అనంతపురం

హర హర మహాదేవ...శంభోశంకర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 24:మహాశివరాత్రి వేడుకలు నగరంలో వైభవంగా నిర్వహించారు. నగరంలోని భక్తులు శుక్రవారం ఉదయం నుండి ఆలయాలకు క్యూకట్టడంతో ఆలయాలు శివరాత్రి శోభను సంతరించుకున్నాయి. హర హర మహాదేవ...శంభోశంకర అంటూ భక్తులు పరమ శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఓం నమశ్శివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ భక్తిశ్రద్దలతో పూజలు చేశారు. ఆలయాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగాయి. అదేవిధంగా మహాశివరాత్రిని పురస్కరించుకుని వివిధ ఆలయాల్లో శివపార్వతుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆది దంపతులైన శివపార్వతుల కల్యాణం వీక్షించిన భక్తులు తరించారు. మొదటి రోడ్డు శ్రీ కాశీవిశే్వశ్వర కోదండ రామాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి అభిషేకాలు, పూజలు చేసి స్వామివారిని విశేషంగా అలంకరించారు. ప్రతిరోజు నిర్వహిస్తున్న వాహన సేవలో భాగంగా విశాలాక్షి, అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశే్వశ్వరస్వామి వారిని నందివాహనంపై అలంకరించి ఊరేగించారు. ఊరేగింపు ముందు నిర్వహించిన గురవయ్యల నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సాయంత్రం నుండి శివునికి యామ పూజలు నిర్వహించారు. అర్ధరాత్రి నిర్వహించిన కల్యాణోత్సవం నేత్రానంద భరితంగా సాగింది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అదేవిధంగా పాతూరు శ్రీ విరూపాక్షేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివలింగ దర్శనం కోసం భక్తులు బారులుతీరారు. శివకోటి ఆలయం, గీతామందిరం, తపోవనం చిన్మయ జగదీశ్వర ఆలయం, ఆరోరోడ్డు అమృతలింగేశ్వర ఆలయం, హెచ్చెల్సీ కాలనీలో కెనాల్ పక్కన వెలసిన ధర్మస్థల శ్రీ మంజునాథ అన్నపూర్ణేశ్వరి దేవస్థానం, పంచలింగేశ్వర ఆలయం, ఆజాద్ నగర్ శ్రీకాశీవిశే్వశ్వర ఆలయం, అరవింద నగర్ సర్వేశ్వర ఆలయం, మారుతినగర్, లక్ష్మీనగర్‌లలోని శివలాయాలతోపాటు వివిధ ఆలయాల్లో ప్రతిష్ఠింపబడిన శివలింగాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలలో పాల్గొన్నారు. మూడోరోడ్డులోని జిఆర్.్ఫంక్షన్‌హాలులో అనంత శివారాధన సమితి ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాశీవిశే్వశ్వర లింగానికి పంచామృతాభిషేకము, లక్షబిల్వార్చన, భక్తులచే సామూహిక జలాభిషేకము నిర్వహించారు. ఈసందర్భంగా భజన గీతాలు, కీర్తనలు ఆలపించారు. రాత్రి జరిగిన శ్రీ గిరిజాకల్యాణానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. పాతూరు శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రూ.20 లక్షల కొత్త కరెన్సీతో శివలింగాన్ని అలంకరించి పూజలు చేశారు. బ్రాహ్మణవీధి శ్రీ శివగణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వజ్ర కవచ శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజలు చేశారు. కృష్ణకళామందిర్‌లో ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారీ సంఘం ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు శివ బాబా జయంతి వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా పుష్పాలతో శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. నగరంలో సర్వధర్మ ర్యాలీ నిర్వహించి అనంతరం సదస్సు నిర్వహించారు. నగరంలో భక్తులు రాత్రంతా జాగరణ చేస్తూ వివిధ ఆలయాల్లో జరుగుతున్న శివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిపై
ఉత్కంఠ!
* నామినేషన్లకు మూడు రోజులే గడువు..
