అనంతపురం

నాటిపోరాటమే స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, డిసెంబర్ 19: జాతీయోద్యమంలో కమ్యూనిస్టులు ప్రధాన పాత్ర పోషించారని, నాటి పోరాటాలే స్ఫూర్తిగా నేడు కమ్యూనిస్టులు ముందుకు సాగాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. ఈమేరకు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన కమ్యూనిస్టు ఉద్యమంలో జిల్లా యోధులు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హెచ్చెల్సీ కాలనీలోని వికె.మెమోరియల్ హాలులో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓబుళు అధ్యక్షతన సోమవారం జరిగిన సభలో వివిధ కమ్యూనిస్టు పార్టీల నాయకులు, సీనియర్ కమ్యూనిస్టులు, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. పుస్తకావిష్కరణ అనంతరం మధు మాట్లాడుతూ సమాజంలో మార్పుకు కమ్యూనిస్టు ఉద్యమం ఎంతో దోహదపడిందన్నారు. నాటి బ్రిటీష్ పాలకులు, భూస్వామ్య, పెత్తందారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఆస్తులను, జీవితాన్ని ప్రజా శ్రేయస్సు కోసం ఉద్యమానికి అంకి తం చేశారన్నారు. కమ్యూనిస్టు యో ధుల జీవితాలను గ్రంథస్తం చేయాల్సిన అవసరముందని, అందు లో భాగంగా రేఖా మాత్రంగా ప్రస్తుత పుస్తకం రూపొందించబడిందన్నారు. 1943లో జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమం ప్రారంభమైందని, నాటి నుండి నూతన సమాజం కోసం ఎందరో కమ్యూనిస్టులు ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. భూమికి ఎత్తుపల్లాలున్నట్లే కమ్యూనిస్టు ఉద్యమంలో కూడా ఎత్తుపల్లాలు కనిపిస్తాయన్నారు. కమ్యూనిస్టులు బలహీన పడటానికి కారణం తగిన రీతిలో పనిచేయకపోవడమేనన్నారు. ప్రైవేటీకరణ కారణంగా జరుగుతున్న వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో భారతదేశ కమ్యూనిస్టులు వెనుకబడి ఉన్నాయన్నారు. రొటీన్ పోరాటాలకు స్వస్తి పలకాలని, వామపక్షాలు నిర్దిష్టమైన పరిస్థితులను అధ్యయనం చేసి అవసరమైన కార్యాచరణ రూపొందించాలన్నారు. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు కార్యక్రమం నల్లధనం అరికట్టడానికి కాదని, సామాన్యులను పన్నుల పరిధిలోకి తెచ్చేందుకేనన్నారు. మరణించిన కమ్యూనిస్టులకు సంతాపం తెలిపే తీర్మానాన్ని నల్లప్ప ప్రవేశపెట్టగా, జిల్లా కార్యదర్శి రాంభూపాల్ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కమ్యూనిస్టులు, 5 వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాత్రీలేదు..పగలూలేదు
ధర్మవరం రూరల్, డిసెంబర్ 19: పెద్ద నోట్ల రద్దుతో సామాన్యునికి నేటికీ కరెన్సీ కష్టాలు కొనసాగుతూనే వున్నాయి. నోట్ల రద్దు నవంబర్ 8న ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన నేటికి 40 రోజులు దాటినా బ్యాంకుల వద్ద, ఎటిఎంల వద్ద ప్రజలు రాత్రివేళల్లో సైతం కరెన్సీ కోసం బారులుతీరి వుంటూనే వున్నారు. ధర్మవరం పట్టణంలో సోమవారం ఆంధ్రాబ్యాంకు వద్ద పలువురు మహిళలు ఉదయం నుంచి నగదు కోసం క్యూలో నిలబడినా సాయంత్రం దాకైనా లభించకపోవడంతో అసహనం వ్యక్తం చేయడంతోపాటు బ్యాంకు అధికారులతో వాదోపవాదాలకు దిగి ఓ దశలో ఘర్షణకు దిగారు. దీంతో పట్టణ ఎస్‌ఐ సునీత అక్కడకు చేరుకుని వారికి సర్దిచెప్పి వివాదాన్ని సద్దుమణిగించారు. అంతేకాక ప్రధాన బ్యాంకు అయిన ఎస్‌బిఐ వద్ద కరెన్సీ కష్టాలు చెప్పనక్కరలేదు. కేవలం రూ.2వేలు మాత్రమే ఇస్తుండడంతో ప్రతి రోజు క్యూలో నిలబడాల్సి వస్తున్నదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక పలుకుబడి వున్న వారికి సాయంత్రంవేళ నిబంధనలను పక్కన వుంచి అధికంగా డబ్బు ఇస్తున్నారని పలువురు విమర్శిస్తూనే వున్నారు. అయితే దీన్ని బ్యాంకు అధికారులు మాత్రం కొట్టిపారేస్తున్నారు. ఇక ఎటిఎంల విషయానికి వస్తే పట్టణంలోని ఏటిఎం నోట్ల రద్దు రోజు నుండి పూర్తిగా కనీసం 12గంటలపాటు కూడా పనిచేసిన దాఖలాలు లేవు. ఇక రాత్రివేళల్లోనైనా క్యాష్ దొరుకుతుందేమోనని, ఎప్పుడెప్పుడు క్యాష్ ఏటిఎంలలో పెడతారోనని బారులుతీరే వుంటున్నారు. ప్రధానంగా నోట్ల రద్దు మొదటివారంలో రూ.24వేలు ఇచ్చిన అధికారులు క్రమేపీ అది కుదించడంతో ఉద్యోగులతోపాటు ఇతర అత్యవసర ఖర్చులకు కావాల్సిన వారి బాధలు వర్ణణాతీతం. కొద్ది రోజుల్లోనే నగదు బాధలు తీరుతాయని అధికారులు చెబుతున్నప్పటికి ఇంకెన్నాళ్ళకు తమ బాధలు తీరుతాయని సహనంతోనే బ్యాంకులు, ఏటిఎంల వద్ద రేయింబవళ్లు నగదు కోసం వేచి చూస్తున్న సామాన్యుని కష్టాలు చెప్పనక్కరలేదు.

