అనంతపురం

ఆశావహుల్లో ఉత్కంఠ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఫిబ్రవరి 26 : జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరన్నది తేలకపోవడం జిల్లా టిడిపి నేతలు, ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆదివారం విజయవాడలో సిఎం నిర్వహించిన పొలిట్‌బ్యూరో సమావేశంలో పలు అంశాలు చర్చించినా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయం ప్రస్తావనకు రాలేదని జిల్లాకు చెందిన పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు తెలిపారు. నేడు నూతన అసెంబ్లీ భవనాన్ని అప్పగించనుండటంతోపాటు మార్చి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పొలిట్‌బ్యూరో సమావేశానికి కూడా ఎక్కువ సమయం తీసుకోలేదని తెలుస్తోంది. కాగా రాష్ట్రంలోని అన్ని స్థానిక ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. సోమవారం అభ్యర్థుల పేర్లను సిఎం చంద్రబాబు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ సమయంలో సమావేశం నిర్వహిస్తారు, ఎప్పుడు పేర్లు ప్రకటిస్తారన్నది స్పష్టంగా తెలియలేదు. జాబితాలోని పేర్లను ఎవరైనా రాష్ట్ర సీనియర్ నేత ఒకరు ప్రకటించనున్నట్లు సమాచారం. దీంతో జిల్లా నాయకులు, ఆశావహుల్లో ఆతృత పెరిగిపోతోంది. ముఖ్యంగా జిల్లా నుంచి తాడిపత్రి ఎమ్మెల్యే జెసి.ప్రభాకర్‌రెడ్డి అల్లుడు దీపక్‌రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి మరోమారు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. అలాగే పార్టీ సీనియర్ నేత వై.సుబ్రహ్మణ్యం (గెడ్డం సుబ్బు) కూడా ఎమ్మెల్సీ ఇవ్వాలని సిఎంను కోరిన విషయం విధితమే. వీరితో పాటు మరికొందరు కూడా సీనియర్ల పేర్లు సిఎం పరిశీలనలో ఉండొచ్చని ఊహాగానాలు లేకపోలేదు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి టిడిపికే అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. దీంతో వైకాపా సైతం ఇప్పటి వరకు పోటీకి అభ్యర్థిని నిలుతామన్న విషయాన్ని వెల్లడించలేదు. ఈ పరిస్థితుల్లో టిడిపి అభ్యర్థిగా ఎవరు నామినేషన్ వేస్తే వారే ఎమ్మెల్సీగా ఎన్నికవుతారు. అయితే కుల సమీకరణలు, గత ఎన్నికల అనుభవాలను బేరీజు వేసుకుని అభ్యర్థిని ఖరారు చేస్తారా? లేదా సీనియర్లకు అవకాశం ఇస్తారా? అనే చర్చ సాగుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో (2019) జిల్లాలో పార్టీ పట్టు కోల్పోకుండా, జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజల నుంచి విమర్శలు రాకుండా ఉండేలా అభ్యర్థిని ఖరారు చేయాలన్న ఆలోచనలో సిఎం చంద్రబాబునాయుడు ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇకపోతే సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో నేటితో ఊహాగానాలకు తెరపడనుంది. ఎంపికైన అభ్యర్థి రేపు జిల్లా పార్టీ నేతల ఆధ్వర్యంలో నామినేషన్ వేయనున్నారు.
గ్రూప్-2 పరీక్ష ప్రశాంతం
* కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, డిఆర్‌ఓ
అనంతపురం సిటీ, ఫిబ్రవరి 26: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలను కలెక్టర్ కోన శశిధర్, డిఆర్‌ఓ మల్లీశ్వరీదేవిలు నగరంలోని కెఎస్‌ఆర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభ్యర్థులకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా అడిగితెలుసుకున్నారు. జిల్లాలో 135 పరీక్ష కేంద్రాలలో 52,034 మంది అభ్యర్ధులను కేటాయించామని, అందులో 40,042 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారని, 76.95 శాతం హాజరయ్యారని, 11,992 మంది గైర్హాజరయ్యారని డిఆర్‌ఓ మల్లీశ్వరీదేవి తెలిపారు. జిల్లాలో ఏ కేంద్రంలో కూడా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదని, అన్ని కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు.
