అనంతపురం

అంతటా కరవే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జనవరి 22 : వరుస కరవులతో జిల్లా కునారిల్లుతోంది. నాలుగైదేళ్ల నుంచి వరుణుడు ముఖం చాటేస్తుండటంతో రైతులు పంటలు నష్టపోతూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా ఖరీఫ్, రబీ పంటలు నిలువునా ఎండిపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఆఖరికి తాగు, సాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. గడిచిన 17, 18 ఏళ్లుగా జిల్లాను కరవు వెంటాడుతూనే ఉంది. మరోవైపు ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనులు కల్పిస్తున్నా వలసలు తప్పడం లేదు. మరోవైపు పంటల సాగుకు నీరు లేకపోవడంతో బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు రైతులు, ఉపాధి కూలీలు ఉపాధి కోసం వెళ్తున్నారు. పశువులకు గ్రాసం కరువై కబేళాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం వేసవి సమీపించకనే గ్రాసం కొరత ఏర్పడుతోంది. దీని ప్రభావం పాడి పరిశ్రమపై భారీగా పడుతోంది. కాగా జిల్లాలో 2016- 17 వ్యవసాయ సంవత్సరం (జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ అధికారిక గణాంకాల మేరకు 338.4 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉన్నా, 257.3 మి.మీ మాత్రమే కురిసింది. ఈశాన్య రుతుపవనాల ద్వారా 155.6 మిమీకు కేవలం 27.6 మిమీ మాత్రమే నమోదైంది. ఈక్రమంలో ఖరీఫ్‌తో పాటు రబీ సీజన్ కూడా జిల్లా రైతాంగాన్ని కుంగదీసింది. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో ప్రధాన పంట అయిన వేరుశనగ సాధారణ విస్తీర్ణం కన్నా తక్కువగానే సాగైంది. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో మొత్తం 6లక్షల 29వేల853 హెక్టార్లలో వేరుశనగ పంట సాధారణ విస్తీర్ణంలో సాగు కావాల్సి ఉండగా, గత ఏడాది (2016) 6లక్షల 22వేల154 హెక్టార్లలో మాత్రమే సాగైంది. అయితే వర్షాభావంతో వేరుశెనగ పంట నిలువునా ఎండిపోయింది. 2016 జూన్‌లో సాధారణ వర్షపాం 63.9 మిమీ కాగా, 94.5 మిమీ కురిసింది. జూలైలో 67.4 మిమీగాను, 102.8 మిమీ మేర అధిక వర్షపాతం నమోదైంది. ఆగస్టుకు వచ్చే సరికి వర్షపాతం దారుణంగా పడిపోయింది. ఆ నెలలో మొత్తం 88.7 మి.మీ కురవాల్సి ఉండగా, కేవలం 18.1 మి.మీ (అంటే 79.5 శాతం తక్కువ) మాత్రమే కురిసింది. సెప్టెంబర్‌లో సైతం 118.4 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉన్నా, అతి తక్కువగా 41.9 మి.మీ మాత్రమే కురిసింది. ఈ లెక్కన నైరుతి రుతుపవనాల ద్వారా 338.4 మి.మీ వర్షం కురవాల్సి ఉన్నా, 257.3 మి.మీ సాధారణ వర్ష పాతం నమోదైంది. 2015-16లో కూడా తక్కువగా 319.3 మి.మీ కురిసింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో సైతం అతి తక్కువగా వర్షం పడింది. డిసెంబర్‌లో 9.9 మి.మీగాను, 18.8 మి.మీ కురిసి అధిక వర్షపాతం నమోదైంది. అయితే తుపానుల ప్రభావం ఉన్నా ఆశించిన మేర వర్షం కురవక పోవడంతో రబీ పంటలు సైతం దెబ్బ తిన్నాయి. 2016-17కు మొత్తం సాధారణ వర్షపాతం 553 మి.మీగాను కేవలం 283 మి.మీ మాత్రమే నమోదైందని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2015-16లో 568.4 మి.మీ వర్షం కురవడం విశేషం. 2012-13 నుంచి 2014-15 వరకు 450 మి.