అనంతపురం

చిరు వ్యాపారుల్లో ట్రేడ్ లైసెన్స్ ఫీజుల దడ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 23: ఆదాయ వనరుల్ని పెంచుకోవడం కోసం ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఈ ఏడాది ట్రేడ్ లైసెన్సు ఫీజుల్ని కూడా ఎడాపెడా వసూలు చేస్తోంది. దీంతో చిన్నా చితకా వ్యాపారులు వేలాది రూపాయలు చెల్లించుకోలేక గగ్గోలు పెడుతున్నారు. గతంలో పన్నులు ఎగ్గొట్టి యథేచ్ఛగా వ్యాపారాలు చేసుకునే వివిధ వాణిజ్య, వ్యాపార వర్గాలు తప్పించుకోలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మున్సిపాలిటీలకు ఆదాయం పెంచడం, పన్నుల వసూలులో పారదర్శకతను పాటించడం కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని అమలుచేస్తోంది. నీటి, ఆస్తి పన్ను, ఇతరత్రా పన్నులతోపాటు ట్రేడ్ లైసెన్సు ఫీజును వసూలు చేస్తోంది. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ ట్రేడ్ లైసెన్సు డిమాండ్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఒక్కో షాపునకు ఏడాదికి వెయ్యి రూపాయలు పైబడి చెల్లించాల్సి వస్తోంది. ఇళ్లు లేదా, దుకాణ షట్టర్లు ఉన్న చోట చిరు వ్యాపారాలు చేస్తున్నా సరే, తమ వ్యాపారాన్ని ప్రతిబింబిస్తూ బోర్డులు ఏర్పాటుచేసినా సరే ట్రేడ్ లైసెన్సు కట్టాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో అద్దె ఇళ్లు, హౌస్ కమ్ షాపు తీసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారు సైతం ఏడాదికి రూ.1000 మేరకు బకాయిలు కలిపి కనీసం రూ.3వేలు పైబడి చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఇళ్ల అద్దెలు చెల్లించడమే గగనంగా మారిన నేపథ్యంలో ఈ అదనపు భారంతో దిక్కుతోచడం లేదని, విధి లేక చెల్లించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. కాగా 2011 నుంచి ఆన్‌లైన్ అయిన జాబితాలో ఉన్న వ్యాపారుల నుంచి ఐదారు వేలకు మించి వసూలు చేస్తున్నారు. అదే సమయంలో గత ఏడాది అక్టోబర్ నుంచి నమోదు చేసిన చిరు వ్యాపారులకు కూడా కనీసం మూడేళ్ల బకాయిలు కలిపి మూడు వేల నుంచి ఐదారు వేల రూపాయలు కట్టాలంటూ 2017-2018కి సంబంధించి డిమాండ్ బిల్లులు పంపారు. బకాయిలు, ఏప్రిల్ నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి కలిపి మొత్తం సొమ్ము చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది మార్చి 1వ తేదీకి ముందే చెల్లించిన వారికి ఎలాంటి పెనాల్టీ లేదు. మార్చి 1 నుంచి 31వ తేదీ లోపు కట్టే ట్రేడ్ లైసెన్సు ఫీజు మొత్తానికి 25 శాతం అదనంగా భారం పడుతోంది. ఏప్రిల్ 1 తర్వాత కట్టే వారికి 50 శాతం పెనాల్టీ భారం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో సుమారు 7600 మంది వ్యాపారులకు ట్రేడ్ లైసెన్సు డిమాండ్ బిల్లులు పంపారు. వీరిలో గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 21 వరకు గత రెండు, మూడేళ్ల బకాయిలతో సహా 422 మంది ఫీజులు చెల్లించడంతో మొత్తం రూ.10.37 లక్షల వరకు వసూలైంది. ఈ నెలాఖరుకు ఇంకా పెరిగే అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు తెలిపారు. కాగా తమకు అందిన డిమాండ్ బిల్లుల్లో తప్పొప్పులను, గతంలో చెల్లించిన ఫీజులకు సంబంధించి రసీదులను అనేకమంది వ్యాపారులు మున్సిపల్ కార్యాలయానికి తీసుకొచ్చి సరిచేయించుకుని నగదు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో చిరు వ్యాపారులు మాత్రం ఇబ్బందులుపడుతూ కడుతున్నా, కొందరు మాత్రం మున్సిపల్ సిబ్బందితో వాగ్వాదం చేస్తున్నారు. దీంతో వారు పన్ను రాయితీ పరిధిలో ఉన్నట్లయితే మినహాయిస్తున్నారు. అసలే అద్దెల భారం, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు తడిసి మోపెడవుతున్న పరిస్థితుల్లో చిరు వ్యాపారులు డబ్బు కట్టలేక సతమతమవుతున్నారు.