తెలుగుదేశం పార్టీతోనే
అన్నివర్గాలకు న్యాయం
* మంత్రులు కొల్లు రవీంద్ర, సునీత, పల్లె
అనంతపురం సిటీ, ఫిబ్రవరి 26: ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగులు, కర్షక, కార్మికులకు న్యాయం టిడిపి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్‌రెడ్డి, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు, టిడిపి జిల్లా అధ్యక్షుడు బికె.పార్థసారథిలు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మంత్రి పరిటాల సునీత నివాసంలో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులతో ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థులు బచ్చల పుల్లయ్య, కేజే రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ టిడిపికి అండగా నిలుస్తున్న అనంతపురం జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేనిదని పలు సందర్భాల్లో సిఎం చంద్రబాబు అన్న మాటలను గుర్తుచేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా నుంచే శ్రీకారం చుట్టారన్నారు. హంద్రీనీవాతో జిల్లాను సస్యశ్యామలం చేయాలన్నదే సిఎం సంకల్పమని తెలిపారు. వెనుకబడిన జిల్లాలో పరిశ్రలలు ఏర్పాటుచేసి వేలాది మందికి ఉపాధి కల్పించాలన్నదే టిడిపి ప్రభుత్వం ధ్యేయమన్నారు. ఏపిలో నూతన సాంకేతిక విప్లవం తీసుకురావడంలో సిఎం చంద్రబాబు ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగులు, కర్షక, కార్మికులకు టిడిపి ప్రభుత్వంతోనే న్యాయం జరుగుతుందన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్యను, పట్ట్భద్రుల ఎమ్మెల్సీ కేజే రెడ్డిలను భారీ మోజార్టీలతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎన్‌యుఎస్ రాష్ట్ర నాయకులు రామలింగప్ప, ఉపాధ్యాయులు, ఇతర సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బావిలోదూకి తల్లీబిడ్డ ఆత్మహత్య
తనకల్లు, ఫిబ్రవరి 26: మండల పరిధిలోని బండివానిపల్లిలో హేమావతి (30), విష్ణుప్రియ (6) అనే తల్లీబిడ్డ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. మృతురాలి భర్త సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాలిలా వున్నాయి. కొనే్నళ్ల క్రితం సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో కలిసి జీవనోపాధి కోసం మదనపల్లికి వెళ్లారు. అక్కడ సుబ్రహ్మణ్యం డ్రైవర్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శివరాత్రి పండుగ సందర్భంగా రెండు రోజుల క్రితం ఆ కుటుంబం సభ్యులు స్వగ్రామం వచ్చారు. గత కొనే్నళ్లుగా హేమవతి మానసిక పరిస్థితి సరిగాలేదని, గతంలో బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో వైద్య చికిత్సలు చేయించినా ప్రయోజనం లేకపోయిందని భర్త పేర్కొన్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒక్కగానొక్క కుమార్తె విష్ణుప్రియను తీసుకొని బావి వద్దకు వెళ్లింది. మొదట బిడ్డను బావిలోకి తోసేసి తర్వాత హేమావతి దూకింది. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు బావిలోకి దూకి తల్లీ బిడ్డను గట్టున చేర్చారు. అప్పటికే ఇరువురూ మృతి చెందారు. ఇలా తల్లీబిడ్డ ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. శవాలను పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్‌ఐ బాలరాజు తెలిపారు.