కళ్యాణదుర్గం డిఎస్పీగా
వెంకటరమణ

అనంతపురం, డిసెంబర్19: పో స్టింగుల కోసం ఎదురు చూస్తున్న పలువురు డిఎస్పీల్లో 10 మందికి రాష్ట్ర పోలీసు శాఖ స్థానాలు కల్పించింది. వీరిలో కళ్యాణదుర్గం డిఎస్పీగా టిఎస్.వెంకటరమణను నియమిస్తూ రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి సోమవారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఈయన 1989 బ్యాచ్‌కు చెందిన వారు. అంబర్‌పేటలోని పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పొందారు. త్వరలో ఆయన కళ్యాణదుర్గంలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక్కడ పని చేస్తున్న డిఎస్పీ పులిపాటి అనిల్‌కుమార్ వైజాగ్ జిల్లా చింతలపల్లికి బదిలీ కావడంతో నెల రోజులుగా ఈ స్థానం ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఇన్‌చార్జ్‌గా గుంతకల్లు డిఎస్పీ రవికుమార్ కొనసాగుతున్నారు.

మున్సిపల్ మాజీ చైర్మన్
అంబటి నారాయణరెడ్డి మృతి
అనంతపురం కల్చరల్, డిసెంబర్ 19: మునిసిపల్ మాజీ చైర్మన్ అంబటి నారాయణరెడ్డి (84) సోమవారం నగరంలోని తన స్వగృహంలో మృతి చెందారు. గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అంబటి రెండు పర్యాయాలు చైర్మన్‌గా పనిచేశారు. నారాయణరెడ్డి మృతికి పలువురు కాంగ్రెస్, వైఎస్సార్ పార్టీకి చెందిన నాయకులు సంతాపం తెలిపారు. ఎమ్మెల్యేలు ప్రభాకరచౌదరి, జెసి.ప్రభాకరరెడ్డి, మేయర్ స్వరూప, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, వైకాపా నాయకులు మాజీ ఎంపి అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ తోపుదుర్తి కవిత, భాస్కర్‌రెడ్డి, మాజీ మేయర్ రాగే పరశురామ్, చవ్వా రాజశేఖరరెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఫకృద్దీన్, మార్కెట్‌యార్డు చైర్మన్ ఆదినారాయణ తదితరులు మృతదేహాన్ని సందర్శించి సంతాపం ప్రకటించారు. గార్లదినె్న సమీపంలోని తోటలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.

