అనంతపురం

ఇక పోరు షురూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఫిబ్రవరి 23 : ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు, ఉపసంహరణ ఘట్టాలు ముగియడంతో ప్రచార పర్వానికి తెరలేచింది. గురువారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో పశ్చిమ రాయలసీమ పట్ట్భద్రులు, ఉపాధ్యాయ స్థానాల్లో 35 మంది పోటీ పడుతున్నారు. పట్ట్భద్రులకు 25, ఉపాధ్యాయ స్థానానికి 10 మంది ఉన్నారు. వీరిలో ఒకరిద్దరు ఇండిపెండెంట్లు ప్రచారాన్ని ఆపి వేసి తమకు అనుకూలంగా ఉన్న వారికి అనధికారికంగా మద్దతు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మిగతావారు ప్రచారానికి ప్రణాళికలు రూపొందించుకున్నారు. పశ్చిమ రాయలసీమ నుంచి పట్ట్భద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ సిపిఎం మద్దతుతో రాయలసీమ అభివృద్ధి నినాదంతో రెండోసారి పోటీకి దిగారు. వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఎన్‌జిఓ సంఘం మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి మాసూలు శ్రీనివాసులు పోటీ పడుతున్నారు. వీరు ముగ్గురూ జిల్లావాసులే కావడం విశేషం. అలాగే టిడిపి నుంచి కర్నూలు జిల్లావాసి టిడిపి అభ్యర్థిగా కెజె.రెడ్డి, కర్నూలుకు చెందిన నాగార్జురెడ్డి కూడా రాయలసీమ అభివృద్ధి పేరుతో రంగంలోకి దిగారు. వీరితోపాటు మిగతా ఇండిపెండెంట్లు, ప్రజాసంఘాల మద్దతుదారులు పోటీలో ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ కడపకు చెందిన బచ్చల పుల్లయ్య టిడిపి, పిఆర్‌టియు మద్దతుతో, కత్తి నరసింహారెడ్డి సిపిఐ, ఎస్‌టియు మద్దతుతోనూపోటీ పడుతున్నారు. వీరితోపాటు మాజీ ఎమ్మెల్సీ కడపకు చెందిన పోచంరెడ్డి సుబ్బారెడ్డి, కర్నూలుకు చెందిన కెవి సుబ్బారెడ్డి, కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన ఒంటేరు శ్రీనివాసులురెడ్డి కూడా పోటీలో ఉన్నారు. ఈనేపథ్యంలో గ్రాడ్యుయేట్స్ స్థానానికి చతుర్ముఖ పోటీ, ఉపాధ్యాయ స్థానానికి బహుముఖ పోటీ ఉండబోతోందని పరిశీలకులు భాస్తున్నారు. కాగా ఓటరు జాబితాలో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 13వ తేదీ నాటికి సవరించిన ఓటర్ల జాబితా మేరకు పశ్చిమ రాయలసీమ పట్ట్భద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి 2,49,582 మంది ఉన్నారు. వీరిలో తొమ్మిది మంది థర్డ్ జెండర్ ఉన్నారు. పురుష ఓటర్లు 1,72,962 మంది, మహిళలు 76,611 మంది ఉన్నారు. జిల్లాలవారీగా చూస్తే అనంతపురంలో పురుషులు 61,090, మహిళలు 27,731, థర్డ్ జెండర్ ఇద్దరు చొప్పున మొత్తం 88,823 మంది ఓటర్లు ఉన్నారు. కడపలో 53,914 మంది పురుషులు, 24,249 మంది మహిళలు, ఐదుగురు థర్డ జెండర్ వారు ఉన్నారు. కర్నూలు జిల్లాలో 57,958 మంది పురుషులు, 24,631 మహిళలు, ఇద్దరు థర్డ్ జెండర్ వారు కలిపి 82,591 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ స్టేషన్లు కడపలో 106, అనంతపురంలో 125, కర్నూలులో 121 చొప్పున మొత్తం 352 ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి మొత్తం 20,515 మందితో తుది ఓటరు జాబితా తయారైంది. వీరిలో పురుష ఉపాధ్యాయులు 13,294 మంది, మహిళా ఉపాధ్యాయులు 7,220 మంది, ఒకరు థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. జిల్లాలవారీగా కడపలో పురుషులు 3,971, మహిళలు 1,999 చొప్పున 5,970 మంది, అనంతపురంలో 5,173 మంది పురుషులు, 2,702 మంది మహిళలు కలిపి 7875 మంది, కర్నూలు జిల్లాలో 4,150 మంది పురుషులు, 2,519 మంది మహిళలు, ఒకరు థర్డ్ జెండర్ వారు కలిపి మొత్తం 6,670 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరికీ 172 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో కడపలో 52, అనంతపురంలో 55, కర్నూలులో 55 చొప్పున ఏర్పాటు చేయనున్నారు.
మండుతున్న ఎండలు!