* అంతుపట్టని టిడిపి అధిష్టానం మనోగతం

అనంతపురం, ఫిబ్రవరి 24 : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా నుంచి ఎవరు బరిలో ఉంటారనే నేతల మధ్య ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో అత్యధిక ఓటర్లు టిడిపికే ఉండటంతో అధిష్టానం ఎవరికి సీటు కేటాయిస్తుందో అన్న విషయం అంతుపట్టడం లేదు. గత శనివారం విజయవాడలో నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో కూడా ఈ విషయం చర్చకు రాలేదు. దీనిపై ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌రెడ్డి ప్రస్తావించినప్పటికీ సోమవారం మాట్లాడుదామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే ఈనెల 26న విజయవాడలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఈనెల 26న టిడిపి పొలిట్‌బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 14 నోటిఫికేషన్ విడుదల కావడంతో 21న రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ రోజు నుంచి నిన్నటి వరకూ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నామినేషన్ల స్వీకరణకు ఈనెల 28 అఖరుతేదీ. అంటే రేపటి నుంచి కేవలం మూడు రోజు లు మాత్రమే గడువు ఉంది. అయినా ఇప్పటి వరకు జిల్లాలో అభ్యర్థి ఎవరన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికీ తేల్చడం లేదు. కాగా సిట్టింగ్ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డితోపాటు తాడిపత్రి ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి అల్లుడు దీపక్‌రెడ్డి ఎమ్మెల్సీ సీటును ఆశిస్తున్నారు. రాయదుర్గంలో పార్టీ పటిష్టత కోసం కృషి చేసిన తమ అల్లుడికే అవకాశం ఇవ్వాలని ఇప్పటికే జెసి సోదరులు ముఖ్యమంత్రికి విన్నవించారు. మరోవైపు జిల్లా టిడిపి సీనియర్ నాయకుడు గెడ్డం సుబ్రహ్మణ్యం గత శనివారం జిల్లా సమీక్ష సమావేశం సందర్భంగా సిఎంతోపాటు రాష్ట్ర పార్టీ నేత కళా వెంకట్రావును కోరారు. వీరితో పాటు మాజీ జడ్పీ చైర్మన్, గుంతకల్లుకు చెందిన కెసి నారాయణ సైతం అవకాశం ఇవ్వాలని సిఎంను కోరుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై జిల్లా టిడిపి నేతలు కూడా ఏమీ వెల్లడించడం లేదు. అధిష్టానం నిర్ణయమే తమకు శిరోధార్యమంటూ చెబుతున్నారు. కాగా ఈనెల 28తో నామినేషన్ల గడువు ముగియగానే, మరుసటి రోజు మార్చి 1న నామినేషన్ల పరిశీలన, 3వ తేదీ ఉపసంహరణకు అఖరుగా ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
1281 మంది ఓటర్లు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి 1281 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 547, మహిళా ఓటర్లు 734 మంది ఉన్నారు. జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్లవారీగా చూస్తే ధర్మవరంలో మొత్తం 144 మంది ఉండగా, పురుషులు 66, మహిళలు 78 మంది ఉన్నారు. కదిరి డివిజన్ పరిధిలో 194 మందికి పురుషులు 72, మహిళలు 122, పెనుకొండ డివిజన్‌లో పురుషులు 120, మహిళలు 143, కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్‌లో పురుషులు 97, మహిళలు 122, అనంతపురం డివిజన్‌లో అత్యధికంగా పురుషులు 192, మహిళలు 269 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరికీ ఒక్కో డివిజన్‌లో ఒక్కో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు.

కలిసి పని చేద్దాం..