తాగునీటికి అత్యంత ప్రాధాన్యత

అనంతపురం, డిసెంబర్ 19:రా నున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో తాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర సమాచార పౌర సంబందాలు, ఐటి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం రెవెన్యూ భవన్‌లో మీ కోసం గ్రీవెన్స్‌లో మంత్రి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా హంద్రీ నీవా నీటిని జిల్లాలోని అన్ని చెరువులకు నింపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీంతో మంత్రి స్పందిస్తూ హెచ్‌ఎల్‌సి ఎస్‌ఈ శేషగిరి రావును, హంద్రీ నీవా అధికారులను పిలిచి.. వీలైనన్ని చెరువులకు హంద్రీ నీవా నీటిని నింపాలని, దశల వారీగా జిల్లాలోని అన్ని చెరువులకు అందించాలని ఆదేశించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యల్ని తక్షణమే పరిష్కరించేందుకు మీ కోసంను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు. జిల్లాలోని పిఎబిఆర్, ఎంపిఆర్, పిబిఆర్ డ్యామ్‌లలో తగినంత నీటిని తాగునీటి కోసం నిల్వ చేసుకుని మిగిలిన నీటిని అన్ని చెరువుకు 30 నుంచి 40 శాతం నింపాలని ఆదేశించారు. ఇందుకు తగిన ప్రణాళికలను రూపొందించుని ఇప్పటి నుంచే పనులు చేపట్టాలన్నారు. ఒడిసి మండలం తంగేడుకుంటలోని రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఏడాది వాతావరణ బీమా కింద రాష్ట్రానికి రూ.434 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇందులో రూ.368 కోట్లు జిల్లా రైతులకు అందనుందన్నారు. ఇటీవల అకాల వర్షాలతో జిల్లాలో పంట దెబ్బతిన్న రైతులను ఆదుకోవడానికి రూ.23.81 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. త్వరలో జరగనున్న జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో అర్హులైన వారికి కొత్తపెన్షన్లు, రేషన్‌కార్డులు మంజూరు చేస్తామన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెన్స్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ప్రజా సదస్సు పేరిట విజ్ఞప్తులు స్వీకరించేందుకు ప్రతి నెలా ఒక మండలంలో కార్యక్రమాలను తాను ఏర్పాటు చేసి పరిష్కరిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో జెసి బి.లక్ష్మికాంతం, జెసి-2 సయ్యద్ ఖాజామొహిద్దీన్, డిఆర్‌ఓ మల్లీశ్వరి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలపై
అసెంబ్లీని ముట్టడిస్తాం
* సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు
అనంతపురం సిటీ, డిసెంబర్ 19: కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో వారికి మద్దతుగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీని ముట్టడిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఆర్‌డిఓ కార్యాలయం ముందు 18 రోజులుగా చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల నిరవధిక సమ్మెకు సిపిఎం నాయకులు మద్దతును తెలియజేసారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గాడి తప్పిందని, గత 18 రోజులుగా కాంట్రాక్టు లెక్చరర్లు సమ్మె చేస్తుంటే వారి సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా దారుణమన్నారు. నిరవధిక సమ్మెకు మద్దతుగా వైఎస్‌ఆర్‌సిపి నాయకులు గురునాథ్‌రెడ్డి, విద్యార్థి సంఘం నాయకులు, రైతు సంఘం నాయకులు పెద్దిరెడ్డి, సిఐటియు రాష్ట్ర నాయకులు ఇంతియాజ్, జెఎసి నాయకులు రామాంజినేయులు, ఎర్రప్ప, హరిప్రసాద్, షా లెంరాజు, వేణుగోపాల్, ఇతర అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు పరిష్కరిస్తాం..మంత్రి పల్లె
కాంట్రాక్టు లెక్చరర్లు, జెఎసి నాయకులు సోమవారం రాష్ట్ర పౌర సంబంధాలు, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేసారు. ఇందుకు స్పందించిన మంత్రి పల్లె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
మీ కోసం అర్జీలన్నీ పరిష్కరించండి

అనంతపురం, డిసెంబర్ 19:జిల్లా యంత్రాంగంపై ఎంతో నమ్మకంతో జిల్లా వ్యాప్తంగా పేదలతో పాటు అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం జిల్లా, డివిజన్, మండల స్థాయిలో మీ కోసంలో ఇస్తున్న అర్జీలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి వాటిని అరకొరగా కాకుండా సంపూర్ణంగా పరిష్కరించి అర్జీదారులకు తెలిపాలని కలెక్టర్ కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో మీ కోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయిం ట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, జెసి-2 సయ్యద్ ఖాజామొహిద్దీన్, డిఆర్‌ఓ మల్లీశ్వరిలతో కలిసి మీ కోసంలో కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. ఇక నుంచి జిల్లా అధికారులందరూ తప్పనిసరిగా వారి వారి మండల, డివిజన్, క్షేత్రస్థాయి అధికారులతో మీ కోసం అర్జీల పరిష్కారంపై సమీక్షించిన అనంతరమే జిల్లా స్థాయి మీ కోసం లో పరిష్కార నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. అలా కాకుండా ఒక అధికారి నుంచి మరొక అధికారికి సమస్య పరిష్కారం నిమిత్తం పంపిన దరకాస్తు వివరాలను ఆధారంగా చేసుకుకుని సమస్య పరిష్కారమైనట్లు భావించకూడదన్నారు. అలా చేస్తేచర్యలు తప్పవని హెచ్చరించారు. అర్జీదారులు సమస్యల్ని సంపూర్ణంగా, నాణ్యతతో కూడినవి సంబంధిత మండల, డివిజన్, క్షేత్రస్థాయి అధికారులకు సవివర సూచనలతో కూడిన ఆదేశాలు జారీ చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కరించకుండానే పరిష్కరించినట్లు అర్జీదారులకు సెల్‌ఫోన్ మెసేజ్‌లు పంపవద్దని, పరిష్కారం అనంతరమే సంక్షిప్త సందేశాలు పంపాలని స్పష్టం చేశారు. అలాగే పరిష్కార దశను సమస్య పరిష్కారంగా భావించరాదని అర్జీదారులు, అధికారులకు కలెక్టర్ సూచించారు. కాగా ప్రభుత్వ శాఖల్లో వంద శాతం ఈ-ఆఫీసు అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మీ కోసంలో మాట్లాడుతూ జిల్లాలో ఈ-ఆఫీసు ద్వారా మొత్తం 38,008 ఫైళ్లు రాగా, వాటిలో రెవెన్యూ శాఖ 24,485, డిసిఓ 2742, డిఆర్‌డిఎ 1386, జడ్పీ1238, డిఎస్‌ఓ 1169 చొప్పున ఫైళ్లను పరిష్కరించి మొదటి ఐదు స్థానాల్లో నిలిచారన్నారు. మిగిలిన శాఖలు కూడా వంద శాతం అమలు ఈ-ఆఫీసు అమలు చేయాలన్నారు.
