అనంతపురం

ముగిసిన ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 7 : పశ్చిమ రాయలసీమ పట్ట్భద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఆయా పార్టీల అభ్యర్థులు నువ్వా, నేనా అన్న రీతిలో సిద్ధమవుతున్నారు. మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగియడంతో రేపు జరగనున్న పోలింగ్‌కు సిద్ధమవుతున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా మొత్తం 190 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల వద్ద ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ రాజశేఖర్‌బాబు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఓటర్లు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే రౌడీషీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్ కంద్రాలపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
ఇకపోతే ఓటర్లను పోలింగ్ కేంద్రానికి తరలించేందుకు అధికార పార్టీ నాయకులు పలుచోట్ల ఇప్పటికే తమ నాయకులు, కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఇలాంటి చర్యలను అడ్డుకునేందుకు వైపాకా సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, పోలింగ్ ఏజెంట్లు ఓటర్లను ప్రభావితం చేయకండా ఎన్నికల అధికారులు నిరంతర వీడియో కవరేజ్ చేయనున్నారు. ఎవరైనా ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. ఇక ఓటర్లకు పంపిణీ చేస్తున్న స్లిప్పులు సక్రమంగా అందడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. అనంతపురం రూరల్ ప్రాంతంలో చాలా చోట్ల స్లిప్పులు అందక ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలో సైతం ఓటర్లు ఇళ్ల నంబర్లు సరిగా లేకపోవడంతో పంపిణీ చేసే సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. కాగా ఓటరు స్లిప్పులు అందరికీ అందేలా చర్యలు తీసుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
కమిషనర్‌పై దాడి..
రహస్య విచారణ!
* వర్గపోరుపై వివరాల సేకరణ
అనంతపురంటౌన్, మార్చి 7: కార్పొరేషన్ కమిషనర్‌పై జరిగిన దాటి ఘటనకు దారితీసిన కారణాలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ రహస్య విచారణ చేపట్టింది. దాడికి కారణం బిల్లు లేనా లేక వర్గపోరు అన్న దిశగా వివరాల సేకరణ జరుగుతోంది. మేయర్ ఛాంబర్‌లో కమిషనర్‌పై దాడికి పాల్పడిన కార్పొరేటర్లతోపాటు ఆ సమయంలో ఉన్న మిగతా వ్యక్తుల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. నేతల వర్గపోరులో అధికార పార్టీలో ఏ ఏ కార్పొరేటర్లు ఏ నేతకు మద్దతుగా నిలుస్తున్నారు, ఎవరు ఏ వర్గంలో ఉన్నారన్న అంశాలపై ఆరా తీస్తున్నారు. మేయర్ సమక్షంలోనే బిల్లులకై కమిషనర్‌పై దాడి జరగటంతో అధికార పార్టీ ప్రతిష్ట మసకబారినట్లైంది. పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తున్న నేతల వర్గపోరుకు 3చెక్2 పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. తెలుగుదేశానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా అటు జిల్లాతోపాటు ఇటు తొలిసారి నగరంలో పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టి అధికారం అప్పగిస్తే నేతల వర్గపోరు, అవినీతి, అక్రమాలతో పలుచన కావటం ప్రభుత్వాన్ని మేలుకొల్పింది. దీనితో కమిషనర్‌పై దాడికి బిల్లులా లేక వర్గపోరేనా అన్న దిశగా నిజాలు నిగ్గుతేల్చేందుకు పోలీస్ శాఖ ద్వారా రహస్య విచారణకు ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా. మున్సిపల్ పరిపాలనా శాఖ ద్వారా కాకుండా ప్రత్యేకంగా పోలీస్ శాఖ ద్వారా రహస్య విచారణ చేపట్టటం పలువురిని ఆందోళనకు గురిచేస్తోంది. దీని పర్యవసానంగా అటు అధికారులతోపాటు ఇటు నేతల భవిష్యత్తును మార్చివేస్తుందేమోనన్న భయం అందరినీ వెన్నాడుతోంది. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న విచారణపై వివరాలు వెల్లడి కాకుండా పోలీస్ శాఖ తగు జాగ్రత్తలు తీసుకుంది. విచారణ జరుగుతున్నట్లుగా అనుమానాలు రాకుండా చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఏడు కోట్ల రూపాయల అభివృద్ధి పనులపై పబ్లిక్ హెల్త్ శాఖ ఎస్‌ఇ శ్రీనాథరెడ్డి విచారణ జరిపి నివేదిక సిద్ధం చేసింది. తాజాగా కడప కార్పొరేషన్ ఎస్‌ఇ ఉమామహేశ్వరరావుఅభివృద్ధి పనులపై త్వరలో విచారణ జరపటానికి అనంతపురం రానున్నారు. అభివృద్ధి పనులలో అంచనాలను ఎక్కువ చేసి పనులు చేపట్టటం వలన కార్పొరేషన్ నిధులు కొల్లగొట్టటానికి బాధ్యులెవరెవరో అన్న దిశగా కూడా విచారణ సాగుతోంది. గతానికి భిన్నంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనల పేరుతో కార్పొరేషన్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి కోట్లాది రూపాయలను మంచినీళ్లలా ఖర్చు చేయటం జరిగింది. గతంలో ముఖ్యమంత్రుల పర్యటనల సందర్భంగా కలెక్టర్ నేతృత్వంలోనే వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లను చేయటం జరిగేది. ఇందుకు సంబంధించి కలెక్టర్ అందుబాటులోని నిధులను లేదా ఆయా శాఖల పద్దుల నుంచి సర్దుబాట్లు చేయటం జరిగే తంతు. దీనికి భిన్నంగా గత ఏడాది డిసెంబర్‌లో వనం, ప్రగతి పేరుతో ఒకసారి, అలాగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల పేరుతో మరోసారి కోట్లాది రూపాయల నిధులు వ్యయం చేయటం జరిగింది. అయితే పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో సిఎం పర్యటనలో బయో టాయిలెట్లకు ఆరు లక్షల రూపాయలకు పైగా వ్యయం చేయటం ఒక ముఖ్య నేత తనిఖీలో వెల్లడైంది. దీనితో మిగతా పనులలో జరిగిన అభివృద్ధి పాలెంత, అభివృద్ధి చాటున నిధుల దుబారా చేసిన భాగమెంత అన్న దిశగా ఆరా తీయటంతో అవినీతి, అక్రమాల భాగోతం ఒక్కొక్కటిగా వెలుగుచూసింది. దీనిపై ముఖ్య నేత ఉన్నతాధికారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పర్యవసానంగా అప్పటి కమిషనర్ సెలవుపై వెళ్ళి బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోయినా అప్పటి అభివృద్ధి పనుల బిల్లులు మాత్రం మంజూరుకు నోచుకోకపోగా వివాదాలకు నిలయంగా మారింది. జరిగిన అభివృద్ధి పనులలో 3బోగస్2 పాలు వెలికితీయటంతోపాటు కొందరు అవినీతి అధికారుల గుట్టు కూడా వెలికితీసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనితో ఉన్నతాధికారితోపాటు కొందరు ఇంజినీరింగ్ అధికారులపై కూడా వేటుపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు అధికార వర్గాలలో జోరుగా ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా వర్గాల పేరుతో 3హల్‌చల్2 చేసిన నేతలను కట్టడి చేసేందుకు కూడా ఈ రహస్య విచారణ ఉపయోగపడే అవకాశముంది. అందరినీ కలుపుకుని పోకుండా ఒంటెత్తు పోకడలు పోతున్న వర్గ నేతలపై కూడా చర్యలు చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే గనుక జరిగితే కొత్త మార్పులకు ఉగాది నాంది పలుకనున్నట్లు తెలిసింది.