* అసంతృప్త నేతలకు ఎమ్మెల్యే బాలయ్య ఫోన్
హిందూపురం, ఫిబ్రవరి 24 : ‘ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే మరిచిపోండి.. త్వరలో అన్ని విషయాలు చర్చించుకుని పరిష్కరించుకుందాం’ అంటూ నియోజకవర్గంలోని అసంతృప్త నేతలకు ఎమ్మెల్యే బాలకృష్ణ ఫోన్ చేసినట్లు సమాచారం. కొద్దిరోజులుగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో అసంతృప్తవర్గం తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం విధితమే. ఇందులో భాగంగానే నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా ఇటీవల నియమితులైన కృష్ణమూర్తికి సైతం అసంతృప్త జ్వాలలు తగిలాయి. దీంతో శుక్రవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసానికి వెళ్లి కృష్ణమూర్తి మంతనాలు సాగించారు. ప్రధానంగా వ్యక్తిగత కార్యదర్శి కనుమూరి శేఖర్ వ్యవహారంపై అసంతృప్తవర్గం తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తోందని బాలయ్యతో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీనికి తోడు పలు సమస్యలపై చర్చించినట్లు సమాచారం. ఈ విషయాలపై ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించి మాజీ ఎమ్మెల్యే సిసి వెంకట్రాముడు, టిడిపి నేత అంబికా లక్ష్మీనారాయణకు ఫోన్ చేసి చర్చించినట్లు తెలుస్తోంది. నాలుగైదు రోజుల్లో తాను రావడమో, లేక మీరు ఇక్కడికి రావడమో నిర్ణయించి పార్టీలో నెలకొన్న సమస్యలు కూలంకషంగా చర్చిద్దామని, అప్పటి వరకు ఎలాంటి అసంతృప్త సమావేశాలు, కార్యకలాపాలు వద్దని సూచించినట్టు సమాచారం. ఇతరుల వల్ల పొరపాట్లు జరిగి ఉంటే మరచిపోండని, త్వరలోనే అన్ని విషయాలపై చర్చించి భవిష్యత్తులో కలిసికట్టుగా పనిచేయాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ వ్యవహారంపై తానే చెబుతానని సూచించినట్టు సమాచారం. శేఖర్‌ను తొలగించినట్టు బాలకృష్ణ స్వయంగా చెప్పాలని ఓ వైపు అసంతృప్తవర్గం కోరుతుండగా మరోవైపు ఈ విషయంపై స్పష్టత రాకపోవడం చర్చనీయాంశమవుతోంది. అయితే శనివారంలోపు బాలకృష్ణ శేఖర్ వ్యవహారంపై స్వయానా మీడియాకు చెబుతారని అసమ్మతి వర్గం భావిస్తోంది.
కార్పొరేషన్‌లో అన్నింటికీ కలెక్టర్ మంత్రం!
* నేను చెప్పలేదు:కలెక్టర్ కోన శశిధర్
అనంతపురంటౌన్, ఫిబ్రవరి 24: కార్పొరేషన్‌లో వర్గపోరు కొత్తరూపుదాల్చింది. నేతల వర్గపోరులో అన్నింటికి కలెక్టర్ నామమంత్రం జపిస్తున్నా రు. ఎవరినైనా ఇబ్బంది పెట్టాలన్నా, ఏ పనియైనా చేయించుకోవాలన్నా కలెక్టర్ పేరు చెపితే చాలు ఇట్లే పనులు జరుగుతాయి. ఆగిపోతాయి. కార్పొరేషన్‌లో కాంట్రాక్టర్ల బిల్లులు కలెక్టర్ ఆదేశాలతో విచారణ కారణంగా చెల్లింపులు ఆగిపోయాయి. దీనితో ఇదే అవకాశంగా తీసుకుని ఇరువర్గాలు కలెక్టర్ పేరు వాడుకోవటంలో పోటీలు పడుతున్నారు. ఇది అధికారవర్గాలకు ఇబ్బ ంకరంగా మారింది. ఔనంటే కలెక్టర్ తో చీవాట్లు, కాదంటే నేతలతో బెదరింపులు ఎదురవుతుండటంతో అధికారు లు నలిగిపోతున్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కార్పొరేషన్‌లో కాంట్రాక్ట్‌వర్కర్స్‌ను తొలగించటం, బదిలీ చేయించటంలో ఒక ముఖ్యనేత ప్రమేయం ఉండటం మరో వర్గానికి మింగుడుపడటం లేదు. వర్కర్ల కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని తొలగించినవారికి న్యాయ ం జరిగేలా చూడాలన్న మరో వర్గం నేత పట్టుదలతో వ్యవహరిస్తోంది. కలెక్టర్‌తో ఇరువర్గాల నేతలు వెళ్ళి చర్చిద్దామంటో మరో వర్గం నేత కుంటిసాకులు చెప్పి తప్పించుకోవటంతో ఇది ఆ నేత నిర్వాకమేనన్న అం శం ఢంకా భజాయించి చెబుతున్నా రు. కమిషనర్ సురేంద్రబాబుపై దాడి ఘటన, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన ఏడు కోట్ల రూపాయల బిల్లులలో బోగస్2 ఉన్నాయన్న ఒక వర్గం ఫిర్యాదులతో కలెక్టర్ శశిధర్ పబ్లిక్‌హెల్త్ ఎస్.