అనంతపురం

ప్రధాన అభ్యర్థులకు స్వతంత్రుల సెగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 5 : పశ్చిమ రాయలసీమ పట్ట్భద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఇండిపెండెంట్ అభ్యర్థుల సెగ తలుగుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఇండిపెండెంట్లు కాస్తా గట్టిగానే ప్రచారం కొనసాగిస్తున్నారు. 2011 ఎన్నికల్లో ఉపాధ్యాయ స్థానానికి 9, పట్ట్భద్రుల స్థానానికి 11 మంది పోటీలో ఉన్నారు. అదే ఈసారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 10, పట్ట్భద్రుల స్థానానికి భారీ సంఖ్యలో 25 మంది పోటీలో ఉన్నారు. వీరిలో అధికార టిడిపితోపాటు ప్రధాన ప్రతిపక్షం వైకాపా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈనేపథ్యంలో ఇండిపెండెంట్ల అభ్యర్థులు ఎక్కువ మంది బరిలో ఉండటంతో ఓట్లు చీలే అవకాశం ఉన్నందున ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో మూడు జిల్లాల్లోనూ అభ్యర్థులు తమ శాయశక్తులా ప్రచారం ముమ్మరం చేశారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులకు మూడు జిల్లాల్లో టిడిపి, వైకాపాల్లో అనుచర గణం ఉండటంతో రెండు, మూడో విడత ప్రచారం చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీలో ఉన్న టిడిపి అభ్యర్థి కెజె రెడ్డి, వైకాపా అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్సీ, సిపి ఎం మద్దతుతో పోటీలో ఉన్న డాక్టర్ గేయానంద్, కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు మాసూలు శ్రీనివాసులు పోటీ చేస్తుండగా, ఇండిపెండెంట్లుగా 21 మంది పోటీలో ఉన్నారు. వీరిలో వెన్నపూస గోపాల్‌రెడ్డి, మాసూలు శ్రీనివాసులు సహా 11 మంది అనంతపురం జిల్లా వారు కాగా, 8 మంది కడప జిల్లా, టిడిపి అభ్యర్థి కెజె రెడ్డి సహా ఆరుగురు కర్నూలు జిల్లాకు చెందిన వారున్నారు. వీరిలో ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుతో అనంతపురానికి చెందిన ఇల్లూరు ఉమాకాంత్‌రెడ్డి పోటీలో ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 10 మందిలో సిట్టింగ్ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య సహా మొత్తం ఆరుగురు అభ్యర్థులు కడప జిల్లాకు చెందిన వారే కావడం విశేషం. అత్యల్పంగా అనంతపురం నుంచి ఇద్దరు, కర్నూలు నుంచి ఇద్దరు చొప్పున పోటీ చేస్తున్నారు. పలువురు అభ్యర్థులకు ఎస్‌టియూ, యూటిఎఫ్, టిడిపి, కమ్యూనిస్టులు మద్దతుగా ఉన్నారు. పోటీలో ఉన్న వారిలో కడపకు చెందిన ఇద్దరు ఒకే ఇంటి పేరు, పేరుతో (కత్తి నరసింహారెడ్డి) పోటీలో ఉన్నారు. వారు కత్తి ఓబుళరెడ్డి కుమారుడు కత్తి నరసింహారెడ్డి, కత్తినారాయణరెడ్డి కుమారుడు కత్తి నరిసింహారెడ్డి కావడంతో ఓటర్లు ఆయోమయానికి గురయ్యే పరిస్థితి ఉంది. వీరిలో ఎస్‌టియూ మద్దతుతో, కమ్యూనిస్టుల సహకారంతో నారాయణరెడ్డి కుమారుడు కత్తి నరసింహారెడ్డి పోటీలో ఉన్నారు. ఈయనతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, ఇంటేరు శ్రీనివాసులరెడ్డి, పోచంరెడ్డి సుబ్బారెడ్డి, డాక్టర్ కెవి.సుబ్బారెడ్డి మధ్యే పోటీ ఉండబోతోంది. ఈ క్రమంలో పట్ట్భద్రుల స్థానానికి పోటీలో ఉన్న ఇండిపెండెంట్లు అత్యధికులు ప్రచారంలో వెనుకబడి ఉన్నారు. మూడు జిల్లాల్లోనూ వారు పూర్తిస్థాయిలో ప్రచారాన్ని నిర్వహించలేక పోతున్నారు. కొందరు అభ్యర్థులు ఓటర్ల సెల్‌ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇదే తరుణంలో తమ అనుచరులు, బంధువర్గం, ప్రజా సంఘాల కార్యకర్తల ద్వారా కొందరు అభ్యర్థులు యథాశక్తి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పలురకాల గిఫ్ట్‌లు, కొంత నగదుతో ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఎక్కడా ఈసారి ఎన్నికల కమిషన్‌కు పట్టుబడకుండా ప్రధాన అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక దాదాపు 20 మంది అభ్యర్థులకు ఎన్నికల్లో ఏజెంట్లు నియమించుకునేందుకు కూడా ఇబ్బందిగా పడే పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ రాయలసీమ పట్ట్భద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 336, ఉపాధ్యాయ స్థానానికి 171 చొప్పున పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అన్ని చోట్లా టిడిపి, వైకాపా తమ ఏజెంట్లను నియమించుకునే వీలుండగా, కాంగ్రెస్ మెరుగైన స్థితిలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకోనుంది. మరోవైపు కొందరు ఇండిపెండెంట్లు నామమాత్రంగా ప్రచారం చేస్తుండటం, ఇంకొందరు అందుబాటులో ఉన్న ఓటర్లను కలిసి సిట్టింగ్, ప్రధాన పార్టీల అభ్యర్థులకు కాకుండా తమకే తొలి ప్రాధాన్యత ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. డాక్టర్ గేయానంద్‌కు లోక్‌సత్తా పార్టీ మద్దతు ప్రకటించి ప్రచారం చేస్తోంది.