మీలోపే వర్షపాతం నమోదైంది. దీంతో ఏటా రైతులతో వరుణ దేవుడు దోబూచులాడుతుండటం పరిపాటిగా మారింది. ఈక్రమంలో ఈ ఏడాది (2016-17)లో జిల్లాలోని లేపాక్షి మండలం సిరివరం గ్రామంలో 70.89 మీటర్ల మేర భూగర్భజలాలు అడుగంటాయి. ఈ పరిస్థితుల్లో వెయ్యి అడుగుల పైగా లోతుకు భూగర్భజలం వెళ్లిపోయింది. రబీ సీజన్‌లో సైతం ఆహార ధాన్యాలు, నూనె గింజల పంటలు, వాణిజ్య పంటలు సైతం బోర్లు, బావుల కింద సాగు చేసినా నీటి కొరత కారణంగా బాగా దెబ్బ తిన్నాయి. ఇక జాతీయ వ్యవసాయ బీమా పథకం కింద కంది పంటకు ఫసల్ బీమా యోజన పథకాన్ని గ్రామం యూనిట్‌గా అమలు చేస్తున్నారు. అయితే అత్యధికంగా ఖరీఫ్‌లో సాగయ్యే వేరుశనగ పంటను ఈ పథకం కింద చేర్చాలన్న డిమాండ్ నేరవేరకుండా పోయింది. ఇక పంటల బీమా పథక కింద 2016 ఖరీఫ్‌కు జిల్లాకు రూ.367 కోట్లు అందాల్సి ఉంది. జిల్లాలోని మొత్తం 4.94 లక్షల మంది రైతులు 44 కోట్లు పంటల బీమా కింద ప్రీమియం చెల్లించారు. ప్రభుత్వ వాటాగా రూ.208 కోట్లు బీమా కంపెనీకి చెల్లించడం జరిగింది. అయితే రాయలసీమలో అత్యధికంగా అనంతపురం జిల్లాకే రూ.367.08 కోట్లు చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లా మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రకటించారు. కానీ నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఆ నిధుల ఊసే లేదు. మండలాల వారీగా పంట నష్టంపై నివేదికలు అందక పోవడమే కారణమని తెలుస్తోంది. మరోవైపు వాతావరణ బీమా సొమ్ము కూడా రైతులకు అందాల్సి ఉంది.
తాండవిస్తున్న నిరుద్యోగం
జిల్లాలో అధికారిక గణాంకాల మేరకు దాదాపు 70 వేల మంది నిరుద్యోగులు ఉన్నారు. జిల్లాలో పరిశ్రమల ద్వారా దాదాపు 13వేల మందికి ఉపాధి కల్పించినట్లు ప్రభుత్వం చెబుతున్నా, విద్యావంతులైన నిరుద్యోగులు, నిరక్షరాస్యులు, వ్యవసాయ కూలీలు సైతం ఉపాధి, ఉద్యోగాల కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వసలు వెళ్తున్నారు. కదిరి, తాడిపత్రి, అనంతపురం తదితర ప్రాంతాల నుంచి పొట్ట కూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో వెళ్తూ నకిలీ ఏజెంట్లు, గల్ఫ్‌లో ఉపాధి ప్రదేశాల్లో పడరాని పాట్లు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ఇక్కడి వాస్తవ పరిస్థితుల్ని కేంద్ర బృందానికి ఏకరువు పెట్టక తప్పదుమరి.
నేడు కేంద్ర కరవు బృందం పర్యటన
* రేపు ఉదయం అనంతలో అర్జీల స్వీకరణ

అనంతపురం, జనవరి 22 : కేంద్ర కరవు బృందం నేడు జిల్లాలో పర్యటించనుంది. కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి జెకె.రాథోడ్ నేతృత్వంలో జిఆర్.జగార్, షివ్‌శ్యాంగ్‌మీనా, ఎం.రామకృష్ణతో కూడిన అధికారుల బృందం ఆదివారం అర్ధరాత్రి జిల్లాకు చేరుకున్నారు. చిలమత్తూరు మండల పరిధిలోని రక్షా అకాడమీలో రాత్రి బస చేసింది. నేటి ఉదయం 8.30 గంటలకు రక్షా అకాడమీ నుంచి బయలుదేరి ఉదయం 9 గంటలకు హిందూపురంలోని పట్టు పరిశోధన క్షేత్రం చేరుకుని క్షేత్ర స్థాయి పర్యటనను ప్రారంభిస్తుంది. అనంతరం 9-10 గంటల మధ్య జిల్లా కరవు పరిస్థితులపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో కేంద్ర బృందం అధికారులు పాల్గొంటారు. అనంతరం హిందూపురంలోని తాగునీటి సమస్యపై పరిశీలిస్తారు. అక్కడి నుంచి మణేసముద్రం, పరిగి మండలం గొల్లపల్లి, గోరంట్ల మండలం మందలపల్లి, బుక్కపట్నం చెరువు, కొత్తచెరువు, పెనుకొండ మండలం రాంపురం, గొర్రెల పెంపక కేంద్రం, కోనాపురం, తిమ్మాపురం గ్రామాలు, సికే పల్లిలో పర్యటించి కరువు పరిస్థితుల్ని కేంద్ర కరువు బృందం పరిశీస్తుంది. అక్కడి నుంచి నేటి రాత్రికి అనంతపురం ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో బస చేస్తారు. 24వ తేదీ ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు తదితరుల నుంచి అర్జీలను బృందంలోని అధికారులు స్వీకరిస్తారు. అనంతరం కర్నూలు జిల్లాకు బయలుదేరి వెళ్తారు.