ఇతో విచారణ జరిపించారు. ఇదే అవకాశంగా తీసుకుని కార్పొరేషన్‌లో అయినదానికి, కానిదానికి కూడా కలెక్టర్ 3బూచి2ని చూపుతూ మరోవర్గం కార్యం చక్కబెడుతోంది. అధికారులు సైతం కలెక్టర్ పేరును వాడుకుంటూ పనులు చక్కబెడుతున్నారు. తాజాగా గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశానికి కలెక్టర్ పేరుచెప్పి పాత్రికేయులకు కార్పొరేషన్ కార్యదర్శి జ్యోతిలక్ష్మి అనుమతి నిరాకరించారు. ఇదే అంశాన్ని పత్రికలలో ప్రధాన హెడ్డింగులతో రావటంతో కలెక్టర్ స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేర కు సమాచారాన్ని డిపిఆర్‌ఓ జయమ్మ శుక్రవారం ఫోనుద్వారా విలేకరులకు తెలిపారు. ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి స్టాండింగ్ కమిటీ సమావేశానికి విలేకరులను అనుమతించవద్దని కలెక్టర్‌గా ఆదేశాలు జారీ చేయలేదన్నా రు. అనవసరంగా తన పేరును వాడుకుని కార్పొరేషన్ అధికారులు దుర్వినియోగపరచటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన కార్పొరేషన్ అధికారుల బరితెగింపుకు నిదర్శనంగా నిలుస్తోంది. మేయర్ స్వరూప సైతం అధికారుల తప్పిదాలకు వత్తా సు పలుకుతూ చంద్రబాబు కూడా ఇటీవలి సమావేశాలలో పత్రికలకు దూరంగా ఉండాలని సూచించినట్లు గురువారం విలేకరులకు తెలిపారు. అధికారపార్టీ నేతలలో సఖ్యత కొరవడి చీటికిమాటికి ఘర్షణకు దిగుతుండటంపై పత్రికలలో కథనాలు రావటంతో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధానిలో అనంతపురం జిల్లాలోని వివిధ నియోజకవర్గ నేతలతో ప్రత్యేకంగా సమావేశమై వర్గనేతలకు 3స్పెషల్ క్లాస్2 పీకారు. సి.ఎం చీవాట్లను బేఖాతర్ చేస్తూ నాయకులు తలోదారిన వెళుతున్నారు. తమ మాటే నెగ్గాలన్న ధోరణితో పంతాలకు పోవటంతో అధికారులు ఈ అవకాశాన్ని అలుసుగా తీసుకుని తాము ఆడింది ఆట పాడింది పాట అన్న చందాన సాగుతున్నారు.

భక్తులతో పోటెత్తిన
బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం
తాడిపత్రి, పిబ్రవరి 24:పెన్నానది ఒడ్డున నిత్యస్వచ్చ గంగారిష్టుడై వెలసియున్న శ్రీబుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పునస్కరించుకుని భక్తుల హరిహర శంభోశంకర శివనామస్మరణతో మారుమ్రోగంది. తెల్లవారుఝాము నుంచే భక్తుల తాకిడితో బుగ్గరామలింగేశ్వరస్వామి దేవాలయం కిటకిటలాడింది. మహాశివరాత్రిని పునస్కరించుకుని శ్రీబుగ్గరామలింగేశ్వరస్వామి, శ్రీరాజరాజేశ్వరీదేవిలకు పంచామృత, క్షీరాభిషేకాలు, జలాభిషేకాలు, బిల్వార్చనలుగావించి విశేషపుష్పాలతో సుందరంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనార్థం భక్తులకు ప్రత్యేక బ్యారికేడ్లు నిర్మించారు. ఆలయం వెలుపలి ధ్వజస్తంభంపై శివరాత్రి సందర్బంగా అర్దరాత్రి 11గంటలకు వెలగించే శివజ్యోతిని, అనంతరం 12గంటలకు లింగోద్బవకాల అభిషేకాన్ని భక్తులందరూ తిలకించేల ఆలయ ప్రాంగణములో స్క్రీన్‌టీవిలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా డిఎస్పీ చిదానందరెడ్డి ఆదేశాలమేరకు పట్టణ సిఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా బుగ్గరామిలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లోభాగంగా ఆరవరోజు మహాశివరాత్రిని పునస్కరించుకుని బుగ్గరామలింగేశ్వరుడు నందివాహనంపై దర్శనమిచ్చారు. నందివాహనంపై సుందరంగా అలంకృతుడైన బుగ్గరామలింగేశ్వరున్ని మంగళవాయిద్యాలతో పురవీధుల్లో ఊరేగించారు.
