అనంతపురం

నత్తనడకన భూసార పరీక్షలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జనవరి 6 : జిల్లా భూసార పరీక్ష కేంద్రంలో సిబ్బంది కొరత కారణంగా మట్టి నమూనాల విశే్లషణ నత్తనడకన సాగుతోంది. 2014-15 నుంచి రాష్టవ్య్రాప్తంగా 6.40 లక్షల మేరకు భూసార పరీక్షల నిమిత్తం మట్టి నమూనాలు (శ్యాంపిల్స్) తీయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందులో జిల్లాలో ఈఏడాది (2016-17) 65,705 మట్టి నమూనాలు తీయాలని లక్ష్యం విధించింది. ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాలంటే తగినంత మంది సిబ్బంది అవసరం. ఇందుకోసం ఇటీవల ప్రభుత్వం నియమించిన ఎంపిఇఓలు 20 మందిని డిప్యుటేషన్‌పై జిల్లా భూసార పరీక్ష కేంద్రానికి పంపాల్సి ఉంది. ఇప్పటి వరకు 8 మంది మాత్రమే వచ్చారు. మిగతా 12 మందిని జిల్లాలోని వివిధ మండలాల నుంచి రిలీవ్ చేయాల్సి ఉంది. జిల్లాలోని 11 వ్యవసాయ డివిజన్ల పరిధిలోని వివిధ మండలాల్లో పని చేస్తున్న ఎంపిఇఓలు వస్తే మట్టి నమూనాల విశే్లషణ వేగవంతం అవుతుంది. లేకుంటే మరింత నత్తనడకన సాగే పరిస్థితి ఉంది. తద్వారా రైతులకు సకాలంలో భూసార పరీక్ష విశే్లషణ పత్రాలు అందడంలో జాప్యం తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 2016-17కు కేటాయించిన 65,700 మట్టి నమూనాల లక్ష్యంలో ధర్మవరం వ్యవసాయ మార్కెట్ కమిటీలోని భూసార పరీక్ష కేంద్రానికి 11,475, పెనుకొండ కేంద్రానికి 11,475, సంచార భూసార పరీక్ష కేంద్రానికి 8,175 చొప్పున, జిల్లా ల్యాబొరేటరీకి 34,145 చొప్పున కేటాయించారు. ఈ లక్ష్య సాధనకు ధర్మవరం, పెనుకొండ ఎఎంసిలకు నలుగురు చొప్పున ఎంపిఇఓలను డిప్యూట్ చేశారు. కాగా 2016-17 సంవత్సరానికి 65,705 మట్టి నమూనాలు సేకరించి విశే్లషించి రైతులకు భూసార పరీక్ష విశే్లషణ పత్రాలు అందివ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గత నవంబర్ నుంచి ఈనెల ఇప్పటి వరకూ జిల్లావ్యాప్తంగా కలిపి మొత్తం 30వేల మట్టి నమూనాలు తీశారు. ఏప్రిల్ నాటికి లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ఈ ఏడాదితో ప్రభుత్వం నిర్దేశించిన మూడేళ్ల వ్యవధి పూర్తవుతుంది. 2014-15కు 32వేల మట్టి నమూనాలు పూర్తి చేశారు. వీటికి సంబంధించి ప్రధాన రైతులతోపాటు గ్రిడ్ (25 ఎకరాల పరిధి)లోని రైతులందరూ కలిపి 1.15 లక్షలు మంది ఉన్నారు. 2015-16కు సంబంధించి 65,700 మట్టి నమూనాలు తీయాలని లక్ష్యంగా నిర్దేశించగా, ఆ మేరకు భూసార పరీక్షలు పూర్తి చేసి 2.28 లక్షల మంది రైతులకు విశే్లషణ పత్రాలు అందజేశారు. 2016-17కు సంబంధించి 65,705 మట్టి నమూనాలు సేకరించి విశే్లషించి రైతులకు కార్డులు అందించాల్సి ఉంది.
ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తాం..
- ఎం.కృష్ణమూర్తి, ఎడి, జిల్లా భూసార కేంద్రం
ఈఏడాది (2016-17) లక్ష్య సాధనకు కృషి చేస్తున్నాం. ఏప్రిల్ నాటికి మట్టి నమూనాలన్నింటినీ విశే్లషించి పూర్తి చేస్తాం. రైతులకు మేనెల కార్డులు అందిస్తాం. ప్రస్తుతం ఎంపిఇఓలను డిప్యుటేషన్‌పై పంపాలని ఉన్నతాధికారులను కోరాం. వివిధ మండలాల నుంచి ఎంపిఇఓలను రిలీవ్ చేయాలని వ్యవసాధికారులకు మెమోలిచ్చాం. గతేడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు తీసిన 30వేల నమూనాలను ఆన్‌లైన్ చేస్తున్నాం. వీటిలో 20వేలు జిల్లా ల్యాబ్‌కు కేటాయించారు. ఇందులో 10వేల మట్టి నమూనాల విశే్లషణ పూర్తి అయింది. మిగతా వాటి విశే్లషణ జరుగుతోంది.