పేదలకు వరి అన్నం
రుచి చూపిన ఎన్టీఆర్
* మంత్రి పల్లె, ఎంపిలు జెసి, నిమ్మల
నల్లమాడ, జనవరి 22: కేవలం కిలో రూ. 2లకే అందజేసి ప్రతి వ్యక్తికీ వరి అన్నం రుచి చూపిన ఆంధ్రుల అన్న నందమూరి తారక రామారావు అని మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎంపిలు జెసి దివాకర్‌రెడ్డి, నిమ్మల కిష్టప్ప అన్నారు. ఆదివారం నల్లమాడలోని తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు వారు హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలేసి విగ్రహావిష్కరణగావించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో వారు మాట్లాడుతూ దేశంలో దివంగత నేత ఇందిరమ్మ ప్రభంజనం కొనసాగుతున్న రోజుల్లో తెలుగువారి ఆత్మగౌరవం పేరిట తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 8 మాసాల్లోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తెలుగువాడి సత్తా చాటింది ఎన్టీఆర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఎక్కువ శాతం కేవలం ఒకే సామాజికవర్గం రాజకీయాల్లో రాణిస్తుండేదన్నారు. టీడీపి ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్ పుణ్యమాని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ రాజకీయ చైతన్యంతో రాణిస్తున్నారన్నారు. ఎన్టీఆర్ హయాంలోనే అనంతపురం జిల్లాలో 3 లక్షల 60 వేల హెక్టార్ల భూమికి నీళ్లిచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలన్న సంకల్పంతో ఆయన హంద్రీనీవాకు నాంది పలికారన్నారు. ఇప్పటికవరకు తెలుగుదేశం ప్రభుత్వం వున్న సమయాల్లో ఎక్కువమంది బీసీలే జిల్లా పరిషత్ ఛైర్మెన్‌లుగా వున్నారన్నారు. ఎన్టీఆర్ హయాంలో 14 శాఖలతో ఎస్ రాంచంద్రారెడ్డికి మంత్రి పదవినిచ్చి ఆయన జిల్లాకు ప్రాధాన్యతనిచ్చారన్నారు. తెలుగువారికి బతకడం నేర్చిన వ్యక్తి ఆ మహానుభావుడేనని ఆయన చూపిన దారిలోనే తాము ప్రయాణిస్తూ రాజకీయాల్లో రాణిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ విగ్రహం ప్రతి మండలంలో కూడా వుండటం ఒక దేవుడి విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నట్లన్నారు.
ఒక్క పంటకు నీరిచ్చినా కరవును పారదోలవచ్చు..
ఏడాదికి ఒక్క పంటకు సరిపడా జిల్లావాసులకు నీళ్లందచేసినా కూడా జిల్లాలో కరవును పారదోలవచ్చని జెసి దివాకర్‌రెడ్డి అన్నారు. అభివృద్ధి కేవలం ప్రభుత్వాలు చేపడితేనే జరుగవనీ అందుకు ప్రజల సహకారం కూడా వుండాలన్నారు. ఒక్క రూపాయి బియ్యాన్ని అందరూ వ్యతిరేకించి ఆ బియ్యాన్ని రూ.5లకు అందజేయాలని ముఖ్యమంత్రికి ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులందరూ లేఖలు రాసి రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు. బియ్యం కోసం అదనంగా కిలోకి రూ. 4లు అందజేసి నీటి సరఫరా కాలువలకు వినియోగించాలని ప్రభుత్వాన్ని కోరుదామన్నారు. ముఖ్యమంత్రి బుక్కపట్నం వచ్చినప్పుడు హామీ ఇచ్చారనీ, పుట్టపర్తి మునిగిపోకుండా జాగ్రత్తపడాలని మంత్రి పల్లె రఘునాథరెడ్డికి చెప్పారనీ అంటే బుక్కపట్నం చెరువును పూర్తిస్థాయిలో నీటితో నింపి రైతులను ఆదుకుంటామని చెప్పారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అనంతపురం జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలన్న ఆలోచన వుందని ఎవ్వరూ భయపడొద్దని మంచి రోజులు రాబోతున్నాయని ఎంపీ దివాకర్‌రెడ్డి వివరించారు. విగ్రహ దాత మసకవంకపలి రమణ చాలామంచి పనిచేశారని ఆయన్ను అభినందించి దుశ్శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మెన్ చమన్‌సాబ్, మైనార్టీ సెల్ రాష్ట్ర డైరెక్టర్ అల్లాబకష్, మాజీ డీసీయంఎస్ ఛైర్మెన్ కేశవరెడ్డి, జయంత్‌రెడ్డి, అగిశం ప్రతాప్, సలాంఖాన్, అన్నం లక్ష్మినారాయణ, చిన్నపరెడ్డి, మంజునాథరెడ్డి, పద్మనాభరెడ్డి, గడ్డం రమణారెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కరవు బృందం పర్యటనతో
