అనంతపురం

నేత్రపర్వంగా సాగిన జగన్నాథ రథయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 11:అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాజం (ఇస్కాన్) ఆధ్వర్యంలో 9వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నగరంలో శనివారం జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది. ప్రత్యేకంగా అలంకరింపబడిన రథంలో సుభద్ర, బలభద్ర సమేతుడైన జగన్నాథుడు ఊరేగుతూ భక్తులకు నేత్రానందం గొలిపాడు. రథయాత్రకు ఇస్కాన్ దక్షిణ భారత ఇన్‌చార్జి శ్రీ సత్యగోపీనాథ్‌దాస్ స్వామీజీ, మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్రతీర్థ స్వామీజీ ముఖ్య అతిథులుగా హాజరై జగన్నాథుడికి హారతి ఇచ్చి రథయాత్రను ప్రారంభించారు. ఎస్పీ రాజశేఖరబాబు రథం ముందు చీపురుతో ఊడ్చి రథయాత్రను ప్రారంభించారు. మంత్రాలయం పీఠాధీశులు శ్రీ సుబుధేంద్రతీర్థ స్వామీజీ రథోత్సవంలో పాల్గొన్నారు. రథయాత్ర ముందు 1008 కలశాలతో మహిళలు నిలవగా 108 మంది హారతులు పట్టారు. కుల, మత, వర్గాలకతీతంగా అందరు రథాన్ని లాగుతూ సమరసతను చాటారు. రథం ముందు నరసింహ స్వామి విగ్రహంతో ఏర్పాటు చేసిన ఉపరథం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అదేవిధంగా శ్రీ కృష్ణలీలను వివరించే వివిధ ఘట్టాలను కళ్లకు కట్టేలా వివరిస్తూ ఏర్పాటు చేసిన ఉప రథాలు భక్తులను ఆధ్యాత్మిక అనుభూతిలో ముంచెత్తాయి. వీటితో పాటు కేరళ నుండి వచ్చిన కళాకారులు వివిధ దేవతా వేషధారణలతో ప్రత్యేకమైన వాయిద్యాలతో చేసిన నృత్యాలు విశేష ఆకర్షణగా నిలిచాయి. అదేవిధంగా కర్ణాటకకు చెందిన మహిళా కళాకారుల నృత్యాలు, వీరభద్రస్వామి వేషధారణలతో ఆడిన నృత్యాలు, టిటిడి ఆధ్వర్యంలో నిర్వహించిన భజనలు, కోలాటం, చెక్క్భజన, గురవయ్యల నృత్యాలు, ఉరుముల కళాకారుల నాట్యాలు, విచిత్ర వేషధారణలతో నిర్వహించిన కళాప్రదర్శనలు నగర ప్రజలకు నయనానందం కలిగించాయి. అంబేద్కర్ సర్కిల్ నుండి ప్రారంభమైన రథయాత్ర సప్తగిరి సర్కిల్, టవర్‌క్లాక్ సర్కిల్, రఘువీర టవర్, రాజురోడ్, శ్రీకంఠం సర్కిల్, గాంధీబజార్, బసవన్నకట్ట మీదుగా లలితకళాపరిషత్ వరకు సాగింది. రథయాత్ర మార్గంలో భక్తులు అరటి గెలలతో దారి పొడుగునా అలంకరించారు. మహిళలు రంగవళ్లులతో స్వాగతం పలికారు. యువకులు బాణసంచా పేలుస్తూ స్వాగతం పలికారు. జగన్నాథుడికి అడుగడుగునా జనం నీరాజనం పలికారు. జై జగన్నాథ్... జైజై జగన్నాథ్ అంటూ ప్రతి ఒక్కరు రథం లాగుతూ తన్మయత్వం చెందారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో దారిపొడగునా భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ‚‚‚
ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు
హిందూపురం టౌన్, ఫిబ్రవరి 11: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు ఎంతో మెరుగు పడ్డాయని వైద్య, విధాన పరిషత్ జాయింట్ కమిషనర్ డాక్టర్ జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. పేదలకు అన్ని విధాలా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. వైద్య, విధాన పరిషత్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తీసుకున్న చర్యలతో ఇది సాధ్యమైందన్నారు. శనివా రం పురం ప్రభుత్వాసుపత్రిని ఆయ న తనిఖీ చేశారు. రోగులతో వైద్య సౌకర్యాలు, వైద్యులు, సిబ్బంది పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. జాయింట్ కమిషనర్ మాట్లాడుతూ, హిందూపురం ప్రభుత్వాసుపత్రి ఆవరణలో నిర్మాణంలో ఉన్న ఎంసిహెచ్ కేంద్రాన్ని 3 నెలల్లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ఆ కేంద్రానికి అవసరమైన అత్యాధునిక వైద్య పరికరాలను కూడా కొనుగోలు చేసేందుకు అంచనా వేశామన్నా రు. గతంలో పోల్చితే ఐపి, ఓపి, శస్త్ర చికిత్సలు, ప్రసవాలు ప్రభుత్వాసుపత్రుల్లో ఎంతో మెరుగు పడ్డాయన్నారు. వీటిని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడా మందుల కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఇకపోతే స్థానిక ప్రభుత్వాసుపత్రిలో నెలకొన్న వైద్యులు, సిబ్బంది కొరతను మరో 3 నెలల్లోగా పరిష్కరిస్తామన్నారు. కాగా చేతులు శుభ్రం చేసుకోకుండా భోజన పదార్థాలు తీసుకోవడం, బహిరంగ మల విసర్జన వంటి వాటి వల్ల 19 ఏళ్ళ లోపు వారిలో నులి పురుగులు చేరుకునే అవకాశం ఉందన్నారు. తద్వారా తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోగా రక్తహీనత సోకుతుందన్నారు. దీన్ని దృష్టిలో వుంచుకొని విద్యావాహిని పథకం ద్వారా అన్ని ప్రాంతాల్లో వైద్య విద్యార్థులతో అవగాహన కల్పిస్తామన్నారు. అలాగే పాఠశాలల స్థాయిలో నులి పురుగుల నివారణకు మందులను కూడా ఉచితంగా అందచేస్తున్నట్లు తెలిపారు. వైద్యులు, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని, విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ జెఇ వెంకటస్వామి, సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు, ఆర్‌ఎంఓ డాక్టర్ రుక్మిణమ్మ, వైద్యులు పాల్గొన్నారు

అశ్వవాహనంపై కొలువుదీరిన
కొండమీదరాయుడు
బుక్కరాయసముద్రం,్ఫబ్రవరి 11: శ్రీ కొండమీదరాయుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అశ్వవాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనభాగ్యం కలిగించారు. మాఘశుద్ధ పౌర్ణమి శుక్రవారం జరిగిన రథోత్సవం అనంతరం శ్రీవారికి సతీసమేతంగా బలిహారం ఊరేగింపు నిర్వంచారు. సాయంత్రం చిన్నరథంపై శ్రీదేవి భూదేవి సమేతంగా అశ్వవాహనంపై కొలువుదీరి గ్రామపురవీధుల గుండా స్వామి వారిని ఊరేగిస్తారు. ఊరేగింపు తర్వాత కొండమీదరాయస్వామి ఆలయంలో స్వామివారి ఇంట పడ్డ దొంగల పట్టు కార్యక్రమాన్ని ప్రతియేటా ఆనవాయితీగా నిర్వహిస్తారు.ఈ దృశ్యాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో హాజరవుతారు. రథోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులు తేరుబజారులో ఉన్న గాజుల అంగళ్ళు, మిఠాయి కొట్లు, చెరుకుల వద్ద జనసందోహంతో కిక్కిరిసిపోయింది.
