అనంతపురం

అనంతను ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, జనవరి 23:అనంతపురం జిల్లాలో తీవ్రమైన కరవు పరిస్థితుల వల్ల ప్రజలు అనేక కష్టనష్టాలకు గురవుతున్నారని కేంద్ర కరవు అధ్యయన బృందానికి కలెక్టర్ కోన శశిధర్ తెలియచేశారు. జిల్లా కరవు పరిస్థితులపై అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని కిరికెర పట్టు పరిశోధనా కేంద్రంలో ప్రత్యేకంగా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా కళ్ళకు కట్టినట్లు వివరించారు. జెక్ రాథోడ్ నేతృత్వంలో జిఆర్ జగర్, షివ్ శ్యాంగ్‌మీనా, రామక్రిష్ణలతో కూడిన కేంద్ర కరవు అధ్యయన బృందం సోమవారం పర్యటించింది. తొలుత వివిధ శాఖలకు చెందిన జిల్లా, డివిజన్ స్థాయి అధికారులతో కరవు పరిస్థితులపై సమీక్షించింది. వేరుశెనగ, కంది, పండ్లు, ఉద్యానవన తోటలు, పట్టు పరిశ్రమ, తాగునీటి సమస్య వంటి పరిస్థితులపై కేంద్ర కరవు బృందం అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోన శశిధర్ మీడియాకు ఆ వివరాలను వెల్లడించారు. 2016 ఖరీఫ్‌లో ఎంత పంట నష్టం జరిగింది, రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రత్యామ్నాయ చర్యలు ఏవేవి తీసుకున్నారు అన్న అంశాలపై సమీక్షించినట్లు తెలిపారు. వంద స్లైడ్‌ల ద్వారా జిల్లా కరవు పరిస్థితులను వివరించామన్నారు. తక్షణ కరవు సహాయం కింద రూ.2,160 కోట్లు అవసరమని కేంద్ర బృందానికి నివేదిక అందచేసినట్లు తెలిపారు. ఖరీఫ్, రబీ సీజన్‌లలో వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు సాగు చేసి పంటలకు గాను రూ.1952 కోట్లు, కరవు నివారణ చర్యల కింద రూ.208 కోట్లు తక్షణమే కేటాయించాల్సిన అవసరం ఉన్నట్లు వివరించారు. అయితే ఖరీఫ్ సీజన్ వరకు మాత్రమే జరిగిన పంట నష్టంపై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం నివేదికలు కోరినట్లు కేంద్ర బృందం స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా తాము అధ్యయనం చేసి నివేదికలను సమర్పించడం జరుగుతుందని రాథోడ్ పేర్కొన్నారు. కాగా దాదాపు ప్రతియేటా పంట నష్టం జరుగుతున్నందున జిల్లా నుండి వేలాది కుటుంబాలు ఇతర ప్రాంతాలకు పొట్టకూటి కోసం వలసలు వెళుతున్నాయని కరవు అధ్యయన బృందానికి కలెక్టర్ తెలిపారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా 1000 అడుగుల మేరకు బోర్లు తవ్వినా నీరు లభ్యం కాని పరిస్థితులు ఉన్నాయని వివరించారు. ఖరీఫ్ వరకే పరిమితం కాకుండా రబీ సీజన్‌లో కూడా జరిగిన పంట నష్టాన్ని పరిగణనలోకి తీసుకొని కరవు కరాటాలతో సతమతమవుతున్న అనంతపురం జిల్లాను ఆదుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ శశిధర్ కోరారు. ఇకపోతే పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా, క్షేత్రస్థాయిలో పరిస్థితులను చూసిన కేంద్ర బృందం అవసరమైన నిధులను విడుదల చేసే విధంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు అందచేస్తామని సానుకూలంగా స్పందించినట్లు కలెక్టర్ చెప్పారు.