రాష్ట్రానికి లాభం లేదు
* పిసిసి చీఫ్ రఘువీరా
మడకశిర, జనవరి 22 : రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులను పరిశీలించడానికి వస్తున్న కరవు బృందం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని పిసిసి అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. ఆదివారం మడకశిరలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరవు ఏర్పడి మూడు నెలలైందని, అయితే ప్రభుత్వం సకాలంలో నివేదికలు పంపకపోవడంతో కేంద్ర బృందం ఆలస్యంగా పర్యటిస్తోందన్నారు. పక్క రాష్ట్రం కర్నాటకలో నివేదికలను సకాలంలో పంపడంతో కరవు నివారణకు రూ.1,782 కోట్లు విడుదల మంజూరు కాగా కరవు నివారణ పనులు జరుగుతున్నాయన్నారు. టుంకూరు, బళ్లారి, చిత్రదుర్గం తదితర ప్రాంతాల్లో 60 ఉచిత పశు గ్రాస కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో కరవు బృందానికి రైతులు సాగు చేసిన పంటలు ఏమాత్రం కనిపించవన్నారు. అసలు ఇక్కడ రైతులు పంటలు సాగు చేశారా అన్న అనుమానం కరవు బృందానికి కలుగుతుందన్నారు. దీనివల్ల ఆశించిన స్థాయిలో నిధులు అందకపోవచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గత మూడేళ్లుగా రైతులకు బకాయిపడ్డ పంట నష్టపరిహారం, బీమా పరిహారం రూ.40 వేల కోట్లను జమ చేయాలన్నారు. అలాగే అన్ని గ్రామాల్లో ఉచిత పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, సబ్సిడీతో పశుదాణా అందించాలని, పాల ధరను లీటర్‌కు రూ.5 పెంచాలని, తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు విడుదల చేయాలని, వ్యవసాయ కూలీలు ఇతర ప్రాంతాలకు పనుల కోసం వెళ్లకుండా స్థానికంగానే పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో పశుగ్రాసం కొనుగోలు చేస్తామని చెప్పి రూ.70 కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. యంత్రాలతో ఉపాధి పనులను చేయడాన్ని పూర్తిగా నిలిపివేయాలన్నారు. వ్యవసాయాన్ని చిన్న చూపు చూస్తుండటంతో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారన్నారు. గతంలో కరవు నివారణ కోసం రూపొందించిన ప్రాజెక్టు అనంతను అమలు చేయాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కరవు పరిస్థితులపై ప్రత్యేక చొరవ తీసుకొని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, నాయకులు సొరంగాల నాగరాజు, మంజునాథ్, నాగేంద్ర, నరసింహమూర్తి, దొడ్డయ్య, డాక్టర్ రవిశంకర్, నాగభూషణం, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

పరుగుతో సంపూర్ణ ఆరోగ్యం
* మారథన్ రన్నర్ జువాన్ మానువెల్, ఆర్‌డిటి ప్రోగ్రాం డైరెక్టర్ మాంచూ ఫెర్రర్
అనంతపురం సిటీ, జనవరి 22: ప్రతి ఒక్కరు రన్నింగ్‌తోనే ఆరోగ్యంగా ఉంటారని మారథన్ రన్నర్ జువాన్ మానువెల్, ఆర్‌డిటి ప్రోగ్రాం డైరెక్టర్ మాంచూ ఫెర్రర్‌లు తెలిపారు. ఆదివారం అనంత క్రీడాగ్రామంలో ఆర్‌డిటి ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ రన్ ప్రారంభించారు. ఈ రన్‌కు ముఖ్య అతిథులుగా జువాన్ మానువెల్, మాంచూలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మానువెల్ మాట్లాడుతూ గత ఏడాది ఫిబ్రవరి నెలలో జిల్లాలో 140 కిలోమీటర్లు పరుగు సాధించానని తెలిపారు. జిల్లాలో అనేక సేవలు చేస్తున్న ఆర్‌డిటి సంస్థకు చేయూతనిస్తూ ప్రతి సంవత్సరం జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం మాంచూ మాట్లాడుతూ అథ్లెటిక్స్‌కు ఉత్సాహాన్ని అందించే ఉద్దేశ్యంతో అనంత క్రీడా గ్రామంలో రన్‌ను నిర్వహించామని తెలిపారు. వయోజనులు, యువజనులు, పిల్లలు ప్రతి ఒక్కరు రన్ చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో రన్నింగ్ టీమ్స్‌ను ఏర్పాటుచేసుకుని జిల్లాలో ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించాలన్నారు. అనంతరం ఆర్‌డిటి వ్యవస్థాపకులు విన్సంట్ ఫెర్రర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా క్రీడాకారులతో స్పెయిన్ అథ్లెటిక్స్ కలసి పరుగెత్తి నూతన ఉత్సాహాన్ని తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిటి ఛైర్మన్ తిప్పేస్వామి, మాంచూ ఫెర్రర్ సతీమణి విశాల ఫెర్రర్, డైరెక్టర్లు జేవియార్, దశరథ్, నిర్మల్‌కుమార్, వలంటీర్లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

