అనంతపురం

గ్రాడ్యుయేట్స్‌లో వైకాపా దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 21: పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో వైకాపా అభ్యర్థి దూసుకుపోతున్నాడు. సోమవారం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు మంగళవారం రాత్రి వరకూ కొనసాగింది. పట్ట్భద్రుల ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఎన్‌జిఒ సంఘం మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డి ఆధిక్యతలో కొనసాగుతూ ముచ్చెమటలు పట్టిస్తున్నారు. టిడిపి అభ్యర్థికెజె.రెడ్డి ద్వితీయ స్థానం, పిడిఎఫ్ అభ్యర్థి గేయానంద్ తృతీయ స్థానంలో కొనసాగుతున్నారు. బిజెపికి చెందిన ఇల్లూరు ఉమాకాంతరెడ్డి ఆరు రౌండ్లలో 1413 ఓట్లు సాధించగా, మిగతా అభ్యర్థులందరూ రెండంకెలు, మూడంకెల ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొత్తం ఆరు రౌండ్లలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగింది. ఇందులో వైకాపా, టిడిపి అభ్యర్థుల్లో ఎవరికీ కోటా ఓట్లు రాలేదు. దీంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును మొదలుపెట్టారు. ఈ సందర్భంగా పట్ట్భద్రుల స్థానానికి పోటీలో ఉన్న 25 మంది
అభ్యర్థుల్లో ఎలిమినేషన్ ద్వారా ఓట్ల లెక్కింపు చేయక తప్పలేదు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి వరకు 11 మంది అభ్యర్థుల్ని ఎలిమినేషన్ పద్ధతిలో తొలగించి వారి ఓట్లను విభజించి మిగిలిన అభ్యర్థులకు కేటాయించారు. ఆ సమయానికి వెన్నపూస గోపాల్‌రెడ్డి 53,834 ఓట్లతో మరోమారు ఆధిక్యతను చాటుకున్నారు. ద్వితీయ స్థానంలో 41,162 ఓట్లతో కెజె.రెడ్డి, 33,015 ఓట్లతో డాక్టర్ గేయానంద్ మూడవ స్థానంలో నిలిచారు.
మొత్తం 6 రౌండ్లలో తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కించగా ప్రతి రౌండ్‌లో వైకాపా అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి 2వేల పైచిలుకు ఓట్ల మెజార్టీని చాటుతూ వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు 53,714 ఓట్లు రాగా, రెండో స్థానంలో ఉన్న కెజె.రెడ్డికి 41,037 ఓట్లు, డాక్టర్ గేయానంద్‌కు తృతీయ స్థానంలో 32,819 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన మాసూలు శ్రీనివాసులు 768 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్ అభ్యర్థి, బిజెపికి చెందిన ఇల్లూరు ఉమాకాంత్‌రెడ్డికి 1413 ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో వైకాపా అభ్యర్థి తొలి రౌండులో తన సమీప ప్రత్యర్థి కెజె.రెడ్డికన్నా 2,145 ఓట్లు, రెండో రౌండులో 1374, మూడవ రౌండ్‌లో 2045, నాల్గవ రౌండులో 2651, ఐదో రౌండులో 2086, ఆరో రౌండులో 2016 ఓట్ల మెజార్టీని కనబరుస్తూ వచ్చారు. మొత్తం ఆరు రౌండ్లలోనూ 10 వేల పైచిలుకు ఓట్ల తేడాతో వెన్నపూస గోపాల్‌రెడ్డి ముందంజలో దూసుకుపోతున్నారు. బుధవారం ఉదయానికి స్పష్టమైన ఫలితాలు వెలువడే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు ప్రకటించారు.

చెల్లని ఓట్లు 18,383
* నోటా కోటాలో 1576

అనంతపురం, మార్చి 21: పట్ట్భద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు నేపథ్యంలో చెల్లని ఓట్లు అభ్యర్థుల్ని, అధికారులను కంగు తినిపించాయి. ప్రథమ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆరు రౌండ్లలో మొత్తం 18,383 ఓట్లు చెల్లకుండా పోయినట్లు ఎన్నికల అధికారులు గుర్తించారు. ఇంత భారీగా ఓట్లు ఎందుకు చెల్లకుండా పోయాయన్న ప్రశ్న ప్రతి ఒక్కరినీ తొలిచేసింది. ఓటర్లు అవగాహన రాహిత్యంతో నిబంధనలకు విరుద్ధంగా ఓటు వినియోగించుకోవడం వల్లే ఇలా జరిగిందని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటు వేసే విధానంపై అభ్యర్థులతోపాటు ఓటర్లకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు నిర్లక్ష్యం కారణంగానే ఓటు ఎలా వేయాలో తెలియలేదన్న విమర్శలున్నాయి. కాగా 1576 మంది ఓటర్లు తమ ఓటును నోటా(నన్ ఆఫ్ ది ఎబౌ)కు వేసి అభ్యర్థులెవరూ తమకు నచ్చలేదని తేల్చి చెప్పారు. కాగా నోటాకు వేసిన ఓట్లలో చాలా మంది అవగాహన లేకపోవడం వల్లే అభ్యర్థుల పేర్ల బదులు వేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత ఏడాదికన్నా ఈ ఏడాది ఇంత పెద్ద ఎత్తున ఓట్లు చెల్లకుండా పోవడం విశేషం.