నేడు పరిటాల రవీంద్ర వర్ధంతి
రామగిరి, జనవరి 23: మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వర్ధంతి ఆయన స్వగ్రామం వెంకటాపురంలో నిర్వహించేందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్‌లు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం వర్ధంతి ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం నుంచే ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ మంత్రి బిజీగా వున్నారు. వచ్చే అభిమానుల కోసం ఎలాంటి అసౌకర్యం కలుగకుండా వుండేలా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటుచేశారు. ప్రధానంగా భోజనశాల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేయించారు. మంత్రి భోజనశాల వద్దకు వెళ్ళి భోజనాలు చేసేందుకు సిద్ధంగా వున్న కూరగాయలను, ఆకుకూరలను పరిశీలించారు. నాణ్యతగా, శుభ్రంగా చేయాలని సూచించారు. ప్రత్యేకంగా లడ్డూను కూడా తెప్పించారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేకంగా వేదికను తయారుచేశారు. పరిటాల ఘాట్‌కు నివాళులు అర్పించేందుకు మంత్రులు కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, మృణాళిని, పల్లె రఘునాథరెడ్డితోపాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు రానున్నారు. అభిమానులు తెచ్చిన క్యాలెండర్లను మంత్రి సునీత, ఆమె తనయుడు శ్రీరామ్‌లు ఆవిష్కరించారు. పరిటాల వర్ధంతి సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించేందుకు పలు రకాల పూలను బెంగళూరు నుండి తెప్పించారు. ప్రతి ఏడాది కూడా ఘాట్‌ను పూలతో ప్రత్యేక అలంకరణగావిస్తారు. దాదాపు 50వేలమంది పరిటాల వర్ధంతికి రావచ్చునని అంచనాతో వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా వుండేలా భోజన సదుపాయంతోపాటు తాగునీటి ఏర్పాట్లు పరిటాల తనయుడు శ్రీరామ్ దగ్గరుండి పర్యవేక్షించారు.
భారీగా పోలీసు బందోబస్తు...
పరిటాల వర్ధంతి సందర్భంగా మంత్రులు కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, మృణాళిని, పల్లె రఘునాథరెడ్డి, చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్‌పి చైర్మన్‌తోపాటు వేల సంఖ్యలో పార్టీ నాయకులు, పరిటాల అభిమానులు తరలిరానుండడంతో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకించి ముగ్గురు డిఎస్‌పిలు, నలుగురు సిఐలు, 16మంది ఎస్‌ఐలు, 27మంది ఏఎస్‌ఐలు, 168మంది పిసిలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామ కూడలిలోను పోలీసులను మో
కరవు‚తాండవిస్తోంది

అనంతపురం, జనవరి 23: ‘జిల్లాలో కరవు తాండవిస్తోంది.. రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు, యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సమస్య, సాగునీటి ఇబ్బందులు ఉన్నాయి. పంటలు బాగా దెబ్బతిన్నాయి. జిల్లా కరవు పరిస్థితులు మమ్మల్ని కలిచి వేశాయి. ఇక్కడి పరిస్థితుల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం’ అని కేంద్ర కరవు బృందం (ఇంటర్ మినిస్టీరియల్ టీమ్) అధికారులు అన్నారు. విద్యుత్ శాఖ డైరెక్టర్ జెకె.రాథోడ్ నాయకత్వంలో సభ్యులుగా గ్రామీణాభివృద్ధి శాఖ అండర్ సెక్రటరీ రామకృష్ణ, తాగునీటి విభాగం సీనియర్ సలహాదారు జె ఆర్.జర్గర్‌లతో కూడిన త్రిసభ్య బృందం సోమవారం జిల్లాలో పర్యటించింది. హిందూపురం, పరిగి, గోరంట్ల, బుక్కపట్నం, కొత్తచెరువు, పెనుకొండ, చెనే్నకొత్తపల్లి మండలాల్లోని పలు గ్రామాలను ఈ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా తాగునీటి సమస్య, నీటి రవాణా, వేరుశెనగ, కంది, మల్బరీ పంటల ఎండిపోవడం, బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడం తదితర సమస్యలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో హిందూపురంలో జిల్లా కరవుపై ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోన శశిధర్ కరవు బృందం అధికారులతో మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో కరవు పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయన్నారు. అనంతరం క్షేత్ర స్థాయి పర్యటన చేసిన బృందం సభ్యులు దుర్భిక్ష పరిస్థితుల్ని చూసి చలించి పోయారు. రైతులు, గ్రామీణులు, వ్యవసాయ కూలీలు బృందం అధికారులకు తమ పరిస్థితిని వివరించారు. గోరంట్ల మండలం మందలపల్లిలో రైతులతో కరవు బృందం అధికారులు ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా కరవు కోరల్లో చిక్కి శల్యమవుతున్నామని, ప్రతి ఏటా పంటలు ఎండిపోతుండటంతో అప్పుల పాలవుతున్నామని, తీసుకున్న రుణాలు చెల్లించలేక, వడ్డీలు కట్టలేక, కొత్త అప్పులు చేస్తూ దుర్భర జీవితాన్ని వెల్లదీస్తున్నామని రైతులు వాపోయారు. గోరంట్ల మండలం మందలపల్లిలో రైతులో కేంద్ర కరవు బృందం ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా రైతులు తమ గోడు వినిపించారు. తరాలుగా వేరుశెనగ పంట సాగు చేస్తున్నామని, వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో పంట ఎండిపోయి తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీని చెల్లించాలని, వాతావరణ బీమా సొమ్ము కూడా ఇచ్చి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. అలాగే సాగునీరు లేక అవస్థలు పడుతున్నామన్నారు. హంద్రీ నీవా ప్రాజెక్టును త్వరిత గతిన పూర్తి చేసి సాగు నీటిని సరఫరా చేస్తే గానీ తమ కష్టాలు గట్టేక్కేలా లేవని, హంద్రీ నీవాద్వారా పంట పొలాలు సస్యశ్యామలమవుతాయని హిందూపురం, పరిగి, బుక్కపట్నం, కొత్త చెరువు, చెనే్నకొత్తపల్లి ప్రాంత రైతులు అన్నారు.