బుక్కపట్నం చెరువుకు నీరివ్వలేకపోతే
పోటీ చేయను
* మంత్రి పల్లె రఘునాథరెడ్డి
కొత్తచెరువు, జనవరి 22: హంద్రీనీవా కాలువ ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు నీరివ్వని పక్షంలో ఎన్నికల్లోనే పోటీ చేయనని రాష్ట్ర సమాచార, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. కొత్తచెరువులో మాజీ మంత్రి జెసి.దివాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు కొండసాని సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన రైతు సమావేశంలో మంత్రి పల్లె, మాజీ మంత్రి జెసి.దివాకర్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఆయన మాట్లాడుతూ రాజకీయాలు ముఖ్యం కాదని, ఎన్నుకున్న ప్రజలే ముఖ్యమని, ప్రజల ఆకాంక్ష నెరవేర్చలేనపుడు పదవుల అవసరం వుండదన్నారు. హంద్రీనీవా పథకం ద్వారా బుక్కపట్నం చెరువుకు నీరందించే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రజల కరతాళ ధ్వనుల మధ్య పేర్కొన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుక్కపట్నంకు వచ్చినపుడు చెరువు అభివృద్ధికి నిధులు విడుదల చేశారని, చెరువుకు నీరిస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. హంద్రీనీవా పథకం ద్వారా దాదాపు 400 చెరువులు నింపడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేస్తున్నానని, ఇంతకంటే ఇంకేమి కావాలని మాట్లాడారు. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. మాజీ మంత్రి, ఎంపి జెసి.దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పేరును చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా రాయలసీమకు తాగు, సాగునీరు అందించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారని కొనియాడారు. బుక్కపట్నం చెరువుకు నీరు వస్తే జిఓ వెంటనే వస్తుందని, ఎన్నికల్లోపు జిల్లాలోని చెరువులన్నీ నింపడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గతంలో ఏ ఒక్కరూ చేయని విధంగా సాగునీటి ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెసి ముఖ్య అనుచరుడు కొండసాని సురేష్‌రెడ్డి, అంగడి సత్తి, నిషార్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

ఆదర్శప్రాయుడు యోగి వేమన
* విగ్రహావిష్కరణలో కర్నాటక డిప్యూటీ స్పీకర్ శివశంకర్‌రెడ్డి
పరిగి, జనవరి 22 : తన పద్యాలతో ప్రజలను చైతన్యం చేసిన వేమారెడ్డి నేటితరానికి ఆదర్శప్రాయుడని కర్నాటక డిప్యూటీ స్పీకర్ శివశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన్ను ఆదర్శంగా తీ సుకుని రెడ్డి కులస్థులు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రమైన పరిగి సా యినగర్ కాలనీలో నూతనంగా ఏర్పా టు చేసిన యోగి వేమన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివశంకర్‌రెడ్డి మాట్లాడుతూ, రెడ్డి కులస్థు లు అన్ని వర్గాలను అక్కున చేర్చుకునేందుకు తమవంతు సహకారం అం దించాలన్నారు. ముఖ్యంగా పేదరికం లో ఉన్న విద్యావంతులకు తగిన సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపోతే ఇటీవల కాలంగా యోగి వేమన పద్యాలకు ఒకింత కనుమరుగవుతున్నాయని, వాటిని మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ప్రభుత్వాలు కృషి చేయాల్సి ఉందన్నారు. రెడ్డి