* వేసవి ప్రారంభంలోనే పెరిగిన ఉష్ణోగ్రతలు
* ఉక్కపోతతో అల్లాడుతున్న జనం
అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 23: ఎండలు బాబోయ్... ఎండలు అంటూ నగర ప్రజలు రోజు రోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతకు భయపడుతున్నారు. నగరంలో గురువారం 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వివరాలు తెలుపుతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఉక్కపోతతో జనం సతమతమవుతున్నారు. ఫిబ్రవరి మాసం లో గతంలో ఎన్నడూ నమోదుకాని వి ధంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం తో రానున్న మాసాల్లో ఇంకా ఎంత ఎండ తీవ్రత ఉంటుందోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎండల నుండి కాపాడుకోవడానికి జనం గొడుగులు, టోపీలు ధరించి బయటికి వస్తున్నారు. మధ్యాహ్న వేళల్లో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి కూల్‌డ్రింక్‌లు, పండ్ల రసాలు సేవిస్తున్నారు.

మహాశివరాత్రికి ముస్తాబైన ఆలయాలు
* నేడు శివపార్వతుల కల్యాణం
అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 23: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నగరంలో వెలసిన శివాలయాలు వేడుకలకు ముస్తాబయ్యాయి. మహాశివరాత్రి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆయా ఆలయ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు. శివరాత్రి పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా, శివరాత్రి రోజు ఉపవాసాలు, జాగరణలతో పరమ శివుని పూజించిన వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలతోపాటు మోక్షం ప్రాప్తిస్తుందని శాస్త్రాలు, పురాణాలు చెపుతున్నాయి. ఇందుకోసం ప్రతి రోజు శివారాధన చేసే భక్తులతోపాటు ప్రతి రోజు ఆరాధన చేయలేని భక్తులు కనీసం శివరాత్రి రోజు ఒక్క రోజు పూజించినప్పటికీ అనేక పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయన్న నమ్మకంతో అత్యధిక సంఖ్యలో భక్తులు శివాలయాలకు వచ్చి శివుని పూజించటం జరుగుతోంది. ఈ దృష్ట్యా అత్యధిక సంఖ్యలో ఆలయాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేశారు. నగరంలోని శివాలయాల్లో మహాశివరాత్రి సందర్భంగా నేడు శివపార్వతుల కల్యాణం నిర్వహించేందుకు కల్యాణ వేదిక ఏర్పాటుచేశారు. నగరంలో అత్యంత పురాతన ఆలయమైన శ్రీ విరూపాక్షేశ్వర దేవాలయం, మొదటి రోడ్డు శివాలయం, శారదా నగర్‌లోని శ్రీ శృంగేరి శంకర మఠంలో, ఆరో రోడ్డులో వెలసిన శివాలయం, గీతామందిరంలోని శివాలయం, శివకోటి ఆలయం, అరవిందనగర్ సర్వేశ్వరాలయం, లక్ష్మినగర్‌లోని శివాలయం, మారుతీనగర్ శివాలయం, తపోవనంలో నూతనంగా నిర్మింపబడిన శ్రీ చిన్మయ జగదీశ్వరాలయం, హెచ్చెల్సీ కాలనీ ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయం. శ్రీ చాముండేశ్వరి ఆలయంలోని పంచలింగేశ్వరాలయంలో మహాశివరాత్రి వేడుకలు, అభిషేకాలు, పూజలు, శివపార్వతుల కల్యాణోత్సవాలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. మూడో రోడ్డులోని జిఆర్.్ఫంక్షన్ హాలులో అనంత శివారాధన సమితి ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
* జిల్లాకు మూడు సెట్ల ప్రశ్నపత్రాలు

అనంతపురం, ఫిబ్రవరి 23 : జిల్లాలో ఇంటర్ మీడియట్ పరీక్షల నిర్వహణకు జిల్లా, ఇంటర్ బోర్డు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మార్చి 1 నుంచి 19వ తేదీ వరకూ సైన్స్, ఆర్ట్స్ విద్యార్థులకు రాత పరీక్షలు జరగనున్నాయి. ఇదివరకే సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ పూర్తి చేశారు. అయితే పలు కళాశాలల్లో ల్యాబ్ సౌకర్యం లేకపోవడంతో అరకొరగా సౌకర్యాలున్న చోట మమ అనిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. అనంతరం వార్షిక రాత పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ప్రస్తుతం జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తున్న పరీక్షల్లో గత రెండేళ్లతో పోలిస్తే ఈఏడాది 75 శాతం ఉత్తీర్ణత సాధించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం తొలి నుంచి విద్యార్థులను సబ్జెక్టుల వారీగా తర్ఫీదు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్టవ్య్రాప్తంగా ఇంటర్‌లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచడంతోపాటు పరీక్షలను పకడ్బందీగా, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం తగిన సూచనలు, సలహాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఠక్కర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్‌దాస్ ఇప్పటికే రెండుమార్లు ఎగ్జామ్స్ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరీక్షల ఏర్పాట్లపై సమీక్షించారు. అలాగే ఇంటర్ బోర్డు కమిషనర్, సెక్రటరీ ఉదయలక్ష్మి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్లపై సూచనలు, సలహాలు ఇచ్చారు. పరీక్షల సమయంలో అవసరమైన సౌకర్యాల కల్పనకు కావాల్సిన నిధులు విడుదలకు కూడా ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అధికారులు మొత్తం 96 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి సౌకర్యాలపై పర్యవేక్షిస్తున్నారు.