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
* కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఆంక్షలు * ఆర్‌ఐఓ వెంకటేశ్వర్లు
అనంతపురం సిటీ, ఫిబ్రవరి 26: ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షల నిర్వహణకు అధికారులు పక్బందీగా ఏర్పాట్లును పూర్తి చేశారు. ఆదివారం స్థానిక ఆర్‌ఐఓ కార్యాలయంలో ఆర్‌ఐఓ వెంకటేశ్వర్లు విలేఖర్లతో మాట్లాడుతూ పరీక్షలకు సంబందించిన ఏర్పాట్లును తెలియజేసారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో 96 పరీక్ష కేంద్రాలలో 70,324 మంది విద్యార్థులు, అందులో మొదటి సంవత్సరంలో 35,981 మంది, రెండవ సంవత్సరంలో 34,743 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరువుతున్నారని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టమెంటల్ అధికారిని నియమించి, పరీక్షలకు సంబందించి మెటీరియల్స్‌ను అందజేసామని తెలిపారు. జిల్లాలో 96 పరీక్ష కేంద్రాలకు సంబందించిన ప్రశ్నపత్రాలను 37 పోలీస్ స్టేషన్లలో స్కోరేజ్ చేశామని తెలిపారు. జిల్లాలో సెల్ఫ్ పరీక్ష కేంద్రాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. పరీక్ష కేంద్రాలలో బెంచీలు లేని వాటికి పక్కన ఉన్న స్కూల్స్‌ను నుండి తీసుకువచ్చి వేయాలని అధికారులను ఆదేశించామన్నారు. పరీక్షల సమాయానికి పరీక్ష కేంద్రాల వద్దకు ఆర్‌టిసి బస్సులను నడపాలని ఆర్‌ఎంను, వైద్య సదుపాయాల కోసం వైద్య సిబ్బందిని నియమించాలని వైద్య ఆరోగ్య శాఖాధికారిని కోరామని తెలిపారు. జిల్లాలో పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 12:30 గంటల వరకు జరుగుతాయని, ఆ సమయంలో పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించాలని, చుట్టుపక్కల ఉన్న జిరాక్స్ సెంటర్స్‌ను మూసివేయించాలని పోలీసు శాఖను కోరినట్లు తెలిపారు. పరీక్షల సమయంలో 4 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 10 సిట్టింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటుచేశామని, వారితోపాటు ఆర్‌ఐఓ, డివిఈఓ, హైపవర్ కమిటీ సభ్యులు కూడా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తారని తెలిపారు. విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందుగానే చేరుకోవాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల కోడ్స్‌ను పరీక్ష కేంద్రం బయట ప్రదర్శించాలని యాజమాన్యాలను ఆదేశించారు. విద్యార్థులు ఒక రోజు ముందుగానే తమ పరీక్ష కేంద్రాన్ని చూసుకోవాలని తెలిపారు. పరీక్ష కేంద్రాలలో ఎటువంటి ఇబ్బందులు కలిగిన తమకు ఫిర్యాదు చేయవచ్చునని ఆర్‌ఐఓ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకుని పరీక్షలు బాగా రాయాలని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసారు.
కమనీయం..
బుగ్గరామలింగేశ్వరుడి కల్యాణం
* ఘనంగా బుగ్గరామలింగేశ్వరుని రథోత్సవం
తాడిపత్రి, ఫిబ్రవరి 26: శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి అనంతరం 8వ రోజున ఆదివారం శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వరీదేవిల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ వేదికపై పట్టు వస్త్రాలు, విశేష పుష్పాలతో సందరంగా అలంకృతులైన శివపార్వతుల ఉత్సవ విగ్రహాలకు వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ కల్యాణోత్సవం నయనానందకరంగా సాగింది. శివపార్వతుల కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో హాజరైనారు. కల్యాణోత్సవనంతరం భక్తులకు అన్నసంతర్పణ జరిగింది. పుష్పాలాంకృతులైన బుగ్గరామలింగేశ్వరస్వామి, రాజరాజేశ్వరీదేవిల ఉత్సవ విగ్రహాలను మేళతాళాలతో బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయం నుంచి చిన్న రథంపై గాంధీ కట్ట వద్దనున్న మహారథం వద్దకు తీసుకువచ్చారు. శివపార్వతులు మహారథం పీఠంపై ఆశీనులు కాగా, పట్టణ సిఐ రామకృష్ణారెడ్డి కొబ్బరికాయను సమర్పించి మహారథాన్ని ప్రారంభించారు. హరహర మహాదేవ శంభో శంకరా అంటు భక్తుల శివనామస్మరణలతో మారుమోగగా, డప్పులు, మంగళవాయిద్యాలతో మహారథాన్ని లాగారు. భక్తులు మహారథం చక్రాల కింద గుమ్మడికాయలను పెడుతూ స్వామి, అమ్మవార్లకు నారీకేళాలను సమర్పించారు. భక్తులు మహారథంపైకి బెల్లం, మిరియాలు చల్లుతూ భక్తిని చాటుకున్నారు. మహా రథోత్సవం గాంధీ కట్ట నుంచి ప్రారంభమై మెయిన్ బజార్ మీదుగా అభయాంజనేయ స్వామి విగ్రహం వరకు వెళ్ళి తిరిగి గాంధీ కట్ట వద్దకు చేరుకుంది. ఈ మహా రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