‘ఉపాధి’ బిల్లుల కోసం
ఎదురుచూపు!
* బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న కూలీలు
* మరుగుదొడ్ల పరిస్థితి అంతే...
నల్లమాడ, మార్చి 21 : కష్టకాలంలో కల్పతరువుగా వుండాల్సిన ఉపాధి హామీ ప్రస్తుతం కూలీలకు మరింత కష్టాన్ని తెచ్చిపెడుతోంది. పనులు చేసి నెలలు గడుస్తున్నా బిల్లులు చెల్లించకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 7,65,650 మంది జాబ్ కార్డుదారులున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఫారంపాండ్ల పనులు అధికంగా జరుగుతున్నాయి. ఇంతవరకు ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు 5 వారాలుగా కూలీ మొత్తాలు అందకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా కూలీనాలీ చేసుకుంటూనే తమ పిల్లలను మంచి పాఠశాలల్లో చదివించుకుంటున్న వారు పిల్లల ఫీజులు చెల్లించకపోవడంతో పాఠశాలల యాజమాన్యం తీవ్ర ఒత్తిడి తెస్తున్నారంటూ వాపోతున్నారు. అదేవిధంగా ఉపాధి హామీ ద్వారా జిల్లా వ్యాప్తంగా 29,000 మరుగుదొడ్ల నిర్మాణం జరగాల్సి వుండగా ఇప్పటికి 9903 పూర్తయి మిగిలినవి పనులు జరుగుతున్నాయని సంబంధిత అధికారులు చెప్తున్నారు. ఈ పనులు పూర్తయిన వివరాలు జిల్లా అధికారులకు మండల పరిషత్ అధికారులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి వుంది. అధికారులు ఇంకా పనులు జరగాల్సి వుంది అని చెప్తున్న గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో పనులు పూర్తయి అప్‌లోడ్‌కి నోచుకోనివి చాలా వున్నాయి. మరుగుదొడ్లను నిర్మించుకుంటే రూ. 12 వేలు కేంద్ర ప్రభుత్వం, రూ. 3 వేలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బిల్లులు మంజూరు చేస్తోంది. పల్లెల్లో చాలామంది ఇటుక, సిమెంటు, ఇసుకకు అప్పులు చేసి నిర్మాణాలు పూర్తి చేసుకుని బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. విడతల వారీగా కొన్నింటికి బిల్లులు మంజూరు చేసినా పూర్తిస్థాయిలో అందాల్సినవి నిర్మాణాలు పూర్తిచేసుకున్న వాటిలో 95శాతం వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఉపాధి హామీ ద్వారా వర్షాధార భూముల్లో పండ్ల తోటల పెంపకాలు కూడా చేబట్టారు. సుమారు 38 వేల ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం ఉపాధి హామీ ద్వారా చేబట్టినట్లు అధికారులు చెప్తున్నారు. వాటికి కూడా 3 సంవత్సరాల వరకు నీరు, కాపలా, పర్యవేక్షణకు ఒక్కో మొక్కకు ఒక్క రూపాయి చొప్పున చెల్లించాల్సి వుంది. వాటికి కూడా పూర్తిస్థాయిలో బిల్లులు అందజేయడం లేదు. గతంలో అయితే తపాలా కార్యాలయాల ద్వారా ఉపాధి బిల్లుల పంపిణీ జరిగేది. అయితే తపాలా అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఉపాధి కూలీలకు చెందిన బ్యాంకుల ఖాతాల్లోకే ప్రస్తుతం బిల్లుల మొత్తాలను జమ చేస్తున్నారు. దీంతో తాము చేసిన ఉపాధి పనులకు సంబంధించి ఏమైనా బిల్లుల మొత్తాలు తమ ఖాతాల్లో జమ అయ్యాయేమోనని వందలమంది ప్రతి రోజూ బ్యాంకుల వద్దకు వచ్చి బిల్లుల మొత్తాలు వారి ఖాతాల్లో జమకాలేదని తెలుసుకుని ఉసూరుమంటూ వెనుతిరుగుతున్నారు. ఏదైనా అత్యవసరానికి ఇతరుల దగ్గర అప్పులు చేసి బిల్లులు మంజూరైనప్పుడు తిరిగి ఇచ్చేద్దామనుకున్నా చిల్లిగవ్వ కూడా అప్పు పుట్టడం లేదని ఉపాధి కూలీలు వాపోతున్నారు. మొత్తంగా ఉపాధి హామీ ద్వారా జరుగుతున్న పలు అభివృద్ధి పనులకు సంబంధించి పనులు చేసిన కూలీలకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పలువురు కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సివస్తోంది. ఎంత పనిచేసినా సకాలంలో కూలీలు అందే పరిస్థితులు లేవన్న బాధతో ఉపాధి పనులపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న కూలీలు వలసబాట పడుతున్నారు. కరువుతో అల్లాడుతున్న ప్రస్తుత సమయంలో కూలీలకు ఉపాధి హామీ ద్వారా అందాల్సిన బిల్లులు సకాలంలో చెల్లించడంలో అధికారులు ఆలస్యం చేయకూడదని ఉపాధి కూలీలు కోరుతున్నారు.