నిర్వహణ సిబ్బంది, స్క్వాడ్స్ సిద్ధం
పరీక్షల నిర్వహణకు 96 మంది చొప్పున చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులు 192 మందిని, 18 మంది కస్టోడియన్లను నియమించారు. నాలుగు సిట్టింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక రెవెన్యూ అధికారి, ఒక పోలీసు, జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, విద్యాశాఖ లైబ్రేరియన్‌లు ఉంటారు. అలాగే 10 సిట్టింగ్ స్క్వాడ్స్‌ను నియమించారు. కాగా పరీక్షల ఏర్పాట్లపై కలెక్టర్, జెసి, డి ఇఓలు సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 18 పరీక్ష కేంద్రాల్లో ఫర్నిచర్ సమస్య ఉండటంతో సమీపంలోని కళాశాలల నుంచి అవసరమైన వాటిని సొంత ఖర్చులతో తరలించేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే వెంటిలేషన్, లైట్ల ఏర్పాటుకు రూ.1.80 లక్షల వ్యయం చేయవచ్చన్నారు. కాగా పరీక్ష కేంద్రాలను విద్యార్థులు సులువుగా గుర్తించేందుకు వీలుగా ఆయా కళాశాలల యాజమాన్యాలు సంబంధిత ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. సెంటర్ నంబరు, సెంటర్ కోడ్, కేంద్రం ఉన్న ఏరియాను స్పష్టంగా సూచిస్తూ ఏర్పాటు చేయనున్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి వసతి కల్పిస్తున్నామన్నారు. సెల్ఫ్ సెంటర్లుగా ఉన్న తాడిపత్రి, తలుపుల, తనకల్లు, పెద్దవడుగూరు, నల్లమాడ, ఆత్మకూరులో సిట్టింగ్, ఫ్లైయింగ్ స్క్వాడ్స్‌తో మాస్ కాపీయింగ్, కాపీయింగ్ జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్లు ఆర్‌ఐఓయు.వెంకటేశ్వర్లు చెప్పారు.
స్టోరేజ్ పాయింట్లకు ప్రశ్నపత్రాలు
జిల్లాకు ఇప్పటికే సెట్-1, సెట్-2, సెట్-3 ప్రశ్న పత్రాలు వచ్చాయి. వీటిని జిల్లా వ్యాప్తంగా గుర్తించిన మొత్తం 37 పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన స్టోరేజ్ పాయింట్లకు చేర్చారు. కాగా మొత్తం 1000 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. వీరిలో 700 మంది ఇంటర్ అధ్యాపకులు కాగా, మరో300 మందిని ఎస్‌జి, స్కూల్ అసిస్టెంట్లను ఆయా మండలాల పరిధిలోని పాఠశాలల నుంచి నియమించుకున్నారు.
-----------------------------
పరీక్షలు : మార్చి 1 నుంచి 19 వరకు
సమయం : ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు
కేంద్రాలు : ప్రభుత్వ కాలేజీలు-33, ప్రయివేటు-43
విద్యార్థులు : మొత్తం 70,726 మంది
ఫస్ట్ ఇయర్ : 35,981 మంది
సెకెండ్ ఇయర్ : 34,745 మంది
ఇన్విజిలేటర్లు : 1000 మంది..వీరిలో 300 మంది స్కూల్ టీచర్లు
-------------------------------------

శేఖర్ తొలగింపుపై హైడ్రామా!