* సాగునీటి ప్రాజెక్టుల కేంద్రం సహకరించాలి
* హిందూపురం ఎంపి నిమ్మల కిష్టప్ప
జిల్లా దశాబ్దాలుగా కరవు పీడిత ప్రాంతంగా ఉంది. పార్లమెంటులో ప్రతి సమావేశంలోనూ జిల్లా దుర్భిక్షంపై ప్రస్తావిస్తూనే ఉన్నాం. కేంద్ర కరువు బృందాలు వస్తూనే ఉన్నాయి. నివేదికలు కేంద్రానికి సమర్పిస్తూనే ఉన్నాయి. అంతటితో సరిపెట్టక కేంద్రం జిల్లాను ఆదుకోవాలి. జిల్లాలో కరువు నేపథ్యంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక దృష్టి పెట్టాలి. రాష్ట్రంలో నదుల అనుసంధానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారు. జిల్లాలో హంద్రీ నీవాతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి సహకరించాలి. జిల్లా కరవును కేంద్రమే డిక్లేర్ చేసింది. కనుక నిపుణులు క్షుణ్ణంగా అధ్యయం చేసి ఇక్కడి పరిస్థితులు అర్థం చేసుకోవాలి. కేంద్రం నుంచి న్యాయం జరిగేలా చూడాలి.
పది మందికి అన్నం పెట్టాం.. కరవుతో దిన కూలీలయ్యాం..
* నాగప్ప, రైతు, గొల్లపల్లి, పరిగి మండలం
నాకు రెండెకరాల పొలం ఉంది. మా కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం. పంటల సాగు కోసం నాలుగు బోర్లు వేశాను. రూ.లక్షలు అప్పులయ్యాయి. కానీ బోర్లలో నీటి బొట్టు కూడా పడలేదు. డబ్బు మట్టిలో పోసినట్లయింది. అప్పులు మిగిలాయి. జీవనం దుర్భరంగా మారింది. పది మందికి అన్నం పెట్టిన చేతులు మావి. ఇపుడు పట్టెడన్నం కోసం దిన కూలీలుగా మారాం. ఉపాధి కోసం వలసలు వెళ్లక తప్పడం లేదు. ఇప్పటికే అప్పులతో రైతులు చచ్చిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాలి. లేకుంటే వలసలు, చావులే శరణ్యం.
ఢిల్లీ పెద్దలు రైతులపై జాలి చూపాలి
* రంగప్ప, రైతు, గొల్లపల్లి
తరాలుగా కరవుతో అల్లాడుతున్నాం. పంటలు ఎండిపోయి అవస్థలు పడుతున్నాం. రైతుల్ని ఆదుకోవడానికి శాశ్వత పరిష్కారం చూపాలి. కేంద్ర ప్రభుత్వం మాపై దయ చూపాలి. హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేసి, శాశ్వతంగా సాగు నీరు అందించాలి. పంటల బీమా సకాలంలో అందించాలి. అకాలపు వర్షాలకు నష్ట పరిహారం ఇవ్వాలి.
నేడు అర్జీల స్వీకరణ
కేంద్ర కరవు బృందం నేటి ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నుంచి నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో జిల్లా కరువు పరిస్థితులపై అర్జీలు స్వీకరించనుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ కోరారు. అనంతరం ఈ బృందం కర్నూలు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళుతుంది.