కులస్థులు వేమనను స్ఫూర్తిగా తీసుకొని సమస్యల పరిష్కారానికి ముందుకెళ్లాలన్నారు. ఈ నెల 29వ తేదీన కర్నాటకలో అఖిల భారత రెడ్డి సమాఖ్య మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒలింపిక్స్ రాష్ట్ర అధ్యక్షులు జెసి పవన్‌కుమారెడ్డి మాట్లాడుతూ రెడ్డి అంటే గతం నుంచి అన్నం పెట్టే వ్యక్తిగానే గుర్తుకు వచ్చేదని, అయితే ప్రస్తుతం రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని పేద విద్యార్థులకు వసతి గృహాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పేద విద్యార్థులు ఎంబిఏ వరకూ చదువుకునేందుకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. రెడ్డి విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలన్నారు. ఇందులో భాగంగా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాలకు కొటిపి హనుమంతరెడ్డి రూ.2 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు అంకాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథ్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, వైటి ప్రభాకర్‌రెడ్డి, అశ్వర్థనారాయణరెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ తోపుదుర్తి కవిత, సీనియర్ న్యాయవాది మెళవాయి గోవిందరెడ్డి, సంక్షేమ సంఘం నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, ఆనందరంగారెడ్డి, రవిశేఖర్‌రెడ్డి, చౌళూరు రామకృష్ణారెడ్డి, కృపాకర్‌రెడ్డి, గంగులకుంట నరేష్‌రెడ్డి, గోవిందరెడ్డి, రమేష్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, సత్యనారాయణరెడ్డి, మల్లికార్జునరెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, మారుతీరెడ్డి,అంజనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పరిటాల రవి వర్ధంతికి తరలిరండి
* మంత్రి పరిటాల సునీత
రామగిరి, జనవరి 22: మాజీ మంత్రి, దివంగత పరిటాల రవీంద్ర 12వ వర్ధంతికి దేశం శ్రేణులు, పరిటాల అభిమానులు తరలిరావాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పిలుపునిచ్చారు. ఆదివారం వెంకటాపురం గ్రామంలో విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పరిటాల రవీంద్ర వర్ధంతికి రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నట్లు ఆమె తెలిపారు. పరిటాల రవి వ్యక్తి కాదని, ఆయన సామూహిక శక్తి అని, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నారు. ముఠా కక్షలను అంతం చేసి అనేక గ్రామాల్లో ప్రశాంతత నెలకొల్పిన మహోన్నత వ్యక్తి పరిటాల రవి అన్నారు. అంతేకాక బలహీన వర్గాలకు అభివృద్ధే ధ్యేయంగా సమాజంలో వారికి గుర్తింపునిస్తూ వారి అభివృద్ధికి పాటుపడ్డారన్నారు. రవికి జిల్లాలోనే కాకుండా రాష్ట్రం నలుమూలల ఆదరాభిమానాలు వున్నాయంటే ఆయన చేసిన పనుల వల్లే అభిమానుల గుండెల్లో గూడుకట్టుకున్నారన్నారు. రవికి జిల్లాను నీరు తీసుకొచ్చి జిల్లాను పైరుపచ్చలతో సస్యశ్యామలంగా చూడాలన్న ఆయన కోరిక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత తీర్చారన్నారు. అనునిత్యం కక్షలు, కార్పణ్యాలతో వున్న జిల్లాను ఫ్యాక్షన్ కోరల నుండి తప్పించి ప్రశాంతత నెలకొల్పేందుకు అనునిత్యం కృషి చేశాడన్నారు. పరిటాల రవి తనయుడు శ్రీరామ్ తండ్రి వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సాంస్కృతిక కార్యక్రమాలు వుంటాయని తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చిగిచెర్ల ఓబిరెడ్డి, రేగాటిపల్లి మధుసూదన్‌రెడ్డి, కళ్యాణదుర్గం తిప్పేస్వామి, జెడ్‌పిటిసి రామ్మోహన్‌చౌదరి, మాజీ జెడ్‌పిటిసి రామ్మూర్తినాయుడు, టిడిపి సీనియర్ నాయకులు ఎల్.నారాయణచౌదరి, ఎంపిపి బడగొర్ల ఆంజనేయులు, మాజీ ఎంపిపి రంగయ్య, నెట్టెం వెంకటేశులు, మండల టిడిపి కన్వీనర్ పరంధామయాదవ్ పాల్గొన్నారు.