అభివృద్ధిని అడ్డుకోవడమే జగన్ ధ్యేయం
* జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర
కదిరి, ఫిబ్రవరి 26: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ధ్యేయమని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఆదివారం పట్టణంలోని హిందూపురం రోడ్డులో వున్న ఎస్‌విటి రాజారెడ్డి తోటలో టిడిపి కదిరి నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం కదిరి నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్రతోపాటు జిల్లా మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత, హిందూపురం ఎంపి నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్సీ, జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు గాలి ముద్దుక్రిష్ణమనాయుడు, స్థానిక ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ లోటు బడ్జెట్‌లో వున్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేస్తూ, విదేశాల నుండి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. అయితే ప్రతిపక్ష నేత జగన్ మాత్రం ఆయన చేస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటూ, కులాలు, మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారన్నారు. తునిలో రైళ్లు తగలబెట్టి విధ్వంసాలు జగన్ సృష్టించారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదన్నదే జగన్ లక్ష్యమన్నారు. దేశంలోనే 29 రాష్ట్రాల్లో ఎపిని 10.8 శాతం వృద్ధి రేటుతో మొదటిస్థానంలో రాష్ట్రాన్ని నిలిపిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. దేశ చరిత్రలో రైతులకు రూ. 24 వేల కోట్లు రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. నదులు అనుసంధానం చేయడంతోపాటు హంద్రీనీవాను పూర్తి చేస్తున్నారన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీళ్లు అందించడంతోపాటు పులివెందులకు నీరు ఇచ్చిన అపర భగీరథుడు చంద్రబాబు అన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణంకు పిలుపునిస్తే రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు ఇచ్చారన్నారు. టిడిపి అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటిగా వస్తున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్ట్భద్రుల నుండి కెజె రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బచ్చల పుల్లయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రికి బహుమతిగా ఇవ్వాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ అనంతపురం జిల్లా అంటే ముఖ్యమంత్రికి ప్రత్యేక అభిమానం అన్నారు. జిల్లాలోనే ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్రలో రైతుల కష్టాలను చూసి తాను అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తానని జిల్లాలోనే ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 13 డిఎస్‌సిల ద్వారా 1.80 లక్షల మంది ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.61 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించారని, త్వరలో నిరుద్యోగ భృతి ఇవ్వడంతోపాటు కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పారిశ్రామికవేత్త అయిన కెజె రెడ్డి పట్ట్భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, ఆయన్ను గెలిపిస్తే పరిశ్రమలు నెలకొల్పి, ఆయనకు అత్యధిక మెజార్టీ ఇచ్చిన ప్రాంత వాసులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తారన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బచ్చల పుల్లయ్య 31 సంవత్సరాలపాటు వివిధ హోదాల్లో పనిచేశారని, ఉపాధ్యాయుల సమస్యలపై ఆయనకు స్పష్టమైన అవగాహన వుందన్నారు. అందువల్ల టిడిపి బలపరుస్తున్న ఇరువురు అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను దశలవారిగా నెరవేర్చడం జరిగిందన్నారు. 