కరవు బారి నుండి ఆదుకోండి
పెనుకొండ, జనవరి 23:కరవు కోరల్లో నలిగి పోతున్న తమను ఆదుకోవాలని పెనుకొండ మండలంలోని రైతులు, పలు రాజకీయ పార్టీల నాయకులు సోమవారం ఇక్కడ పర్యటించిన కేంద్ర కరవు బృందాన్ని కోరారు. మండల పరిధిలోని కోనాపురం, తిమ్మాపురం, రాంపురం, షీఫ్‌ఫారంలలో కేంద్ర కరవు అధ్యయన బృందం అధికారులు రాథోడ్, జగార్, రామక్రిష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు హంద్రీనీవా నీటిని చెరువులకు మళ్లించాలని, ఉపాధి హామీ పనులను 200 రోజులకు పెంచాలని, ఉపాధి హామీ పనిని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని, తాగునీటి ఎద్దడి తీర్చాలని, పశుగ్రాసం ఉచితంగా పంపిణీ చేయాలని, ఉద్యానవన, సెరికల్చర్, వ్యవసాయ రంగాలను పంట నష్టపరిహారం అందించాలని కోరారు. అదే విధంగా వేరుశెనగ పంట నష్టపోయిన రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలన్నారు. టిడిపి నాయకులు, జడ్పీటీసీ నారాయణస్వామి, ఎంపిపి యశోద, శ్రీరామ్‌యాదవ్, శ్రీనివాసులు, బిజెపి నాయకులు రామక్రిష్ణ, రామాంజినేయులు, వైకాపా నాయకులు భాస్కర్‌రెడ్డి, సుధాకర్, రామ్మోహన్‌రెడ్డి తదితరులు కరవు బారి నుండి రక్షించాలని వినతిపత్రాలు అందచేశారు. కరవు బృందం షీఫ్‌ఫారంలో పంపిణికి సిద్ధంగా ఉంచిన పశుదాణా, గ్రాసాన్ని పరిశీలించారు. గతంలో నిర్వహించిన పశుగ్రాస కేంద్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోనాపురంలో 15 ఏళ్లుగా ఉంటున్న మామిడి తోట ఎండిపోయిన దృశ్యాలను పరిశీలించారు. రాంపురంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను పరిశీలించి రైతులు, కూలీలతో సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. బృందం వెంట జెసి లక్ష్మీకాంతం, ట్రైనీ కలెక్టర్ వినోద్‌కుమార్, సెరికల్చర్ జెడి అరుణకుమారి, వ్యవసాయ శాఖ జెడి శ్రీరామ్మూర్తి, పశుసంవర్ధక శాఖ జెడి రవీంద్రనాథ్‌ఠాగూర్, ఉద్యానవన శాఖ డిడి సుబ్బరాయుడు, ఆర్డీఓ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో రక్తం దొరుకుతుంది..
నీరు దొరకదు...
* కేంద్ర కరవు బృందానికి విపులంగా వివరించిన మంత్రి పల్లె
కొత్తచెరువు, జనవరి 23: జిల్లాలో రక్తం కావాల్సినంత దొరుకుతుంది కానీ నీరు దొరకడం కష్టంగా వుందని రాష్ట్ర సమాచార, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కేంద్ర కరవు బృందానికి కళ్లకు కట్టినట్లు వివరించారు. కరవు పరిస్థితులను అధ్యయనం చేయడానికిగాను కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సీనియర్ అధికారి జెకె.రాథోడ్ ఆధ్వర్యంలో ముగ్గురు కరవు బృంద సభ్యులు సోమవారం మండలంలోని పలు ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కేంద్ర కరవు బృందం మొదట బుక్కపట్నం చెరువులోకి వెళ్లి వాస్తవ పరిస్థితిని రైతులతో ముఖాముఖిగా తెలుసుకున్నారు. ఆ తర్వాత చెరువుకట్ట దగ్గర కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుండగా మంత్రి పల్లె రఘునాథరెడ్డి విచ్చేసి జిల్లా పరిస్థితులను విపులంగా వివరించారు. గత 19 సంవత్సరాల్లో 16 సంవత్సరాలు జిల్లాలో కరవు నెలకొందని, దేశంలో అతి తక్కువ వర్షపాతం పడే రెండో జిల్లా అనంతపురం అని వారికి వివరించారు. బుక్కపట్నం చెరువులోని రైతులతో కేంద్ర బృందం సభ్యులు ముఖాముఖిగా విపులంగా చర్చించారు. జిల్లా రైతు సంఘం నాయకులు జంగాలపల్లి పెద్దన్న ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, మండల సిపిఎం కార్యదర్శి వీరనారాయణప్ప, డివిజన్ కార్యదర్శి గౌస్‌లాజమ్ తదితరులు కేంద్ర బృంద సభ్యులను కలిసి జిల్లాలో పరిస్థితులను వివరించారు. అలాగే కాంగ్రెస్ మండల కన్వీనర్ మనేరు ప్రసాద్, ఓబులేసు, రామాంజనేయులు తదితరులు కలిసి వినతిపత్రం సమర్పించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. వీటన్నింటిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ లక్ష్మికాంతం, బుక్కపట్నం చెరువు సాగునీటి సంఘం చైర్మన్ శంకర్‌నారాయణ, దేశం నేతలు విజయభాస్కర్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
నిత్యం నీటి కష్టాలే..!