ఐదువారాలైనా.. బిల్లు రాలేదు...
నరసింహులు, ఉపాధి కూలీ, నల్లమాడ...
గతేడాది 150 రోజులు పనిచేశాము. అప్పటివి సగం బిల్లు రాలేదు. ఈ ఏడాది కూడా 5 వారాలు పనిచేశాను. ఇంతవరకు బిల్లు రాలేదు. కేవలం ఉపాధి హామీ పనులు చేసుకుంటూనే కుటుంబపోషణతోపాటు ఇద్దరు కుమార్తెలను చదివించుకుంటున్న. పెద్దమ్మాయి ఎమ్మెస్సీ బయోటెక్, చిన్నమ్మాయి బీయస్సీ నర్సింగ్ చదివిస్తున్నా. వారికి ఫీజులు చెల్లించాలి. చిల్లిగవ్వ కూడా అప్పు పుట్టడం లేదు. ఉపాధి హామీ బిల్లులు అందజేసి ఆదుకోండి.

సైకిలెక్కనున్న కొట్రికె!
* మాజీ ఎమ్మెల్యేతో ఎంపి జెసి మంతనాలు
గుత్తి, మార్చి 21 : మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కొట్రికె మధుసూదన్‌గుప్తా తెలుగుదేశం పార్టీ వైపు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం ఎంపి జెసి దివాకర్‌రెడ్డి రెండు రోజుల క్రితం రహస్యంగా మంతనాలు జరిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఇరువురి మధ్య రాజకీయంగా పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో త్వరలో నియోజకవర్గాల పునర్విభజన జరుగనున్నదని రాజకీయంగా కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఇరువురి మధ్య అంగీకారం కుదిరినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తా, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో గుంతకల్లు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోగలిగారు. రాష్ట్ర విభజన అనంతరం చోటు చేసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన మధుసూదన్‌గుప్తా 2014 ఎన్నికల్లో టిడిపి టికెట్‌ను ఆశించారు. అప్పుడు నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అవకాశం ఆఖరి నిమిషంలో చేజారిపోయింది. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అప్పటి నుండి రాజకీయాలకు మధుసూదన్‌గుప్తా దూరంగా ఉంటూ వచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా తనకంటూ ఒ వర్గాన్ని తయారుచేసుకున్న మధు 2019 ఎన్నికల్లో పోటీ చేయాలని దాదాపు అభిమానుల నుండి పెద్ద ఎత్తున ఒత్తిడి పెరుగుతూ వస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం మొదటిలో బిజెపిలో చేరుతానని పెద్ద ఎత్తున ప్రచారం సాగినప్పటికి ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశాలు పెద్దగా లేవని భావించిన ఆయన ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. అదే క్రమంలో నియోజకవర్గంలో ఆయన అనుచరులపైనా అక్కడక్కడా అడపాదడపా అధికార పార్టీ నేతల నుండి, పోలీసుల నుండి ఇబ్బందులు ఏర్పడినప్పటికి రాజకీయ కార్యకలాపాలను వేగవంతం చేస్తే తన అనుచరులకు మరిన్ని ఇబ్బందులకు తప్పవని ప్రస్తుత పరిస్థితుల్లో వేచిచూసే ధోరణే సరైనది తన అనుచరుల వద్ద తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మరో రెండు సంవత్సరాల్లో ఎన్నికలు రానుండడంతో 2019 ఎన్నికల్లో పోటీ చేసి తీరాలన్న ధీమాతో ఉన్న ఆయనను రాష్ట్రంలోని అధికార పార్టీ నేతలతోపాటు అటు కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం పార్టీలోకి చేరాల్సిందిగా ఆహ్వానిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేనందున అధికార పార్టీలోకి చేరి తిరిగి తన రాజకీయ ప్రస్థానాన్ని పునః ప్రారంభించడానికి దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే గత కొంత కాలంగా ఎంపి జెసి దివాకర్‌రెడ్డి మధుసూధన్ గుప్తను వీలైనంత త్వరగా పార్టీలోకి చేర్పించడానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. అయితే మధుసూదన్‌గుప్తా పార్టీలోకి చేరే సమయానికి పెద్ద ఎత్తున తన అనుచరులతో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని, అయితే ఈ కార్యక్రమానికి టిడిపి యువ నేత లోకేష్‌ను ఆహ్వానించడమా లేక రాయలసీమ జిల్లాల ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్న సిఎం రమేష్ సమక్షంలో చేరాలా అన్న విషయంపై తర్జన భర్జనలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తా ఫోన్‌లో సంప్రదించగా తనకు, జెసి దివాకర్‌రెడ్డికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయన్నారు. అయితే 2019 ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని అయితే రంగప్రవేశం చేయడానికి మరింత సమయం ఉందని ఆయన సమాధానం ఇచ్చారు.