8.75 లక్షలు నూతన రేషన్ కార్డులు మంజూరు చేశామని, ద్విచక్ర వాహనం వున్న వారికి రేషన్ కార్డు రద్దు చేస్తామని వస్తున్న వదంతులు నమ్మవద్దన్నారు. ముఖ్యమంత్రి మద్దతు ప్రకటించిన కెజె రెడ్డి, బచ్చల పుల్లయ్యలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఎంపి నిమ్మల మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్భ్రావృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఆయన కష్టానికి ప్రతిఫలంగా ఎమ్మెల్సీ అభ్యర్థులను అందరూ కలిసి కష్టపడి గెలిపించుకోవాలన్నారు. వారిని గెలిపించుకుంటే జిల్లాకు మరిన్ని నిధులు వచ్చి మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. గాలి ముద్దుక్రిష్ణమనాయుడు మాట్లాడుతూ కదిరి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు కలిసి టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 80 శాతం టిడిపి ప్రజాప్రతినిధులు గెలిచారని, అందరూ కష్టపడితే ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు సులభమవుతుందన్నారు. గతంలో బడ్జెట్‌లో 6 శాతం మాత్రమే కేటాయిస్తే చంద్రబాబు తన బడ్జెట్‌లో 23 శాతానికి పెంచారన్నారు. హుదూద్ తుఫాను ద్వారా విశాఖపట్నం అతలాకుతలమైతే ఏడాదిలోనే దాన్ని పునః నిర్మించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. పట్ట్భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కెజె రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో చాలా వరకు సాగునీటి సమస్యను ముఖ్యమంత్రి పరిష్కరించారని, నిరుద్యోగ సమస్య జఠిలంగా వుందన్నారు. గతంలో విదేశీలు పెట్టుబడులు పెట్టేందుకు ఉమ్మడి ఎపితోపాటు గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల వైపు చూసేవారని, విభజన అనంతరం ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధిని చూసి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు. జిల్లాలో తాను కొడికొండ వద్ద ఓ పరిశ్రమను ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించానని, దీని ద్వారా 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. కర్నూలులో మరో రెండు పరిశ్రమలు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారధి, ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గుడిసె దేవానంద్, మహిళా కమీషన్ సభ్యురాలు పర్వీన్‌బాను, జిల్లా నాయకులు డివి వెంకటరాముడు, దేశం ఉపాధ్యక్షుడు తాతం అరవిందబాబు, టిడిపి సీనియర్ నాయకులు ఎస్‌ఎస్ ఎండి ఇస్మాయిల్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ షేక్ సురియాభాను, వైస్ ఛైర్మన్ వసంత, మార్కెట్ యార్డు ఛైర్మన్ రామక్రిష్ణారెడ్డి, పాలక మండలి ఛైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబుతోపాటు జడ్పీటీసీలు, ఎంపిపిలు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
కళ్యాణదుర్గం, ఫిబ్రవరి 26 : పట్టణంలోని బ్రహ్మయ్య ఆలయం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుకల్లు గ్రామానికి చెందిన తిమ్మరాజు(24) మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామానికి చెందిన తిమ్మరాజు మోటార్ సైకిల్‌లో ఉదయం పట్టణానికి వచ్చాడు. తిరిగి వెళ్తున్న తిమ్మరాజు వాహనాన్ని బ్రహ్మయ్య ఆలయం వద్ద శెట్టూరు నుంచి పట్టణానికి వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో తిమ్మరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలను సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్‌ఐ శంకర్‌రెడ్డి తెలిపారు.