హిందూపురం టౌన్, జనవరి 23:శాశ్వత నీటి వనరులు లేని హిందూపురం పట్టణంలో నిత్యం నీటి కోసం కష్టాలు పడుతున్నామని, నీటి కోసం రేయింబవళ్లు వేచి ఉండాల్సిన వస్తోందన్నారు. కొళాయిల్లో సక్రమంగా నీరు రాకపోతే, బిందె నీటిని రూ.4 దాకా వెచ్చించి కొనుగోలు చేస్తున్నామన్నామని కేంద్ర కరవు అధ్యయన బృందం ఎదుట మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లాలో కరవు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కేంద్ర కరవు బృందం ఉన్నతాధికారులు రాథోడ్, శ్యాంసాంగ్‌మీనా, రామక్రిష్ణ విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక రహమత్‌పురంలో పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యపై ఉన్నతాధికారులు మహిళలతో అడిగి తెలుసుకున్నారు. తొలుత కలెక్టర్ కోన శశిధర్, జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంత్‌లు హిందూపురం పట్టణ జనాభా, నీటి వనరులు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా తదితర అంశాలపై వివరించారు. పిఏబిఆర్ నుండి సక్రమంగా నీరు రావడం లేదని, తాము ఏర్పాటు చేసుకున్న కొళాయిల్లో నెల రోజులకు ఒకసారి మాత్రమే నీరు వస్తోందని, ఇలాయితే తాము ఎలా జీవనం సాగించాలని మహిళలు వాపోయారు. విధి లేని పరిస్థితుల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోందని తెలిపారు. అనంతరం అక్కడే ఎండిపోయిన బోరును పరిశీలించారు. కాగా ట్యాంకర్ల ద్వారా నీటిని పట్టుకున్న మహిళల వద్దకు వెళ్ళిన కరవు బృందం అధికారులు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ రావిళ్ళ లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ మున్సిపాలిటీకి ఎలాంటి శాశ్వత నీటి వనరులు లేవని, పిఏబిఆర్ నుండి అరకొరగా నీరు వస్తుండటంతో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో ఉన్న బోర్లు కూడా వర్షాభావ పరిస్థితుల కారణంగా రోజురోజుకు ఎండిపోతున్నాయని, నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. స్థాని క కౌన్సిలర్లు దాదాపీర్, షాజియా పట్టణంలో నెలకొన్న నీటి సమస్య, కరవు పరిస్థితులపై ప్రత్యేకంగా తయారు చేసిన ఫొటోలతో కూడిన వినతిపత్రాన్ని అందచేశారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బాలాజీ మనోహర్, ఆదిమూర్తి, పట్టణ అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో పట్టణంలో నెలకొన్న నీటి సమస్య, హంద్రీనీవా ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర కరవు బృందానికి వినతిపత్రం అందజేశారు. అదే విధంగా బిజెపి నాయకులు సైతం వినతిపత్రం అందచేశారు. ఇదిలా ఉండగా స్థానిక ధర్మపురం, మోతుకపల్లిలో ఎండిపోయిన బోర్లు, పెన్నా నదిని పరిశీలించేందుకు ముందస్తుగా ఏర్పాట్లు చేయగా కేంద్ర కరవు బృం దం అధికారులు వాటిని పరిశీలించకుండానే వెళ్ళిపోయారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి కనుమూరి శేఖర్, వైస్ ఛైర్మన్ జెపికె రాము, టిడిపి నాయకులు ఏ.నాగరాజు, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఇ శ్రీనాథ్‌రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ రమేష్, డిఇఇలు ఈశ్వరయ్య, వన్నూరస్వామి, ప్రసాద్, ఎఇలు నీరజ, సురేష్ ఉన్నారు.