జెసి.. నోరు అదుపులో పెట్టుకో...
* జగన్‌ను తిడితే మంత్రి పదవి వస్తుందా..
* జెసి ట్రావెల్స్ ముందు వైకాపా నేతల నిరసన
అనంతపురం అర్బన్, మార్చి 5: జెసి దివాకర్‌రెడ్డికి చెందిన ట్రావెల్స్ ముమ్మాటికి నిబంధనలను అతిక్రమించిందని, కృష్ణా జిల్లా నందిగామలో జరిగిన ప్రమాదంలో 11 మంది మృతి చెందడం, 38 మంది గాయపడం నిజమని, అధికారులు, పోలీసుల అండతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అండగా నిలిచారని, దీనిని ప్రశ్నించినందుకు ప్రతిపక్ష నేతపై కేసులు పెట్టడమే కాకుండా నిజాలను రాసిన పత్రికా కార్యాలయం ముందు నిరసనకు దిగడం, ప్రతిపక్ష నేతను ఎంతవస్తే అంత మాట్లాడటం మానుకోకపోతే నాలుక కోస్తామని తీవ్రస్థాయి తాడిపత్రి తెదేపా ఎమ్మెల్యే జె.సి ప్రభాకర్‌రెడ్డిని వైకాపా జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ, తాడిపత్రి సమన్వయకర్త పెద్దరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, యువజన విభాగం నాయకులు ఆలూరి సాంబశివారెడ్డి శివాలెత్తారు. ఆదివారం స్థానిక వైసిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో శంకరనారాయణ మాట్లాడుతూ జెసి సోదరులు రాజ్యాంగ విలువలను ఏరోజు గౌరవించలేదన్నారు. రాజ్యాంగబద్దంగా ఎన్నుకోబడిన వ్యక్తి కనీసం నీతి నియమాలు, నైతిక విలువలు కలిగి వుండాలన్నారు. శనివారం పత్రికా కార్యాలయం ముందు తన కుమారుడు ఆస్మిత్‌రెడ్డితో కలిసి ధర్నా చేయటాన్ని ఆయన తప్పుపట్టారు. ఆయన మతిస్థిమితం కోల్పోయి మాట్లాడారా అన్న అనుమానాలు కలిగిస్తున్నాయన్నారు. పెద్దారెడ్డి మాట్లాడుతూ తాను తాడిపత్రి వైసిపి సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకొన్నప్పటి నుంచి జెసి ప్రభాకర్‌రెడ్డికి మతిభ్రమించిందన్నారు. తనను సైతం ఎదుర్కోలేని జెసి ప్రభాకర్‌రెడ్డి జగన్, ఆయన తల్లి విజయలక్ష్మి, తండ్రి వైఎస్ రాజశేఖర్‌డ్డి గురించి నీచంగా మాట్లాడటంపై తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇప్పటికే జెసి కుటుంబానికి రాజకీయంగా జిల్లాలో పార్లమెంట్ స్థానంలో జెసి దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేగా జెసి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీగా దీపక్‌రెడ్డికి రాజకీయ పదవులు లభించాయని, ఇప్పుడు మంత్రి పదవి లక్ష్యంగా జగన్‌పై పరుష పదజాలం వాడటం జరిగిందన్నారు. దమ్ముంటే తాడిపత్రి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనతో పోటీ చేసి గెలవాలని ఆయన సవాల్ విసిరారు.గురునాథ్‌రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులమని చెప్పుకొనే జెసి కుటంబం ఓ ప్రతిపక్ష నేత పట్ల పరుష పదజాలం వాడటాన్ని ఆయన తప్పుపట్టారు. ఆలూరి సాంబశివారెడ్డి మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి సమక్షంలో జెసి దివాకర్‌రెడ్డి జగన్‌మోహన్‌రెడ్డిపై మాటల యుద్ధానికి దిగితే జెసి దివాకర్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయటం జరిగిందన్నారు. ఇప్పటికే జెసి ప్రభాకర్‌రెడ్డి జగన్‌పై చేసిన మాటల దాడిపై యువజన విభాగం పూర్తిగా ఖండిస్తోందన్నారు. అనంతరం నగరంలోని నందిని హోటల్ ఎదురుగా వున్న జెసి దివాకర్‌రెడ్డి ట్రావెల్స్ కార్యాలయం చేరుకొన్న వైకాపా నాయకులు కార్యాలయం ముందు నిరసనకు దిగారు. 1వ పట్టణ పోలీసులు వీరందరినీ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. ఈ సమావేశంలో పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు.