* ఆగని అసంతృప్తవాదుల ఆందోళన
హిందూపురం, ఫిబ్రవరి 23 : ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శిగా, నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జిగా చలామణి అయిన కనుమూరి శేఖర్ తొలగింపుపై హైడ్రామా నడుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఇక్కడ నియమితులైన టిడిపి నియోజకవర్గ కోఆర్డినేటర్ కృష్ణమూర్తిపై అసంతృప్తవాదులు నిలదీస్తున్న విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం అసంతృప్తవర్గంతో భేటీ అయిన కృష్ణమూర్తి గురువారం సాయంత్రంలోగా స్పష్టత ఇస్తామని చెప్పింది విధితమే.ఈ నేపథ్యంలో తనను అసమ్మతివర్గం సమావేశానికి ఆహ్వానించి అల్టిమేటం జారీ చేయడంపై కృష్ణమూర్తి మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం స్థానిక బిసి కార్పొరేషన్ ఛైర్మన్ పామిశెట్టి రంగనాయకులు నివాసానికి కృష్ణమూర్తితోపాటు టిడిపి నేతలు జెఇ వెంకటస్వామి, దేమకేతేపల్లి అంజినప్ప, నెట్టప్ప తదితరులు సుదీర్ఘంగా అసంతృప్తవర్గం డిమాండ్లపై చర్చలు సాగినట్టు సమాచారం. ఇందుకు పామిశెట్టి స్పందిస్తూ శేఖర్ వ్యవహారంపై కొద్దిరోజులుగా దుమారం రేగుతుండగా ఏదో ఒక విషయాన్ని స్పష్టం చేస్తే సబబుగా ఉంటుందని, ప్రధానంగా ఆయన్ను తొలగించారా లేదా అన్న వ్యవహారంపై బాలకృష్ణతో చెప్పిస్తే వివాదం సద్దుమణిగినట్టు అవుతుందని సూచించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీన్ని దృష్టిలో ఉంచుకుని నేటిలోగా బాలయ్యతో చర్చించి స్పష్టత తెలియచేస్తామని కృష్ణమూర్తి చెప్పినట్టు తెలుస్తోంది. ఇకపోతే గురువారం సాయంత్రం చిలమత్తూరు జడ్పీటీసీ లక్ష్మినారాయణరెడ్డి తదితర 40 మంది అసంతృప్త నాయకులు స్థానిక పాండురంగనగర్‌లోని కృష్ణమూర్తి ఇంటికి వెళ్లారు. అయితే కృష్ణమూర్తి జడ్పీటీసీ లక్ష్మినారాయణరెడ్డిని మాత్రమే బలవంతంగా లోపలికి తీసుకెళ్లి దాదాపు అరగంట సేపు మంతనాలు సాగించారు. తాను ఈ రోజు రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లి నేడు బాలకృష్ణ, టిడిపి అధిష్ఠానంతో చర్చించి వెంటనే స్పష్టం చేస్తానని అసంతృప్తవర్గాలకు హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. ఏదేమైనా 24 గంటల్లోగా శేఖర్ వ్యవహారంపై స్పష్టత ఇస్తామని చెప్పిన కృష్ణమూర్తి హైడ్రామా నడుమ గురువారం రాత్రి హైదరాబాద్‌కు పయనం కావడం చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో శివరాత్రికి బాలకృష్ణ ఇక్కడికి విచ్చేస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా తయారైంది.
మున్సిపల్ బడ్జెట్‌లో
పద్దుల కేటాయింపుపై సభ్యుల అసంతృప్తి
* రోడ్లు, కాలువల కేటాయింపులు పెంపు
అనంతపురంటౌన్, ఫిబ్రవరి 23: మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్‌లో పద్దుల కేటాయింపుపై సభ్యులు అసంతృప్తితో ఉన్నారు. గురువారం స్టాండింగ్ కమిటీ సభ్యుల పంతం మేరకు స్థానిక కౌన్సిల్ హాలులో స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నమూనా మున్సిపల్ బడ్జెట్ (మోడల్ మున్సిపల్ బడ్జెట్)ను చర్చించారు. కాని బడ్జెట్‌లో ప్రజా సంక్షేమం లోపించిందని స్టాండింగ్ కమిటీ సభ్యులు పలు అంశాలను ఎత్తిచూపుతూ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. 2017-18 సంవత్సరం బడ్జెట్ అంచనాల ముగింపు నిల్వను 1103.73 లక్షలుగా ప్రతిపాదించారు. నగరంలో అభివృద్ధి పనులకు 1048.54 లక్షలుగా కేటాయించారు. నూతన ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రారంభ నిల్వ అంచనా 398.53 లక్షలుగా తీసుకున్నారు. విద్యుత్ చార్జీలు, నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగాయని, ప్రభుత్వం నుండి కార్పొరేషన్‌కు వచ్చు ముఖ్య ఆదాయాలైన వినోద పన్ను, స్టాంప్ డ్యూటీపై సర్‌చార్జి తగ్గించిన కారణంగా రాబడి తగ్గిందని బడ్జెట్‌లో పేర్కొన్నారు. ప్రజారోగ్యానికి సంబంధించి నగరంలో సీజనల్ వ్యాధుల నిరోధానికి కేవలం రూ.5 లక్షలు కేటాయించారు. గత ఏడాది ఇందుకు 7 లక్షలు కేటాయించటం గమనార్హం. గత ఏడాది డెంగ్యూ, చికెన్‌గున్యా తదితర విష జ్వరాలు ప్రబలటంతో కోటి రూపాయలకు పైగా అత్యవసర పారిశుద్ధ్యం పనుల నిమిత్తం వ్యయం చేశారు. డెంగ్యూ వ్యాధి సోకి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇదే అంశాన్ని సభ్యులు ప్రస్తావించి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మేజర్ పార్కుల మరమ్మతు, నిర్వహణకు ఏకంగా రూ.110 లక్షలు కేటాయించారు. మొక్కల కొనుగోలు, పరిరక్షణ, డివైడర్ల