గాయపడిన వ్యక్తి మృతి
గోరంట్ల, ఫిబ్రవరి 26 : మండల పరిధిలోని గుమ్మయ్యగారిపల్లి వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గత శుక్రవారం రాత్రి గుమ్మయ్యగారిపల్లికి చెందిన నారప్ప(65) నడుచుకుంటూ వెళ్తుండగా ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

పది విద్యార్థులకు అవగాహన సదస్సు
అనంతపురం సిటీ, ఫిబ్రవరి 26: 2017 మార్చిలో పబ్లిక్ పరీక్షలకు హాజరగు విద్యార్థి, విద్యార్థులకు పరీక్షలపై నేడు స్థానిక లలిత కళా పరిషత్‌లో అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు ప్రైవేటు పాఠశాలల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.పుల్లారెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలపై భయానికి, ఆందోళనకు గురికాకుండా ప్రముఖ వ్యక్తిత్వ వికాస ప్రేరకుడు పోకల సుబ్బారెడ్డితో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులు హాజరై అవగాహన పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి చంద్ర, నాయకులు ఇక్బాల్, రామిరెడ్డి, నగర అధ్యక్షుడు సుబ్బారెడ్డి, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి సనప రాజుల బ్రహ్మోత్సవాలు
ఆత్మకూరు, ఫిబ్రవరి 26: ఈ నెల 28న మంగళవారం నుంచి సనప శ్రీమాధవరాజుల బ్రహ్మోత్సవాలను సనప రంగంపేట పాలచర్ల తోపుదుర్తి గ్రామ పెద్దల సహకారంతో నిర్వహిస్తున్నట్లు ఈఓ లక్ష్మీప్రసన్న ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 28న చెరకు కొలను పూజ, మార్చి 1న సనప ఆలయం నుంచి స్వామివారి ఉత్సవమూర్తులను సనప రంగంపేట గ్రామాల మధ్య పొలాలలో ఉన్న ఆలయానికి ఊరేగింపుగా తెచ్చుట, 2న స్వామివారికి భక్తులు పనే్నరపు బండ్లపై ప్రసాదములు తెచ్చి సమర్పించుట, 3వ తేదీ రథోత్సవం, కొలను పూజ, 4న భక్తులు స్వామివారికి కోర్కెలు నివేదించుట, రాత్రికి నవరత్నాల పేరుతో పౌరాణిక నాటక ప్రదర్శన, 5న స్వామివారి ఉత్సవమూర్తులను సనప ఆలయానికి ఊరేగింపు, 6న స్వామివారికి మారుపూజ చేయుటతో పూర్తవుతాయన్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గంగాధర్‌కు మద్దతు
అనంతపురం అర్బన్, ఫిబ్రవరి 26: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోకవర్గం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో వున్న గంగాధర్ యాదవ్‌కు ఎస్‌సి, ఎస్‌టి, బిసి మైనార్టీ ఐక్య వేదిక మద్దతు తెలిపింది. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్ నుందు జరిగిన విలేఖరుల సమావేశంలో బిసి, ఓబిసి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీ్ధర్ మాట్లాడుతూ అనంతపురం జిల్లా నుంచి ఏకైక బిసి అభ్యర్థిగా ఉపాధ్యాయ నియోజకవర్గానికి గంగాధర్ యాదవ్‌ను గెలిపించాలని ఆయన కోరారు. బిసిలు మరింత చైతన్యం కావాలంటే బిసి అభ్యర్థికి గెలిపించుకోవాల్సిన అవసరం వుందన్నారు. బిసి ఎమ్మెల్సీని గెలిపించుకొంటే చరిత్రలో మన వర్గాల ఐక్యతను చాటి చెప్పినట్లు అవుతుందన్నారు. బహుజన ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు ఓబిలేసు మాట్లాడుతూ ఉన్నత సామాజిక వర్గాల నుంచి కాకుండా వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన మంచి చేయాలనే తపన వున్న గంగాధర్ యాదవ్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. సమావేశంలో బిసిటియు రాష్ట్ర కార్యదర్శి వరదరాజులు, బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగభూషణం, శ్రీ్ధర్‌బాబు, లక్ష్మినారాయణ, యాదవ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరసింహయాదవ్, రాష్ట్ర ఉద్యోగ యాదవ్‌ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసుల యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఓటరు వివరాలకు
యాప్ ఆవిష్కరణ

అనంతపురం అర్బన్, ఫిబ్రవరి 26: సాంకేతికంగా ఎమ్మెల్సీ ఉపాధ్యాయ, పట్ట్భద్రుల ఓటర్ల జాబితాను సులభ రీతిలో పొందేందుకు బెంగళూరు వైఎస్‌ఆర్‌సీపీ ఐటి విభాగం ఆధ్వర్యంలో మిక్ ఓట్ ఫైన్‌డర్ అనే సరికొత్త మొబైల్ అప్లికేషన్ తయారుచేశారు. దీనిని ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి ఆవిష్కరించారు.