తూమకుంట పారిశ్రామికవాడ
అభివృద్ధికి చర్యలు
* త్వరలో ‘పురం’ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుల భర్తీ..
* జెసి లక్ష్మీకాంతం
హిందూపురం, జనవరి 6 : హిందూపురం సమీపంలోని తూమకుంట పారిశ్రామికవాడ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక ప్రభుత్వాసుపత్రికి విచ్చేసి అభివృద్ధి పనులు, సమస్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ జెఇ వెంకటస్వామి, సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులతో అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో ఇటీవల ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ పనితీరు బాగా ఉందంటూ ప్రశంసించారు. అదే విధంగా ఆసుపత్రిలో ఇటీవల జరుగుతున్న అభివృద్ధి పనులపై కూడా జెసి సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే జిల్లాస్థాయి ఆసుపత్రి గుర్తింపు కలిగిన ఇక్కడి ప్రభుత్వాసుపత్రిలో గత కొనే్నళ్లుగా సర్జన్ లేకపోవడంతో చిన్నపాటి ఆపరేషన్లకు కూడా బెంగళూరు, అనంతపురం వంటి ప్రాంతాలకు సిఫార్సు చేస్తున్నందున సాధారణ రోగులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని జెసి దృష్టికి తీసుకురాగా త్వరలోనే ఆయా పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. అదేవిధంగా నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ఇప్పటికే చర్యలు తీసుకోగా ఆయా పనులను వేగవంతం చేస్తామన్నారు. కాగా హిందూపురానికి నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తుండగా ఆయన ఇచ్చిన హామీలు అంతంత మాత్రంగానే అమలుకు నోచుకుంటున్నాయని, ఇందులో భాగంగా తూమకుంట పారిశ్రామిక వాడలో కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు దాదాపు ఎనిమిదికిపైగా సరిహద్దులో ఉంటున్న కర్నాటక ఎస్‌ఇజడ్‌కు తరలివెళ్లాయని స్థానికులు జెసి దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు జెసి స్పందిస్తూ త్వరలో అక్కడకు వెళ్లి స్థితిగతులు తెలుసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా హిందూపురం నియోజకవర్గంలో పరిశ్రమల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని వివరించారు.
సర్వవ్యాపితం పరమాత్మతత్వం
* శ్రీ గురు జ్ఞానరాజ్ మాణిక్య ప్రభు
అనంతపురం కల్చరల్, జనవరి 6 : పరమాత్మతత్వం సర్వత్రా వ్యాపించి ఉండటంతోపాటు సకల జీవుల్లో భగవంతుడు ఉన్నాడని శ్రీ గురు జ్ఞానరాజ్ మాణిక్య ప్రభు అన్నారు. నగరంలోని మూడవ రోడ్డు జిఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా సమీపంలోని మాణిక్‌నగర్ సంస్థాన పీఠాధిపతి శ్రీ గురు జ్ఞానరాజ్ మాణిక్య ప్రభు మాట్లాడుతూ భగవాన్ దత్తాత్రేయులు మూడు తలలు, ఆరు చేతులతో కూడిన రూపంతో మనకు కనిపిస్తాడన్నారు. గురుతత్వంతో కూడిన అవతారమే దత్తావతారమన్నారు. రావణ సంహారం కోసం రాముడిగా, కంసుడు, శిశుపాలుని సంహారం కోసం కృష్ణుడిగా అవతరించిన మహావిష్ణువు మనలోని అజ్ఞానాంధకారాలను నాశనం చేయడానికి గురు అవతారంగా అవతరించాడన్నారు. సర్వజిత్ యాగం చేసిన మహావిష్ణువు అత్రి మహర్షికి తనను తాను అర్పించుకోవడంతోపాటు దత్తుడుగా అత్రికి ఇచ్చుకున్నందు వల్లే దత్తాత్రేయుడుగా పిలుస్తున్నారన్నారు. ఈశ్వరస్సర్వ భూతానాం... అంటూ భగవద్గీతలో భగవంతుడు తన చిరునామా గురించి స్పష్టంగా తెలియజేశాడన్నారు. మనకు శబ్ధ, స్పర్శ, రూప, రస, గంధ గుణాలు దేనిద్వారా తెలుస్తాయో అదే పరమాత్మతత్వ మని, అదే దత్తాత్రేయ స్వరూపమన్నారు. సర్వత్రా వ్యాచి భగవంతున్ని మనం చూడాలని, ఆ ప్రయత్నం మనం చేయడం లేదన్నారు. ఏ వెలుతురు కారణంగా మనకు సర్వం కనిపిస్తున్నాయో ఆ వెలుతురే భగవంతుని తత్వమన్నారు. దాన్ని తెలుసుకోవాలని భక్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు డిఎస్.విజయసాయికుమార్, మణూరు నాగరాజరావు, పినే్నపల్లి శ్రీరాములు, ద్వారకానాథ్‌రెడ్డి, చలపతిరెడ్డి, రవికిరణ్, రామశర్మ, వంశీకృష్ణ, భారతీరెడ్డి తదితరులతో పాటు అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తిమ్మంపల్లిలో జెసి పాగా!