ఘనంగా చౌడేశ్వరీదేవి రథోత్సవం
పరిగి, ఫిబ్రవరి 11:మండలంలోని ఊటుకూరులో వెలసిన బాల చౌడేశ్వరి అమ్మవారి ఉత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. దేవాలయంలో వెలసిన అమ్మవారి విగ్రహాన్ని వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అదే విధంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని భక్తులు మోసుకొచ్చి అందంగా అలంకరించిన రథంపై కూర్చోబెట్టి గ్రామ వీధుల గుండా లాగారు. ఇందులో భాగంగా సంతానం లేని మహిళలు, దీర్ఘకాలిక రోగాలతో బాధ పడుతున్న బాధితులు శరీర భాగాలకు శూలాలను గుచ్చుకుని రథం ముందుభాగంలో నడిచారు. ఇలా చేయడం వల్ల తాము కోరుకున్న కోర్కెలు తీరుతాయన్నది భక్తుల విశ్వాసం. మహా మంగళహారతి అనంతరం భక్తులకు తీర్థ, ప్రసాదాలు పంపిణీ చేశారు.
పోరాటాలకు తరిమెల నాగిరెడ్డి స్ఫూర్తి

అనంతపురం సిటీ, ఫిబ్రవరి 11: కమ్యూనిస్టు ఉద్యమ పోరాటాలకు తరిమేల నాగిరెడ్డి స్ఫూర్తి అని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం తరిమేల నాగిరెడ్డి శతజయంతిని పురస్కరించుకుని స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో సిపిఐ ఆధ్వర్యంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ శతజయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ సురవరం సుధాకర్‌రెడ్డి, సిపిఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యులుసుబోద్‌మిత్రా, సిపిఎం జాతీయ కమిటీ సభ్యులు గఫూర్, ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, తరిమెల నాగిరెడ్డి ట్రస్టు అధ్యక్షులు సూర్యసాగర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభిప్రాయ బేదాలను పక్కన పట్టె చీలికలను తగ్గించుకుని ఐక్య ఉద్యమాలకు కమ్యూనిస్టులు పూనుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆమోదయోగ్యమైన కార్యచరణతో ఐక్యవేదిక ద్వారా పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో సంఘ వ్యతిరేక శక్తులు గెలుపొంది అధికారాన్ని చెలాయిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం ఏర్పడిందన్నారు. జాతీయతను గురించి మాట్లాడే నైతిక హక్కు ఆర్‌ఎస్‌ఎస్‌కు లేదన్నారు. విద్యార్థిదశ నుండి జాతీయోద్యమంలో పాల్గొన్న తరిమెల నాగిరెడ్డి ఆ తర్వాత సదాశివన్, నీలం రాజశేఖర్‌రెడ్డి, ప్రజాసమస్యలను పరిష్కారం కోసం ఉద్యమించారన్నారు. శాస్ర్తియంగా నిరూపించే వాదనలతో యువతను కమ్యూనిస్టు కార్యక్రమాల వైపు ఆకర్షించిన గొప్ప వక్త నాగిరెడ్డిని పేర్కొన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్, సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, సిపిఐఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యులు సింహాద్రి ఝూన్సీ, మానవత సంస్థ వ్యవస్థాపకులు అమర్‌నాథ్‌రెడ్డి, తరిమెల శరత్‌చంద్రారెడ్డి, మానవ హక్కుల వేదిక నాయకులు బాషా, అడ్వకేట్ రామకృష్ణారెడ్డి, సాహితివేత్త సింగమనేని నారాయణ, కదిలిక ఎడిటర్ ఇమామ్, ప్రజా విజ్ఞాన వేదిక సలీమ్ మాలిక్, ఇతర సిపిఐ నాయకులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక చింతనతోనే శాంతి
అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 11:ఆధ్యాత్మిక చింతన ద్వారానే సమాజంలో నిజమైన శాంతి నెలకొంటుందని ఇస్కాన్ దక్షిణ భారత ఇన్‌చార్జి శ్రీ సత్యగోపీనాథ్‌దాస్ స్వామీజీ పేర్కొన్నారు. ఈమేరకు ఇస్కాన్ ఆధ్వర్యంలో శనివారం నగరంలో నిర్వహించబడిన జగన్నాథ రథయాత్రకు సత్యగోపీనాథ్ దాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ, ఎస్పీ రాజశేఖరబాబు హాజరయ్యారు. ఈసందర్భంగా సత్యగోపీనాథ్ మాట్లాడుతూ వ్యక్తినడవడికలో మార్పు రావాలంటే ఆధ్యాత్మిక చింతనలో మార్పు రావాలన్నారు. ఆధ్యాత్మికత అంటే ఆలయాల్లో పూజారులకు మాత్రమే సంబంధించినదిగా భావిస్తున్నారన్నారు. ప్రకృతి చట్టాలను ఆధ్యాత్మిక చింతన తెలియచేస్తుందన్నారు. నేడు జంతువుకు, తనకు వ్యత్యాసం లేకుండా మనుషులు ప్రవర్తిస్తున్నారని, అటువంటి వారిని నిజమైన మనిషిగా ఆధ్యాత్మిక చింతన మారుస్తుందన్నారు. వినమ్రత, ప్రేమ, అనురాగం సమాజంలో లోపించాయని, ప్రేమ స్వరూపం ఉన్నచోట సంపద, విజయం వుంటాయన్నారు. కలియుగంలో కపటం, కోట్లాటలు ఎక్కువగా ఉంటాయన్నారు. కృష్ణనామాన్ని ఉచ్చరిస్తే కష్టాలు దూరమవుతాయన్నారు. సమాజంలో మంచిని బోధించే వ్యక్తులు నేడు చాలా అవసరమన్నారు. కృష్ణతత్వానికి అనుగుణంగా మన జీవనాన్ని సాగించాలన్నారు. ఇస్కాన్ వ్యవస్థాపకులు ఎసి.్భక్తివేదాంత స్వామి తన 70సం.ల వయసులో ప్రపంచమంతా పర్యటిస్తూ సనాతన ధర్మాన్ని ప్రచారం చేశారన్నారు. భారత భూమిలో నిజమైన విజయ రహస్యం ధర్మమేనన్నారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో నేడు ప్రపంచమంతా 4వేల నగరాల్లో జగన్నాథ రథయాత్రలు నిర్వహింపబడుతున్నాయన్నారు. లండన్‌లో జరిగిన జగన్నాథ రథయాత్రకు అక్కడి ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించిందన్నారు. ఎస్పీ రాజశేఖరబాబు మాట్లాడుతూ రథయాత్ర మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలన్నారు. ఆధ్యాత్మిక చింతన లోపిస్తున్న కారణంగానే సమాజంలో అశాంతి, నేరప్రవృత్తి ప్రబలుతున్నాయన్నారు. ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు ఇస్కాన్ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఈకార్యక్రమంలో దామోదర గౌరంగదాస్ ప్రభు, డిఎస్పీ మల్లికార్జున వర్మ, శ్రీపాదవేణు, ఇంటెల్ ప్రతాప్‌రెడ్డి, డాక్టర్ కేశన్న, ఆదరణ రామకృష్ణ తదితరులతో పాటు హిందూ చైతన్య వేదిక, రాఘవేంద్ర స్వామి మఠం, టిటిడి, ఇటెల్ కళాశాల విద్యార్థులు, వివిధ ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి రథం ఊరేగింపు
ఉరవకొండ, ఫిబ్రవరి 11:శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి రథాన్ని ఊరేగించారు. కర్నాటకలోని హంపి నుండి వచ్చిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున రథం ఉరవకొండ చేరుకుంది. స్థానిక ఆర్‌అండ్‌బి వసతి గృహం నుండి పట్టణ పురవీధుల గుండా రథోత్సవాన్ని ఊరేగించారు. ఈ రథోత్సవాన్ని శివమాలధారులు పూజలు నిర్వహించి ఊరేగింపు చేపట్టారు.