నయనానందంగా పుష్ప యాగోత్సవం
* ముగిసిన బ్రహ్మోత్సవాలు
కదిరి, మార్చి 21: శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి వేడుకగా మంగళవారం రాత్రి పుష్ప యాగోత్సవం నేత్రపర్వంగా సాగింది. శ్రీదేవి, భూదేవి సమేత వసంత వల్లభుడు కళ్యాణమండప వేదికపై ఆశీనులనుగావించారు. వసంత వల్లభుడును వివిధ సుగంధ, పుష్ప, ఫలాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. చూపరులను కళ్లు తిప్పుకోలేనంతగా రమణీయంగా పుష్పాలతో పొందిక చేశారు. ఆలయ అర్చకులు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్పయాగోత్సవంలో బ్రహ్మోత్సవాలకు హాజరైన భక్తజన బృందాన్ని ఆశీర్వదిస్తారని ప్రతిథి. లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు నాలుగు చతుర్థిక భవనాల నుండి హాజరైన ఇంద్రాద్రి అష్టదిక్పాలకులకు, ముక్కోటి దేవతలకు ద్వాదశారాధనతో చందన, ఫల, పుష్ప తాంబూళాలు సమర్పించారు. వారివారి లోకాలకు పంపే పద్ధతిని పాటించారు. అనంతరం ప్రధాన అర్చకులకు ఆలయ ఈఓ వెంకటేశ్వరరెడ్డి, పాలక మండలి ఛైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబు, సభ్యులు కలిసి వస్త్ర బహుమానం జరిపి ఆలయ మర్యాదాలతో అర్చకులను వారి తిరుమాళిగకు పంపారు. ఇలా శ్రీవారి బ్రహ్మోత్సవాల కార్యకలాపాలు మంగళకరంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా పూల అశ్వర్థనారాయణ, కుసుమ కుమారి వ్యవహరించగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
శ్రీవారి హుండీ లెక్కింపు
నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో జరిగిన 15 రోజులకుగాను స్వామివారికి భక్తులు సమర్పించిన హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించగా రూ. 16.89 లక్షలు ఆదాయం వచ్చింది. బుధవారం కూడా హుండీ ఆదాయం లెక్కిచనున్నట్లు ఈఓ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆలయ సిబ్బందితోపాటు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి ఛైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబు, సభ్యులు మోపూరిశెట్టి చంద్రశేఖర్, రొడ్డారపు నాగరాజు, ఇద్దే రఘునాథ్‌రెడ్డి, సురగాని రవికుమార్, సభ్యులు పాల్గొన్నారు.
సామూహిక వివాహాలకు
పేర్లు నమోదు చేసుకోండి
మడకశిర, మార్చి 21 : శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా మండల పరిధిలోని నీలకంఠాపురంలో నిర్వహించే సామూహిక వివాహాలకు ఏప్రిల్ 3వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఎన్. రఘువీరారెడ్డి సూచించారు. మంగళవారం నీలకంఠాపురంలోని నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో గోవిందాపురం, గంగులవాయిపాళ్యం గ్రామాలకు చెందిన ప్రజలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 5 నుంచి 8వ తేదీ వరకూ శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఉత్సవాల నిర్వహణపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు. ఏప్రిల్ 5న ఉదయం 8 గంటల నుంచి సీతారాముల కల్యాణం, 9న సామూహిక వివాహాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో వివాహం చేసుకోవాలనుకునే యువతీ, యువకులు స్థానిక నీలకంఠేశ్వరస్వామి ఆలయ అర్చకుల వద్ద పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఈ వివాహాల్లో మంగళసూత్రంతో పాటు వధూవరులకు దుస్తులు, వారి తరపు బంధువులకు భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు లక్ష్మీదేవమ్మ, హనుమక్క, మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్లు ప్రభాకర్‌రెడ్డి, నరసింహమూర్తి, అనిల్‌బాబు పాల్గొన్నారు.

భగ్గుమంటున్న శింగనమల
* 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు..