ఆదివారం స్థానిక వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో పట్ట్భద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఈ యాప్‌ను తయారుచేసిన రాష్ట్ర ఐటి విభాగం కార్యదర్శి భూమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిని ఆయన అభినందించారు. యాప్ ఎలా పొందాలి గూగుల్ ప్లే స్టోర్ (ఆన్‌డ్రాయిడ్), యాప్ స్టోర్ (యాపిల్)లో వెళ్లి మిక్ ఓటర్ ఫైన్‌డర్ టైప్ చేసి సెర్చ్ చేసి దాన్ని తమ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నారు. మొబైల్ యాప్ ప్రారంభించాక కింది భాగంలో చెక్ యువర్ ఓటు బటన్ నొక్కగానే ఏపి ఎన్నికల కమీషన్ వారి వెబ్‌సైట్ ఇంటర్‌ఫేస్ కనెక్ట్ అవుతుందన్నారు. ఇక్కడ ఏ జిల్లా ఓటర్ అయితే ఆ జిల్లాను సెలెక్ట్ చేసుకోవాల్సి వుంటుందన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయ, పట్ట్భద్రుల సెలెక్ట్ చేసుకోవాలన్నారు. ఇంటి నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ బటన్ నొక్కాలన్నారు. అంతే మనకు కావాల్సిన ఓటర్ వివరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయన్నారు. వీటి ద్వారా ఓటరు పేరు, చిరునామా, సీరియల్ నెంబర్, పోలింగ్ స్టేషన్ నెంబర్, పోలింగ్ బూత్ వివరాలు పూర్తిగా పొందవచ్చన్నారు.
వడ్డెర్లకు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలి
అనంతపురం అర్బన్, ఫిబ్రవరి 26: 2014 అసెంబ్లీ ఎన్నికలు సందర్భంగా స్వయానా అప్పటి తెదేపా ప్రతిపక్ష నేత చంద్రబాబునాయడు జిల్లాలోని వడ్డెర్లకు తప్పనిసరిగా ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తానని హామీ ఇచ్చారని ఆ మాటను నిలిబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని జిల్లా వడ్డెర్ల సంఘం అధ్యక్షులు మల్లెల జయరామ్ కోరారు. ఆదివారం జిల్లాలోని వడ్డెర్లతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 5 లక్షల మంది వడ్డెర్లు వున్నారన్నారు. వీరికి ఇప్పటి వరకు రాజకీయ ప్రాతినిథ్యం లభించలేదన్నారు. ఒక్క పుట్టపర్తి నియోజవర్గంలోని 70 వేల మంది దాకా వడ్డెర్లు వున్నారన్నారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి తాను పోటీ చేయటం జరిగిందన్నారు. కాని అప్పట్లో పల్లె రఘనాథరెడ్డి, నిమ్మల కిష్టప్ప, కదిరి నియోజకవర్గ నాయకులు కందికుంట తనకు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా అవకాశం ఇస్తామని చంద్రబాబు సమక్షంలోనే మాట ఇవ్వటం జరిగిందన్నారు. దీనిపై జిల్లా మంత్రులతోపాటు అధ్యక్షులను ఆదివారం ఆయన కలిసి తన ఆవేదనను వెల్లబోసుకొన్నారు. తనకు న్యాయం జరగకపోతే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా వడ్డెర్ల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రామాంజినేయులు, మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరీ, ఉపాధ్యక్షులు నిర్మలమ్మ, రేవతి, నాగలక్ష్మి, హనుమన్న, నాగభూషణ, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల వేళ.... ఉపశమనాల వల!