యువత సభ్యత, సంస్కారాన్ని
పెంపొందించుకోవాలి
అనంతపురం సిటీ, జనవరి 23: దేశంలోని యువత సభ్యత, సంస్కారంతో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని జెఎన్‌టియూ ఉప కులపతి ఆచార్య ఎంఎంఎం. సర్కార్ పేర్కొన్నారు. సోమవారం జెఎన్‌టియూ విశ్వవిద్యాలయ పరిధిలోని కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులచే యువజనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విసి హాజరై మాట్లాడుతూ దేశం పట్ల యువత సభ్యత, సంస్కారంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ముందుకు వెళ్ళాలని సూచించారు. యువతకి దేశం మీద సామాజిక బాధ్యత ఉండాలని, పల్లెలని దత్తతకు తీసుకుని, చిన్నపిల్లలకు చదువు చెప్పటం, రక్తదాన శిబిరాలను ఏర్పాటుచేయాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు మేమున్నామంటూ ఎన్‌ఎస్‌ఎస్ యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. యువజనోత్సవాల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్ట్ఫికెట్లును, మెమొంటోలను అందజేసారు. ఇందులో గెలుపొందిన విద్యార్థులను రాష్టస్థ్రాయి యువజనోత్సవాల్లో పాల్గొంటారని ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్టినేటర్ ఆచార్య ఎంఎల్‌ఎస్ దేవకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య సుబ్బారావు, రిజిస్ట్రార్ ఆచార్య క్రిష్ణయ్య, యూనివర్సిటీ డైరెక్టర్లు, కళాశాల ప్రిన్సిపాల్స్ ఆచార్య కె.ప్రహ్లాదరావు, వైస్ ప్రిన్సిపాల్స్ ఆచార్య దేవకుమార్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు దిలీప్‌కుమార్, లలిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాట్యాచార్యులు పట్నం శివప్రసాద్‌ను సన్మానించారు.

ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి
అనంతపురం కల్చరల్, జనవరి 23: బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాటం సాగించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎఐడిఎస్‌ఓ, ఎఐడివైఓ ఆధ్వర్యంలో శ్రీనివాసనగర్ మదర్ థెరిసా సర్కిల్‌లో నేతాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎఐడిఎస్‌ఓ రాష్ట్ర అధ్యక్షులు డి.రాఘవేంద్ర, పలువురు విద్యార్థి, యువజన సంఘాల నాయకులు, విద్యార్థులు నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం అన్ని వర్గాల వారిని ఏకం చేసి, భారత జాతీయ సైన్యం ఆజాద్ హింద్ ఫౌజ్‌ను నిర్మించిన గొప్ప పోరాట యోధుడు సుభాష్ చంద్రబోస్ అని పేర్కొన్నారు. చంద్రబోస్ ఆశయాలను కొనసాగిస్తాం, జోహార్ సుభాష్ చంద్రబోస్ అంటూ నినాదాలు చేశారు. ఎఐడిఎస్‌ఓ జిల్లా అధ్యక్షులు నాగరాజు, జిల్లా కార్యదర్శి నరేంద్ర, రామాంజినేయులు, ఎఐడివైఓ నాయకులు శివప్ప పాల్గొన్నారు.

కేంద్ర నిధుల విడుదలపై నిమ్మల ఆవేదన
హిందూపురం, జనవరి 23:అనంతపురం జిల్లా కరవు పరిస్థితులను అటు పార్లమెంటులోనూ ఇటు కేంద్ర మంత్రులతో పదేపదే తాము విన్నవించినా నిధులు మాత్రం ఆశించిన స్థాయిలో విడుదల కావడం లేదని హిందూపురం ఎంపి నిమ్మల కిష్టప్ప కేంద్ర కరవు అధ్యయన బృందం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. పంట నష్టం, కరవు పరిస్థితులను అధ్యయనం చేయడానికి మీరు వస్తారు, నివేదిక అందజేస్తారు, అవసరమైన నిధులు మాత్రం అంతంత మాత్రమేనని వాపోయారు. జిల్లా కరవు పరిస్థితులను పరిగి మండలం గొల్లపల్లిలో ఎంపి నిమ్మల వివరించి అవసరమైన సహకారం కోసం నివేదిక ఇచ్చారు. 18 ఏళ్ళలో 15 ఏళ్లు కరవు దాపురించిందని, రైతులు ఎంత మేర నష్టపోయారో దయచేసి కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు. దేశంలో ఇతర ప్రాంతాలకు భిన్నంగా అనంతపురం జిల్లాకు ప్రత్యేక పాలసీని అమలు పరచి రైతులను ఆదుకోవాలన్నారు. శాశ్వతమైన పరిష్కారం కేంద్రం చూపితే జిల్లా బాగు పడుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నదుల అనుసంధానం ద్వారా రైతాంగాన్ని ఆదుకొనేందుకు ఎంతో కృషి చేస్తున్నారని, అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు రాష్ట్ర బిసి కార్పొరేషన్ ఛైర్మన్ పామిశెట్టి రంగనాయకులు కరవు బృందం అధికారులతో చర్చించి జిల్లాను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.
కరవు రైతును ఆదుకోండి
* కరవు బృందంతో రైతు సంఘం వినతి
హిందూపురం రూరల్ :దశాబ్ధాలుగా వరుస కరవులతో సతమతమవుతున్న కరవు రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు కేంద్ర కరవు బృందానికి వినతిపత్రం ఇచ్చారు. కేంద్ర కరవు బృందం సభ్యులు రాథోడ్, జర్గర్, రామకృష్ణ, జిల్లా కలెక్టర్ కోన శశిధర్‌ల ఆధ్వర్యంలో మండల పరిధిలోని పట్టు పరిశోధనాకేంద్రంలో జిల్లా కరవుపై సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని కలసిన రైతు సంఘం నాయకులు ఈ జిల్లా రైతాంగం ప్రతి ఏటా కరవుతో సతమతమవుతోందన్నారు. సాగు నీటికోసం అమలు చేస్తున్న హంద్రీనీవా పథకాన్ని వెంటనే పూర్తి చేయడం ద్వారా మాత్రమే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయగలమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షులు సిద్దారెడ్డి, కార్యదర్శి వెంకటరామిరెడ్డి, ఓపిడిఆర్ శ్రీనివాసులు, చైతన్య గంగిరెడ్డి, బిఎస్‌పి శ్రీరాములు ఉన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల పరిశీలన
స్ర్తి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు, వివిధ పథకాల అమలు తీరును కేంద్ర కరవు బృందం సభ్యులు సోమవారం పరిశీలించారు. కరవు బృందం పర్యటనలో భాగంగా మండల పరిధిలోని మణేసముద్రం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ జుబేదాబేగం స్ర్తి, శిశు సంక్షేమశాఖ ద్వారా అమలవుతున్న పలు పథకాలను వారికి వివరించారు. కరవు బృందం సభ్యులు రాథోడ్, జర్గర్, రామకృష్ణ, జెసి లక్ష్మీకాంతం, రాష్ట్ర బిసి కార్పొరేషన్ ఛైర్మన్ రంగనాయకులు, నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి శేఖర్, సిడిపిఓ నాగమల్లేశ్వరీ, సిబ్బంది శ్రీలత, వరలక్ష్మీ, మల్లికార్జున తదితరులున్నారు.
కరవు బృందానికి స్వాగతం
చిలమత్తూరు :జిల్లాలో కరవు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు విచ్చేసిన కేంద్ర కరవు బృందానికి తహసీల్దార్ ఇబ్రహీంసాబ్, ఎంపిపి నౌజియాభాను, ఎంపిడిఓ శకుంతల తదితరులు సోమవారం తెల్లవారుజామున ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుండి రోడ్డు మార్గాన కేంద్ర కరవు అధ్యయన బృందం అధికారులు స్థానిక రక్షా అకాడమికి విచ్చేయగా బొకేలు అందచేసి స్వాగతించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ భాస్కర్‌రెడ్డి ఉన్నారు.