విదేశీ పర్యటనలతో సాధించిన నిధులపై
శే్వతపత్రం విడుదల చేయాలి
* పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి
మడకశిర, జనవరి 22 : ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనల ద్వారా రాష్ట్రానికి సాధించిన నిధులు, పెట్టుబడులపై వెంటనే శే్వతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మడకశిరలో విలేఖరులతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పోటాపోటీగా విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన వల్ల రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు రాలేదన్నారు. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చానన్న చంద్రబాబు చేసిన ప్రకటనలో కనీసం రూ.4 కోట్ల తీసుకొచ్చిన దాఖలాలు లేవన్నారు. విదేశీ పర్యటనలు చేస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారన్నారు. విశాఖపట్నంలో పారిశ్రామిక వేత్తలతో పెట్టుబడులు తెచ్చానని సదస్సులు నిర్వహించి మాటలకే పరిమితం చేసి సదస్సు పేరిట లక్షలాది రూపాయలు దర్వినియోగం చేశారన్నారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనల వల్ల రాష్ట్భ్రావృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కాదన్నారు.
మృతులకు రూ.20 లక్షల పరిహారం అందించాలి
విజయనగరం వద్ద జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల పరిహారం అందించి ఆదుకోవాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. రైలు ప్రమాద ఘటన పట్ల రఘువీరా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందించడంతోపాటు గాయపడ్డ బాధితులకు సరైన వైద్య సౌకర్యం కల్పించి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. ప్రమాద సంఘటనపై సమగ్ర విచారణ జరిపించి కారకులపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి కాంగ్రెస్ నాయకులు క్షతగాత్రులకు సహకారం అందించినట్లు తెలిపారు.
రైల్వేస్టేషన్ల సంఖ్య పెరిగినా అవే బోగీలు..
* కిక్కిరిసిపోతున్న తిరుపతి రైలు..
* ఇబ్బందుల్లో ప్రయాణికులు
గుంతకల్లు, జనవరి 22 : గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని గుంతకల్లు - తిరుపతి ప్యాసింజర్ రైలుకు స్టేషన్లు పెంచినా అదనంగా బోగీలను ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి ప్రతి నిత్యం వేలసంఖ్యలో ప్రయాణికులు వివిధ ప్రాంతాల వెళ్తుంటారు. అదేవిధంగా ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులు, పోటీ పరీక్షలకు వెళ్లే అభ్యర్థులు, విధి నిర్వహణకు నిరంతరం వెళ్లి వస్తూ ఉంటారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి, విద్యార్థులకు అనుకూలంగా ఉండటం, సాయంకాలం బయలుదేరి ఉదయం తిరుమల చేరుకుంటుండటంతో ఈ రైలు అందరికీ సౌకర్యంగా ఉంటుంది. అయితే గతేడాది డిసెంబర్ 31వ తేదీ నుంచి గుంతకల్లు-తిరుపతికి వెళ్లే ప్యాసింజర్ రైలును కళ్యాణదుర్గం నుంచి ప్రారంభించారు. ప్రస్తుతం కల్యాణదుర్గంలో మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి, గుంతకల్లుకు సాయంకాలం 6 గంటలకు చేరుకుంటుంది. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రయాణికులతో గుంతకల్లు చేరుకునే సమయానికి రైలు కిటకిటలాడుతుంటుంది. గుంతకల్లు నుంచి వెళ్లాల్సిన ప్రయాణిలకు సీట్లు దొరకని పరిస్థితి. ప్యాసింజర్ రైలును అదనపు స్టేషన్‌లకు మళ్లించి సమంజసమే కానీ, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కోచ్‌లు ఏర్పాటు చేయకపోవడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న కేవలం 16 కోచ్‌లతోనే కొనసాగించడం వల్ల చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించి గుంతకల్లు నుంచి మరో రెండు అదనంగా కోచ్‌లను ఏర్పాటు చేసి ప్రయాణికులు కోరుతున్నారు.

మహిళల ఆత్మహత్యలను ఆపలేని ప్రభుత్వం
అనంతపురం అర్బన్, జనవరి 22: రాష్ట్రంలో మహిళలు, యువతుల ఆత్మహత్యలను కట్టడి చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సావిత్రమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఐద్వా ఆధ్వర్యంలో అమ్మాయిలను కాపాడలేరా అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. సమావేశానికి వైఎస్‌ఆర్ పార్టీ నగర కమిటీ అధ్యక్షురాలు శ్రీదేవి, లోక్‌సత్తా నాయకురాలు సరస్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సావిత్రమ్మ మాట్లాడుతూ అధికారంలో వున్న తెలుగుదేశం ప్రభుత్వం మహిళలపై జరుగుత్ను లైంగిక నేరాలు, ఆత్మహత్యలు, హత్యలు, వేధింపులను ఆపడంలో పూర్తిగా వైఫల్యం చెందినట్లు ఆమె తెలిపారు. గత వారం రోజుల వ్యవధిలోనే అనంతపురం జిల్లాలో తాడిపత్రి ప్రాంతానికి చెందిన జాహ్నవిరెడ్డి అనే వివాహితను వరకట్న వేధింపులకు గురిచేసి ఆత్మహత్యకు కారణమైన సంఘటన, కూడేరు మండలంలో సైతం ఇలాంటి సంఘటనతో వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవటం జరిగిందన్నారు. ఈ కేసుల్లో జాహ్నవి కేసు ఎస్‌పితోపాటు మహిళా పోలీస్ స్టేషన్, రాజకీయ నాయకులును కలిసినా ఆ అమ్మాయికి న్యాయం జరగలేదన్నారు. త్వరలోనే మహిళలకు రక్షణ కల్పించాలంటూ ఎస్‌పిని కలవబోతున్నట్లు ఆమె తెలిపారు.సమావేశంలో పలువురు మహిళా నాయకులు ఐద్వా చంద్రిక, సావిత్రమ్మ, శోభ, నాగలక్ష్మి పాల్గొన్నారు.
శ్రీ వేద గాయత్రీ విగ్రహం ఊరేగింపు
అనంతపురం అర్బన్, జనవరి 22: తపోవనంలోని శ్రీ వేద గాయత్రీ దేవాలయంలో జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1న శ్రీ మహాలక్ష్మి, మహా సరస్వతీ, శ్రీ చక్ర- త్రిమతాచార్య, నవగ్రహ సహిత పంచాయతన వేదగాయత్రీ ప్రతిష్ఠ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు సూర్యనారాయణశాస్ర్తీ, కార్యదర్శి రామగోపాల్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం తపోవనం, సోమనాథ్‌నగర్, ప్రశాంతి నగర్‌లో విగ్రహాలను ఊరేగించారు. షిరిడీ సాయిబాబా దేవాలయం నిర్వాహకులు శ్రీరాములు ఆధ్వర్యంలో భజన భక్త మండలి సభ్యులు పాల్గొన్నారు. చిన్నారుల కోలాటాలతో ఊరేగింపు కలశాలతో మహిళలు విగ్రహాలు ముందు నడిచారు.
ప్రభుత్వ అర్ధనగ్న దిష్టిబొమ్మ దహనం
అనంతపురం సిటీ, జనవరి 22: ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని ప్రొద్దుటూరు దీక్ష చేస్తున్న ప్రవీణకుమార్‌రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా ఆదివారం ఆర్ట్స్ కళాశాల ముందు రాయలసీమ విమోచన సమితి, విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ప్రభుత్వం అర్ధనగ్న దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ విమోచన సమితి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ స్టీవ్ సాధన సమితి అధ్యక్షుడు ప్రొద్దుటూరులో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుచేయాలని చేస్తున్న దీక్షను భగ్నం చేసి అక్రమంగా అరెస్టు చేయడం చాలా దారుణమన్నారు. అక్రమ అరెస్టులు చేసి ఉద్యమకారులను అణిచివేతకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వ ధోరణి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి సమాఖ్య నాయకులు కృష్ణ, తిప్పేరెడ్డి నాగార్జునరెడ్డి, రాధాకృష్ణారావు, అశోక్ వర్థన్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనంతపురం అర్బన్, జనవరి 22: విష్ణు సహస్ర నామ సత్సంగం 11వ వార్షికోత్సవం పురస్కరించుకొని రైల్వే స్టేషన్ రోడ్డులో కొలువైన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం వెంకటేశ్వర కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉయం స్వామివారికి విష్ణు సహస్తన్రామ పారాయణం, సదర్శన హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీ పాద వేణు మాట్లాడుతూ ఫిబ్రవరి 7న భీష్మ ఏకాదశి సందర్భంగా తొమ్మిదోసారి నూరు రోజులపాటు కోటి విష్ణు సహస్త్ర పారాయణం ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన తెలిపారు.