‘పురం’ నీటి సమస్య తీర్చేందుకు
కొత్త ప్రణాళిక
* గొల్లపల్లి నుంచి నీరు తెచ్చేందుకు యత్నాలు
* పరిశీలించిన అధికారుల బృందం
హిందూపురం టౌన్, మార్చి 5 : పట్టణ శాశ్వత సమస్యగా మారిన నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపుతోంది. ఇందులో భాగంగా పెనుకొండ మండలం గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి హిందూపురానికి పైపులైన్‌ల ద్వారా తాగునీటిని అందించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ సందర్భంగా సమగ్ర ప్రణాళికను రూపొందించిన అధికారులు ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రస్తుతం పట్టణానికి పిఎబిఆర్ నుంచి సగటున కేవలం ఐదు మిలియన్ లీటర్ల నీరు మాత్రమే సరఫరా అవుతుండటంతో ఇది ఏమాత్రం పట్టణ అవసరాలకు సరిపోవడం లేదు. దీంతో ప్రత్యామ్నాయంగా గొల్లపల్లి నుండి పట్టణానికి నీటిని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉన్నత స్థాయి అధికారుల బృందంతోపాటు ప్రణాళికను తయారు చేసిన కన్సల్టెంట్‌లు గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి హిందూపురం వరకూ పరిశీలించి పరిస్థితులను తెలుసుకున్నారు. ఎక్కడెక్కడ పంప్‌హౌస్‌లు ఏర్పాటు చేయాలి, ఎక్కడిదాకా గ్రావిటీ ద్వారా నీటి సరఫరా చేయవచ్చు, ఎక్కడ నుంచి మోటార్ల ద్వారా సరఫరా చేయాలి, ఎక్కడ వేటిని నిర్మిస్తే సరిపోతుంది, ఎంత స్థలం అవసరం, విద్యుత్ సౌకర్యం ఇతరత్రా ఏర్పాట్లు తదితర అన్ని అంశాలను పరిశీలించారు. వివరాలను సేకరించి నమోదు చేసుకున్నారు. ఇప్పటికే తయారు చేసిన సమగ్ర ప్రణాళికలో చిన్నపాటి మార్పులు చేసి ప్రభుత్వానికి అందచేసేందుకు సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర ప్రణాళికను ప్రాథమిక దశలోనే పరిశీలించడానికి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ ప్రజారోగ్య విభాగం ఇంజనీరింగ్ చీఫ్ పాండురంగారావు పరిశీలించారు. అనంతరం ఆయన అధికారుల బృందాన్ని ఇక్కడికి పంపారు. అన్ని అంశాలను పరిశీలించిన సాంకేతిక అధికారుల బృందం ఆదివారం సాయంత్రం హిందూపురం మున్సిపాలిటీలో సమావేశమయ్యారు. ప్రణాళికలో చేయాల్సిన మార్పులు, చేర్పులను చర్చించారు. రెండుదశల్లో ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుండి హిందూపురం వరకు పైపులైన్ ద్వారా తాగునీటిని సరఫరా చేసే పనులు ఒకదశగానూ, పట్టణంలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేసేందుకు అంతర్గత పైపులైన్ నిర్మాణ పనులను మరో దశగాను విడదీశారు. మొదటి దశను రూ.166 కోట్లు, రెండోదశను రూ.90 కోట్లతో పూర్తి చేయవచ్చని అంచనాలు వేశారు. పట్టణానికి గొల్లపల్లి రిజర్వాయర్ నుండి ఏడాదికి 0.54 టిఎంసిల నీటిని సరఫరా చేసేందుకు నీటి కేటాయింపులు జరిపేలా చూడాలని ఇప్పటికే ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం చీఫ్ నుంచి సాగునీటి శాఖ ముఖ్య ఇంజనీర్‌కు ప్రతిపాదనలు వెళ్లాయి. ఇదే ప్రతిపాదనలపై ఎమ్మెల్యే బాలకృష్ణ ఉన్నత స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. నీటి కేటాయింపుల అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలోపే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక పనులన్నింటిని పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. నీటి కేటాయింపులు జరిపిన వెంటనే ప్రభుత్వం నుండి నిధుల మంజూరు అనుమతి తీసుకుని టెండర్లు పిలవాలని ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక విభాగం ప్రతినిధి చౌదరి, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఇ శ్రీనాథ్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, మున్సిపల్ ఇంజనీర్ రమేష్‌తోపాటు నైస్, టాటా కన్సల్టెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు.