ఎండిన మల్బరీ తోటలను పరిశీలించిన కరవు బృందం
పరిగి :కేంద్ర కరవు బృందం ఉన్నతాధికారులు సోమవారం మండల పరిధిలోని గొల్లపల్లిలో ఎండిపోయిన మల్బరీ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో సాగునీరు, తోటల పెంపకానికి వ్యయమైన పెట్టుబడి, కూలీల ఖర్చులు తదితర వాటి గురించి రైతులతో అడిగి తెలుసుకున్నారు. వర్షాభావ పరిస్థితులతో భూగర్భజలాలు అడుగంటిపోయి బోర్లు వేసినా నీరు లభ్యం కాని పరిస్థితులు నెలకొన్నాయని రైతులు అధికారులతో ఎదుట వాపోయారు. నీరు లేక మల్బరీ తోటలు, కంది పంట ఎండిపోయినట్లు పేర్కొన్నారు. వర్షాభావంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, కనీసం పెట్టుబడులు కూడా చేతికి అందే పరిస్థితులు లేవని, అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.

ఆటో డ్రైవర్ ఆత్మహత్య
అనంతపురం అర్బన్, జనవరి 23: నగరంలోని పిల్లిగుండ్ల కాలనీకి చెందిన చాంద్‌బాషా(22) సోమవారం తన ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకొన్నట్లు రెండవ పట్టణ ఎస్.ఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపారు. మృతుడి మానసిక పరిస్థితి సరిగా లేనట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టంకు ఆసుపత్రికి తరలించినట్లు ఎస్.ఐ తెలిపారు.
ఎలుక తెచ్చిన తంటా..
అనంతపురం అర్బన్, జనవరి 23: శుభమా అని షాపు తీసి దేవుని ఫొటోలకు పూజ చేసి దీపం, అగరవత్తులు వెలిగించాడు. అనంతరం షాపు యజమాని తన పనిలో నిమగ్నమయ్యాడు. ఫొటోలపై పైకి చేరిన ఎలుక అక్కడి నుంచి కిందికి దిగుతూ దీపంకు తగిలింది. దీంతో దీపం కిందపడటంతో షాపులో అగ్నిప్రమాదం చోటు చేసుకొని రూ.3 లక్షలు మేర నష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెలితే షాపు యజమాని వెంకటేష్ సోమవారం కోర్టు రోడ్డులో వున్న బాలజీ అండ్ కో సుగుణ మోటార్స్ పంపుసెట్స్ దిన చర్యల్లో భాగంగా ఉదయం తన షాపునకు వచ్చి షాపులోని ఫొటోలకు పూజ చేశారు. దీపం, అగరవత్తులు వెలిగించి పూజ పూర్తి చేసుకొని తన పనిలో మునిగిపోగా ఓ ఎలుక ఫోటోల పైకి చేరి అనంతరం దీపానికి తగలడంతో దీపం కింద పడింది. దీంతో చిన్నగా మొదలైన పొగలు గుర్తించినప్పటికి అగరబత్తీలు అని పొరబడ్డాడు. షాపులో కెమికల్స్ సైతం వుండటంతో మంటలు వేగంగా విస్తరించాయి. ఇది గుర్తించిన యజమాని తక్షణమే బక్కెట్లో నీళ్లు తీసుకొని ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. దీంతో కొద్దిసేపటికే మంటలు పెద్ద ఎత్తున విస్తరించాయి. షాపులో దాదాపు రూ. 50 లక్షల విలువైన మోటార్లు, ఫైపులు, పంప్‌సెట్స్, కేబుల్స్, సింటెక్ ట్యాంకులు ఇతరత్రా ఎలక్ట్రికల్ వస్తువులు పెద్ద ఎత్తున వున్నాయి. కొన్ని వస్తువులు పూర్తిగా ఖాళీ పోయాయి. అగ్నిమాపక శాఖాధికారి లింగమయ్య నేతృత్వంలో సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
విద్యార్థినిపై అత్యాచారం
ముదిగుబ్బ, జనవరి 23: మండలంలోని మర్తాడు గ్రామానికి చెందిన విద్యార్థినిపై దురిగల్లు పశువైద్య కేంద్రంలో పశు గణ సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్న ఆదినరసింహులు సోమవారం అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. నల్లమాడ మండలం రామాపురం ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలిక సంక్రాంతి సెలవుల అనంతరం సోమవారం పాఠశాలకు వెళ్తూ అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడానికి ముదిగుబ్బకు తల్లితోపాటు వచ్చిందన్నారు. తల్లి కనపడకపోవడంతో వెతుక్కుంటూ పశువైద్యశాల వైపునకు వెళ్లిందన్నారు. అక్కడ వున్న ఆదినరసింహులు బాలికకు మాయమాటలు చెప్పి లోపలకు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు తెలిపారు. అనంతరం బాలిక తల్లిదండ్రులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు. నిందితుడు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తామని పోలీసులు తె లిపారు.