పిఎబిఆర్ నీటి కోసం చెక్‌డ్యాం ధ్వంసం
బత్తలపల్లి, డిసెంబర్ 19: మండలంలోని అప్రాచెరువుకు పిఎబిఆర్ నీటిని తీసుకెళ్ళాలనే ఉద్దేశ్యంతో చెక్‌డ్యాంను ధ్వంసం చేసిన సంఘటన బత్తలపల్లిలో చోటు చేసుకుంది. ధర్మవరం కుడికాలువ ద్వారా పిఎబిఆర్ నీటిని చెరువులకు నీటిని వదిలిన విషయం తెలిసిందే. సోమవారం టిడిపి కన్వీనర్ వీరనారప్ప తమ గ్రామ చెరువుకు నీటిని తీసుకెళ్ళడానికి బత్తలపల్లి సమీపాన గల చెక్‌డ్యాంను ధ్వంసం చేసి నీటిని తీసుకెళ్తున్నాడు. కాలువగుండా వచ్చే నీటిలో ఎగువ గ్రామాల్లో గల చెక్‌డ్యాంలను వాటి జోలికి పోకుండా కేవలం బత్తలపల్లి సమీపాన గల చెక్‌డ్యాంలు మాత్రమే జెసిబి సహాయంతో వీరనారప్ప తన అనుచరులతో వెళ్లి ధ్వంసం చేసి వారి గ్రామానికి నీటిని తీసుకెళ్తున్నాడని పలువురు రైతులు ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపిపి కోటి సూర్యప్రకాష్‌బాబు ధ్వంసం చేసిన చెక్‌డ్యాంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం భూగర్భ జలాలు పెంపొందించడానికి పలుచోట్ల నిర్మించిన చెక్‌డ్యాంలను ఇష్టానుసారంగా ధ్వంసం చేస్తే పశువులు, గొర్రెలకు దాహం తీరకుండా పోతాయన్నారు. ఈ విషయమై ఇరిగేషన్ ఈఈ రాజును ఎంపిపి ఫోన్‌లో సంప్రదించగా చెక్‌డ్యాంలు ధ్వంసం చేయడమంటే ప్రభుత్వ నిధులను నష్టపరచడమేనన్నారు. ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, ధ్వంసమైన చెక్‌డ్యాంను తిరిగి పునర్నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఎంపిపి కోటి సూర్యప్రకాష్‌బాబు, రైతులు గంగాద్రి, కాటమయ్య, గంగాప్రసాద్, గోపి, బిల్లే సూరి, జెడ్‌పిటిసి అక్కిం నరసింహులు, కోఆప్షన్ మెంబర్ కరీంసాహెబ్, కోటి నరేష్, వీరనారప్ప తదితరులతో కలిసి బత్తలపల్లి రూరల్ సి ఐ మురళీకృష్ణతో చెక్‌డ్యాంలు ధ్వంసం చేసిన వీరనారప్ప, అతని అనుచరులపై ఫిర్యాదు చేశారు. ధ్వంసం చేసిన చెక్‌డ్యాం సమీపాన పలువురు వైకాపా నేతల పొలాలు వుండడంతో అదే పనిగా ఉద్దేశ్యపూర్వకంగా చెక్‌డ్యాంలు ధ్వంసం చేశారని సిఐకు ఫిర్యాదు చేశారు. ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, చెక్‌డ్యాంను కూడా నిర్మింపచేస్తామని సిఐ హామీ ఇచ్చారు.