కొలిక్కి వస్తున్న
‘పురం’ టిడిపి విభేదాలు
* కలిసికట్టుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
హిందూపురం, మార్చి 5 : తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటున్న నియోజకవర్గ టిడిపిలో నేతల మధ్య విభేదాలు ఓ కొలిక్కి వస్తున్నాయి. ఎంపి జెసి దివాకర్‌రెడ్డి అసంతృప్తవర్గానికి నేతృత్వం వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే సిసి వెంకట్రాముడి ఇంటికి రెండు రోజుల క్రితం వెళ్లి మంతనాలు సాగించిన విషయం విధితమే. ఈ సందర్భంగా శాసనమండలి ఎన్నికల్లో టిడిపి బలపరుస్తున్న అభ్యర్థుల విజయానికి దోహద పడాలని జెసి కోరగా కేవలం ఎమ్మెల్యే పిఏ శేఖర్ వ్యవహార శైలి పట్ల తమ బాధ అని, టిడిపి, బాలకృష్ణకు తాము ఎప్పటికీ సహకరిస్తామని స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో ఆదివారం హిందూపురం ఎంపి నిమ్మల కిష్టప్ప హిందూపురానికి విచ్చేసి ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రచారం సాగించారు. ఈయన సైతం మాజీ ఎమ్మెల్యే సిసి ఇంటికి వెళ్లి చర్చించడంతోపాటు అసంతృప్తవర్గానికి మరో ప్రధానుడైన టిడిపి నేత అంబికా లక్ష్మీనారాయణను కూడా పిలిపించి సఫలమయ్యారు. అటు అసంతృప్తి వర్గం ఇటు టిడిపి సీనియర్ నాయకులు సమన్వయంతో శాసనమండలి ఎన్నికల ప్రచారానికి ఉపక్రమించడంతో స్థానిక టిడిపిలో నెలకొన్న విభేదాలు దాదాపు దూరమవుతున్నట్లు చర్చ సాగుతోంది. అయితే తన నియోజకవర్గంలో ఇంత తతంగం జరిగినా, శాసనమండలి ఎన్నికలు జరుగుతున్నా, స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వయంగా ఇక్కడికి రాకపోవడం చర్చనీయాంశమవుతోంది.

ఇసుక నేలే పట్టు పరుపు!
* కుటుంబ పోషణ కోసం నిరంతర శ్రమ
* పొట్టకూటి కోసం బెంగళూరు వైపు..
నల్లమాడ, మార్చి 15: ఉన్న ఊరు కన్నతల్లిలాంటిది. వర్షాభావ పరిస్థిలు, పంటల సాగుకు చేసిన అప్పులు, పిల్లల చదువులు, వృద్ధ తల్లిదండ్రుల పోషణ ఇవన్నీ భారమై సొంత ఊళ్ళల్లో వున్న ఇళ్ల వద్దే అమ్మానాన్నలను, పిల్లలను వదిలివెళ్ళాల్సిన దుస్థితి జిల్లాలోని ప్రతి మండలంలోనూ కనిపిస్తోంది. అనంతపురం జిల్లా నుంచి వలస వెళ్ళే వారు అత్యధికంగా బెంగళూరుకే పరుగులు తీస్తున్నారు. ఎవరైనా బెంగళూరుకు వెళ్ళి వచ్చాడంటే వాళ్ళకేమి బెంగళూరెళ్ళి బాగున్నారు అని చాలామంది అనుకోవడం చూస్తుంటాం. అయితే బతుకుతెరువు కోసం బెంగళూరెళ్ళిన వారి కష్టాలు కళ్ళారా చూస్తే తప్పా తెలియదు. ఎప్పుడు తింటారో.. ఎక్కడ నిద్రపోతారో... ఇసుక నేలే వారికి పట్టుపరుపులు.. పిటికెడన్నమే వారికి పరమాన్నం. తాము ఎంత కష్టాన్నైనా భరించి ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న కుటుంబాన్ని గట్టెక్కించాలని మదిలో వుంచుకున్న ఆలోచనలతో నిరంతరం శ్రమించే అనంతపురం జిల్లావాసులు బెంగళూరు నగరంలో అడుగడుగునా కనిపిస్తుంటారు. ఎవరిని పలకరించినా గుండెభారంతో కొందరు, కంటతడిపెడుతూ మరికొందరు వారి కష్టాలను వినిపిస్తారు. ఒక్కొక్కరిది ఓ దీనగాధ..
ఏ ఒక్కరి పరిస్థితి గమనించినా పంటల సాగుకు చేసిన అప్పులు తీర్చుకుంటూ పిల్లల చదువు కోసం వలస వచ్చామన్న సమాధానమే రావడం గమనార్హం. ఉపాధి పనులు పూర్తిస్థాయిలో సక్రమంగా జరగడంతోపాటు, జిల్లాలోని చెరువులకు నీళ్లు చేరవేస్తే తప్పా కరవు దూరమై వలసలు తగ్గే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలూ కరవుతో సతమతమవుతున్న దృష్ట్యా ప్రతి రోజూ వలసలు వెళ్ళే వారి సంఖ్య అధికమవుతూనే వుంది. పాలకులు, జిల్లా అధికారులు వలసలను తగ్గించడంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధమైన ఉపాధి అవకాశాలు కల్పించాలన్న విషయంపై సమగ్ర ప్రణాళిక తయారుచేసి చర్యలు తీసుకోకపోతే గ్రామీణ ప్రాంతాలు పూర్తిస్థాయిలో ఖాళీ అయ్యే ప్రమాదం వుంది.