వైభవంగా చంద్రవౌళీశ్వరస్వామి
రథోత్సవం
ఉరవకొండ, మార్చి 7 : పట్టణంలోని శ్రీకరిబసవస్వామి గవిమఠంలో వెలిసిన శ్రీ చంద్రవౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి రథోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ముం దుగా ఆలయంలో స్వామివారికి అభిషేకం, అలంకరణ, అర్చనలు, పూజలు చేశారు. భక్తుల శివ నామస్మరణాల న డుమ చంద్రవౌళీశ్వర స్వామి ఉత్సవమూర్తులను రథం వరకూ ఊరేగించా రు. రథానికి విశేష పుష్పాలతో, అరటి, మామిడి, టెంకాయ తోరణాలు, నూత న వస్త్రాలతో శోభాయమానంగా అల ంకరించారు. రథంలో ప్రథమ పీఠాధిపతి జగద్గురు కరిబసవ రాజేంద్ర స్వామి, చంద్రవౌళీశ్వరస్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. రథం ముందు వేదపండితులు రథాంగ హో మం, బలిహారణ పూజలు నిర్వహించి జయజయ ధ్వానాలమధ్య గవి మఠం నుంచి ఎదురుగా ఉన్న బసవన్న గుడి వరకూ లాగారు. ప్రతి సంవత్సరంలాగే అనవాయితీ ప్రకారం మంగళవా రం గ్రామపంచాయతీ నుండి చంద్రవౌళీశ్వర స్వామి ఆలయానికి గజమాలను ఊరేగింపుగా తీసుకెళ్లి పూజలు నిర్వహించారు. భక్తులు రథోత్సవానికి టెంకాయలు సమర్చించారు. అలాగే నిమ్మకాయలు, అరటి పండ్లు విసిరి మొక్కుబడులు తీర్చుకున్నారు. రథోత్సవాన్ని తిలకించడానికి హైదరాబాద్, కర్నూలు, అనంతపురం జిల్లాలోని వి విధ ప్రాంతాలతో పాటు కర్నాటక లో ని బెంగళూరు, హొస్పేట్, గంగావతి, సండూర్, రాయచూర్, బళ్లారి తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్య లో తరలివచ్చారు. ప్రస్తుత 8వ పీఠాధిపతి జగద్గురు చెన్నబసవ రాజేంద్రస్వామి, గవి మఠం సహాయ కమిషనర్ ఆనంద్‌ను మేళతాళాలు, బాజభజంత్రీలతో ఊరేగించారు. అనంతరం భక్తి ప్రవచనాలు, ధార్మిక, అధ్యాత్మిక ప్రవచనాల కార్యక్రమాలను నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గుంతకల్లు డిఎస్‌పి రవికుమార్, ఉరవకొండ సిఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కా ర్యక్రమంలో మెజిస్ట్రేట్ సాయికుమారి, ఆర్‌ఐ లింగేష్, పెన్నోబిళం ఇఓ సాకే ర మేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. కాగా రథోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక అనంతపురం రోడ్డులో రైతు సంఘం ఆధ్వర్యంలో సైకిల్ పందెం పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్ర థమ బహుమతి పొందిన వినోద్‌కు రూ. 3, ద్వితీయ బహుమతి అనీల్‌కు రూ.2, తృతీయ బహుమతి పొందిన శ్రీహరికి రూ. 1,116 నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం లో రైతు సంఘం నాయకులు శివన్న, రాఘవేంద్ర ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్ నర్రా కేశన్న, టిడిపి నాయకులు దండాప్రసాద్, శంకరప్ప, రామంజినేయులు, వెలిగొండ బుసప్ప పాల్గొన్నారు.
ఖాద్రీశుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం
* నేడు కల్యాణోత్సవం
కదిరి, మార్చి 7: పట్టణంలోని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయ ంత్రం అంకురార్పణతో ఘనంగా ప్రా రంభమయ్యాయి. ఉదయం స్వామి మూలవిరాట్ శ్రీదేవి, భూదేవి సమేధులైన పరివార సమేతులకు తైలాభ్యంద న, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పూజలు నివేదన కైంకర్యాలను జరిపారు. సాయంత్రం విస్వసేనాది బలిబేరములు యాగశాలకు వేంచేశారు. అక్కడ తూర్యారామాలతో మహా సంకల్పం స్వస్తివాచకాలు, ఆలయ ప్రోక్షణలు, మృత్సంగ్రహణ పూర్వక అంకురార్పణ గావించారు. దేవతా వాహనాలకు పూజలు నివేదనలతో హారతి కార్యక్రమాలు నిర్వహించారు. నవ ధాన్యాలను ఒకచోట చల్లి ఏదిశలో మొలకెత్తుతాయే ఆ ప్రాంతంలో పంటలు బాగా పండుతాయన్నది భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా బెంగళూరుకు చెందిన కెఎన్ నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు వ్యవహరించగా, బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, ఆలయ పాలక మండలి ఛైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబు, ఈఓ వెంకటేశ్వరరెడ్డితోపాటు పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
నేడు కల్యాణోత్సవం..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు రాత్రి స్వామివారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కల్యాణోత్సవం కోసం రూ. 28 లక్షలతో ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. కాగా ఈ కార్యక్రమానికి మంత్రి పరిటాల సునీత హాజరవుతున్నట్లు కందికుంట తెలిపారు.