గాలిమరలు, సోలార్‌లలో
రైతులను భాగస్వామ్యం చేయాలి
* ‘కార్పొరేట్’ కోసమే నోట్ల రద్దు..
* బుద్ధి పూర్వకంగానే మభ్య పెడుతున్న మోదీ
* ఆలిండియా సిఐటియు ఉపాధ్యక్షుడు బివి రాఘవులు
హిందూపురం, ఫిబ్రవరి 24 : గాలిమరలు, సోలార్ సంస్థల ఏర్పాటుల్లో భూములు ఇచ్చిన రైతులను భాగస్వాములను చేయాలని ఆలిండియా సిఐటియు ఉపాధ్యక్షులు బివి రాఘవులు డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం హిందూపురంలో రోటరీక్లబ్ ఆవరణలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కరవు పీడిత జిల్లా అనంతపురాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రకృతి వనరులను సైతం దోచుకుని అన్యాయం చేస్తోందన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక, ప్రణాళికేతరాల కింద అభివృద్ధి పనులకు నిధులు కేటాయించేదని, తద్వారా వెనుబడిన రాయలసీమ, ఉత్తరాఖండ్, ఉత్తరాంచల్ వంటి ప్రాంతాలకు న్యాయం జరిగేదన్నారు. అయితే ప్రస్తుతం ఒకే విధానం ద్వారా నిధుల కేటాయింపు జరుగుతున్నందున వెనుబడిన ప్రాంతాల అభివృద్ధి ‘ఎక్కడ వేసిన గొంగళి’ అక్కడే అన్న చందంగా తయారైందన్నారు. అధికారంలోకి రాక మునుపు పేదల సంక్షేమమే ధ్యేయమని ప్రగల్బాలు పలికిన ప్రధాని మోదీ ప్రధాని అయ్యాక కార్పొరేట్ సంస్థలకు విధేయుడిగా పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. అంతేగాకుండా పెద్దనోట్ల రద్దుపై సర్జికల్ దాడి చేశామంటూ ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. పెద్దనోట్ల రద్దుతో నల్లధనం, ఉగ్రవాదం, హవాలా వంటి అసాంఘిక కార్యకలాపాలను అణచివేస్తామని గొప్పలు చెప్పుకున్న మోదీ ఏం సాధించారని ప్రశ్నించారు. బుద్ధి పూర్వకంగానే దేశభక్తి పేర పెద్దనోట్ల రద్దు సందర్భంగా సంయమనం పాటించండని ప్రజలను మోసగించారన్నారు. కార్పొరేట్ సంస్థలకు కమీషన్ పేర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకే నోట్ల రద్దు దోహద పడిందన్నారు. త్వరలో జరగబోవు శాసనమండలి ఎన్నికల్లో ప్రజలను మోసగిస్తున్న టిడిపి, బిజెపి కూటమిని, కాంగ్రెస్, వైకాపాకు బుద్ధి చెప్పాలన్నారు.