పంటల్లేక.. కుటుంబ పోషణ భారమై...
- అమరనాథరెడ్డి, సోమందేపల్లి
మా ఊరు సోమందేపల్లి. నాకు నాలుగు మగ్గాలుండేవి. ఎన్ని చీరలు నేసినా, నేయించినా మా వద్ద తక్కువ ధరకు తీసుకుని దుకాణాదారులు అధిక ధరలకు అమ్ముకునేవారు. వాటిలో నష్టం వాటిల్లేది. అదేవిధంగా వర్షాలు లేకపోవడంతో పంటల పరిస్థితి అంతంతమాత్రమే. దానికితోడు నా తండ్రికి అనారోగ్యం. చేసే వృత్తిలో నష్టం, తండ్రి అనారోగ్యం, కుటుంబ పోషణ భారమైంది. లక్షల్లో అప్పులయ్యాయి. వాటిని తీర్చడానికి వేరే మార్గం కనిపించలేదు. నాకు ఇద్దరు పిల్లలు, ఒకరు 10 ఏళ్ళు, మరొకరికి 2 ఏళ్ళు. ఇద్దరినీ ఇంట్లో అమ్మ వద్దే వుంచి నేను నా భార్య బెంగళూరుకు వచ్చేశాము. నా భార్య గార్మెంట్ పరిశ్రమకు వెళ్తుంది. నేను కొబ్బరికాయల వ్యాపారం చేస్తున్నాను. పిల్లలు, తల్లికి దూరంగా వుండాల్సి వచ్చిందన్న బాధ వేదిస్తున్నా కొంతవరకు అప్పులు తీర్చుకోగలుగుతున్నా. ప్రభుత్వం మాలాంటి వాళ్ళను గుర్తించి బ్యాంకుల్లో రుణాలిప్పించి ఉపాధి కల్పిస్తే నాలాంటి వలస వచ్చిన వారికి ఊరట కలుగుతుంది.
‘ఉపాధి’ లేక బెంగళూరొచ్చాను..
- చిత్తయ్య, యర్రంపల్లి, గుమ్మగట్ట మండలం
ఉపాధి బిల్లులు సరిగ్గా ఇవ్వకనే బెంగళూరొచ్చాను... మా ఊళ్ళో జరిగే ఉపాధి పనులకు నేను నాతోపాటు మా అన్నదమ్ములు, స్నేహితులు కలిసి వెళ్ళే వాళ్ళం. నెల రోజులు పనిచేసినా కూడా మాకు వెయ్యి రూపాయలు కూడా మా అకౌంట్‌లో జమ అయ్యేది కాదు. మాకు చదువు రాదు. గతంలో అయితే ఎవరికి ఎంత డబ్బులొచ్చాయ్ అనే విషయం చీటీలొచ్చేవి. ఇప్పుడు బ్యాంక్‌ల్లో మా అకౌంట్‌లలో వేస్తుండటంతో బ్యాంక్‌లోకి వెళ్ళి అడిగితే రూ. 600లు, రూ. వెయ్యి వచ్చిందని బ్యాంక్ వాళ్ళు చెప్పారు. నెలకు కనీసం రెండు వేలు కూడా వచ్చేది కాదు. ఇలా వుంటే ఎలా బతకడమని మా ప్రాంతం నుంచే రెండొందలమంది వచ్చేశాము. ఉపాధి హామీ పనులు పెట్టి సక్రమంగా బిల్లులు మాకందజేస్తే తిరిగి మా ఊళ్ళకు రావడానికి మేము సిద్ధంగా వున్నాం.
ప్రహ్లాద వరద నమో నారసింహా..