కరాటేలో విద్యార్థుల ప్రతిభ
హిందూపురం టౌన్, డిసెంబర్ 19:కర్నాటక రాష్ట్రం మైసూర్‌లో జరిగిన ఒకనోల్ కరాటే ఇన్విటేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్ పోటీల్లో హిందూపురం విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు శిక్షకులు ఫైరోజ్ తెలిపారు. ఈ పోటీలకు పట్టణం నుండి ఆరుగురు విద్యార్థులు హాజరు కాగా అందులో దీప్తి పాఠశాల విద్యార్థి గురు రాఘవేంద్ర బ్లాక్‌బెల్ట్ జూనియర్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలువగా, చైతన్య పాఠశాల విద్యార్థి సిద్ధార్థ ద్వితీయ స్థానంలో, మోక్షిత, మహిత, హర్షితలు తృతీయ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. అలాగే ఉత్తమ రెఫరీలుగా ఫైరోజ్, గిరిప్రసాద్‌లు ఎంపికయ్యారు. విజేతలకు కర్నాటక బిజిఎస్ స్వామిజీ, అఖిల కర్నాటక స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అల్త్ఫాపాషా బహుమతులు, సర్ట్ఫికేట్లు అందజేశారు. విద్యార్థులను తీర్చిదిద్దుతున్న కరాటే శిక్షకులు ఫైరోజ్‌ను తల్లిదండ్రులు అభినందించారు.
రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసిన
మంత్రి పరిటాల సునీత
అనంతపురం సిటీ, డిసెంబర్ 19: అనంతపురం రైల్వే స్టేషన్‌లోని వివిధ దుకాణాలను సోమవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తనిఖీ చేశారు. అక్కడ దుకాణదారులతో మాట్లాడి చిల్లర కొరత, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. చిల్లర సమస్య వల్ల వారి అమ్మకాలు సగానికి సగం తగ్గిపోయాయని దుకాణదారులు మంత్రికి తెలియజేసారు. అయితే గత నెల రోజుల క్రితంతో పోలిస్తే వ్యాపారం ఇప్పుడు కొంచెం పర్వాలేదని దుకాణాదారులు మంత్రికి విన్నవించారు. చిల్లర సమస్య నుండి సామాన్యులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని వారు మంత్రిని కోరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ చిల్లర సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు బ్యాంకర్లతో మాట్లాడుతున్నామని, చాలా వరకు సమస్యలను తీర్చిగలిగామన్నారు. అలాగే రైల్వే స్టేషన్‌లో ఉన్న దుకాణాలు ఎక్కువ ధరలకు అమ్మకుండా, ప్యాకెట్లపై ఉన్న ధరలకే అమ్మాలని సూచించారు. అలా ఎక్కువ ధరలకు అమ్మితే చర్యలు తప్పవని దుకాణదారులను హెచ్చరించారు. అనంతరం అక్కడ ఉన్న ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
బిఎస్‌ఎన్‌ఎల్ సేవలను వినియోగించుకోండి
టెలికాం డిఇ బాలయ్య
హిందూపురం టౌన్, డిసెంబర్ 19:్భరత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ప్రత్యేక పథకాలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని టెలికాం డిఇ బాలయ్య, ఎస్‌డిఇలు రమేష్, సుబ్రమణ్యం పేర్కొన్నారు. సోమవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, రూ.139 ఎస్‌టివి (స్పెషల్ టారీఫ్ ఓచర్) కింద రీచార్జి చేసుకొంటే 28 రోజుల పాటు బిఎస్‌ఎన్‌ఎల్ మొబైల్‌కు అన్‌లిమిటెడ్ టైమింగ్, 300 ఎంబి డేటా ఉంటుందన్నారు. అదే విధంగా రూ.339 ఎస్‌టివి రీచార్జి చేసుకొంటే ఏ నెట్‌వర్క్‌కు అయినా ఎస్‌టిడి, లోకల్ 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ టైమింగ్ ఉంటుందని, 1జిబి డేటా ఉంటుందన్నారు. అదే విధంగా ఈ నెల 21, 22వ తేదీల్లో పట్టణంలోని ఎనిమిది కేంద్రాల్లో అన్ని మండల కేంద్రాల్లో ఉచిత సిమ్ అందచేసేందుకు రోడ్‌షోలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ముగిసిన కానిస్టేబుళ్ల దేహదారుఢ్య పరీక్షలు
* 5263 మంది హాజరు
అనంతపురం అర్బన్, డిసెంబర్ 19: గత ఆరు రోజులుగా నీలం సంజీవరెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు సోమవారం ముగిసాయి. దేహదారుఢ్య పరీక్షల్లో ఎంతమంది విజయవంతం అయ్యారులాంటి వివరాలు ఇంకా అందాల్సి వుంది. ప్రాథమిక పరీక్ష అనంతరం 5,697 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకావాల్సి వుండగా, 5,263 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మరో 434 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు ఎస్‌పి రాజశేఖర్‌బాబు తెలిపారు. దేహదారుఢ్య పరీక్షల్లో భాగంగా అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్(పి.ఎం.టి), ఫిజికల్ ఎఫిషియన్సీ (పి.ఇ.