పకడ్బందీగా ‘పది’ పరీక్షలు
* డిఇఓ లక్ష్మీనారాయణ
అనంతపురం సిటీ, మార్చి 7: పదవ తరగతి పరీక్షలను పక్బందీగా నిర్వహించాలని డిఇఓ పి.లక్ష్మినారాయణ పరీక్షల అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్టమెంటల్ అధికారులతో పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ వంద శాతం పరీక్షలను సజావుగా నిర్వహించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 193 పరీక్ష కేంద్రాల్లో 49,576 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరువుతున్నారని తెలిపారు. ఈ నెల 10వ తేదీన, 13, 20, 21వ తేదీల్లో ప్రశ్న పత్రాలను పరీక్ష కేంద్ర పరిధిలోని పోలీస్ స్టేషన్లుకు పంపడం జరుగుతుందని తెలిపారు. పరీక్ష ప్రశ్న పత్రాలను పోలీస్ స్టేషన్లుకు వచ్చిన సమయంలో చీఫ్‌లు, డిఓలు తప్పకుండా వాటిని తీసుకుని భద్రపరచాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 20 ఫ్లైయింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటుచేశామని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో కూడా ఫర్నిచర్‌ను ఏర్పాటుచేసుకోవాలని తెలిపారు. ఇందుకు సంబందించి గ్రామాల్లోని దాతల సహకారం తీసుకోవాలన్నారు. ప్రతి కేంద్రం వద్ద పరీక్ష సమయంలో 144 సెక్షన్‌ను అమలుచేయాలని, జిరాక్స్ సెంటర్సును మూసివేయించాలని తెలిపారు. ఏ ఒక్క విద్యార్థి కూడా కింద కూర్చుని పరీక్ష రాయకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసి గోవిందనాయక్, డిప్యూటి డిఇఓ చాంద్‌బాషా, చీఫ్ సూపరిండెంటెంట్‌లు, డిపార్టమెంటల్ అధికారులు పాల్గొన్నారు
నిధుల వినియోగంపై ఆడిట్ తప్పనిసరి
* జిల్లా ఆడిట్ అధికారి రామచంద్రారెడ్డి
హిందూపురం టౌన్, మార్చి 7 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే నిధుల వినియోగానికి సంబంధించి తప్పనిసరిగా ఆడిట్ చేయించుకోవాలని జిల్లా ఆడిటింగ్ అధికారి రామచంద్రారెడ్డి అన్నారు. ఆడిట్ నివేదికలు సమర్పించకపోతే కొత్త నిధులు వచ్చే అవకాశం ఉండదన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆడిట్ నివేదికలను పరిశీలించారు. ఈ సందర్భంగా తన ను కలిసిన విలేఖరులతో మాట్లాడు తూ జిల్లాలో అనంతపురం నగర పా లక సంస్థ మినహా మిగిలిన అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ల్లో గత ఏడాదికి సంబంధించిన ఆడి ట్ ప్రక్రియ పూర్తయిందన్నారు. అనంతపురం పాలక సంస్థలో ఆడిట్‌కు సం బంధించి అక్కడి అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో జాప్య ం జరుగుతోందన్నారు. అధికారులు సహకరిస్తే త్వరితగతిన ఆడిటర్లు తమ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వాల నుండి వచ్చిన నిధులను సక్రమంగా ఖర్చు చేసి వాటి వివరాలను సక్రమంగా నమోదు చేయాలన్నారు. నిధుల వినియోగంలో నిబంధనలు పాటించకపోతే అభ్యంతరాలు వస్తాయన్నారు. ప్రతి కార్యాలయంలో తప్పనిసరిగా ఎప్పటికప్పుడు ఆడిటింగ్ చేయించుకుని వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అంతేగాకుండా నిబంధనలకు లోబడే నిధులు ఖర్చు చేయాలన్నారు. ఆడిట్ అభ్యంతరాలపై కూడా సంబంధిత అధికారులు దృష్టి సారించి పరిష్కరించుకోవాలన్నారు. నిధులు దుర్వినియోగం అయి ఉంటే సంబంధిత అధికారుల నుండి రికవరీ చేయాలన్నారు. ఆడిట్ వివరాలను సీనియర్ అకౌంటెంట్లు సునీత, విజయభాస్కర్‌లతో అడిగి తెలుసుకున్నారు.