అనంతపురం అర్బన్, మార్చి 21: జిల్లాలో అత్యధికంగా ఇప్పటి వరకు నమోదైన ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలుగా ఉండగా శింగనమల మండలంలో మూడు రో జులుగా 43 డిగ్రీలకు తగ్గకుండా నమోదవుతోంది. మంగళవారం శింగనమల మండలంలో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉరవకొండలో 33.8 డిగ్రీల త క్కువ ఉష్ణోగ్రత నమోదైంది. కదిరిలోని కొర్రకోడులో 42.3, బుక్కరాయసము ద్రం వెంకటాపురంలో 42.2, పామిడి 41.6, యల్లనూరు 41.5, గుంతకల్లు మండలం నాగసముద్రం 41.1, తాడిమర్రి 41.1, చెనే్నకొత్తపల్లి 40.9, ధర్మవరం 40.7, కొత్తచెరువు మండలం బండ్లపల్లి 40.7, అనంతపురం 40, కదిరి 39.9, గుంతకల్లు 39.5, గుత్తి 39.2, కళ్యాణదుర్గం 38.8, పుట్టపర్తి 38.8, పెనుకొండ 38.6, హిందూపురం 37.9 నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రతిష్టాత్మకంగా ‘పురం’ వార్డు ఉప ఎన్నిక
* టిడిపి తరపున శాంతి - వైకాపా నుండి సునీత
* కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో సందిగ్ధం
హిందూపురం, మార్చి 21: వచ్చే నెల 9వ తేదీన జరుగు స్థానిక మున్సిపల్ 9వ వార్డు ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున బోయ గంగమ్మ గెలుపొందగా అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఆ వార్డుకు ఉప ఎన్నిక జరుగుతుండగా మళ్లీ తమ స్థానాన్ని పదిలపరచుకొనేందుకు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక దృష్టి వహిస్తోంది. ఇందులో భాగంగా గంగమ్మ రెండో కోడలు శాంతిని బరిలోకి దించనున్నారు. గత రెండు రోజులుగా టిడిపి నేతలు సమావేశమై అభ్యర్థి ఎంపికపై మంతనాలు సాగించారు. టిడిపి నాయకుడు లింగప్ప భార్య మీనాక్షిని బరిలోకి దించాలని ఒత్తిళ్లు రాగా గతంలో ఆమెకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చేతిలో ఓటమి చెందినందున ఆయన సోదరుడు భార్య శాంతిని ఎట్టకేలకు అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే గత మున్సిపల్ ఎన్నికల్లో కొద్ది ఓట్ల తేడాతో ఓటమి చెందిన వైకాపా ఈ ఉప ఎన్నికలో ఆ వార్డులో గెలుపొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అన్ని విధాలా బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు దృష్టి పెడుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్ భార్య సునీత అభ్యర్థిత్వంపై మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈమేరకు నామినేషన్ దాఖలుకు అవసరమైన ప్రక్రియపై ఆమె వర్గీయులు దృష్టి పెట్టారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ సైతం తప్పకుండా అభ్యర్థిని బరిలోకి దింపేందుకు కృషి చేస్తోంది. పిసిసి చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి కూడా ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ తరపున అభ్యర్థిని బరిలో దించాలని స్థానిక నాయకులను ఆదేశించగా బలమైన అభ్యర్థి కోసం దృష్టి పెట్టారు. భారతీయ జనతా పార్టీ ఈ వార్డును తమకు కేటాయించాలని మిత్రపక్షమైన టిడిపిని కోరుతోంది. అయితే గతంలో తాము గెలవడం, తమ కౌన్సిలర్ మృతి చెందడంతో ఈ ఉప ఎన్నికలో పోటీ చేయకపోతే పార్టీ వర్గీయులు అసంతృప్తికి గురవుతారని బిజెపి నాయకులకు నచ్చచెప్పి తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సహకరించాలని నేతలు కోరారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల్లోగా నామినేషన్‌ల దాఖలుకు తుది గడువు ఉండటంతో ప్రధాన పార్టీలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. గత సార్వత్రిక, స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల అనంతరం ప్రప్రథమంగా పార్టీల గుర్తుల తరపున ఈ ఉప ఎన్నిక జరుగుతుండటంతో టిడిపి, వైకాపాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీనికితోడు తెలుగుదేశం పార్టీకి చెందిన మున్సిపల్ ఛైర్‌పర్సన్ రావిళ్ళ లక్ష్మి ఇదే వార్డు పరిధిలో నివాసం ఉండటంతో ఆమెకు ఈ ఉప ఎన్నిక మరింత ప్రతిష్టాత్మకమయింది.
శ్రీవారి సేవలో ఐఎఎస్ బృందం
కదిరి, మార్చి 21: పట్టణంలోని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామిని మంగళవారం ఐఎఎస్‌ల బృందం శ్రీవారిని దర్శించుకున్నారు. కేంద్ర ఎన్నికల ప్రత్యేక పరిశీలకులైన ఐఎఎస్ అధికారులు శ్రీవాస్తవ, రాజేష్ కుమార్, వీరేంద్రకుమార్‌లకు ఆలయ సాంప్రదాయం ప్రకారం అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం ఆలయ విశిష్ఠతను అర్చకులచే అడిగి తెలుసుకున్నారు. పాలక మండలి ఛైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబు, ఈఓ వెంకటేశ్వరరెడ్డి, అర్చకులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు, ప్రతిమను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు మోపూరిశెట్టి చంద్రశేఖర్, రొడ్డారపు నాగరాజు, ఎస్‌ఐ గోపాలుడు తదితరులు పాల్గొన్నారు.
డిఎస్పీ కార్యాలయం తనిఖీ
అనంతపురం అర్బన్, మార్చి 21: అనంతపురం సబ్ డివిజన్ పోలీసు కార్యాలయాన్ని రాయలసీమ ఐజి శ్రీ్ధరరావు, ఎస్పీ రాజశేఖరబాబుతో కలసి మంగళవారం తనిఖీ చేశారు. ముందుగా డిఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఐజి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, కొన్ని సూచనలు చేశారు. సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల రికార్డులను, కేసులను లోతుగా సమీక్షించారు. కొన్ని ముఖ్య కేసుల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారో నిశితంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణ, కేసుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎఎస్పీ మాల్యాద్రి, అనంతపురం డిఎస్పీ మల్లికార్జున వర్మ, సిఐలు శివనారాయణస్వామి, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
సమాజానికి ఉపయోగపడేలా బడ్జెట్ ఉండాలి
* ఎస్కేయూ రెక్టార్ ఆచార్య లజపతిరాయ్
అనంతపురం సిటీ, మార్చి 21: సమాజ హితం కోసం ఉపయోగపడేలా బడ్జెట్ కేటాయింపులు ఉండాలని, ఆ కేటాయించిన నిధులు సక్రమంగా వినియోగం జరగాలని ఎస్కేయూ రెక్టార్ ఆచార్య హెచ్.లజపతిరాయ్ పేర్కొన్నారు. సెంటర్ ఫర్ సోషల్ ఎక్స్‌క్లూజివ్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు సమావేశాన్ని మంగళవారం డైరెక్టర్ ఆచార్య బావయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెక్టార్ హాజరై మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం బడ్జెట్‌ను కేటాయిస్తున్నా, వాటి వినియోగం సక్రమంగా జరగడం లేదన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లోనే లొసుగులు ఉన్నాయని, వాటిని అధికమించే దిశగా కృషి చేయాలని, ఏదైనా సంఘటనలు జరిగిన తర్వాత పునరావాసాలపై దృష్టిసారించి బడ్జెట్ కేటాయిస్తున్నారుకానీ, ఆ ప్రమాదాలు, సంఘటనలు జరుగకుండా చూసేందుకు బడ్జెట్ కేటాయింపులు జరగడం లేదన్నారు. నిధులు వినియోగంపై సామాజిక తనిఖీ ఉండాలన్నారు. బడ్జెట్‌ను ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్కేయూ ఓఎస్‌డి ఆచార్య ఎవి.రమణ, అసిస్టెంట్ డైరెక్టర్లు డా.డి.శ్రీనివాసులు, కె.వెంకటరెడ్డి, ఉషారాం, కొండారెడ్డి, పద్మావతి, ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
భర్త ఆత్మహత్య
* ఆసుపత్రిలో భార్య ఆత్మహత్యాయత్నం
తాడిపత్రి, మార్చి 21: కుటుంబ కలహాలు ఆ కుటుంబాన్ని ఛిద్రం చేశాయి. భర్త ఆత్మహత్యకు పాల్పడంటంతో మనస్థాపానికి గురైన భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో చిన్నారి రోదన అరణ్య రోదనగా మారిన సంఘటన మంగళవారం చేనేత కాలనీలో చోటు చేసుకుంది. చేనేత కాలనీలో నివాసముంటున్న షాషావలి(24), కర్నూలు జిల్లా అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రమీజా (21)తో నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి కౌసర్(2)అను కుమార్తె ఉంది. షాషావలి ఓ షాపులో గుమాస్తాగా పనిచేస్తుండే వాడు. కుటుంబ కలహాలతో మంగళవారం ఇంటిలో క్రిమిసంహారక మందును తాగడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. షాషావలి తాగిన పురుగుల మందు డబ్బాను వైద్యులకు చూపించడానికి ఆసుపత్రికి తీసుకు వచ్చారు. షాషావలిని పరిశీలించిన వైద్యులు మృతి చెందాడని తెలుపడంతో తీవ్ర మనస్థాపానికి గురైన రమీజా భర్త తాగగా మిగిలిన పురుగుల మందును ప్రభుత్వ ఆసుపత్రిలో తాగింది. అప్రమత్తమైన వైద్యులు వెంటనే ప్రథమ చికిత్స గావించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
మడకశిర, మార్చి 21 : పట్టణంలోని శ్రీ అయ్యప్పస్వామి ఆలయం వెనుక భాగంలోని ఓ రైతు తోటలో చింతచెట్టుకు గుర్తు తెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం బహిర్భూమికి వెళ్లడానికి పలువురు వ్యక్తులు అటు వైపు రాగా దాదాపు 38 ఏళ్ల వయస్సున్న వ్యక్తి తన పంచెతోనే చెట్టుకు ఉరేసుకున్న విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఎస్సై మక్బుల్‌బాషా, ఎఎస్సై బాబులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు వేసుకున్న షర్టులో ఎలాంటి ఆధారాలూ లభించలేదు. ఉరేసుకున్న తీరును బట్టి చూస్తే మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి చెట్టుకు ఉరేసినట్లు ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతి చెందిన వ్యక్తి ఆచూకీ కోసం నియోజకవర్గంలోని ఐదు పోలీసుస్టేషన్లతోపాటు సమీప కర్నాటక పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మడకశిర ప్రభుతాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి ఆత్మహత్య