సుందరీకరణకు రూ.40 లక్షలు కేటాయించారు. కాగా స్టాండింగ్ కమిటీ సమావేశం 10 గంటలకు. అరగంటకు పైగా కౌన్సిల్ హాలులో వేచి చూశా. అధికారులు తీరికగా 11 గంటలకు సమావేశానికి వచ్చారు. ఇలాగేనా సమావేశం నిర్వహించేది, దీనిపై వివరణ ఇవ్వాలని మేయర్ స్వరూప కార్పొరేషన్ కార్యదర్శి జ్యోతిలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి అధికారులే ఆలస్యంగా రావటంతో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. సమయపాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. దీనిపై డిఇఇలు షుకూర్, సురేంద్రనాథ్, కిష్టప్ప, ఆర్‌ఓ సుజాత, లక్ష్మిదేవి తదితరులు మాట్లాడుతూ 10గంటలకు సమావేశమైతే 10.15 నిమిషాలకు సమాచారం అందించారని తెలిపారు. దీనితో హడావిడిగా పరుగెత్తుకుని వచ్చామన్నారు. పత్రికలు చూసిన తర్వాత స్టాండింగ్ కమిటీ సమావేశం ఉన్నట్లు తెలిసిందన్నారు. దీనిపై కమిషనర్ సత్యనారాయణ స్పందిస్తూ సమావేశ వివరాలను ముందు రోజు ఎస్‌ఎంఎస్‌ల తర్వాత మెసేజ్ పంపాలన్నారు. దీనివలన సమాచారం అందించారన్న ఆధారం ఉంటుందన్నారు. అలాకాకుండా తీరా సమావేశం ముందు 10 నిమిషాలకు సమాచారం పంపటం సరికాదన్నారు.
గజవాహనంపై ఊరేగిన గరళకంఠుడు
అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 23: మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు మొదటి రోడ్డు శ్రీ కాశీవిశే్వశ్వర కోదండ రామాలయంలో కన్నుల పండువగా సాగుతున్నాయి. ప్రతి రోజు నిర్వహిస్తున్న వాహన సేవలో భాగంగా గురువారం గజ వాహనంపై ఊరేగుతూ గరళ కంఠుడు భక్తులకు దర్శనమిచ్చారు. కాశీవిశే్వశ్వర లింగానికి ఉదయం అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేసి విశేషాలంకారము గావించారు. సాయంత్రం విశాలాక్షి, అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశే్వశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను గజ వాహనంపై అలంకరించి మొదటి, రెండో రోడ్డుగుండా నగరోత్సవం నిర్వహించారు. కొట్టాలపల్లి గ్రామానికి చెందిన శ్రీ ఆంజనేయస్వామి భజన మండలి వారు భజన గీతాలు ఆలపించారు. అనంతరం చిన్మయ మిషన్ బ్రహ్మచారిణి ప్రపుల్ల మాతాజీ శివరాత్రి మహత్యమును వివరించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్ సంధ్యామూర్తి, వైస్ చైర్మన్ ఓబులేసు, సభ్యులు స్వప్న, కూరగాయల మాణిక్యం, శ్రీనివాసులు, నరసింహమూర్తి, ఆంజనేయులు, ఇఓ నాగేంద్రరావు, ప్రధాన అర్చకులు ఇంద్రకంటి ప్రసాద్‌శర్మ, అర్చకులు కె.కిషోర్, జి.కిషోర్, ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.
ఉద్యానవన జిల్లాగా మార్చేందుకు కృషి
* 1.71 లక్షల హెక్టార్లలో పంటల సాగు
* ఉద్యానవన శాఖ డిడి సుబ్బరాయుడు
మడకశిర, ఫిబ్రవరి 23 : ఉద్యానవన సముదాయ జిల్లాగా మార్చేందు కు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న ట్లు ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుబ్బరాయుడు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో 1,71,028 ఎకరాల్లో ఉద్యాన పంట సాగవుతున్నట్లు తెలిపారు. గురువారం మడకశిరలో విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో 1.22 లక్షల హెక్టార్లలో మామిడి, చీనీ, అర టి, దానిమ్మ, 58 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పూలతోటలు సాగవుతున్నట్లు తెలిపారు. దానిమ్మ తోటకు బ్యాక్టీరియా సోకడంతో సాగు విస్తీర్ణం తగ్గిందని, పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీ సుకుంటున్నట్లు తెలిపారు. అలాగే 32 వేల హెక్టార్లలో కూరగాయలు సాగవుతుండగా ఇందులో ఒక్క టమోటా మాత్రమే 17 వేల హెక్టర్లలో సాగు అవుతున్నట్లు చెప్పారు. 2016-17లో పండ్ల తోటల పెంపకానికి రూ.25.54 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మరో రూ. 10 కోట్లు కేటాయించాలని ప్రభుత్వా న్ని కోరినట్లు తెలిపారు. అలాగే 201 7-18 సంవత్సరానికి సంబంధించి రూ .56 కోట్లతో బడ్జెట్ అంచనాలు తయా రు చేసినట్లు చెప్పారు. సమగ్ర ఉద్యానాభివృద్ధి పథకం కింద రూ.26 కోట్లు, రాష్ట్ర కృషి విజ్ఞాన పథకం కింద రూ.8 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. జిల్లా లో రైతులను సమీకరించి 32 గ్రూపులను ఏర్పాటు చేయగా 7 వేల మంది సభ్యులు ఉన్నట్లు తెలిపారు. వీరికి ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, సబ్సిడీలకు ప్రాధాన్యత కల్పించి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. రైతులను మరింత అభివృద్ధి చేసేందుకు జిల్లా, మండల స్థాయిల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎడిలు రమణ, సుదర్శన్, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