నిత్యం ప్రజా సమస్యలపై అంకితభావంతో పనిచేస్తున్న వామపక్షాల పార్టీల అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా డాక్టర్ గేయానంద్ తరపున ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులతో రాఘవులు ప్రత్యేకంగా చర్చించి ఘన విజయం తెచ్చి పెట్టాలని కోరారు. ఈ సమావేశంలో రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్ ఓబులు, ఓపిడిఆర్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు, సిఐటియు రాష్ట్ర నాయకులు ఇంతియాజ్, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఇటి రామ్మూర్తి, రైతు సంఘం నాయకులు ధనాపురం వెంకట్రామిరెడ్డి, నాయకులు రాజశేఖర్, రామకృష్ణ, ఎన్‌జిఓ నాయకులు జమ్మన్న, సిఐటియు నాయకులు జడ్పీ శ్రీనివాసులు, సూపర్‌బి శ్రీనివాసులు, ముస్లిం నగారా నాయకులు ఉమర్‌ఫరూఖ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా శ్రీ్భగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి
పామిడి, ఫిబ్రవరి 24 : శ్రీ్భగేశ్వరస్వామి దేవాలయంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి క్రిష్ణయ్య, ధర్మకర్తల మండలి చైర్మెన్ సురేష్‌కుమార్ ఆద్వర్యంలో శుక్రవారం మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని అర్చకులు వేకువజామున గణపతి పూజ పుణ్యహావాచనము, ఏకవారదశవార రుద్రాభిషేకం, మద్యాహ్నాం మహాన్యాసపూర్వక ఏకాదశవార రుద్రాభిషేకాన్ని చేపట్టారు. అనంతరం శ్రీ భోగేశ్వరస్వామిని నీలకంటేశ్వరుడుగా అలంకరణ చేశారు. ఆలయంలోని మూలవిరాట్ శ్రీ భోగేశ్వరస్వామి ఎన్నో మహిమలను కనబరిచారని భక్త్భివంతో స్వామిని దర్శించుకుంటే అనుకున్నవన్నీ నెరవేరుతాయన్న నమ్మకంతో వేకువజాము నుండే భక్తులు దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలను చేపడుతూ స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. వేలాదిమంది భక్తుల రద్దీతో శ్రీ భోగేశ్వరస్వామి దేవాలయం కిటకిటలాడగా వారు చేసిన శివనామస్మరణ మారుమ్రోగింది. శ్రీ భోగేశ్వరస్వామికి అభిషేకార్చనలు చేపట్టిన అర్చకులు, భక్తులంతా కలిసి ప్రత్యేక వెండి రథాన్ని రకరకాల పూలతో అలంకరించి రాత్రి విధ్యుత్ దీపాల వెలుగులో స్వామి వారితో పాటు అమ్మవారి ఉత్సవ విగ్రహాలను పురవీధుల గుండా ఊరేగించారు. దేవాలయంలో నీలకంటేశ్వరుడుగా దర్శనమిచ్చిన శ్రీ భోగేశ్వరస్వామికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి కృఫకు పాత్రులయ్యారు. అంతకుమునుపు ముగ్గుల పోటీలను నిర్వహించగా మహిళలు, బాలికలు రంగు రంగుల ముగ్గులను వేయటంతో పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు.

మున్సిపల్ కార్మికుడి ఆత్మహత్య
మడకశిర, ఫిబ్రవరి 24 : నగర పంచాయతీలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న కార్మికుడు నరసింహమూర్తి (32) శుక్రవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నరసింహమూర్తి 12 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తుండగా గతనెల 22న వాల్మీకి సర్కిల్ వద్ద సుజల స్రవంతి ప్లాంట్ ఏర్పాటుకు చేస్తుండగా సంబంధిత కాంట్రాక్టర్ ఎక్కడో సెల్‌ఫోన్‌ను పోగొట్టుకుని తాను ఈ ప్లాంట్ వద్దే పోగొట్టుకున్నానని, దాన్ని నివే తీసుకున్నామని, వెంటనే ఇవ్వాలని, లేనిపక్షంలో కేసు నమోదు చేయించి ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరింపులకు గురి చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నరసింహమూర్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం బెంగళూరుకు తరలిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నరసింహమూర్తి మృతికి కారణమైన వ్యక్తిపై కేసు నమోదు చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేపట్టనున్నట్లు కార్మిక సంఘం నాయకులు తెలిపారు.
ఆర్టీసీ కండక్టర్ అనుమానాస్పద మృతి
కదిరి, ఫిబ్రవరి 24:కదిరి ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న జానకీపతిరెడ్డి (50) అనుమానాస్పదంగా శుక్రవారం మృతి చెందారు. జానకీపతిరెడ్డి కడప జిల్లాలోని నామాలగుండు (తలుపుల మండల సరిహద్దు) సమీపంలో శవమై పడివుండడంతో పులివెందుల పోలీసులకు సమాచారం అందింది. జానకీపతిరెడ్డి తలపై రాళ్లతో బాది హత్యచేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతని స్వగ్రామం తలుపుల మండలం వేపమానిపేట కాగా, కదిరిలోని వాణీ వీధిలో కాపురం వుంటున్నారు. జానకీపతిరెడ్డి మృతిచెందాడన్న విషయాన్ని తెలుసుకున్న ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు, ఉద్యోగులు మృతుని నివాసం వద్దకు చేరుకుని ఆరాతీశారు. పులివెందుల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.