* నెలలో మూడు రోజులు అక్కడే..
* సొంత ఇళ్లు, కార్యాలయం కోసం భవంతి
తాడిపత్రి, జనవరి 6 : యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో పాగా వేయడానికి తాడిపత్రి ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తిమ్మంపల్లికి చెందిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్తగా ఆ పార్టీ అధినేత జగన్ నియమించిన విషయం విధితమే. నియోజక సమన్వయకర్తగా నియమించినప్పటి నుంచి పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలో విసృతంగా పర్యటిస్తూ వైకాపాను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఆయన్ను నిలువరించడానికి ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌రెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఏకంగా 10 మంది వైకాపా సర్పంచులు టిడిపి తీర్థం పుచ్చుకోవడంలో జెసిపి చక్రం తిప్పారని చర్చ సాగుతోంది. అంతేగాకుండా తిమ్మంపల్లిలో నివాసంతోపాటు సొంత కార్యాలయం ఏర్పాటు చేసేందుకు కానాల వెంకటరెడ్డికి చెందిన భవంతిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ నిమిత్తం శుక్రవారం తాడిపత్రి సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంలో ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌రెడ్డి స్వయంగా తనపేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ భోగాతి నారాయణరెడ్డి మాట్లాడుతూ యల్లనూరు మండలంలో టిడిపిని బలోపేతం చేయడంతోపాటు కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి ఇంటిని కనుగోలు చేసినట్లు తెలిపారు. అంతేగాకుండా నెలకు మూడు రోజులు తిమ్మంపల్లిలో మకాం వేస్తారని తెలిపారు.
కలియుగ వైకుంఠం చెన్నకేశవపురం
* లక్ష్మీచెన్నకేశవుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం
* 8న శోభారాజు అన్నమయ్య సంకీర్తనలు
కొత్తచెరువు, జనవరి 6 : మండలంలోని చెన్నకేశవపురలో వెలసిన శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం ధ్వజారోహణతో అత్యంత వైభవంగా అంకురార్పణ చేశారు. గ్రామానికి చెందిన ఉషారాణి, చెన్నారెడ్డి దంపతులు ఈ ఆలయాన్ని సొంతంగా నిర్మించడమే కాకుండా ప్రతిఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే 4వ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 8గంటల నుంచి 12గంటలలోపు ధ్వజారోహణ, అంకురార్పణ తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం 4గంటలకు మహాభిషేకా, పుష్పోత్సవం, ఉయ్యాల సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. శనివారం సుదర్శన హోమం అనంతరం గరుడవాహనంలో స్వామివారు ఊరేగుతారు. ఈనెల 8న తెల్లవారుఝామున 4గంటల నుంచి ద్వార ప్రవేశం, ఉదయం 8గంటలకు హోమాలు, పూర్ణాహుతి, నూతన కల్యాణవేదిక ప్రారంభోత్సవం, లక్ష్మీచెన్నకేశవుని కల్యాణోత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 4గంటలకు చక్రస్నానం, ధ్వజారోహణ, శ్రీవారి ఉంటుంది. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఆదివారం శ్రీకాళహస్తి నుంచి తెప్పించి ఏర్పాటు చేసిన ప్రత్యేక ఉత్తర ద్వారం నుంచి లక్ష్మీచెన్నకేశవున్ని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా 8న అన్నమయ్య పదకోకిల పద్మశ్రీ డాక్టర్ శోభరాజుచే అన్నమయ్య పాటలు, సాయంత్రం సుచికీర్తి బృందంచే శ్రీవెంకటేశ్వర కల్యాణ నాటక రూపం నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలను తిలకించడానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు అధికంగా వస్తుంటారు. ఇందులో భాగంగా శ్రీమతి ఉషారాణి, చెన్నారెడ్డి దంపతులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆలయ ప్రాంగణంతోపాటు చెన్నకేశవపురం గ్రామం మొత్తం రంగురంగుల విద్యుత్‌దీపాలతో అలంకరించారు. మార్కాపురం నుంచి ఇక్కడికి వచ్చి సాక్షాత్కారమై తన ఉనికి నిలిపిన బ్రహ్మాండ భువనాధీశ్వరులు శ్రీలక్ష్మిచెన్నకేశవ చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు దుర్మిఖినామ సంవత్సర పుష్ప శుద్ధ నవమి నాడు ప్రారంభమై ముక్కోటి ఏకాదశి వరకూ జరగనున్నాయి. కావున భక్తాదులందరూ స్వామివారిని దర్శించి పునీతులు కావాలని ధర్మకర్తలు కోరుతున్నారు. ఇక్కడ వివాహం జరిపించడానికి భారీ ఎత్తున నూతన కల్యాణ వేదికను నిర్మిస్తున్నారు.