* వందశాతం పన్నులు వసూలు చేయాలి
* మున్సిపల్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి
హిందూపురం టౌన్, ఫిబ్రవరి 23 : మున్సిపాలిటీల్లో 13వ ఆర్థిక సంఘం కింద మంజూరైన నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. మార్చి నెలాఖరులోపు సంబంధిత నిధులు వినియోగించుకోని పక్షంలో వెనక్కు వెళ్లే ప్రమాదం ఉందన్నారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులు పరిశీలించి కమిషనర్ విశ్వనాథ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో 13వ ఆర్థిక సంఘం కింద మంజూరైన నిధుల్లో రూ.18.19 కోట్ల వరకు ఇంకా ఆయా మున్సిపాలిటీల్లో వినియోగించాల్సి ఉందన్నారు. అనంతపురంలో రూ.2.45, రాయదుర్గంలో రూ.2, హిందూపురంలో రూ.2.09 కోట్ల నిధులు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. అదేవిధంగా జిల్లాలో 14వ ఆర్థిక సంఘం కింద రూ.42 కోట్ల నిధులు విడుదలైనట్లు తెలిపారు. ఇకపోతే ఆర్థిక సంవత్సరం ముగిస్తుండటంతో మున్సిపల్ కమిషనర్లు మున్సిపాలిటీల్లో ఆస్తి, నీటి తదితర పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 55 శాతం పన్నులు మాత్రమే వసూలైనట్లు చెప్పారు. జిల్లాలోని మున్సిపాలిటలు, నగర పంచాయతీల నుండి రూ.66 కోట్ల పన్నులు వసూలు కావాల్సి ఉండగా అందులో రూ.33.31 కోట్లు వసూలైనట్లు తెలిపారు. అయితే అన్ని మున్సిపాలిటీల్లోనూ గతం కంటే ప్రస్తుతం పన్నుల వసూలు బాగా మెరుగుపడిందన్నారు. హిందూపురం మున్సిపాలిటీలో 13వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం తప్ప మిగిలిన అన్ని విభాగాల్లో మెరుగైన ఫలితాలే కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఇకపోతే రాష్ట్రంలోనే 110 మున్సిపాలిటీల్లోనూ ఇఆర్‌పి కింద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగిత రహిత పరిపాలన నిర్వహించడమే ధ్యేయంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం ఇంజినీరింగ్ విభాగం, రెవెన్యూ విభాగం ఉద్యోగులతో సమావేశమై అభివృద్ధి పనులు, పన్నుల వసూళ్లు తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఇఆర్‌పి నోడల్ అధికారి ప్రదీప్‌కుమార్, మున్సిపల్ ఇంజనీర్ రమేష్, డిఇఇలు ఈశ్వరయ్య, వన్నూరస్వామి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
లత్తవరం చెరువుకు కృష్ణాజలాల పంపింగ్
ఉరవకొండ, ఫిబ్రవరి 23 : హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టులోని హంద్రీనీవా కాలువ నుంచి లత్తవరం చెరువుకు గురువారం కృష్ణాజలాలను పంపింగ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ హంద్రీనీవా కాలువలో నిలిచి ఉన్న నీటిని మోటార్ల ద్వారా పంపింగ్ చేసి లత్తవరం, లత్తవరం తండా, షెక్షానుపల్లి చెరువులకు నీటిని మళ్లించినట్లు తెలిపారు. భూగర్భజలాలు పెంచడానికి నీటిని పంపింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో మండల టిడిపి కన్వీనర్ భాస్కర్, ఎంపిపి సుంకరత్నమ్మ, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ శంకరప్ప, పట్టణ టిడిపి అధ్యక్షులు రామంజినేయులు, విడపనకల్లు ఎంపిపి దాసరి ప్రతాప్ నాయుడు, పెద్దకొట్టాలపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు భీమలింగ, చిన్నమారెయ్య, మాజి జెడ్పిటిసి గుర్రం సుధాకర్, మాజీ సర్పంచ్ లత్తవరం గోవిందు, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

ప్రయాణికులకు మెరుగైన సేవలు
* రైల్వే జిఎం వినోద్‌కుమార్‌యాదవ్
ధర్మవరం టౌన్, ఫిబ్రవరి 23: రైల్వే ప్రయాణీకులకు మెరుగైన సేవలందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రైల్వే జిఎం వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. గురువారం స్థానిక రైల్వే స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లను, పరిసర ప్రాంతాలను తనిఖీ చేసి అలాగే బోగీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సిబ్బంది చూడాలని, బోగీలను పరిశుభ్రంగా వుంచాలన్నారు. ప్రయాణీకుల భద్రతకు కూడా పెద్ద పీట వేస్తున్నామని, అందుకు అనుగుణంగా సాంకేతికతను ఉపయోగించుకోవడంతోపాటు ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు డిఆర్‌ఎం అమితాజ్ ఓజా, ధర్మవరం ఎస్‌ఎం మధుసుదన్‌రావు, టిసిఎం గణేశ్వర్‌రావ్ పాల్గొన్నారు.