టి) పారదర్శకంగా నిర్వహించినట్లు ఎస్‌పి తెలిపారు. గతంలో ఎన్నడు లేనంతగా ఈ పరీక్షలకు టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించటం జరిగిందన్నారు. ప్రాథమికంగా బయోమెట్రిక్‌తో ఆరంభించి అందులో విజయవంతమైన వారికి పిఎంటి పరీక్షల్లో ఎత్తు, ఛాతి కొలతలు పూర్తయిన తరువాత, సర్ట్ఫికెట్ల పరిశీలన కొనసాగించారు. అనంతరం అభ్యర్థులకు 1600 మీటర్ల పరుగుపందెంతో ఆరంభించి, వంద మీటర్లు, లాంగ్‌జంప్‌ను నిర్వహించారు. మరోవైపు సీసీ కెమెరాలతో అభ్యర్థుల పరుగు పోటీల్లో నిర్దేశించిన సమయంతోపాటు చేరార లేదా వంటి వాటితోపాటు అతి తక్కువ సమయంలో లక్ష్యాన్ని పూర్తి చేసిన వారిని ఇందులో గుర్తించారు. అభ్యర్థులు తమ వెంట తెచ్చుకొన్న సెల్‌ఫోన్, కిట్లుకు పూర్తి భద్రత సైతం కల్పించారు. ఉదయం అభ్యర్థులకు అల్పాహారంతోపాటు మధ్యాహ్నం పులిహోర, పెరుగు అన్నం అందించారు. గత ఆరు రోజులుగా ఎస్‌పి రాజశేఖర్‌బాబు దగ్గురుండి పరీక్షలను పరిశీలించారు. ఎఎస్‌పి మాల్యాద్రి, డిఎస్పీలు వల్లికార్జునవర్మ, నాగసుబ్బన్న, వెంకటరామాంజినేయులు, మహబూబ్‌బాషా, వెంకటేశ్వర్లు, చిన్నికృష్ణ, చిదానందరెడ్డి, జిల్లా పోలీస్ కార్యాలయం పరిపాలన అధికారి సూర్యనారాయణ, పలువురు సి.ఐలు, ఎస్.ఐలు, జిల్లా పొలీస్ కార్యాలయ సిబ్బంది, ఐటి కోర్ కమిటి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
యేసుక్రీస్తు బోధనలను ఆచరించాలి
అనంతపురం కల్చరల్, డిసెంబర్ 19: యేసుక్రీస్తు బోధనలు మానవాళికి ఎంతో తోడ్పడుతాయని, వాటిని ప్రతి ఒక్కరు ఆచరించాలని మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత పేర్కొన్నారు. ఈమేరకు మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కృష్ణ కళామందిర్‌లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితోపాటు ఎమ్మెల్సీలు శమంతకమణి, డా.గేయానంద్, జడ్పీ చైర్మన్ చమన్, ఎమ్మెల్యేలు ప్రభాకర చౌదరి, ఉన్నం హనుమంతరాయచౌదరి, నగర మేయర్ స్వరూప, కలెక్టర్ కోన శశిధర్, జెసి బి.లక్ష్మీకాంతం, జెసి-2 సయ్యద్ ఖాజామొహిద్దీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ యేసుక్రీస్తు శాంతి, సహనం, ప్రేమను అందించారన్నారు. మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. క్రైస్తవులందరూ క్రిస్మస్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం క్రిస్మస్ కానుక పేరుతో వారికి సరుకులను పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. అదేవిధంగా క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులతోపాటు చర్చి పాస్టర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు.
శ్రీ కాశీవిశే్వశ్వర కోదండ రామాలయంలో ధనుర్మాస పూజలు
అనంతపురం కల్చరల్, డిసెంబర్ 19: మొదటి రోడ్డు శ్రీ కాశీవిశే్వశ్వర కోదండ రామాలయంలో ధనుర్మాసం సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, విశేషాలంకారములతో పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీ జాగర్లమూడి శ్యామ సుందర శాస్ర్తీచే ధనుర్మాస విశిష్టతను వివరిస్తూ ప్రవచనములు నిర్వహించారు. శ్రీ వినాయక నృత్య కళానికేతన్ విజయకుమార్ శిష్య బృందంచే నృత్య ప్రదర్శన గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ సంధ్యామూర్తి, ఈఓ నాగేంద్ర, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
జడ్పీ చైర్మన్ స్థానం వాల్మీకులకు కేటాయించాలి
* వాల్మీకి చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు గంగాధర్
అనంతపురం కల్చరల్, డిసెంబర్ 19: జడ్పీ చైర్మన్ స్థానం వాల్మీకులకు కేటాయించాలని వాల్మీకి చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు వాల్మీకి గంగాధర్ డిమాండ్ చేశారు. ఈమేరకు సమితి కార్యాలయంలో సోమవారం విలేఖరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జిల్లా మంత్రులు జడ్పీ చైర్మన్‌గా చమన్‌ను రెండున్నరేళ్లు కొనసాగించి, తదుపరి రెండున్నరేళ్ల పదవీ కాలానికి వాల్మీకి కులానికి చెందిన గుమ్మగట్ట జడ్పీటిసి పూల నాగరాజుకు చైర్మన్‌గా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రస్తుతం రెండున్నరేళ్ల పదవీ కాలం పూర్తయినందున నాటి హామీ మేరకు వాల్మీకులకు జడ్పీ చైర్మన్ స్థానం కేటాయించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వాల్మీకి, బోయ సామాజిక వర్గం జనాభా అధికంగా ఉన్నారని, గత ఎన్నికల్లో టిడిపిని బలపరచారని ఆయన తెలిపారు. ఇప్పటికే వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తామన్న హామీని, జడ్పీ చైర్మన్ స్థానం రెండున్నరేళ్లకు వాల్మీకులకు కేటాయిస్తామన్న హామీని వెంటనే అమలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాము ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బోయ పోతులయ్య, ఆవుల గోవిందు, విజయ్, శంకర్, లక్ష్మణ్, సురేష్, రామాంజినేయులు పాల్గొన్నారు.