* రేపటి నుంచి ఖాద్రీశుని బ్రహ్మోత్సవాలు
కదిరి, మార్చి 5: దక్షిణ భారతదేశంలోనే నవ నారసింహా క్షేత్రాల్లో ఒకటైన శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుండి (మంగళవారం) ప్రారంభమవుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం తర్వాత అతి ప్రాచీనమైనదిగా శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. హిరణ్యకసిపుని సంహరించిన అనంతరం ఉగ్ర స్వరూపులైన శ్రీ నరసింహస్వామి కదిరి పట్టణంలో గల స్తోతాద్రి పర్వతం వద్ద ముక్కోటి దేవతలు, ప్రహ్లాదుడు శాంతింపజేశారని, అందువలన ఈ క్షేత్రము ప్రహ్లాద సమేత నృసింహస్వామి దేవాలయంగా వెలసింది. ఖా అనగా విష్ణు పాదమని, అద్రి అనగా పర్వతమని, ఈ ప్రాంతంలో స్వామివారు పాదం మోపినందు వలన ఈ పట్టణం ఖాద్రీ (కదిరి) పిలవబడుతున్నది. ఒరిస్సా రాష్ట్రంలోని పూరి పట్టణంలో వెలసిన కొయ్య జగన్నాథుడి వలే ఈ క్షేత్రంలో నరసింహస్వామి చండ్ర వృక్షం (ఖదిరి వృక్షం) ఆవిర్భవించడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. బ్రహ్మోత్సవాలు తిరుపతి తర్వాత అంత పెద్ద స్థాయిలో 15 రోజులపాటు అత్యంత వైభవంగా జరగడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మ రథోత్సవం సందర్భంగా స్వామివారు బ్రహ్మ రథోత్సవంపై భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుండే కాక మన రాష్ట్రం నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ముఖ్యంగా శ్రీవారి బ్రహ్మ రథోత్సవం తమిళనాడులోని అండాల్ అమ్మవారి శ్రీవల్లి పుత్తూరు రథం, తంజావుర్ జిల్లాలోని తిరువార్ రథం తర్వాత మూడవ అతి పెద్ద రథంగా ప్రసిద్ధి. స్వామివారి పడమర గోపురం సమీపంలో వున్న భృగుతీర్థంలో స్నానం చేస్తే పాప విమోచనం కలుగుతుందన్నది భక్తుల నమ్మకం. భృగు మహర్షి తపస్సు చేసి స్వామివారి స్మరణం చేసుకున్నారని, మహర్షి కోరిక మేరకు శ్రీవారు స్వయంగా శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉత్సవ విగ్రహాలు అందించినట్లు బ్రహ్మాండ పురాణం ద్వారా తెలుస్తోంది. అప్పట్లో స్వామివారు స్వయంగా నిలిచిన ఉత్సవ విగ్రహాలే ఇప్పుడు జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో తిరువీధుల్లో భక్తులు దర్శనమిస్తున్న శ్రీదేవి, భూదేవి సమేత నారసింహుడు. ప్రతి నెలా స్వాతీ నక్షత్రం రోజున స్వామివారి మూల విరాట్‌కు అభిషేకం చేస్తారు. అప్పుడు మూల విరాట్ నుండి శే్వత బిందువులు వెలువడడం స్వామివారి మహిమాన్వితంగా భక్తుల నమ్మకం. స్వామివారి మూల విరాట్ అష్ట్భుజుడైన శ్రీ నారసింహా భగవానుడు దుష్టరాక్షసుడైన హిరణ్యకశిపుని తన తొడలపై పరుండబెట్టుకొని రెండు హస్తములతో అతని శిరస్సును, పాదములు బట్టి మరో రెండు హస్తములతో వజ్ర తీక్షణములగు గోళ్లతో అతని వక్షస్థలమును చేధించినట్లుగా, తక్కిన నాలుగు హస్తంలచే శంఖు, చక్ర, ఖేడ్య, ఖడ్గములతో దర్శనమిస్తారు. ప్రహ్లాద సమేతంగా శ్రీవారు భక్తులకు దర్శనమివ్వడం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. స్వామివారి బ్రహ్మోత్సవాలు మార్చి 7న అంకురార్పణతో ప్రారంభమవుతాయి. 8న కల్యాణోత్సవం, 9న హంస వాహనం, 10న సింహ వాహనం, 11న హనుమద్ వాహనం, 12న బ్రహ్మ గరుడోత్సవం, 13న శేష వాహనం, 14న సూర్యచంద్రప్రభ, 15న మోహినీ ఉత్సవం, 16 ప్రజాగరుడ సేవ, 17న గజ వాహనం, 18న బ్రహ్మరథోత్సవం, 19న అశ్వ వాహనం, 20న తీర్థవాది, 21న పుష్పయాగోత్సవంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
వైభవంగా గవిమఠం పీఠాధిపతి అడ్డపల్లకి ఉత్సవం
ఉరవకొండ, మార్చి 5 : పట్టణంలోని గవిమఠంలో వెలిసిన శ్రీ చంద్రవౌళేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పాల్గుణ శుద్ద అష్టమి ఆదివారం 8వ పీఠాధిపతి శ్రీ జగద్గురు చెన్నబసవరాజేంద్ర స్వామి అడ్డపల్లకి ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ప్రస్తుత 8వ పీఠాధిపతి చెన్నబసవ రాజేంద్ర స్వామి చంద్రవౌళేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరి గ్రామంలోని ఆంజనేయస్వామితోపాటు ఉరవకొండ పట్టణ శివారు ప్రాంతంలో ఉన్న వెలిగొండ రోడ్డులో ఉన్న విడిది మండపానికి చేరుకున్నారు. అక్కడ సహాయ కమిషనర్ ఆనంద్ ఆధ్వర్యంలో చంద్రవౌళేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం గవిమఠం నుంచి అడ్డపల్లకిని తీసుకుని, బాజభజంత్రీలు, మేళతాళాలతో విడిది మఠానికి చేరుకున్నారు. 8వ పీఠాధిపతి జగద్గురు చెన్నబసవ రాజేంద్ర స్వామువారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గవిమఠానికి రావాలని ఆహ్వానించడంతో పీఠాధిపతులు ఆశీనులయ్యారు. పీఠాధిపతులను అడ్డపల్లకిలో కూర్చొబెట్టి ఊరేగింపుగా మఠానికి చేరుకున్నారు. మఠం వద్దకు చేరుకోగానే పూజలు నిర్వహించి ఆహ్వానించారు.