గోసంతతి సంరక్షణకే గోపూజలు
* హిందూధర్మ ప్రచార మండలి జిల్లా అధ్యక్షుడు శ్రీపాద వేణు
అనంతపురం కల్చరల్, జనవరి 6 : సకల దేవతా నిలయం, సకల సంపదలకు మూలమైన గోసంతతి సంరక్షణ కోసం టిటిడి, హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు హిందూ ధర్మప్రచార మండలి జిల్లా అధ్యక్షులు శ్రీపాద వేణు అన్నారు. ఈమేరకు శుక్రవారం స్థానిక టిటిడి కల్యాణ మండపంలో గోపూజ గోడపత్రికలు, కరపత్రాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మంలో గోవును తల్లిగా భావించి పూజిస్తున్నట్లు తెలిపారు. సామాజికంగా, ఆధ్యాత్మికంగా గోవుకు విశేషమైన ప్రాధాన్యత కలదన్నారు. గోవును పూజించిన వారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయని మన పురాణాలు చెపుతున్నాయన్నారు. ఇలాంటి గోవు ప్రాశస్త్యాన్ని గ్రామగ్రామాన అందరికీ తెలియజేయాలన్న సంకల్పంతో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా గోపూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని 63 మండలాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు ఒక్కో కార్యక్రమానికి రూ. 2వేలు చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో హిందూ ధర్మప్రచార మండలి జిల్లా కార్యదర్శి నాగేశ్వరి, విశ్వహిందూ పరిషత్ నాయకురాలు జి.లక్ష్మమ్మ, టిటిడి బాబు, పురాణ పండిట్ వేణు తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
* జన్మభూమి సభల్లో నేతలు
హిందూపురం టౌన్, జనవరి 6 : రాష్ట్రంలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర బిసి కార్పొరేషన్ చైర్మన్ పామిశెట్టి రంగనాయకులు, మున్సిపల్ చైర్‌పర్సన్ రావి ళ్ల లక్ష్మి, వైస్ చైర్మన్ జెపికె రాము, ము న్సిపల్ రీజినల్ డైరెక్టర్ విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని 19, 20, 22, 29వ వార్డుల్లో ఆ యా వార్డు కౌన్సిలర్ల అధ్యక్షతన జన్మభూమి వార్డు సభలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఎన్నో పారదర్శకమైన చర్యలు తీసుకుంటున్నారన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల వినియోగదారులకు ఎలాంటి కోత లేకుండా నిరంతరంగా విద్యుత్ సరఫరా అందిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అన్నింటిని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పేద వర్గాలు సుఖసంతోషాలతో పండుగ జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఉచితంగా సంక్రాంతికి కానుకలను అందచేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తూ విద్యపరంగా ప్రోత్సహించడం జరుగుతోందన్నారు. మున్సిపల్ పాఠశాలలను కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు చంద్రన్న కానుకలు, అన్న బీమా యోజన, ఉపకార వేతనాలు, నూతన రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, టిడిపి నాయకులు ఏ.నాగరాజు, అమర్‌నాథ్, మురళీ, గోపి, శివకుమార్, నింకంపల్లి రామాంజి, డైమండ్‌బాబా, కౌన్సిలర్లు నాగమ్మ, సరోజు, జరీనా, రోషన్‌అలీ, సీతాలక్ష్మి పాల్గొన్నారు.