కష్టానికి తగ్గ ఫలితం అందించాలి
అనంతపురం అర్బన్, డిసెంబర్ 19: గత పదేళ్లుగా క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బందికి తీసిపోని స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నప్పటికి చాలీచాలని వేతనాలతో తాము తీవ్ర ఇక్కట్లుపడుతున్నామని, తక్షణమే తమ వేతనాలను ఐదు వేలకు పెంచాలని జిల్లా ఆశా వర్కర్ల ప్రధాన కార్యదర్శి నాగవేణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఆశా వర్కర్ల అధ్యక్షురాలు హనుమక్క, ప్రధాన కార్యదర్శి నాగవేణి మాట్లాడుతూ గత పదేళ్లుగా గ్రామస్థాయిలో గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలు సంరక్షణతోపాటు ఆసుపత్రులలో కాన్పులు జరిగేలా చూడటం, కుటుంబ నియంత్రణ, పారిశుద్ధ్యంతోపాటు జనన, మరణాలు, మలేరియా తదితర రోగాలకు అందుబాటులో వుండి నిరంతరం సేవలందించటం జరుగుతోందన్నారు. వేతనాలు అందించకుండా పారితోషికాలు అందిస్తున్నారన్నారు. కేరళ, బెంగాల్, హరియానా, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో కేంద్రం అందిస్తున్న పారితోషికాలతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్స్‌కు పారితోషికాలు అందిస్తున్న విషయాన్ని తెలిపారు. కాని రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్స్‌తో వెట్టిచాకిరీ చేయించటంతోపాటు పారితోషికాలు అందించలేని దుస్థితిలో వుందన్నారు. అనంతరం వినతిపత్రాన్ని జిల్లా వైద్యాధికారి వెంకటరమణకు అందజేశారు. ప్రభుత్వం స్పందించకుంటే జనవరి 20న చలో విజయవాడ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ ఉపాధ్యక్షురాలు లక్ష్మి, కార్యదర్శులు ఫాతిమా, ప్రమీల, మాధవి, కళావతి, రామగిరి ముత్యాలమ్మ తదితరులు పాల్గొన్నారు.
యువరైతు ఆత్మహత్య
రోళ్ల, డిసెంబర్ 19:మండల పరిధిలలోని హెచ్‌టి హళ్ళి గ్రామానికి చెందిన గురునాథ్ (30) అనే రైతు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ నాగన్న తెలిపారు. భార్య కళావతి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. తనకున్న 3 ఎకరాల పొలంలో మల్బరి, వరి, పూలతోటలు సాగుచేశాడు. ఉన్నపలంగా భోరుబావిలో నీళ్లు రాకపోవడంతో అదనంగా 3లక్షల అప్పులు చేసి మరో బోరుబావి తవ్వించాడు. అయితే అక్కడ కొద్దిపాటి నీళ్ల లభ్యమైనట్లు తెలిపారు. దీంతో ఆ నీళ్లు సాగుభూమికి నీరు సరిపోకపోవడం, చేసిన అప్పులు తీర్చేమార్గంలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. సోమవారం సాయంత్రం తన పొలం సమీపంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన గ్రామస్తులు కుటుంబానికి సమాచారం ఇవ్వడంతో తక్షణం 108 వాహనంలో మడకశిర పిహెచ్‌సికి తరలిస్తుండగా మార్గమద్యంలో చనిపోయినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతినికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నట్లు తెలిపారు.
నిందితులకు రిమాండ్
మడకశిర, డిసెంబర్ 19:మడకశిర పట్టణంలో వృద్ధురాలు భారతమ్మ హత్య కేసులో నిందితులను ఆదివారం జిల్లా ఎస్పీ ఎదుట స్థానిక పోలీసులు హాజరు పరచిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సంబంధిత నిందితులు నాగరాజు, ముత్యాలప్ప, రాజప్ప, రమేష్‌లను సోమవారం కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి ఈ ఈ నెల 30వ తేదీ వరకు రిమాండ్ విధించినట్లు ఎస్‌ఐ మక్బూల్‌బాషా తెలిపారు. ఈ కేసులో మరో ప్రధాన నిందితుడి ఆచూకీ లభ్యం కావాల్సి ఉందని, గాలింపు చర్యలు చేపడుతున్నామని, త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు తెలిపారు.