రామగిరి, మార్చి 21: మండలంలోని గంతిమర్రి గ్రామానికి చెందిన మన్నీల దేవరాజు(22) మంగళవారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్ననాగప్ప, ఈశ్వరమ్మల కుమారుడైన దేవరాజు సోమవారం రాత్రి కడుపునొప్పిస్తున్నట్లు తెలిపాడని తల్లిదండ్రులు తెలిపారు. తెల్లవారుజామున నొప్పి అధికం కావడంతో తోట వద్దకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రామగిరి హెడ్ కానిస్టేబుల్ మన్సూర్ హుస్సేన్ కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ఆస్పత్రికి తరలించారు.
పోలేపల్లిలో రైతు ఆత్మహత్య
బ్రహ్మసముద్రం, మార్చి 21: మండల పరిధిలోని పోలేపల్లి గ్రామానికి చెందిన వెట్టి తిప్పేస్వామి(45) అప్పుల బాధ తాళ లేక సోమవారం వేకువజామున ఇంటి పైకప్పుకు తన లుంగీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. సమీప బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు గత ఆరు నెలల నుండి తన ఇంటి దగ్గరకు అప్పు ఇచ్చిన వారు వచ్చి గలాటకు దిగడంతో అదేవిధంగా గుమ్మఘట్ట ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు నందు సుమారు రూ.1లక్ష, ఇతర ప్రైవేటు వ్యక్తుల నుండి రూ.1.15 లక్షలు అప్పు చేశారని భార్య లక్ష్మిదేవి తెలిపారు. ఈ నెపంతో మనస్తాపానికి గురై మంగళవారం వేకువజామున ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకని మృతి
పెద్దపప్పూరు, మార్చి 21: రేగు తోటకు ఆశించిన తెగులుకు మందు పిచికారీ చేయాలని పొలానికి వెళ్తున్న రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన శింగనమల మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. పెద్దపప్పూరు మండలం తబ్జూల గ్రామానికి చెందిన నాగేంద్ర (35), రామక్రిష్ణ ద్విచక్ర వాహనంపై అలంకరాయునిపేటకు వెళ్తుండగా అనంతపురం నుంచి పెద్దపప్పూరుకి వస్తున్న బొలోరా వాహనం ఢీకొంది. ప్రమాదంలో తీవ్ర గాయాలైన నాగేంద్ర, రామక్రిష్ణలను చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నాగేంద్ర మృతి చెందాడు. విషయం తెలుసుకున్న శింగనమల పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రాయదుర్గం రూరల్, మార్చి 21 : రాయదుర్గం పట్టణంలోని శాంతి నగర్ కాలనీలో నివాసముంటున్న చౌడప్ప (63) అనే వృద్ధుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం సాయం త్రం పట్టణంలోని బళ్లారి రోడ్డు వైపు నడుచుకుంటు వెళ్తుండగా వెనుకవైపు నుంచి బైక్ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆర్టీసీ బస్సు బోల్తా..
తృటిలో తప్పిన ప్రమాదం..
కణేకల్లు, మార్చి 21: ఉరవకొండ డిపోకు చెందిన ఆర్టీసి బస్సుకు మంగళవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఉరవకొండ నుండి నింబగల్లు, హనుమాపురం, మాళ్యం, కణేకల్లు మీదుగా రాయదుర్గంకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మండల పరిధిలోని హనుమాపురం గ్రామానికి చేరుకోగానే కణేకల్లు నుండి ఉరవకొండకు ద్విచక్ర వాహనంలో వెళ్తున్న వాహనం బస్సు మీదకు రావడాన్ని గమనించిన ఆర్టీసి డ్రైవర్ ఇస్మాయిల్ కుడి పక్కకు బస్సును తిప్పడంతో బస్సు అలాగే ఒరిగి ముళ్లపొదల్లోకి పడింది. ఈ సంఘటనలో 22 మంది ప్రయాణీకులు, 20 మంది 8వ తరగతికి చెందిన విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. వీరిలో లక్ష్మిదేవి అనే మహిళకు, ముగ్గురు విద్యార్థులకు రక్త గాయాలయ్యాయి. సంఘటనను పరిశీలించిన ఎస్‌ఐ యువరాజ్ క్షతగాత్రులను ప్రమాదం నుండి కాపాడి ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎవరికి పెద్ద ప్రమాదం ఏమి కాలేదని ఎస్‌ఐ తెలిపారు.

