర్గంలో విబేధాలు లేకుండా అంతా సజావుగా ఉందని నిరూపించేందుకు నేతలు చేసిన యత్నాలు అపహాస్యం పాలయ్యాయి. అయితే సమావేశం ఆద్యంతం మేయర్, కమిటీ సభ్యులు ఎడమొహం, పెడమొహం అన్నట్లుగా ఉండిపోయారు. సమావేశం తర్వాత కమిటీ సభ్యులకు మధ్యాహ్నం విందు భోజనం ముఖ్య నేత స్వగృహంలో ఏర్పాటుచేసినట్లు చర్చించుకోవటం కనిపించింది. విందు భోజనానికి కమిటీ సభ్యులు ఆసక్తి చూపకపోవటంతో హాజరుకావటం అనుమానమే.
హేమావతిలో ఘనంగా లక్ష దీపోత్సవం
అమరాపురం, డిసెంబర్ 13 : దక్షిణకాశీగా పేరొందిన హేమావతి సిద్దేశ్వరాలయంలో మంగళవారం లక్ష దీపోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. కార్తీక మాసంలో ప్రారంభమైన హేమావతి సిద్దేశ్వరస్వామి ప్రత్యేక పూజల్లో భాగంగా సిద్దేశ్వరస్వామి పూల రథోత్సవాన్ని పురవీధుల గుండా ఊరేగించారు. అనంతరం లక్ష దీపోత్సవం నిర్వహించారు. మహిళలు ఉపవాస దీక్షతో సిద్ధేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు. దీపాల వెలుతురులో ఆలయం దేదీప్యమానంగా ప్రకాశించింది. ఈ పూజల్లో ఆంధ్ర, కర్నాటక ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు నృత్య ప్రదర్శనలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సర్పంచు కుమారస్వామి, గ్రామ పెద్దలు, శివప్రకాష్, శివానంద్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
బ్యాంకుల వద్ద జాతర!
* కనిపించని స్వైపింగ్ యంత్రాలు
* లావాదేవీలపై గగ్గోలు
* తెరచుకోని ఎటిఎం కేంద్రాలు
హిందూపురం టౌన్, డిసెంబర్ 13 : పెద్ద నోట్లు రద్దు నేపథ్యంలో వరుసగా మూడు రోజులపాటు బ్యాంకులకు సెలవులు రావడంతో మంగళవారం పట్టణంలోని అన్ని బ్యాంకుల వద్ద జాతరను తలపించాయి. గత నవంబర్ 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ.1000, రూ.500 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ప్రజలకు కరెన్సీ కష్టాలు ప్రారంభమై విషయం తెలిసిందే. ఓవైపు రిజర్వు బ్యాంకు, మరోవైపు కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ లావాదేవీలపై రోజుకో రకంగా ప్రకటనలు చేస్తుండటంతో ఖాతాదారులు తమ ఖాతాల్లో ఉన్న సొమ్మును డ్రా చేసుకునేందుకు ఉదయం 8 గంటలకే బ్యాంక్ వద్ద క్యూ కడుతున్నారు. అయితే పలు బ్యాంకులకు అవసరమైన మేరకు నగదు ఇవ్వకపోవడంతో కేవలం రూ.2 వేల వరకు మాత్రమే నగదు డ్రా చేసుకొనేందుకు అనుమతి ఇస్తున్నారు. దీంతో వివిధ అవసరాల కోసం సొమ్ము దాచుకున్న ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ఈనేపథ్యంలో వరుసగా మూడు రోజులు సెలవుల అనంతరం మంగళవారం బ్యాంక్‌లు తెరచుకోవడంతో ఖాతాదారులు బ్యాంకుల వద్ద బారులు తీరారు. ఇకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని పదేపదే చెబుతున్నా అందుకు తగ్గట్టు సరైన చర్యలు లేకపోవడంతో వ్యాపార వర్గాలు తీవ్ర విస్మయానికి గురవుతున్నాయి. ఇప్పటి వరకు కనీసం ఒక్క స్వైపింగ్ యంత్రాన్ని కూడా మంజూరు చేయలేదు. చివరకు మున్సిపల్ కార్యాలయంలో సైతం స్వైపింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. దీంతో వ్యాపారులు, పాఠశాలల నిర్వాహకులు లావాదేవీలపై గగ్గోలు