వృద్ధురాలి మెడలో గొలుసు లాక్కెళ్లిన దుండగలు
కదిరి, డిసెంబర్ 19: పట్టణంలోని అడపాల వీధిలో గంగులమ్మ అనే వృద్ధురాలి మెడలో నుండి గుర్తుతెలియని దొంగలు బంగారు గొలుసు లాక్కెళ్లిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ఇంటి బయట గంగులమ్మ వుండగా, ద్విచక్ర వాహనంలో వచ్చిన దుండగలు ఆమె మెడలోని గొలుసును లాగారు. కాగా గొలుసు లాగేటప్పుడు జరిగిన ప్రతిఘటనలో వృద్ధురాలి మెడకు గాయం కావడంతో ఆమెను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గడ్డివాము, ఎడ్లబండి దగ్ధం
కదిరి, డిసెంబర్ 19: మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్ల సమీపంలో రేకే గంగన్న అనే రైతుకు చెందిన 20 ఎడ్లబండ్లు గల గడ్డివామితోపాటు ఎడ్లబండికి గుర్తుతెలియని దండుగులు సోమవారం తెల్లవారుజామున నిప్పు పెట్టడంతో రూ. లక్ష ఆస్తి నష్టం జరిగింది. విషయం తెలుసుకున్న వైకాపా కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా. పి.వి సిద్దారెడ్డి బాధితుని పరామర్శించి రూ. 10 వేలు ఆర్థికసాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా పట్టణ, రూరల్ కన్వీనర్లు కె.యస్ బహావుద్దీన్, ప్రకాష్, నాయకులు కె.వి సురేష్‌రెడ్డి, కౌన్సిలర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తి ఆత్మహత్య
వజ్రకరూరు, డిసెంబర్ 19:మండల కేంద్రంలో ఉన్న ఆటో మధు (28) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం జరిగింది. ధువులు తెలిపిన వివరాలు మేరకు ఇంటిలో కుటుంబ ఖర్చుల కోసం ఉంచిన రూ.5వేలు మధు తీసుకుని వెళ్లాడని తండ్రి కిష్టప్ప మందలించడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఆదివారం ఉదయం ఇంటి నుండి వెళ్లిపోయిన మధు ఇంటికి రాకపోవడంతో అతనికోసం సమీప బంధువులు గాలించారు. సోమవారం ఉదయం గ్రామ శివార్లల్లో ఉన్న అముద పంట పొలంలో శవమై కనిపించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ జనార్ధననాయుడు తెలిపారు. మృతునికి భార్య లక్ష్మి, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.
జాతీయ రహదారిపై ఇరుక్కున్న లారీ
రాప్తాడు, డిసెంబర్ 19: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గాలిమరలను రవాణా చేస్తున్న లారీ సోమవారం తెల్లవారుజామున అదుపుతప్పి ఇరుక్కుపోయింది. దీంతో జాతీయ రహదారిపై వాహనాల రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గాలిమరలకు అమర్చాల్సిన రెక్కలను లారీలో బెంగళూరు నుండి కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో రాప్తాడు దగ్గర మలుపు వద్ద లారీ అదుపు తప్పి జాతీయ రహదారిపై పూర్తిగా అడ్డంగా ఇరుక్కుపోయింది. దీంతో సాయంత్రం వరకు రవాణాకు భారీ వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానిక పోలీసులు జాతీయ రహదారి సిబ్బంది భారీ క్రేన్లను తెప్పించి లారీని తప్పించి రాకపోకలకు అంతరాయం కలుగకుండా చేశారు.
30 బస్తాల సబ్సిడీ బియ్య పట్టివేత
ఓడిచెరువు, డిసెంబర్ 19: మండల కేంద్రంలోని ప్రైవేటు మండీ దుకాణంలో సోమవారం రాత్రి 30 బస్తాల ప్రభుత్వ సబ్సిడీ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్ ఆంజనేయులు తెలిపారు. అందిన సమాచారం మేరకు సోమవారం ప్రైవేటు మండీలో సబ్సిడీ బియ్యం నిల్వ ఉన్నట్లు తెలియడంతో ఆర్‌ఐ శర్మ, విఆర్‌ఓ బాలప్పలతో తనికీ చేశామన్నారు. తనిఖీల్లో సబ్సిడీ బియ్యం లభ్యమైయ్యాయన్నారు. బియ్యం స్వాధీనం చేసుకుని రెండవ ఎఫ్‌సి దుకాణం వద్ద సీజ్ చేసి ఉంచామన్నారు. కేసు వివరాల విచారిస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు.