అనంతపురం

ప్రజా సంక్షేమమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాప్తాడు, జనవరి 9: ప్రజా సంక్షేమానికే నిరంతరం పాటుపడతామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. సోమవారం ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో 4వ విడత జన్మభూమి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పరిటాల సునీత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికే ఇప్పటివరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, మున్ముందు మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తామన్నారు. గ్రామాల్లోకి అధికారులు వచ్చినపుడు గ్రామాభివృద్ధికి ఏమి అవసరమో వాటిని ఖచ్చితంగా విజ్ఞాపన పత్రాలను అందించాలన్నారు. హంద్రీనీవా కాలువ వెళ్ళే మార్గంలో రాప్తాడు నియోజకవర్గంలోని అన్ని చెరువులను నీటితో నింపడం జరిగిందని, దీనివల్ల భూగర్భ జలాలు వృద్ధి చెందుతున్నాయన్నారు. గతంలో ఆయకట్టు భూములు బీడు భూములుగా, కంపచెట్లుగా కనిపించేవని, ప్రస్తుతం అన్ని చెరువులు నిండడంతో పచ్చని పంటలతో భూములు కళకళలాడుతున్నాయన్నారు. సుమారు 100 చెక్‌డ్యాంలను నీటితో నింపామన్నారు. రాప్తాడు చెరువుకు నీటిని తీసుకురావడానికి సొంత నిధులను వెచ్చించి నీటిని తీసుకొచ్చామన్నారు. అదేవిధంగా పండమేరు వంకకు కూడా హంద్రీనీవా నీటిని తీసుకొస్తున్నామన్నారు.కుల, మత, పార్టీ వర్గాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందరికీ అందిస్తున్నామన్నారు. రాప్తాడు పంచాయతీలో 762మందికి ప్రతి నెలా సుమారు రూ.7.70 లక్షలు పింఛన్లు అందిస్తున్నామని, ప్రస్తుతం పంచాయతీలో 2129 రేషన్ కార్డుదారులుండగా గ్రామసభల్లో కొత్తగా 93 రేషన్ కార్డులను అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా రుణమాఫీ కింద రూ.9.54 కోట్లు అందించామని తెలిపారు. అసంఘటిత కార్మికులందరు చంద్రన్న బీమాకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సునీత తెలిపారు. ఎన్‌టిఆర్ వైద్య పరీక్షలు రాప్తాడు పంచాయితీలో 71మంది చేయించుకున్నారని, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ కార్పొరేషన్ల కింద 69మంది లబ్దిదారులు దరఖాస్తు చేసుకోగా రూ.47 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎన్‌టిఆర్ గృహ నిర్మాణ పథకంలో 60మందికి ఇళ్ళను నిర్మించి ఇస్తున్నామని, వాటి విలువ సుమారు రూ.30 లక్షలు అని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గొర్రెల సంక్షేమానికి రూ.17.25 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న తహశీల్దార్ కార్యాలయాన్ని వచ్చే నెలలో పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు. 1.35 కోట్ల మందికి రాష్ట్ర వ్యాప్తంగా రూ.350 కోట్లు ఖర్చు చేసి చంద్రన్న సంక్రాంతి కానుకలను పంపిణీ చేస్తున్నామని, కొత్తగా 8.59 లక్షల మందికి రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని, వీరందరికి కూడా చంద్రన్న సంక్రాంతి కానుకలను అందజేస్తున్నామన్నారు. కాగా రాప్తాడు పండమేరు వంకలో పంచాయతీ నిధులు రూ.5 లక్షలతో నిర్మించిన దోబీఘాట్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం చంద్రన్న సంక్రాంతి కానుకలు, రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి దగ్గుబాటి ప్రసాద్, డిఆర్‌డిఎ పిడి వెంకటేశ్వర్లు, ఆర్‌డిఓ బాలానాయక్, ఎస్‌ఎస్‌ఎ పిఓ దశరథరామయ్య, ప్రత్యేక అధికారి రవిశంకర్, ఎంపిడిఓ శ్రీనివాసులు, తహశీల్దార్ నాగభూషణం, సర్పంచ్ వెంకటరాముడు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.