ఐరావతంపై ఊరేగిన చంద్రవౌళేశ్వరస్వామి
చంద్రవౌళేశ్వర స్వామి బ్రహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఐరావత వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. సుప్రబాత సేవలో భాగంగా తెల్లవారు జామున అభిషేకం, ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవ మూర్తులకు పట్టువస్త్రాలు, వివిధ పుష్పాలతో అలంకరించి, ప్రత్యేకంగా తయారు చేసిన ఐరావత వాహనంపై కొలువుదీర్చి బాజభజంత్రీల నడుమ ఎదురు బసవన్న గుడి వరకూ ఊరేగించారు. ఉత్సవాన్ని తిలకించడానికి పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా ఉరవకొండ సిఐ సూర్యనారాయణ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సంఘం నాయకులు, సహాయ కమిషనర్, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తి ఆత్మహత్య
రొళ్ల, మార్చి 5 :మండల పరిధిలోని ఎస్‌టి.హళ్లి గ్రామ సమీపంలో నరసింహారెడ్డి (42) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కదిరి మండలం ముత్తేపల్లికి చెందిన నరసింహారెడ్డి, ఎస్‌టి.హళ్లిలో వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడ్డాడు. అయితే భార్యాభర్తలు ఉపాధి నిమిత్తం బెంగళూరు వలస వెళ్లి పని చేసుకునేవారు. నాలుగు రోజుల క్రితమే ఇక్కడికి వచ్చారు. ఈనేపథ్యంలో గ్రామ సమీపంలో దుర్వాసన రావడంతో స్థానికులు గమణించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్సై నాగన్న ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పరిశీలించారు. పురుగుల మందు ఎప్పుడు తాగాడోగానీ శవం దుర్వాసన వెదజల్లుతోందని ఎస్సై తెలిపారు. మృతుడికి కొడుకు, కూతురు ఉన్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.
రెవెన్యూ భవన్‌లో బ్యాలెట్ పేపర్లను
తనిఖీ చేసిన కలెక్టర్
అనంతపురం సిటీ, మార్చి 5: ఉపాధ్యాయ, పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్‌కు వినియోగించనున్న బ్యాలెట్ పేపర్లను కలెక్టర్ కోన శశిధర్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యాలెట్ పేపర్ల సీరియల్ నెంబర్, ప్రింటింగ్ సక్రమంగా వుందా లేదా అని జాగ్రత్తగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. రెవిన్యూ డివిజన్ల వారీగా, పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల మేరకు బ్యాలెట్ పేపర్లను లెక్కపెట్టి ప్యాకింగ్ చేయాలన్నారు. వీటిని గట్టి బందోబస్తు మధ్య ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించాలన్నారు. ఈ ప్రక్రియను డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు, ఉప తహశీల్దార్లు, సిబ్బంది సుమారు 50 మంది దాకా చేపట్టారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ మల్లీశ్వరీదేవి, ఆర్‌డిఓ మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, శ్రీనివాసులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్‌లు భాస్కర్‌నారాయణ, వరదరాజులు, హరి, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
టిడిపి అభ్యర్థుల్ని గెలిపించండి
* మంత్రులు పల్లె, కొల్లు
అనంతపురం కల్చరల్, మార్చి 5 : టిడిపిమద్దతుతో పట్ట్భద్రుల ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు కెజె.రెడ్డి, బచ్చల పుల్లయ్యలను గెలిపించాలని మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కొల్లు రవీంద్ర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్లకు, ఉపాధ్యాయులకు టిడిపి ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. లోటు బడ్జెట్‌లో కూడా అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. రాబోయే బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి చెల్లించేందుకు రూ.1000 కోట్ల కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా టిడిపి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తమ అభ్యర్థుల విజయానికి తోడ్పడుతాయన్నారు. అభ్యర్థుల విజయానికి టిడిపి శ్రేణులతోపాటు ఓటర్లందరూ తోడ్పడాలని కోరారు. సమావేశంలో టిడిపి జిల్లా అధ్యక్షులు బికె.పార్థసారథి, మేయర్ స్వరూప, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌస్‌మొద్దీన్, పార్టీ నాయకులు బివి.వెంకటరాముడు, మల్లెల జయరాం పాల్గొన్నారు.

పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని
ఏర్పాటుచేయండి
అనంతపురం సిటీ, మార్చి 5: ఉపాధ్యాయ, పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఏర్పాటుచేయాలని అధికారులతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కోన శశిధర్ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లోని రెవిన్యూ భవన్ నుండి కడప కలెక్టర్, కర్నూల్ జెసిలతోపాటు కడప, అనంతపురం, కర్నూలు డిఆర్‌ఓలు, ఆర్‌డిఓలతో ఆయన ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై టెలికాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు నియమించిన అధికారులకు ఓటుహక్కు కలిగిన వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును వినియోగించుకునేందుకు సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల విధులను నిర్వర్తించే ప్రతి ఒక్కరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునే విధంగా అనగాహన ముందుగానే కల్పించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు తెలియజేయాలన్నారు. ఇందుకు అనుగుణంగా వారు తమ ఏజెంట్లను నియమించుకోవచ్చునని తెలిపారు. ఎన్ని బాక్సులు వాడితే అన్నింటికి డిక్లరేషన్ తీసుకోవాలని, అలాగే బ్యాలెట్ పేపర్ల అకౌంటు, తదితర వివరాలను పిఓ డైరీలో ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. ఈ ప్రక్రియను జాగ్రత్తగా ఎటువంటి లోపాలు లేకుండా చేపట్టాలన్నారు. బ్యాలెట్ పేపర్లను ఇప్పటికే ఆయా జిల్లాలకు పంపామని అవి అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అని ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలించాలని తెలిపారు. పోలింగ్ సామాగ్రి తగినంత వుండే విధంగా ముందు జాగ్రత్త తీసుకోవాలన్నారు. ఎన్నికల కమీషన్ తెలుగు, ఇంగ్లీషు భాషలందు రెండు ఫ్లెక్సీలను పంపిందని వాటిని ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద డిస్‌ప్లే చేయించాలన్నారు. వెబ్‌కాస్టింగ్ లైవ్‌ను ఏర్పాటు చేయాలన్నారు.
మాదిగ అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం
అనంతపురం సిటీ, మార్చి 5: ఎస్సీ వర్గీకరణ కోసం అనేక పోరాటాలు చేసి ఆశువుల బాసిన అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దామని ఎంఈఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు శంకర్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఉపాధ్యాయ భవన్‌లో మాదిగ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టబద్దత చేసేందుకు కేంద్రం సుముఖతగా ఉందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చేస్తేనే మాదిగ జాతికి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరసింహులు, గంగాధర్, మధుసూధన్, బాబయ్య, గంగన్న, సుబ్బరాయుడు, నాగరాజు, సురేష్, ఇతర ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
సర్వేయర్ ఉద్యోగాలకు నిర్వహించే
పరీక్ష సెంటర్ల తనిఖీ
అనంతపురం సిటీ, మార్చి 5: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆధ్వర్యంలో జిల్లాలో డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలకు నిర్వహిస్తున్న ఆన్‌లైన్ పరీక్షను ఆదివారం ఎస్‌ఎస్‌బిఎన్ డిగ్రీ, పిజి కళాశాలలో కలెక్టర్ కోన శశిధర్ పరిశీలించారు. జిల్లా అంతటా పరీక్షలు జరుగుతున్న తీరును ఏపిపిఎస్‌సి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పరీక్షలు రాసేందుకు దరఖాస్తులు చేస్తున్నట్లు ఏపిపిఎస్సీ అదికారులు కలెక్టర్‌కు వివరించారు. జెఎన్‌టియూ, బికెఎస్ మండలంలోని ఎస్‌ఆర్‌ఐటి కాలేజి, షిర్డిసాయి కాలేజి, నగరంలోని ఎస్‌ఎస్‌బియన్, గుత్తిలో గేట్స్ కాలేజి, వి టెక్నాలజిస్‌లలో మొత్తం 6 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఓ మలోలా, తహశీల్దారు శ్రీనివాసులు, ఎస్‌ఎస్‌బిఎన్ కాలేజి ప్రిన్సిపాల్ నాగత్రిశూలపాణి, ఎపిపిఎస్సీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా రిషిత స్కూల్ వార్షికోత్సవం
అనంతపురం సిటీ, మార్చి 5: నగరంలోని సోమనాథ్ నగర్‌లోని ఉన్న రిషిత ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ మదమంచి స్వరూప, డిఇఓ పి.లక్ష్మినారాయణలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. విద్యార్థి దశలోనే కష్టపడే స్వభావాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తల్లిదండ్రులను, విద్యార్థులను అలరించాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ గోపాల్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఒంటేరును గెలిపించండి
అనంతపురం అర్బన్, మార్చి 5: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోకవర్గ అభ్యర్థిని బంటేరు శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి. ఆదివారం స్థానిక సిద్ధార్ద ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 25 ఉపాధ్యాయ సంఘాలు ఎమ్మెల్సీ అభ్యర్థి ఒంటేరుకు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే గత కొనే్నళ్లుగా అపరిష్కృతంగా వున్న ఉపాధ్యాయ సమస్యలపై శాసన మండలిలో గళం వినిపిస్తానని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐటిఎ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆదిశేషయ్య, గోపాల్, యన్‌టిఎ అధ్యక్షులు హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి జయరామ్, ఎపిసిపిఎస్‌ఇఎ అధ్యక్షులు చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.