కౌకుంట్లలో సినిమా షూటింగ్
ఉరవకొండ, జనవరి 6 : సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకుడు తేజ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ శుక్రవారం మండలంలోని పెద్దకౌకుంట్లలో చిత్రీకరించారు. షూటింగ్ చూడడానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కౌకుంట్ల గ్రామం వద్ద ఉన్న ఓహెచ్‌ఆర్ ట్యాంక్ వద్ద ప్రత్యేక సెట్టింగ్ తయారు చేసి పెళ్లి సన్నివేశాన్ని చిత్రీకరించారు.
వైభవంగా గంగమ్మ పూజ
డి.హీరేహాల్, జనవరి 6 : మండల పరిధిలోని మలపనగుడి గ్రామంలో గంగపుత్రులు భక్తిశ్రద్ధలతో శుక్రవారం గంగపూజ ఘనంగా నిర్వహించారు. బెస్తల ఆరాధ్య దైవం గంగమ్మకు ప్రతిఏడాది కుటుంబ సమేతంగా ఉపవాసాలు, మేళతాళాలతో ఊరి చివరన ఉన్న బావివద్దకు వెళ్లి గంగమ్మకు చీర, గాజులు, కుంకుమ సమర్పించి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. దాదాపు 50 కుటుంబాల పెద్ద హనుమంతరాయుడు ఆధ్వర్యంలో ఇంటికో కలశం తీసుకుని చెక్క్భజనలు చేసుకుంటూ గంగమ్మ బావి వద్దకు వెళ్లి పూజలు చేశారు.
గవర్నర్ నరసింహన్ నేడు పుట్టపర్తి రాక
పుట్టపర్తి, జనవరి 6 : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నేడు పుట్టపర్తికి రానున్నారు. నేడు మధ్యాహ్నం బెంగుళూరు నుంచి రోడ్డు మార్గాన పుట్టపర్తికి చేరుకుని ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారు. తర్వాత శాంతిభవన్ విడిది గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. 3:30కు ఇక్కడి నుండి బయలుదేరి బెంగుళూరుకు వెళ్తారు. ఈ సందర్భంగా డిఎస్‌పిలు వేణుగోపాల్, నాగసుబ్బన్న, సిఐ శ్రీ్ధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బాంబ్‌స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్, రోడ్ ఓపెనింగ్ పార్టీ తదితర పోలీసు బృందాలు క్షుణ్నంగా పరిశీలంచాయి.
ఎనుములపల్లిలో శివాలయం నిర్మాణం
పుట్టపర్తి, జనవరి 6 : పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లి గ్రామంలో అధునాతన శివాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈమేరకు ఆలయ నిర్మాణం, వాస్తు పద్ధతులను అనంతపురంలోని చిన్మయ మిషన్ ఆశ్రమ ఆత్మవిదానంద స్వామిజీ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ దాతలు, ఉప్పుతల్లు శ్రీరాము లు, ఆలయ కమిటీ సభ్యులు స్వామిజీని సత్కరించారు. అనంతరం స్వామిజీ మాట్లాడుతూ ఎనుములపల్లి గ్రామానికి వాస్తు అమోఘంగా ఉందన్నారు. ప్ర ధానంగా ఒకే ప్రాంతంలో శాం త నరసింహస్వామి, ఆంజనేయస్వామి, సత్యమాంబ, శివాలయం ఏర్పాట్లు జరగడం ము దావహమన్నారు. ఆలయ ని ర్మాణాన్ని కొందరుకాక అందరూ కలి సి తమవంతుగా నిర్మిస్తే మంచిదని సూచించారు. గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు స్వామీజీకి సత్యసా యిబాబా చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ ప్రాంగణంలో స్వామీజీ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుయువత నాయకులు చింతా దామోదర్, మురళి తదితరులు పాల్గొన్నారు.

సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైల్లో
శిశువు మృతదేహం లభ్యం
గుంతకల్లు, జనవరి 6 : తిరుపతి-నిజాముద్దిన్ ఎక్స్‌ప్రెస్ రైల్లో శుక్రవారం మగ మృతశిశువు లభ్యమైంది. తిరుపతి నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైల్లో స్లీపర్ కోచ్ 8లో నెలలోపు ఉన్న మగ శిశువు మృతదేహాన్ని ప్రయాణికులు గుర్తించి జీఆర్డీ పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి శిశువును వైద్యులతో పరీక్షలు చేయించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రయాణికులు చిన్నారి మృతి చెందాడని గుర్తించి రైల్లోనే వదిలి వెళ్లి ఉంటారని పోలీసులు తెలిపారు.