బచ్చలను నట్టేట ముంచిన సంఘాల నాయకులు
* కత్తికి కలిసొచ్చిన ఫ్యాప్టో ఉద్యమాలు
* ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా
కత్తి నరసింహారెడ్డి ఘన విజయం

అనంతపురం సిటీ, మార్చి 21: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కత్తి నరసింహారెడ్డి విజయకేతనం ఎగురవేశారు. ముందుగా ఉపాధ్యాయులు అంచనాలు వేసుకున్నట్లుగానే ఉద్యమ స్ఫూర్తిగా పనిచేసే వ్యక్తికి, ఉపాధ్యాయులకు అన్ని వేళలల అందుబాటులో వుండే వ్యక్తికి ఉపాధ్యాయులు మొగ్గుచూపారు. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులు పోటీ పడగా అందులో ఎక్కువగా టిడిపి మద్దతుతో పోటీ చేసిన బచ్చల పుల్లయ్య, ఆర్‌జెయుపి ఇతర సంఘాల మద్దతుతో పోటీ చేసిన ఒంటేరు శ్రీనివాస్‌రెడ్డికి, ఎపిటిఎఫ్ వర్న రఘురామయ్యకు, ఎస్టీయు, యుటిఎఫ్, కమ్యూనిస్టులు, ఆర్‌యుపిపి, ఇతర సంఘాల మద్దతుతో పోటీ చేసిన కత్తి నరసింహారెడ్డి మధ్య నామినేషన్ వేసే సమయానికి ఉత్కంఠ పోటీ నెలకొన్నది. ఆ సమయంలో ఒంటేరు శ్రీనివాసరెడ్డి కాస్త ఎక్కువగా పుంజుకున్నారని ఉపాధ్యాయుల్లో గుసగుసలాడారు. ఒంటేరు ఉపాధ్యాయుల్లో ఎక్కువగా కలసిపోవడంతోపాటుగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దుకై కేంద్ర మంత్రి రాజనాథ్‌సింగ్‌ను రెండుసార్లు స్వయంగా కలసి రద్దుకు సిఫారస్సు చేయడంతో ఉపాధ్యాయులు ఒంటేరు వైపు మొగ్గుచూపడం జరిగింది. కానీ ఉద్యమాలతో ఉపాధ్యాయులతో కలసిపోవడంతో ఒంటేరు కాస్త వైఫల్యం చెందారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండవ స్థానంలో కత్తి నరసింహారెడ్డికి గట్టి పోటీ ఇచ్చి రెండవ స్థానంలో నిలిచిపోయారు. మరొకవైపు ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న బచ్చల పుల్లయ్య ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండకుండా, ఎలాంటి ఉద్యమాల్లో కూడా పాల్గొనకుండా, శాసన మండలిలో సమస్యల పరిష్కారం చూపడంలో పూర్తి వైఫల్యం చెందారనే భావన ఉపాధ్యాయుల్లో ఎక్కువగా ఉంది. దీనికితోడు ఉపాధ్యాయ సంఘాల నాయకులపై అంతా మీరే చూసుకోవాలని భరోసా ఉంచి, వారికే పెత్తనం అప్పగించడంతో సంఘాల నాయకులు మాత్రమే లాభం పొంది సామాన్య ఉపాధ్యాయులకు చేయూతను అందివ్వకుండా చేయడంతో మరింత వ్యతిరేకతతో భారీగా ఓడించారు.
అలాగే గత 20 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటు, గత 10 సంవత్సరాలుగా ఎస్టీయు రాష్ట్ర నాయకునికి పనిచేస్తూ ప్రతి సామాన్య ఉపాధ్యాయునికి అందుబాటులో ఉంటు సమస్యల పరిష్కారంలో ముందంజలో ఉంటూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను నడిపించడంలో ముఖ్య పాత్ర పోషించిన కత్తి నరసింహారెడ్డి, ఫ్యాప్టో ఏర్పాటుచేసి రాష్ట్ర అధ్యక్షుడిగా, దేశ, రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ ఉద్యమాల్లో కీలక భూమిక పోషించారు. ఏ ఉద్యమంలోనైనా మొదటిగా ఉంటూ జిల్లాలో ఫ్యాప్టో నాయకులను చైతన్యపరస్తూ ఉద్యమాలు నడిపించారు. దీంతో ఉపాధ్యాయులు ఎక్కువగా కత్తి నరసింహారెడ్డికి మొగ్గుచూపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కత్తి నరసింహారెడ్డికి మొదటి రౌండు నుండి చివరి వరకు మోజార్టీతో కొనసాగారు.