హిందూపురం టౌన్, ఫిబ్రవరి 26 : రెండేళ్ల పాటు ‘అదిగో ఇల్లు.. ఇదిగో రుణం’.. పట్టణాల్లో ‘అందరికీ ఇళ్లు’ అంటూ ప్రభుత్వం ఊరడింపులతోనే సరిపెడుతూ వచ్చింది. లబ్ధిదారుల జాబితా తయారు చేసినా నిబంధనల పేర ఒక్క ఇల్లు ప్రారంభించలేదు. చివరకు మంజూరైన ఇళ్లు నిర్మించుకోలేని పరిస్థితికి నిబంధనల పేరుతో అడ్డంకిగా మార్చారు. పట్టణాల్లో ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల నిర్మాణాలకు అన్ని నిబంధనలు పాటించాలంటూ గతంలో ఆదేశాలు జారీ చేశారు. అర్బన్ ఎన్టీఆర్ పథకం కింద నిర్మించే ఇళ్లకు తప్పనిసరిగా ఆన్‌లైన్ అనుమతి తీసుకోవాలని, స్థలం అనుమతి పొందిన లేఔట్‌లోనే ఉండాలని, స్థలం ఉన్న ప్రాంతానికి 30 అడుగుల రహదారులు ఉండాల్సిందేనని, భవన నిర్మాణాలు జాతీయ భవన నిర్మాణ నిబంధనలకు అనుగుణంగా నిర్మించాలని ఇలా అలవికాని నిబంధనలు ఎన్నో పెట్టారు. నిబంధనల కారణంగా జిల్లాలో 11 వేల ఇళ్లు మంజూరయితే ఒక్కటీ నిర్మాణానికి నోచుకోలేదు. కనీసం పునాదులు వేయలేకపోయారు. ఇటీవల ఇళ్ల నిర్మాణాలపై సమీక్షలో ప్రజాప్రతినిధుల నుండి తీవ్ర వ్యతిరేకత రావడం, ఎమ్మెల్యే బాలకృష్ణ ఇదే విషయమై పురపాలక శాఖ మంత్రితో ప్రత్యేకంగా చర్చించడం, పట్ట్భద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాలకు చెందిన ఓటర్లే ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం నిబంధనలను సడలించింది. అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో టౌన్‌ప్లానింగ్ నుండి ప్లాన్ అప్రూవల్ అవసరం లేదని, ఆఫ్‌లైన్‌లోనే ప్లాన్‌లను అనుమతించాలని, 30 అడుగుల రహదారులు లేకపోయినా ఫర్వాలేదని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాలు, వంశ పారంపార్యంగా వచ్చిన స్థలాలకు లింకు డాక్యుమెంట్లు ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదని పేర్కొన్నారు. వీటికితోడు నిర్మాణాలకు సంబంధించి జాతీయ భవన నిర్మాణ నియమావళి పాటించాల్సిన పని లేదని స్పష్టం చేశారు. వీటన్నింటికీ సంబంధించి ఉన్నతాధికారుల నుండి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు అన్నింటిని సడలించినందు వల్ల వెంటనే అనుమతుల జారీ పూర్తి చేయాలని, మార్చి నాటికి నిర్మాణాలు ప్రారంభమయ్యేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల పుణ్యమా అని, ప్రజాప్రతినిధుల ఉన్నత స్థాయిలో వ్యక్తం చేసిన వ్యతిరేకత వల్ల పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారులకు కాస్త ఊరట లభించింది. నిబంధనల సడలింపుతో 11 వేల ఇళ్లు కాకపోయినా సగమైనా ప్రారంభించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
రూ.3.50 లక్ష ఏ మూలకో..
పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఇంటికి రూ.3.50 లక్షల చొప్పున కేటాయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.లక్ష మాత్రమే. అంటే ప్రభుత్వం ఇచ్చేది రూ.2.50 లక్షలు మాత్రమే. ఈ సొమ్ముకు అదనంగా బ్యాంక్‌ల నుండి రూ.75 వేలు రుణం ఇప్పించేలా చూస్తారు. మరో రూ.25 వేలు లబ్ధిదారుడి వాటాగా చెల్లించాలి. పెరిగిన ధరల నేపథ్యంలో రూ.2.50 లక్షలతో ఇంటి నిర్మాణం ఎలా సాధ్యమని పట్టణ ప్రాంత లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. హిందూపురం లాంటి పట్టణాల్లో అయితే ఇంటి నిర్మాణానికి చివరకు నీటిని కొనుగోలు చేయాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. ట్యాంకర్ నీటికే రూ.500 వెచ్చించాల్సి ఉంటుందని వాపోతున్నారు. కనీసం రూ.5 లక్షలు ఇస్తే తప్ప ఇంటిని నిర్మించలేని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇళ్లను మంజూరు చేసినా ఎంత మంది లబ్ధిదారులు ముందుకు వస్తారన్నది ప్రశ్నార్థకమే.