వైభవంగా బూదిగుమ్మ
సంజీవరాయస్వామి రథోత్సవం
* నేడు పెన్నానదిలో భక్తుల మాఘస్నానాలు
బెళుగుప్ప, ఫిబ్రవరి 11:మండలంలోని రామసాగరం సమీపంలో పెన్నానది ఒడ్డున వెలసిని శ్రీ బూదిగుమ్మ సంజీవరాయుడు తిరునాళ్ల ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి వైభవంగా రథోత్సవం జరిగింది. వేలాది మంది భక్తుల మద్య జైశ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ స్వామివారి రథాన్ని లాగారు. శనివారం ఉదయం స్వామివారికి సుప్రభాతసేవ, అభిషేకాలు, సింధూర తైలం, ప్రత్యేక అలంకరణతో దర్శన మిచ్చారు. జిల్లాలోని బెళుగుప్ప, కల్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాల నుండే కాక కర్నాటకలోని చిత్రదుర్గం, బళ్లారి, చెళ్లికెర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. మొట్టమొదటగా శ్రీ లక్ష్మివెంకటేశ్వరస్వామి రథాన్ని లాగి అనంతరం సంజీవరాయుడి స్వామి రథాన్ని జైశ్రీరామ్ నినాదాలతో ఊరేగించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం అనంతరం మరుసటిరోజు ఆదివారం వేకువజామునే వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఆలయానికి సమీపంలో ఉన్న సిద్దేశ్వర ఘాట్ వద్ద పెన్నానదిలో మాఘస్నానాలు ఆచరించి సిద్దేశ్వరస్వామి, సంజీవరాయస్వామిలకు తడిబట్టలతో దర్శనం చేసుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయన్న నమ్మకం. సిద్దేశ్వర ఘాట్‌వద్ద భక్తులు మాఘస్నానాలు చేసేందుకు ఇఓ ఈశ్వరరెడ్డి, ఎస్‌ఐ నాగస్వామి, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులుకూడా నదిలోతుగా ఉండడంతో జాగ్రత్తగా మాఘస్నానాలు చేసి దర్శనాలు చేసుకోవాలని కోరారు.
పండిత్ దీన్‌దయాల్
అందరికీఆదర్శం
* బిజెపి జిల్లా అధ్యక్షుడు జె.అంకాల్‌రెడ్డి
అనంతపురం సిటీ, ఫిబ్రవరి 11:్భరతీయ జనసంఘం మాజీ అధ్యక్షులు ఏకాత్మ మానవతవాద సిద్ధాంత ప్రతిపాదకులు పండిత దీన్ దయాల్ ఉపాధ్యాయ జీవితం అందరికి ఆదర్శమని పేర్కొన్నారు. శనివారం స్థానిక బిజెపి జిల్లా కార్యాలయంలో నగరశాఖ ఆధ్వర్యంలో పండిత్ 49వ వర్ధంతిని పురస్కరించుకుని కార్యాలయం వద్ద స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి కార్యాలయంలో పండిత్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అంకాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపపంచంలో రాజకీయ సామాజిక జీవన విధానాల్లో పెట్టుబడి దారి వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ, కమ్యూనిస్ట్ మొదలగు వాటి సమాజం అనుసరిస్తున్న వేళలో ప్రపంచానికి పడిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవతా వాదే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారని తెలిపారు. దేశంలో ప్రధాని మోదీ చేస్తున్న సంక్షేమ పథకాలల్లో గ్రామీణ కౌసల్యయోజన, గ్రామ జ్యోతియోజన, ఆవాస్ యోజన, గ్రామీణ ఉపాధి హామీ పథకం, గ్రామీణ అభివృద్ధి వంటి పథకాలకు బడ్జెట్‌లో దాదాపుగా రూ.5.51లక్షల కోట్లను ఈ బడ్జెట్‌లో కేటాయించి దేశంలోని అట్టడుగున ఉన్న నీరుపేదలకు కనీస అవసరాలైన తాగునీరు, ఇల్లు, విద్య, ఉపాధి ఆరోగ్యం గ్రామీణ అపాంతాల్లో వౌళిక వసతులు వంటి పథకాలను పండత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ బలిదానం దేశానికి ఒక పెద్ద సమర్పణ చేశారన్నారు. ప్రతి బిజెపి కార్యకర్త దీన్‌దయాళ్ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. బిజెపి రాష్ట్ర నాయకులు లలిత్‌కుమార్, సందిరెడ్డి శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, ఆదిలక్ష్మి, మల్లీశ్వరీ, రూపాదేవి, రత్నమయ్య, హరీష్‌రెడ్డి, వెంకటరాముడు, సయ్యద్‌బాబా, పెద్దన్న, నగర అక్షుడు కెఎం.శ్రీనివాసులు, మందారపు రమణ పాల్గొన్నారు.