భవనం సీజ్‌తో కళాశాలకు సంబంధం లేదు
* మంత్రి పల్లె రఘునాథరెడ్డి

అనంతపురం, మార్చి 7 : పన్ను బకాయిలున్నందున కదిరిలో బాలాజీ విద్యా సంస్థలకు చెందిన కళాశాలను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని, ఈ ఘటనకు తమ కళాశాలకు ఏమాత్రం సంబంధం లేదని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి ఫోన్‌లో మాట్లాడుతూ ఆ భవనంలో తాము విద్యాసంస్థను అద్దె ప్రాతిపదికన నడుపుతున్నామన్నారు. భవనానికి సంబంధించి పన్నులు పెండింగ్‌లో ఉన్నందున మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సిబ్బంది సీజ్ చేశారన్నారు. భవన యజమాని బకాయి ఉన్న మొత్తంలో రూ.80వేలు చెల్లించారని, దీంతో అధికారులు భవనాన్ని వినియోగించుకోవడానికి సాయంత్రానికే అనుమతిచ్చారని వివరించారు. అది సొంత భవనమై ఉంటే తమ బాధ్యత ఉండేదన్నారు. భవనం పన్నులకు సంబంధించి కొన్ని నెలల క్రితమే నగదు చెల్లించినా, అది దుర్వినియోగం కావడం వల్లే సదరు యజమానికి రసీదు అందకపోవడం వల్లే కమిషనర్ చర్యలు తీసుకున్నట్లు తెలిసిందన్నారు. తమ విద్యా సంస్థలపైనా, ప్రభుత్వంపైనా బురద జల్లడానికే కొందరు ఈ ఘటనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
వలస వెళ్లిన కూలీలు,
రైతులను ఆదుకోండి
* కలెక్టర్‌కు సిపిఐ నేతల వినతి
అనంతపురం సిటీ, మార్చి 7: జిల్లాలో ఉపాధి లేక జిల్లా నుండి పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీలు, రైతులను సొంత ఊర్లకు రప్పించి ఇక్కడే ఉపాధి కల్పించి ఆదుకోవాలని సిపిఐ ప్రతినిధి బృందం కలెక్టర్ కోన శశిధర్‌ను కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్సు హాల్‌లో సిపిఐ బృందం కలెక్టర్‌ను కలసి వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ జిల్లా నుండి వలస వెళ్లిన కూలీలు స్థితిగతులను తెలుసుకునేందుకు సిపిఐ ప్రతినిధి బృందం, జిల్లా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా బృందం మార్చి 2, 3,4వ తేదీల్లో కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో పర్యటించామన్నారు. ఆయా పట్టణాల్లో వలస కూలీల జీవన పరిస్థితి దుర్భరంగా ఉందన్నారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్‌కు జిల్లా నుండి వేలాదిమంది కూలీలు వలస వెళ్లి అక్కడే కూలీలుగా దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు. కూలీలు ఫుట్‌పాత్‌లు, బస్టాండ్‌లు, మురికి కాలువలు మీద రాత్రివేళల్లో నిద్రిస్తున్నారని, దీంతో వారు అనారోగ్యానికి గురవుతూ తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని తెలిపారు. జిల్లాలో వలసలపై తక్షణమే కలెక్టర్ స్పందించి వారి గ్రామాలకు తిరిగి రప్పించి ఉపాధి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లికార్జున, కాటమయ్య, నాయకులు కేశవరెడ్డి, బి.రామకృష్ణ, మైనుద్దీన్, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వృద్ధుడి ఆత్మహత్య
పెనుకొండ, మార్చి 7 : పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియ ని వృద్ధుడు (66) మంగళవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వృద్ధుడు తెల్లని చొక్కా, పంచె ధరించి ఉన్నాడు. ఈమేరకు హిందూపురం రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం

అనంతపురం సిటీ, మార్చి 7: శాసన మండలి ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశామని, ప్రజలు నిర్భయంగా ఓటేసేలా అన్ని ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కోన శశిధర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక రెవిన్యూ భవన్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆయన విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో శాసన మండలి ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా వున్నామని తెలిపారు. కడప-అనంతపురం-కర్నూలు పట్ట్భద్రులకు సంబందించి మొత్తం 24,9582 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. పట్ట్భద్రులకు సంబందించి కడపలో 78,168, అనంతపురంలో 88,823 మంది, కర్నూల్‌లో 82,591 మంది ఓటర్లున్నారని తెలిపారు. ఉపాధ్యాయులకు సంబంధించి మొత్తం 20,515 ఓటర్లుండగా, కడపలో 5,970, అనంతపురంలో 7,875, కర్నూల్‌లో 6,670మంది ఓటర్లున్నాయని తెలిపారు. పోలింగ్ స్టేషన్లు మొత్తం 524 కాగా, కడపలో 158, అనంతపురంలో 190, కర్నూల్‌లో 156 పోలింగ్ స్టేషన్లున్నాయని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ కోసం ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటుచేశామని, 8వ తేదీ ఉదయం 8 గంటలకు ఈ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చునన్నారు. తదుపరి ఓటు వినియోగించుకున్న పోస్టల్ బ్యాలెట్‌లను పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో సీల్ చేసి ట్రెజరీలో భద్రపరచడం జరుగుతుందన్నారు. కడప, కర్నూలు జిల్లాలో కూడా ఇలాంటి ఏర్పాట్లుచేయడం జరిగిందన్నారు. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో, నిష్పాక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. పోలింగ్ సిబ్బంది నియామకం కూడా 8వ తేదీ ఉదయానికి ఏ పోలింగ్ స్టేషన్‌కు అనేది తెలుస్తుందన్నారు. 41 రూట్లలో ఆర్‌టిసి బస్సుల ఏర్పాటుచేశామని, 5 డివిజన్లలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి పోలింగ్ మెటీరియల్‌తో సిబ్బంది ఈ బస్సులో వెళ్తారన్నారు. అనంతరం జిల్లాకు సంబందించి పోలింగ్ తర్వాత బ్యాలెట్ బాక్సులు నేరుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజి సెంటర్‌లో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూములకు చేరతాయన్నారు. కర్నూలు, కడప జిల్లాకు సంబందించి, ఆయా జిల్లాల్లోని రెవిన్యూ డివిజన్లలో ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్‌లలో ఏర్పాటుచేశారని, వరుసటి రోజు అనంతపురంలోని స్ట్రాంగ్ రూమ్‌లకు చేరతాయన్నారు. స్ట్రాంగ్‌రూమ్‌ల్లో చెదలు నియంత్రణకు ముందుగానే తగిన చర్యలు తీసుకున్నామని, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసుతో, 24 గంటలు సిసి కెమెరాల ఏర్పాటుతో కట్టుదిట్టమైన ఏర్పాట్లుచేశామని తెలిపారు. పోలింగ్ స్టేషన్లలోకి అభ్యర్థులకు సంబందించిన మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తామని, మీడియాను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించమని, పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఎలాంటి వస్తువులు(సెల్‌ఫోన్స్, పుస్తకాలు, పెన్‌లు, కెమెరాలు)లాంటివి కూడా అనుమతించమని తెలిపారు. పోలీంగ్ స్టేషన్లు నుండి వంద శాతం లైవ్ టెలికాస్టింగ్ ఉంటుందని తెలిపారు. ప్రతి ఓటరు ఏదోక గుర్తింపు కార్డుతోపాటు ఓటరు స్లిప్పును కూడా తీసుకెళ్లాలని తెలిపారు.