గడ్డివామికి నిప్పుపెట్టిన యువకుడిపై దాడి - మృతి
ముదిగుబ్బ, ఫిబ్రవరి 23: ఒక వ్యక్తిపై కక్షతో గడ్డివామికి నిప్పు పెట్టగా గ్రామస్థులు నిప్పుపెట్టిన ప్రకాష్ అలియాస్ ఏబు (25)పై దాడి చేశారు. ఈ దాడిలో ప్రకాష్ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. గురువారం కదిరి డిఎస్పీ వెంకట రామాంజినేయులు, నల్లమాడ సిఐ శివరాముడు తెలిపిన వివరాలిలా వున్నాయి. ఉప్పలపాడుకు చెందిన సుబ్బారెడ్డి అనే రైతు వద్ద ప్రకాష్ కూలీ పనికి వెళ్లేవాడని, అయితే అతను తరచూ చోరీలకు పాల్పడేవాడని, మూడు నెలల క్రితం కూడా సుబ్బారెడ్డి ట్రాక్టర్‌కు సంబంధించిన బ్యాటరీతోపాటు మరికొన్ని పరికరాలు దొంగలించగా అతన్ని మందలించడం జరిగింది. అనంతరం ప్రకాష్ గ్రామం వదిలి వెళ్లిపోయాడు. తిరిగి రెండు రోజుల క్రితం గ్రామంలోకి వచ్చి బుధవారం సాయంత్రం పాత సంఘటన కారణంగా సుబ్బారెడ్డి, అతని అనుచరులు మందలించారు. ఈ సందర్భంగా వారి మధ్య వాదోపవాదనలు జరిగాయి. దీంతో కోపోద్రికుడైన ప్రకాష్ సుబ్బారెడ్డి, ఇతరులకు చెందిన గడ్డివాములకు నిప్పు పెట్టగా అవి పూర్తిగా కాలిపోయాయి. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు ప్రకాష్‌ను పట్టుకొని చావబాదడంతో తీవ్ర గాయాలై అక్కడే మృతి చెందాడు. ఈమేరకు మృతుడి సోదరుడు పెద్దన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు వారు తెలిపారు.
పలువురిపై కేసు నమోదు...
ఉప్పలపాడు సంఘటనకు సంబంధించి అదే గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి తదితరులతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు ముదిగుబ్బ ఎస్‌ఐ జయానాయక్ తెలిపారు. నిందితులందరూ పరారీలో వున్నారని, త్వరలోనే పూర్తి స్థాయిలో విచారణ చేసి అసలైన నిందితులను అరెస్ట్ చేస్తామని ఆయన తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
తాడిపత్రి, ఫిబ్రవరి 23: మండల పరిధిలోని గంగాదేవిపల్లిలో గురువారం పురుగుల మందు తాగి సంజప్ప(40) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూరల్ ఎస్సై నారాయణరెడ్డి తెలిపిన వివరాలమేరకు గంగాదేవిపల్లిలో అంత్రాలు వేసుకొని జీవించే సంజప్ప దురలవాట్లకు బానిసై అప్పులు ఎక్కువగా చేససుకుని తీర్చలేక గురువారం తెల్లవారుజామున గంగాదేవిపల్లి నుంచి బుగ్గకు వెళ్లే దారిలో మద్యంలో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడినాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
కుందుర్పి, ఫిబ్రవరి 23 : భార్య వైద్యానికి డబ్బులు లేక మనస్థాపానికి గురైన భర్త తిప్పేస్వామి (45) ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం బండమీదపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసుస్టేషన్ జమేదార్ రమణ అందించిన సమాచారం మేరకు బండమీదపల్లికి చెందిన బలిజ తిప్పేస్వామి తన భార్య 6 నెలలు నుంచి అనారోగ్యంగా ఉండడంతో ఆసుపత్రికి తీసుకెళ్లడానికి డబ్బులు లేవు. దీంతో మనస్థాపానికి గురై గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని శవాన్ని పొస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆటో బోల్తా.. ఒకరి మృతి
గుమ్మఘట్ట, సెప్టెంబర్ 23 : మండలంలోని అడిగుప్ప గ్రామ సమీపంలో గురువారం ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందారు. 14 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాయదుర్గం నుంచి తాళ్లకెరకు 15 మందితో వెళ్తున్న ఆటో అడిగుప్ప దగ్గర అదుపు తప్పి బోల్తా పడింది. వెంటనే క్షతగాత్రులను రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ నాయకుల హనుమక్క (70) పరిస్థితి విషమించి మృతి చెందారు. ఐదుగురిని బళ్లారి తరలించారు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు. ఘట నా స్థలానికి చేరుకున్న ఎస్సై హైదర్‌వలి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నేడు సిపిఎం నేత రాఘవులు రాక