లోక్ అదాలత్‌లో సత్వర కేసుల పరిష్కారం
హిందూపురం టౌన్, ఫిబ్రవరి 11:కోర్టుల్లో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి కక్షిదారులకు న్యాయం చేసేందుకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు అదనపు జిల్లా జడ్జి రాములు పేర్కొన్నారు. శనివారం స్థానిక కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎడిజె మాట్లాడుతూ, కక్షిదారులు రాజీమార్గం ద్వారా వ్యయప్రయాసలకు గురి కాకూడదన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. కేసుల్లో ఉన్న ఇరు వర్గాల కక్షిదారులు రాజీ అయితే వెంటనే పరిష్కారమవుతాయన్నారు. న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు లోక్‌అదాలత్‌లపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం కోర్టు ఆవరణలో ఐదు బెంచ్‌లను ఏర్పాటు చేసి 223 కేసులను పరిష్కరించారు. రోడ్డు ప్రమాదాలు, చెక్‌బౌన్స్, మున్సిపల్, ఎక్సైజ్, పోలీసు, ప్రీలిటిగేషన్, భరణం తదితర కేసులు పరిష్కారమయ్యాయి. ఆయా కేసులకు సంబంధించి బాధితులకు అందాల్సిన నగదును వెను వెంటనే అందజేసేలా న్యాయమూర్తులు ఆదేశాలు జారీ చేశారు. సీనియర్ సివిల్ జడ్జి నాగశేషయ్య, జూనియర్ సివిల్ జడ్జి జానీబాషా, ప్రత్యేక మెజిస్ట్రేట్‌లు ఆనందతీర్థ, శారదారెడ్డి, ఎపిపి రాజశేఖర్, ఎజిపి సుదర్శన్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రామచంద్రారెడ్డి, లోక్ అదాలత్ కమిటీ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా హాజరైన కక్షిదారులు తదితరులకు రోటరీక్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారం, భోజన సౌకర్యాన్ని కల్పించినట్లు క్లబ్ సభ్యులు రమేష్, క్రిష్ణారావు, రాజశేఖర్ తెలిపారు.
మడకశిరలో...
మడకశిర:మడకశిర మున్సిఫ్ కోర్టు ఆవరణలో శనివారం జరిగిన మెగా లోక్ అదాలత్‌లో 71 కేసులు పరిష్కారమైనట్లు ఎస్‌ఐలు మక్బూల్‌బాషా, వెంకటరమణ తెలిపారు. ఉదయం 10 గంటలకు స్థానిక మున్సిఫ్ మెజిస్ట్రేట్ రమేష్‌నాయుడు ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ జరిగింది. అదేవిధంగా ఈ అదాలత్‌లో మడకశిర పోలీసుస్టేషన్‌కు సంబంధించి 8, అగళి నాలుగు, అమరాపురం మూడు, గుడిబండ 10, రొళ్ళకు సంబంధించి 13 కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు. అంతేకాక 31 ఎక్సైజ్ కేసులు కూడా పరిష్కారమయ్యాయి. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు.
గోరంట్లలో...
గోరంట్ల:పెనుకొండ కోర్టులో శనివారం నిర్వహించిన మెగా లోక్ అదాలత్‌లో స్టేషన్ పరిధిలో నమోదైన 73 కేసులు పరిష్కారమయ్యాయని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అదేవిధంగా గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల్లో కక్షిదారులతో చర్చలు జరిపి రాజీ కుదుర్చామని, ఈ మేరకు లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించినట్లు తెలిపారు.