పోలింగ్ కేంద్రాల్లో
కట్టుదిట్టమైన ఏర్పాట్లు....ఎస్పీ
ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించే పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటుచేశామని ఎస్పీ రాజశేఖర్‌బాబు తెలిపారు. కలెక్టరేట్‌లోని రెవిన్యూ భవన్‌లో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 190 పోలింగ్ కేంద్రాల్లో 2,713 మంది పోలీసు సిబ్బందిని నియమించామన్నారు. 9 మంది డిఎస్పీలు, 21 మంది సిఐలు, 380 మంది ఎస్‌ఐలు, 429 మంది ఎఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుల్స్, 1348 మంది పిసిలు, 380 మంది హోంగార్డులతోపాటు 405 మంది ఆర్మ్డ్ పోలీసు సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లు మీద ప్రత్యేక దృష్టి సారించామన్నారు. 450 మందిని బైండోవర్ చేశామని, వందకుపైగా నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశామన్నారు. పోలింగ్ స్టేషన్‌కు 200 మీటర్ల పరిధిలో ఎలాంటి ప్రచారం నిర్వహించినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని, 20 సమస్యాత్మక ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. 6 ప్రదేశాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, 63 క్విక్ రియాక్షన్ టీంలు ఏర్పాటుచేశామన్నారు. ఈ కార్యక్రమంలో జెసి-1 బి.లక్ష్మికాంతం, డిఆర్‌ఓ మల్లీశ్వరిదేవి, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అనాథ శవాలకు అంతిమ సంస్కారం
* మానవత్వం చాటుకున్న సాయి సంస్థ
అనంతపురం కల్చరల్, మార్చి 7: ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలో గల అనాథ శవాలకు అంతిమ సంస్కారం నిర్వహించిన సాయి సంస్థ సభ్యులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రభుత్వాసుపత్రిలో తన వారు ఎవరూ పట్టించుకోకుండా వదలివెళ్లిన అనాధ శవాలు 15 రోజులుగా మార్చురీలోనే ఉంటున్న కారణంగా వాటి నుండి దుర్గంధం వస్తోంది. దీనిపై స్పందించిన సాయి సంస్థ సభ్యులు సోమ, మంగళవారాల్లో రోజుకు 4 శవాలకు చొప్పున దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి సంస్థ అధ్యక్షులు విజయసాయి మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి, ఆసుపత్రి సూపరింటెండెంట్, ఎమ్మార్వో సహకారంతో 8 శవాలకు అంతిమ సంస్కారం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కిరణ్‌కుమార్, జగదీష్, రామాంజినేయులు, భాస్కర్, నాగరాజు పాల్గొన్నారు.
దీక్ష విరమించిన ఆరోగ్య కార్యకర్తలు
అనంతపురం కల్చరల్, మార్చి 7: విధుల నుండి తొలగించినందుకు నిరసనగా డిఎంహెచ్‌ఓ కార్యాలయం ముందు దీక్ష చేపట్టిన ఆరోగ్య కార్యకర్తలు తమ దీక్షను విరమించారు. 24 మంది ఆరోగ్య కార్యకర్తలను విధుల నుండి తొలగించడంతో వారు దీక్షకు దిగారు. దీనిపై స్పందించిన డిఎంహెచ్‌ఓ వెంకటరమణ వారితో చర్చించి తిరిగి విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీక్ష చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు డిఎంహెచ్‌ఓ నిమ్మరసం అందించి దీక్ష విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు నరసింహులు, బాలపెద్దన్న, లక్ష్మన్న, నాగరాజు, చంద్రశేఖర్, భాస్కర్, ఇదయతుల్లా, రామాంజినేయులు పాల్గొన్నారు.
స్టాలిన్‌కు నివాళి
అనంతపురం అర్బన్, మార్చి 7: సమాజంలో వున్న అంతరాలు తొలగిపోవాలంటే సోషలిస్ట్ భావాలను ప్రపంచం అమలుచేయాల్సిన అవసరం ఎంతైనా వుందని. పెట్టుబడిదారి విధానం వల్ల అవాంతరాలు పెరుగుతున్నాయేకాని తగ్గడం లేదని ఎస్‌యుసిఐ (సి) జిల్లా కార్యదర్శి అమర్‌నాథ్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ దిగ్గజం స్టాలిన్ వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభను నిర్వహించారు. సభకు నగర కమిటి సభ్యులు ప్రతాప్‌సింగ్ అధ్యక్షతవహించారు. ముఖ్య ఉపన్యాసకులుగా హాజరైన ఆ పార్టీ జిల్లా కార్యదర్శి అమర్‌నాథ్ మాట్లాడుతూ చారిత్రాత్మక నవంబర్ సోషలిస్ట్ మహావిప్లవం శతాబ్దిని ఏడాది పొడవునా జరుపుకోవడం జరుగుతుందన్నారు. భారతదేశంలో ప్రధాని మోదీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విధానాలను వేగంగా అమలుచేయటంలో దూసుకెళ్తున్నారన్నారు. వీటి అమలువల్ల భవిష్యత్‌లో ఏర్పడబోయే దుష్ఫరిణామాలు తాము ప్రజల్లో చైతన్యాన్ని నింపటం జరుగుతుందన్నారు. సమావేశంలో ఎస్‌యుసిఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు లలిత, నగర కార్యదర్శి రాఘవేంద్ర, నాయకులు నాగరాజు, నరేంద్ర, రమ్య పాల్గొన్నారు.