అనంతపురం అర్బన్, ఫిబ్రవరి 23: సిపిఎం జాతీయ నాయకులు రాఘవులు నగరానికి రానున్నారని జిల్లా పెన్షనర్ల సంఘం అధ్యక్షులు పెద్దన్నగౌడ్ తెలిపారు. గురువారం స్థానిక ఎన్‌జివో హోమ్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉదయం 11గంటలకు పోలీస్ కాంప్లెక్స్‌లోని సిద్ధార్ధ ఫంక్షన్ హాల్‌లో 25 ఏళ్ల సంస్కరణలు- వివిధ తరగతులపై వాటి ప్రభావం అన్న అంశంపై సదస్సులో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని కార్మిక సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా ఎఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి రాజామోహన్, సిఐటియు రాష్ట్ర కమిటీ మెంబర్ మల్లికార్జున హాజరయ్యారు.
విద్యార్థులు పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలి
అనంతపురం సిటీ, ఫిబ్రవరి 23:విద్యార్థులు పోటీతత్వాన్ని పెంపొందించుకుంటే భవిష్యత్తులో రాణిస్తారని డిఇఓ పి.లక్ష్మినారాయణ పేర్కొన్నారు. సృజనోత్సవంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్, వక్తృత్వ పోటీలను సైన్సు సెంటర్ నందు జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిఇఓ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు తమ జ్ఞానాన్ని అంతర్జాలంతో అనుసంధానం చేసుకుని, ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా మెలగాలని పిలుపునిచ్చారు. అనంతరం సైన్సు క్యూరేటర్ నాగరాజు మాట్లాడుతూ సృజనోత్సవంలో భాగంగా నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు రాష్టస్థ్రాయిలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం డిఇఓ జిల్లాస్థాయి పోటీల్లో గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్థులకు సర్ట్ఫికెట్లు, బహుమతులను అందజేసారు.
అవినీతి వ్యతిరేక పోరాట కమిటీ
నియామకం
అనంతపురం అర్బన్, ఫిబ్రవరి 23: జిల్లా వైద్య, విద్య, వైద్య, సామాజిక హక్కుల అవినీతి వ్యతిరేక పోరాట కమిటీని నియామకం చేసినట్లు అవినీతి వ్యతిరేక పోరాట కమిటీ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు రాయల్ కొండయ్య తెలిపారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు.
గౌరవ సలహాదారుగా రవీంధ్రనాథ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులుగా రాయల్ కొండయ్య, ఉపాధ్యక్షులుగా మయూరి రంగస్వామి, తిరుపాలు, ప్రధాన కార్యదర్శి రాజు, సంయుక్త కార్యదర్శులు శేఖర్, నాగరత్నమ్మ, కోశాధికారి సురేష్, కార్యవర్గ సభ్యులుగా అమర్‌నాథ్, మహేష్‌బాబు, వన్నూరు, షెక్షావలి, రాము, రమేష్, నాగరాజు, రాజేష్‌లను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. వ్యవస్థాపక అధ్యక్షులు జాకీర్‌హుసేన్ పాల్గొన్నారు.

ఎస్కేయూ ఇంజినీరింగ్ కాలేజి
పరీక్షల ఫలితాలు విడుదల
అనంతపురం సిటీ, ఫిబ్రవరి 23: ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి, రెండవ, మూడవ, నాల్గవ సంవత్సరాల మొదటి సెమిష్టర్ పరీక్షల ఫలితాలు గురువారం ఎస్కేయూ విసి ఆచార్య కె.రాజగోపాల్ విడుదల చేశారు. ఇందులో మొదటి సంవత్సరంలో 287 మంది విద్యార్థులకు 147 మంది ఉత్తీర్ణత సాధించారని, రెండవ సంవత్సరంలో 306 మందికిగాను 194 మంది ఉత్తీర్ణత సాధించారని, మూడవ సంవత్సరంలో 319 మందికిగాను 261 మంది ఉత్తీర్ణత సాధించారని, నాల్గవ సంవత్సరంలో 250మందికిగాను 222 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. మొత్తం 1162 మందికిగాను 824 ఉత్తీర్ణతతో 70.91 శాతం సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్కేయూ రెక్టార్ ఆచార్య లజపతిరాయ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.సుధాకర్‌బాబు, ఇంజినీరింగ్ కాలేజి ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.