కన్నుల పండువగా
పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం
పామిడి, ఫిబ్రవరి 11:పట్టణంలోని శ్రీ భోగేశ్వరస్వామి దేవాలయంలో శనివారం దేవస్థానం కమిటీ, శివ దీక్షాస్వాముల ఆద్వర్యంలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం వేలాదిమంది భక్తుల సమక్షంలో కన్నుల పండువగా సాగింది. దేవస్థానం అర్చకులు శ్రీ ప్రసన్న పార్వతీ శ్రీ భోగేశ్వరస్వాముల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి వేద మంత్రాలను వల్లిస్తూ శాస్త్రోక్తం కల్యాణోత్సవాన్ని చేపట్టారు. కల్యాణోత్సవానికి విరివిగా తరలివచ్చిన భక్తులు స్వాములను దర్శించుకుంటూ ప్రత్యేక పూజలను చేపడుతూ తీర్థప్రసాదాలను స్వీకరించారు. భక్తుల రద్దీతో దవాలయం కిటకిటలాడింది. అనంతరం అన్నదానం నిర్వహించారు. దేవస్థానం కమిటీ చైర్మెన్ పి.సురేష్‌కుమార్, ఈఓ క్రిష్ణయ్య, శివ దీక్షాస్వాములు, భక్తాదులు పాల్గొన్నారు.
ఘనంగా రుద్రహోమం
తాడిపత్రి, ఫిబ్రవరి 11:శ్రీబుగ్గరామలింగేశ్వరస్వామి దేవాలయంలో శనివారం రుద్రహోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని బుగ్గలింగేశ్వరస్వామి, రాజరాజేశ్వరీదేవి మూలవిరాట్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాఘమాసం పౌర్ణమిని పునస్కరించుకొని రుద్రహోమం చేపట్టామని, హోమంలో పాల్గొన్న దంపతుల కోరికలు సిద్దిస్తాయని ఆలయ ప్రధాన అర్చకులు శంకరయ్యశర్మ తెలిపారు.
పూరిగుడిసె దగ్ధం-రూ.లక్ష ఆస్తి నష్టం
అమరాపురం, ఫిబ్రవరి 11:మండలంలోని హల్కూరు ఎస్సీ కాలనీలో శనివారం సిద్దమ్మ, లింగమ్మలకు చెందిన పూరి గుడిసె ప్రమాదవశాత్తు దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే సిద్దమ్మ, లింగమ్మలు గుడిసెలో వంట చేస్తుండగా మంటలు ఉన్నఫళంగా ఎక్కువ కావడంతో గుడిసె అంటుకుంది. గుడిసెకు నిప్పంటుకోవడంతో వారు గట్టిగా కేకలు వేసేలోపే గుడిసెకు పూర్తిగా మంటలు వ్యాపించాయి. చుట్టు ప్రక్కల వారు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. గుడిసెలో నిత్యావసరాలైన బియ్యం, రాగులు, రూ.15వేల నగదు, బట్టలతో వంట సామాగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు. దీంతో తమకు లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తమను అన్ని విధాలా ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
వివాహిత ఆత్మహత్య
గోరంట్ల, ఫిబ్రవరి 11:స్థానిక మోహన్‌రావు కాలనీకి చెందిన మహేశ్వరి (28) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కడుపునొప్పి భరించలేక గత శుక్రవారం ఇంటిపైకప్పుకు తాడుతో ఉరి వేసుకోగా కుటుంబ సభ్యులు వెంటనే గమనించి అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
వ్యక్తి ఆత్మహత్య
గోరంట్ల, ఫిబ్రవరి 11:మద్యం తాగడానికి డబ్బు ఇవ్వలేదని భార్యతో గొడవ పడిన భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకొంది. స్థానిక కూరగాయల సంతలో నివాసం ఉంటూ చెత్తకుప్పల్లో ప్లాస్టిక్ కాగితాలు సేకరించి జీవనం సాగిస్తున్న రియాజ్ (45) శుక్రవారం రాత్రి మద్యం కోసం భార్య వరాలమ్మతో రూ.200 అడిగాడు. డబ్బు ఇవ్వకపోవడంతో ఘర్షణ పడి ప్రక్కనే ఉన్న బోరు పైపుకు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.