పోలింగ్ నిర్వహించే పాఠశాలలకు
8, 9 తేదీల్లో సెలవు
అనంతపురం సిటీ, మార్చి 7: ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసిన కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఈ నెల 8, 9వ తేదీల్లో సెలవు దినాలుగా ప్రకటించినట్లు కలెక్టర్, ఎన్నికల అధికారి కోన శశిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్ట్భద్రులకు 125, టీచర్స్‌కు 65, మొత్తం 190 పోలింగ్ స్టేషన్లను జిల్లాలో ఏర్పాటు చేశామన్నారు. వీటికి మాత్రమే సెలవు వుంటుందని, మిగిలిన కార్యాలయాలు, విద్యాసంస్థలు యథావిధిగా పనిచేస్తాయన్నారు. అదేవిధంగా అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 20వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తున్న సందర్భంగా ఈ విద్యాసంస్థకు కూడా సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు.

హోదా కోసం పోరాడే వారినే గెలిపించండి
* ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని
అనంతపురం కల్చరల్, మార్చి 7: రాష్ట్రంలో పట్ట్భద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో విభజన హామీల కోసం పోరాడే వ్యక్తులనే ఎమ్మెల్సీలుగా పంపాలని ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈమేరకు నగరానికి వచ్చిన ఆయన ఓ లాడ్జిలో విలేఖరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, పరిశ్రమల ఏర్పాటు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎవరైతే పోరాటం సాగిస్తారో అటువంటి వారినే గెలిపించాలని కోరారు. సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, మైనార్టీ విద్యార్థి సమాఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో విజయం సాధిస్తాం
అనంతపురం సిటీ, మార్చి 7: సీమలోని ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో ఎన్నికల్లో గెలుపొందుతానని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న ఒంటేరు శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో విస్తృత ప్రచారం నిర్వహిం చామన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత 30 సంఘాలను కూడగట్టుకుని విస్తృత ప్రచారం నిర్వహించామన్నారు. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులను కలిసేందుకు కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలోని ప్రతి పాఠశాలలకు వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నామన్నారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న మునిసిపల్ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్, భాషా పండితులు, పిఈటీల ఉన్నతీకరణను అలవోకగా సాధించామన్నారు. 2012 బ్యాచ్‌కు చెందని జూనియర్ లెక్చరర్స్‌కు రెగ్యులరైజేషన్ చేయించినట్లు తెలిపారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధన కోసం ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం శాఖ మంత్రి రాజనాథ్‌సింగ్‌ను కలసి రాష్టప్రతి సవరణ ఉత్తర్వులు కోసం ప్రయత్నించామన్నారు. ఉపాధ్యాయ సామర్థ్య పరీక్ష రద్దు చేయించినట్లు తెలిపారు. సిపిఎస్, సిసిఈ విద్యా విధానాల రద్దుకై కేంద్రంపై వత్తిడి తీసుకువచ్చేందుకు పోరాడుతున్నామన్నారు. ఉపాధ్యాయులంతా తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ముందుంటాం
అనంతపురం సిటీ, మార్చి 17: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ముందుటామని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పోచంరెడ్డి సుబ్బారెడ్డి అన్నారు. రాయలసీమలో గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం, ఉద్యమాలు, యూనియన్లలో పనిచేసిన అనుభవంతో ఉపాధ్యాయులతో నేరుగా పరిచయాలు పెంచుకుని మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గత సంవత్సరం నుండి ఉపాధ్యాయులతో కలసి పనిచేస్తూ వారి సమస్యలు తెలుసుకునిపరిష్కారానికి చర్యలు తీసుకున్నామన్నారు. గతంలో పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవంతో పాఠశాలలు తిరిగి ఉపాధ్యాయులను కలిశామన్నారు. అప్పట్లో ఉపాధ్యాయుల సమస్యల సాధనలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చామని, కొన్ని అంశాలు పరిష్కరించ గలిగామన్నారు.
భవిష్యత్తులో ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ఉపాధ్యాయులను కలుస్తూ మద్దతు కూడగట్టామన్నారు. ఉపాధ్యాయులంతా తనకే ఓటు వేస్తారన్న ధీమా వ్యక్తం చేశారు.