పెడుతున్నారు. బ్యాంకర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకూ కేవలం నగదు పంపిణీ తదితర బ్యాంక్ కార్యకలాపాలకే పరిమితమవుతుండటంతో స్వైపింగ్ యంత్రాల గురించి ఎలాంటి సమాచారం లేకుండాపోయిందని అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఇకపోతే గతనెల 8వ తేదీ రాత్రి మూతబడ్డ పలు ఎటిఎం కేంద్రాలు ఇప్పటి వరకూ తెరచుకోలేదు. పట్టణంలో కేవలం ఎస్‌బిఐ ఎటిఎంలు పలు ప్రాంతాల్లో కొంత సమయం పాటు పనిచేస్తుండగా మిగిలిన ఎటిఎంలు ఏమాత్రం పనిచేయడం లేదని ఖాతాదారులు వాపోతున్నారు. బ్యాంకుల వద్ద తీవ్రమైన రద్దీ ఉండటం, పెద్ద ఎత్తున క్యూలు ఉండటంతో నగదు ఎలా పొందాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజల కష్టాలను గుర్తెరిగి పూర్తి స్థాయిలో బ్యాంకులకు నగదు విడుదల చేయడంతోపాటు ఎటిఎం కేంద్రాలు పనిచేసేలా చూడటంతోపాటు, దరఖాస్తుదారులందరికీ స్వైపింగ్ యంత్రాలను అందజేయాలని ప్రజలు కోరుతున్నారు.
‘వార్ధా’ ప్రభావం.. జిల్లాలో చిరుజల్లులు

అనంతపురం, డిసెంబర్ 13 : వర్ధా తుఫాన్ ప్రభావంతో మంగళవారం జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. అంతేగాకుండా రెండురోజులుగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. 10 నుంచి 13 డిగ్రీల సెల్పియస్ వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్టంగా 5.7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతోంది. ఓవైపు చలి కాలం కావడం, మరోవైపు వర్ధా తుఫాన్ కారణంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతేడాది కన్నా ఈఏడాది చలి అధికంగా ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు.
కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు
491 మంది హాజరు
* పరిశీలించిన ఎస్.పి రాజశేఖర్‌బాబు
అనంతపురం అర్బన్, డిసెంబర్ 13: నీలం సంజీవరెడ్డి స్టేడియంలో ఆరంభమైన కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు మంగళవారం తొలి రోజున 800 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి వుండగా, 491 మంది మాత్రమే హాజరైనట్లు ఎస్‌పి రాజశేఖర్‌బాబు తెలిపారు. దేహదారుఢ్య పరీక్షలతోపాటు అథ్లెటిక్స్ భాగంగా ఎస్.పి అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేశారు. పూర్తి టెక్నాలజీ సహాయంతో పరీక్షలు నిర్వహించారు. బయోమెట్రిక్ ద్వారా అభ్యర్థుల వేలిముద్రలు తీసుకొన్న తరువాత ఫిజికల్ మెజర్‌మెంట్స్‌కు పంపారు. అనంతరం ఎత్తు, ఛాతి కొలతలు పూర్తి చేసుకొని విజయవంతం అయిన అభ్యర్థులకు తదుపరి చిప్‌తో కూడిన నంబరింగ్ ఇచ్చి 1600 మీటర్ల పరుగుకు అనుమతించారు. మరోవైపు సెన్సర్లుతో అభ్యర్థుల పరుగు నమోదైంది. అనంతరం హైజంప్, లాంగ్‌జంప్ పలువురు అభ్యర్థులు నిర్ధేశించిన సమయంలో 1600 మీటర్ల పరుగును పూర్తిచేయలేక నిరాశతో నిష్క్రమించారు. అభ్యర్థులకు తాగునీరు, అల్పహారం స్వచ్చంద సేవా సంస్థల సహాయంతో అందజేశారు. ఎక్కడా చిన్న అపశృతి తలెత్తకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకొన్నారు. ఎఎస్‌పి మాల్యాద్రి, డిఎస్పీలు నాగసుబ్బన్న, నరసింగప్ప, వెంకటేశ్వర్లు, చిన్నికృష్ణ పాల్గొన్నారు.